top of page

నాట‌కం


'Natakam' New Telugu Story
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఆ రోజు సాయంకాలం నేను ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న స‌మ‌యంలో రాఘ‌వ వచ్చి. "నీతో మాట్లాడాలి" అని చెప్పాడు.

రాఘ‌వ ఆఫీసులో నా కొలీగ్‌; నాట‌కాలంటే బాగా పిచ్చి. ఎప్ప‌డూ శ‌ల‌వులు పెట్టి ప‌రిష‌త్ నాటక పోటీలనీ, నంది నాట‌కాల‌నీ తిరుగుతుంటాడు. అందుకే అత‌నికి ఆఫీసులో మంచి పేరు లేదు. అత‌నికి ఎన్నో సార్లు బ‌దిలీ జ‌రిగినా ఏ మంత్రినో, ఎమ్మెల్యేనో ప‌ట్టుకొని వాటిని ఆపించుకుంటూ ఉంటాడు.

“ఏమిటి సంగ‌తి రాఘ‌వా? మ‌ళ్ళీ ఏదైనా నాట‌క పోటీలున్నాయా?” అని వాడిని న‌వ్వుతూ అడిగాను..


"నీకు నాట‌కాలంటే బాగా చిన్న చూపు గురూ! ఒక్క‌సారి నాట‌కంలో వేషం వేస్తే దానిలో సాద‌క బాద‌కాలు నీకు తెలుస్తాయి. నాట‌కాలాడి మేమేదో బోలెడు సంపాదిస్తునాం అని మీరంతా అనుకుంటూ ఉంటారు. కానీ వాటి వ‌ల్ల నేను ఒక్క పైసా సంపాదించ‌లేదు. అంతా చేతి చ‌మురు భాగోతం; నా చేతి డ‌బ్బులు ఇప్ప‌టిదాకా ఐదు లక్షలు ఖ‌ర్చై పోయాయి. అయినా క‌ళా సేవ కోసం ఆ పాటి త్యాగం చెయ్య‌క త‌ప్ప‌దు” అన్నాడు తానే నాట‌క‌రంగాన్ని ఉద్ద‌రిస్తున్నట్లు ఫోజు పెడుతూ.


“అది స‌రే. ఇంటికెళ్ళిపోతున్న స‌మ‌యంలో వ‌చ్చావేంటి? ఏం అంత అర్జెంటా?" అని అడిగాను..

“చెప్పాలంటే అర్జంటే!... ప‌దిహేను రోజుల్లో నంది నాట‌కోత్స‌వాలు జ‌రగబోతున్నాయి. మేం ప్ర‌తీ సంవ‌త్స‌రం ఆడే నాట‌కాల‌న్నింటికీ బహుమతులు వచ్చేసాయి . ఎంత కాలం ఆ పాత చింత‌కాయ ప‌చ్చ‌ళ్ళు ప‌ట్టుకొని వేళాడ‌తాం చెప్పు. అందుక‌ని ఈ సంవ‌త్స‌రం ఓ కొత్త నాట‌కం వెయ్యాల‌ని నిర్ణ‌యించుకున్నాము. నువ్వు ఎలాగూ క‌థ‌లు, న‌వ‌ల‌లు వ్రాస్తుంటావు కాబ‌ట్టి మా కోసం ఒక మంచి నాట‌కం వ్రాస్తే ఈ సంవ‌త్స‌రం దాన్నే ఆడి ఫ‌స్ట్ ప్రైజ్ కొడ‌తాము” అన్నాడు రాఘ‌వ‌.


“నేనెప్ప‌డూ నాట‌కాలు వ్రాయ‌లేదు రా... అన్నీ క‌థ‌లూ, న‌వ‌ల‌లే.. అంత‌గా వెయ్యాలంటే ఏదో న‌చ్చిన న‌వ‌ల‌ని నాట‌కంగా మార్చుకుంటే స‌రి” అన్నాను వాడితో.

“బాబూ! ఆ ప‌నేదో నువ్వే చేసి పెట్టి మాకు ఒక మంచి నాట‌కాన్ని త‌యారు చెయ్యి... నీ పేరు చెప్పుకొని బ‌హుమ‌తులందుకుంటాము." అన్నాడు మ‌ళ్ళీ న‌వ్వుతూ..


“అవునులే క‌ష్టం ర‌చ‌యిత‌ది, డ‌బ్బు, బ‌హుమ‌తులు మీవి! క‌వుల్ని, ర‌చ‌యిత‌ల్ని ఎప్పుడీ స‌మాజం గుర్తించింది క‌నుక‌? అప్పటి శ్రీ‌నాథుడు నుంచి మొన్న‌టి మ‌హాక‌వి శ్రీ‌శ్రీ దాకా.... కవులందరికీ పేరొచ్చింది కానీ ధ‌న‌ల‌క్ష్మి వాళ్ళ‌ని క‌నిక‌రించ‌లేదు. ఈ విష‌యంలో మాకూ, ల‌క్ష్మిదేవికి చుక్కెదురు "అన్నాను కుర్చీలోంచి లేస్తూ...


“అది స‌రే! ఎప్ప‌టికిస్తావు మాకు నాట‌కాన్ని... అది పూర్తైతే మాకు రిహార్సులు, డ్రెస్సులు అని బోలెడు ప‌నులుంటాయి.. ఆడ పాత్ర‌లు ఎక్కువ ఉండ‌కుండా చూడు... ఎప్పుడూ మా నాట‌కాల్లో హీరోయిన్ గా వేసే మాధురి ఏవో కుటుంబ స‌మ‌స్య‌ల వ‌ల్ల ఈ సారి వేయనంటోంది . అందుక‌ని హీరోయిన్‌గా ఎవరినైనా కొత్తమ్మాయిని వెతుక్కోవాలి... అయినా ఈ ఆడ‌వాళ్ళ‌తో గొప్ప ఇబ్బంది... రిహార్సుల‌న్నీ అయిపోయి ఇంకా నాట‌కం రెండు రోజులుంద‌న‌గా నా భ‌ర్త ఒప్పుకోవ‌టం లేదనీ , మా నాన్న వ‌ద్దంటున్నాడ‌నీ కుంటి సాకులు చెప్పి మానేస్తుంటారు. అయినా త‌ప్ప‌దు.. ఏం చేస్తాం హిరోయిన్ లేని నాట‌క‌ల‌ను ఎవ్వ‌రూ చూడ‌రు” అన్నాడు తనూ లేస్తూ...


“ఏ న‌వ‌ల‌ని నాట‌కం ‌గా మారిస్తే బాగుంటుందో ఆలోచించి రేప‌ట్నుంచి వ్రాయ‌డం మొద‌లు పెడ‌తాను. ఏదైనా నాలుగురోజుల్లో మీకు నాట‌కం స్క్రిప్ట్ మొత్తం ఇచ్చేస్తాను..." అన్నాను వాడితో.


అనుకున్న‌ట్లుగానే నాలుగు రోజుల త‌రువాత నాకు ప్ర‌ధ‌మ బహుమ‌తి వ‌చ్చిన `రంగుల తెర‌` న‌వ‌ల‌ని అదే పేరుతో నాట‌కం గా వ్రాసి రాఘ‌వ‌కి ఇచ్చాను...

రాఘ‌వ ఆనాటిక‌ను సాంతం చ‌దివి, "వంశీ! ఇందులో రెండు స్త్రీ పాత్ర‌లున్నాయి. అందులో మ‌రీ ముఖ్యంగా ఝాన్సీది చాలా పవర్ ఫుల్ కేర‌క్ట‌ర్‌... ఆపాత్ర మీదే నాట‌క‌మంతా న‌డుస్తుంది. దీన్ని మాధురి లాంటి అనుభ‌వ‌మున్న న‌టీమ‌ణి పోషిస్తేనే ర‌క్తి క‌డుతుంది. ఏ మాత్రం ఆ పాత్ర పోషించిన న‌టి త‌డ‌బ‌డిందో నాటిక మొత్తం అభాసుపాల‌వుతుంది. కానీ ఆ ‌మాధురి ఇప్పుడు నాటిక‌లు వెయ్య నంటోంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు” అన్నాడు.


“మీ ట్రూపులో ఆవిడ ఎన్నో నాటకాల్లో వేసింది క‌దా ఓసారి అడిగి చూడు.. పాత్ర న‌చ్చిందంటే ఒప్పుకోవ‌చ్చు” అన్నాను నేను...


"లేదురా... ఎంత బ‌తిమాలినా ఆవిడ ఒప్పుకోవ‌టం లేదు... ఆవిడ భ‌ర్త నాటకాల్లో వెయ్య‌డానికి సుతరామూ ఇష్ట‌ప‌డ‌టం లేదుట‌. నేను అత‌న్ని క‌లిసి ప్రాధేయ‌ప‌డ్డాను. కానీ వ‌ర్క్‌వుట్ అవ‌లేదు. అత‌నో పెద్ద‌మూర్ఖుడు... ఈ విష‌యంలో నువ్వు ఒక‌సారి మాధురి గారి ద‌గ్గ‌రికి వెళ్ళి క‌థ‌ని వినిపించి ఆ పాత్ర‌ని వెయ్య‌మ‌ని అడిగితే ఒప్పుకోవ‌చ్చ‌ని నా క‌నిపిస్తోంది... మా ట్రూపు కోసం ఆ మాత్రం స‌హాయం చేస్తే నీ మేలు జన్మలో మరిచిపోమ” అని అడిగాడు రాఘ‌వ‌...


