top of page

పుటం పెట్టబడ్డ హృదయాలు

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link


'Putam Pettabadda Hrudayalu' New Telugu Story Written By Nallabati Raghavendra Rao

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు


బంగారాన్ని వేడిచేసి, కరిగించి శుభ్రం చేస్తారు. ఈ ప్రక్రియనే పుటం పెట్టడం అంటారు. పుటం పెట్టబడ్డ బంగారం, స్వచ్ఛంగా తయారవుతుంది. అలాగే మనసుకు మలినం అంటి, పెద్దలను దూరం చేసుకున్న హృదయాలు వేదన చెంది, తిరిగి స్వచ్ఛంగా మారిన కథను హృదయానికి హత్తుకునేలా రచించారు ప్రముఖ రచయిత నల్లబాటి రాఘవేంద్ర రావు గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

ఇక కథ ప్రారంభిద్దాం...


' ఆనందమయం వృద్ధాశ్రమo ''. . .


పైన నేమ్ బోర్డు చూసి ఆ వృద్ధాశ్రమంలోకి ప్రవేశించారు.. రామ చంద్రం, సీతామాలక్ష్మి. . . అది కాకినాడకు అటు పక్క, దూరం గా ఉన్న ప్రశాంతి నగర్.


హరిహరమహదేవయ్య, అన్నపూర్ణమ్మ అనే వృద్ధ జంట 4 నెలలక్రితం ఈ అనాధ ఆశ్రమంలో జాయిన్ అయ్యారని, వాళ్ళను ఒకసారి చూపిస్తే మాట్లాడి వెళ్ళిపోతామని ఆ ఇద్దరూ అడిగారు ఆఫీసు నిర్వహకుడు ముత్యాలరావు ని.


అతను రిజిస్టర్ చూసి వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారని.. ‘వాళ్లకు మీరు ఏమి అవుతారు?’.. అని అడిగాడు.


రామచంద్రం తడబడి.. “వాళ్ళిద్దరూ కొంచెం తెలుసు, దూరపు బంధువులు.. ” అని చెప్పాడు.


'' నిజమే! బయోడేటా లో వాళ్ళిద్దరూ తాము అనాధలమని రాశారు. ఇక్కడి రూల్స్ ప్రకారము బయట వాళ్ళను కలవనివ్వ”మని చెప్తూ “అయినా ఈ రోజు సమయం దాటిపోయింది కనుక మీ పేర్లు ఇచ్చి మళ్లీ నెల మొదటి శనివారం సాయంత్రం నాలుగు.. ఐదు గంటల మధ్య వస్తే ఈ లోపున వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు కలవాలని ఇష్టపడితే తప్పకుండా సహయ పడగల”నని హామీ ఇచ్చాడు ముత్యాలరావు.


***


మళ్లీ నెల మొదటి శనివారం రానే వచ్చింది.


రామచంద్రం, సీతామాలక్ష్మి మోపెడ్ బయటపెట్టి, ఆనందమయం వృద్ధాశ్రమం లోకి ప్రవేశించారు.


'' ఏవండీ.. నెల పోయాక రమ్మన్నారు కదా! మా అమ్మనాన్నలను ఈరోజు అయినా చూపిస్తారా??'' రుసరుసలాడుతూ అడిగాడు రామచంద్రం, ఆఫీసు నిర్వాహకుడు ముత్యాలరావు ని.


'' పోయినసారి మీరు వెళ్ళాక మీ పేర్లు లోపలున్న హరహరమహదేవయ్య, అన్నపూర్ణమ్మ గార్లకు చెప్పాను. మీ గురించి అంతగా ఆసక్తి చూపించ లేదు వాళ్ళు. అన్నట్టు పోయినసారి వచ్చిన ప్పుడు వాళ్ళిద్దరు దూరపు బంధువులు అని చెప్పారు. ఇప్పుడు ''అమ్మానాన్న' అంటున్నారేమిటి?'' ప్రశ్నించాడు ముత్యాలరావు.


''ఇప్పుడు చెప్పిందే నిజమండి. వాళ్ళిద్దరూ నాకు అమ్మానాన్న. కుటుంబం అన్నాక 90 సమస్యలు ఉంటాయి కదా.. మీకు తెలియందేముంది” కొంచెం సర్దుబాటుగా, మరి కొంచెం చిరాగ్గా అన్నాడు రామచంద్రం.


''సార్.. నిజం చెప్పమంటారా! లోపలన్న వాళ్ళిద్దరూ నాకు అత్తయ్యగారు, మామయ్యగారు. ఈయన గారి తల్లి తండ్రి'' నెమ్మదిగా వివరించింది సీతామాలక్ష్మి .


''చూడమ్మ.. మీ ఇద్దరి విషయం నాకు అనుమానంగా ఉంది. రోజులు అసలే బాగుండలేదు. ఆనక ఏదైనా జరిగితే నా ఉద్యోగం ఊడిపోద్ది. మీకు నేను సహాయం చెయ్యలేను. ఎప్పుడూ ఇక్కడికి రాకండి. వెళ్లిపోండి ''.. అని గదమాయించాడు ముత్యాలరావు.


వెంటనే పర్స్ లోంచి ₹100 తీసి అతని జేబులో పెట్టబోయాడు రామచంద్రం.


'' మీరు చాలా తప్పు చేస్తున్నారండి. ఇలా వృద్ధుల మీద వ్యాపారం చేసే పశువుని కాదు నేను. నాకు అమ్మానాన్న ఉన్నారు. దయచేసి మీరు మాట్లాడకుండా వెళ్లిపోండి. కాదని మీరు ఒకమాట గట్టిగా మాట్లాడితే నేను యాజమాన్యానికి ఫోన్ చేయడం తప్ప దారి లేదు" అంటూ ముత్యాలరావు వాళ్ళిద్దర్నీ బయటకు నెమ్మదిగా పంపిస్తూ మెయిన్ గేటు మూసేసాడు.


రామచంద్రం గట్టిగా మాట్లాడబోతుండగా. .

'' ఏమండీ.. గొడవద్దు. తర్వాత వద్దాం. మనదే తప్పు. వెళ్ళిపోదాం.. వచ్చేయండి'' అంటూ భార్య సీతామాలక్ష్మి, చెయ్యిపెట్టి భర్తను లాగింది.

***

రామచంద్రం, తాము నివసించే కాకినాడ వెళ్లిపోయాక ఏమి చేయాలి అని ఆలోచిస్తూ బండి నడుపుతున్నాడు. కొంచెం చీకటి పడుతోంది.. సడన్గా ఆకాశం మేఘావృతమై సన్న జల్లు పడుతోంది. గాలికూడా వీస్తోంది. భార్య సీతామాలక్ష్మి కంగారు పెట్టడంతో.. పక్కనే ఉన్న చిన్నషెడ్డు లో బండి పెట్టి, అక్కడే ఉన్న చెక్క బల్ల మీద ఇద్దరూ కూర్చున్నారు.


వర్షం పెద్దదైంది.. ధారాపాతంగా పడు తున్న వర్షంలో నుంచి నాలుగునెలల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది రామచంద్రానికి.

***

అది కాకినాడకు ఇటుపక్క దూరంగా ఉన్న.. హరిహరమహాదేవయ్య, అన్నపూర్ణమ్మ ఫ్యామిలీ నివసించే చిన్న పల్లెటూరు లో రచ్చబండ లాంటి ప్రదేశం. .


అబ్బాయిదొర గారు హుందాగా కూర్చుని ఇలా మాట్లాడుతున్నారు.


'' మన కాలనీలో సమస్య బయటకు వెళ్లకూడదు అనేది మన సాంప్రదాయం.

