సైబర్ వలయం!
- Ronanki Divija Saibhanu

- 14 minutes ago
- 5 min read
#CyberValayam, #సైబర్ వలయం, #RonankiDivijaSaibhanu, #రోణంకిదివిజసాయిభాను, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Cyber Valayam - New Telugu Story Written By Ronanki Divija Saibhanu Published In manatelugukathalu.com On 17/12/2025 సైబర్ వలయం - తెలుగు కథ
రచన: రోణంకి దివిజ సాయిభాను
మెసేజ్ నోటిఫికేషన్ శబ్దం వినిపించి స్టాఫ్ రూంలో ఉన్న శ్రీజ ఫోన్ తీసి చూసింది. మళ్లీ అదే నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. "ఈరోజు నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు" అని దాని సారాంశం. శ్రీజకు వెన్నులో వణుకు పుట్టింది. ఇలా ఈ నంబర్ నుంచి మెసేజ్ రావటం ఇది ఒకటో సారి కాదు. ఏం చేయాలో అర్థం కాక చూస్తూ కూర్చుంది. అదే సమయంలో ఆ రూంలో చివరి కుర్చీలో కనిపిస్తున్న ఒక నవ్వును ఆమె గమనించలేదు.
శ్రీజ...కాలేజీ ప్రొఫెసర్. ఆమె మంచి మనసున్న మనిషి. చిన్నప్పుడే తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అనాథ శరణాలయంలో పెరిగింది. అయినా కూడా, నిరాశ చెందకుండా బాగా చదివి ఉద్యోగం తెచ్చుకుంది. సబ్జెక్ట్ పైన మంచి అవగాహన, చెప్పే తీరు అన్నీ చక్కగా ఉండటంతో కొద్ది కాలంలోనే కాలేజీలో మంచి పేరు సంపాదించుకుంది. పెళ్లి ప్రస్తావనలు చాలా వచ్చినా, తనకు తగిన వ్యక్తి దొరకలేదనే ఉద్దేశంతో వాటన్నింటినీ సున్నితంగా తిరస్కరించేది.
గత వారం రోజులుగా శ్రీజ ఈ నిరంతర వేధింపులకు గురవుతోంది. మొదట్లో సరదాగా ఎవరో ఆకతాయి పంపారని అనుకుంది. కానీ మెసేజ్‌ల కంటెంట్ రోజురోజుకీ వ్యక్తిగతంగా, భయంకరంగా మారుతోంది. ఆమె రోజూ కాలేజీకి వేసుకునే చీరలు, ఆమె కూర్చునే పద్ధతి, పాఠాలు చెప్పే విధానం, ఇలా చిన్న చిన్న విషయాలను కూడా మెసేజ్‌లలో ప్రస్తావించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా, ఆమె ఈ రోజు కాలేజీలో గంటన్నర ముందుగా అడుగుపెట్టిన విషయాన్ని కూడా మెసేజ్ ద్వారా పంపడంతో, ఎవరో తనను ఎక్కువగా గమనిస్తున్నారని, తన చుట్టూ ఉన్నవారే అయ్యుంటారని శ్రీజకు అర్థమైంది.
ఒక మంచి వృత్తిలో ఉంటూ, తాను ఈ భయాన్ని దాచుకుంటే సమాజంలో తప్పు చేసిన వాళ్లకే ధైర్యం ఇచ్చినట్టు అవుతుందని శ్రీజ నిర్ణయించుకుంది. ఆమె వెంటనే ప్రిన్సిపాల్ గారిని కలిసి విషయం అంతా చెప్పింది. ప్రిన్సిపాల్, శ్రీజ చెప్పినదంతా విని, ఇది తీవ్రమైన విషయం అని గ్రహించారు. ఆయన వెంటనే సైబర్ సెక్యూరిటీ శాఖ ఇన్స్పెక్టర్ ప్రియాంకను సంప్రదించాలని సూచించారు. ఆయన ప్రియాంకకు కాల్ చేశారు. ప్రియాంక తండ్రి, ప్రిన్సిపాల్ చిన్ననాటి స్నేహితులు కావడంతో, ఆ చనువుతో ఈ విషయాన్ని కాస్త నిశితంగా పరిశీలించమని చెప్పి, ఫోన్ శ్రీజకు ఇచ్చారు. శ్రీజ ఆమెకు విషయం అంతా వివరించింది. ఇలాంటి అనేక కేసులను విజయవంతంగా ఛేదించిన ప్రియాంక, కొన్ని ప్రశ్నలతో విషయాలు తెలుసుకొని, శ్రీజకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీజ తర్వాత ప్రిన్సిపాల్ గారికి చెప్పి బయటకు వచ్చింది.
