top of page

నవ్వుకోండి నవ్వుకోండి ఇంకొంచెంసేపు నవ్వుకోండి!

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Navvukondi Navvukondi Inkonchemsepu Navvukondi' New Telugu Story Written By Nallabati Raghavendra Rao

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు


సుబ్బరామయ్య కాలిలో దురద పెట్టిన పిల్లిలా హాల్లో అటూఇటూ తిరుగుతున్నాడు.


అతని సెల్ కుయ్యో కుయ్యో అంది. వెంటనే ఆన్ చేశాడు.


ఎవరండీ మీరు?'' అంటూ అడిగాడు.


''అన్నయ్యా నేను.. నీకు సొంత తమ్ముడిని.'' అన్నదో కంఠం.. అవతల నుండి.


'' సొంత తమ్ముడా... చింతపండా..నాకెవరూ తమ్ముడులు లేరు.. నీ పేరు.?..'' అడిగాడు సుబ్బరామయ్య.


'' నేనన్నయ్య నీ రక్తబంధం.. నీ తర్వాత పుట్టిన ప్రయోగాలరావుని.'' అన్నాడు అవతల వ్యక్తి.


''మా ప్రయోగాలరావా.. నువ్వు చచ్చిపోలేదా..? బ్రతికున్నావా? అసలు నువ్వు మనిషివా.. లేక.. దెయ్యానివా''?.. చిత్ర విచిత్రంగా అడిగాడు సుబ్బ రామయ్య.


''అప్పుడు నాకు ఐదేళ్ళు.. అన్నవరంలో మన కుటుంబం దగ్గరనుండి తప్పిపోయిన నేను తెలివి వచ్చి చూసేసరికి ఇతరదేశాల్లో ఉన్నాను.. చదువు సంధ్య అన్నీ అక్కడే. ఈ పాతికేళ్లలో బస్తాలు బస్తాలు డబ్బు సంపాదించాను. నీ అడ్రస్ తెలుసు కున్నాను.. ఇప్పుడు రాజమండ్రి లో ఉన్నాను.. ఒక గంటలో వచ్చేస్తున్నాను నీ దగ్గరికి.''.. అలా అనడం ప్రయోగాలరావు అన్నగారు దగ్గరకి వచ్చేయడం గంటలో జరిగిపోయాయి.


''పాతిక సంవత్సరాల తర్వాత ఇతరదేశాల నుంచి వస్తున్నాను కదా.. పైగా ముద్దుల తమ్ముడిని.. ఏమిటన్నయ్యా కాస్త స్వాగతం కూడా లేదు...'' రావడంతోనే గారాలు పడ్డాడు ప్రయోగాలరావు.. రోడ్డు అవతల నిలబడి.


సుబ్బరామయ్య తెల్లమొహం వేసి ఇలా అన్నాడు

.. ...''నీ ప్రయోగాలు మండిపోను.. నువ్వు ఇంకా మార లేదా.. చంటప్పుడు కూడా ఇలాంటి వెధవ కోరికలే కోరే వాడివి.'' అంటూ పక్కనే ఉన్న తలుపుచెక్కను తెప్పించి నలుగురు పనివాళ్ళ చేత తమ్ముడుని దాని మీద కూర్చోబెట్టించి దాన్నే పల్లకి లా.. ఓం..భోo.... ఓం..భోo....అంటూ మోస్తూ వెనుక ఒకరు పువ్వులు చల్లుతూ తీసుకొచ్చారు....''


'' అన్నయ్యా.. ఇది శవాన్ని మోస్తున్నట్లు లేదూ..'' కొచ్చినేశాడు తమ్ముడు ప్రయోగాలరావు. అంతా నవ్వేశారు.


'' తమ్ముడూ సమయానికి వచ్చావు రేపు మన లక్ష్మి కొడుకు.. నా మనవడు.. బిట్టుగాడు అక్షరా భ్యాసం. వాడికి రెండు ఏళ్ళు పూర్తయ్యాయి'' అన్నాడు ఆనందంగా సుబ్బరామయ్య.