హరిహరమహాదేవయ్యగారు, అన్నపూర్ణమ్మగారు.

మీరిద్దరూ సృష్టిస్తున్న సమస్యల వల్ల, ప్రవర్తన వల్ల తమకు, తమ పిల్లలకు సుఖశాంతులు కరువ య్యాయని మీ అబ్బాయి రామచంద్రం, కోడలు సీతామాలక్ష్మి మీ మీద ఫిర్యాదు చేశారు. వయసు భారంతో మీరిద్దరూ అనుసరిస్తున్న విధానాలు కూడా వాళ్ళకు నచ్చడంలేదని. . దాంతో జీవితం దుర్భరంగా తయారయ్యిందని వాళ్ళoటున్నారు. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ విధానాలు తట్టుకోవడం కష్టంగా ఉంది కనుక ఆ మీ సొంత ఇంట్లో వారో మీరో ఎవరో ఒక జంట మాత్ర మే ఉండాలి అన్నది వాళ్ల ఉద్దేశ్యం.


పెద్దలుగా మీకు కూడా ఈ రచ్చబండ మీద కూర్చు ని తీర్పు చెప్పిన అనుభవం ఉంది. . అందుకని ‘ఏం జరిగింది.. మీరు చెప్పండి?’ అని మిమ్మల్ని అడిగే ధైర్యం మాకు లేదు. మీ అబ్బాయి ఇచ్చిన వివరణ మాత్రం మీకు చెప్తాం. అతనేమంటున్నాడoటే ఆ ఇల్లు ఇరుకుగా ఉన్న మూలాన సమస్యలు వస్తున్నాయి కనుక తన కాలు, చెయ్యి కూడతీసుకుని ఇంటి పై అంతస్తు వేస్తానని, ఇప్పటికే ఆ ఇల్లు అప్పులో ఉన్న మూలాన, ఇంకా అప్పు చేసి ఆ పని ఇప్పుడే చేయలేనని, అంత వరకు అందరి ప్రశాంతత కోసం మిమ్మల్ని ఇద్దరిని వృద్ధాశ్రమంలో ఉండమని చెప్పాడు. పోనీ మిమ్మల్ని సొంత ఇంట్లో ఉంచి తనే అద్దె ఇంట్లోకి వెళ్లి పోదామంటే అద్దె పెను భారంగా మారుతుంది అంటున్నాడు.


హరిహరమహాదేవయ్యగారూ! ఆ ఇల్లు మీ స్వార్జితం కనుక మిమ్మల్ని బయటకు వెళ్లమని చెప్పే హక్కు మాకు లేదు. అలాగని చిన్న ఉద్యోగం చేస్తూ పిల్లలతో ఉన్న మీ అబ్బాయి, కోడలు వాళ్లనూ బయటకు వెళ్ళమని అనడానికి మాకు నోరు రావడంలేదు. అందుకనే ఈ సమస్యకు పరిష్కారం మీకే వదిలేస్తున్నాను.


24 గంటల లోపున మీ ఇరు పక్షాలు ఒక రాజీకి వచ్చి మాకు తెలియజేయండి. లేదంటే ఈ రచ్చ బండ ఇచ్చే తీర్పు గౌరవించి, అంగీకరించడానికి మీ ఇరుపక్షాలూ సిద్ధంగా ఉండండి. ఇక అందరూ వెళ్ళవచ్చు.. '' చెప్పడం ముగించి హుందాగా లేచి వెళ్ళిపోయారు అబ్బాయి దొర గారు.


వచ్చిన జనం ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్లిపోతున్నారు.


అక్కడే అంతా వింటూ చూస్తున్న రామచంద్రం ఇద్దరు పిల్లలు- 8 ఏళ్ల రాజు, 10 ఏళ్ల రమణి బిక్క ముఖాలతో భయంగా ఉండిపోయారు. వాళ్లిద్దర్నీ తీసుకుని రామచంద్రం, సీతామాలక్ష్మి కూడా వెళ్ళిపోయారు.


