నువ్వే గెలిచావ్..
- Sathyanarayana Murthy M R V
- Jul 6
- 4 min read
#నువ్వేగెలిచావ్, #NuvveGelichav, #MRVSathyanarayanaMurthy, #MRVసత్యనారాయణమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Nuvve Gelichav - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy
Published In manatelugukathalu.com on 06/07/2025
నువ్వే గెలిచావ్ - తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
“మీ అమ్మాయి మాకు కూడా నచ్చింది. మంచిరోజు చూసి తాంబూలాలు పుచ్చాకుందాం” అన్నాడు కేశవరావు. అతని భార్య ధనలక్ష్మి కూడా అంగీకారసూచకంగా నవ్వుతూ తలూపింది.
వారిద్దరి మొహాలు ఆనందంగా ఉండడం, పెళ్లి చూపులు తతంగం తర్వాత ఘట్టం నిశ్చయ తాంబూలాలు వరకూ కొనసాగడం చూసి, స్వాతి తల్లితండ్రులు జగన్నాధం, వసుంధర చాలా సంతోషించారు.
“మరి ఇచ్చి పుచ్చుకోవడాలు గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది” నెమ్మదిగా అన్నాడు జగన్నాధం. దానికి కేశవరావు గట్టిగా నవ్వాడు.
“మేము వరకట్నానికి వ్యతిరేకం. మా అబ్బాయికి వెల కట్టను” అన్నాడు కేశవరావు గంభీరంగా.
ఈసారి మరింతగా సంతోషించారు జగన్నాధం దంపతులు. స్వాతి కూడా కిరణ్ కేసి మెచ్చుకోలుగా చూసింది.
కిరణ్ చిన్నగా నవ్వాడు.
కేశవరావు, కొడుకు కేసి తిరిగి “నువ్వూ అమ్మాయి ఏమైనా మాట్లాడుకోవాలంటే అలా వెళ్లి మాట్లాడుకోండి. నేనూ బావగారూ, ముచ్చట్లు చెప్పుకుంటాం” అని అన్నాడు.
కిరణ్, స్వాతి లేచి బయటకు వచ్చి నెమ్మదిగా నడుచుకుంటూ పక్క వీధిలోనే ఉన్న పార్కుకు వచ్చి సిమెంట్ బెంచీ మీద కూర్చున్నారు.
ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
అరగంట గడిచాక తండ్రి నుండి ఫోన్ వచ్చింది కిరణ్ కి. “వస్తున్నా నాన్నా” అని చెప్పి, “పద స్వాతి, ఇంటికి వెళ్దాం” అని అన్నాడు కిరణ్. ఇద్దరూ స్వాతి వాళ్ళ ఇంటికి వచ్చారు.
“వస్తాం బావగారూ, రెండు రోజుల్లో నాకు ఫోన్ చేసి చెప్పండి” అని జగన్నాధం కి చెప్పి, భార్యా, కొడుకుతో కలిసి కారెక్కి వెళ్ళాడు కేశవరావు.
హాలులో జగన్నాధం వసుంధర, స్వాతి కుర్చీలలో కూర్చున్నారు. తను పార్కు కి వెళ్లేముందున్న ఉత్సాహం, సంతోషం తల్లితండ్రుల ముఖాల్లో లేకపోవడం గమనించింది స్వాతి.
“ఏం నాన్నా, వాళ్ళు ఏమైనా హిరణ్యాక్ష కోరికలు కోరారా? మీరిద్దరూ అలా ఉన్నారు” అడిగింది స్వాతి.
“అబ్బే, అదేం లేదమ్మా. వాళ్ళు బాగానే మాట్లాడారు” అన్నాడు జగన్నాధం.
ఆయన మాటల్లో సహజత్వం లేకపోవడం పసిగట్టింది స్వాతి.
“చూడండి నాన్నా, ఈ పెళ్లి నాది. దీనికి సంబంధించిన ప్రతి విషయం నాకు తెలియాలి. లేకపోతే తర్వాత నేను ఇబ్బంది పడవలిసివస్తుంది. పెళ్లి వేడుకల గురించి, కిరణ్ వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఏమన్నారో నాకు వివరంగా చెప్పండి” అంది గట్టిగా స్వాతి.
కూతురికి కోపం వచ్చిందని గ్రహించాడు జగన్నాధం. “చూడమ్మా స్వాతి, కేశవరావు గారు కొడుక్కి కట్నం వద్దన్నారు గానీ, లాంచనాలు, వేడుకలు అంటూ చాలా చెప్పారు. వాటికి తట్టుకోగలమా? అన్న సందేహం కలుగుతోంది” నెమ్మదిగా అని తలవంచుకున్నాడు జగన్నాధం.
“ముందు వాళ్ళ కోరికల ‘లిస్టు’ చెప్పండి. అప్పుడు వాట్కి మనం తూగగలమా, లేదా? అన్నది తర్వాత ఆలోచిద్దాం” అంది స్వాతి.
“కిరణ్ కి ఇద్దరు అక్కలు ఉన్నారుగదా. వాళ్లకి ‘పానకపు బిందెలు’ వెండి బిందెలు ఇవ్వాలిట.
వాళ్ళు ఇద్దరూ యు. కె. లో ఉంటున్నారుగా. వాళ్ళ ఫ్లైట్ టికెట్లు మనం భరించాలిట. అల్లుళ్ళు ఇద్దరూ వీలుగా ఉంటె పెళ్ళికి వస్తారుట, లేకపోతే లేదుట. వియ్యపురాలి లాంచనంగా, ధనలక్ష్మి గారికి డైమండ్ నెక్లెస్ పెట్టాలిట. పెళ్లి కొడుక్కి వెండి కంచం, వెండి చెంబు, పట్టుబట్టలు ఇవ్వాలిట. అతనికి నచ్చిన నాలుగు సూట్లు అతను కొనుక్కుంటాడట. బిల్లు మనం ఇవ్వాలిట.
అలాగే నిశ్చయ తాంబూలాల రోజున పెళ్లి కొడుక్కి డైమండ్ రింగ్ పెట్టాలిట. నీకు మామూలు రింగ్ ఇస్తారట. అది వారి సంప్రదాయమట. ఒకవేళ ‘ప్రీ వెడ్డింగ్ షూట్’ ఏర్పాటు చేస్తే ఆ ఖర్చులు మనం భరించాలట. ఇది కంపల్సరీ కాదుట. మనకి మినహాయింపు ఇచ్చారు” అని జగన్నాధం చెప్పగానే స్వాతి గట్టిగా నవ్వింది.
“ఫర్వాలేదులే.. మినహాయింపు కూడా ఇచ్చారా ఆ మహానుభావులు. ఊ.. సరే, మిగతా డిమాండ్లు కూడా చెప్పండి” అంది స్వాతి ఆసక్తిగా.
“కనీసం రోజుకు రెండు లక్షలు రెంటు ఉండే, ఏ. సి. ఫంక్షన్ హాలులో పెళ్లి చేయాలిట. వారి బంధువులు, మిత్రులు చాలా మంది వస్తారుట. రెండు భోజనాలు, రెండు టిఫిన్లు ఏర్పాటు చేయాలిట. భోజనాలలో కనీసం ఇరవై అయిటంసు ఉండాలిట. ఎప్పుడు నీళ్ళు అడిగినా ‘మినరల్ వాటర్’ బాటిల్స్ ఇవ్వాలిట. వీడియో షూటింగ్, ఫోటోగ్రాఫర్ ని, వాళ్ళు మాట్లాడుతారట. బిల్లు మనం ఇవ్వాలి. పెళ్ళికి వచ్చిన వారికి ‘రిటర్న్ గిఫ్ట్’ మనం కొని, వాళ్లకి ఇవ్వాలిట. వాళ్ళ బంధువులకి, మిత్రులకి ఆ గిఫ్ట్ వాళ్ళు ఇచ్చుకుంటారట.
పెళ్లి ఇలా గ్రాండ్ గా చేయడం వలన మనకి కూడా పేరొస్తుంది అని అన్నారు. పెళ్లి అయ్యాకా మీరు హనీ మూన్ కి ఫారిన్ వెళితే, ఖర్చు చెరి సహం, పెట్టుకుంటారట..” ఒక క్షణం ఆగారు జగన్నాధం.
‘పోనీ, హనీమూన్ కి వాళ్ళ అబ్బాయిని ఒక్కడినే వెళ్లి రమ్మనండి” అంది స్వాతి గంభీరంగా.
ఆమె మాటలకి జగన్నాధం, వసుంధర గట్టిగా నవ్వారు.
రాత్రి భోజనాలు అయ్యాక తన గదిలోకి వెళ్లి ఆలోచించింది స్వాతి. కిరణ్ తండ్రి అడిగిన ‘గొంతెమ్మ కోరికలు’ అన్నీ తీర్చాలంటే కనీసం ఇరవై లక్షలు కావాలి. ఈమధ్య మగపెళ్లి వారికి ఇదో ‘ఆట’గా మారింది.
మాకు కట్నం అక్కరలేదు, మర్యాదలు చేయండి చాలు, అని అంటున్నారు. కానీ అవి సామాన్య మర్యాదలా?
.. కాదు ‘రాచ మర్యాదలు’.
తన తండ్రి ఎలిమెంటరీ స్కూల్ టీచర్. తనని ఎంతో కష్టపడి బి. టెక్. చదివించాడు. చదువు పూర్తికాగానే ఉద్యోగం వచ్చింది. తను జీతం పొదుపు చేసుకోవడం వలన కొంత డబ్బు దాచుకుంది. తండ్రి రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బు బ్యాంకు లో ఉంది. తన పెళ్లి పేరుతో ఆ డబ్బు ఖర్చు చేయించి, తండ్రిని ఆర్ధిక స్తోమతు లేనివాడిగా చేయడం ఎంతవరకూ సబబు? ఉహూ.. అది చాలా తప్పు. అలా జరగకూడదు.
కిరణ్ కంటే తన పేకేజీ ఎక్కువ. అయినా కిరణ్ తన పట్ల ఎంతో ‘కేర్’ తీసుకుంటున్నాడని, అతనికి ఏ విధమైన చెడు అలవాట్లు లేవని ఈ సంబంధానికి ఒప్పుకుంది. కొంచెం సమయం తీసుకుంటే, మరో మంచి సంబంధం రావచ్చు కదా! చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది స్వాతి.
మర్నాడు సాయంత్రం కిరణ్ కి ఫోన్ చేసి, “చూడండి కిరణ్, మీ నాన్నగారు చెప్పిన పెళ్లి ఏర్పాట్లు మావాళ్ళు చేయలేరు. అందుచేత ఈ సంబంధం వదులుకుంటున్నాము” అని చెప్పింది స్వాతి. కిరణ్ ఆమె చెప్పినదానికి హతాశుడయ్యాడు.
‘స్వాతి అందమైనది, తెలివైనది. తన కంటే ఎక్కువ సంపాదిస్తోంది. ఆమెతో జీవితం పంచుకుంటే ఎంతో హాయిగా ఉంటుందని కలలు కన్నాడు. కానీ కథ అడ్డం తిరిగింది. తండ్రినే ఒప్పించాలి’ అని నిశ్చయించుకుని ఇంటికి వచ్చాడు కిరణ్.
“నాన్నా, స్వాతి వాళ్ళ తల్లితండ్రుల్ని ఇబ్బంది పెట్టవద్దు. వాళ్ళ తాహతుకు తగినట్టిగా మా పెళ్లి చేస్తారు. మీరు కాదనకండి” అని తండ్రిని బ్రతిమాలాడు కిరణ్.
కేశవరావు ‘ససేమిరా వీలు కాదు, నేను చెప్పినట్లే నీ పెళ్లి జరగాలి” అని నిష్కర్షగా చెప్పాడు. తండ్రిని ఒప్పించడం తనవల్ల కాదని గ్రహించాడు కిరణ్.
రెండు రోజులు గడిచాక స్వాతిని కలిసాడు కిరణ్. “నిన్ను నేను వదులుకోలేను స్వాతీ. నన్ను ఏం చేయమంటావో చెప్పు” అని ప్రాధేయపడ్డాడు. స్వాతి ఆలోచించి ఒకమాట, చెప్పింది. దానికి అంగీకరించాడు కిరణ్.
వారం రోజులు గడిచాక ఇంటిముందు టాక్సీ ఆగితే, ఎవరా? అని చూసారు, కేశవరావు, ధనలక్ష్మి.
పెళ్లి దండలతో కారు దిగిన కిరణ్, స్వాతిలను చూసి నిర్ఘాంతపోయారు వాళ్ళు ఇద్దరూ.
“ఇప్పుడే రిజిస్ట్రార్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుని వచ్చాం. మమ్మల్ని ఆశీర్వదించండి. తర్వాత స్వాతి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి” అన్నాడు కిరణ్. చిరునవ్వుతో కొడుకు పక్కనే ఉన్న స్వాతిని చూసి ‘నువ్వే గెలిచావ్’ అని నిట్టూర్చాడు కేశవరావు.
ధనలక్ష్మి ఇంకా ఆ షాక్ నుండి తేరుకోలేదు. వాళ్ళ ఇద్దరివైపూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది.
*******
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comments