'' సరే అన్నయ్యా.. నేను ఇక్కడ ఉన్నన్నాళ్ళు అన్ని వ్యవహారాలు విదేశ పద్ధతుల లాగానే జరగాలి.. ఇండియా పద్ధతులు వద్దు..ఇండియా ఇక ఎప్పుడు బాగుపడతుందో..'' క్రింది పెదవి గిర్రున వెనక్కి తిప్పుతూ అన్నాడు ప్రయోగాల రావు.


'' అంటే రేపటి కార్యక్రమం ఎలా చేద్దామని నీ అభిప్రాయం? '' తమ్ముడిని గదిలో కూర్చోపెడు తూ టీ తాగిస్తూ అడిగాడు సుబ్బరామయ్య.


'' ఇది స్పీడ్ యుగం అన్నయ్యా.. ఏదైనా స్పీడ్ గా జరగాలి.. ఇప్పుడు ఈ బిట్టుగాడికి ఆటోమేటిక్ గా అమ్మ..ఇటుక...ఎలుక వచ్చేస్తాయి... అంటే అచ్చులు మనం నేర్పే అవసరం లేదు. .''అన్నాడు ప్రయోగాలరావు.


" ఇది ఎట్టాగ..? అంటూ...ముఖం..చిత్రీ పట్టే మిషన్ లా పెట్టాడు సుబ్బరామయ్య..


'' అవును అచ్చులు మానేసి డైరెక్టుగా హల్లులు మొదలు పెట్టించేద్దాం.. అంటే క.. గ.. మళ్లీ దాని పక్కన ఉంటాది కదా.. అది ఏదో వంకరగా.. అది వద్దు.. దాని తర్వాత చ.. జ... ఆ తర్వాత ఉండే కుంటి అక్షరo అది కూడా వద్దు.. వాటి ఉపయోగం లేదు.. అలా అలా అన్నమాట... 3 నెలల్లో ఎల్కేజీ ....యూకేజీ అయిపోతుంది. రెండేళ్లలో 5వతరగతి ఫినిష్. వాడికి 10 ఏళ్లు వచ్చేసరికి అలా అలా జంపులు చేయిస్తూ టెన్త్ క్లాసు పూర్తి చేయిద్దాం. 15 ఏళ్లు వచ్చేసరికి వీడో సాఫ్ట్వేర్ ఇంజనీర్.... బ్రహ్మాండంగా లేదూ నా ఐడియా..


నాదంతా విదేశీ ఐడియాలు అన్నయ్యా... నేను ఏ దేశంలో ఉన్నా.. నువ్వు ఏ విషయంలో అయినా సరే నాకు ఒక ఫోన్ కొట్టు చాలు.. నీకు సలహాలు ఇస్తూ ఉంటాను కదా.. ప్రస్తుతం నేను ఇచ్చిన ఈ షార్ట్ కట్ ఐడియా కి చప్పట్లు కొట్టు..చప్పట్లు కొట్టు...." అంటూ బలవంతంగా చప్పట్లు కొట్టిం చుకున్నాడు..ప్రయోగాలరావు... ఓ తలతిక్క పోజు పెడుతూ.


సుబ్బరామయ్య కు తల మూడుసార్లు గిర్రున తిరిగినట్టు అయింది...

" ఇది ఎట్టా.. అచ్చులు మాన్పించేసి హల్లులు మొదలెడదామా? ప్రమాదం కదా..." అని మాత్రం అనగలిగాడు.


ఆ రాత్రి భోజనాలయ్యాక డబల్ బెడ్ మంచం తమ్ముడికి వేసి... తను అదే గదిలో చిన్ని మడత మంచం పై పడుకున్నాడు సుబ్బరామయ్య.... తమ్ముడు చెప్పిన షార్ట్ కట్టు విధానం నెమరువే సుకుంటూ.... అలా అలా నిద్రలోకి జారాడు.


కాసేపటికి అతనికి ఒక పెద్ద బ్రహ్మాండమైన " కల " రావడం మొదలుపెట్టింది...... ఆ కలలో.....


