నేటి – మేనమామలు
- Srinivasarao Jeedigunta

- Oct 14, 2025
- 6 min read
#NetiMenamamalu, #నేటిమేనమామలు, #JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #TeluguHeartTouchingStories

Neti Menamamalu - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 14/10/2025
నేటి – మేనమామలు - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సీతారామయ్య గారికి నలుగురు మొగపిల్లలు, చివరన ఒక ఆడపిల్ల. చేసేది ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. పిల్లలకు ఏ లోటు రాకుండా పెంచి పెద్దచేశాడు. పెద్ద కొడుకు శోభన్, రెండో కొడుకు వినయ్‌కి ఉద్యోగం రావడం, మూడో కొడుకు కృష్ణా, నాలుగో కొడుకు రవికి డిగ్రీ చదువులు అయ్యేసరికి కోవిడ్ బారిన పడి సీతారామయ్య మరణించాడు.
కూతురు మాలతి ఇంటర్మీడియట్‌లో ఉంది. తల్లి, తమ్ముళ్లని, చెల్లెలి పెళ్లి బాధ్యత — ఉద్యోగం చేస్తున్న ఇద్దరి మీద పడింది.
ప్రతి నెల ఇద్దరూ కొంత డబ్బు తల్లికి పంపించి, “ఇంతకంటే ఎక్కువ సహాయం చేయలేము. త్వరగా తమ్ముళ్లను కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటే, చెల్లెలు పెళ్లి చేసి పంపించుదాం. అమ్మ ఎవరి దగ్గరైనా కాలం గడిపేస్తుంది,” అనడంతో పైచదువులు చదవాలన్న ఆశ అడుగంటటంతో ఉద్యోగాల వేటలో పడ్డారు సీతారామయ్య గారి చివరి ఇద్దరు మొగపిల్లలు.
“ఇంత చిన్న వయసులో నాకు పెళ్లి ఏమిటమ్మా! నలుగురు అన్నయ్యలు ఉన్నారు కదా, నన్ను కూడా డిగ్రీ వరకు చదివిస్తే ఏదో ఉద్యోగం చేసుకుంటాను,” అంది కూతురు మాలతి తల్లితో.
“నిజమే కానీ మన సంసారం ఎలా ఉందో చూస్తున్నావు కదా! కొన్నాళ్లు పోతే నీ పెళ్లి విషయం కూడా పట్టించుకోరు నీ అన్నయ్యలు. వాళ్లకి పిల్లలు పుట్టిన తర్వాత నీ విషయం ఎవ్వరూ పట్టించుకోరు. అయినా అనుకోగానే సంబంధం కుదరాలి కదా. ఈలోపు కంప్యూటర్ నేర్చుకో,” అంది తల్లి సుభద్రమ్మ.
చిన్న కొడుకులు — కృష్ణ ఆటోమొబైల్ కంపెనీలో, రవి హైదరాబాద్‌లో బ్యాంకు ఉద్యోగం సంపాదించారు. వాళ్లు హైదరాబాద్ వెళ్లి పెద్ద ఇల్లు తీసుకుని, “తల్లీ, చెల్లెలుని తీసుకుని వస్తాము. ఈలోపు పనికిరాని సామాను ఎవరికైనా ఇచ్చేయండి,” అని చెప్పి హైదరాబాద్ వెళ్లిపోయారు.
ఉద్యోగంలో చేరిన తరువాత పెద్ద అన్నగారి అంగీకారంతో తల్లి, చెల్లెలు ఇద్దరు తమ్ముళ్లతో ఉండే విధంగా — తను, తన రెండవ తమ్ముడు నెలకు కొంత సొమ్ము సహాయం చేసేలా నిర్ణయం తీసుకున్నారు. తమకు ఇంకా పెళ్లి కాకపోవడంతో ఎటువంటి అనుమానం లేకుండా మూడో, నాలుగో తమ్ముళ్లు ఇల్లు తీసుకుని తల్లిని, చెల్లెలును తీసుకుని వచ్చారు.
చెల్లెలు మాలతి పెళ్లి తప్ప మిగిలిన పిల్లల పెళ్లిళ్లు అయ్యాయి. వాళ్లకి పిల్లలు కూడా కలిగారు. సుభద్రమ్మకి రాను రాను మనసులో అనుమానం పెరిగింది. నాలుగో కొడుకు రవి బ్యాంకు ఉద్యోగం చేయడంతో ప్రతి నెల అన్నగార్లు ఇచ్చే డబ్బు విషయంలో అశ్రద్ధ చేయడం మొదలుపెట్టాడు. మూడో వాడు మొదటి నుంచీ చేతులు ఎత్తేసాడు — “నేను ఒక్క పైసా ఇవ్వలేను. నాకొచ్చే జీతంతో నా ఇద్దరు పిల్లలను పోషించడం కష్టంగా ఉంది,” అని.
