top of page

గాడిద పాలు

#పెనుమాకవసంత, #PenumakaVasantha, #GadidaPalu, #గాడిదపాలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

ree

Gadida Palu - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 18/8/2025

గాడిద పాలు - తెలుగు కథ

రచన, కథా పఠనం: పెనుమాక వసంత

"గాడిద పాలండి గాడిద పాలు.. !" ఒకతను అరుచుకుంటూ పోతున్నాడు. 


"ఓ గాడిద పాలబ్బాయి.. !" అని అరుస్తూ మమత, కిందకు దిగి వెళ్ళేసరికి వెళ్ళి పోయాడు. 


"ఛా.. ఈ సైకిళ్ల మీద తీసుకుని వస్తారు అన్నీను. నేను కిందకు దిగేసరికి వెళ్ళిపోతా”రనుకుంటూ.. విసుగ్గా కింద చైర్లో కూలబడింది మమత. 


మళ్ళీ “గాడిద పాలు.. !" అని అరుపు వినబడితే ఈసారి గాడిద పాలను వదులు కోకూడదని.. "అబ్బాయి.. ఆగు!” అని ఇంటిగేట్ దగ్గర నుండే అరుస్తూ ఇంటి పైకి చూసింది, వాళ్ల ఆయన ఎక్కడ వింటాడోనని.


'అమ్మయ్య పైన లేరులే.. ' అనుకుంటూ సైకిల్ దగ్గరకు వెళ్ళింది. 


"ఆ రండి.. !" అంటూ పక్కింటి వాళ్ళకు పోస్తున్న

అతన్ని "ఎంతయ్య లీటర్ గాడిద పాలు" అడిగింది. 


దానికి జవాబుగా “లీటర్ మూడొందలకు తీసుకున్నాము ఆంటీ.. !” అన్నాడు పక్కింటి రెడ్డి. 


"అంత ధర ఏంటి బాబు.. ?” అని దీర్ఘం తీసింది మమత.


"అసలు ఐదువందలయితే, పొద్దునే..  బోణి బేరమని ఇచ్చా. అసలు అంతకంటే తక్కువకు ఇచ్చేది లేదు. ఈ పాలకున్న గిరాకీ మీకేమి తెల్సు? అపుడెప్పుడో విక్టోరియా మహారాణి ఈ పాలతో తానం చేసి నిమ్మపండు లాగా తెగ నిగనిగలాడేదంట. ఇంకా దీనిలో ఏవో కనిజాలు విటమిన్లు వున్నాయంట" అని గాడిద పాల విశిష్టత గురించి

గాడిద పురాణం చెప్పాడు గాడిద పాలబ్బాయి. 


"సరే ఒక లీటర్ పొయ్యి.. గాడిద పాలబ్బాయి.. !" అన్న మమతతో, "ఏమండోయి.. గాడిద పాలబ్బాయి కాదు. నా పేరు డిఎం రావు" అన్నాడు. 


"అదేమీ దిక్కుమాలిన ఇంగ్లీష్ పేరు" అని తెలుగు టీచర్ ఆయిన మమత యాష్ఠ పడింది


"గాడిద పాలును ఇంగ్లీషులో డాంకి మిల్కు అంటారంట. ఈ పాలు అమ్మటం వల్ల అందరూ నాపేరు డిఎం రావు చేసా”రని చెప్పాడు గాడిద పాలబ్బాయి గర్వంగా. 


"ఖర అండం కాదూ! మన తెలుగు భాషలో మంచి పేర్లు వుంటే.. ఆ దరిద్ర ఆంగ్ల నామం ఎందుకు? అసలు నీ పేరేంటి"


"నా పేరా.. పాపారావు. మీరు కర అండం అనేదో అన్నారు. దాని అర్థం ఏంది?" అన్నాడు తల మీది తుండు తీసి గోక్కుంటూ. 


వెంటనే రెడ్డి అందుకుని "గాడిద గుడ్డులే.. కాని పాపారావు కన్నా.. డీఎం రావు పేరే.. ! బావుంది. అదే ఫిక్సు చేసుకో.. !"


 "నేను ఖరయ్య అని పిలుస్తాను” అన్న మమతతో "ఏదోకటి పిల్సుకోండి. సరే వత్తాను. ఆ మూడో ఇల్లెగా మనది" అన్న డీఎంరావుతో,


"మాది ఆ ఇల్లు.. ! మర్చిపోకుండా, గాడిద పాలు తీసుకు రా.." అంది మమత. 


“రెడ్డి.. ! బాగా ఎక్కువ ధర పెట్టినట్లున్నాము ఈ పాలకు" అన్న మమతతో "అదేం లేదు ఆంటీ.. ! ఇంకా బయట ఎక్కువ రేట్ వుంది. మొన్న మా ఆఫీసులో లీటర్  ఐదు వందలు పెట్టీ కొన్నారు. "


"అవును నువ్వు ఎందుకు కొన్నావు? ఈ ఖరం పాలు.. !" ఆసక్తిగా కళ్ళజోడులో నుండి చూస్తూ అడిగింది రెడ్డిని మమత. 


"అదా.. ! మా ఆవిడకు ఎపుడు నీరసం అంటుంది. దీనిలో ఏ టూ జడ్ వరకు విటమిన్స్, ఇంకా ఖనిజాలు వున్నాయని యూ ట్యూబ్ లో చదివి తీసుకున్నా. మాఆవిడ ఇవీ తాగి ఆరోగ్యంగా ఉంటే.. చాలు.. !" మమత మొహంలో ఫీలింగ్స్ చూస్తూ అన్నాడు రెడ్డి. 


"మీ ఆవిడది ఎంత అదృష్టం. అట్లా పట్టించుకుని చూస్తున్నావు. మీ అంకుల్ అసలు నేను బతికి వున్నది కూడా ఆయనకు గుర్తు లేదు. ఇవి ఆయనకు ఇస్తే కాస్త బలం వచ్చి ఆయన పని ఆయన చేసుకుంటాడని అంతే.. !”


"ఏం? అంకుల్ కు బాగలేదా?" అని డౌటుగా అడిగిన రెడ్డితో "ఆయన బాగానే వున్నారు నాయనా..! రిటైర్మెంట్ అయి ఇంట్లో ఉండి బొత్తిగా ఏ పని చేయకుండా మహారాజులాగ కూర్చుని చివరకు ఎట్లా అయ్యారంటే.. టివి రిమోట్ కూడా నొక్కటం లేదు. 


‘మమ్మీ.. , ! కాస్త ఇటు వచ్చి టివి రిమోట్ నొక్కు’ అంటున్నారు. ‘అదేంటి కొంచం రిమోట్ కూడా నొక్క లేరా?’ అంటే.. వేళ్ళు నొప్పులని చూపిస్తున్నారు. 


మొన్న డాక్టర్ దగ్గరకు వెళితే షుగర్ డౌన్  అయింది, విటమిన్స్ వున్న ఫుడ్ పెట్టమన్నారు. ఆయన్ను శక్తి పురుషుడిగా కాకపోయినా బల పురుషుడిగా చేద్దామనే తాపత్రయం నాది. ఆయనకు బలం వచ్చి స్విచ్లు వేసుకుంటే చాలు.. ! నన్ను మాటిమాటికి పిలవకుండా.. !


మీ ఆవిడకు మా ఆయనకు ఇద్దరికీ బద్దకాలు వదలవులే.. ! మనిద్దరం ఇట్లా చేస్తున్నంత కాలం రెడ్డి.. !” అంటూ ముక్కు మీద జారిన కళ్ళజోడు సర్దుకుంటూ వెళ్ళింది. 


"అసలే నీరసంతో చస్తుంటే.. ఎంత సేపు? బజారు పెత్తనాలు.. !” అన్న కవితతో

"వస్తున్నా.. ! చిటికెలో నీకు బలుపు వచ్చేట్లు సారి.. బలం వచ్చేట్లు చేస్తాను" అంటూ

పాల గిన్నె పొయ్యిమీద పెట్టాడు రెడ్డి. 


మమత ఇంట్లోకి వచ్చే సరికి ఫ్యాన్ స్విచ్ ను కర్రతో వేసుకుంటున్న భర్తను చూసి 'ఇంకో నాల్గు కర్రలు కొని వుంచాలనుకుని' వంట గదిలోకి వెళ్ళినది. 


పాలు కాచి తీసుకొచ్చి భర్త సర్వ మంగళానికి ఇచ్చింది. గాడిద పాల గురించి చెప్పలేదు భర్తకు. లేదంటే దాని గురించి ఒక పెద్ద లెక్చర్ ఇస్తాడు. తను ఎవరికైనా క్లాసులు తీస్తుంది కానీ ఎవరైనా తనకు క్లాస్ తీస్తే మాత్రం పిచ్చి కోపం మమతకు. 


 

రోజు భర్తకు ఏమన్నా బలం వచ్చిందా? లేదా అని చెక్ చేస్తుంది మమత. 'కొంచం నయమే ఈ మధ్య రిమోట్ నొక్కుతున్నాడు నన్ను పిలవకుండా. 

అమ్మయ్య గాడిద పాలు పనిచేస్తున్నాయి. '


భర్త శక్తి మాన్ అవుతున్నాడని ఆనందంతో డీఎం రావు వద్ద గాడిదపాలు కొంటున్నది మమత. 


సాయంత్రం వాకింగ్ కు వెళుతూ కాస్త యాక్టీవ్ గా అయిన భర్తను చూసి 'శక్తిమాన్ కాదు శక్తి పురుష్' అని మనసులో అనుకుంది. ఈ మధ్య సర్వ మంగళం అన్ని వస్తువులను బలంగా కాలితో తంతున్నాడు. 


"ఏమండీ.. ! ఏంటి? కొంచం వంగి వస్తువులను పైన పెట్టకుండా తన్నుకుంటూ వెళ్తున్నారు" అంటే గాడిద సకిలింపు పెట్టాడు సర్వ మంగళం. 


"ఏంటి గాడిద పాలు ఇలా పని చేస్తున్నాయా? అనుకుని ఆలోచిస్తుంటే.. సర్వ మంగళం మమతను కాలితో ఒక్క తన్ను తన్నాడు. 


ఎగిరి వెళ్ళి కుర్చీలో పడింది. "అదేంటి ఎపుడు లేనిది నన్ను తంతున్నారు. ఒళ్లు తిక్క తిక్కగా వుందా?” అంది కళ్ళు పెద్దవి చేసి మమత. 


"ఏమోనే మమ్మీ.. ! చేతులు పని చేయటం లేదు. కానీ కాళ్ళు భలే షార్ప్ గా అయ్యాయి. ఏ పనైనా కాలితో చేయాలనిపిస్తుందే.. !" అని మళ్ళీ సకిలించాడు. 


ఇంతలో సర్వ మంగళం వాకింగ్ ఫ్రెండ్  సోమలింగం వచ్చాడు. 

"ఏంటి చెల్లాయి మా బావ వింతగా బిహేవ్ చేస్తున్నాడు. నిన్న పార్క్ లో పచ్చ గడ్డిపీక్కుని తిన్నాడు. ఏంటి బావా ఇది అంటే.. ? పచ్చ గడ్డి బలము అంటున్నాడు పైగా. 


ఐరన్ లోపమేమో కాస్త తోటకూర వండి పెట్టు. ఇంకా వింతగా ఎట్లా బిహేవ్ చేస్తున్నాడంటే.. వంగుని యూరిన్ పాస్ చేస్తున్నాడు. ఒకసారి వెన్నెముక సరిగా వుందో లేదో.. ఎందుకైనా ఎముకల డాక్టరుకు చూపించు చెల్లాయి. "


అపుడే లుంగీ మార్చుకుని వచ్చిన సర్వ మంగళం "ఏంటి,, మా లింగం బావ ఏదో అంటున్నాడు" అన్నాడు.

 

"ఏమిలేదులే వస్తా బావా.. ! వస్తా చెల్లాయి. " అనగానే ఒక్కసారిగా సకిలించాడు మంగళం. 


ఆ సకిలింపుకు, లింగం పరుగో పరుగు. 

'ఏమైంది ఈయనకు.. !' అని మమత టెన్షన్ పడుతుంటే.. తోటకూర కట్ చేద్దామని టేబుల్ మీద పెట్టినది తెచ్చుకుని తింటున్నాడు మంగళం. 


"అయ్యో.. ! ఇదేం ఖర్మ? పచ్చి తోట కూర తింటున్నారు. ఇంక కూరేమి తగల బెట్టను" తలకొట్టుకుంది మమత. 


మరుసటి రోజు గుళ్లో రెడ్డి కనపడ్డాడు మమతకు. "రెడ్డి మీ ఆవిడకు గాడిద పాలు పడినాయా?”


"ఆంటీ.. ! పిల్లల్ని తెగ తంతుంది. ఇదివరకు చేత్తో కొట్టేది ఇపుడు కాళ్లు ఈడ్చి తంతుంది. అర్థరాత్రి లేచి వంగుని సకిలిస్తుంది. మా ఆవిడ 

సకిలింపులకు పిల్లలు దడుచుకుంటే ఇదిగో గుళ్లో తాయెత్తులు పిల్లలకు కట్టటానికి 

తీసుకెళ్తున్నా. "


"అవునా.. ! మా ఆయన ఈ చేష్టలే చేస్తున్నారు. ఇదంతా గాడిద పాల వల్లే అనుకుంటా. అవి తాగి వీళ్లు బలపడటం ఏమో కానీ మన ప్రాణాలకు వస్తుంది ఆ తన్నులు పడలేక. "

అంటూ తన తన్నుల గోడు వెళ్ళబోసుకుంది మమత. 


"రేపు వస్తాడు ఆంటీ.. ! డీఎం రావు. నేను మానేస్తాను ఇక తీసుకోను గాడిదపాలు.”

 

"నేను తీసుకోను. ఇంకా ఏదైనా బలం వచ్చే టానిక్ యూట్యూబ్ లో వుందేమో చూడాలి.”

 

"రేపు మనమేనా? ఇంకా ఎవరైనా మన కాలనిలో ఇలా ఆవస్త పడుతున్నారో లేదో చూడాలి రెడ్డి. "


"మా ఫ్రెండ్స్ తీసుకున్నారు. వాళ్ళెవరూ.. ! ఇలాంటి పనులు చేయటము లేదు ఏంటో? మనకే ఈ అవస్థలు. ఈ గాడిద పాల మిస్టరీ తేల్చాలి ఆంటీ"


మరుసటిరోజు డీ ఎం రావు వస్తే మమత "ఏంటి ఖరయ్యా.. , ! మాకు నిజంగా గాడిద పాలే.. ! పొస్తున్నవా?' అని అడిగింది. 


"అదేందండి ఈ కాలనిలో ఎంతోమందికి డౌట్ రానిది మీకెందుకొచ్చింది. నిఖార్సైన గాడిద పాలు పోస్తుంటే.. కావాలంటే.. పక్కూరిలో ఉన్న మా ఇంటికి రాండి. మా గాడిదను చూస్తే నమ్ముతారేమో. ఆ సివరిల్లు సుబ్బారావుగారు కుండ తీసుకొచ్చి కొనుక్కున్నారు. "


"కుండ పాలు ఎందుకు?" అన్న మమతతో,


"వూర్కొండి.. ఏమి తెల్వనట్లు మాటాడతారు. మీరు తెలుగు టీచర్ కూడాను. ఆవు పాలు గరిటడు సాలు, గాడిద పాలు కుండ కావాలి అని పద్యం ఉందంటగా. అపుడే ఇవి పని చేస్తాయని సుబ్బారావుగారు తీసుకున్నారు"


ఇంతలో సుబ్బారావు వాకింగ్ చేయకుండా రన్నింగ్ చేస్తూ పార్క్ కు వెళ్తున్నాడు. 


"మీరు ఒక కుండ పాలు కొనండి.” సుబ్బారావు వైపు మురిపెంగా చూస్తూ 

“అట్లా..  పని చేస్తాయి. మీ అయ్యగారు కూడా పరుగెడతారు. మీరేమో కూసిని పాలు కొంటారు. వాటిలో మళ్ళీ నీళ్ళు పోసి పడతారు. ఇంకేమి బలము వుంటది. ఏదైనా ఎంత మోతాదులో ఇయ్యాలో అంత మోతాదు ఇయ్యాలి. ఇదిగో ఈ చిన్న కుండ పాలు పట్టండి అయ్యగారికి. అపుడు సూద్దాము గాడిదపాలు ఎందుకు పడవో?" అంటూ కుండ పాలు 

ఇచ్చాడు డీఎం రావు మమతకు వద్దంటున్నా వినకుండా. 


"ఎంత డబ్బులు? అంటే.. "ఆ ఎంత.. ఒక రెండు వేలు ఇవ్వండి సాలు.. !"


కొన్నవి పారబోయటం ఎందుకు? అని మమత తను తాగటం మొదలు పెట్టింది. పెరట్లో గడ్డి పీకి బయట పారెయకుండా ఇపుడు ఇద్దరూ కలిసి పచ్చగడ్డి తింటున్నారు. 


పచ్చ గడ్డి కొస్తున్న భార్యను చూస్తూ "పచ్చ గడ్డి కోసేటి వృద్ద పిల్లో.. !" అంటూ సకిలిస్తూ పాట పాడుతున్నాడు సర్వ మంగళం. కోరస్ గా మమత కూడా పాట పాడుతూ సకిలిస్తుంది. 


ఇపుడు సర్వ మంగళం ముద్దుగా ఒక గాడిద తన్ను తంతే మమత భర్త మీద ఇదివరకటి కసినీ గుర్తుకు తెచ్చుకుని ఎగిరెగిరి తంతూ.. ! తన పగ తీర్చుకుంది. ఆ బాధకి గట్టిగా ఓండ్ర పెడుతున్నాడు సర్వ మంగళం. 


వీళ్ల బలం కావాలనే బలహీనతను మన డీ ఎం రావు క్యాష్ చేసుకుంటున్నాడు. తను బల పడుతున్నాడు. గాడిద పాలలో మేక పాలు కూడా కలపటం వల్ల కాలని వాసులు 

నాన్ వెజ్ మానేసి ఆకులు, అలములు తింటూ వంతెన సర్రాజు గారి వీడియోలు చూస్తూ మార్కెట్లోకి ఆకుకూరలు లాటుగా తెచ్చుకుని తింటున్నారు. అన్నట్లు అందరూ.. ఆకుపచ్చ రంగులో తేలారు. అంటే పచ్చగా అయ్యారు. 

సమాప్తం


పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

 రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.


Comments


bottom of page