హరిహరమహాదేవయ్య, అన్నపూర్ణమ్మలు కూడా కళ్ళు తుడుచుకొంటూ ఇంటికొచ్చేశారు. మర్నాడు ఉదయం చూస్తే వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు. విషయం ఊర్లో అందరికీ చెప్పాలని రామచంద్రం మధ్యాహ్నం వరకు చూసి బయటకు వెళ్లేసరికి, ఎదురు వచ్చిన ఓ జంట, హరిహరమహాదేవయ్య అన్నపూర్ణమ్మ లు తమకు తెలుసునని, ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ కాకినాడకు దూరంగా ఉన్న ప్రశాంతి నగర్ లోని వృద్ధాశ్రమంలో జాయిన్ అయినట్టు చెప్పడంతో రామచంద్రం తనూ ప్రశాంత పడ్డాడు.


ఇదంతా. . .

అలా అలా గుర్తొచ్చింది రామచంద్రానికి. . . అలా నాలుగు నెలల క్రితం. . . తమంతట తాము. . . ఆ వృద్ధాశ్రమం లో జాయిన్ అయిన తల్లిదండ్రులను చూడ్డానికి ఈరోజు రెండవసారి వచ్చిన రామ చంద్రం. . . ఆఫీసు నిర్వహకుడు ముత్యాలరావు వల్ల జరిగిన ఘర్షణతో బాధపడుతూ కూర్చు న్నాడు. . ఆ షెడ్డులో. . . వర్షం తగ్గే వరకు.


వర్షం కొంచెం తగ్గిందని భార్య సీతామాలక్ష్మి చెప్ప డంతో. . ఉలిక్కిపడి, నిలబడి బండి స్టార్ట్ చేసి భార్యతో సహా బయలుదేరాడు. . ఇంటికి. . .


***


మర్నాడు ఆదివారం పిల్లలు రాజు. . రమణి ఇద్దరూ ఇంటి దగ్గరే అంతా వింటూ ఉన్నారు. . .


రామచంద్రం భార్య వైపు చూస్తూ ఇలా అన్నాడు

'' అమ్మానాన్నని అక్కడ అలా ఉంచడం నాకు చాలా బాధగా ఉంది సీతా. . . మూర్ఖత్వంగా ఆలోచించి పదిమందిలో నిలబెట్టాను. ఇప్పుడు వాళ్ళిద్దర్నీ క్షమించమని కాళ్లు పట్టుకుని ఇంటికి తీసు కొచ్చేయడం ఒకటే మంచి పని అవుతుంది. అది కూడా ఎలాగో అర్థం కావడం లేదు. . ''


'' నేను. . అదే మీకు చెబుతామనుకుంటున్నాను. అలాగే చేయండి. . '' భర్తకు అనుకూలంగా మాట్లాడుతూ అంది సీతామాలక్ష్మి.


అలా ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినా. . ఇప్పుడు వాళ్ళను ఎలా ఇంటికి తీసుకురావాలో అర్థం కాలేదు. . రామచంద్రం సీతామాలక్ష్మి లకు.


చాలా సేపు ఆలోచించిన మీదట 4 నెలల క్రితం తీర్పు కోసం వెళ్లిన అబ్బాయి దొరగారి దగ్గరకే వెళ్లి సాయం కోరాలని బయలుదేరారు రామచంద్రం సీతామాలక్ష్మి. . పిల్లలిద్దరూ కూడా వస్తానన్నారు.


పిల్లలిద్దరినీ గదమాయించి. . '' ఇలాంటి పెద్దవాళ్ల విషయాల్లోకి పిల్లలు దూరకండి.

ఇంట్లో కూర్చుని హోంవర్క్ చేసుకోండి. . అరగంట లో వస్తాo. . '' అంటూ మోపెడ్ మీద అబ్బాయి దొరగారి ఇంటికి వెళ్లారు. విషయమంతా ఆయనకు ఇలా చెప్పాడు రామచంద్రం . . .


'' తప్పు చేశాను అబ్బాయి దొరగారూ! అసలు నేను ప్రశాంతినగర్లో ఉన్న ఆనందమయం వృద్ధాశ్రమానికి మాఅమ్మానాన్నని చూద్దామనే వెళ్ళాను. కానీ వాళ్లకు నా మీద కోపం వచ్చినట్టుంది. నన్ను చూడ్డానికే వాళ్ళిద్దరూ ఇష్టపడలేదట. నాకు బుద్ధి వచ్చింది. అమ్మానాన్న ను మళ్ళీ ఇంటికి తీసుకు వచ్చేయాలనుకుంటున్నాను. వాళ్లకు బాధ కలగ కుండా చూసుకోవాలనుకుంటున్నాను. పెద్ద మనసుతో నన్ను క్షమించి, నాకు సహాయం చేయండి. మీరే ఆ బాధ్యత తీసుకోండి. . ''. . అంటూ అడిగాడు రామచంద్రం. . సీతామాలక్ష్మి కూడా ఆయన కాళ్ళ పై పడింది.


దాంతో అబ్బాయి దొరగారు

'' రామచంద్రం! నీ మనసు నాకు అర్థమైందయ్యా. కానీ తీర్పులు చెప్పే ఒక పెద్ద గా ఇలాంటి పని నేను చెయ్యలేను. . చేయకూడదు. అయితే నీలో ఒక విషయం నాకు నచ్చింది. . తల్లిదండ్రులను శాశ్వతంగా వదిలించుకోవాలి అనుకుంటున్న ఈ రోజుల్లో. . మళ్లీ నీలో, నీ భార్యలో ఇలాంటి మార్పు రావడం హర్షించదగినది. అందుకనే నీతో నేను మాట్లాడుతున్నాను. . చివరగా నీకు ఓ చిన్న సలహా మాత్రం ఇవ్వగలను. . ఈ పనికి. . నీ దగ్గర బంధువులు ఎవరి నైనా ఉపయోగించు. . బాగుంటుంది. ''

అని చెప్పి అబ్బాయి దొరగారు లేచి లోపలకు వెళ్లిపోయారు. రామచంద్రం చేసేదిలేక బయట కొచ్చి భార్యతో మోపెడ్ ఎక్కి. . ఇంటిదారి పట్టగా దారిలో తన పక్క ఊరిలో నివాసం ఉంటున్న తన సొంత పెదనాన్న శరభేశ్వరరావు కనబడ్డాడు. బ్రతిమలాడి పెదనాన్న ని ఇంటికి తీసుకు వెళ్ళాడు. .

రామచంద్రం.


గతంలో జరిగిన విషయం తెలిసిన శరభేశ్వరరావు రామచంద్రం, సీతామాలక్ష్మి లని గట్టిగా మందలించి ఇలా అన్నాడు. . .


''ఒరేయ్ రామచంద్రo. . నువ్వు క్షమించరాని తప్పు చేశావురా. ఇప్పుడు నీలో మార్పు వచ్చింది అంటే ఎలా నమ్మమంటావు. ఇప్పుడు మీ కుర్రకారుకి ఇదో ఫ్యాషన్ అయి పోయింది రా. అంతేకాదు. . మీ అమ్మానాన్న బాగున్నారా అని ఎవరైనా అడిగితే. . . '' వాళ్లకేం . . ఓల్డ్ ఏజ్. . హోమ్ లో హాయిగా ఉన్నారు'' అని చెప్పటం లేటెస్ట్ డైలాగ్ గా మారిపోయింది.