వాడి మాట‌లు న‌న్ను ఆలోచ‌న‌ల్లో ప‌డేసాయి. రెండు మూడు సార్లు నాట‌కాలు చూడ‌టానికి వెళ్ళిన‌పుడు మాధురి‌తో కొద్దిసేపు మాట్లాడ‌టం త‌ప్పితే ఆమెతో పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. అయినా ఇది నేను వ్రాసిన నాట‌కం కాబ‌ట్టి ఒక‌సారి మాట్లాడితే ఆవిడ అభిప్రాయం తెలుస్తుంద‌ని నాక‌నిపించి ఆ మ‌ర్నాడే మాధురి ‌ని క‌ల‌వాల‌ని నిర్ణ‌యించుకున్నాను.

నాకున్న సందేహ‌మ‌ల్లా రాఘ‌వ‌తో న‌టించ‌డానికి ఆమె ఒప్పుకుంటుందా అని!... ఎందుకంటే రాఘ‌వంటే చాలా మంది న‌టిమ‌ణుల‌కు ప‌డ‌దు... న‌టిస్తున్న‌ప్పుడు వాళ్ళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తాడ‌ని వాడి మీద ఓ పెద్ద అప‌వాదు ఉంది.


ఒక‌సారి రాగిణి అన్న ఒక న‌టి అయితే ఏకంగా పోలీస్టేష‌న్లో వాడి మీద ఫిర్యాదు కూడా చేసింది. ఇంకో న‌టిమ‌ణి భ‌ర్త రాఘ‌వ‌ని కొట్ట‌డానికొచ్చాడు.. కాక‌పోతే రాఘ‌వ మంచి న‌టుడు కాబ‌ట్టి ఆ ట్రూపు భ‌రిస్తోంది. లేక‌పోతే ఎప్పుడో వాడికి ఉద్వాస‌న ప‌లికేవారు...

ఆ మ‌ర్నాడు అదివారం కావ‌డంతో టిఫిన్ తిని ప‌దిగంట‌ల‌కు మాధురింటికి వెళ్ళాను... వెళ్ళేస‌రికి ఆమె ఒక్క‌ర్తే ఇంట్లో ఉంది. భ‌ర్త ఏదో ఊరు వెళ్ళాడ‌ని చెప్పి నాకు కాఫీ ఇచ్చింది...


కాఫీ తాగుతూ నేను వ‌చ్చిన ప‌ని ఆమెకు చెప్పాను.. ఆమె నా మాట‌లు విని కొద్డిసేపు మౌనం త‌రువాత "వంశీ గారూ! మీరు గొప్ప ర‌చ‌యిత‌! మీ ర‌చ‌న‌లెన్నో నేను చ‌దివాను. అందువ‌ల్ల మీరంటే నాకు మంచి గౌర‌వం.. కానీ మీరు కొరుతున్న‌ట్లు ఆ నాటికంలో నేను న‌టించ‌లేను.. మీ మాట కాద‌న్నుందుకు క్ష‌మించండి"అని చెప్పింది....


“మాధురిగారూ! మీరు గొప్ప న‌టి.. మీ వ‌ల్లే నాట‌కాల‌కు బ‌హుమ‌తులొచ్చిన సంగ‌తి నాకు తెలుసు. అటువంటిది ఆక‌స్మ‌త్తుగా నాట‌కాల‌లో న‌టించ‌క‌పోవ‌డం అన్న‌ది మా లాంటి నాట‌కాభిమానులు జీర్ణించుకోలేని విష‌యం.. న‌టించ‌కపోవ‌డం వెన‌క ఏ స‌మ‌స్య ఉందో నాకు తెలియ‌దు. ఏదైనా మీరు మీ నిర్ణ‌యాన్ని పునఃసమీక్షించుకుని మ‌ళ్ళీ న‌టిస్తే మీ అభిమానులు సంతోషిస్తారు... అస‌లే సినిమాలు, టీవీ ల వ‌ల్ల నాట‌క‌రంగం కొడ‌గ‌ట్టుకు పోతోంది... దానికి తోడు మీ లాంటి వాళ్ళు కూడా నాట‌కాలు వెయ్య‌డం మానేస్తే ఈ రంగాన్ని న‌మ్ముకొని జీవిస్తున్న కళాకారులు ఏమౌతారు చెప్పండి... మీకేదైనా స‌మ‌స్య ఉంటే చెప్పండి... దాన్ని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తాను”అన్నాను ఆమెతో....


“వంశీ గారూ! నేను గ‌త ప‌దిహేను సంవ‌త్స‌రాలుగా నాట‌కాల్లో న‌టిస్తున్నాను. ఎప్పుడో అప్పుడు శ‌ల‌వు తీసుకోక త‌ప్ప‌దు.. పాత నీరు పోతేనే క‌దా కొత్త నీరు వ‌స్తుంది. ఏదైనా అవకాశాలు వస్తున్నప్పుడు త‌ప్పుకుంటేనే నా లాంటి క‌ళాకారుల‌కు మంచిది... మీకు కావాలంటే నా కంటే మంచి న‌టిని చూపిస్తాను. ఆమె నా క‌న్నా బాగా న‌టిస్తుంది. ఆమె పేరు ప్రియంవ‌ద‌.. ఆమె క్రితం సంవ‌త్స‌రం రెండు సార్లు ఉత్త‌మ న‌టిగా పుర‌స్కారాలు అందుకుంది. మీ నాటకంలోని పాత్ర‌కు ఆమె పూర్తి న్యాయం చేస్తుంది.. మీకు స‌మ్మ‌త‌మైతే ఇప్పుడే పిలుస్తాను” అంది మాధురి..


ఆమె మాట‌లు విన్న త‌రువాత ఆమెను న‌టించేందుకు ఒప్పించ‌డం క‌ష్ట‌మ‌ని తెలిసిపోయింది నాకు. అందుకే ఆమె సూచించిన ప్రియంవ‌ద గురించి రాఘ‌వ‌తో మాట్లాడేను. అత‌ను ఒప్పుకోవ‌డంతో ఆమెను పి‌లవ‌మ‌ని మాధురికి చెప్పాను. ఆమె ఇల్లు అక్క‌డికి ద‌గ్గ‌ర్లోనే ఉండ‌టం వ‌ల్ల అర‌గంట‌లో ఆమె మాధురి ఇంటికి వ‌చ్చింది.

ఆమె వ‌స్తునే నాకు న‌మ‌స్కారం పెట్టింది. చూడ‌టానికి ప్రియ ముఖం తిప్పుకోలేనంత అందంగా ఉంది. పైగా ఆమె మాధురి క‌న్నా బాగా చిన్న‌ది. మాట‌ల మ‌ధ్య‌లో ఆమె త‌న‌కు చిన్న‌ప్ప‌ట్నుంచీ న‌ట‌న అన్నా, నాట‌కాల‌న్న బాగా ఇష్ట‌మ‌నీ, తాను క‌న్యాశుల్కంలో మ‌ధుర‌వాణి పాత్ర‌ను చాలా సార్లు పోషించాన‌నీ, ఇప్ప‌టి దాకా వంద నాట‌కాల్లో హిరోయిన్‌గా వేసాన‌నీ, మూడు సార్లు నందులు వ‌రించాయ‌నీ, మాధురి వ‌ల్లే తాను నాట‌కాల్లోకి వ‌చ్చాన‌నీ, ఆమె త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన స్నేహితురాల‌నీ ఇలా ఎన్నో విష‌యాల‌ను అన్యా‌ప‌దేశంగా చెప్పింది.


ఆమె మాట‌లు నాకు చాలా సంతోషం క‌లిగించాయి. మాధురి న‌టించ‌క‌పోయినా అంత క‌న్నా మంచి న‌టిని మాకు ప‌రిచ‌యం చేసి మా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం సూచించినందుకు ఆమెకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పి నేను వ‌చ్చేసాను.


ఆ మ‌ర్నాటి నుంచి నాట‌కం రిహార్స‌ల్స్‌ మొద‌ల‌య్యాయి. ఊరికి దూరంగా రిహార్స‌ల్స్ కోసం ప్ర‌త్యేకంగా ఒక ఇంటిని తీసుకున్నారు. మొద‌టి రోజు నేను రిహాల్స్‌కి వెళ్ళాను. కానీ నాకెందుకో అక్క‌డి వాతావార‌ణం న‌చ్చ‌క మ‌ర్నాడు నుంచి వెళ్ళ‌డం మానేసేను.. వారం త‌రువాత రాఘ‌వ మా ఇంటి కొచ్చీ"రిహార్స‌ల్స్ బాగా జ‌రుగుతున్నాయి గురూ! నువ్వు తెచ్చిన న‌టి ప్రియంవ‌ద అద‌ర‌గొట్టేస్తునాది. మాధురికి ఏ మాత్రం తీసిపోదు.. చెప్పాలంటే ఆమె కన్నా ఈవిడే బాగా చేస్తున్నాది... ఈ విష‌యంలో నీకు కృత‌జ్ఞ‌త‌లు” అని చెప్పాడు.


“నాదేం ఉంది రాఘవా ‌! అదంతా మాధురి గారి చ‌ల‌వ‌. ఆవిడ ప్రియంవ‌ద గారిని పిలిచి మ‌రీ ఆమె గొప్ప‌త‌నాన్ని చెప్ప‌డం వ‌ల్లే నేను నీకు చెప్పాను. ఇంత‌కీ నాట‌కం ఎప్పుడు?” అని అడిగాను...


"వ‌స్తున్న ఆదివార‌మే... టిక్క‌ట్ల‌న్నీ అమ్ముడైపోయాయి... ఈ సారి మ‌న‌కే నంది వ‌స్తుంద‌ని అంద‌రూ ప్రియంవ‌ద న‌ట‌న‌ని చూసిన త‌రువాత అనుకుంటునారు. నువ్వు త‌ప్ప‌కుండా చెల్లెమ్మ‌నీ, పిల్ల‌ల్ని తీసుకొని రావాలి.. మ‌ర‌చిపోకు” అన్నాడు రాఘ‌వ‌.


కానీ రెండు రోజుల త‌రువాత రాఘ‌వ వ‌చ్చి పిడుగు లాంటి వార్త చెప్పాడు...

“గురూ! ప్రియంవ‌ద నాట‌కంలో న‌టించ‌న‌ని నిన్న ఫోన్ చేసి చెప్పింది. నేను, గిరి వెళ్ళి ఎంత బ‌తిమాలినా వినే ప‌రిస్థితిలో ఆమె లేదు. రెండు సార్లు ఫోన్ చేసి అడిగేస‌రికి ఫోన్ స్విచాఫ్ చేసేసింది.. ఏం చెయ్యాలో అర్థం కావ‌ట్లేదు. ఆమె గానీ న‌టించ‌క‌పోతే ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర అభాసుపాల‌వుతాము” అన్నాడు గాబ‌రా ప‌డుతూ.

“ మ‌రిప్పుడేం చేస్తావు! ఇంకెవ్వ‌రూ లేరా ఆ పాత్ర‌ని చెయ్య‌డానికి" అని అడిగాను.

“ఎవ్వ‌రూ లేరు !మాధురి ముందే న‌టించ‌న‌ని చెప్పేసింది.. ఏదో ఈవిడ ఒప్పుకుందంటే ఇప్పుడు రానంటోంది! ఇలాంటి వాళ్ళ‌తో ఎలా నాట‌కాలాడేది చెప్పు... కొంచెమైన బాధ్య‌త ఉండ‌క్క‌ర్లేదా వీళ్ళ‌కు... ఇప్ప‌టికి ల‌క్ష‌దాకా ఖ‌ర్చు పెట్టాము. ఒక్క ప్రియంవ‌ద గురించి మొత్తం నాట‌క‌మే గంద‌ర‌గోళంలో ప‌డింది.. నువ్వే ఏదో ఒక‌టి చేసి ఆవిడ‌ని తీసుకురావాలి... లేక‌పోతే ఇన్నాళ్ళ శ్ర‌మ బూడిద‌లో పోసిన ప‌న్నీర‌వుతుంది” అన్నాడు రాఘ‌వ న‌న్ను బ‌తిమాలుతూ.


వాడి మాట‌లు న‌న్ను ఆలోచ‌న‌ల్లో ప‌డేసాయి.

ఇంక త‌ప్ప‌క ఆ సాయంత్రం ఆమె ఇంటికి వెళ్ళాను !... నేను వెళ్ళేస‌రికి ఆమె మొక్క‌ల‌కు నీళ్ళు పోస్తునాది... ఆ చిన్న ఫ్లాట్ లో ఆమె ఎన్నోమొక్క‌ల్ని పెంచుతుండ‌టం నాకాశ్చ‌ర్యం క‌లిగించింది.


న‌న్ను చూసి ఆశ్చ‌ర్య‌పోయి లోప‌లికి తీసికెళ్ళింది... కాఫీ తాగుతూ ఆమెని అడ‌గ‌టం మొద‌లు పెట్టాను.

“మేడం! మీరు నాట‌కంలో న‌టించ‌నంటున్నార‌ట‌... మా వాళ్ళు గాబ‌రా ప‌డుతునారు. ఇంత‌కీ న‌టించ‌క‌పోవ‌టానికి కార‌ణం ఏమిటి?” అని అడిగాను...


“ఇంట్లో కొన్ని స‌మ‌స్య‌లొచ్చాయి... మావారికి మొద‌ట్నుంచీ నేను నాట‌కాల్లో న‌టించ‌డం ఇష్టం లేదు... మాధురి చెప్పింది క‌దా అని త‌ప్ప‌క సిద్ధ‌ప‌డ్డాను కానీ మా వారికెందుకో ఆ ట్రూపుతో న‌టించ‌టం ఇష్టం లేదు... రిహార్స‌ల్‌కి వెళుతున్న నాటి నుంచి మా మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌య్యాయి. ఇంక నేను మొండిప‌ట్టుప‌ట్టి న‌టించానంటే మా సంసారంలో గొడ‌వ‌లు ఎక్క‌డికి దారి తీస్తాయో తెలియ‌దు. అందుకే న‌టించ‌కూడ‌ద‌నుకున్నాను. ద‌య‌చేసి ఈ విష‌యంలో న‌న్ను ఇబ్బంది పెట్టొద్దు” అని చెప్పింది.


ఆమె అలా మాట్లాడేస‌రికి నాకు ఏం చెప్పాలో అర్థంకాక మౌనం దాల్చేను...

కొద్దిసేప‌టికి తేరుకొని”మేడం! మీకుండే స‌మ‌స్య‌లు మీకుంటాయి. నేను కాద‌న‌ను. అటువంట‌ప్పుడు మీరు న‌టిస్తాన‌ని ముందే ఒప్పుకోకుండా ఉండ‌వ‌ల‌సింది. అప్పుడు వాళ్ళ బాధేదో వాళ్ళు ప‌డేవారు. ఒక రోజు నాట‌కం ఉంద‌న‌గా మీరు ఇప్పుడు న‌టించ‌న‌ని చెప్ప‌డంతో నాట‌క ప్ర‌ద‌ర్శ‌న మీద నీలినీడ‌లు ప‌రుచుకున్నాయి. కాబ‌ట్టి న‌టించే విష‌యంలో మీరు పున‌రాలోచించుకుంటే మంచిద‌ని నా అభిప్రాయం... ఆ త‌రువాత మీ ఇష్టం” అని ఆమెకి చెప్పి వ‌చ్చేసాను.


ఇంటికి వ‌చ్చేనే కానీ ఆమె తిరిగి న‌టిస్తుంద‌న్న విష‌యం మీద నాకేమీ అపోహ‌లు లేవు... ఖచ్చితంగా ఆమె న‌టించ‌దు... అదే విష‌యాన్ని రాఘ‌వ‌కు చెబుదామ‌ని నిర్ణ‌యించుకున్నాను. కానీ ఆశ్చ‌ర్యంగా ఆమ‌ర్నాడుద‌యం ఆమె ఫోన్ చేసి "ఈ నాట‌కం వ‌ర‌కు న‌టిస్తాన‌నీ, ఆ త‌రువాత నుంచి ఇంక న‌టించ‌న‌నీ చెప్పింది.."

దాంతో మా నాట‌క ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో ఉన్న సందిగ్ధ‌త తొల‌గి ప్ర‌ద‌ర్శ‌న‌కు మార్గం సుగ‌మ‌మైంది...

.........

అనుకున్న‌ట్లు‌గానే ఆదివారం నాడు నాట‌కం ప్ర‌ద‌ర్శ‌న మొద‌లైంది... నాట‌కంలో ప్రియంవ‌ద హీరోయిన్‌గా న‌టిస్తోంద‌ని రాఘ‌వా వాళ్ళు ప్ర‌చారం బాగా చెయ్య‌డంతో ఆడిటోరియం అంతా కిక్కిరిసిపోయింది. ప్రొఫెస‌ర్లు, క‌ళాకారులు, సినీ ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లు, క‌వులు ఇలా అంద‌రూ నాట‌కాన్ని వీక్షించ‌డానికి వ‌చ్చారు.


ఆ నాట‌కం నిడివి గంట‌న్న‌ర సేపు ఉంటుంది... మూడు అంకాలుగా విభ‌జించి దాన్ని వ్రాసేను. రెండు అంకాలు పూర్తై చ‌ర‌మాంకం లోకి ప్ర‌వేశించింది... ప్రియంవ‌ద‌, రాఘవా పోటా పోటీగా న‌టించ‌డంతో రెండంకాలు బాగా రక్తికట్టాయి.


క‌ధ ప్ర‌కారం రాఘ‌వ వేస్తున్న శ్యామ్ పాత్ర‌ ప్రొటాగ‌నిస్ట్ కానీ ఏంటోగ‌నిస్ట్‌గా ఆఖ‌ఱి అంకంలో ప‌రిణామం చెందుతాడు. అత‌ను ప్రియంవ‌ద వేసే శాంతి పాత్ర‌ను ప్రేమించిన‌ట్లు న‌టించి మోసం చేస్తాడు. దాంతో శాంతి అత‌నితో విడిపోయి యింకో వ్య‌క్తిని పెళ్ళి చేసుకునే స‌మ‌యంలో ఆ పెళ్ళిని చెడ‌గొట్టాల‌ని శ్యామ్ క‌ళ్యాణ‌ మంట‌పానికి వ‌చ్చిన‌పుడు శాంతి అత‌న్ని కోపంతో చెప్పుతో కొడుతుంది... అదీ ఆ స‌న్నివేశం...


స‌రిగ్గా న‌టిస్తే అద్భుతంగా పండి క్లైమాక్స్ హైలెట్ అయ్యే అవ‌కాశం ఉన్న ప్ర‌ధాన స‌న్నివేశం... ప్రేక్ష‌కుల క‌ర‌తాళ ధ్వ‌నుల‌తో చ‌ర‌మాంకం మొద‌లైంది...

శ్యామ్ వ‌చ్చి శాంతితో "మ‌న పెళ్ళి విష‌యాన్నినీక్కాబోయే భ‌ర్త‌కు చెబుతాను" అంటూ కొన్ని ఫోటోల‌ను చూపిస్తుంటే శాంతి రెచ్చిపోతుంది.


అంతే! ఆ ఆవేశంలో ప్రియంవ‌ద శాంతి పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి ఆవేశం తెచ్చుకొని చెప్పుతో రాఘ‌వ‌ని కొట్టింది... ప్రేక్ష‌కుల నుంచి చ‌ప్ప‌ట్లు, ఈల‌లు! అవి ఆగ‌టం లేదు... క‌ర‌తాళ ధ్వ‌నులు మిన్నుముడుతునాయి.


