top of page

నిజాయితీ నిడివి

#NijayitheeNidivi, #నిజాయితీనిడివి, #LakshmiRaghavaKamakoti, #లక్ష్మీరాఘవకామకోటి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Nijayithee Nidivi - New Telugu Story Written By Dr. Lakshmi Raghava Kamakoti

Published In manatelugukathalu.com On 19/08/2025 నిజాయితీ నిడివి - తెలుగు కథ

రచన: డా. లక్ష్మీ రాఘవ కామకోటి

కథా పఠనం: పద్మావతి కొమరగిరి

లలిత చిన్న కొడుకు రాజేంద్రను చంకలో ఎత్తుకుని అన్నం తినిపిస్తూంది. 

ఇంతలో జామచెట్టు పైన ఉన్నకాకి “కావు.. కావ్“ అని అరిచింది. వెంటనే రాజేంద్ర తల పక్కకు తిప్పి కాకి వైపుకి చేయి చూపించాడు.. దానికి ఇవ్వు అన్నట్టుగా. 

“ముందు నీవు తినరా నాన్నా.. మిగిలింది ఎలాగూ దానికే.. ” అని అన్నం ముద్ద నోటి దగ్గర పెడుతూoటే పక్కకు తోసేశాడు. దాంతో ముద్ద కింద పడటం.. కాకి రివ్వున వచ్చి తినటం చూసి సంతోషంగా నవ్వాడు. లలిత కూడా వాడి మాట నెగ్గినదుకు సంతోషపడింది. 


ఇద్దరు కొడుకుల తర్వాత ఏడేళ్లకు అనుకోకుండా పుట్టిన సంతానానికి ఇష్టంగా రాజేoద్ర ప్రసాద్ అని పేరు పెట్టినా ఇంట్లో ముద్దుగా ‘రాజూ’ అనే పిలుస్తారు. తల్లికి ముద్దుల కుమారుడైనా వయసురీత్యా అన్నలతో కలవలేక పోయే వాడు. అందుకేనేమో స్కూల్ లో చాలా మందితో స్నేహం చేసేవాడు. క్లాసులో ఫస్ట్ వస్తూండటంతో టీచర్స్ కు కూడా రాజు అంటే ఇష్టం. 


ఏడవ తరగతి లో ఉన్నప్పుడు ఒకరోజు నాన్న దగ్గరికెళ్ళి ”నాన్నా, ఎవరికైనా అవసరమైనప్పుడు సాయపడాలి అని మీరు చెబుతారు కదా.. ” అంటూన్న రాజు మాటలకు ఆయన నవ్వి “ఏం కావాలి నీకు?” అన్నాడు. 


“నాన్నా, నా ఫ్రెండ్ రాముకు పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బు లేదని ఏడుస్తుంటే నేను ఇస్తానని అని చెప్పాను” సందేహంగా అన్నాడు. ఆయన జేబులోనుండీ డబ్బు తీసి ఇస్తూ

“ఇది పరవాలేదు కానీ అందరికీ ఇలా సాయం చేస్తానంటే కష్టం.. మన శక్తి కి మించి ఇవ్వలేము కదా” అన్నాడు కొడుకు తలమీద చేయివేస్తూ. రాజు ఆ డబ్బు సంతోషంగా తీసుకుని రాము ఫీజు కట్టాడు. 


స్కూలుకు పంపిన టిఫిన్ డబ్బా ఎప్పుడూ ఖాళీగా తెచ్చే రాజుని చూసి ముచ్చట పడుతూ అడిగిoది లలిత “నీకు నేను పెట్టె అన్నం సరిపోతూందా? ఇంకా ఆకలి వేస్తే చెప్పు ఇంకో చిన్నడబ్బా ఇస్తాను” అన్నది ఒకరోజు. 


“నా డబ్బాలో కొంచెం శీనుకు ఇస్తానమ్మా. వాడికి అమ్మలేదు. డబ్బా తెచ్చుకోడు. నీవు నిజంగా ఇంకోడబ్బా కూడా ఇస్తే రోజూ వాడికి ఇచ్చేస్తా.. ” సంతోషంగా అంటూన్న రాజును, “మా నాయనే.. ఈ జాలితో ఎలా బతుకుతావో ఏమో.. ” అని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. 