సరే. . . అదంతా పక్కన పెట్టు. ఇప్పుడు నేను వెళ్లి బ్రతిమలాడో, బామాలో మీ అమ్మానాన్నలని తీసుకు వచ్చాను అనుకో. . మళ్లీ ఇదే సంఘటన రిపీట్ కాదని గ్యారెంటీ ఏమిటి ? అప్పుడు నా తల ఎక్కడ పెట్టుకోవాలి రా. తప్పు చేసిన నువ్వే దీనిని సర్దుకుంటే మళ్లీ ఆ తప్పు చేయవు. ఈ విషయంలో మాత్రం నేను నీకు సహాయపడ లేనురా. . . అదిగో. . మీ పిల్లలు ఇద్దరూ మానసికంగా ఈ నాలుగు నెలల నుండి ఎలా కృంగి కృశించి పోతున్నట్టు ఉన్నారో చూడు. . అక్కడ ఆ వృద్ధులను, ఇక్కడ ఈ పిల్లలను కూడా బాధ పెడుతున్నారు మీ భార్యభర్తలు. నేను ఇక వెళ్తానురా. మన బంధువర్గంలో నీకు మళ్ళీ మంచి స్థానం కలగాలంటే ఈ సమస్య మొత్తం నువ్వే పరిష్కరించుకోవాలి ''. . . అంటూ బయట పడ్డాడు రామచంద్రం పెదనాన్న శరభేశ్వరరావు.


అంతా వింటూ చూస్తున్న పిల్లలు రాజు, రమణి ఏడుస్తూ కూర్చున్నారు ఓ మూల. . ఆ రాత్రి.


బాధలో ఉన్న రామచంద్ర వాళ్ల దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు

'' మా అమ్మ నాన్న గురించి నా ఏడుపేదో నేను ఏడుస్తుంటే మధ్యలో మీ ఏడుపు ఎందుకురా? గదిలోకి వెళ్లి హోంవర్కు చేసుకుని చావండి. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపొండి'' అంటూ కసురుకున్నాడు కూడా.


'' చెప్తుంటే మీక్కాదు.. మమ్మల్ని చంపడానికి పుట్టారు మీరిద్దరూ. వంటింట్లోకి వెళ్ళి ఉన్నది తిని చావండి. '' మరిoత బాధతో అరిచినట్టoది తల్లి సీతామాలక్ష్మి,పిల్లలవైపు చూస్తూ.


ఆ రాత్రి రామచంద్రం, సీతామాలక్ష్మిలకు కునుకు పట్టలేదు. ఇప్పుడు ఏం చేయాలో ఏ మాత్రం బోధపడని భయంకరమైన పరిస్థితి వాళ్లది. కళ్ళల్లోoచి వస్తున్న కన్నీటితో తలగడ తడిచి పోయినట్టు కూడా వాళ్లు గ్రహించలేకపోతు న్నారు. .


***


తెల్లవారింది.


'' ఏవండీ. . ఏవండీ. . మిమ్మలనే . . లేవండి లేవండి. . పిల్లలిద్దరూ కనిపించటంలేదు. ఇల్లంతా చూసాను దొడ్లోకూడా వెతికాను. వీధిలో కూడా లేరు. ఆ రామాలయం అరుగుమీద కూడాలేరు. నాకుచాలా భయంగా ఉంది. . '' కంగారుతో భర్తను లేపింది సీతామాలక్ష్మి.


''రాత్రి వాళ్ళనన్నమాటలతో ఎక్కడికైనా వెళ్లిపోయి, ఏ అఘాయిత్యం అయినా చేసుకున్నారంటావా?” లేస్తూ అన్నాడు రామచంద్రం .


'' ఏమో బండి తీసుకురండి. ఊరంతా వెతుకుదాం” తలుపు గొళ్ళెం పెడుతూ అంది సీతామాలక్ష్మి.


