'Nivu Nerpina Vidya' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao
'నీవు నేర్పిన విద్య' తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
పెళ్ళుమన్న శబ్దంతో బయటికి వచ్చాడు శ్రీకాంత్. పక్క యింటి పిల్లాడు క్రికెట్ బాల్ తో కిటికీ అద్దం పగలుకొట్టేసాడు.
“యిదిగో.. నిన్ను బాల్ మా వైపు రాకుండా ఆడుకోమన్నానా, యిప్పుడు కిటికీ అద్దం పగలకోట్టేశావు” అన్నాడు. ఆ పిల్లాడు నిర్లక్ష్యం గా వెళ్ళిపోయాడు.
సాయంత్రం ఆ అబ్బాయి తండ్రి వెంకటేష్ రాగానే శ్రీకాంత్ వెళ్లి జరిగింది చెప్పాడు.
“పిల్లలు ఆడుకోవటానికి స్థలం లేక వరండా లో ఆడుకుంటున్నారు. పొరపాటున జరిగిన దానికి ఏం చేస్తాం అంకుల్, రేపు మా పనిమనిషిని పంపి గాజు పెంకులు ఏరించి బయట పడేయమంటాను” అన్నాడు, కిటికీ అద్దం గురించి మాట్లాడకుండా.
చేసేది లేక కార్పెంటర్ ని పిలిచి కొత్త అద్దం వేయించుకున్నాడు శ్రీకాంత్. ఎందుకైనా మంచిది అని “మీ పిల్లాడిని చూసి ఆడుకోమనండి, ఈసారి మళ్ళీ పగిలితే నా వల్ల కాదు ,ఈ వయసులో పనివాళ్ళని పట్టుకొచ్చి బాగుచేయించుకోవడం” అని చెప్పేసాడు.
“అబ్బే! మా పిల్లలు యిహ వరండాలో ఆడుకోకుండా మేడమీద ఆడు కోమన్నాను” అన్నాడు పక్కింటాయన.
నాలుగు రోజుల తరువాత శ్రీకాంత్ భార్య సుమతి మేడ మీద నుంచి అరుస్తోవుంటే, ఏమైందా అని పరుగున పైకి వెళ్ళాడు. ఏముంది.. సుమతి ఎండపెట్టిన మాగాయి జాడి ఊట అంతా నేలపాలు అయ్యి, జాడి ముక్కల మధ్యలో క్రికెట్ బంతి పడివుంది. అటుపక్క మేడ గోడ వెనుకాల నక్కి చూస్తున్న పక్కింటి కుర్రాడు కనిపించాడు.
శ్రీకాంత్ కి ఒళ్ళు మండిపోయి, “నీకు బుద్దిలేదా? బాల్ మా మేడ మీదకి ఎందుకు కొడ్తావు ప్రతిసారి” అన్నాడు.
మొత్తానికి తిట్టుకుంటూ కిందకి దిగివచ్చి, “పోనీలే.. ఆ మామిడి ముక్కలని ఎండపెట్టు, పప్పులో వేసుకోవచ్చు” అన్నాడు భార్యతో.
“అది సరే, ఎంత కోపం వస్తే మాత్రం ఆ పిల్లాడిని అలా తిట్టేయడం ఏమిటి, వాళ్ళు అసలే ధనవంతులు” అంది.
“అంత డబ్బు ఎక్కువ వుంటే వాళ్ళ అబ్బాయి పగలుకొట్టిన వాటికి డబ్బు కట్టమను. వాళ్ళ పిల్లాడు వాళ్ళకి ముద్దు, మనకేమిటి” అన్నాడు శ్రీకాంత్. “యింకా వాడు యిలాగే వుంటే ముంబై నుంచి మన మనవరాలుని పిలుస్తాను, పక్కన కుర్రాడు ఒకటి పగలు కొడితే, యిది రెండు పగలుకొడుతుంది” అన్నాడు నవ్వుతు.
సాయంత్రం పక్కింటి పిల్లాడు వాళ్ళ నాన్నకి, ‘అంకుల్ నన్ను బుద్ది లేదా అని తిట్టాడు’ అని కంప్లైంట్ చేయటంతో వెంకటేష్ శ్రీకాంత్ ఇంటికి వచ్చి పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ‘మా అబ్బాయిని మేమే తిట్టం, మీరు ఎవ్వరు తిట్టడానికి’ అన్నాడు.
“మా వస్తువులు మీ పిల్లాడు పగలకొట్టకపోతే మేము తిట్టం. మీకు ఈ విషయములో ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే తంతు. మీ పిల్లాడిని ఎందుకు తిట్టామో అడిగి మీ వాడిని కంట్రోలో లో పెట్టుకోవలిసింది పోయి, నాదే తప్పు అన్నట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదు వెంకటేష్” అన్నాడు శ్రీకాంత్.
“క్రికెట్ ఆడే అప్పుడు బాల్ ఎటు వెళ్తుందో ఎవ్వరికి ఏంతెలుస్తుంది” అంటూ వెళ్ళిపోయాడు.
“నేను చెప్పానుగా! వాళ్ళ తప్పువున్నా వాళ్ళ పిల్లాడిని తిడితే గొడవ పెడ్తారని, మీకు ఎంతైనా నోరు కంట్రోల్ వుండదు, బీపీ తో వూగిపోతారు” అని తప్పంతా మొగుడుదే అన్నట్టుగా మాట్లాడింది సుమతి.
“నీ తీరు బాగుంటే యింత గొడవ ఎందుకు జరిగేది, తగుదునమ్మా అంటూ జాడిని మేడ మీదకి ఎందుకు తీసుకుని వెళ్ళావు” అన్నాడు కోపంగా శ్రీకాంత్.
“క్రింద పెడితే మీరు ఫోన్లో మాట్లాడుకుంటూ అన్నీ తన్నుకుంటో వెళ్తారని, పైన పెట్టాను. బుద్ది తక్కువై” అంది సుమతి.
“యింతకీ రాత్రి తింటానికి ఏమైనా పెడ్తావా లేదా” అన్నాడు.
“తిన్నారుగా పక్కింటి ఆయనతో చివాట్లు, కడుపునిండి వుంటుంది, ఒకటి గ్లాస్ మజ్జిగ తాగి పడుకోండి” అంది సుమతి.
ఒక అరగంట తరువాత కాలింగ్ బెల్ చప్పుడుకి తలుపు తీసి చూస్తే, ఎదురుగా జొమాటో కుర్రాడు ప్యాకెట్ పట్టుకుని నుంచున్నాడు.
“అదేమిటి? టిఫిన్ తెప్పించుకున్నారా..”అంది మొగుడితో.
“అవును. మసాలాదోశ, నా కోసం” అన్నాడు శ్రీకాంత్.
“మరి నాకు?” అంది సుమతి.
“నీకు మజ్జిగ” అన్నాడు దోశ తింటూ శ్రీకాంత్.
“రెండు పూటలా నడుం పడిపోయేడేట్లు వంటచేసి పెడుతూవుంటే, లొట్టలేసుకుంటో తిని, ఈ ఒక్క పూట ఏమిచేయలేదు అని మీరు ఒక్కరు తెప్పించుకుని తింటారా, పాపం తగులుతుంది మీకు” అంది.
యింతలో మళ్ళీ కాలింగ్ బెల్ మ్రోగడం తో ‘నా ప్రాణంకి ఈ బెల్ ఒక్కటి’ అంటూ తలుపు తీసింది.
మళ్ళీ జొమాటో వాడు యింకో ప్యాకెట్ తో నుంచుని వున్నాడు. ప్యాకెట్ తీసుకుని లోపలికి వచ్చి, “ఒక్క టిఫిన్ చాలదా, యింకోటి తెప్పించుకున్నారు” అంది సుమతి.
“అది నీకు. చట్నీస్ హోటల్ నుంచి తెప్పించాను” అన్నాడు శ్రీకాంత్.
“బాగానే వుంది మీ అతి ప్రేమ” అంటూ పొట్లం విప్పి చూసి, “ఎంతైనా చట్నీస్ హోటల్ టిఫిన్ రుచే వేరు” అంది. మొత్తానికి ఆరోజు రాత్రి ప్రశాంతంగా గడిచింది.
ఏమైందో కానీ పక్కింటి బంతి శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి రావడం లేదు. సుమతి ధైర్యంగా మేడమీద వడియాలు పెట్టేసింది. మొగుడుకి యిష్టం అని కొద్దిగా వడియాల పిండి అన్నంలోకి తీసి వుంచింది. అదేమిటో వడియాలు పెట్టిన రెండో రోజే ఆకాశం మబ్బులు పెట్టి ‘వడియాలు తీసి లోపల పెట్టుకోండి, వాన కురవాలి’ అని బెదిరింపులు మొదలుపెట్టింది.
“వంట మీరు చూసుకోండి, నేను మేడ మెట్టు మీద కూర్చుని వుంటాను, వాన మొదలు అవుతోవుండగా వడియాల క్లాత్ లోపలికి తెస్తాను” అంది సుమతి.
పాపం ఆకాశం మంచిదే, బెదిరించింది కాని వాన రాలేదు.వడియాలు కూడా సగం పైగా ఎండిపోయాయి.
“వాన వచ్చినా భయం లేదు ఫ్యాన్ కింద పెడితే ఆరిపోతాయి” అంది సుమతి. “అయినా ఎండే దాకా వుంచేడట్లు లేరు మీరు, రోజు నాలుగు వడియాలు పచ్చివే వేయించుకుని తినేస్తున్నారు” అంది పైగా.
ఆరోజు అర్ధరాత్రి ఊరుములు మెరుపులతో పెద్ద వాన పడింది. గాలికి ములగ చెట్టు విరిగి పక్కింటి వాళ్ళ కారు మీద పడి కారు సొట్ట పడి అద్దం పగిలిపోయింది.
తెల్లారి లేచి చూసే సరికి కనిపించింది ఈ దృశ్యం తో శ్రీకాంత్, పక్క వాడితో ఏం గొడవ అవుతుందో అని బయపడి, లోపలికి వెళ్లి కూర్చున్నాడు. అనుకున్నంతా అయ్యింది.
పక్కింటి వెంకటేష్, సొసైటీ సెక్రటరీ ఇద్దరు కలిసి వచ్చి “మీ చెట్టు పడి మా కారు పాడైంది. మీరు విరిగి పడ్డ చెట్టుని తీయించి, మా కారు రిపేర్ చేయించండి” అన్నాడు.
“చూడు వెంకటేష్! మీ క్రికెట్ బాల్ ఎటు వెళ్తుందో తెలియనట్టుగానే వాన ఎప్పుడు వస్తుందో, చెట్టు ఎటువైపు పడుతుందో నాకు ఏమి తెలియదు. మీరు మీ అబ్బాయి మా వస్తువులు బంతి తో పగులుకొట్టినప్పుడు, మీరు బాధ్యత తీసుకోలేదు, యిప్పుడు నాకు కూడా ఏ బాధ్యతా లేదు మీ కారు డామేజ్ గురించి” అన్నాడు శ్రీకాంత్.
కాలనీ సెక్రటరీ కి కూడా అంతకముందు జరిగిన విషయం వివరించి చెప్పాడు శ్రీకాంత్.
“వెంకటేష్ గారు! మీ అబ్బాయి శ్రీకాంత్ గారి యింటి కిటికీ అద్దం పగలుకొట్టినప్పుడు, మీరు బాధ్యత వహించి కొత్త అద్దం వేయించి వుంటే, ఈ నాడు చెట్టు పడటం వలన వచ్చిన నష్టం కి శ్రీకాంత్ గారిని అడగవచ్చు. అప్పుడు మనది కాదుగా అని తప్పించుకుని, యిప్పుడు శ్రీకాంత్ గారిని అడగటానికి రావడమే తప్పు” అన్నాడు కాలనీ సెక్రటరీ.
“కాలనీలో చెట్లు కొట్టించివేయండి, లేదంటే మాకు జరిగినట్లే జరగవచ్చు ఈ వానాకాలం” అంటూ వెళ్ళబోతున్న వెంకటేష్ చెయ్యి పట్టుకుని “ఆగండి, నేను మీకు తెలిసిరావడానికి నాకు సంబంధం లేదన్నాను కానీ, బాధ్యత నుంచి తప్పించు కోలేను. నేను వయసులో పెద్దవాడిని, ఆ మెకానిక్ చుట్టూ తిరగలేను, మీరు రిపేర్ చేయించుకుని బిల్లు ఎంత అయ్యింది చెప్పండి, నేను మీకు డబ్బు యిస్తాను” అన్నాడు శ్రీకాంత్.
శ్రీకాంత్ నిజాయితీ కి సిగ్గు పడ్డ వెంకటేష్, “అక్కర్లేదు అంకుల్, కారు కి వారంటీ వుంది, కంపినివాళ్లు ఫ్రీగా చేస్తారు. మా అబ్బాయి ని హాస్టల్ పెట్టాను, యింట్లో వుండి అల్లరి తప్పా చదువు లేదు” అన్నాడు వెంకటేష్ బయటకి నడుస్తో.
వంటగదిలో నుంచి అంతా గమనిస్తున్న సుమతి బయటకు వచ్చి, “యింత తెలివితక్కువగా మాట్లాడితే ఎలా అండి, ఒకవేళ అతను ఏ పదివేలకో బిల్లు తెస్తే ఏం చేసేవారు” ఆంది.
“ఏమో.. అలా తప్పించుకోవడం అన్యాయం అనిపించింది, అంతే” అన్నాడు శ్రీకాంత్.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Σχόλια