top of page

నేటి మేటి బాలలం

Updated: Mar 14

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #NetiMetiBalalam, #నేటిమేటిబాలలం, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 27

Neti Meti Balalam - Somanna Gari Kavithalu Part 27 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 07/03/2025

నేటి మేటి బాలలం - సోమన్న గారి కవితలు పార్ట్ 27 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


నేటి మేటి బాలలం


మేము చిన్న పిల్లలం

మమకారాల మల్లెలం

మేటి రేపటి పౌరులం

సాటి లేని వీరులం


రవిచంద్రుల వెలుగులం

వెన్నెలమ్మ జల్లులం

అక్షరాల తోటలోన

ఆడుకునే బాలలం


విరబూసిన పూవులం

అందలొలుకు మాలలం

పున్నమి నాటి జాబిలి

నిండు పండు వెన్నెలలం


సెలయేరుల గలగలం

తారకమ్మ మిలమిలం

కడిగినట్టి ముత్యాల

సొగసులీను తళతళలం


భరతమాత బిడ్డలం

జగతి ప్రగతి బాటలం

మేమే!మేమే! బాలలం

జీవజలపు ఊటలం
















తాతయ్య హితవు

----------------------------------------

మాట మంచిదైతే

ఊరంతా బంధువులు

అహం ఎక్కువైతే

అడుగడుగునా ఇడుములు


వ్యతిరేక భావనలు

ప్రగతికవి అడ్డంకులు

ఆదిలోన త్రుంచితే

ఎన్నెన్నో లాభములు


శ్రేష్టమైన తలపులు

చేకూర్చును శుభములు

బాగుపడును బ్రతుకులు

వర్ధిల్లును గృహములు


శుద్ధమైన చూపులు

ఒనగూర్చును మేలులు

బాగుంటే నడతలు

తెచ్చును పేరుప్రతిష్ఠలు

తెచ్చిపెట్టును ఘనతలు









అక్షరాలు అమూల్యం

----------------------------------------

శక్తిగలవి అక్షరాలు

అందరికీ అవసరము

కాంతులీను కాగడాలు

చక్కజేయు జీవితాలు


వెలిగించును మస్తకాలు

జీవమున్న అక్షరాలు

అజ్ఞానం తొలగించి

మార్చునోయి తలరాతలు


అక్షరాల తోటలోన

ఆనందం గుండెలోన

పంచిపెట్టును వినోదము

పెంపుజేయును వికాసము


వమ్ము మాత్రం చేయవు

నమ్మితే అక్షరాలు

అమ్మలా ఆదరించి

చేయునోయ్! పలు మేలులు










బడి అమ్మ ఒడి

----------------------------------------

బడి మాకు అమ్మ ఒడి

గురువులుండు దైవ గుడి

బాలలుండే చోటు

అక్షరాల నారు మడి


నేర్పుతుంది నడవడి

తరుముతుంది అలజడి

మెత్తని అమ్మ ఒడిలా!

సేదదీర్చు మదికిలా!


అందమైన మా బడి

ఆనందాల సవ్వడి

తరిమి తరిమికొట్టును

మానసిక ఒత్తిడి


జ్ఞానమనే పుత్తడి

పంచుతుంది మా బడి

జీవుతాలను చేయును

సొగసులీనే సింగిడి


లేదు లేదు గారడి

చేయదోయ్! దోపిడీ

అక్షరాల అంగడి

విజ్ఞానమే రాబడి


"పిల్లలుండు చోటు బడి"

అని అనాదిగా నానుడి

బ్రతుకు దిద్దు కార్యశాల

భవితనిచ్చు పాఠశాల










విజ్ఞాన కేంద్రం పాఠశాల

----------------------------------------

పాఠశాల లేని ఊరు

అభివృద్ధికి బహు దూరము

విజ్ఞానపు సెలయేరు

గురుదేవులుండే స్థలము


పవిత్రమైన ఆలయము

బాలబాలికలకాశ్రయము

అజ్ఞానము తరిమివేయు

భువిని విజ్ఞాన కేంద్రము


సేదదీర్చు పాఠశాల

మెత్తని అమ్మ ఒడిలా

వెలిగించును మస్తకము

తెలియజేయును సమస్తము


విద్యాబుద్ధులు నేర్పే

చక్కనైన కార్యశాల

అందమైన పర్ణశాల

అందరికీ చంద్రశాల


క్రమశిక్షణ నేర్పించును

సంస్కారం అందించును

సాటిలేని పాఠశాల

మేటియైన పాఠశాల


కాలం విలువ తెలుపును

జీవితాలను దిద్దును

ఉజ్వల భవిత అందించు!

బ్రతుకు తెరువు చూపించు!


తలరాతలు వ్రాసేది

జీవితాలు మార్చేది

పాఠశాల అవనిలోన

పరిపూర్ణతనిచ్చేది


వికాసమే విరిసేది

వినోదమే పంచేది

పాఠశాలకు మించింది

లోకంలో లేదు లేదు


-గద్వాల సోమన్న


Comments


bottom of page