కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Nannakem Thelusu' Written By Venku Sanathani
రచన: వెంకు సనాతని
అవును..
నాన్నకేం తెలుసు?
తన సుఖం చూసుకోడం తెలీదు
పిల్లల్ని కోప్పడ్డం తెలీదు.
స్వార్థమనే మాటకు అర్థం తెలీదు.
ఏమీ తెలీని ఒక నాన్న కథను మన కళ్ళ ముందుంచారు ప్రముఖ రచయిత వెంకు సనాతని గారు. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
నారాయణ గారూ.. మీరీ మధ్య ఆఫీసుకి ఆలస్యంగా వస్తున్నారు. అప్పుడే వచ్చి, హడావుడిగా బల్ల మీద ఫైళ్ళు సర్ధుతున్న నారాయణతో కంప్యూటర్లో పని చేసుకుంటూనే అన్నాడు మేనేజర్ విష్ణు.
ఆ మాటలకు నారాయణ చేతులు కట్టుకుని మౌనంగా నిలబడ్డాడు. "పెద్దవారు.. చేతులు దించండి." నారాయణ వైపు చూస్తూ అన్నాడు విష్ణు.
మీ ఆలస్యంతో ఉదయం పని ఇబ్బందిగా మారింది నారాయణ గారు. ఇదే విషయం ఈ మధ్య మీతో చాలా సార్లు ప్రస్తావించాను. "అయినా..!" నిట్టూర్చాడు విష్ణు.
"ఈ కారణంతో మిమ్మల్ని తీసేయ్యొచ్చు. కానీ మీకున్న మంచితనం నాకున్న మానవత్వం అడ్డుపడుతున్నాయి." కుర్చీలో వెనక్కి వాలుతూ అన్నాడు.
"సార్.. సార్.. అంత పని మాత్రం చేయకండి. రేపటి నుండి త్వరగానే వచ్చేస్తాను." అన్నాడు నారాయణ బ్రతిమాలుతూ. ఆలస్యంగా వచ్చిన ప్రతిసారీ చెప్పే మాటను నారాయణ మళ్ళీ వల్లె వేయడంతో మనసులోనే నవ్వుకుంటూ పనిలో పడ్డాడు విష్ణు.
ఆఫీసుకి ఎప్పుడూ టంచనుగా వచ్చే నారాయణ ఆలస్యంగా వస్తున్నాడు. అదీ ఈ మధ్య నుండే. అధికారి హోదాలో హెచ్చరించాడే కానీ నారాయణ పట్ల ఏ దురుద్దేశం లేదు విష్ణుకి.
నారాయణకి, విష్ణుకి వయసులో వ్యత్యాసం ఉంది. నారాయణకి ఆఫీసులో ప్యూనుగా పదేళ్ళ అనుభవమూ ఉంది. విష్ణు మేనేజరుగా వచ్చి రెండేళ్ళు అవుతుంది. పనులన్నిటినీ చక్కబెట్టి తన పనిని సులువు చేసే నారాయణంటే విష్ణుకి మొదటి నుంచీ అపారమైన గౌరవం. ఏకవచనంతో ఏనాడూ సంబోధించ లేదు. స్టాఫు కూడా అంతే. తన పని పూర్తయినా, ఎవరికైనా పని ఎక్కువుంటే వారితో పాటు ఉండి వారికి కావాల్సినవి చూసి అప్పుడు వెళ్ళేవాడు. వారు ఆడవారైతే ఇంటి దాకా తోడు వెళ్ళేవాడు.
ఆఫీసులో తండ్రి స్థానమున్న నారాయణకి ఇద్దరు మగ సంతానం. వాళ్ళు కవలలుగా పుట్టిన ఏడాదికే భార్య కన్నుమూసింది. ఆసరా కరువైనా, బ్రతుకు బరువైనా అన్నీ తానై పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. తానున్న స్థితికి కష్టమే అయినా ఉన్నత చదువులు చదివిస్తున్నాడు నారాయణ. వాళ్ళకి వాళ్ళ చదువు తప్ప తండ్రి చనువు పట్టదు. గొంతెమ్మ కోర్కెలతో గంతులు పెట్టించేవారు. గొంతులో ప్రాణ మేసిన నాన్నకి కష్టమంతా ధార పోయడం ఓ లెక్కా. అదే చేస్తున్నాడు నారాయణ.