ప్రేక్ష‌కుల రెస్పాన్స్ చూసి ప్రియంవ‌ద రెచ్చిపోయింది. అంతే! చెప్పుతో ఒక‌టి కాదు... రెండు కాదు... ప‌ది దెబ్బ‌లు... అవీ చాలా గ‌ట్టిగా కొట్టింది... రిహార్సల్స్ లో చేసిన‌ట్లు రెండు లేక మూడు దెబ్బ‌లు కొట్టాలి కానీ ఆమె వ‌రుస‌గా అవీ చాలా గ‌ట్టిగా కొడుతుండ‌టంతో రాఘ‌వ కి అర్థం కాలేదు... అలా ఆలోచిస్తుంటే ఆమె మ‌రింత రెచ్చిపోయి కొడుతుండ‌టంతో అత‌ను ఒక్క‌సారిగా నేల‌మీద ప‌డిపోయాడు.


అత‌ను నేల‌మీద ప‌డ‌గానే అది గొప్ప న‌ట‌న అని ప్రేక్ష‌కుల నుండి మ‌రింత‌గా చ‌ప్ప‌ట్లు, అరుపులు. !.."ఆ దొంగ నాకొడుకుని కొట్టు... చంపు” అంటూ కొంద‌రు వీరావేశంతో ఊగిపోతూ అర‌వ‌డం మొద‌లు పెట్టారు. దాంతో ఆమె మ‌రింత ఆవేశం తెచ్చుకొని కాలితో అత‌న్ని త‌న్న‌డం మొదులు పెట్టింది... ముఖం మీద‌, ఆ త‌రువాత గుండెల మీద‌, ఆత‌రువాత కాళ్ళ‌మీద చాలా గ‌ట్టిగా త‌న్న‌డం మొద‌లు పెట్టింది.


ఆ త‌న్నుల నుండి త‌ప్పించుకోవ‌డానికి రాఘ‌వ దూరంగా వెళ్ళి లేవ‌డానికి ప్ర‌య‌త్నించినా ఆమె ప‌రుగున వెళ్ళి అత‌ని జుట్టు ప‌ట్టుకొని మ‌రింత‌గా త‌న్న‌డం మొద‌లు పెట్టింది...


రాఘ‌వ ముక్కు నుంచి ర‌క్తం కార‌డం మొద‌లైంది... వెంట‌నే నాట‌క నిర్వాహ‌కులు లైట్లార్పి, తెర‌దించేసారు!...


హాలంతా చ‌ప్ప‌ట్ల‌తో మ‌ళ్ళీ మారుమోగిపోయింది...

అనుకున్న‌ట్లుగానే రాఘ‌వ వాళ్ళు ప్ర‌ద‌ర్శించిన నాట‌కానికి బంగారు నంది, ప్రియం వ‌ద‌కు ఉత్త‌మ‌న‌టి పుర‌స్కారాలు ల‌భించాయి.

.........

ఆమ‌ర్నాడు నేను ప్రియంవ‌ద‌ని క‌లిసి ఉత్త‌మ‌న‌టిగా ఎన్నికైనందుకు అభినంద‌న‌లు తెలిపాను...


“ప్రియ గారూ! మీరేంటి నిన్న అంత వీరావేశం ప్ర‌ద‌ర్శించారు. నిజంగా మీ న‌ట‌న అద్భుతం. మీరంత‌గా ఆ పాత్ర‌లో లీన‌మ‌వుతార‌ని మేమెవ్వ‌రం ఊహించ‌లేదు. మేము అనుకున్న‌దానిక‌న్నా బాగా న‌టించారు. ప‌త్రిక‌ల‌న్నీ అదే వ్రాసాయి. మొత్తానికి మీ న‌ట‌న నాట‌కానికే హైలైట్ !... మీరు మా న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చెయ్య‌లేదు” అని చెప్పాను...


ఆమె కొద్దిసేపు మౌనం దాల్చి”వంశీగారు! ఆ సీన్ అంత‌గా హైలెట్ కావ‌డానికి కార‌ణం అది న‌ట‌న కాక‌పోవ‌డ‌మే” అంది;

ఆమె మాట‌ల‌కు నేను ఆశ్చ‌ర్య‌పోయాను.


“ఏమిటి మీరు చెబుతోంది” నా మాట‌లు నూతిలోంచి వ‌స్తున్న‌ట్లున్నాయి.

“నేను చెబుతున్నది నిజం... వాణ్ణి నిజంగానే కొట్టాను. మ‌న‌స్ఫూర్తిగా కోపంతో త‌న్నాను. అది నాట‌కం కాబ‌ట్టి ఎవ్వ‌రికీ అనుమానం రాలేదు. రాఘ‌వ ఒక నీచుడు... వాడు అమాయ‌కురాళ్ళైన ఎంద‌రో న‌టీమ‌ణుల్ని పాడుచేసాడు. లొంగ‌ని వాళ్ళ జీవితాల‌ను ఛిద్రం చేసాడు. ఎందరో సంసారాల్లో క‌ల‌త‌లు రేపాడు." చెబుతూ ఆమె మౌనం దాల్చింది...


