నరకచతుర్దశి - అంతరార్థం
- Sudha Vishwam Akondi

- Oct 19
- 4 min read
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguDevotionalStories, #NarakachaturdasiAntharartham, #నరకచతుర్దశిఅంతరార్థం

Narakachaturdasi Antharartham- New Telugu Story Written By Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 19/10/2025
నరకచతుర్దశి - అంతరార్థం - తెలుగు కథ
రచన: సుధావిశ్వం ఆకొండి
చీకటివెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి..
ఆనందాలను పంచే దీపావళి..
దీపావళి అంటే దీపాల వరుస. ఈ పండగ ఎందుకు చేసుకుంటారు? మనందరికి తెలిసిందే! శ్రీకృష్ణ పరమాత్మ సత్యాభామాదేవి సహితుడై నరకుడు అనే అసురుని సంహరించినందుకు ఈ పండుగ చేసుకుంటాం అని ఠకీమని చెప్పేస్తాం కదా!
చతుర్దశినాడు నరకాసురుని వధ జరిగింది. ఆ మరునాడు అంటే అమావాస్య నాడు అన్ని లోకాలు నరకుని పీడ పోవడంతో అందరి జీవితాల్లో చీకట్లు తొలగిపోయి, వెలుగులు వచ్చాయని ఆనందంతో అంతటా దీపాలు వరుసలుగా వెలిగించారు. అన్ని లోకాలు కాంతులతో వెలిగిపోయాయి. అందుకే అమావాస్య నాడు దీపావళిగా జరుపుకుంటారు.
మహాలక్ష్మిని పూజించడం ద్వారా అమ్మ అనుగ్రహం కలిగి సిరిసంపదలతో తులతూగుతారని భావిస్తారు.
నరక చతుర్దశి :
అసలు నరకుడు ఎవరు? ఏమి చేశాడు? ఎందువల్ల పరమాత్మచే సంహరించబడ్డాడు?
మహావిష్ణువు ఆది వరాహమూర్తిగా వచ్చినప్పుడు, హిరణ్యాక్షుడి చేత నీటిలో దాచబడిన భూమిని రక్షించాడు ఆ రాక్షసుని వధించి. అప్పుడు భూదేవి కోరిక మేరకు ఆది వరాహమూర్తి ప్రసాదించిన పుత్రుడే ఈ నరకుడు.
కానీ రాక్షస ప్రవృత్తితో ఉండడం వల్ల రాక్షసుడు అయ్యాడు. బ్రహ్మ దేవుని కోసం తపస్సు చేస్తాడు. ఆయన ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకొమ్మంటే.. "నాకు మరణం లేకుండా వరం కావాలి" అని అడుగుతాడు
"అలా కుదరదు. ఈ సృష్టిలో మరణం లేనిది ఉండదు"
"అయితే నా తల్లి చేతిలో మరణించే వరం ఇవ్వండి" అని కోరుకుంటాడు.
"తథాస్తు " అని అదృశ్యం అవుతాడు బ్రహ్మ దేవుడు.
'ఏ తల్లి కూడా తన కుమారుని చంపలేదు కదా! ఇక తనకు చావు ఉండదు' అని అనుకుంటాడు.
ఆ వరబల గర్వంతో పద్నాలుగు భువనాలను జయిస్తాడు. అన్ని రాజ్యాల పైకి దండెత్తి, ఆ రాజులను చంపేసి, వాళ్ళ కూతుళ్ళను తన రాజ్యానికి తెచ్చి బంధించడం చేసాడు.
అలా పదహారువేలమంది రాచకన్యలను తెచ్చి బంధించాడు. రావణాసురునిలా స్త్రీలను అనుభవించలేదు. కేవలం బంధించి ఉంచాడు.
దేవతల తల్లి అయిన అదితి కుండలాలను తస్కరిస్తాడు. వరుణ దేవుని ఛత్రాన్ని, దేవతలు విహరించే గిరిని ఎత్తుకొచ్చి, తన రాజ్యంలో పెట్టుకున్నాడు. ప్రాగ్జోతిష్య పురం నరకునిది. కానీ ఎక్కువగా మహిష్మతిపురంలో ఉంటాడు అసుర గణాలతో.
తన వంటి రాక్షసులను కూడగట్టుకొని యజ్ఞయాగాది క్రతువులు చేయకుండా అడ్డుకోవడం. దేవతలతో సహా అందర్నీ హింసించడం ఇదే పనిగా ఉంటాడు.
*****
నరకుని చేత పీడింపబడిన దేవతలందరినీ తీసుకుని, దేవేంద్రుడు కృష్ణ పరమాత్మ వద్దకు వస్తాడు.
"స్వామీ! నరకుని ఆగడాలు పెరిగి పోయాయి. అదితి కుండలాలు, వరణుని ఛత్రం, మా అందరికి ఇష్టమైన పర్వతం ఎత్తుకుపోయాడు. లోకాల్లోని అందర్నీ హింసిస్తున్నాడు. వాడి పీడ వదిలించి, లోకాల్ని రక్షించు" అని వేడుకుంటాడు దేవేంద్రుడు
అలాగేనని అభయమిస్తాడు కృష్ణుడు.
