నవ్వుల నదిలో సాగూ!
- Gadwala Somanna
- May 20
- 2 min read
#TeluguKavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #NavvulaNadiloSagu, #నవ్వులనదిలోసాగూ, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 78
Navvula Nadilo Sagu - Somanna Gari Kavithalu Part 78 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 20/05/2025
నవ్వుల నదిలో సాగూ! - సోమన్న గారి కవితలు పార్ట్ 78 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
నవ్వుల నదిలో సాగూ!
----------------------------------------
కాసంత చిరునవ్వులు
వదనానికి కడు అందం
పూసంత మన మనసులు
పెనువేయును ఘన బంధం
సదనవనంలో నవ్వులు
పరిమళించు సిరిమల్లెలు
సొగసులీనే పువ్వులు
తీయగా మ్రోగు మువ్వలు
జీవితాన మధుమాసం
తెచ్చిపెట్టు దరహాసం
ఎందుకోయి! ఆలస్యం
కావాలోయ్! ఆరంభం
పైసా ఖర్చు లేనిది
ఉచితంగా వచ్చునది
జాగేల ఇక నేస్తమా!
నవ్వుల నదిలో సాగుమా!

మేలు కదా! నేస్తం!
----------------------------------------
మంచినే పెంచినా
మమతనే పంచినా
మేలు కదా! నేస్తం!
చెడు వ్యసనం త్రుంచినా
లక్ష్యం ఛేదించినా
విజయం సాధించినా
మేలు కదా! నేస్తం!
మేలి పనులు చేసినా
చేయి చేయి కలిపినా
చెలిమితోడ మెలిగినా
మేలు కదా! నేస్తం!
మనసు మనసు కలిసినా
అభివృద్ధి చెందినా
శిఖరమంత ఎదిగినా
మేలు కదా! నేస్తం!
వినయంతో ఒదిగినా

వాస్తవాలు
-----------------
మనసులే చేరువైతే
మమకారం పండును
బంధాలే దూరమైతే
చెరువులాగ ఎండును
అన్నదాత లేకపోతే
అన్నమే శూన్యమగును
ధనమెంత కూడబెట్టినా
ఆకలి కేకలు అగునా
వ్యసనాలే ముదిరితే
వృక్షాలుగా మారితే
మానుకొనుట కడు కష్టం
ఆదిలోనే సులభం
కష్టపడే వ్యక్తులకు
ప్రేమించే మనసులకు
ఉజ్వల భవిత ఉండును
సాయపడే చేతులకు

శాంతి కపోతాలు
----------------------------------------
విశ్వశాంతి సంకేతం
ముద్దులొలికే కపోతం
నివాస స్థలం ఉన్నతం
జ్ఞాపకశక్తి అద్భుతం
పక్షుల్లో మేలు జాతి
వార్తాహరులు ఆనాడు
పవిత్ర ప్రేమ చిహ్నం
అవే కదా! చూడు చూడు
మారుపేరు పావురం
జీవన విధం అబ్బురం
కలసిమెలసి ఉంటాయి
గుంపుగా విహరిస్తాయి
వైద్యంలో వినియాగం
మేలుచేయు పావురాలు
పందెంలో ఉపయోగం
మేటియైన పావురాలు
గుడులు, గోపురాలపై
ఉండునోయి!కపోతాలు
ఉన్నత స్థలాల్లో అవి
చేయునోయి! కాపురాలు
నాడు తెచ్చె సందేశాలు
ప్రేమికులకు కపోతాలు
ఎంత దూరం వెళ్లినా
చేరుకొనును నివాసాలు

నాన్న మేటి సూక్తులు
----------------------------------------
మనశ్శాంతి ఉంటే
బ్రతుకు స్వర్గధామం
పెద్దల మాట వింటే
జీవితమే సుఖమయం
శ్రద్ధగా చదివితే
బుద్ధిగా మసలితే
వృద్ధి అగును సాధ్యం
ఇది అక్షర సత్యం
స్ఫూర్తిగా బ్రతికితే
కీర్తిని సాధిస్తే
బ్రతుకే ఆదర్శం
గౌరవమే సొంతం
జ్ఞానం ఆర్జిస్తే
ధ్యానం సాగిస్తే
ఎక్కొచ్చు అందలం
జీవనం ప్రశాంతం!
-గద్వాల సోమన్న
Comments