అక్కడ్నుంచి తిరిగి వచ్చేటప్పుడు శ్రీజ ఒక విషయం గమనించింది. సూర్య తన ఫ్రెండ్‌తో ఏదో హ్యాకింగ్ గురించి మాట్లాడుతుండగా శ్రీజకు వినిపించింది. ఒక పక్క నిల్చుని వాళ్ల మాటలు వింటుంది, "శ్రీజ మేడమ్ బావుంటారు రా, ఆమె క్లాస్ చెప్పేటప్పుడు భలే ఉంటారు కదా" అంటూ శ్రీజ కోసం వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నారు. శ్రీజ రాకను వారిరువురూ గమనించలేదు.
సూర్య తన క్లాసులో చాలా చురుకైన విద్యార్థి, కంప్యూటర్ సైన్స్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సూర్య ఎప్పుడూ తనను చూసి నవ్వడం, తన వ్యక్తిగత విషయాల గురించి క్లాస్ అయ్యాక మాట్లాడటానికి ప్రయత్నించడం ఆమె గమనించింది. ఇప్పుడు, ఈ మాటలు విన్న తరువాత సూర్యనే మెసేజ్ లు పెట్టి తనను ఇబ్బంది పెడుతున్నాడని అనుకుంది. వెంటనే, ప్రియాంక గారికి ఈ విషయం గూర్చి కాల్ చేసి చెప్పింది. ప్రియాంకకు విషయం అర్థమైంది, సూర్య చేసిన పనికి తగిన గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకుని శ్రీజకు ప్లాన్ చెప్పింది.
ఆ రాత్రి మళ్ళీ అదే నెంబర్ నుంచి శ్రీజకు మెసేజ్ వచ్చింది.
“శ్రీజా! నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను విడిచి ఉండలేను," అని. శ్రీజకు అది సూర్యనే అని అనిపించింది. 'వద్దు సూర్య, ఇది మంచి పద్ధతి కాదు,' అని తిరిగి మెసేజ్ పంపిద్దామని అనుకుంది. కానీ, మళ్లీ ఆలోచించి, కాస్త ఆగి ఆ మెసేజ్ ను ప్రియాంకకు పంపింది. ప్రియాంక గాబరా పడొద్దు అని భరోసా ఇచ్చి, మరుసటి రోజు కోసం వేచి చూడమని ధైర్యం చెప్పింది.
మరుసటి రోజు ఉదయం, ప్లాన్ ప్రకారం కాలేజీలో ఒక సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రియాంకను ఆహ్వానించారు. ఆ సెమినార్ యొక్క అంశం - "సైబర్ భద్రత: మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులు, చట్టాలు.”
సెమినార్ ప్రారంభం అయింది. అన్ని డిపార్ట్మెంట్స్ హెడ్స్, ప్రొఫెసర్స్, సూర్యతో పాటు విద్యార్థులంతా అక్కడే ఉన్నారు, శ్రీజ మాటలు వింటున్నారు. శ్రీజ, ఎన్నో నూతన విషయాలను ప్రస్తావించింది. ఆమె ప్రసంగం ఆకర్షణీయంగా, అర్థవంతంగా ఉండడంతో, అందరూ శ్రద్ధగా వింటున్నారు. సెమినార్ అంతా పూర్తి చేసి, చివర్లో ఒక స్లైడ్ ఓపెన్ చేసింది. ఆ స్లైడ్‌లో రెండు సెల్ ఫోన్ స్క్రీన్‌షాట్స్ ఉన్నాయి. ఒక స్క్రీన్ షాట్ లో సూర్య నెంబర్ తో ఒక వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వటం గూర్చి ఉంది. మరో దాంట్లో, ఆ నెంబర్ నుంచి శ్రీజకు వచ్చిన మెసేజ్ లు ఉన్నాయి. ఒక్కో మెసేజ్ చదివేసరికి, అందరి ముందే సూర్య ముఖం పాలిపోయింది. తనకేమీ తెలియక అయోమయంగా చూస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాక, లేచి, "మేడమ్... ఆ నెంబర్ నాదే, కానీ ఆ మెసేజ్‌లు నేను పంపలేదు. నేను క్లాస్ తర్వాత మీతో మాట్లాడాలని ప్రయత్నించినందుకు, మిమ్మల్ని చూసి నవ్వినందుకు, నా ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి" అని చెప్పాడు. సెమినార్ హాల్లో ఉన్నవారంతా నిర్ఘాంతపోయి చూస్తున్నారు.