'' సీతా. . నేను బండిమీద ఊరంతా తిరిగిచూస్తాను నువ్వు నాతో రావద్దు. నువ్వు నడిచి వెళ్లి ఈశాన్య మూలన ఉన్న శివాలయం, విష్ణాలయం, కచేరీ చావడి వీధులన్నీ చూడు '' భార్యకు పురమాయించి తను ఆతృతగా బండి ఎక్కి వెళ్ళిపోయాడు రామచంద్రం.


అలా వీధులన్ని మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి తిరిగి. . అలసిపోయి మళ్లీ ఇంటికొచ్చి కలుసుకొన్నారు ఆ భార్యభర్తలు ఇద్దరు.


'' సీతా. . అమ్మానాన్న పెట్టిన శాపం ఇది. వాళ్ళను ఏడిపించాను. మనం ఏడవలసి వస్తుందిప్పుడు. మంచినీళ్లు తాగు. . రా మళ్ళీ వెళ్దాం. . '' బెదురుగా అన్నాడు రామచంద్రం.


'' సరే! ఇప్పుడు ఎక్కడికి వెళదాం?'' కంగారుగా అడిగింది సీతామాలక్ష్మి.


'' ఇద్దరం కలిసి రైల్వే ట్రాక్ లు అన్నీ వెతుకుదాం ''


'' అంటే. . '' భర్త మాటకు బెంబేలు పడిపోతూ అడిగింది సీతామాలక్ష్మి. . బిగ్గరగా ఏడుస్తూ. .


'' కంగారు పడకు నేను ఉదయం. . ఊర్లో అన్ని మందు షాపులు తిరిగి కూడా అడిగాను. ''

అన్నాడు రామచంద్రం బండి నడుపుతూ.


'' ఏం అడిగారు. . ''. . ప్రశ్నించింది సీతామాలక్ష్మి''


'' అది. . . అదే. . ఎవరైనా ఇద్దరు పిల్లలు వచ్చి పురుగుల మందు కొన్నారా అని అడిగాను." నెమ్మదిగా అన్నాడు రామచంద్రం .


'' అలా భయ పెట్టకండి నేను తట్టుకోలేను'' గట్టిగా రోదిస్తోంది సీతామాలక్ష్మి .


రామచంద్రం ఇంకా చెబుతున్నాడు బండి నడుపుతూ. .

'' అవును సీతా! ఇప్పటి పిల్లల్లో ఉద్రేకం పాలు ఎక్కువ. మొన్న మా ఫ్రెండు సుందర్రావు వాళ్ళ 10 ఏళ్ల అబ్బాయిని చిన్నగా కోప్పడ్డాడని. . ఇంట్లో నే ఉరిపోసుకుని చచ్చిపోయాడు. .


నెల క్రితం. . మా బాస్ వాళ్ళ అమ్మాయిని ‘ఇంటికి ఎందుకు లేటుగా వచ్చావు?’ అని అడిగినందుకే వాళ్ళింటి మూడు అంతస్థుల బిల్డింగ్ మీద నుండి దూకి చచ్చిపోయింది. ఇలాంటి చాలా సంఘటనలు పేపర్లలలో కూడా చదువుతున్నాము కదా” అంటుండగా సీతామాలక్ష్మి అడ్డుపడుతూ

'' ఆగండి. ఈ సమయంలో అలాంటివి చెప్పి భయ పెట్టకండి. మళ్లీ అటు ఎక్కడికి?" అంటూ ప్రశ్నించింది.


'' చీకటి పడకముందే సముద్రం ఒడ్డున వెతికి చూద్దాం. . . ''


''అంటే మీ ఉద్దేశం నా బిడ్డలిద్దరూ.." చలించి పోతూ అంది సీతామాలక్ష్మి.


'' కంగారు పడకు. నాతో రా. . ధైర్యం తెచ్చుకో . . '' అంటూ రామచంద్రం భార్యతో కలిసి ఒడ్డు అంతా రాత్రి వరకు తిరిగారు. బాగా చీకటి పడింది. చేసేదిలేక ఆ ఇద్దరూ ఇంటికి వచ్చి గుక్క తిప్పు కోవడం మర్చి ఏడ్చారు.


'' నా బిడ్డలు ఎలా ఉన్నారో అని తండ్రిగా నేను ఇక్కడ బాధపడుతున్నట్టే. . తన బిడ్డ అయిన నేను ఎలా ఉన్నానో అని. . అక్కడ నా అమ్మానాన్న కూడా నా గురించి ఏడుస్తూ ఉంటారు. . అర్థం చేసుకోలేని పశువుగా ప్రవర్తించాను. ''. . . అనుకుంటూ రామచంద్రం. . కళ్ళల్లోంచి రక్తం కారే స్థితి వరకు ఏడ్చాడు. అలా ఏడుస్తూనే అతని భార్య సీతామాలక్ష్మికూడా భర్తతో పాటు సొమ్మ సిల్లి పోయింది


***


తెల్లవారబోతుంది. . . మగతలో నుండి రామచంద్రం తేరుకున్నాడు.


'' సీతా. . . త్వరగా రా. . . . . . ' ఎఫ్ ఐ ఆర్ ' రాశాను. స్టేషన్ కు వెళ్దాం. . ''' అంటూ కంగారు పెట్టాడు భార్యను రామచంద్రం.


' పదండి ' అంటూ సీతామాలక్ష్మి అతడిని అనుసరించింది. . ఇద్దరూ తలుపు గడియ తీసి బయ టకు వచ్చారు. వాళ్ళిద్దరి ముఖాలు వాడిపోయి వర్ణవిహీనంగానే ఉన్నాయి. కళ్ళలోంచి నీటి ధార లతో దారి మార్గం కూడా కనిపించడం లేదు.


అంతే. . వాళ్ల ఇంటి ఎదురుగా రోడ్డు మీద అస్పష్టం గా కనబడిన దృశ్యం చూసి. . చలించిపోయారు.


ఆశ్చర్యం!!!


వాళ్ల ఇంటి ముందు ఆటోలోంచి దిగుతున్నారు వాళ్ల పిల్లలు రాజు, రమణి. . . దిగిపోయాక వాళ్ళిద్దరి సహాయంతో. . హరిహరమహాదేవయ్య. . అన్నపూర్ణమ్మలు. . . నెమ్మదిగా దిగుతున్నారు. . . క్రిందకు దిగి తన ఇంటి లోపలకు వస్తున్నారు అందరూ. వాళ్ళందరి వెనుకగా డ్రైవర్ రెండు చిన్నబ్యాగులు మోస్తూ వస్తున్నాడు.


రామచంద్రం సీతామాలక్ష్మి . . ఈసారి. . ఇంకా గట్టిగా ఏడుపు మొదలు పెట్టారు. తాము చేసిన తప్పును బహిర్గతం చేస్తున్నట్టు ఏడ్చిఏడ్చి వీధిలో చెరో పక్క గోడల మీదే వాలిపోయారు. . గడప దాటి ఇంటిలోపలకు వెళుతున్న తమ వాళ్లందరినీ ప్రేమగా చూస్తూ. . . సిగ్గుతో ముఖాలు మూసేసుకుంటూ. . . . వాళ్ళిద్దరూ ముడుచుకు పోయారు.


అలా. . అలా. . కాసేపటికి తేరుకున్న రామచంద్రం, సీతామాలక్ష్మి లు ఆ వృద్ధదంపతుల కాళ్లపై పడడానికి. . తమ బిడ్డలను గుండెలకు హత్తుకోడానికి ఇంటిలోపలకు వెళ్లారు.


ఇప్పుడు వాళ్లిద్దరివీ పూర్తిగా ' పుటం ' పెట్టబడ్డ హృదయాలు!!!!!


* సమాప్తం *

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.


రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం....


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు


106 views2 comments
bottom of page