ఆ తర్వాత నరకుని వధించడానికి బయలుదేరుతుంటే సత్యభామ పరుగున వచ్చి..
"నాథా! నేనూ వస్తాను మీతో" అంటుంది.
అప్పుడు చిరునవ్వుతో.. "సత్యా! ఉద్యానవనంలో విహరించడానికి వెళ్లడం లేదు. యుద్ధానికి కదా వెళ్ళేది! వన విహారానికి వచ్చినట్లుగా అనుకుంటున్నావా? భయంకరమైన రాక్షసులు, అస్త్ర, శస్త్రాలు ప్రయోగిస్తారు. ఏనుగుల, గుర్రాల శబ్దాలు, చనిపోయే వారి అరుపులు ఇవన్నీ ఉంటాయి. సుకుమారివి అయిన నువ్వు ఆ ఘోర రణరంగంలోకి ఎలా వస్తావు? నేను వెళ్లి వారిని వధించి త్వరగా వచ్చేస్తాను. బెంగపడకు" అన్నాడు
కానీ సత్యభామ ఆయన భుజంపైన చుబుకం (గడ్డం) ఉంచి ప్రియంగా..
"కృష్ణా! నాకేమీ భయం లేదు. మీ భుజబల రక్షణలో ఉంటాను. మీరుండగా నాకేమీ భయం లేదు. నాకు మీ వెంట రావాలని ఉంది. వద్దనవద్దు" అంటూ రెండు చేతులతో నమస్కరించింది
దానితో సంతోషంగా సరేనని, రమ్మన్నాడు కృష్ణ పరమాత్మ. గరుత్మంతుని పైన ఎక్కి ఇద్దరూ బయలుదేరారు.
గరుత్మంతుని పైన ఇద్దరూ నరకుని నగరానికి వెళ్లారు. వాడికి స్నేహితులు,
నమ్మిన బంట్లు మురాసురుడు, నిశుంభుడు, హాయగ్రీవుడు అనే రాక్షసులు.
జలదుర్గం, గిరి దుర్గం, శస్త్ర దుర్గం వంటివి ఆరు రకాల దుర్గాలు ఉంటాయి. అలాంటివి చాలా నిర్మించాడు రాజ్యంలో నరకుడు.
ఆ దుర్గాలను అన్నిటినీ కూల్చేసి, తన పాంచజన్యాన్ని పూరించాడు కృష్ణుడు. అది విని మురాసురుడు జలదుర్గంలో నుంచి వచ్చాడు. వాడు అయిదు తలలతో, పెద్ద జడ వేసుకుని వున్నాడు. తన పాశాలతో ఈ పురాన్ని కట్టి ఉంచాడు. ఎవరైనా వస్తే తెలుస్తుందని. ఆ పాషాలు నరికి వేసేసరికి బయటకు వచ్చాడు. భయంకరమైన రూపంతో వున్నాడు.
కృష్ణుడు వాడి కొడుకులతో సహా వాడిని తన గదను ఉపయోగించి చంపి వేసాడు. అది తెలిసి నరకాసురుడు కోపంగా యుద్ధానికి వచ్చాడు. నరకుడు పెద్ద సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. అది చూసిన సత్యభామ నేనూ యుద్ధం చేస్తానంది ఉత్సాహంగా.
తన పెద్ద జడను ముడివేసుకుని, మెడలోని హారాలు సరిచేసుకుని, చీరచెంగు కదలకుండా దోపుకుని కృష్ణుని ముందుకు వచ్చి..
"నాథా! ఆ ధనుస్సు ఇవ్వండి. నేను యుద్ధం చేస్తాను" అంది దేదీప్యమానంగా ముఖం వెలిగిపోతుండగా
అన్నీ తెలిసినవాడైన కృష్ణ పరమాత్మ, చిరునవ్వు నవ్వి తన ధనుస్సును సత్య భామ చేతికి ఇచ్చాడు.
ఆ ధనుస్సు పట్టుకోగానే ఆ పరమాత్మ తేజస్సు తనలో కలిసిపోయినట్లుగా వెలిగిపోతూ, ఆ ధనుస్సును వంచి అల్లెత్రాడు కట్టేసి, బాణాలను అభిమంత్రించి, ఆ రాక్షసులపైన వదిలి పెట్టడం మొదలుపెట్టింది సత్యభామాదేవి.
ఒక్కొక్క బాణం ఎప్పుడు, ఎలా వేస్తుందో తెలియకుండా చాలా వేగంగా బాణాలు వేసింది.
వీర, శృంగార, భయ, రౌద్ర రసాలు ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తుంది ఆ తల్లి.
