'Okadu Masi Okadu Manishi' New Telugu Story
Written By Ch. C. S. Sarma
'ఒకడు మసి.. ఒకడు మనిషి' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
సత్యానంద్... సివిల్ ఇంజనీర్...
సత్యాన్ని... ధర్మాన్ని... న్యాయాన్ని... అన్యాయాన్ని.. ఎరిగిన వాడు...పాటించేవాడు.
అతని తండ్రి సాంబశివరావు... అదే పి.డబ్ల్యు.డి. ఇ.ఇ., కార్యాలయంలో ముప్పై సంవత్సరాలుగా అటెండర్ గా పనిచేసి రిటైర్ అయాడు.
అతని కల... ‘తన కొడుకును... ఇంజనీర్ చేయాలని... తాను పనిచేసిన ఆపీస్ లోనే చేరి ఇంజనీరుగా పని చేయాలని...’ తాను కష్టపడి కొడుకు సత్యానంద్ ను బి.ఇ., సివిల్ ఇంజనీరింగ్... చదివించాడు.
తండ్రి కలను... పండించేదానికి సత్యానంద్.. సాంబశివరావు చెప్పిన ప్రతి మంచి మాటను గౌరవించి... శ్రమించి.. చదివి ఆ తండ్రి ఆశయాన్ని నేరవేర్చ కలిగాడు.
తన ముప్ఫై ఏళ్ల సర్వీసులో... ఆ ఇంజనీర్ ఇ.ఇ.,.ఆపీసుకు ఎందరో ఇంజనీర్లు వచ్చారు. రెండు మూడేళ్లు వుండేవారు... తరువాత బదిలీలో వేరే చోటికి... కొందరు ప్రమోషన్స్ తో వెళ్లిపోయేవారు.
ఆ అందరి వ్యక్తిత్వాన్ని... తత్వాన్ని ఎంతో పరిశీలనగా చూచే సాంబశివరావు తాను చూచిన మంచి వ్యక్తుల గురించి... వారిని గురించి జనం ఏమనుకొంటున్నారనే విషయాన్ని... సత్యానంద్ కు కధలుగా చెప్పేవాడు....
తండ్రి మాటలను ఎంతో శ్రద్ధగా వినేవాడు సత్యానంద్... ‘నన్ను గురించి జనం ఒకనాడు... మంచిగా గొప్పగా చెప్పుకోవాలనేదే’... అతని ఆశయం.
సాంబశివరావు రిటైర్ అయిన నెలరోజుల తర్వాత... సత్యానంద్ ఆ ఆపీస్ లో ఏ.ఈ.గా చేరాడు.
ఇ.ఇ., శంకరయ్యగారు... ఏ.ఇ.ఇ. శకుంతల... మరో ఏ.ఇ., పరంథామ్ ఆ ఆఫీస్ ముఖ్య కార్యవర్గం.
ముందు సత్యానంద్... ఇ.ఇ.గారిని కలిశాడు. వారు అతనికి మిగితా వారినందరినీ పరిచయం చేశారు. అందరికీ సత్యానంద్ గౌరవంగా నమస్కరించాడు.
శకుంతల... అతని ఇమీడియట్ బాస్... సత్యానంద్ కు చేయవలసిన పనులను గురించి వివరించింది.
ఆ సాయంత్రం... ఆరుగంటలకు అందరూ తమతమ ఇండ్లకు బయలుదేరారు.
సత్యానంద్ గ్రామం... ఆ జిల్లా కేంద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో వుంది.
ఆరుగంటల ప్రాంతంలో ఆకాశాన కారుమబ్బులు క్రమ్ముకొన్నాయి. అందరూ హడావిడిగా వెళ్లిపోయారు.
పరంథామ్... సత్యానంద్ లు ఆఫీసులో వుండిపోయారు. ‘‘సత్యానంద్ !... ఇంటికి వెళ్లవా !...” అడిగాడు పరంథామ్...
“సార్ !... మావూరు ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో వుంది. వర్షం కురుస్తూవుంది. వర్షం తగ్గితే.. బస్టాండుకు వెళ్లి లాస్ట్ బస్ ఎక్కాలి. వర్షమా తగ్గేటట్టుగా లేదు !...” విచారంగా ఆకాశం వైపు చూస్తూ చెప్పాడు సత్యానంద్..
క్షణం తర్వాత “మరి సార్ !.. మీరు...” అడిగాడు
“మా ఇల్లు ప్రక్కనే... వర్షపు వేగం తగ్గిందంటే వెళ్లిపోతాను” చెప్పాడు పరంధామ్.
తల ఆడించాడు సత్యానంద్... ‘ఈ వర్షం ఎపుడు తగ్గుతుందో!... తగ్గదో !... హు... మొదటి రోజే ఇలా అయింది. అమ్మా నాన్నా నాకోసం ఎదురు చూస్తూవుంటారు. సర్వేశ్వరా !... తండ్రీ !... నీ గంగమ్మ ప్రవాహాన్ని ఆపుస్వామీ... ఓ అరగంట’ దీనంగా వేడుకొన్నాడు సత్యానంద్.
