నా జ్ఞాపకాలు
- Merigi Ramya
- 2 hours ago
- 5 min read
#MRamya, #Mరమ్య, #NaJnapakalu, #నాజ్ఞాపకాలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Na Jnapakalu - New Telugu Story Written By - M. Ramya
Published in manatelugukathalu.com on 17/12/2025
నా జ్ఞాపకాలు - తెలుగు కథ
రచన: M. రమ్య
జ్ఞాపకాలు మంచివైనా, చెడ్డవైనా చనిపోయే వరకు భరించక తప్పదు. నన్ను ఇద్దరు చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉండేవారు. నేను కూడా వాళ్ళిద్దరినీ చాలా గాఢంగా ప్రేమించాను. ఒకే సమయం లో నా ప్రేమ ను ఇద్దరికీ పంచాను. అస్సలు ఎవరు ఆ ఇద్దరు.. ?, ఏంటి ఈ ప్రేమ అని ఆలోచిస్తున్నారా.. ? ఇలాంటి ప్రేమ ను ప్రతి కూతురు, ఏదో ఒక సమయం లో ఎదుర్కొంటుంది అని నా అభిప్రాయం..
నేను ఎనభైలలో పుట్టిన అమ్మాయిని.. , నా పేరు మంజుల. నేను 22 సంవత్సరాల కి పెళ్లి చేసుకొన్నాను. పెళ్లి చేసుకొన్న వెంటనే విదేశాలకు వెళ్లి పోయాను, ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ సొంత ఊరికి వచ్చేసాను. భర్త దూరం గా ఉండడం, నేను పుట్టింటికి తరచుగా వెళ్ళడం వల్ల, నేను వాళ్ళిద్దరితో గాఢమైన ప్రేమ లో ఉన్నానని తెలుసుకో లేకపోయాను. నేను రోజు మా నాన్న తో కాసేపు కూర్చుని మాట్లాడాలని పుట్టింటి కి వెళ్ళేదాన్ని.
మా నాన్నగారు వయస్సు అప్పటికి 73 సంవత్సరాలు. నడవడానికి శక్తి లేకపోయినా, నా కోసం గేట్ దగ్గరికి వచ్చి, ఎదురు చూస్తూ ఉండే వారు. నేను ఒక వేళ రాకపోతే, భోజనం కూడా చేసేవారు కాదు. ఏంటి ఈ పెద్దాయన ఇలా ప్రవర్తిస్తున్నారూ.. ? బహుశా వయసు మీద పడడం వల్ల, చిన్నపిల్లాడు లాగా అయిపోయాడు ఏమో.. , అని చాలా సార్లు మనసులో అనుకున్న. కొన్ని కొన్ని సమయాల్లో తిట్టుకున్నాను కూడా.
మా నాన్నగారు ఇలా ప్రవర్తిస్తున్నారు అని నా భర్తతో చెప్పినప్పుడల్లా, నా భర్త.. , నువ్వు అసలు ఆ ఇంటికి వెళ్లొద్దు. నీకేం పని.. ? నీకు మంచి ఇల్లు కట్టించాను కదా.. ! మన పిల్లలను చూసుకో. నువ్వు అసలు ఆ ఇంటికి వెళ్లొద్దు. నాకు అస్సలు ఇష్టం లేదు" అంటూ నా భర్త కూడా గొడవ పడుతూ ఉండేవాడు.
ఒకానొక సమయంలో ఇద్దరి ప్రవర్తన వల్ల, చాలా చిరాకు, కోపం వచ్చేసి, చాలా బాధపడేదాన్ని.. అలా రెండు సంవత్సరాలు గడిచేసరికి వాళ్ళిద్దరూ నన్ను ఎంత ప్రేమిస్తున్నారో నాకు అర్థం అవడం మొదలయింది. నాన్న గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుండి నాకు పెద్దగా క్లోజ్ గా ఉండే పర్సన్ కాదు. ఎప్పుడు దూరంగానే ఉంచేవారు. నేను కూడా దూరం దూరం గానే ఉండేదాన్ని అనే భ్రమలో ఉండేదాన్ని. అప్పుడు నాకు అర్థం కాలేదు నేను యుక్త వయసులో ఉన్నాను అని.
ఇది కావాలి అని అడగకుండానే, అన్నీ కొని పెట్టే నాన్న.. , కొన్ని విషయాల్లో, ఎన్నిసార్లు అడిగినా కొనే వారు కాదు. అప్పుడు బాగా బాధ అనిపించేది. నేను ఏ విషయం కూడా నాన్నతో పంచుకున్నదే లేదు. అమ్మకి అన్ని విషయాలు చెప్పలేకపోయేదాన్ని. అలా సతమతమవుతున్న సమయంలోనే, నా భర్త నాకు పరిచయం అయ్యాడు.
నేను అతను ఇద్దరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం. మా ఇద్దరు తల్లిదండ్రులు.. , మా ఇద్దరికీ ఘనంగా పెళ్లి చేశారు. నాన్న మీద ఉండే చిన్న చిన్న కోపాలు, అమ్మ మీద ఉండే చిన్న చిన్న కోపాలు నన్ను విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడాలి అని నిర్ణయించుకునేలాగా చేశాయి. ఇంకెప్పుడూ ఈ పుట్టింటికి రాకూడదు అని, దూరంగా వెళ్లిపోవాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడు అయితే విదేశాలకు వెళ్లి, తల్లిదండ్రులకు దూరమయ్యానో.. , అమ్మానాన్న నాకోసం చేసిన ప్రతి చిన్నపని ప్రేమగా కనిపించడం మొదలయింది.. ముఖ్యంగా నాన్న నా కోసం పడిన తపన, నా మీద ఉన్న ప్రేమ రోజు తలుచుకునే లాగ చేసింది.
రోజు అమ్మానాన్నలతో మాట్లాడుతూ నా జీవితానికి కొనసాగిస్తూ ఉండేదాన్ని.. వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు, నా భర్త నాతో ప్రేమగా ఉన్నా.. , నాన్నకు అస్సలు నచ్చేది కాదు. కాస్త కోపంగా చూసేవారు. నేను పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. కొన్ని రోజులకి.. , నాన్న.. , నా భర్తతో మాట్లాడినా లేదా పక్కన కూర్చున్నా, నా భర్తకు చనువుగా ఉన్నా నాన్నకు అస్సలు ఇష్టం ఉండేది కాదు.
అయిష్టాన్ని నా పైన చూపించలేక, ఆయనలో ఆయనే ఎంతో సతమతమైపోయి, అమ్మతో గొడవ పడేవాడు. నాన్న లేని సమయంలో.. , అమ్మ అప్పుడప్పుడు చెబుతూ ఉండేది. నాన్నతో వీడియో కాల్ లో మాట్లాడినప్పుడు, నువ్వు నీ భర్తకి కాస్త దూరంగా ఉండు అని, తనకి చనువుగా ఉండొద్దు అని అమ్మ చెబుతూ ఉండేది.
అలాగే నాన్న ముందు ఏదైనా కావాలి అంటే మీ ఆయనని అడగొద్దు అంటూ అమ్మ చెబుతూ ఉండేది.. అప్పట్లో నాకు అది అర్థం అయ్యేది కాదు. నా భర్తని నేను కాకపోతే ఇంకెవరు అడుగుతారు.. ? నాకు మీరు దూరంగా ఉన్నారు కదా అమ్మ. మరి ఇప్పుడు నా కోరికలను నాభర్తే కదా తీర్చాలి అంటూ అమ్మతో వాదిస్తూ ఉండేదాన్ని ఒకప్పుడు. నాన్న ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటూ చాలా రోజులు కోపంతో అలిగి నాన్నతో మాట్లాడటం మానేసే దాన్ని. అప్పుడప్పుడు నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చాలాసార్లు అడగాలని అనిపించింది. కానీ ధైర్యం లేక అడగలేదు.
నా భర్తతో ఈ విషయాన్ని ఎప్పుడైనా పంచుకుంటే, నువ్వు మీ నాన్నతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు అంటూ ఈయన కూడా గొడవ చేసేవారు.. విదేశాల నుండి తిరిగి వచ్చిన రోజు మా నాన్న కళ్ళ లో ఆనందం స్పష్టంగా కనిపించేది. ఆయనకి హత్తుకోవాలని ఉన్నా దూరంగా ఉంచేవాడు. నా భర్తతో ఫోన్లో మాట్లాడాలి అన్నా, నాకు చాలా భయం వేసేది. నాన్నకి కోపం వస్తుందేమో అని భయపడుతూ భయపడుతూనే చాలా తక్కువగా, నా భర్తతో మాట్లాడేదాన్ని. అప్పుడు నా భర్త అలిగి గోల చేసేవారు. నువ్వు ఎందుకని నాతో మాట్లాడటం లేదు.. ? నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత నన్ను మర్చిపోయావు అంటూ బాగా అలిగి గోల చేసేవారు.. చిన్న పిల్లాడి లాగా.
నువ్వు నాతోనే ఉండాలి. నువ్వు నాతోనే మాట్లాడు అంటూ గంటలు గంటలు ఫోన్లో మాట్లాడేవారు. తన పనులన్నీ పక్కనపెట్టి నాతో సమయం గడిపేవాడు. నాకు ఏదైనా కావాలి అని అడగకముందే, నా భర్త నాకు అవి తెచ్చి ఇచ్చేవాడు. నేను చాలా లక్కీ అని అనుకుంటూ పుట్టింటి వాళ్ళతో గొడవ పడుతూ ఉండేదాన్ని. అంత మంచి వాడిని ఎలా వదిలేయమంటారు అంటూ గొడవ చేస్తూ ఉండేదాన్ని.. కాలక్రమేనా అమ్మ చనిపోయింది. నాన్న ఒంటరి వాడు అయిపోయారు. నాన్నని దగ్గరుండి చూసుకోవాలి అని అనిపించింది. విదేశాలలో ఉండటం వల్ల అమ్మ చివరి చూపులు కూడా నేను చూసుకోలేకపోయాను. నాన్నను అలా వదిలేయకూడదు అని, తిరిగి ఇండియాకి వచ్చేసాను.
అప్పటి నుండే సమస్యలు బాగా పెరిగిపోయాయి. 75 సంవత్సరాల వయసులో కూడా నా కోసం పరితపించే నాన్నను చూస్తూ ఉంటే, ఈయనే కదా నా ఫస్ట్ లవ్ అని అనిపించని రోజు లేదు. చిన్నతనంలో అడగకముందే అన్నీ తెచ్చిపెట్టే నాన్న జ్ఞాపకాలని నేను ఎలా మర్చిపోయాను.. ? యుక్త వయసులో నేను చేసిన తప్పులన్నీ కూడా క్షమించి నన్ను ముందుకు నడిపించిన నాన్నని నేను ఎలా మర్చిపోయాను.. ? అని నేను ఆయన చేయి పట్టుకొని ఎన్నోసార్లు బాధపడ్డాను.
చావు చివరి అంచులు దాకా వెళ్ళిన నన్ను, బ్రతికించి, మళ్లీ నా భర్తకు అప్పజెప్పిన నాన్నని నేను ఎలా మర్చిపోయాను అని నన్ను నేను తిట్టుకొన్నా. నాన్న చివరి దశలో మంచం మీద ఉన్నారు. ధైర్యం చేసుకొని ఎందుకు నాన్న, నా భర్తకు దూరం ఉండమని చెప్తూ ఉంటారు అని ఒక రోజు అడిగాను.
నేను మాత్రమే నిన్ను ప్రేమించాలి. నువ్వు నన్నే ప్రేమించాలి. ఇంకెవరిని ప్రేమించకూడదు. నువ్వు నా దానివి. నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు ఇంకొకరి ప్రేమలో పడి, నన్ను ఎక్కడ వదిలేస్తావో అని చాలా భయమేసింది. అందుకే నీ భర్తకు దూరంగా ఉండమని ఎన్నోసార్లు నీతో గొడవ పడ్డాను అని నాన్న కళ్ళంట నీళ్లు పెట్టుకొని చెబుతూ ఉన్నారు..
నిస్వార్ధమైన నాన్న ప్రేమకి నా కళ్ళంటూ నీళ్లు కారడం మొదలైంది.. నాన్న నువ్వు నా ఫస్ట్ లవ్ వి. దానిని ఎలా వదిలేసుకునేది అని మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కూడిన బాధ కలిగేది. నాకు కూడా మా నాన్న కదా ఫస్ట్ లవ్. ప్రతి చిన్న విషయాన్ని నాన్నతో పంచుకోవాలని చూసే చిన్నతనం నుండి ఏ విషయం చెప్పకూడదు అని నిర్ణయించుకున్న రోజులకి నేను ఎందుకు వచ్చాను అని ఆలోచించడం మొదలు పెట్టాను.
ఆ ఆలోచన వెనుక నా యుక్త వయసు గుర్తుకు వచ్చింది. యుక్తవయసులో పరిచయమైన నా భర్త గుర్తుకు వచ్చాడు. వెంటనే నా భర్త మీద కోపం వచ్చేది. అయినా కానీ ఆ కోపాన్ని నా భర్త మీద చూపించేదాన్ని కాదు. ఎందుకంటే నా భర్త ప్రేమ అలాంటిది. నా భర్త కూడా మా నాన్న లాగే మాట్లాడేవారు. నువ్వు నన్నే ప్రేమించాలి. ఇంకెవరిని ప్రేమించకూడదు. నువ్వు నాకే సొంతం.
'నువ్వు నాతోనే చనువుగా ఉండాలి. నీకు కష్ట సుఖాలన్నీ నాతోనే చెప్పుకోవాలి. ఇంకెవరితో చెప్పుకోకూడదు. నేనే నీకు అన్నీ కొనివ్వాలి. నీకు ఎవరైనా ఏదైనా కొనిస్తే నా మనసుకు చాలా బాధగా ఉంటుంది' అని చాలా సార్లు నా భర్త చెబుతూ ఉండేవాడు.
ఒక పక్కన నాన్నని చూసుకుంటూనే, మరోపక్క చిన్న పిల్లాడి లాగా అలిగే నా భర్తను చూసుకుంటూ వచ్చాను.. కొన్ని రోజులకు నాన్నకి చాలా సీరియస్ గా ఉండడం వల్ల, మరింత దగ్గరగా ఉండి చూసుకోవాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయి. అలాంటి సమయంలోనే నేను నా భర్తకి కాస్త దూరంగా ఉండాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయి.
చివరి క్షణంలో కూడా నాన్న నా చెయ్యి వదలలేదు. తన ఊపిరి పోయే క్షణంలో కూడా నా చెయ్యిని పట్టుకొని తన చివరి శ్వాసను వదిలారు.. నాన్న పోయారని చాలా రోజులు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.
'ఎందుకలా నాన్న నాన్న అని చచ్చిపోతావు' అంటూ నా భర్త గొడవ పడుతూ ఉండేవాడు.
నాన్న ఫోటో పట్టుకొని ఏడుస్తూ, పిల్లల్ని కూడా పట్టించుకోని రోజుల్లోకి వెళ్ళిపోయాను. నెమ్మది నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఈ రెండు సంవత్సరాల్లో నా భర్త ప్రేమను కూడా నేను కోల్పోయాను. ప్రతి చిన్న విషయం నాతో పంచుకునే నా భర్త ఇప్పుడే నాతో మాట్లాడటం తగ్గించేసాడు.
నా భర్తకి.. , నాకు.. , ఉన్న ప్రేమ.. , జ్ఞాపకాలుగా మిగిలిపోతూ ఉన్నాయి. నాన్న జ్ఞాపకాలు తరచూ నన్ను వెంటాడుతూ ఉన్నాయి. అదే విధంగా నా భర్త జ్ఞాపకాలు కూడా వెంటాడుతూ ఉన్నాయి. నాన్న జ్ఞాపకాలు మధురమైతే, భర్త చేసిన జ్ఞాపకాలు చేదుగా మిగిలిపోతాయేమో అని భయం వేస్తుంది. అందుకే అంటున్నాను జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా భరించి తీరాల్సిందే. ఇద్దరి ప్రేమలో నిస్వార్థం ఉన్నా, నా ప్రేమను ఎవరూ అర్థం చేసుకోలేదు అనే బాధ నాకు మిగిలింది.
ముగింపు
M. రమ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: M. రమ్య




Comments