****

రాజు టెన్త్ లో ఉన్నప్పుడు ఒక రోజు సాయంత్రం లెక్కల మాస్టారు మూర్తిగారు రాజు ఇంటికి వచ్చారు. రామారావు నవ్వుతూ “రండి, మాస్టారూ బాగున్నారా?” అని ఆహ్వానించాడు. 


కూర్చున్న మాస్టారికి మంచినీళ్లు ఇస్తూ లలిత “మా వాడు బాగానే చదువుతున్నాడు కదండీ” అని అడిగిoది. 


“చదువు విషయంలో మీ వాడిమీద ఎప్పుడూ కoప్లయింట్స్ ఉండవమ్మా.. ” అన్నాడాయన. 


“ఏమిటి సంగతి ? టీచర్స్ అందరూ బాగున్నారా? ఈ సారి స్కూల్ రిజల్ట్ ఎంత పర్సెంట్ వస్తుంది?” అనడిగాడు రామారావు ఆసక్తిగా. 


“అవన్నీ బాగానే ఉన్నాయి.. ఈ రోజు మీకు రాజేంద్ర ఏమీ చెప్పలేదా?”


“రాజునా ? ఏమీ చెప్పలేదే ఏమైంది? ఏదైనా గొడవ పెట్టుకున్నాడా? చదువులో ప్రాబ్లమ్ లేదు కదా”


“ఈ రోజు రాజేంద్ర కు వార్నింగ్ ఇచ్చారు హెడ్మాస్టర్..”


“దేనికి? ఏం చేశాడు?” ఆందోళనగా చూశాడు రామారావు. 


“ఈ రోజు ఫ్రీ ఫైనల్ పరీక్షలో రాజేంద్ర తన పేపరు పక్కన ఉన్న వాసు కు ఇచ్చాడు. వాడు కాపీ చేస్తుంటే పట్టుకున్నాము. ఇదే పబ్లిక్ పరీక్ష లో చేసాడంటే ఇద్దరినీ పట్టుకుని డీబార్ చేస్తారు. నీ పేపర్ ఎందుకిచ్చావని రాజుని దబాయిస్తే వాసు జ్వరంగా వుందని చదువుకోలేదు అంటే హెల్ప్ చేశానని అన్నాడు. పరీక్ష లో ‘ఇలా చేస్తే పనికి రాదని’ చెప్పండి.. మీకు తెలియాలని నేను చెప్పటానికి వచ్చాను. ” అని చెప్పి వెళ్ళారు. 


ఆ రాత్రి రాజును హెచ్చరించాడు రామారావు.. లలితమ్మ భర్తతో రాజు గురించి చర్చించాల్సి వచ్చింది. అవకాశాల కోసం వెతుక్కుని ఎవరినైనా అణగదొక్కే కాలం లో రాజు ఎలా బతుకుతాడో అని బాధ పడ్డారు ఇద్దరూ. 

***** 

అన్నల వలె తనకు ఇంజనీరింగు లో ఇంటరెస్ట్ లేదని చెప్పి రాజు కంప్యూటర్ మెయిన్ గా డిగ్రీ చేరాడు. రాజు డిగ్రీ పూర్తయ్యేసరికి అన్నలు ఉద్యోగాలలో స్థిరపడ్డారు.. మంచి సంబంధాలు వస్తే పెళ్ళిళ్ళు చేశారు. ఆ తర్వాతే రామారావుకు చిన్నకొడుకు గురించిన చింత ఎక్కువైంది. ఎవరేం చెప్పినా శ్రద్దగా చేసే అతన్ని అందరూ అన్ని విధాల ఉపయోగించుకోవడం చూసి ఇప్పటి వారి లాగా కాస్త స్వార్థం తో ముందుకు పోవాలని సూచించినా రాజు బుర్రకు ఎక్కడం లేదని మరింత యోచన మొదలైంది. 


అప్పుడు అనుకోకుండా తన పాత స్నేహితుడు చిదంబరoను కలిశాడు. చిదంబరం చేస్తున్న వ్యాపారం గురించి తెలుసు కనుక రామారావు రాజు విషయం ప్రస్తావించాడు. 

రామారావు మాటలు విని “నీతో కలవడానికి ఇదో అవకాశం నాకు. ఒకే ఆఫీసు లో పని చేసిన వాళ్ళం. ఒకసారి నా టెంపరరీ ఉద్యోగం పోయేలా వుంటే.. ఆఫీసులో అందరి మద్దతు తీసుకుని నేను అక్కడే స్థిరపడటానికి కారణం నీవు రామా. కష్టం లో ఉన్నప్పుడు నీవు ఆదుకున్న విషయం నేనెప్పటికీ మరవను. ఆ పైన నా భార్య ఆస్తి కలిసి రావడం తో ఇలా వ్యాపారం లో నిలదొక్కుకున్నాను. ఇన్ని రోజులకి నీ కొడుకు కోసం అడుగుతుంటే నేను సాయ పడనా?. నీవు కోరుకున్నట్టే మనo కలిసి ఈ ఊళ్లోనే చిన్న షాప్ పెడదాం. క్రమంగా ఎదగవచ్చు. ”


“ఒక అభ్యర్థన చిదంబరం! వ్యాపారంలో సమ బాగస్తులమైనా.. రాజుకు కొన్ని నిబంధనలు పెట్టు. వాడు అనవసర దానాలు ఎక్కువ చేస్తాడు. కాబట్టి వ్యాపారం ‘గోవిందా’ అనకుండా ఉండాలి.. ” అన్న రామారావు ను చూసి నవ్వుతూ “నాకు వదిలేయ్. నేను చూసుకుంటా.. ”అని భరోసా ఇచ్చాడు.. 


అప్పుడు మొదలైన షాప్ క్రమంగా గుర్తింపు పొందసాగింది. రాజు ఒక స్థాయికి ఎదగ వచ్చు అన్న నమ్మకం కలగ సాగింది. 

*****

ఒక రోజు అనుకోకుండా బాత్ రూమ్ లో పడిపోయిన రామారావు ను ఆస్పత్రి తీసుకెడితే మైల్డ్ హార్ట్ ఎటాక్ అని చెప్పారు.. ఐ సీయూ లో రెండు రోజులు ఉన్న భర్తను కంటికి రెప్పలా చూసుకున్న లలితమ్మ, ప్రతి క్షణం తండ్రిని కనిపెట్టుకుని చూసుకున్న రాజు. వీరికి తోడుగా అమ్మ తమ్ముడు శంకరం మామయ్య ఉండటంతో ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. 


తొందరగానే ఆస్పత్రి నుండీ డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు రామారావు. పెద్ద కొడుకులిద్దరూ రెండు, మూడు సార్లు వచ్చి చూసి వెళ్లారు. 


ఒకసారి వాళ్ళు వచ్చినప్పుడు లలితమ్మ రాజు పెళ్లి ప్రస్తావన తెచ్చింది. 

“ఎవరో ఒకరు వస్తారు.. చెయ్యచ్చులే” అన్నారు తేలిక భావంతో.

 

“అదేమిటి? మీకు పెళ్లీడు వచ్చేసరికి పెళ్ళిళ్ళు చేశాం కదా. ఇప్పుడు నాన్న ఆరోగ్యం వల్ల రాజు కోసం ఇబ్బంది పడకూడదని మీకు చెబుతున్నా.. ” అని చెప్పింది లలితమ్మ.


“అమ్మా, మేము బాగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నాం. కాబట్టి సులభంగా సంబంధాలు కుదిరాయి. వాడికి పెద్ద చదువు లేకపోయినా పెట్టుబడి పెట్టి మరీ వ్యాపారం చేయిస్తున్నారు కదా.. ” కొంత నిష్టూరం బయటపడింది ఆ మాటల్లో.

 

“మీకు చదువులకు పెట్టినంత డబ్బే వాడి వ్యాపారానికి పెట్టారు. మేము ఉన్నప్పుడే వాడూ స్థిర పడాలని అంతే.. ” సంజాయిషీగా అన్నా జవాబు రాలేదు వారి నోటి నుండీ. 

ఈ సంభాషణ అంతా విన్న రామారావుకి తను ఉన్నంతలోనే రాజుకు న్యాయం చేయాలనిపించింది. రాజు కోసమైనా ఆరోగ్యం బాగుపడాలని కోరుకున్నాడు. దేవుడి దయతో ఆరు నెలల్లో నార్మల్ అయిన పరిస్థితి వచ్చింది. రామారావును చూడడానికి శంకరం తరచూ వచ్చే వాడు. 


రాజేంద్ర పెళ్లి విషయమై ప్రయత్నాలు మొదలు పెట్టారు.. ఉన్న సంబంధాలలో మెరుగైనవి రాజుకు చెప్పినప్పుడు “నాన్నా, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్ళితో నాకు ఒక బాధ్యత ఉంటుంది. నేనూ, నా సంసారం అన్న పరిధిలో ఆలోచిoచాలి. అదే నేను ఒంటరివాడిగా ఉంటే ఎంతమందికో ఉపయోగ పడచ్చు.. నన్నిలా ఉండనివ్వండి. మీరు నా గురించి ఆలోచించడం మాని ఆరోగ్యం సరిగా చూసుకోండి. మీకు సేవ చేయడానికైనా నన్నిలాగే ఉండనీ.. ” అని కాళ్ళకు మొక్కుతున్న రాజేంద్రను ఆప్యాయంగా ఆశీర్వదించారు. 


ఒకసారి తమ్ముడు వస్తే లలితమ్మ “శంకరం, మా పడక గదిలో ఉన్న ఇనపపెట్టి [iron safe, భోషాణం] చూసావు గదా”


“చూశాను అక్కయ్యా, ఎప్పుడో పాతకాలం నాటిది కదా” 


“అవును, దాన్ని ఒక మూలగా జరపాలి. ఎందుకంటే ఒకరోజు మీ బావ కాలు దానికి తగిలి పక్కనే ఉన్న బెడ్ మీదికి ఒరిగిపోయారు.. ఏమీ కాలేదు కానీ అదే మరోవైపు పడి ఉంటే తలకు దెబ్బ తగిలేది. అప్పటి నుండీ భయంగా ఉంది. రాజుకు చెబుతున్నా కానీ వాడికి తీరిక ఉండటం లేదు”


“నిజమే అక్కా, ఇంకో ముగ్గురు మనుష్యులు ఉంటే నేనే జరపిస్తా. పిలుద్దామా”


 వెంటనే ముగ్గురిని సాయంగా పిలిపించి నెమ్మదిగా పెట్టెను మూలకు జరిపారు.. వాళ్ళు వెళ్ళాక “అది లోపల సరిగా ఉందో లేదో చెక్ చేసుకో అక్క” అన్నాడు శంకరం.

 

ఎక్కడో దాచి ఉంచిన పాత తాళంచెవుల గుత్తి బయటకు తీసింది లలితమ్మ. 


దాన్ని చూసేసరికి “అదేమిటి అంతకుచ్చుగా ఇన్ని తాళంచెవులు?” అని బోలెడు ఆశ్చర్యపడిపోయాడు శంకరం.


లలితమ్మ నవ్వుతూ “నేను మా మామగారు ఉన్నప్పుడు ఒక్కసారే తెరిచాను దీన్ని. అప్పుడు అందులో ఉన్నవి ఖాళీ చేశాము. ఆయన పోయాక ఇంట్లో దృష్టి బొమ్మలా ఉంది. ” అని అన్నిటిలో పెద్ద తాళపు చెవితో తలుపు తెరిచింది. లోపల రెండో తలుపు, ఇంకా మూడో తలుపు తెరిచాక లోపల పెద్దగా ఉన్న ఖాళీ అర, ఇరువైపులా నిలువు అరలు. కింద ఒకటీ లాక్ చేసి ఉన్నాయి. అప్పుడు అర్థమైంది శంకరానికి ఇన్ని తాళం చెవులు ఎందుకున్నాయో. నెమ్మదిగా అన్నీ చూస్తూ లోపల అంతా బట్టతో తుడిచి శుబ్రం చేయాలని కూర్చుంది లలితమ్మ.


ఆ పని అయ్యాక రామారావు, లలితమ్మ శంకరం ముగ్గురూ రెండు గంటలు ఏదో చర్చించుకున్నారు.. 


సాయంకాలం శంకరం ఊరికి వెళ్ళాడు. 

వారo లోపలే రామారావు దంపతులిద్దరూ శంకరం ఊరికి వెళ్ళి వచ్చారు. హటాత్తుగా జరిగిన ఈ ప్రయాణం గాలి మార్పు కోసమే అని అందరూ అనుకున్నారు. వచ్చాక కాస్త ఉల్లాసంగా కనిపించారు దంపతులిద్దరూ. 


మరో ఆరు నెలల్లో రామారావుకి హటాత్తుగా రెండవసారి అటాక్ వచ్చింది.. హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఆయన రాజు చేతిలో ఒక కాగితo “ఇది చదువు ” అని చేతిలో పెడితే నిరాసక్తగా జేబులో ఉంచుకున్నాడు. డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయాలి అన్నారు.. అన్నలిద్దరూ రావడానికి సన్నాహాలు చేసుకున్నారు. కానీ ఆరోజే రాత్రి హటాత్తుగా కార్డియాక్ అరెస్ట్ తో ఆయన పోయారు.. 


ఇంటికి వచ్చి రామారావు కార్య క్రమాలన్నీ పూర్తి చేసిన రోజే లలితమ్మ ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. ఆమె కోసం మళ్ళీ ఆస్పత్రి వెంట మూడు రోజులు తిరిగినా లాభం లేకపోయింది. భర్త ఆరోగ్యం పై ఆందోళనతో లలితమ్మ తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. అందుకేనేమో భర్త పోయిన మూడవ రోజునే అతన్ని చేరుకుంది. అందరూ “పుణ్యాత్మురాలు” అన్నారు. 


ఇద్దరికీ చేయవలసిన కర్మకాండలన్నీ అయిన మరురోజే ఆస్తి పంపకాల గురించి ప్రస్థావన మొదలైంది. 


రాజు ఒంటరి వాడు కాబట్టి పెద్దకోడళ్ళు అత్తగారి నగలు కావాలని కోరుకున్నారు. 

రాజు వ్యాపారానికి ఇచ్చిన డబ్బే ఒక భాగం గా అవుతుందని, నాన్న పేరు మీద ఇల్లు, ఉన్న కొద్ది ఆస్తి పంపకం లో రాజుకు వాటా ఇవ్వక్కర లేదని వాదించారు పెద్దకొడుకులిద్దరూ.. దేనికీ రాజు మాట్లాడలేదు. 


 చావు జరిగిన కొద్ది రోజుల్లో ఇంటి వాతావరణం భాగాలు పంచుకోవడంతో వేడెక్కి పోవడం అతనికి భరించరానిదయింది.. 


నెమ్మదిగా కదిలి నాన్న గదిలోకి వచ్చాడు. అక్కడ మూలగా గోడ కానించి ఉన్న నాన్న చేతికర్ర చూడగానే దాన్ని తీసుకుని బయటకు వచ్చి “ఇది నేను తీసుకుంటాను” అనగానే అన్నలు “ఇదా.. “ అని పెద్దగా నవ్వి వెంటనే “తప్పకుండా అది నీకే.. ” అని ఎద్దేవాగా అంటూంటే వదినలు ముసి, ముసి నవ్వులు నవ్వారు.

 

కానీ రాజు మాత్రం ఎంతో అపురూపంగా దాన్ని తీసుకుని తన రూముకు వెళ్ళాడు.. మంచం మీద కూర్చుని తల్లిదండ్రులను గుర్తు తెచ్చు కుంటే హటాత్తుగా నాన్న ఐ సీయూ లో ఇచ్చిన చీటీ గుర్తుకు వచ్చి చొక్కాల జేబులు తడిమాడు. చివరకు దొరికిన ఒక నలిగిన చీటీ తెరుస్తే.. నాన్న దస్తూరీ.. ఆతృతగా చదివాడు.

 

"నాన్నా రాజూ.. ఇంట్లో ఎంత మంది ఉన్నా, అందరి కంటే నువ్వు చిన్నవాడివి అయినప్పటికీ.. బుద్ధిలో బృహస్పతివి. మనసులో దానకర్ణుడివి. ఏ స్వార్థపు మకిలీ అంటని మాణిక్యానివి!


 కానీ, లోకం తీరు వేరు నాన్నా. ఇంటా బయటా అందరి సమస్యల్లో నేనున్నానంటూ ముందుకొచ్చే నీ గుణం కారణంగా, నువ్వు ఏదో ఒకనాడు తీరని ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటావేమోనని నా భయం రా నాన్నా.. ఆనాడు సాయంగా.. నీకు నువ్వు తప్ప ఇంకెవరూ మిగలరేమో!


అలాంటపుడు నా చేతికర్రే నీకు ఊతం ఇస్తుంది. నా మరణానంతరం.. నీ తోబుట్టువులు ఎవరెవరు ఏమేమి పంచుకున్నా, నా చేతికర్రను మాత్రం నువ్వు చేజిక్కించుకో. జాగ్రత్త తండ్రీ.. " తనకెంతో ఇష్టమైన నాన్న.. మరణశయ్యపై ఉండి, తన చేతిలో పెట్టిన కాగితాన్ని చదివిన రాజు కళ్ళు తుడుచుకుంటూ చేతికర్ర వైపు పరికించి చూసాడు! 

ఆశ్చర్యమేమిటంటే నాన్న చీటీ చదవకుండానే తానుగా ఆ చేతి కర్రను కోరుకోవడం! 

ఇది నిజం గా దైవ నిర్ణయం అనిపించింది.. 


ఆ నెల రోజుల్లో ఇల్లు అమ్మడానికి నిర్ణయం చేసి అన్నలు వారి ఊర్లకు వెళ్లారు. 

రామారావు చనిపోయాక అతని స్నేహితులు కొంత మంది ఇంటికి వచ్చి రాజు ను కలిశారు. వారి ద్వారా తండ్రి గొప్పదనం ఎన్నో రకాలుగా తెలిసింది రాజు కు. 


ఒక రోజు రాత్రి పడుకోబోతూ నాన్నను గుర్తు చేసుకుంటూ పక్కనే గోడ కానించి ఉన్న చేతికర్ర అందుకోబోయాడు. అది పట్టు దప్పి జారి కిందపడింది. ఆ శబ్దo లో తేడా కనిపించింది. డొల్లగా ఎందుకు వినిపించింది.. విరిగిందేమో అన్న ఆందోళన తో లేచి కూర్చుని కర్ర చేతిలో తీసుకుని పరీక్షగా చూశాడు. పిడికిలి దగ్గర వంపు కొంచెo తేడా గా ఉన్నట్టు గ్రహించాడు. అక్కడ చిన్నఅతుకు ఉంది. కర్రను చెవి దగ్గరగా పెట్టుకుని కదిపితే చిన్న శబ్దం వస్తూంది. ఆసక్తి ఎక్కువై స్క్రూ డ్రైవర్ తో దాన్ని పైకి లేపాడు. 

ఆశ్చర్యం ! 


అక్కడ చిన్నపెట్టె లాటి అర.. దానిలో కనిపిస్తున్న బంగారు నాణెం. కర్ర వంపి చేతిలో వేసుకుంటే ఒకటి కాదు అయిదు బంగారు నాణేలు ఉన్నాయి. 


నాన్న తన కోసమే అందులో నాణేలు పెట్టి ఉన్నాడని అర్థం అయ్యింది.. 


అప్పుడు జ్ఞాపకం వచ్చింది శంకరం మామయ్య కార్యాలకు వచ్చినప్పుడు నీకో విషయం చెప్పాలి అనడం.. మరురోజే అతనితో మాట్లాడితే వివరాలు తెలిసాయి. ఆ రోజు ఇనప్పెట్టే జరిపాక శుబ్రం చేస్తున్నప్పుడు అనుకోకుండా కింద ఉన్నఅరలో చిన్నబట్టలో కట్టి ఉంచిన బంగారునాణేలు కనిపించాయి. 


అవి తప్పకుండా వారసత్వంగా వచ్చాయని అనిపించి శంకరం తో కూర్చుని మాట్లాడారు. రామారావు, లలితమ్మలకు అవి దొరకడం ఒక కారణం వల్లనే అన్న భావన కలిగింది. పెద్ద కొడుకులిద్దరూ రాజుకు న్యాయం చేస్తారనే నమ్మకం లేదు. పంపకాలలో రాజు ఏమీ దక్కక పోవచ్చు అన్నది విశదంగా కనిపించినట్టయ్యింది. శంకరం కూడా వారితో ఏకీభవించాడు. అవి రాజు కు చెందాలంటే ఏమి చెయ్యాలన్నది ఆలోచించారు. చివరకు రామారావు కే చేతి కర్ర ద్వారా ఇచ్చినట్టయితే బాగుంటుందని అభిప్రాయం కలగడం తో ఎలా చేయాలనేది శంకరం తో చర్చించారు.


చివరకు శంకరం ఊరికి వెళ్ళి రహస్యంగా చేతి కర్రలో పెట్టినట్టు తెలిపాడు. కానీ ముందుగా రాజుకు ఏమాత్రం తెలిసినా ఏమిచ్చేస్తాడో అన్న భయం ఉండేది. అందుకే రాజుకు చేతికర్ర తీసుకోమని చీటీ రాసి జేబులోనే పెట్టుకుని తిరిగేవారు. ఐసీయూ లో ఉన్నప్పుడు దాన్ని రాజు చేతిలో పెట్టడానికి కారణం అదే అన్నది అర్థం అయ్యింది రాజుకు. 


జరగబోయేది ముందే ఊహించి తనకు న్యాయం జరగాలన్న తాపత్రయం తో బంగారం చేతి కర్ర ద్వారా ఇవ్వడం వెనుక ఆలోచన తెలిసింది. ఇంత జాగ్రత్త తీసుకున్నoదుకు వారి ఋణం ఎలా తీర్చుకోను?’ అనుకుంటూ ప్రేమగా చేతులెత్తి అమ్మానాన్నల ఫోటోకు మొక్కుతున్నప్పుడు హటాత్తుగా తన కర్తవ్యం ఏమిటో బోధ పడింది.. 


రెండు నెలల్లో పంపకాలు జరిగాయి. 

 అన్నీ పూర్తి అయ్యాక అన్నలిద్దరూ తృప్తిగా వెళ్లారు. 


ఆ పైన పది రోజుల్లో వారు విన్న వార్తతో బుర్ర తిరిగింది. 

అమ్మిన ఇల్లు రాజేంద్ర ప్రసాద్ కొన్నాడు!. రాజు కొనగలిగాడంటే నమ్మ బుద్ది కాలేదు వారికి. 


కానీ ఇది జరగడానికి రాజు వల్ల సహాయం పొందిన వారందరూ సహాయ పడ్డారు. 

మంచి చేస్తే మంచే తిరిగివస్తుందన్న కర్మ సిద్దాంతం ఋజువయ్యింది. 


రాజు మరో రెండు నెలల్లో ఆ ఇంటిని “రామ లలితా ఆశ్రమం” గా ఏర్పాటు చేశాడు. ఒంటరిగా మిగిలిన ముసలి దంపతులకే కాదు.. అనాధలను ఆదుకునే గృహంగా కూడా మొదలు పెట్టాడు. అతని శ్రద్ద, అంకిత భావం అందరికీ తెలిసింది. ఎందరో డొనేషన్లు ఇస్తాం అని ముందుకు వచ్చారు. అనతికాలంలోనే ఎంతో మందికి ఆశ్రయం ఇస్తూ సమాజానికి ఉపయోగ పడ సాగింది. 


రాజు లోని నిలువెత్తు నిజాయితీని నిలబెట్టేందుకు నాన్నగారు ఇచ్చిన చేతికర్ర అందంగా అద్దాల పెట్టెలో అమర్చబడి ఆశ్రమ ఆఫీసులో ఇప్పటికీ వెలుగునిస్తూ, ఆశీర్వదిస్తూనే ఉంది. 


*****$****


డా. లక్ష్మీ రాఘవ కామకోటి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

డా. లక్ష్మీ రాఘవ, విశ్రాంత జంతుశాస్త్ర రీడర్ రచయిత్రి మరియు ఆర్టిస్టు

సాహితీ ప్రయాణం – 1966 లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో మొదటి కథ.

ఇప్పటి దాకా ఏడు కథా సంపుటాలు, ఒక స్మారక సంచిక, ఒక దేవాలయ చరిత్ర ప్రచురణ.

గుర్తింపునిచ్చిన కొన్ని పురస్కారాలు.

కన్నడ భాషకు అనువదింపబడిన ”నా వాళ్ళు’, “అనుభ౦ధాల టెక్నాలజీ” అన్న రెండు కథా సంపుటులు, .

అనేక సంకలనాలలో కథలు.

కథల పోటీ నిర్వహణ, పోటీలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం సాహిత్యపు అనుభవం.


రచనలే కాకుండా కళల పై ఆసక్తి, ఆర్టిస్టు గా "wealth out of waste “అంటూ ఎక్జిబిషన్ ల నిర్వహణ



bottom of page