అప్పుడు, ప్రియాంక లేచి మైక్ అందుకొని ఇలా చెప్పడం మొదలుపెట్టింది.
"మీ కాలేజీ లో పనిచేస్తున్న శ్రీజ మేడమ్ గారు తనకు ఒక నంబర్ నుంచి వేధింపులు వస్తున్నాయని చెప్పారు. ఆమె వేధింపులకు గురవుతున్న నెంబర్ మీలో ఒకరైన సూర్యది అని తెలిసింది. మరి ఆ నంబర్ నుంచి మెసేజ్ ఎలా వచ్చిందనే విషయంపై దృష్టి పెట్టగా, నాకు 'మెసేజ్ స్పూఫింగ్' గురించి తెలిసింది. అదే విషయం ప్రెజెంటేషన్ లో మేడమ్ చెప్పారు. ఈ మెసేజ్‌లు పంపుతున్న వ్యక్తి, వేరే వ్యక్తి నంబర్‌ను ఉపయోగించి మెసేజ్‌లు పంపగలడు. ఆ మెసేజ్‌లు వేరే వ్యక్తి పంపుతున్నారని కూడా మనం ఊహించలేము కదా" అని అంది. అదే సమయంలో మారుతున్న ఒక వ్యక్తి ముఖ కవళికలు ప్రియాంక దృష్టి నుంచి తప్పుకోలేదు.
ప్రియాంక సూర్యని స్టేజ్ పైకి పిలిచింది. "సూర్యా! ఈ తప్పు నువ్వు చేయలేదని నాకు తెలుసు. నీ నెంబర్ ఉపయోగించి ఎవరో మెసేజ్‌లు పంపారని కూడా నాకు తెలుసు సూర్య. ఈ స్లైడ్‌లో ఉన్నది చూడండి," అంటూ చూపించింది. కాలేజీలో అందరికీ పరిచయమున్న ముఖం స్లైడ్ లో ఉంది.
"సూర్య నంబర్‌ను ఉపయోగించి శ్రీజ మేడమ్‌ను వేధించిన వ్యక్తి, మీ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి మూర్తి సర్. ఈ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసిన ఐపీ అడ్రస్, అలాగే మూర్తి సర్ శ్రీజ మేడం గారిపై నిఘా ఉంచిన వివరాలు, వారు పంపిన మెసేజ్‌లు అన్నీ మా దగ్గర స్పష్టమైన డిజిటల్ ఆధారాలతో ఉన్నాయి. వారు తమ పదవిని, టెక్నాలజీ పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేశారు. కేవలం భయం, అనుమానం సృష్టించడానికి సూర్య వంటి ఒక తెలివైన విద్యార్థిని బలిపశువును చేయాలని చూశారు. ఇది చాలా పెద్ద తప్పు.”
మూర్తి సార్ ముఖం పాలిపోయింది. ఆయన వెంటనే హాలులో నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఇద్దరు పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. కాలేజీ సిబ్బంది, సూర్యతో పాటు మిగతా విద్యార్థులంతా అయోమయంలో చూస్తున్నారు.
ప్రియాంక మళ్ళీ మాట్లాడింది.
మూర్తి సర్ పైన అనుమానం ఉందని శ్రీజ మేడమ్ నాకు ముందే చెప్పారు. అయినా ఆయనను వెంటనే తప్పుపట్టలేం కదా!
ఎందుకంటే… నిజం బయటపడాలంటే, ఆధారాలు కావాలి.
ఈ సెమినార్… ఒక అవగాహన కార్యక్రమం మాత్రమే కాదు. ఇది ఒక ట్రాప్. మహిళలను వేధించడానికి, ఇతరులను ఇరికించడానికి టెక్నాలజీని ఉపయోగించడం సైబర్ క్రైమ్. మూర్తి గారు ఇదివరకే శ్రీజ మేడంను చాలా సార్లు పెళ్లి చేసుకోవాలని వేధించారు, శ్రీజ మేడం ఒప్పుకోకపోవడం వలన ఇలాంటి విపరీత చర్యకు పాల్పడి సూర్య పైన నెట్టేయాలని అనుకున్నారు. మూర్తి గారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రిన్సిపాల్ గారి అనుమతితో మేము వచ్చాం.
నేటి సమాజంలో టెక్నాలజీ ఒక శక్తివంతమైన సాధనం. మనం దాన్ని ఎలా ఉపయోగిస్తామనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ టెక్నాలజీని మంచి పనుల కోసమే, మంచి ఉద్దేశాల కోసమే ఉపయోగించాలి. ఇది కేవలం మన జ్ఞానాన్ని, సృజనాత్మకతను పెంచడానికి మాత్రమే కాక, ఇతరులకు సహాయం చేయడానికి, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి కూడా ఉపయోగపడాలి.ఎదుటివారి బలహీనతలను గౌరవించి, వారి ప్రైవసీని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. వేధింపులకు గురైనప్పుడు భయపడకుండా, సరైన పద్ధతిలో, చట్టబద్ధంగా ఎదుర్కొంటే విజయం మనదే..." అంటూ ముగించింది. ప్రియాంక మాటలకు సెమినార్ హాల్ మొత్తం చప్పట్లతో నిండిపోయింది.
తరువాత శ్రీజ మైక్ అందుకుని,
"చూశారా? భయం వదిలి, ధైర్యంగా నిలబడితేనే న్యాయం జరుగుతుంది. మనం మౌనంగా ఉంటే, ఇలాంటి తప్పులు చేసేవాళ్లకు మరింత ధైర్యం ఇచ్చినట్టు అవుతుంది. నాపై జరిగిన ఈ వేధింపు చర్య నన్ను చాలా భయపెట్టింది. ఈ రోజు సూర్యపైన తప్పుడు ముద్ర పడకుండా కాపాడిన ప్రియాంక మేడమ్ గారికి ధన్యవాదాలు. టెక్నాలజీని మంచికి ఉపయోగించండి. మీకు ఇలా జరిగితే మౌనంగా ఉండకండి. మాట్లాడండి. మనం బలహీనులము కాము. ఈ డిజిటల్ యుగంలో భద్రత మన చేతుల్లోనే ఉంది. ఈరోజు నుండి, మన కాలేజీలో ఏ విద్యార్థి, ఏ సిబ్బంది అయినా వేధింపులకు గురైతే, వెంటనే ప్రిన్సిపాల్ గారిని సంప్రదించవచ్చు. సైబర్ వలయం నుండి బయటపడటానికి మనమంతా ఐక్యంగా పోరాడదాం," అని ఉద్వేగంగా ప్రసంగించింది.
ప్రిన్సిపాల్ గారు లేచి నిలబడి శ్రీజ ధైర్యాన్ని అభినందించారు. ప్రియాంకకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రియాంకకు మూర్తి గారిని ఉద్యోగం నుండి తొలగించినట్టు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రకటించారు. ఆ రోజే కాలేజీలో సైబర్ భద్రత డిపార్ట్మెంట్ ను ప్రారంభించి, దానికి శ్రీజను అధ్యక్షురాలిగా నియమించారు. ఆ క్షణంలో సూర్యకు శ్రీజ పైన మరింత గౌరవం పెరిగింది.
ఆ రోజు నుండి, శ్రీజ కాలేజీలో మరింత గౌరవాన్ని, ధైర్యాన్ని సంపాదించుకుంది. ఆమె వేసుకునే ప్రతీ చీర, ఆమె చెప్పే ప్రతీ పాఠం... ఆమెకు భయం కాదు, సమాజంలో మార్పు తెచ్చిన ఒక యుద్ధాన్ని గుర్తుచేసే గెలుపుకి చిహ్నంలా నిలిచాయి. ఆమె జీవితంలో భద్రత, ప్రశాంతత తిరిగి వచ్చాయి.
***
రోణంకి దివిజ సాయిభాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు రోణంకి దివిజ సాయిభాను. తెలుగు భాషాభిమానిని. తెలుగు భాషలో కవితలు మరియు కథలను రాస్తుంటాను. మనసును నింపిన ప్రతి భావాన్ని పదాలతో అల్లుతూ ఇప్పటివరకు ఎన్నో కవితలను రాసాను. నా కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఎన్నో సాహిత్య పోటీల్లో పాల్గొని, విజయాలు సాధించడం నాకు మరింత ప్రేరణనిచ్చింది. భావాలకి, కలలకి మాట దొరికేలా చేసే ఈ సాహిత్యయాత్రలో నిరంతరం కొత్త అంచులను అన్వేషిస్తూ ముందుకు సాగుతున్నాను.




Comments