రాక్షసుల వైపు భయానకంగా చూసి బాణాలు విసిరి, వాటి ధాటికి ఆ రాక్షసులు అరుస్తుంటే, కృష్ణుని వైపు శృంగార రసంతో చూసారా వాళ్లపై వేసాను అన్నట్లుగా చూసి, ఆయన సంతోషంగా మెచ్చుకున్నట్లుగా కళ్ళల్లో భావాలు పలికిస్తుంటే ఏక కాలంలో ఇన్ని రసాలు పోషిస్తూ యుద్ధం చేసింది సత్యభామ.
యోధులైన రాక్షసులు అందరూ ఉగ్రంగా వచ్చారు. అప్పుడు ఆ తల్లి ఎడమ కాలు ముందుకు పెట్టి, కుడి కాలు వెనక్కి పెట్టి, తీక్షణంగా బాణం ఎక్కుపెట్టి వదులుతుంటే చెవుల తాటంకాల కాంతులు, అరికాళ్ళల్లోని కాంతులు పరుచుకోగా యుద్ధం చేస్తుంటే..
చిరు నవ్వులు చిందిస్తూ, విస్మయంగా కృష్ణుడు సత్యభామ వంక చూస్తూ..
"ఈవిడేనా యుద్ధం చేసేది! అంతఃపురంలో ఉండి, పక్కన ఉన్న మందిరానికి పల్లకిలో వెళ్ళడానికి అలిసిపోయేది, మగవాళ్ల ముందుకు రానిది, ఇక్కడ శత్రువులను చీల్చి చెండాడుతుంది. ఎవరైనా కొద్దిగా పెద్దగా మాట్లాడితే భరించలేనిది ఇక్కడి అరుపులు భరిస్తూ భయానకంగా యుద్ధం చేస్తుంది. ఇవన్నీ ఎప్పుడు, ఎలా నేర్చుకుంది!" అని అనుకున్నాడట అని ఆ ఘట్టాన్ని అద్భుతంగా వర్ణిస్తారు భాగవతంలో
అలా చివరికి నరకుడు మరణిస్తాడు.
వాడు కోరుకున్న వరం ప్రకారం తన తల్లి భూదేవి అంశ అయిన సత్యభామ చేతిలో మరణిస్తాడు. నరకుడు మరణించాడని ఆనందంగా దేవతలు, మానవులు అందరూ ఎన్నో దీపాలు వరుసలుగా పెట్టి వెలిగించి ఆనందోత్సాహాలు జరుపుకున్నారట. అందుకని అలా ఇప్పటికీ వెలిగిస్తాము.
కానీ అసలు అంతరార్థం ఏమిటంటే..
మనలోనే ఉన్న అసలు నరకుడిని సంహరిస్తే అప్పుడు నిజమైన దీపావళి.
నరకుడు అంటే అజ్ఞానం. అదితి అంటే ఆకాశం. కుండలాలు అంటే సూర్యచంద్రులు. సూర్యచంద్రుల గమనం జీవించేకాలం తరిగిపోవడం. అందుకని ఎత్తుకుపోయాడు. ఆ అజ్ఞానాన్ని కృష్ణ పరమాత్మ తీసివేశాడు.
ఇక నరకుడు బంధించిన పదహారు వేల మందిని కృష్ణ పరమాత్మ పెళ్లి చేసుకోవడం వెనకాల ఒక పరమార్ధం ఉంది. అష్ఠభార్యలు ఒక మహాలక్ష్మి (ప్రకృతి) అంశలు అయితే, ఈ పదహారు వేల మంది ఆ పరమాత్మ యొక్క షోడశ కళలు. ఆ కళలే స్త్రీలుగా వచ్చి ఆయనను సేవించుకున్నాయి. వీరిని బంధించి నరకుడు ఆ ఈశ్వరుని ధిక్కరించాడు. వారిని అందరిని ద్వారకకు పంపించి, తర్వాత పదహారు వేలమందిని ఏక కాలంలో, పదహారు రూపాలతో పెళ్లి చేసుకున్నాడు.
ఎదుటి వారివి మనవిగా చేసుకోవాలనే దురాలోచనలే నరకుడు. అంతా నాది, నాకే కావాలి అనే స్వార్థం మనిషిలో వుండే భావనలే నరకుడు. శారీరకంగానే కాదూ, మానసికంగా కూడా ఎదుటివారిని బాధపెట్టడం ద్వారా ఆనందం పొందడం అనేది నరక ప్రవృత్తినే!
ఇలాంటి దుష్ప్రవర్తనలు మనుషుల్లో తొలగి, తద్వారా ఆ ఈశ్వరుని ప్రకృతి శక్తులు శాంతించి, అన్ని ఇక్కట్లనుండి మానవాళి బయటపడాలి ఆ భగవత్ కృప వల్ల.
సర్వేజనాసుఖినోభావంతు..
అందరికీ నరకచతుర్దశి శుభాకాంక్షలు ��
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

-సుధావిశ్వం




Comments