భార్య పోయినప్పటి నుండి ఇంటి పని, వంట పని, ఆఫీసు పని ఇలా అన్ని పనులు వెన్నుపై పడిన నారాయణ్ణి పనిగట్టుకుని మరీ పలకరించింది వృద్దాప్యం. ఇంకొక్క ఏడాదితో పిల్లల చదువులు పూర్తవుతాయి. ఆ కారణంతోనే శక్తిని కూడదీసుకుంటున్నాడు.
పిల్లల చదువులు పూర్తయ్యాయి. విదేశీ ఉద్యోగాలు వచ్చాయి. విదేశీ ప్రయాణానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
"ఏరా.. ఉద్యోగాలొచ్చిన సంగతి కానీ, విదేశాలకి వెళ్తున్నామన్న వివరం కానీ నాన్నకు ఇంతవరకు చెప్పలేదు. ఎప్పుడు చెప్దాం..?" అన్నాడు చిన్నోడు పెద్దోడి వైపు చూస్తూ.
"ఆ.. వెళ్ళే ముందు చెప్దాంలే!" పెద్దోడి మాటల్లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది నిర్లక్ష్యం.
"ముందుగా ఒక మాట చెప్తే బాగుంటుంది కదా.." సాగదీసాడు చిన్నోడు.
"ఫ్యూన్ ఉద్యోగో చేసే నాన్నకి ఫారిన్ ఉద్యోగం గురించి ఏం తెలుస్తుందిరా.. వెళ్ళే ముందు చెప్దాం అన్నానుగా.. పని చూసుకో అన్నాడు పెద్దోడు విసుగ్గా..
ఆరోజు ఆఫీసులో ఆలస్యం అవటంతో రాత్రి 8 గంటలకు ఇంటికి వస్తున్న నారాయణ్ణి పలకరించారు శేషగిరి,కరిముల్లా. "నారాయణా.. అదృష్టవంతుడివయ్యా..!" అన్నాడు శేషగిరి. "అరే భాయ్ నారాయణా.. ఎన్ని కష్టాల్ పడ్డావ్! అన్నీ తీరినట్లే పో! అన్నాడు కరిముల్లా అందుకుని. ఏం అర్థం కాలేదు నారాయణకి. పిల్లలిద్దరూ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించినా "నీలో ఇంత కూడా గర్వం లేదు,గొప్పోడివి" అన్నాడు శేషగిరి.
“పిల్లలిద్దరికీ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలా..!!” ఎవరో చెప్తే కానీ తనకు ఈ విషయం తెలీలేదు. ఈ ఆలోచనలతోనే ఇంటికి వచ్చి వరండాలో ఉన్న కుర్చీలో తల వాల్చాడు నారాయణ.
"నాన్నా.."
"ఆ..!" కళ్ళు తెరిచి పిల్లల వైపు చూశాడు నారాయణ.
పెద్ద పెద్ద బ్యాగుల నిండా లగేజీతో కనిపించారు ఇద్దరూ.
"మాకు ఫారిన్ ఉద్యోగాలు వచ్చాయి. అమెరికా వెళ్తున్నాం.." అన్నారు ముక్తకంఠంతో.
"జాగ్రత్తగా వెళ్ళిరండి." అన్నాడు నారాయణ చిరునవ్వుతో. వెళ్తే రారని తెలిసినా..
తాము వెళ్ళిపోతే తండ్రి పరిస్థితి ఏంటని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దూరపు కొండల నునుపు చూడటానికి రెక్కలొచ్చిన పక్షులల్లే ఎగిరిపోయారు కొడుకులిద్దరూ.
*** సమాప్తం ***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం :
పేరు : వెంకు సనాతని
అమ్మ పేరు : సులోచన నాన్న పేరు : శ్రీను వృత్తి : రచయిత
ఊరు : బాపట్ల
జిల్లా : గుంటూరు
రాష్ట్రం : ఆంధ్ర ప్రదేశ్
తెలుగు కవన వేదిక • 4 hours ago
చాలా బాగుంది అన్న👌👌