బిట్టుగాడు.... తన తమ్ముడు చెప్పిన విధానంలో ఒక సంవత్సరం పాటు నేర్చుకున్న చదువుతో.. చిత్రంగా మాట్లాడడం మొదలుపెట్టాడు.


రాజు.. అనమంటే.. రజ అంటున్నాడు.

పాపా..అనమంటే..పప....అంటున్నాడు.

పోకిరి.. అనమంటే.. పకర..అంటున్నాడు.


" అచ్చులు నేర్చుకోలేదు కదా అందుకని దీర్ఘాలు అలవాటుకాలేదన్నమాట!.. ఇదేమి పెద్ద ప్రమాదం కాదులే.. నెమ్మదిగా వస్తాయి లే...".. అంటూ సర్ది చెప్పాడు ప్రయోగాలరావు.. అన్నగారికి.


సుబ్బరామయ్య ఒప్పుకోలేదు.. తనకు సమాజo లో తల తీసేసినట్టు ఉందని మరి ఇంకేదైన విదేశీ ఐడియా ఇవ్వమని అడిగాడు తమ్ముడు ప్రయో గాలరావుని.


"అన్నయ్యా నువ్వు కంగారు పడకు. మా విదేశా ల్లో అయితే దీని గురించి ఇంతగా ఆలోచించo. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళి కుదరకపోతే ఇంటి దగ్గరే సూది దారం తో నాలుక మడత పెట్టి కుట్టే స్తాం. దాంతో ఏమవుతుంది.. ఏమవుతుందంటే వీడికి నాలిక మడత పడి ఉండటం వల్ల వద్దను కున్నా అన్ని దీర్ఘాలు, అదేటి అంటుంటారు... అన్ని గుణింతాలు మొత్తం అన్ని ఈజీగా నోటికి తిరుగు తాయి." అంటూ చక్కగా వివరించాడు అన్నగారి కి ప్రయోగాలరావు..


అలా అంటూ తన బ్యాగ్ లోంచి సూది దారం తీసి అన్నగారు.. ఇంట్లోవాళ్లు అడ్డుపడుతున్న.. బిట్టు గాడిని జాగ్రత్త గా దగ్గరకు తీసుకొని సూది దారం తో నాలుక మడత పెట్టి కుట్టి పారేశాడు. కానీ నాలుగు రోజులైనా నాలుక మడత లోనుండి... రక్తం కారుతూనేవుంది.


ఇప్పుడు ఇంకో పెద్ద సమస్యతో తల పట్టుకు న్నాడు సుబ్బరామయ్య.


ఫుల్లుగా కడుపునిండా లాగిన్చేసిన ప్రయోగాల రావు.. అన్నగారు పక్కనే కూర్చుని.. వీపు మీద నిమిరాడు.


అన్నయ్యా.. ప్రతి విషయానికి మీ ఇండియా వాళ్లు ఇలా బెంబేలు పడిపోతారు కనుకనే ఇండియా ఇక ఈ జన్మలో బాగుపడదు.


ఇప్పుడు ప్లాస్టిక్ గొట్టంలో నుండి నీరు లీక్ అవు తుంది అనుకో ఫెవికాల్ పెడతాo.. ఇంకా ఆగలేదు అనుకో క్విక్పిక్స్ పెడతాం.. పని జరగకపోతే చివరగా అరల్ డైట్ పెడతాం.. దెబ్బకు సమస్య క్లియర్.... ఇదీఅంతే.."


అంటూ ప్రహ్లాదరావు బీరువాలో ఉన్న అరల్ డైట్ తో బిట్టుగాడు నాలుక మడతను అంటించి పడేశాడు. ఆ దెబ్బతో రక్తం కారడం తగ్గడమే కాకుండా బిట్టుగాడు రెండు పెదాలు కూడా గట్టిగా అంటుకు పోయాయి.


పరిస్థితి చూశాక సుబ్బరామయ్యకు మతి చలించి పోయింది. '' ఎట్టా..ఇప్పుడు ఎట్టా '' అని మాత్రం అనగలిగాడు తమ్ముడితో.