అయితే గుడ్డిలో మెల్లలా, చివరి కోడలు కూడా చిన్న ఉద్యోగం చేయడంతో ఇల్లు ఓడిదడుకులతో చిన్న కొడుకు రవి నడిపిస్తూ, తల్లికి ఏ లోటు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
పులిమీద పుట్రలా, సుభద్రమ్మ గారి కూతురు డిగ్రీ పూర్తి చేసుకుని పెళ్లికి సిద్ధంగా ఉంది. కొడుకులు చూస్తే ఏ ప్రయత్నం చేస్తున్నట్టు లేదు. దానితో సుభద్రమ్మ ఆటోలో పెద్దకొడుకు ఇంటికి వెళ్లి కూతురు పెళ్లి విషయం గుర్తు చేసింది.
అత్తగారు పెళ్లి విషయం ఎత్తగానే, గుండెల్లో రైలు పరుగులు తీసినట్టు అయిన సుభద్రమ్మ గారి కోడలు, “ఈ రోజుల్లో ఇంజనీరింగ్ చదివిన ఆడపిల్లలకే సంబంధాలు కుదరటం కష్టంగా ఉంది. డిగ్రీ చదివిన మాలతికి పెళ్లి సంబంధం చూడటం అంత ఈజీ కాదు. అయినా మీ అబ్బాయి తెలిసిన వాళ్లకి అడుగుతున్నాం,” అంది.
“మెట్రిక్ తప్పిన నీకే రైల్వే ఇంజనీర్ దొరకగా, లేంది డిగ్రీ చదివిన మా చెల్లెలుకి సంబంధం దొరకడం కష్టం కాదు. కాని పెళ్లికి అయ్యే ఖర్చుల గురించే ఆలోచన,” అన్నాడు శోభన్.
“దానికేముంది రా అబ్బాయి! మీ నాన్న కొడుకులనుంచి ఇటువంటి మాట వస్తుందనుకోలేదు. నా మెడలో కొంత బంగారం కొన్నారు, అవసరమైతే అమ్మేద్దాం. నువ్వు మంచి సంబంధం చూడు,” అంది సుభద్రమ్మ.
“సరే అయితే తమ్ముళ్లతో కూడా మాట్లాడి వ్యవహారంలోకి దిగుతాను. నువ్వు కంగారు పడకు. ఎలాగో వచ్చావుగా, ఒక వారం రోజులు నా దగ్గర ఉండు అమ్మా. సాయంత్రం తమ్ముడి ఇంటికి వెళ్లి నీ బట్టలు తీసుకువస్తాను,” అని బలవంతం పెట్టాడు.
కొడుకు మాట కాదనలేక, “సరే, వచ్చే అప్పుడు నా మందులు కూడా పెట్టి తీసుకురా,” అంది ఆఫీసుకి వెళ్తున్న కొడుకుతో.
సాయంత్రం తల్లి బట్టలు తేవడానికి తమ్ముడి ఇంటికి వెళ్లిన శోభన్‌కి అక్కడ తల్లి కనిపించడం తో ఆశ్చర్యంగా, “అదేమిటి? ఎందుకు వచ్చేసావు?” అన్నాడు.
“ప్రతి నెల నా పోషణ కోసం ఇస్తున్న డబ్బు ఇస్తున్నావు. మళ్ళీ నీ ఇంట్లో తినటం ఎందుకు అని వచ్చేసాను. నీ ఆవిడ నీకు ఫోన్ చేసి చెప్పలేదా?” అంది సుభద్రమ్మ.
తల్లి ముఖం చూసిన తర్వాత, తను ఆఫీసుకి వెళ్లిన తర్వాత తన భార్య తల్లిని ఏదో అనేసి ఉంటుందనుకుని, “సరే అమ్మా, నీకు ఎక్కడ బాగుంటే అక్కడే ఉండు,” అని వెళ్ళిపోయాడు.
కొద్ది రోజులలో శోభన్ తన చెల్లెలు కోసం ఒక సంబంధం తెచ్చాడు. పిల్లాడికి అదే ఊరిలో మెడికల్ షాప్ ఉంది, పల్లెటూరులో రెండు ఎకరాల పొలం ఉంది. ఒక్కడే సంతానం. “ఇంతకంటే మంచి సంబంధం దొరకడం కష్టం,” అని తల్లి, చెల్లెలు, మిగిలిన తమ్ముళ్లను ఒప్పించి, తల్లి నగలు అమ్మేసి పెళ్లి చేశారు.
ముగ్గురు అన్నగార్లు చెల్లెలు ఇంటికి కావలసిన వస్తువులు కొని ఇచ్చారు. మూడో వాడైన కృష్ణ మళ్ళీ తన పేదరికం అడ్డం పెట్టుకుని చెల్లెలు పెళ్లి ఖర్చుల్లో తన బాధ్యత తప్పించుకున్నాడు.
పది సంవత్సరాలు గడిచేసరికి చాలా మార్పులు జరిగిపోయాయి. సుభద్రమ్మ కాలం చేసింది. మాలతి భర్త మెడికల్ షాప్ దివాళా తీయడంతో, పొలం అమ్మేసి అప్పులు తీర్చినా కొన్ని అప్పులు మిగిలిపోయాయి. మాలతికి ఆడపిల్ల పుట్టింది.
మాలతి అన్నదమ్ములు — “బావగారు చేసిన మిగిలిన అప్పులు కూడా తీర్చండి,” అని అతనికి సూర్యాపేటలో ఉన్న రైస్‌మిల్లులో గుమాస్తా ఉద్యోగం ఇప్పించి, “ఇహ మీ బ్రతుకు మీరు బతకండి. మా నుంచి సహాయం ఆశించవద్దు. మా పిల్లల మంచి మేము చూసుకోవాలి,” అని అన్నారు.
ఆ తరువాత అప్పుడప్పుడు వినయ్, రవి వెళ్లి చెల్లెలు చూసి కొంచెం డబ్బు చేతిలో పెట్టి వచ్చేవాళ్ళు.
కాలం గడిచింది. ఆడపడుచుని ఇంటికి పిలిచి పసుపు కుంకుమ పెట్టాలి అనే ఆలోచన కూడా లేకుండా వదినలు ఉండటంతో, అన్నగారు పిలిచినా వెళ్ళటం మానేసింది మాలతి. ఎవరి పిల్లల చదువుల హడావిడి లో వాళ్లు ఉండి, ఒకరి విషయం ఒకరు పట్టించుకునే ఆలోచనే లేకుండా పోయింది.
ఒక రోజు చెల్లెలు కామన్‌గా వ్రాసిన మెసేజ్ అన్నదమ్ములు నలుగురు చూసుకుని ఆశ్చర్యంగా, వాళ్ల భార్యలకి చెప్పారు — “రేపు ఆదివారం మా చెల్లెలు మా పెద్దన్నయ్య వాళ్లింటికి వస్తోంది. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మనం అక్కడికి వెళ్తున్నాము,” అని నిర్ణయించారు. “మీ చెల్లెలు చూసి కరిగిపోయి దానకర్ణుడు లా మారిపోకండి,” అని వార్నింగ్ ఇచ్చారు భార్యలు.
ఆదివారం రానే వచ్చింది. తమ్ముళ్లు అందరూ పెద్దన్న శోభన్ ఇంటికి చేరుకున్నారు. “ఎందుకైనా మంచిదని” ఆడవాళ్లు కూడా భర్తలని వెంబడించారు.
అన్నగారింట్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్న సుభద్రమ్మగారి పిల్లలకు ఆటోలో దిగిన చెల్లెలు, బావగారిని చూసి “సామాన్లు ఏవే?” అని అడిగింది. “సూర్యాపేట నుంచే కదా, సామాను ఎందుకు? మీతో మాట్లాడి వెళ్ళిపోతాము,” అంది మాలతి. “నీలో మార్పు లేదు మాలతి. చిన్నప్పటి నుంచీ మా ఇల్లు పరాయి ఇల్లు అనుకుంటున్నావు. ఇప్పుడొచ్చి సాయంత్రం వెళ్ళాలా?” అంది పెద్ద వదిన గారు.
“అలా ఎందుకు అనుకుంటాను వదినా! ఈ ఇల్లులోనే పెరిగిన దానిని,” అంది మాలతి.
లోపలికి వెళ్లి కూర్చున్నాక, అన్నగార్లు, వదినలని ఉద్దేశించి మాలతి చెప్పింది — “ఒక శుభవార్త చెప్పటానికి వచ్చాము. మీ మేనకోడలు ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో ‘డెలాయిట్’ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరింది. యిప్పుడు తనకు మంచి సంబంధం కుదిరింది. పెళ్ళికొడుకు కూడా అదే కంపెనీలో ఉద్యోగం. మనవాళ్లే. కట్నం, కానుకలు లేవు. పెళ్లి బాగా చెయ్యాలి అని అడిగారు. మీ బావగారి విషయం తెలుసు కదా — అందుకే ఈ పెళ్లి సవ్యంగా జరిపించే బాధ్యత మేనమామలుగా మీరు తీసుకోవాలి,” అంది.
“అదేమిటి విచిత్రం! మీ అమ్మాయి ఇంజనీరింగ్ చదివినట్టుగా మాకు తెలియదు,” అంది పెద్ద వదిన గారు.
“మాకు తెలుసు లే, మాతో చెప్పింది మా చెల్లెలు. ‘మీకు మంచి మాటలు నచ్చవు కదా’ అని చెప్పలేదు,” అన్నాడు శోభన్ భార్యతో.
దానితో మొహం చిట్లించుకుని, “అయితే పెళ్లి అంటే అయిదు లక్షలు అయినా కావాలి. ఒక్కపూట భోజనం పెట్టినా ఖర్చవుతుంది. నీ పెళ్లి అంటే నీ అమ్మగారి నగలు అమ్మేసి చేసాం. ఇప్పుడు నీ కూతురు పెళ్లికి నీ దగ్గర నగలు కూడా లేవు. మా నగలు అమ్మాలి,” అంది అసహనంగా శోభన్ భార్య.
“కొద్దిగా ఆగుతావా వదినా! ముందు మా అన్నదమ్ములని మాట్లాడనివ్వు. దయచేసి ఆడవాళ్లు కలగచేసుకోవద్దు,” అన్నాడు రవి.
“అన్నయ్యా, ఇన్నాళ్లూ చెల్లెలు కష్టపడి కూతుర్ని చదివించింది. డబ్బులు ఖర్చు పెట్టినా మన పిల్లల్లో ఒక్కడు ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోలేకపోయాడు. ఇప్పుడు మన చెల్లెలు ని ఆదుకోవడం మన బాధ్యత. కట్నం ఎలాగూ లేదు కాబట్టి పెళ్లి ఖర్చులు మనం నలుగురం సమానంగా వేసుకుని మేనకోడలు పెళ్లి చేద్దాం. పెద్దన్నయ్యా, నువ్వు ఇప్పుడు మాట్లాడాలి తప్పదు,” అన్నాడు రవి.
“రోజూ చాగంటి గారి ప్రవచనాలు వినడం, తులసి చెట్టు చుట్టూ తిరగడం కాదు — కొద్దిగా ఇతరుల కష్టం పట్టించుకోవడం నేర్చుకోవాలి,” అన్నాడు రవి తన భార్యతో.
“బాగానే ఉంది వరస. ఇప్పుడు నేను ఏమన్నాను? మీ చెల్లెలు, మీ డబ్బు, మీ ఇష్టం. మధ్యలో నా అంగీకారం ఎందుకు?” అంది రవి భార్య. దానితో మిగిలిన ఆడవాళ్లు ఏమి చెయ్యాలో తెలియక చూస్తూ ఉండిపోయారు.
“నాకు మాత్రం అదేమీ పరాయిది కాదు కదా రా. మన ముగ్గరం ఏదో విధంగా సరే. కృష్ణ మాటేమిటి? ఇప్పటివరకు వాడు ఏ ఖర్చులలోనూ ముందుకు రాలేదు. ఇప్పుడు రిటైర్ అయ్యి కూతురు దగ్గర ఉంటున్నాడు. ముందు వాడిని మాట్లాడమన్నాడు,” శోభన్ భార్య వంక చూడకుండా అన్నాడు.
వాడు కూడా ఇవ్వాలి తప్పదు. కొడుకు అమెరికాలో ఉన్నాడు కాబట్టి వాడిని అడిగి ఇస్తాడో, తన దగ్గర ఉంటే ఇస్తాడో — వాడి ఇష్టం,” అన్నాడు.
కోపంగా ఉగిపోతూ, “వాడు అమెరికాలో ఉండి మమ్మల్ని పోషించడానికి నానా బాధలు పడుతున్నాడు. మీరు నాలుగు రూపాయలు వెనక్కి తీసుకున్నారు. నేను ఇద్దరి పిల్లలని చదివించడానికి చాలా కష్టపడ్డాను. నాకు ఎవరూ సహాయం చేయలేదు,” అన్నాడు కృష్ణ.
“నీకెందుకు? నేను అమెరికాకి ఫోన్ చేసి వాడిని అడుగుతాను. వాడు ఇస్తాను అంటే, నువ్వు అడ్డం చెప్పకుండా ఉంటే చాలు,” అని అమెరికాలో ఉన్న కృష్ణ కొడుకు సుకుమార్‌కి ఫోన్ చేసి విషయం చెప్పి, “ఇన్నాళ్లూ నీ నాన్నకి ఏ బాధ్యత పెట్టలేదు. పెద్దన్నలు నేను భరించాము. ఇప్పుడు నువ్వు నీ నాన్న పరువు కాపాడాలి,” అన్నాడు రవి.
“బాబాయ్, నా గురించి మా నాన్న ఎందుకు అలా చెడుగా చాటింపు వేస్తున్నాడో తెలియడం లేదు. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. మీతో సమానంగా నేను మా నాన్న బదులు సంతోషంగా ఇస్తాను. మీరు ఎప్పుడు, ఎంత పంపించాలో చెప్పండి. నాన్నకి ఈ విషయంలో జోక్యం అక్కర్లేదు,” అన్నాడు సుకుమార్.
స్పీకర్‌ఫోన్‌లో కొడుకు మాటలు విన్న కృష్ణ ముఖం నల్లబడి, “వాడు అలాగే అంటాడు. అప్పు చేసి ఇస్తే మళ్ళీ తీర్చాలిగా?” అన్నాడు.
“అది కాదు మాలతి! అన్నాను అంటే అన్నాను అంటారు. ఇన్నాళ్ల నుంచి చూస్తున్నాను. చేతిలో కాణి లేనప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేయాలి తప్పా? అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టకూడదు,” అంది ఉక్రోషంతో కృష్ణ భార్య.
“ఆగండి! అసలు నన్ను మాట్లాడనివ్వకుండా మీ అంతట మీరు మాట్లాడేసుకుని మీ స్వభావం బయటపెట్టుకుంటున్నారు. నీకు తల్లి లాంటి దానిని అని రోజూ ఫోన్ చేసి కబుర్లు చెప్పే కృష్ణ అన్నయ్య భార్య కూడా ఇష్టం వచ్చినట్టు దెప్పి పొడుస్తోంది,” అంది మాలతి.
“ఇప్పుడు వచ్చింది మీకు. దాని పెళ్లి కుదిరింది. మీరందరూ వచ్చి నాలుగు అక్షింతలు వేయాలి అని చెప్పటానికే తప్పా, మీ దగ్గర నుంచి డబ్బు సహాయం ఆశించి రాలేదు. నా కూతురుకి మీ విషయం తెలుసు కాబట్టి అది తన జీతం దాచుకుని ఇప్పుడు పెళ్లి ఖర్చులు పెట్టుకుంటోంది. అందుకే వదినలు, మీరు ఎవరూ నగలు అమ్మక్కర్లేదు, అప్పులు చెయ్యక్కర్లేదు,” అంది మాలతి.
“మేనమామలు అంటే తల్లి తరువాత తల్లి లాంటి వాళ్ళు అంటారు. కానీ సంగతి తెలుసుకోకుండా మా ముగ్గురు అన్నయ్యలు ముందుకు వచ్చినా, వదినలు ఇలా తలో మాట అనడం బాగాలేదు. శుభలేఖలు పోస్టులో పంపుతాను. మళ్ళీ వచ్చి పిలవడానికి టైమ్ దొరకడం కష్టం. అన్ని పనులు నేనే చూసుకోవాలి. పెళ్లికి సూర్యాపేట హోటల్‌లో మీ అందరికీ రూమ్స్ బుక్ చేస్తున్నాను. తప్పకుండా పెళ్లికి రండి. నా మీద ఇంత ప్రేమ చూపించిన మీ అందరికీ కృతజ్ఞతలు,” అంటూ, “పదండి, బయలుదేరుదాం,” అంది భర్తతో మాలతి.
ఆడపడుచు చెప్పిన మాటలు విని మనసులో హమ్మయ్య! అనుకున్నా — “మీ సహాయం అక్కర్లేదు” అని దులిపేసిన మాటలకు తెల్లబడిపోయి చూస్తూ ఉండిపోయారు మాలతి వదినలు.
“పదండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కిస్తాను,” అంటూ చెల్లెలు చేతి పట్టుకుని కారు దగ్గరకి నడిచాడు రవి.
ఎవరి బ్రతుకు వాళ్లే బ్రతకాలి అనే కాలంలో ఉన్నాం. ప్రేమ అనేది లేనే లేదు. అందుకే ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు, కూతురికి స్త్రీధనంగా కొంత ఆస్తి తప్పకుండా ఇవ్వాలి. ఆడపడుచు రాకుండా గృహప్రవేశాలు, పెళ్లిళ్లు జరుగుతున్న కాలం ఇది. మార్పు వస్తే బాగుండును.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments