నిత్యకల్యాణానికి నీరాజనం
- Dr. Brinda M. N.
- 5 days ago
- 5 min read
#NithyakalyananikiNeerajanam, #నిత్యకల్యాణానికినీరాజనం, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Nithyakalyananiki Neerajanam New Telugu Story Written By Dr. Brinda M N
Published In manatelugukathalu.com On 13/08/2025
నిత్యకల్యాణానికి నీరాజనం - తెలుగు కథ
రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.
అష్ట సంతానంతో అనురాగ హరివిల్లు రాఘవయ్య గారి కుటుంబం. పిల్లలను తమ తాహతకు తగ్గట్టుగా పెంచి, పెళ్లిళ్లు చేశారు. అందరూ వేర్వేరు ఊళ్ళల్లో తమ తమ సంసారాలను ఆనందంగా కొనసాగిస్తున్నారు. ఐదవ సంతానం వనితకు ఎన్నిసార్లు ప్రయత్నించినా గర్భస్రావం అవుతుండేది. తరచుగా గైనకాలజిస్ట్ ను సంప్రదిస్తూ మందు, మాత్రలు సమయానికి వాడుతూ ఉండేవారు దంపతులిద్దరూ.
"వనిత! ఈసారి మంచి బలమైన మాత్రలు ఇచ్చాను. కచ్చితంగా నిలబడుతుంది, బాధపడకు. తల్లి బాధను అర్థం చేసుకోగలను"
"ఏమో డాక్టరమ్మా! బాగా విసుగు వచ్చింది. పిల్లలు లేకపోయినా పరవాలేదు, ఈ మాత్రలు ఈ నొప్పులు, అవస్థ భరించలేకపోతున్నాను.”
"నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి, సురేష్.. మీరు కొన్ని రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి మీ భార్యకు సమయాన్ని కేటాయించండి. లేదంటే ఈమె తీవ్రంగా మానసిక క్షోభకు గురి కావచ్చు. లేకపోతే పుట్టినింటికి పంపించండి"
"వద్దు డాక్టరమ్మా, వద్దు. సూదులకంటే భయంకరమైన వారి సూటిపోటి మాటలు భరించలేను, ఇక్కడే ఉంటాను."
"సరే, మీ ఇష్టం, మందులు కరెక్ట్ గా వేసుకోండి".
అలాగే అని ఇంటికి వచ్చారు సురేష్, వనిత.
ఒక శుభముహూర్తాన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది వనిత. తొమ్మిది ఏళ్ల అనంతరం కడుపు పంటతో కుటుంబంమంతా కళకళ లాడింది. రాఘవయ్య గారి కుటుంబ సభ్యులు, ఊరి వారందరూ సంతోష సంబరాలు చేసుకున్నారు. భోజనాలు పెట్టారు. ఒకటేమిటి ఎన్నో విధాలుగా వారోత్సవాలనే జరిపించారు. వనిత దంపతులు బిడ్డని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు.
రెండు నెలల తర్వాత బిడ్డ రెండు కళ్ళు ఎర్రగా పెద్దగా మారిపోయాయి. కనుగుడ్లు బయటికి వచ్చాయి. ఇలా నెలరోజుల పాటు ఆ బిడ్డ పోరాడి పోరాడి పరమపదించాడు.
భార్యాభర్తల పరిస్థితి చెప్పనలవి కాదు. కొన్ని రోజులు పెద్దన్నయ్య ఇంట్లోనే ఉన్నారు వారిద్దరు.
ఇక ఆ మహానగరం వదిలి పట్టణానికి వచ్చి ఓ ప్రైవేటు కంపెనీలో చేరారు సురేష్. వనితకు చుట్టూ ప్రక్కల వారితో మంచి స్నేహం ఏర్పడింది. వరుస గర్భస్రావాలతో బక్క చిక్కిపోయింది వనిత. కొన్ని రోజులు పనిమనిషిని పెట్టుకొని, వంటపని, చిన్న చిన్న పనులను మాత్రమే చేసుకుంటూ ఉండేది. రెండేళ్ల అనంతరం మళ్లీ నీళ్ళోసుకుంది వనిత.
ఈసారి గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్లి తన ముందు బాగోతం అంతా వివరించింది. డాక్టర్ అవసరమైన పరీక్షలు అన్నీ చేయించింది. ఇప్పటివరకు జరిగిన నష్టం మొత్తానికి చరమగీతం పాడాలని నిశ్చయించుకుంది. చాలా లోతుగా పరిశీలించి, పిండం గర్భాశయంలో కాక ఫాలోపియన్ గొట్టంలో పెరగడం వలన భారానికి తట్టుకోలేక గర్భస్రావాలు జరిగాయని నిర్ధారించి, ఖరీదైన సూదిమందులను వారం రోజులు వేసుకోవాలని, తరచుగా చెకప్ కు రావాలని ఖచ్చితంగా చెప్పింది.
ఎట్టకేలకు ఒక అందాల పాపకు జన్మనిచ్చింది వనిత. ఒకటిన్నర సంవత్సరం తర్వాత బాబు కూడా పుట్టాడు ఆ దంపతులకు. పట్టణానికి వచ్చి మంచి పని చేశానని, దానివలన జీవితంలో కోల్పోయింది లభించిందని సురేష్ అమితానందపడ్డాడు.
పాప రోజు రోజుకి ఆటపాటలతో హుషారుగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడం గమనించిన డాక్టర్,
"మీరు ఇక ఎటువంటి శంక పెట్టుకోవద్దు" అంటూ అభయహస్తం ఇచ్చింది.
తమ్ముడుతో సహా పాఠశాలకు వెళ్లి వస్తూ ఇంటి దగ్గర అన్ని ఆటలలో చురుకుగా పాల్గొంటూ ఉండేది ప్రేరణ. ప్రాథమిక, మాధ్యమిక, ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసి జేఎన్టీయూలో బీటెక్ సీటును సంపాదించింది. రోజు బస్సులో వెళ్లి వస్తూ ఉండేది కళాశాలకు. అందరికంటే ముందే బసెక్కేది, అదేవిధంగా చిట్ట చివరగా బస్సు దిగేది ప్రేరణ.
"ఏంటండీ? ఇవాళ స్పెషల్" అడిగాడు డ్రైవర్.
"అవును, మా ఇంట్లో నోములు నోచుకున్నాము, తీసుకోండి ప్రసాదం" అంటూ డ్రైవర్ చేతిలో పెట్టింది, అలాగే స్నేహితులకు కూడా ఇచ్చింది ప్రసాదాన్ని.
"ఏంటండీ! ఈరోజు పుస్తకాలు ఏవి లేవు చేతిలో" డ్రైవర్ ప్రశ్న.
"ఈ వారమంతా మాకు పరీక్షలు, తర్వాత సెలవుల్లో మేము మామగారి ఇంటికి వెళ్తాం" ఆనందంగా జవాబు ఇచ్చింది ప్రేరణ.
"ఓహో! మరి మీ వారు ఏం చేస్తారు?" అమాయకంగా అడిగాడు డ్రైవర్.
"ఛ, ఛ, నాకు ఇంకా పెళ్లి కాందే"
"మీరే కదా, మామగారింటికి అన్నారు"
"ఓహ్! బుద్ధు, మా అమ్మగారి తమ్ముడు" గలగల నవ్వింది ప్రేరణ.
డ్రైవర్ ఆతిష్, ప్రేరణకంటే ఐదేళ్లు పెద్దవాడు. ఇంటి పరిస్థితులు అనుకూలించక పదవ తరగతితోనే ఆపేశాడు. లారీ డ్రైవర్ గా చిన్న వయసుకు చేరాడు. ఇప్పుడు బాగా అనుభవం ఉన్నందున బస్సు డ్రైవర్ గా నియమించాడు ఓనర్. ప్రేరణతో ప్రతిరోజు ఏదో విధంగా మాటలు కలుపుతూ ఉండేవాడు ఆతిష్. ప్రేరణ అందం, మనసు, కలపుగోలు తనం తనకు బాగా నచ్చాయి. వేసవి సెలవులు కావడంతో ప్రేరణ సిటీకు వెళ్ళటం, లారీడ్రైవర్గా ఆతిష్ వేరే రాష్ట్రాలకు సరుకు తీసుకెళ్లడం జరిగింది.
మూడవ సంవత్సరం రాగానే ఇంట్లో పెళ్లిచూపులు మొదలుపెట్టారు వనిత, సురేష్. యధావిధిగా అన్ని చెప్తూ ఉండేది ప్రేరణ ఆతిష్ తో.
"ఎందుకో, ఏ సంబంధాలు సెట్ అవ్వటం లేదు. అమ్మానాన్న దిగులుగా ఉన్నారు. పాపం అనిపించింది" అంది ఏడుపు ముఖంతో ప్రేరణ.
"మీరు ఏమీ అనుకోకపోతే, ఒక విషయం చెప్తాను, మూడేళ్లుగా మిమ్మల్ని గమనిస్తున్నాను. మీ అలవాట్లు, మంచితనం, మీ తీరు అన్నీ నాకు నచ్చాయి. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. "
ఠక్కున చెప్పిన ఆతిష్ ను చూసి నివ్వెర పోయింది ప్రేరణ.
రెండు రోజులు బాగా ఆలోచించింది. అవును, ఆతిష్ మంచి మనసున్న మనిషి. డ్రైవర్ అయితేనేమి, కానీ పెద్దలకు ఎలా చెప్పేది, ఆలోచనతో అలాగే నిద్రలోకి జారుకుంది ప్రేరణ. రెండు మూడు సంబంధాలు మళ్లీ వచ్చాయి. నచ్చలేదు.
ఇదే ప్రస్తావిస్తే, ఆతిష్ "ఓహో! నేను మీకు నచ్చట్లేదు అన్నమాట. అవును లెండి మాలాంటి డ్రైవర్ అంటే చిన్న చూపేగా. చూడండి! ఇంట్లో అంతంత మాత్రమే మా నాన్నకి త్రాగుబోతు ఇంటిని పట్టించుకునే వాడు కాదు. అమ్మ, తాతయ్య వాళ్ళు మమ్మల్ని కష్టపడి పెంచారు. జరిగేది కూడా కష్టమే. లేకపోతే నేను కూడా మీలా కళాశాలలో చదువుకునేవాన్ని.
డ్రైవర్ గా కాకుండా ఒక మనిషిగా చూడలేరా? ఒకటి మాత్రం చెప్పగలను, మీరంటే నాకు ప్రాణం, ఒక్కసారి పట్టుకున్న మీ చేతిని చివరిదాకా వదలను. మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను. ఉండను. ఇది కచ్చితంగా చెప్పగలను. మీరు ఒప్పుకుంటే మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను మీ ఇష్టం. "
తన మాటలకు నయనాలు నవ్వాయి ప్రేరణకు. పెళ్ళంటూ చేసుకుంటే ఆతిష్ నే చేసుకోవాలని నిశ్చయించుకుంది.
ఓ సాయంత్రం "నాన్న! ఒక అబ్బాయి నచ్చాడు, నేను అతన్ని వివాహం చేసుకుంటాను"
"ఎవరమ్మా? మీ క్లాస్మేటా"
"కాదు నాన్న! మా కళాశాల బస్సు డ్రైవర్"
"ఏంటే! నీవాలకం, ప్రపంచంలో ఇంక ఏ మగాడు దొరకలేదా?" వనిత కోపంతో కళ్ళెర్రజేసింది.
"అమ్మ! ఆతిష్ మంచి మనసున్నవాడు. నన్ను బాగా చూసుకుంటాడు. ఆ నమ్మకం ఉంది. "
"సర్లేవే, డ్రైవర్ అంటేనే తాగుబోతు, ఎన్ని చూడలేదు?"
"నాన్న! ఇంక సంబంధాలు చూడకండి. పెళ్లి చేయాలనుకుంటే అతనితో జరిపించండి." వాదోపవాదాలకు తావివ్వక కచ్చితంగా చెప్పింది ప్రేరణ.
సురేష్, వనిత ఆలోచనలో పడ్డారు. సరే ఒకసారి అబ్బాయి ఇంటికెళ్లి చూసొద్దాం అని వెళ్లి విచారించి, పెద్దలతో మాట్లాడి, ఖాయం చేసుకున్నారు. నాలుగవ సంవత్సరం అయ్యే లోపు ప్రేరణ ఆతిష్ ల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఆరు నెలలు సంసారం అంటే స్వర్గధామం అనేలా గడిపారు. ప్రేరణ గర్భం దాల్చింది. ఒకరోజు అర్ధరాత్రి ఇంటి తలుపు తడుతుంటే సురేష్ కు భయమేసింది. ఎవరో! ఏమిటో! అంటూ తలుపు తీసి చూడగా ఎదురుగా ఆతిష్.
"ఓ మామగారు! మీరా ఏంటి! ఇంకా నిద్ర పోలే, దా?" త్రాగుడు మైకంలో అల్లుడి మాట విని దిమ్మ తిరిగింది సురేష్ కు.
"ఇక్కడ పడుకో బాబు"
"లేదు, నేను పెళ్ళాం పక్కనే పడుకోవాలి"
"వద్దు బాబు, తను గర్భవతి"
"అయితేనే"
గొడవ గొడవగా చప్పుడు రావడంతో వనిత, ప్రేరణ ఇద్దరూ లేచారు. భర్తని అలా చూసేసరికి అవాక్కయింది ప్రేరణ, నోటిమాట రాలేదు.
ప్రొద్దున్నే "ఏంటండీ మీరు చేసిన పని?"
"తాగాను"
"ఎంత తాపీగా అంటున్నారు"
"నేను డ్రైవర్ని, చుక్క పడకపోతే చక్రం తిప్పలేను"
"ఈ మాట పెళ్లికి ముందు చెప్పలేదుగా"
" ఆ పాపం, అన్ని రాసి ఇస్తాములే" వదలని మత్తుతో అన్నాడు ఆతిష్.
ఇలాంటి సమయంలో పాపకు జన్మనిచ్చింది ప్రేరణ. సంవత్సరం అనంతరం ప్రైవేటు బ్యాంకులో క్లర్క్ గా జాయిన్ అయింది. తన సంపాదనతోనే కుటుంబాన్ని నడిపేది. ఇదే తరుణంలో సురేష్ కాలం చేశాడు. మరలా ఒక బాబుని ప్రసాదించింది ప్రేరణ.
"చూడండి! ఇప్పుడు మనం నలుగురం, అమ్మ. నా ఒక్క సంపాదన సరిపోదు, మిగల్చటానికి వీలు లేకుండా, మీరు ఖాళీ చేస్తున్నారు, ఇప్పటికైనా తాగుడు మానండి" పరిపరి విధాలా నచ్చచెప్పింది.
సరే అనడం త్రాగి రావడం పరిపాటయింది ఆతిష్ కు. ఇక విడిపోదామనుకుని నిశ్చయం తీసుకుంది ప్రేరణ. లీగల్ గా అన్నీ రెడీ చేసుకుంటున్న సమయంలో,
"ప్రేరణ! నేను తాగుడు పూర్తిగా మానేస్తాను, నాకు నువ్వే ముఖ్యం, సారీ"
భర్తలో కలిగిన మార్పుకు లోలోపలే భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంది ప్రేరణ. వనిత మనసు నిశ్చలంగా ఉంది. పిల్లలిద్దరూ తండ్రి మాతో బాగా ఉంటారని ఆనందించారు. తర్వాత అనుకోకుండా ఒక రోజు ఆరోగ్య అవగాహన కార్యక్రమానికి వెళ్లారు ఇద్దరూ. అంతే అదృష్టం వారి తలుపు తట్టింది, వారి దశ తిరిగింది.
ఆరోగ్యానికి సంబంధించిన వెల్నెస్ సెంటర్ ను ఏర్పాటు చేసి, మెంబర్స్ ను చేర్పించి, కోచ్ లుగా ఉంటూ, శిక్షణా తరగతులకు హాజరవుతూ అందులో వచ్చే ప్రతి లాభాన్ని ఆస్వాదిస్తున్నారు. పిల్లలిద్దరూ చేతికందడంతో వారు కూడా తల్లిదండ్రుల బాటలో నడుస్తున్నారు. దేశ, విదేశాలకు వెళ్తూ ఎంచక్కా జీవన ప్రయాణాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారు.
కేంద్రంలో నెల నెలా జరిగే పండుగలో ప్రేరణ ఆతిష్ నూతన వధూవరులుగా పెళ్లి దండలను మార్చుకుంటూ, బహుమతులు గెలుచుకుంటూ, ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. అందరూ వివాహం, షష్టిపూర్తి రెండే చేసుకుంటారు, కానీ వీరి అదృష్టం పుణ్యమేమోగాని ఇప్పటికీ ఎనబై నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నారు.
ఇచ్చిన మాట ప్రకారం ఆతిష్ ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళడు. ఒక్కరోజు పని అయినా, వారం రోజుల పనైనా జంట పక్షులు ఎగరాల్సిందే. చేతినిండా డబ్బు, విహార యాత్రలు, సుఖశాంతులు అన్నిటితో అలరారుతున్న వీరి నిత్యకళ్యాణానికి నీరాజనాలు నిరభ్యంతరంగా అందించాల్సిందే.
నీతి : కష్టసుఖాలు కావడి కుండలు. జీవితంలో చీకటి వెలుగులు సహజం. అన్నింటిని ఓపికతో ఓర్చుకొని, ఒద్దికగా మలుచుకుని, ఓర్పు, నేర్పులను ప్రదర్శిస్తూ మంచి మార్పును స్వాగతిస్తే అందరి జీవితాలు నిత్యకళ్యాణంలా కళకళలాడుతూ ఉంటాయి.
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
సమాప్తం
డాక్టర్ బృంద ఎం. ఎన్. గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.
కవయిత్రి, రచయిత్రి, గాయని,
స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి
15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట
భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.
Comments