'' నేను చెప్తాగా.. ఇప్పుడే విదేశీ తెలివితేటలు ఉపయోగించాలి అన్నమాట... ఇప్పుడు ఆహారం కడుపులోకి వెళ్లడం మాత్రమే సమస్య. ఈ సమ స్యను ఎలా అధిగమించాలి అంటే... కంఠం దగ్గర రూపాయి బిళ్ళ అంత బెజ్జం పెట్టేస్తే సరి అక్కడి నుండి మన ఆహారపదార్థాలు అన్నీ డైరెక్ట్ గా పోసేయొచ్చు కదా'' ఐడియా ఇచ్చాడు తమ్ముడు ప్రయోగాలరావు.


ఇది ఎంత మాత్రం సుబ్బరామయ్యకు అంగీకారం అనిపించలేదు.


ఈ విషయం గ్రహించిన ప్రయోగాలరావు మరో ఐడియా చెప్పాడు అన్నగారికి.. అది ఏంటంటే కడుపు మీదే కిరసనాయిలు గళ్ళా లాంటిది

దూరేలా ఓ చిన్న హోల్ పెట్టి.. ఆ గళ్ళా లోంచి విటమిన్ ప్లస్ మినరల్ జ్యూస్ లు అన్నీ కలిపిన ద్రావణం ఆ హోల్ ద్వారా కడుపులో పోసేస్తే పిల్లాడు బ్రహ్మాండంగా పెరుగుతాడని చక్కటి చిక్కటి ఐడియా ఇచ్చాడు. అంతేకాదు వారం రోజులు ఆ ప్రకారంగా చేసి చూపించాడు అందరి కీ... ప్రయోగాలరావు


అతని ప్రయోగం ఫలించింది. దాంతో బిట్టుగాడు పెద్దఏనుగులా తయారైపోయాడు. సుబ్బరామ య్య చేసేదిలేక ఇంటి గుమ్మాలు అన్నీ బాగా పెద్దవిగా మార్పించి పెట్టించాడు.


బిట్టుగాడు పేరు ప్రపంచం నలుమూలలా పాకి పోయింది. వందమంది పేపర్ విలేకరులు మరో వందమంది ఛానల్ ,రిపోర్టర్స్లు వచ్చేసారు... సుబ్బరామయ్య ఇంటికి. ముందుగా దీనికంతటికీ కారణం అయిన ప్రయో గాలరావుకి పెద్దఎత్తున సన్మానం కూడా చేశారు.

గిన్నిస్ బుక్ లోకి ఎక్కడమే కాకుండా ప్రపంచం నలుమూలల చానళ్లలో బిట్టుగాడే కనిపిస్తు న్నాడు.


'' ఇది అన్నయ్య నా విదేశీ తెలివితేటలు చూశావుగా '' అంటూ కాలర్ ఎగరేస్తున్నాడు ప్రయోగాల రావు.


అంతలో... తెలతెలవారుతుండగా..

వీధిలో కోడి కొక్కొరోకో అని గట్టిగా అరవడంతో అప్పటివరకు కన్న.....' కల ' ..అంతా కరిగిపోయి యధార్థం లోకి వచ్చాడు సుబ్బరామయ్య. చూస్తే డబల్ కాట్ మంచం మీద తమ్ముడు ప్రహ్లాదరావు గురకతన్ని పడుకున్నాడు.


సుబ్బరామయ్యకు.. ఇప్పుడు వచ్చిన కల అంతా యదార్థమే అన్న భ్రమలో ఉండిపోయాడు.. ఆ నిద్రమత్తులో... తమ్ముడు మీద కోపం కసి పగ లాంటివి నషాలానికి అంటుకొన్నాయి.


సుబ్బరామయ్య తలుపు మూలనున్న పెద్ద చింత జూక తీసి... ముసుగు తన్ని పడుకున్న తమ్ముడు వీపుమీద దబదబాగబగబా కొట్ట నారంభించాడు

ప్రయోగాలరావు కుయ్యో మొర్రో అంటూ పైకి లేచి కూర్చున్నాడు. అతడికి విషయం అర్థం కాలేదు.


సుబ్బరామయ్య .. ఇంకా తమ్ముడిని చితక కొట్టడం ఆపలేదు..


'' తమ్ముడు కదా అని ఇంట్లోకి రానిచ్చి నీ మాటకు విలువ ఇస్తే ఇండియా వాళ్లు బాగుపడరు అని ఎగతాళి చేస్తావా??? ఏమిట్రా..ఏమిటి కూసావు.. అచ్చులు మానేసి హల్లులు నేర్చుకోవడం మొదలు పెట్టాలా?? ఏమన్నావు.. నీకు 64 భాషలు వచ్చా

ఎట్టా ఎట్టట్టా...మాతృభాషను చంపేసే ప్రయో గాల ఐడియా ఇచ్చిన నువ్వు 64 ఇతర భాషలు వచ్చు అని చెప్పడానికి సిగ్గు లేదట్రా ?? అయినా చదువులో జంపింగ్ లేమిట్రా.. దౌర్భాగ్యుడా?


నీ విదేశీ తెలివి తేటలు మండ .. నా ముద్దుల మనవడు బిట్టుగాడిని ఏనుగు లా తయారు చేశావు కదరా.'' అంటూ ఇంటి చుట్టూర తిప్పుతూ తమ్ముడు ప్రయోగాలరావుని చింతజూకతో కసిగా ఇంకా చితకొడుతున్నాడు...సుబ్బరా మయ్య.


'' ఆగు కాస్త ఆగు.. బిట్టుగాడుని నేను ఏనుగులా తయారు చేయడం ఏమిటి అన్నయ్యా.. వాడు మామూలుగానే ఉన్నాడు చూడు. నీకు ఏమైనా పాడు కల వచ్చిందా ?? '' అంటూ ఇంటి చుట్టురా పరుగు పెడుతూనే ప్రశ్నించాడు.. ప్రయోగాల రావు.. అన్నగారిని.


ఇంట్లో వాళ్ళందరూ బయటకొచ్చారు. వీధిలో వెళ్లే జనం కూడా ఇంటి చుట్టురా మూగేసారు.


సుబ్బరామయ్య తమ్ముడిని ఇంకా చింతజూకతూ ఇంటిచుట్టురా తరుముతూ.. ఇలా అంటున్నాడు.


'' ఇంకేం కూశావు... నువ్వు ఏ ఇతర దేశాల్లో ఉన్న..నీకు ఒక్క ఫోన్ కొడితే.. నాకు వెంటనే పనికిరాని చెత్త ఐడియా పంపిస్తావా ..? నువ్వు అంత గొప్పోడివా?


'' ఇంకేం అన్నావ్ రా ...ఏమన్నావు... అక్షరాల దీర్ఘాలు రాకపోతే నాలుక మడతపెట్టి కుట్టేయా లా???... అమ్మో అమ్మో .. రక్తం కారుతుంటే గమ్ము పోసి అంటిస్తావా ...?


దాంతో రెండు పెదాలు అంటుకుపోయాయి కదరా అప్రాచ్యుడా .. వాడు అన్నం ఎలా తింటాడు రా ???.. మళ్లీ.... అన్నం పొయ్యడానికి కంఠం దగ్గర రూపాయిబిళ్ళ అంత బొక్క పెడతావా..కాదంటే కడుపు మీదే.. రంధ్రం చేసి కిరసనాయిల గళ్ళ పెట్టి అందులోoచి... ఆహార మంతా జ్యూస్ లా తయారుచేసి పోసేస్తావా..


అడుగో అడుగో చూడు.. నీ వెధవ ప్రయోగం పాటించి నా మనవడు బిట్టుగాడు పెద్దఏనుగులా అయిపోయాడు ..ఇంట్లో నుంచి బయటకు రాలేక పోతున్నాడు. అనవసరంగా ఇంటి గుమ్మాలు అన్నీ తీసేసి యాభై వేలు పెట్టి పెద్దఇంటిగుమ్మాలు చేయించి వాడి కోసం పెట్టించానురా...'' అంటూ సుబ్బరామయ్య తమ్ముడు ప్రయోగాలరావుని.. గొడ్డును బాదినట్టు కొడుతూనే ఉన్నాడు...

నిద్రమత్తులో ఉండి.


ఇదేమీ అసలు అర్థం కాని ప్రయోగాలరావు..అన్న గారికి దండాలు పెడుతూ.. పరిగెడుతున్నాడు, ఇంటి చుట్టురా.


జనమంతా సినిమా షూటింగ్ చూస్తున్నట్టు అలాగా చూస్తూ ఉండిపోయారు.


అదిగో అప్పుడే వచ్చారు.. శ్రీమన్నారాయణ సిద్ధాంతిగారు.. ఆ రోజు బిట్టుగాడు అక్షరాభ్యాస కార్యక్రమం చేయడానికి...


వస్తూ విషయమంతా గ్రహించి, తెలుసుకుని ఇలా అన్నారు...


" ఒరేయ్ సుబ్బరామయ్యా ..ఇన్నేళ్లు నుంచి ఇన్ని కార్యక్రమాలు చేశావు.. ఎవరినైనా సలహా అడి గావా.. ఇప్పుడు మీ తమ్ముడు ఏదో విదేశాల నుంచి వచ్చాడని వాడికి ఏదో నెత్తిమీద రెండు కొమ్ములు మొలిచాయి అని.. వాడి దగ్గర నీకన్నా గొప్ప ఐడియాలు ఉంటాయని వాడి సలహా పాటి స్తావా ?? ఏ విషయమైనా .. మన సొంత ఆలోచ నలతోనే ముందుకెళ్లాలని ఇదివరలో నీకు చెప్పా ను కదా.. నీకంటూ సొంతఐడియాలు ఏడ్చి చచ్చి నపుడు.. ఇతరుల మీద ఆధారపడకూడదు అన్న బుద్ధి నీకు లేదా?


ఒరేయ్ సుబ్బరామయ్య.. నువ్వు నిద్ర మత్తులోనే ఉన్నావు ఇంకా..ఇప్పుడు నువ్వు భ్రమపడుతు న్నది అంతా నీకు వచ్చిన కల అన్నమాట...

వెంటనే నూతి దగ్గరికి వెళ్లి నాలుగు బకెట్ల చల్ల నీళ్ళతో తలారా స్నానం చేసి తగలడు. అప్పుడు గాని ఇదంతా నిజమే అన్న భ్రమ నీకు పోదు.

పిచ్చి భయంలో ఉండిపోయావు.. భయపడకు.. కంగారు పడకు.. వెళ్ళు... వచ్చాక అక్షరాభ్యాసా నికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చూడు." అంటూ పంపించాడు.


సిద్ధాంతి గారు చెప్పినట్టు చేసి వచ్చాడు సుబ్బ రామయ్య.


" ఇదిగో.. ఇలా చూడు..నీ వెధవ తమ్ముడు ప్రయోగాలరావుని.. ఇప్పుడు ఏం చేస్తావంటే...

అచ్చులు వదిలిపెట్టి హల్లులు నేర్చుకుంటే చాలు అని.. వెధవన్నర వెధవ ఐడియాలు ఇచ్చినందుకు వాడు ఇక్కడ ఉన్నన్నాళ్ళు మీ రెండో అంతస్థు పైన... మూలన దోమలగది ఉంది కదా.. అందు లో పాడేయండి .. అక్కడే అన్నo .. పక్క !!..


లేదంటే ఈ వెధవని ఇప్పుడే .. వాడు తెచ్చుకున్న అన్ని బ్యాగులుతో సహా ... మన చిన్నాగాడి ఎడ్లబండి మీద రాజమండ్రి రైల్వే స్టేషన్ కి పంపే యండి... అక్కడ నుండి ఏ దేశం వెళ్లి తగుల డతాడో తగులడనివ్వండి" అన్నాడు సిద్ధాంతి గారు.


అందరూ జాలిపడి ప్రయోగాలరావు ని ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మనకుండా దోమల గదిలోకి తోసే సారు.. అతను ఉన్నన్నాళ్ళు అక్కడే అతనికి తిండి..నిద్ర..మిగిలినవన్నీ కూడా!!!


* సమాప్తం *

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.


రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం....


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు


90 views2 comments
bottom of page