top of page
Original.png

రాఖి – రాఖి – రాఖి

Aug 28
10 min read

రాఖి – రాఖి – రాఖి తెలుగు కవిత – అన్నాచెల్లెళ్ల ప్రేమ మరియు రక్షాబంధన్ అనుబంధం

Rakhi - Rakhi - Rakhi - Telugu Poem | Neeraja Hari Prabhala 

రాఖి - రాఖి- రాఖి తెలుగు కవిత | నీరజ హరి ప్రభల

Published in manatelugukathalu.com on 28/08/2026


రాఖి – రాఖి – రాఖి


అందమైన  రాఖి - అపురూపమైన  రాఖి.

రాఖి  హస్త భూషణం - మది  సంతసం.

రాఖి  బంథం -  వెలలేని  అనుబంధం.

శ్రావణ  పౌర్ణమి - రాఖీ పున్నమి.

కడదాకా పున్నమి  చంద్రునిలా  వెలుగునిచ్చి, అండగ ఉండే   సోదరుని బంధమే  రాఖి. 

ఇది కేవలం  దారపుపోగులతో, మెరిసే  తగరపు బిళ్లతో  ఆకర్షణీయంగా  సోదర చేతికి  ముడివేసే  బంథం కాదు. 

మదినిండా  అమూల్యమైన ప్రేమతో  సోదర చేతికి  పవిత్రతను  చేకూర్చే దైవబంథం.

అన్నా,తమ్మళ్లు  ఇచ్చే అపూర్వకానుక  కోసం  ఎంతో  ఆరాటపడే  సోదరి హృదయ స్పందనే  ఈ రాఖి. 

అది  ఎంతదైనా,  ఏదైనా  ఆమెకు  అమూల్యం. 

అన్నా చెల్లెళ్ల  అపూర్వ కలయిక  ఈ రాఖి.

ఈ తరుణం కోసం   ఆతృతతో ఎదురుచూసే  అక్కచెల్లెళ్లు.

నేనున్నానని  నిండుగ  పలికి  ధైర్యాన్నిచ్చే  ఆత్మీయ  అండ  ఈ రాఖి.

ఆ భరోసాతోనే  ఎన్నోకష్టాలను, బాధలను  అధిగమించి  మనోబలంతో  బ్రతుకు  బండి నడుపుతుంది  స్త్రీ.

సోదర- సోదరీమణుల  అపూర్వ బంథాలను  గుర్తుచేసేది  రాఖి.

ఆ అపూర్వ  పవిత్ర  బంథాన్ని  కడదాకా ఉంచుకోవాలి - పదిలంగా  కాపాడుకోవాలి. 

ధనార్జనే  ప్రబలమైన  నేటి  యాంత్రిక యుగంలో,  ఆత్మీయానుబంథాలకు  తావు ఏది?

ధనవంతురాలైతేనే  ఆ సోదరికి  పుట్టింటి  రాక - పోక. 

రక్తసంబంధమే  కానక్కర్లేదు - తుదిదాకా  పవిత్రమైన  సోదర  భావన  ఉంటే చాలు  ఈ రాఖికి.

అందరిలో  ఈ భావన  ఉంటే  కామప్రకోపాలు  చెలరేగవు.  ఎక్కడా  ఎలాంటి  అఘాయిత్యాలు  జరగవు. 

స్తీలకు  రక్షణ  ఉంటుంది. 

బాధలు, కష్టాలలో  నేనున్నాని  నిండుగ  పలికి  మనోధైర్యాన్నిచ్చే  స్నేహితుడు  కూడా సోదరసమానుడే.  

ప్రేమతో  పలకరింపు, ఆదరణ, ఆప్యాయత  స్త్రీకి  ఎంతో  ఓదార్పుని, మనశ్శాంతిని ఇస్తుంది.

సోదర  ప్రేమ, స్నేహ సౌభ్రాతృత్వం  ఎల్లెడలా  వికసించాలి.

ఎల్లెడలా  రాఖి  జరుపుకోవాలి. 

అందరికీ  రాఖి పర్వదిన  శుభాకాంక్షలు. 

…. నీరజ  హరి  ప్రభల.


=================================

ee Prasnaku baduledi? - Telugu Poem | Neeraja Hari Prabhala 

ఈ ప్రశ్నకు బదులేది? తెలుగు కవిత | నీరజ హరి ప్రభల

Published in manatelugukathalu.com on 19/05/2026


ఒక ఆడపిల్ల కలలతో మొదలైన జీవితం…

బలవంతపు నిర్ణయాలు, అవమానాలు, కుటుంబ బాధ్యతలు, తల్లితన త్యాగాలు, చివరకు ఒంటరితనంగా మారినప్పుడు — ఆమె మనసులో మిగిలింది ఒక్క ప్రశ్నే: “ఈ కష్టాలకు అంతం ఏది?”

ప్రతి మహిళ జీవితంలోని మౌన వేదనను ఆవిష్కరించే హృదయ విదారక తెలుగు గద్యకవిత.


ఈ కష్టాలకు అంతం ఏది?

ఈ ప్రశ్నకు బదులు ఏది?


యుక్త వయస్సులో అందమైన జీవితం గురించి ఎన్నో కలలు కనడం ఆమె తప్పా?

ఎంతో శ్రమకోర్చి కష్టపడి చదివి మంచి భవిష్యత్తు కోసం పాకులాడటం ఆమె తప్పా?

తను ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడదామనే ప్రయత్నంలో ఆశించిన ఫలితం చేరువలో ఉండగా, 

‘ఆడపిల్ల ఉద్యోగాలు చేసి ఊళ్లేలాలా?’ అని నిరాశపరిచి, వాళ్లే ఒక సంబంధం చూసి అదే ఖాయపరిచి, వరుడి వివరాలు తనకి తెలియజేయకుండా గోప్యత ఉంచిన తల్లిదండ్రుల అధికార నిర్ణయం తప్పా?

వాళ్లని అడిగే ధైర్యం, స్వతంత్రత  లేని తనది తప్పా?

కనీసం వరుడిని చూసే వీలు కూడా లేకుండా, మిగిలిన వాళ్ళు వచ్చి సంతలో పశువును బేరమాడుకున్నట్లుగా వివిధ ప్రశ్నలు, ఇంటర్వ్యూలతో పెళ్ళిచూపుల తతంగం తప్పా?


కాబోయే అల్లుడు భాగ్యవంతుడని మురిసిపోతూ, అతని విద్యార్హతలు, గుణగణాలు విచారించకపోవడం తల్లిదండ్రుల తప్పా?

తమ స్తోమతకు మించి భారీగా కట్నకానుకలిచ్చి, లాంఛనాలతో పెళ్లి చేసిన తల్లిదండ్రుల తప్పా? 


నిత్యం 30 మందికిపైగా, వృద్ధులు అధికంగా సభ్యులు ఉండే ఆ ఉమ్మడి కుటుంబంలో, మూఢాచారాలు, సాంప్రదాయ కుటుంబంలో టీనేజ్ పిల్లను కోడలిగా చేసిన తల్లిదండ్రుల తప్పా?

బీద పిల్ల, రంగు తక్కువ అని కొత్త కోడలి ముందే అందరితో ప్రచారం చేసిన ఆ అత్త అహంభావం తప్పా?


తమ ఇంటికి వెలుగునిచ్చేది కోడలు అనుకోకుండా, ఒక పనిమనిషి, వంటమనిషి వచ్చిందని భావించి, ఆ విధంగా ఆమె ఎడల ప్రవర్తించిన అత్తమామల తప్పా?

ఆమెను బానిసగా చూసిన ఆ కుటుంబ సభ్యుల తప్పా?


చిన్నతనం నుంచి  మెతకతనం, మంచిమనసు, ఎల్లవేళలా  సాత్వికంగా ఉంటూ,  ఎవరినీ  నొప్పించని  ఆమె  సహజ స్వభావం  తప్పా?


తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని ఆ కసాయి, శాడిస్టు భర్త తన భార్యను అనుమానంతో వేధించడం ఆ భర్త తప్పా?

వైవాహిక జీవితంలో ఎన్నో ఆశలతో ఆ ఇంటికి వచ్చిన ఆ వధువు, శాడిస్టు, కసాయి భర్తతో తన మనసుకు సర్దిచెప్పుకుంటూ కాపురం చేసి పిల్లల్ని కనడం ఆమె తప్పా?


“ఆడపిల్లల తల్లి ఒక తల్లేనా?” అని అనేక విధాలా ఆమెను అవమానించి, నవదంపతులను ఆమె దీవిస్తే, ఆమెకు లాగా వాళ్లకి ఆడపిల్లలే పుడతారని ఆమెకు దీవించే అర్హత లేకుండా అవహేళనలతో, అవమానించిన ఆ భర్త, అత్త, తోడికోడళ్ళ తప్పా? 

‘వాళ్లు తనలాంటి ఆడవాళ్ళే కదా!’ అని అడిగే ధైర్యం లేని ఆ అభాగ్యురాలి పిరికితనం తప్పా? 


చిన్నతనం నుంచి క్రమశిక్షణ, భయభక్తులతో పెంచి, ఎవరినీ ఎదిరించే ధైర్యం లేకుండా చేసిన ఆమె తల్లిదండ్రుల పెంపకం తప్పా?


‘జీవితమంటే ఇంతే!’ అనుకుంటూ ఎన్నో కష్టాలను, బాధలకోర్చి, తన బిడ్డలను ప్రేమానురాగాలతో పెంచి పెద్దచేసి, విద్యార్హతలిచ్చి, మంచి సంబంధాలను చూసి పెళ్ళి చేసిన ఆమె తప్పా?


బిడ్డలే ప్రాణంగా భావించిన ఆ అమ్మ మనసు తప్పా?

బిడ్డల పురుడు, పుణ్యాలు పోసి, వాళ్ళ ఆలనాపాలనా చూసి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిన ఆ అమ్మతనం తప్పా?


తమ జీవితాలు తమవే అనే ప్రవర్తనతో తమ స్వార్థం చూసుకుని, తల్లి బాగోగులు, కష్టసుఖాలు పట్టించుకోకుండా ప్రవర్తించే బిడ్డల స్వభావం తప్పా?


‘నీ పెళ్లి నాడు మేము లేము, నీ కష్టాలు, బాధలకు మేము కారకులం కాము, నీ జీవితం నీది’ అనే పిల్లల దృఢ నిర్ణయం విని, ఆరుపదుల వయసులో వ్యథ చెందిన ఆ తల్లి మనసు తప్పా?


యాంపుటేషన్ చేసిన భర్తకు 4 సం. నిర్విరామంగా తల్లిలా సేవలు చేసి, ఆ భర్తను మరలా నేలమీద నిలబెట్టేట్టు చేసిన ఆ భార్యది తప్పా? 

భర్తకు నిత్యం డయాలసిస్ చేయిస్తూ కంటికి రెప్పలా సేవలు చేస్తున్న ఆ భార్యది తప్పా?


ఆర్థిక స్వావలంబన, వాక్స్వాతంత్ర్యం కూడా లేకుండా చేసి, భార్యను బానిసగా చూస్తున్న ఆ కసాయి భర్తది తప్పా?


మానవత్వంతో సేవలు చేస్తున్న విధి వంచితురాలైన ఆ అభాగ్యురాలిది తప్పా?


విధాత లిఖితమా?

విధి వంచితమా? కర్మఫలమా? ఎవరిది తప్పు? ఏది తప్పు?

ఈ ప్రశ్నకు బదులు ఏది?


అంతు లేని జీవిత అగాధానికి ఆవలి ఒడ్డు కానరాని ఆ అభాగ్యురాలి బతుకు ఇంతేనా?


ఈ ప్రశ్నకు బదులు ఏది? తుది శ్వాసే ఆమెకు సమాధానమా?


... నీరజ హరి ప్రభల.


===================================







Pusthaka Dinotsavam - Telugu Poem | Neeraja Hari Prabhala 

పుస్తక  దినోత్సవం తెలుగు కవిత | నీరజ హరి ప్రభల

Published in manatelugukathalu.com on 23/04/2026


📖 రోజుకు కనీసం 10 నిమిషాలు చదవండి 📚 ఒక మంచి పుస్తకం ఎంచుకోండి ✨ జ్ఞానాన్ని పంచుకోండి.

మంచి  పుస్తకమే  మంచి స్నేహితుడు. 

జీవితమే  ఒక  పాఠశాల.  

అనుభవాలే  పుస్తకాలు.

నేను  నిత్య  విద్యార్థిని -

నిరంతర   అన్వేషిణి.

చదువుకోవాలి -  చదువు  కొనగూడదు.

అంతులేని  విజ్ఞానం  - అమూల్యమైన  సంపద.

పుస్తకమే  ఒక  పెన్నిధి - అదియే  నా నిధి.

తీరదు  నా దాహం -  చదువుతుంటే   ఆనందం.

లభిస్తుంది శాంతి -  కలుగుతుంది  సంత్రృప్తి.

అవ్వాలి  మంచి  రచయితగ - కావాలి  వాగ్దేవి  అనుగ్రహం.

ఇవ్వాలి  మీ అందరి  దీవెన  - అదియే  నా కమితానందం. 


ఎన్ని   పుస్తకాలు  చదివినా  ఇంకా  ఇంకా  చదవాలనిపిస్తోంది.  

సమస్త  విజ్ణానానికి   జీవితమంతా  సరిపోదు.


....... నీరజ హరి ప్రభల.


======================================






Emitee Jeevitham Endukee Avedana - Telugu Poem | Neeraja Hari Prabhala 

ఏమిటీ  జీవితం? ఎందుకీ  ఆవేదన? తెలుగు కవిత | నీరజ హరి ప్రభల

Published in manatelugukathalu.com on 22/04/2026


జీవితం అంటే ఏమిటి? ఆశలు ఎందుకు వస్తాయి… నిరాశ ఎందుకు వెంటాడుతుంది?

ఈ కవితలో ఒక మనసు తనతోనే మాట్లాడుకుంటుంది.


ఏమిటీ  జీవితం? ఎందుకీ  ఆవేదన?

జీవనకలల  ఆశలు  అడియాశలేనా?

కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న  జీవిత నౌక  అద్దరికి  చేరేనా?

కోరికల పుష్పాలతో  ఊహల  అల్లికల   మాలలు కట్టి,

జీవనవాహినికి   కంఠమాలగా  అలంకరించి,

ఆశల పందిరిలో  ఉంచి   ముచ్చటగా  మురిసిపోతిని.

అది ‘మూడునాళ్ల ముచ్చటాయె’ అని తెలిసి  మూగబోయె  నా మనసు.

ఆశ-నిరాశల  ఊగిసలాటలో

సయ్యాటల  ఓటమే  మిగిలే.

ఎంత  వగచినా  ఏముంది? 

కూసింత  ఆదరణ, కొండంత ఆప్యాయతకై  మది  తపనపడె.

కనుచూపుమేరకూడా  అది  కానరాదని  తెలిసె.    

కాలము,  ప్రాయము  తిరిగి రాదు కదా!

దేనినీ  మనము  ఆపతరమా!

విధి లిఖితాన్ని  మార్చ  ఎవరి తరము?

మనోవ్యాధికి  మందులేదు కదా!

నిరాశ, నిస్పృహలను  పారద్రోలి,

మనోధైర్యాన్ని  పెంపొందించుకుని,

అలుపెరుగని  ఆత్మస్థైర్యంతో  ముందడుగు  వేసి,

ఏకాకినై  జీవనసౌధంలో  విశ్రమిస్తూ,

ఈవిశాలవిశ్వంలో   రేణువునై,

తుదకు  వాయువులో  లీనమవుతా!

ఒంటరిగా  భువికేగితిని. 

ఏకాకిగా  దివికేగుతాను. 

ఇదే  జీవితం - ఇంతే  జీవితం.

జీవిత  సత్యమిదే! 


…..నీరజ  హరి  ప్రభల.


===============================








ఒక స్త్రీ జీవితం… ప్రేమ కోసం ఎదురుచూపుల్లో గడిచిన ఓ మౌన గాథ.

Padaharanala Paduchupilla - Telugu Poem | Neeraja Hari Prabhala 

పదహారణాల పడుచుపిల్ల.. తెలుగు కవిత | నీరజ హరి ప్రభల

Published in manatelugukathalu.com on 02/04/2026


దహారణాల పడుచుపిల్ల నవ వధువుగా  

అత్తవారింట అడుగిడి అంతటా తానే అయి,

బాద్యతలు- బంధాలు పెంచుకుని,

ఆత్మీయత- అనుబంధాలతో ముడివేసుకుని,

ఆ ఇంటితో, ఆ మనుషులతో మమేకమై,

తుది వరకూ అదే తన సుస్థిర స్థానమని తలచి, 

సర్వమూ తానే  అనే మెప్పు పొందాలని తపించి,

వయసుని- మనసుని పణంగా పెట్టి ,

తన కోరికలు- ఆశయాలను అణచిపెట్టి, 

తన భర్తే  తన  సర్వస్వం  అన్నట్లు  భ్రమించినా కూడా,

నీవంటే ఇష్టం లేదు, ప్రేమలేదని చెప్పి,

వెళ్ళి పొమ్మని వేథిస్తున్నా,

భర్త  చులకనను అత్తింటివాళ్ళు  ఆలంబనగా మలచుకుని,

అనేక రకాల ఆరళ్ళు  పెట్టి  తిండి తిప్పలు లేక బాథ పెడితే,

పరువే ప్రాణంగా బ్రతికే  బీద తల్లితండ్రుల  మనసు కష్టపెట్టలేక,

ఓర్పుతో, నేర్పుతో అత్తింట అందరికీ సేవలు చేసి,

ఏనాటికైనా తన జీవితంలో వెలుగు వస్తుందనే ఆశతో,

వయసు ఆకర్షణ ప్రభావం వలన ప్రేమ లేని భర్త సంసారంచేస్తే,

పిల్లలను కని,  వాళ్ళని చూసి మురిసి పోయి,

ప్రేమతో పెంచి పెద్దచేసి, వాళ్ళే తన ప్రాణమని తపించి,

వాళ్ళ భవిష్యత్ పునాదులకోసం అహర్నిశలు శ్రమించి, 

భర్తే ఊపిరి, పిల్లలే ప్రాణం అన్న భావనలో బ్రతికి,

పిల్లల మనసులను అర్థం చేసుకునే జీవన సహచరుడిని  శోధించి, చూసి ,జతకూర్చి,

వాళ్ళ ముచ్చటైన సంసారాలను చూసి సంతసించి,

పిల్ల- పాపలతో కళకళ లాడే వాళ్ళ జీవితాన్ని చూస్తూ, మమకారంతో వాళ్ళను వీడి యుండలేక,

రెక్కలొచ్చిన పిల్లలు తమ వద్ద ఉండరన్న  సత్యాన్ని గ్రహించి ,

నడివయసు  దగ్గరవగానే నేనున్నానంటూ గుర్తుచేసే అనారోగ్యాలు,....అయినా సరే 

తనను తాను చూసుకోకుండా భర్త కోసం పరితపించి,

మలి వయసులో అన్నా  భర్త ప్రవర్తన మారి  మాట- మనసు కలుపుకోవాలని తపిస్తూ,

'వట్టి బోయిన  దానివి,నీతో పనేల? నీ దారి నీవు చూసుకో  'అనే  భర్త  నిరాదరణకు బాథ పడుతూ,

 నేను- నా ఇల్లు -  నా పిల్లలు  అనే భర్త  వెలివేతను భరిస్తూ,  

తను లేకుండా ఆ పిల్లలు ఎక్కడొచ్చారు? కన్నతల్లి తనే అని ఎదురు చెప్పే ధైర్యం లేక,

చెపితే ఆ పరిమాణాలు విషమించి బజారు బతుకు అవతుందని భయపడి గొంతులోనే అణచుకుని,

ఇది ఎవ్వరితో చెప్పేదీ కాదు- చెప్పితే తీరేదీ కాదన్న

జీవిత సత్యాన్ని  వంటబట్టించుకుని,

ఆ మలివయసులో తన నెలవేదో,తన దారి-తన గమ్యస్థానమేదో ఎరుగక,

కడదాకా  'భర్తే తన నేస్తము- తన తోడు 'అని తలచిన  ఆ  అభాగ్యురాలు,

కన్న బిడ్డలకు  తన సమస్యను చెప్పి  పరిష్కారం అడుగగా, 

'ఇది నీ జీవితం-  నీ భర్త- నీ సమస్య - నీవే సాల్వ్ చేసుకోవాలి' అన్న  వాళ్ళ  తెలివితేటలకు  పొంగాలో, కుంగాలో  తెలియని  అమాయకురాలైన, అభాగ్యురాలైన ఓ తల్లి. 

 

====================================











Parabhava Nama Ugadi - Telugu Poem | Neeraja Hari Prabhala 

పరాభవ నామ యుగాది - తెలుగు కవిత | నీరజ హరి ప్రభల

Published in manatelugukathalu.com on 19/03/2026


వస్తున్నది - ఉషస్సుతో  యుగాది వత్సరము.

తెస్తున్నది - మనస్సులో  హర్షాతిరేకము.

శుభములను  కలిగించి  శోభను   చేకూర్చే  పరాభవ సం..ఉగాది - సుఖసంతోషాలను   అందించి  మనశ్శాంతినిచ్చే   మధురోహ్లాది.

వాసంత  సమీరంలో  క్రొంగొత్త  లేలేత  మామిడి చిగురులు  తిన్న  ఆమని  కుహు, కుహు  రాగాలు పాడగా,

షడ్రుచుల  ఉగాది పచ్చడి  జీవిత  అనుభవసారాన్నివ్వగా , 

క్రొత్త  కవితలతో  కవి సమ్మేళనము  విశిష్ట  పుంతలు  త్రొక్కగా,

పండితుల  పంచాంగశ్రవణము  మదిలో   ఆశాసౌధము  నిలుపగా,

రుచికరమైన మామిడి పండ్లు - తాటిముంజలుతో  వేసవి తాపము  చల్లారగా,

మత్తు గొలిపే  మల్లెల  సుగంధాలతో మనసులెల్లా  పరిమళించగా,

వసంతకాల  ఆహ్లాదభరిత  ఆనంద  సౌరభాన్ని  ఆస్వాదిస్తూ,

మనో వికారాలు లేకుండా, రాకుండా  సంతోషంగా  పరాభవ  నామ  సం... ఉగాది  వసంతలక్ష్మిని  స్వాగతిద్దాం. 

మదినిండా  ఆనందానుభూతులను  పొందుదాం.


======================================














మహిళా మణులందరికీ   హృదయ పూర్వక  శుభాకాంక్షలు.🌷🌷

Sthree - New Telugu Poem Written By Neeraja Hari Prabhala 

Published in manatelugukathalu.com on 08/03/2026

స్త్రీ - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


పరిపూర్ణత కు  శ్రీకారం స్త్రీ.

మమకారానికి  సాకారం  స్త్రీ.


కరుణతో లాలించినా, కర్తవ్య దీక్షతో పాలించినా, తల్లిగా  దీవించినా , ధర్మపత్ని గా నడిపించినా  ఆమెకు  సాటి  ఎవరూలేరు, రారు. అందుకే   సృష్టి  యావత్తు  ఆమె  కనుసన్నలలో  నడుస్తోంది. విశ్వవ్యాప్తిగా  ఉండే  చైతన్య  శక్తియే  స్ర్రీ. ఆమెకు నీరాజనాలు పట్టే  సంస్కృతి  మనది. వేదాలు, ఇతిహాసాలు‌  పురాణాలలో  ఆమె పాత్ర అమోఘం.  అద్వితీయం.


" ఉపాథ్యాయాన్ దశాచార్య  ఆచార్యానాం  శతం పితాః, సహస్రంతు  పిత్రూన్  మాతా గౌరవేణాతి  రఛ్ఛతే."


పదిమంది  ఉపాధ్యాయుల కంటి  ఒక  ఆచార్యుడు, వంద మంది  ఆచార్యుల  కంటే  ఒక  తండ్రి, వేయి మంది  తండ్రుల  కంటే  ఒక తల్లి  సదా  పూజనీయురాలు  అని  మను స్ర్మృతి  చెబుతున్నది.


"మాతృ దేవో భవ,  పితృ దేవోభవ " అని  తల్లికే  తొలి  నమస్కారం  చేయాలి అని  ఉపనిషత్తులు  చెపుతున్నవి.


'శ్రీ ' (సంపద), స్త్రీ ( భార్య) ఈ  రెండిటితోనే  పురుషుడికి  పూర్ణత్వం  సిధ్దిస్తుంది. ఆమె తోనే ఆ ఇల్లు   కళకళ లాడి  ఆ వంశం   వృధ్ధి చెందుతుంది. స్త్రీ  దుఃఖించ కూడదు , ఆమె ఖేదం  ఆ వంశ  నాశనం  అని కూడా  మను స్మృతి  చెబుతున్నది. 


"పితా రక్షతి  కౌమారే,  భర్తా రక్షతి  స్థావిరే,

పుత్రా నస్త్రీ  స్వాతంత్ర్య మర్హతి". అని స్త్రీ  రక్షణ బాధ్యత  పురుషునికే  అప్పగించాడు మనువు. బాల్యంలో తండ్రి, యౌవనంలో భర్త, కౌమార, వృథ్థాప్యంలో  బిడ్డలు  ఆమెకు  రక్షణ కల్పించాలని  మను  థర్మం  శాసిస్తున్నది.


"యత్ర నార్యేస్తు పూజ్యంతే  రమంతే తత్రదేవతాః". ఎక్కడ  స్త్రీని  పూజిస్తారో  అక్కడ దేవతలు నివసిస్తారు . అందుకే  స్త్రీ  సర్వత్రా పూజ్యనీయురాలు. ఆమెకే  అగ్రతాంబూలం .


అతని శక్తి " వధువే." 


వివాహమంత్రాలు  వధువుని మహారాణి గా పేర్కొన్నాయి." గ్రృహాన్గఛ్ఛ  గ్రృహపత్నీ చథా సోవశినీత్వం  విదధమాదాసి"  అని ' నీవు  మా ఇంటికి  అతిథిగా  వచ్చి , అధిపతిగా మారి  మాచే పుణ్య కార్యాలు , యజ్ఞ యాగాలు   చేయించి  మమ్మల్ని  ముందుకు  నడిపించటానికి  మా ఇంటికి రావాలి ' అని వరుడు  వథువుని  పెళ్ళిలో  హామం  చేసేటప్పుడు  ప్రాధేయపడతాడు.


కన్యాదాన  సమయంలో  తండ్రి  ఆమెను  లక్ష్మీ  స్వరూపంగా భావించి  కన్యాదానం చేస్తాడు. అందుకే  వథువుని  సర్వాలంక్రృతురాలిని  చేసి నడిపించకుండా   ధాన్యం  పోసిన  వెదురు  బుట్టలో మంగళ వాయిద్యాలతో తీసుకుని వస్తారు.వివాహ తంతు  అయినాక  కూడా ఆమె ను నడిపించకుండా " ఉత్తరా  రథస్యోత్తంభనీ, వాహావుత్తరాభ్యాం యన్నక్తిః’; ‘అరోహయన్తీముత్తరాభి రభిమన్త్రయతే’... - రథం మొదలైన వాహనాల మీద కూర్చోపెట్టి వరుడి  ఇంటికి  తీసుకు వెళ్లాలని  వివాహమంత్రాలు చెబుతున్నాయి.


మొత్తం వివాహ ప్రక్రియలో వరుడే వధువుని తనకు భార్యగా  ఉండాలని " నాతిచరామి"    అని వరుని  చేతే  ప్రమాణం చేయించి ,  ఆమెను  అభ్యర్థించి, ఆమె  అనుమతి మేరకే  తన ఇంటికి తీసుకువెళ్లాలని   వేద మంత్రాలు  వల్లిస్తున్నాయి.


నవమాసాలు మోసి ,  మరోజన్మ (ప్రసవం) ఎత్తి   బిడ్డ కు  ప్రాణం పోసే ప్రాణ శక్తి  స్త్రీ.

భర్త ను  సేద తీర్చే  చైతన్య శక్తి  స్త్రీ.

మనిషిని  పోరాట యోథునిగా తీర్చి దిద్దే శక్తి  స్త్రీ.

తన శ్వాసను వదిలైనా సరే  బిడ్డకు  శ్వాసను అందించాలని  నిస్వార్థంగా  కోరుకునే  ప్రాణి  ఈ భూమి మీద  కేవలం  ఆమె మాత్రమే. 


అందుకే  వేదాలన్నీ ఆమెకు  అంతటి  ప్రాముఖ్యత ఇచ్చాయి . కనుకనే  ఆమె " వేద స్వరూపిణి " అయినది.


====================================









Rangula Sarada Holi - New Telugu Poem Written By Neeraja Hari Prabhala Published in manatelugukathalu.com on 05/03/2026

రంగుల సరదాహోళి - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


రంగుల సరదాహోళి….రసరమ్యకేళి.

సరాగాల హోళి….సరస సయ్యాటకేళి.


హోళికా  దహనమైన  హోళి.

పుడమినిండా  పున్నమికాంతులు  విరజిమ్మే   వివిధ వర్ణాల హోళి. 

 కడలి అలల  పొంగులతో  పోటీపడే  మానస  సంద్రకేళి  హోళి.

ఈ పండుగ  ఎప్పుడెప్పుడొస్తుందా   అని  వేయికళ్లతో  ఎదురుచూసే  హోళి. 

 నవదంపతులు  ఆనందానుభూతులను  ఆస్వాదించే  అందాల హోళి.

పిల్లలు‌, యువతలు  ఉత్సాహంతో  ఛెంగున  గంతేసే  ఛాంగుభళా హోళి. 

ముదిమి వయసుని  మరిపించే  కేళి   హోళి. 

శారీరక, మానసిక  మనోరంజక  మధురహోళి.

కామదహనాన్ని  జరుపుకునే  హోళి.

వాడ వీధులు   సరదా కేరింతలతో  హోరెత్తించే  హోళి.

బావామరదళ్లు   సరస సల్లాపాలతో సయ్యాటాలాడే  హోళి.

ప్రేమికుల సరదాల కేళి  ఈ హోళి. 

మనుషుల మధ్య  స్నేహ  సౌభ్రాతృత్వాన్ని  పెంపొందించే  హోళి.

శతృవులను  మిత్రులుగా  చేసే సహేళకేళి  ఈ హోళి.  

రంగురంగుల  పువ్వులతో  రంగరించే హోళి.

దాండియా, కోలాటాలు, డప్పు నృత్యాలతో  నాట్యమాడే నయనానంద  హోళి. 

అందరి  పెదవులపై  చిరునవ్వు దరహాస కాంతి  వెలిగే హోళి. 

మనుషుల  ముఖకవళికలను  రంగుల మయం చేసే  రసకేళి హోళి. 

సరాగరంజిత  రంగుల హోళి  అంటే  సరదా  ఎవరికుండదు? 

నవరస మిళితమైన  సమ్మోహన హోళి. 

మరలా మరలా  రావాలని  వాంఛించే  వాంఛకేళి  హోళి.

అహర్నిశలు  శ్రమకోర్చే సైనికులు  సైతం  సంతోషంగా  జరుపుకునే  మధురానుభూతుల హోళి.  

పామరులు, శ్రామికులు  గజ్జలకాళ్లతో  చిందేసే  చిత్తరాల  రంగుల   హోళి.  

నిత్యం  మన  జీవితాలలో  ఉండాలి  ఈ  రంగులహోళి. 

రావాలి  మళ్లీ మళ్లీ   హోళి. 

మదినిండా  కావాలి  రంగు రంగుల  హోళి. 

=============================














Mathrubhasha Dinotsava Subhakankshalu - New Telugu Poem Written By Neeraja Hari Prabhala Published in manatelugukathalu.com on 21/02/2026

మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


మర్మమెరుగని, మచ్చలేని మన మాతృ

భాష. మమతలెరిగిన, మధువులొలికే మన తెలుగు భాష.


సుగంధ పూతోటలో వికసించిన పుష్పమై, మదిలోని భావాలకు తెలుగు భాషా సౌరభం రంగరించుదాం.


ప్రేమ సౌభ్రాతృత్వంతో, దేశ ఔన్నత్యాన్ని పెంచుదాం. ప్రేమామృతాన్ని పంచుతూ, ఆ మధువు లోని మాధుర్యాన్ని గ్రోలుదాం. కామధేనువు వంటి తెలుగు తల్లి క్షీరామృతాన్ని గోవత్సలై త్రాగుదాం.


ఆ తల్లి ముద్దు బిడ్డలై కీర్తి శిఖరాలను అధిరోహించి నలు దిశలా కీర్తి బావుటాలను ఎగురవేద్దాం. ఆచంద్ర తారార్కం అఖండ తేజస్సుతో ప్రకాశిద్దాం.


తెలుగు తల్లికి పట్టుబట్ట కట్టి, అచ్చ తెలుగు నుడికారంతో ఆ తల్లి నుదుటన కుంకుమ దిద్దుదాం. ఘనకీర్తిని పూలమాలగా వేసి మృతమవుతున్న మన మాతృభాషను అమృతమయం చేద్దాం.
















Eswara - New Telugu Poem Written By Neeraja Hari Prabhala 

Published in manatelugukathalu.com on 15/02/2026

ఈశ్వరా - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

ఈశ్వరా ! నిరాకారుడు, నిరహంకారుడు, త్రిగుణాతీతుడివీ కనుక ఏ రూపమున నిన్ను కొలువగలను ? ఏ విధముగా అర్చించగలను ?


పవిత్ర నదీ జలాలతో నిన్ను ఆపాదమస్తకం అభిషేకిద్దామంటే పవిత్ర గంగనే నీ శిరస్సున ధరించితివి కదా !


హాలాహలమును గళమున ఉంచుకొని వేడెక్కిన నిన్ను పరిమళ చందనములతో చల్ల పరుద్దామంటే హిమశిఖరమే నీ ఆవాసము కదా ! 


స్వర్ణ మణి మాణిక్యాలతో నిన్ను పూజించుదామనుకుంటే నాగరాజు అయిన వాసుకియే నీ కంఠాభరణము కదా ! 


శ్రృతిలయలతో శ్రావ్యంగా గానం చేద్దామంటే సామగానలోలుడివీ, ఓంకార స్వరూపుడివీ నీవే కదా ! 


నాద ధ్వని వినిపించుదామనుకుంటే ఢమరుకాన్నే చేతిన పూనిన ప్రణవ నాదమునివి నీవే కదా !


వేద పారాయణము చేసి నిన్ను ఆనందింప చేద్దామనుకుంటే వేదోపాసన చేసిన దక్షిణామూర్తివి నీవే కదా ! 


పట్టు వస్త్రములతో నిన్ను సత్కరిద్దామనుకుంటే జింక చర్మమే నీ ఆఛ్ఛాదనము కదా ! 


న్రృత్య నాట్యాలతో నిన్ను అలరిద్దామనుకుంటే నాట్యాధిపతి నటరాజ స్వరూపుడు నీవే కదా !


పంచ భక్ష్య పరమాన్నములతో సంత్రృప్తిగా నీకు నివేదన చేద్దామనుకుంటే సాక్షాత్తు అన్నపూర్ణయే నీ సతి కదా !


షోడశోపచారములతో నీకు సేవ చేద్దామనుకుంటే వినయ విధేయుడైన నందీశ్వరుడు నీ సేవకుడు కదా !


సుగంధ పరిమళ పుష్పాలతో అర్చించి పుష్పమాల వేద్దామనుకుంటే సర్పాన్నే కంఠమాల గా ధరించితివి కదా !


మధురమైన ఫలాలను సమర్పించుదామనుకుంటే గరళాన్ని మ్రింగిన గరళ కంఠేశ్వరుడువి నీవే కదా !


పవిత్ర మందిరమున నిన్ను ఉంచి పూజించుదామనుకుంటే స్మశానమే నీ ఆవాసము కదా !


ఎచట ఉన్నావో నీ ఉనికిని కనుగొందామనుకుంటే

ఆది- అంతము లేని సద్యోజాతకుడివి నీవే కదా !


ఏమి ఇచ్చి నిన్ను సేవించుకోగలను ?

ఏ సేవలతో నిన్ను సంత్రృప్తిపరచను ?

ఏ రూపమున నిన్ను పూజింతును ?


ఏమున్నది నా వద్ద ? " నేను - నా " అనే అహం తప్ప. అహం వీడి సత్యము తెలుసుకున్నాను. 


నాలో జ్వలిస్తున్న జీవన జ్యోతివి నీవే. 

నాది అనబడే ఈ దేహము నాది కాదు - నీవు ఇచ్చినదే. 


అహంకార దర్పములను వీడి  నిర్మలమైన మనస్సును నీకు అర్పించి  నిన్ను అర్చించి, నీలో ఏకమై, మమేకమై శివైక్యమును పొందుతాను ఈశ్వరా !


===========================================












Sankranthi Dhanurmasam - New Telugu Poem Written By Neeraja Hari Prabhala Published In manatelugukathalu.com On 14/01/2026

సంక్రాంతి ధనుర్మాసం - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


ధనుర్మాస వేళ  శీత గాలులు వీచగా, వేకువనే   లేచి  రంగనికి  తానమాడవలె  చెలీ !

జివ్వుమనే  చల్లని నీరు  మేని సోకగా,అల్లరి కన్నయ్య   చిలిపిగ  నా  చేయి పట్టి  లాగి  జలక్రీడ లాడుచూ  పరిహసింపగా, ఆ  నవ్వు చూసి  నాఎద  ఝల్లుమనియె.

అయిన  నా భ్రమ కానీ  నల్లనయ్యకు  ఏల సోకును చలి?

 గోప సరోవరమున గోపికలతో  రాసక్రీడ సలుపుట   కృష్ణయ్యకు  పరిపాటియే కదా!  

పున్నాగ, మల్లికా, జాజి,  సంపంగి  పూవులేరి  తేవలె,


చెలి రావే! పోయెద  కోవెలకు.

సుగంధ  పరిమళ పూలకు  మనస్సునే  తావిగ  చేసి మాలగ  మలిచి  రంగని మెడలో  వేసి,  ఆమేని సుగంధము  ప్రస్ఫుటించగా  పరవశముతో నే  పాశురము  పాడగా,

ఆ గానామృతానికి  మెచ్చి  చిరు దరహాసము తో  నీవు  చేతులు చాచగా,

అర్థనిమీలిత  ధృక్కులతో   నీ దరి చేర  ప్రణయ  కౌగిలిలో  ఓలలాడుదమా! 

మోహన రూపా ! గోపాలా !

=======================================

  







Nuthana Samvatsara Subhakankshalu - New Telugu Poem Written By Neeraja Hari Prabhala Published In manatelugukathalu.com On 01/01/2026

నూతన సంవత్సర శుభాకాంక్షలు - తెలుగు కవిత

రచన: నీరజ హరి ప్రభల 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


అందమైన  జీవితము - ఆనందాలకు  నిలయము.

వచ్చింది  ఉషస్సుతో నూతన  సంవత్సరము.

తెస్తున్నది  మనస్సులో  హర్షాతిరేకము.

తెస్తున్నది  వెలుగు రేఖలు - పోగొడుతుంది  చీకటి వ్యథలు.

మిగులుస్తుంది  ఆశాసౌధాలు.


తెస్తుంది  ఉప్పొంగే  ఉత్తేజము - ఇస్తుంది అమితోత్సాహము.

పరిమళిస్తుంది  జీవిత పుష్పము - పరవశిస్తుంది  మనోనేత్రము.

ఇస్తుంది  ప్రపంచానికి శాంతి ని -  కలిగిస్తుంది  మానవాళికి  స్పూర్తిని.


ఆశాకాంతి  కానున్నది  నూతన సంవత్సరం.

సమైక్యజ్యోతిగా  రానున్నది  ఆనంద వత్సరం.

మలయ  మారుతంలా  వచ్చి  మలయవీచికలు వీచగా, 

పుష్యమిలో  పుష్కలమైన ధాన్యరాశులు, పాడి పంటలతో, 

కళ కళ లాడే  లోగిళ్ళతో వస్తుంది  నూతన  సంవత్సరం.

ఇస్తుంది  ఆనందహాసం - భాసిస్తుంది  తేజో కిరణం.

స్వాగతిద్దాము  మనసారా -  వీక్షిద్దాము కనులారా.                

      


-నీరజ  హరి ప్రభల

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page