నేను ఆమె చెబుతుంటే మౌన ప్రేక్ష‌కుణ్ణ‌య్యాను.


“ఆ నాట‌కంలో నా స్నేహితురాలు మాధురి న‌టించ‌క పోవ‌డానికి ఆ దుర్మార్గుడు రాఘ‌వే కార‌ణం. ఆమెను లొంగ‌దీసుకోవాల‌ని ఎప్ప‌ట్నుంచో ప్ర‌య‌త్నం చేసినా అది లొంగ‌లేదు. దాంతో ఆమె భ‌ర్త‌కు ఆమె గురించి చెడుగా చెప్పి దాని సంసారంలో చిచ్చురేపాడు. మీరు వ‌చ్చి అడిగార‌న్న స‌దుద్దేశంతో అది నాపేరుని సూచించింది. నాకు వాడి సంగ‌తి తెలుసుకాబ‌ట్టే ముందు ఒప్పుకోక‌పోయినా మీరు వ్రాసిన మొద‌టి నాట‌కం అని మీ మీదున్న స‌దుద్దేశంతో ఒప్పుకున్నాను. కానీ నేన‌నుకున్న‌దే జ‌రిగింది. వాడు రిహార్స‌ల‌ప్పుడు, నాతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. వెయ్య‌రానిచోట చేతులు వేసాడు.


న‌న్ను లొంగిపొమ్మ‌ని బ‌ల‌వంత‌పెట్టాడు. లేక‌పోతే న‌లుగురిలో న‌వ్వుల పాలు చేస్తాన‌న్నాడు. అందుకే నేను నాట‌కం నుంచి మ‌ధ్య‌లో త‌ప్పుకున్నాను. పోనీ మీ అంద‌రికీ చెప్పి గొడ‌వ చేస్తే అది నా సంసారంలో గొడ‌వ‌లు సృష్టించే అవ‌కాశం ఉంది... నా భ‌ర్త అసలే అనుమానం మ‌నిషి. కానీ మీరు మా ఇంటికొచ్చి మ‌ళ్ళీ ఆలోచించుకోమ‌ని చెప్పిన త‌రువాత నా ఆలోచ‌న‌లో మార్పు వ‌చ్చింది. భ‌య‌ప‌డి వాడికి దూరంగా పారిపోతే వాడుమ‌రింత రెచ్చిపోయే ప్ర‌మాదం ఉంది; అదీ కాక వాడికి వాడు చేసిన త‌ప్పు తెలియాలి. వాడు ఇంకెప్పుడూ ఏ న‌టీమ‌ణితోనూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు.


గొడ‌వ‌ప‌డి న‌లుగురికి తెలిసి అభాసుపాలు కాకుండా నాట‌కంలో పాత్ర ద్వారా తెలియ‌చెప్పాల‌నే మ‌ళ్ళీ న‌టించ‌డానికి ఒప్పుకున్నాను. అందుకు మీరు వ్రాసిన స్ర్కిప్ట్ నాకు స‌హ‌క‌రించింది. అలాంటి స్ర్కిప్ట్ వ్రాసినందుకు మీకు కృత‌జ్ఞ‌త‌లు."

“చివ‌ర‌గా ఓ మాట‌... త‌ప్పు చెయ్య‌క‌పోయినా అహ‌ల్య‌నూ, సీత‌నూ శిక్షించే స‌మాజం మ‌న‌ది. అదింకా మార‌లేదు. అందుకే ద‌య‌చేసి అటువంటి వెధ‌వ‌కోసం మీరు నాట‌కాలు వ్రాయొద్దు. మీలాంటి గొప్ప వాళ్ళు ఆ నీచుడు నటించే నాట‌కాల్లో న‌టించ‌మ‌ని నా లాంటి వాళ్ళను అడ‌గొద్దు. " అంటూ క‌ళ్ళ‌నీళ్ళ‌ను తుడుచుకుంది.


అప్పుడు ఆమెలో కొత్త ప్రియ‌ని చూసాను. ఆ స‌మ‌యంలో"రాక్ష‌సుల‌ను తెగ‌న‌రికి చంపిన కాళిక‌లా” నాకు ఆమె క‌నిపించింది. ఉవ్వెత్తున పడి లేచిన కడలి తరంగపు హోరులా వినిపించింది.


సిందూరం, ర‌క్త‌చంద‌నం

బంధూకం, సంద్యారాగం

పులిచంపిన లేడి నెత్తురూ

ఎగ‌రేసిన ఎర్ర‌జెండా

రుద్రాలిక న‌య‌న జ్వాలిక‌

క‌ల‌క‌త్తా కాళిక నాలిక‌

కావాలి న‌వ‌క‌వ‌నానికి" అన్న శ్రీశ్రీ గేయం గుర్తు కొచ్చి కంట‌నీరు చెమ్మ‌గిల్లింది.

(స‌మాప్తం)

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link


Podcast Link
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


79 views0 comments
bottom of page