నాగబాల
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- Oct 25
- 4 min read
#Nagabala, #నాగబాల, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Nagabala - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 25/10/2025
నాగబాల - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
ఎంగేజ్‌మెంట్ ఫెయిల్ అయిన బాధ
"మామా.... నువ్వా?..." తన భుజంపై చేయి వేసిన కాళిదాస్‌ను ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు నాగరాజు. నాగరాజు ఒక బార్‌లో టేబుల్ ముందు కూర్చొని, గత పెండ్లిచూపులలో చూసిన సుందరాంగి సుమతిని తలచుకుంటూ విస్కీ సేవిస్తున్నాడు.
"ఆ.... నేనే!..." అన్నాడు గంభీరంగా మేనమామ కాళిదాస్. వచ్చి ఎదురు కుర్చీలో నాగరాజు ముందు కూర్చున్నాడు.
"ఒరే అల్లుడూ ....."
"ఏంటి మామా?....." కనురెప్పలు ఎగరేస్తూ అడిగాడు.
"ఇది నీకు తగునా?" "మనస్సు మండిపోతూ ఉంది మామా!" విచారంగా చెప్పాడు నాగరాజు.
"అందుకేనా హాట్ డ్రింక్ సేవిస్తున్నావు?"
"మామా!... నీవు నేర్పిన మాటే!!.... ఉష్ణం... ఉష్ణేన శీతలం!..." వ్యంగ్యంగా నవ్వాడు నాగరాజు.
"ఇప్పుడు నీకు అంత బాధ ఏం వచ్చిందిరా!... చదువు, సంస్కారం, మంచి ఉద్యోగం, ఆస్థి, అంతస్థు అన్నీ వున్న నీవు, ఒక పిల్ల ఇష్టపడటం లేదని ఇలా త్రాగడం నీకు భావ్యమా!..." విచారంగా అడిగాడు కాళిదాస్.
"మామ!... ఆ రోజు ఆ పిల్ల నన్ను ఏం అడిగిందో తెలుసా!.."
"నీవు చెప్పలేదుగా!...."
సగం త్రాగిన గ్లాసులోని మందును గొంతులో పోసుకొన్నాడు నాగరాజు. తల ఆడించి... "మామా!.... ఇప్పుడు చెబుతాను. .... మందు వేస్తావా!"
నాగరాజు రెండు గ్లాసుల్లో విస్కీ పోసి, ఐస్ క్యూబ్స్, వాటర్ పోసి ఒక గ్లాసును ప్రీతిగా మామకు అందించాడు. కాళిదాసు ఛియర్స్ కొట్టి విస్కీని సిప్ చేశాడు.
"ఆఁ.... ఇప్పుడు చెప్పు ఆ పిల్ల ఏమంది?"
"మామా!... ఆ పిల్ల నన్ను ఓ చిత్రమైన ప్రశ్న అడిగింది!"
"ఏమిటది?"
"చెప్పేదానికి నాకు చాలా లజ్జగా వుంది మామా!" విచారంగా చెప్పాడు నాగరాజు.
"రేయ్!..... నీవు మగవాడివి కదరా!... లజ్జా లేదు, బొజ్జా లేదు!..."
"మామా!... ఆ పిల్ల నన్ను 'నీవు వర్జిన్వేనా' అని అడిగింది మామా!..." ఆశ్చర్య ఆందోళనలతో చెప్పాడు నాగరాజు.
"అలా అడిగిందా!..." కాళిదాసు ముఖంలో ఆశ్చర్యం.
"అవును మామా!..." నాగరాజు ముఖంలో విచారం.
"వర్రీ లేకుండా ఎలా వుండేది మామా!... ఆ పిల్ల రూపురేఖలు, చదువు నాకు బాగా నచ్చాయి మామా!..." బిక్క ముఖంతో చెప్పాడు నాగరాజు.
"సరే!.... నేను నీ పెండ్లి ఆ పిల్లతోనే జరిపిస్తాను. అయితే నీవు నేను చెప్పినట్లు చేయాలి. సరేనా!"
"సరే మామా!..."
నాగరాజు ముఖంలో వెలుగు తళతళాడింది. గ్లాసులు ఖాళీ చేసి మామా, అల్లుళ్ళు బార్ నుండి బయటికి నడిచారు.
కొత్త పెండ్లి చూపులు
"అయ్యా!... దీనదయాళ్ గారూ!... నమస్కారం" చేతులు జోడించాడు కాళిదాస్.
"ఓ కాళిదాస్ గారా!... రండి మిత్రమా!... అంతా కుశలమే!..."
"కూర్చోండి" కుర్చీని చూపుతాడు దీనదయాళ్.
ఇంటి వరండాలో దీనదయాళ్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు కాళిదాస్.
"ఊరికేరారు మహానుభావులు!... అయ్య కాళిదాసుగారూ!... విషయం ఏమిటో చెప్పండి" అడిగాడు దీనదయాళ్.
దీనదయాళ్ రిటైర్డ్ హెడ్ క్లర్క్, పి.డబ్ల్యూ.డి డిపార్టుమెంటులో పనిచేసేవారు.
"మీ అమ్మాయి సుమతి ఇంట్లో వుంద!... పాపం తల్లిలేని అమ్మాయి" విచారంగా అన్నాడు కాళిదాస్.
సుమతి తల్లి సౌదామిని ఏడేళ్ళ క్రిందట గతించింది.
"ఆఁ... వుంది!..."
"ఒకసారి పిలుస్తారా? ఆమెకు ఒక సంబంధాన్ని తెచ్చాను. అబ్బాయి పేరు బాలరాజు. మాకు పిల్లవాడి వివరాలను ఆమెకు చెబుతాను. కారణం మీ అమ్మాయి అందరిలాంటి అమ్మాయి కాదుగా!... బాగా చదువుకొన్నది. ఆదర్శవాది. అందుకని అబ్బాయి గురించిన అన్ని విషయాలు ఆమెకు ముందే చెబితే ఆమెను ఒప్పించడంలో మీకు శ్రమ వుండదుగా!..."
"ఓ... అలాగంటారా!...." చిరునవ్వుతో చెప్పాడు దీనదయాళ్.
దీనదయాళ్ సుమతిని పిలిచారు. ఆమె వరండాలోకి వచ్చింది. సుమతి కాళిదాస్ గారు పనిచేసే స్కూల్లోనే ఎం.ఎ, బి.ఇడి సైన్స్ టీచర్‌గా పనిచేస్తోంది. కాళిదాస్ అక్కడ హెడ్ మాస్టర్.
"నమస్కారం మాస్టారూ!..."
"నమస్కే సుమతీ!..." చిరునవ్వుతో చెప్పాడు కాళిదాస్. జేబులోనుండి ఒక ఫొటోను తీసి దీనదయాళ్కు ఇచ్చాడు.
"అబ్బాయి పి.హెచ్.డి ఇంగ్లీష్. మూగవారి స్కూల్లో పనిచేస్తున్నాడు. మన సుమతిలాగే ఆదర్శవాది. అతనికి మంచి ఆఫర్స్ వచ్చినా ఆ మూగవారి స్కూలును వదలనంటూ, ఆ అమాయక మూగ బాల బాలికలకు ఉన్నతిని కల్పించాలనే సిద్ధాంతంతో పనిచేస్తున్నాడు. అతనికి..."
"అతనికి?..." ఆశ్చర్యంతో అడిగాడు దీనదయాళ్.
"కొంచెం నత్తి!..." చటుక్కున సుమతి ముఖంలోకి చూస్తూ చెప్పాడు కాళిదాస్.
"చూచేదానికి ఆరు అడుగుల అందగాడు. తెల్లనిఛాయ. వారి తండ్రిగారు గతించి ఐదు సంవత్సరాలైంది. వున్నది ఒక్క తల్లి మాధవి మాత్రమే!... చాలా మంచి సంబంధం. కావలసినంత ఆస్థిపాస్తులు వున్నాయి. పిల్లవాడి ఫొటో మీ చేతికిచ్చాను. వివరాలను చెప్పాను. మీ నిర్ణయం ఏమైనా నాకు సంతోషమే!..." నవ్వుతూ చెప్పాడు కాళిదాస్.
దీనదయాళ్ అబ్బాయి ఫొటోను సుమతి చేతికి అందించాడు. సుమతి కొన్ని క్షణాలు ఆ ఫొటోను చూచింది.
"నాన్న!.... లోపలికి రండి!..." వెంటనే లోనికి వెళ్ళిపోయింది సుమతి.
దీనదయళ్ మౌనంగా ఇంట్లోకి నడిచారు. "ఏమ్మా!... నీ అభిప్రాయం ఏమిటి?" అడిగాడు.
"నాన్నా!.... నాకు ఈ అబ్బాయి నచ్చాడు నాన్నా!... మా గురువుగారికి చెప్పండి" ఫొటోను దీనదయాళ్ చేతికిచ్చి సుమతి తన గదిలోనికి వెళ్ళిపోయింది.
ఆనందంగా వరండాలోనికి వచ్చి దీనదయాళ్ తన కుమార్తె నిర్ణయాన్ని కాళిదాస్కు నవ్వుతూ తెలియజేశాడు. "మా అమ్మాయి ఆదర్శవాది సార్!..." సగర్వంగా చెప్పాడు.
వారి చేతిలో తన చేతిని కలిపి కాళిదాస్... "శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు!" మనసారా పలికి తన ఇంటివైపుకు నడిచాడు.
తొలిరేయి - అసలు నిజం
ఆ ఊరి రామాలయంలో దీనదయాళ్, కాళిదాసులు వివాహానికి ఏర్పాట్లు జరిపారు. అనుకున్న లగ్నంలో బంధుమిత్రుల సమక్షంలో వారి వివాహం ఘనంగా జరిగింది.
అది నవదంపతుల తొలిరేయి. పడకగదిలోకి నాగరాజు పక్కా ఆంధ్రా వరుడుగా, తన మామ తన కోరికను తీర్చినందుకు మనసులో ధన్యవాదాలు తెలుపుకుంటూ పరమానందంగా ప్రవేశించాడు.
కొన్ని నిమిషాల తర్వాత సుమతి తెల్ల చీర, అదే రంగు రవికతో, తల కురులలో తెల్లని మల్లెపూలు పెట్టుకుని, కుడిచేతిలో పాలగ్లాసుతో గదిలో ప్రవేశించింది.
తలుపు ప్రక్కనే ఉన్న నాగబాలరాజు తలుపు గడిని బిగించాడు. సుందరి వైపు నవ్వుతూ చూచాడు.
"ఆనాడు నేను అడిగిన ప్రశ్నకు, మిమ్మల్ని కాదన్నందుకు మీకు నాపై కోపం రాలేదా!" మెల్లగా అడిగింది సుమతి.
"పేరు మార్చి గడ్డం మీసాలతో నన్ను మీరు...."
"మోసం చేశారుగా అని అడగబోతున్నావుగా!.... నాకు నీ ఆ ప్రశ్నతో... నీవు నాకు బాగా నచ్చావు. దాని మూలంగా నీవు ఎలాంటిదానివో నాకు అర్థం అయింది. మా మామయ్య కాళిదాసు నీ గురించి, నీ ఆదర్శాలను గురించి నాకు అన్ని విషయాలు చెప్పారు. ఆ కారణంగా నిన్నే పెండ్లి చేసుకోవాలనుకొన్నాను. మా మామయ్యకు నా అభిప్రాయాన్ని చెప్పాను. వారు బాలరాజు అనే పేరుతో గడ్డాలు, మీసాలతో నా ఫోటోను తీయించి, నీకు మీ నాన్నకు చూపించారు. నాకు నత్తి గిత్తి లేదు. నా పూర్తి పేరు నాగబాలరాజు. వాడే వీడు. నీవాడు" నవ్వుతూ చెప్పాడు నాగబాలరాజు.
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments