నిశ్శబ్దం మాటలైన రోజు
- Neeraja Prabhala

- 10 hours ago
- 4 min read
#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #NissabdamMatalainaRoju, #నిశ్శబ్దంమాటలైనరోజు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Nissabdam Matalaina Roju - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 31/12/2025
నిశ్శబ్దం మాటలైన రోజు - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
కామేశ్వరి జీవితం ఒక నిశ్శబ్ద నది లాంటిది. ఎక్కడా ఉప్పొంగదు.
ఎక్కడా ఆగదు. కానీ మనసు లోతు మాత్రం అపారంగా ఉంటుంది.
పదహారేళ్ల వయసులోనే ఆమె పెళ్లి దాశరథితో జరిగింది. అతను అప్పటికి ఉద్యోగం కోసం తిరుగుతున్న యువకుడు. ఇద్దరి మధ్య ప్రేమ లేదు. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం కూడా అంతగా ఆ వయసులో తెలీలేదు.
“వాదనలు లేకుండా మాటలు తగ్గితే జీవితం విలువ పెరుగుతుంది. ” అని తల్లి తనని కాపురానికి పంపేనాడు చెప్పిన మాటే కామేశ్వరికి వేదమంత్రం.
ఆ మాటని ఆమె తూచాతప్పకుండా పాటిస్తోంది.
పెళ్లి తరువాత దాశరథికి ఉద్యోగం వచ్చింది. మంచి ఇల్లు కట్టారు. ఆ దంపతులకు కూతురు సుమతి, కొడుకు రమేష్ పుట్టారు. బాధ్యతలు మరింత పెరిగాయి.
కామేశ్వరి తనకోసం ఎప్పుడూ జీవించలేదు. ఆమె జీవితం తన భర్త కోసం, పిల్లల కోసం, తమ ఇంటి కోసం మాత్రమే కొనసాగుతోంది.
దాశరథి క్రమంగా ఇంట్లో అన్ని నిర్ణయాలకు తనే అధిపతిగా మారిపోయాడు. అతని మాటలకు ఎదురు చెప్పే అలవాటు ఆ ఇంట్లో ఎవరికీ లేదు. కామేశ్వరి అయితే అసలు ఆ ప్రయత్నమే చేయలేదు.
ఆమెకి క్రమేణా ఆలోచనలు చుట్టుముట్టాయి. తన భర్త ఇప్పుడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఈ ఇంట్లో ఆయన మాటే చట్టం అన్నట్లుగా ఇన్ని సంవత్సరాలు కలిసి జీవిస్తున్నారు ఇద్దరూ.
తను ఎప్పుడూ ఆయనకు ఎదురు మాట్లాడలేదు. అవసరమైతే మాట మనసులోనే దాచుకుని బాధని మింగేది, కాని గౌరవాన్ని మాత్రం వదలలేదు.
“ఇల్లు, సంసారం నిలబడాలంటే ఒకరు నిశ్శబ్దంగా ఉండాలి” అనేది ఆమె నమ్మకం. క్రమేణా పిల్లలు పెరిగారు.
కూతురు సుమతి చదువులో చాలా తెలివైనది. ఆమె గురించి తండ్రి గర్వంగా చెప్పుకునే విషయం అదే. కొంతకాలానికి ఆమెకు మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేసి హైదరాబాద్ పంపించారు.
తమ ఇల్లు పెద్దది. ఇప్పుడు పాత తరం గృహంగా మారింది. కానీ ఆ ఇంట్లో ఉండే వాతావరణం చిన్నదైపోయింది. ప్రతి గదిలో, ప్రతి మనిషితోనూ మాటలు తగ్గాయి. ఎవరిని కదిలించినా ప్రతి చూపులో అర్థాలనేకం ఉన్నాయి.
కొడుకు రమేష్ మాత్రం తండ్రిలాగే మాటలో దృఢత్వం, ఆలోచనల్లో స్వార్థం. రమేష్ కి పెళ్లి అయ్యే వరకు ఆ ఇల్లు ప్రశాంతంగానే ఉంది. అతని పెళ్లి తర్వాత కోడలు సునీత వలన ఆ ఇంటి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారడం మొదలైంది.
సునీత చెడ్డది కాదు కానీ ప్రతిదానికి ఆమె లెక్కలు బేరీజు వేసే అమ్మాయి. జీవితాన్ని వ్యాపారాత్మకంగా భావించేది. ప్రతి విషయం ఆమె లాభనష్టాలతోనే చూస్తుంది.
సునీత అడుగుపెట్టిన రోజే ఆ ఇంట్లో లెక్కలు మొదలయ్యాయి.
ఎవరు ఏ గదిలో ఉండాలి? ఎవరి మాట ఎవరు వినాలి? ఏ పని ఎవరు చేయాలి? అనేది ఆఇంట్లో అందరికీ తెలిసింది.
కామేశ్వరి నిశ్శబ్దంగా అన్నింటినీ దగ్గరగా గమనించేది. కోడలి మాటల్లో దాగిన వ్యంగ్యం, కొడుకు చూపుల్లో పెరుగుతున్న అహంకారం, కొడుక్కి తనతో పెరుగుతున్న దూరం, తరచుగా కూతురి ఫోన్లలో వినిపించే అసహనం అన్నీ ఆమెకు స్పష్టంగా కనిపించేవి, వినిపించేవి.
దాశరథి మాత్రం మౌనంగా ఉండేవాడు కాదు. అతని మౌనం అధికారం నుంచి వచ్చేది.
“ఇల్లు నా పేరుమీదే ఉంది”
“రిటైర్మెంట్ డబ్బు నా చేతుల్లోనే ఉంది”అనే భావన అతని ప్రతి మాటలో కనిపించేది.
“ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది?”
“ఆస్తి ఎవరికిస్తారు?”
“మాకు ప్రత్యేకమైన గది ఎందుకు లేదు?” ఈ ప్రశ్నలు మొదట నెమ్మదిగా, తర్వాత ధైర్యంగా సునీత నోటి వెంట వినిపించసాగాయి.
కామేశ్వరి అన్నింటినీ సునిశితంగా గమనించేది. కానీ పైకి మాత్రం ఏమీ అనేది కాదు.
ఒక రోజు ఆమె పూజ చేస్తుంటే
“అత్తమ్మా! మీరు రోజూ దేవుడికి పూజ చేసి నమస్కారం చేస్తారు. జీవితంలో మాకు ఏం దక్కుతుందో కూడా ఆ దేవుడే నిర్ణయిస్తాడా?” సునీత అంది.
ఆ మాట కామేశ్వరి గుండెల్లో బలంగా తాకింది. కానీ పెదవిదాటి మాటలు బయటికి రాలేదు.
దాశరథి మాత్రం సునీత మాటల్లో తన ప్రతిబింబాన్ని చూసుకున్నాడు. ఆయన తన కొడుకు మాటలని వినడం మాని ప్రతిదానికి కోడలిని సమర్థించడం మొదలుపెట్టాడు.
చివరికి ఒకరోజు విషయం బయటపడింది. దాశరథి తన ఆస్తి అంతా రమేష్ పేరు మీద వ్రాయాలనుకుంటున్నాడని చూచాయగా వెల్లడించాడు.
సునీత ముఖంలో ఆ రోజు కనిపించిన ఆనందం —కామేశ్వరి తన జీవితంలో ఆమె చూసిన అత్యంత స్పష్టమైన భావం.
సుమతికి ఈ విషయం తెలిసి “అమ్మా.. నువ్వు ఏం అనలేదా?” ఈ ఇంటికి నీవేమీ కావా? నీకేమీ నిర్ణయం తీసుకునే హక్కు లేదా?” అని ఫోన్ చేసి ఏడుస్తూ తల్లిని అడిగింది.
దానికి ఆమె సమాధానం ఒక్కటే.
“సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. ” అని చెప్పి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ప్రశాంతత ఉంది, బాధ ఉంది, ఒక స్ధిర నిర్ణయం ఉంది.
కామేశ్వరి క్రమంగా ఇంట్లో ప్రేక్షకురాలైంది.
నిత్యం ఆమె పూజ చేసి, వంట చేసి అందరికీ వడ్డిస్తుంది. కానీ ఆ ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయాలలో ఆమె పాత్ర ఉండదు. కనీసం ఆమెకు చెప్పే ప్రయత్నం కూడా చేయడు దాశరథి.
“ఈ ఇల్లు రమేష్ పేరుమీద వ్రాయాలి.. అతను మగపిల్లవాడు. ఈ ఇంటి వారసుడు. తరతరాలకు అదే సరైన నిర్ణయం. రేపు మనం పోయాక తల కొరివి పెట్టే వంశోద్ధారకుడు” అని ఒక రోజు తాను లోగడ చెప్పిన విషయం అందరికీ స్పష్టంగా వినిపించేట్టుగా చెప్పాడు.
ఆ మాట వింటూ కామేశ్వరి తలెత్తి భర్త వంక మొదటిసారి రివ్వున చూసింది. దాశరథి అది గమనించి కూడా ఏం ఎరగనట్టు ఉన్నాడు.
తండ్రి ఆస్తి పంపిణీ చేసే విషయం తెలిసి “అమ్మా.. ఈ విషయంలో నువ్వు ఏం అనలేదా? నాకేమీ అవసరం లేదు. కానీ నువ్వేం అవుతావమ్మా?” అని ఫోన్ చేసి ఏడుస్తూ మరలా తల్లిని అడిగింది సుమతి.
ఎప్పటిలా కామేశ్వరి నవ్వింది. ఆ నవ్వులో ప్రశాంతత ఉంది, బాధ ఉంది, ఒక నిర్ణయం ఉంది. ఆమె సమాధానం ఒక్కటే “సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. ” అని.
ఆ సమయం కోసం ఆమె ఎదురు చూసింది.
ఆ రోజు రాత్రి ఆమె నిద్రపోలేదు. తన పాత ట్రంక్ తెరిచింది. తన గత జీవితాన్ని తలచుకుంది. తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన భూమి, తన పేరుమీదే ఉన్న పాత సేవింగ్స్,
తాను దాచుకున్న కొన్ని పత్రాలు —
అన్నింటినీ ఆమె క్రమంగా చూసింది.
తమ ఇంట్లో ప్రశాంతత కోసం ఇన్నేళ్లు ఆమె మౌనంగా ఉంటూ వాటిని దాచింది. కానీ ఇప్పుడు తన మౌనాన్ని తప్పుగా,చేతకాని అసమర్థతగా అర్థం చేసుకున్నారు ఆ ఇంట్లో అందరూ.
ఒకరోజున ఆస్తి విభజన కోసం
దాశరథి కుటుంబ సమావేశం పెట్టాడు. కూతురిని, అల్లుడిని కూడా పిలిపించాడు దాశరథి. వాళ్లతో పాటు కొడుకు, కోడలు, పిల్లలు అందరూ వచ్చి సోఫాలలో కూర్చొన్నారు. దాశరథి మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ తర్వాత కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు అందరూ మాట్లాడి తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అందరి మాటలు ఆస్తి చుట్టూ తిరిగాయి. ప్లాన్లు, భవిష్యత్తు, పేర్లు, సంతకాలు..మొదలైన ప్రక్రియలతో.
కామేశ్వరి మాత్రం నిశ్శబ్దంగా అందరి మాటలను వింటూ ఉంది. అందరూ మాట్లాడటం పూర్తయ్యాక ఆమె వైపు చూశారు.
ఆమె దాశరథిని మొదటిసారి ప్రశ్నించింది.
“ఈ ఇంట్లో నేను ఎవర్ని?”
భార్య నుంచి ఊహించని ఆ ప్రశ్నకు దాశరథి హతాసుడై వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాడు. అది అతనికి కొత్త ప్రశ్న. ఆయన మౌనంగా ఉండిపోయాడు.
ఆమె నిదానంగా లేచింది. ఇన్నేళ్ల నిశ్శబ్దం ఆ క్షణంలో మటుమాయమై మాటలైంది.
కామేశ్వరి చిన్నప్పటి నుంచే భిన్నంగా ఉండేది. ఆమె మాటలు తక్కువ, ఆలోచనలు లోతైనవి.
అరవయ్యేళ్ల వయసు వచ్చేసరికి ఆమె జీవితం ఒక సుదీర్ఘ నిశ్శబ్ద యుద్ధంలా మారిపోయింది.
కామేశ్వరి ఇప్పటివరకు ఒక్క మాట కూడా అనలేదు.
అందరూ మాట్లాడడం పూర్తయింది.
ఆఖరికి ఆమె వైపు చూశారు.
అప్పుడే..
ఆమె మాట్లాడింది.
కామేశ్వరి మాట్లాడటం పూర్తయింది. అరవయ్యేళ్ళ ఆమె స్వరంలో తడబాటు లేదు. అందరి వైపూ గంభీరంగా చూసి, తను చెప్పాల్సిందింకేం లేనట్లు అక్కడ నుండీ అవతలకు కదిలిందామె.
ఆమె మాటలు వింటున్న అందరికీ దిమ్మతిరిగిపోయింది.
కామేశ్వరి మాటలకు ఆమె భర్త, కూతురూ, కొడుకు అవాక్కై నోళ్ళు తెరుచుకుని ఉండిపోయారు..
అల్లుడు, కోడలు అయోమయంగా చూసారు.
సోఫాలలోనే స్థాణువులై కూర్చున్న వాళ్ళందరినీ ఓ సారి పరిశీలనగా చూసి, చిన్నగా నిట్టూర్చాడు దాశరథి కామేశ్వరి భర్త.
కొన్ని కథలింతే. అవి అంతమౌతాయనుకునేంతలోనే ఆరంభమవుతూ ఉంటాయి.
‘అంతం కాదిది ఆరంభం’ అని మనసులోనే అనుకుని తృప్తిగా నిట్టూర్చింది కామేశ్వరి.
.. సమాప్తం ..

-నీరజ హరి ప్రభల
Profile Link
Youtube Playlist Link




Comments