ఆపీస్ ముందుకు కారు వచ్చి ఆగింది. పోర్టికోలో కారును ఆపి డ్రయివర్ లోనికి వచ్చాడు.
పరంథామ్ కు శల్యూట్ కొట్టాడు...
“సార్!... మా అయ్యగారు కారును పంపించారు. మిమ్మల్ని ఇంటిదగ్గర దించమని...” వినయంగా చెప్పాడు డ్రైవరు.
“ఆ.. పద..” వరండాలోకి ప్రవేశించాడు పరంధామ్.. ఏమనుకొన్నాడో ఏమో వెనుదిరిగి చూచాడు.
“సత్యానంద్ !..”
“సార్ !...
“వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదు... నీవు ఈరోజు మీ గ్రామానికి వెళ్లలేవు... నాతో రా !..”
ఏం చెప్పాలో తోచక సత్యానంద్ దిక్కులు చూచాడు. “మిత్రమా !... సందేహించకు... నేను నీ అన్నయ్యలాంటివాణ్ణి అనుకో... నిర్భయంగా నాతోరా !...” నవ్వుతూ చెప్పాడు పరంధామ్.
సత్యానంద్ కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాన్ని... మేఘావృతమైన ఆకాశాన్ని ఒకసారి చూశాడు.
‘వాతావరణ ప్రభావం రీతిగా పరంధామ్ గారితో వెళ్లక తప్పదు... వూరికి పోలేను...’ అనుకొన్నాడు.
“సరే సార్ !... పదండి...” అన్నాడు.
ఇరువురూ కారు వెనక సీట్లో కూర్చున్నారు. డ్రైవరు కారును స్టార్ట్ చేశాడు. పదినిముషాల్లో కారు పరంధామ్ రూమ్ ముందు ఆగింది.
“సార్ !... వుదయం ఇనస్పెక్షన్ కదా సార్ !... ఎనిమిది గంటలకు వస్తాన్ సార్ !...” చెప్పాడు డ్రైవర్.
“సరే!...” అన్నాడు పరంధామ్.
డ్రైవర్ కారుతో వెళ్లిపోయాడు.
పరంధామ్ తన రూమ్ తలుపులు తెరిచాడు. లైట్స్ ఆన్ చేశాడు.
“రా మిత్రమా!...” చిరునవ్వుతో ఆహ్వానించాడు.
సందేహంతోనే సత్యానంద్ లోన ప్రవేశించాడు.
పరంధామ్... రెస్ట్ రూమ్ లోని గీజర్ ను ఆన్ చేసి హాల్లోకి వచ్చాడు.
“సత్యానంద్... ఇకపై నేను నిన్ను సత్యా అని పిలుస్తాను. నీకు అభ్యంతరం లేదుగా !...”
“లేదు సార్ !...”
“నేను స్నానం చేసివస్తాను.. నీవుచేస్తావా ?...’’
“చేయను సార్... మీరు చేసిరండి...”
పరంథామ్ టీవీని ఆన్ చేశాడు.
“చూస్తూవుండు.. పదినిముషాల్లో వస్తాను....”
పరంధామ్ రెస్టురూమ్ లో ప్రవేశించాడు. సత్యానంద్ టీవీలో వస్తున్న... ‘భరత్ అనే నేను...’ మహేష్ బాబు మూవీని చూడసాగాడు.
పరంధామ్ స్నానం ముగించి డ్రస్ మార్చుకొని వచ్చి సత్యానంద్ ముందున్న సోఫాలో కూర్చున్నాడు.
ప్రక్కనేవున్న మెస్ నుంచి ఓ అబ్బాయి క్యారియర్ తెచ్చి డైనింగు టేబుల్ పై వుంచి వెళ్లిపోయాడు.
సత్యానంద్ రెస్టురూమ్ కు వెళ్లి ఫ్రెష్ అయి వచ్చాడు.
ఇరువురూ భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ ను సమీపించారు.
ఫ్రిజ్ తెరచి విస్కీ బాటిల్ ను రెండు గ్లాసులను టేబుల్ పై వుంచాడు పరంధామ్. వాటిని చూచిన... సత్యానంద్...
“సార్!... నేను తాగను...” అన్నాడు. పరంధామ్ నవ్వాడు.
“సత్యా !... ఎలాంటి కలవరం... కలత లేకుండా స్థిమితంగా భోజనం చేయి. ఇది నీ ఇల్లే అనుకో !.. తాగమని నేను నిన్ను నిర్భంధం చేయను. విత్ యువర్ పర్మిషన్... నేను రెండు పెగ్గులు తీసుకొంటాను... ఓకేనా?...” నవ్వుతూ అడిగాడు పరంథామ్.
“ఓకే సార్ !...”
పరంథామ్ ప్లేటును సత్యానంద్ ముందు వుంచాడు. క్యారియర్ ను విప్పి గిన్నెలను వరుసగా పెట్టాడు. వాటిలో అన్నం... వంకాయ కూర... సాంబార్... దోసకాయ పచ్చడి... చారు... అప్పడాలు వున్నాయి.
“తిను...” అన్నాడు పరంధామ్.
సత్యానంద్ ప్లేట్లో అన్నం... కూర పెట్టుకొని భోంచేయసాగాడు.
పరంధామ్ విస్కీని గ్లాసులో పోసుకొని.. ఐస్ క్యూబ్స్ ను సోడాను వేసుకొని సిప్ చేశాడు.
“సత్యా !.... భోజనం ఎలావుంది?...”
“బాగుంది సార్!...”
“కడుపునిండా తినండి...”
“ఓకే.. సార్ !... థ్యాంక్యూ !...”
పరంధామ్ ఆ గ్లాసును ఖాళీ చేసి మరో గ్లాను నింపుకొని ఓ గుటక వేసి..
“సత్యా !... ఈ ప్రపంచంలో మనుషుల మనుగడ రెండు విధాలుగా సాగుతూవుంది. మొదటిది మన చుట్టూ సిద్ధాంతాల పేరున గిరి గీచుకొని మనుగడను సాగించడం... రెండవది.. సిద్ధాంతాల జోలికి పోకుండా మనకు నచ్చిన... మనం మెచ్చిన మార్గంలో జీవయాత్ర సాగించడం. నేను రెండవ వర్గానికి చెందిన వాణ్ణి. గౌరవంగా బ్రతకాలంటే డబ్బు కావాలి. దాన్ని సంపాదించాలి. మన కోర్కెలను తీర్చుకోవాలి. నేను పేదరికంలో పుట్టాను. అష్టకష్టాలు పడి ఈ స్థితికి వచ్చాను. బ్రదర్ !... లైఫ్ ను ఎంజాయ్ చేయాలి. బ్రతికివున్నంతవరకు ఆనందంగా బ్రతకాలి. ఏమంటావ్?...” సూటిగా సత్యానంద్ ముఖంలోకి చూచాడు పరంధామ్...
సత్యానంద్ వెంటనే జవాబు చెప్పలేదు. లేచి వెళ్లి బేసిన్ లో చేయి కడుక్కొన్నాడు. పరంధామ్ వైపు చూచాడు. అతను భోం చేస్తున్నాడు.
“సార్ !...”
తల ఎత్తి సత్యానంద్ ముఖంలోకి చూచాడు పరంధామ్...
“చెప్పు...” అన్నాడు.
“నాకు నిద్రవస్తోంది సార్ !...” మెల్లగా చెప్పాడు సత్యానంద్.
“వెళ్లి ఆ గదిలో పడుకో....” ఎడంచేతి చూపుడు వేలితో గదిని చూపించాడు... పరంధామ్.
“గుడ్ నైట్ సార్ !..”
పరంధామ్ “గుడ్ నైట్” అన్నాడు. సత్యానంద్ కు తన మాటలు రుచించలేదు... అనుకొన్నాడు పరంధామ్.
సత్యానంద్ గదిలోకి వెళ్లిపోయాడు. తన తండ్రికి ఫోన్ చేసి... ఆఫీస్ విషయాలను... పరంథామ్ పరిచయాన్ని గురించి చెప్పాడు.
అంతవరకు ఇంటికి తిరిగిరాని కొడుకును గురించి ఎంతో వ్యాకులంగా వున్న ఆ తల్లిదండ్రులకు సత్యానంద్ మాటలు శాంతిని కలిగించాయి.
పడకపై వాలాడు సత్యానంద్. అతని మస్తిష్కంలో పరంధామ్ చెప్పిన మాటలు... అతని తత్వాన్ని గురించిన ఆలోచనలు... చివరగా అనుకున్నాడు...
‘నా తత్వానికి ఇతని తత్వం పూర్తి విరుద్ధం... ఇతనితో ఎంత క్లుప్తంగా వుంటే... తనకు అంతమంచిది’ అనుకొన్నాడు సత్యానంద్. కళ్లు మూసుకున్నాడు.
పరంధామ్ భోంచేసి ఆ గదిలోనికి వచ్చాడు. నిద్రపోతున్న సత్యానంద్ ను చూచి ప్రక్క గదిలోకి వెళ్లి పోయాడు.
* * *
మరుదినం... ఆరుగంటలకు సత్యానంద్ లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఆఫీసుకు రెడీ అయాడు. ఎనిమిది గంటలకు లేచాడు పరంధామ్. సత్యానంద్ ను చూచి “అపుడే రెడీ అయావా?...’’ అడిగాడు.
“అవును సార్!... నేను ప్రక్కనవున్న హోటల్ లో టిఫిన్ చేసి ఆఫీసుకు వెళతాను...’’ అన్నాడు సత్యానంద్.
“అలాగే...” క్లుప్తంగా అన్నాడు పరంథామ్.
సత్యానంద్ వీధిలోకి ప్రవేశించి... హెూటల్ లో టిఫిన్ తిని... ఆఫీసుకు చేరాడు.
అతను చేరిన అరగంట తర్వాత శకుంతల ఆపీసుకు వచ్చింది. ప్రీతిగా సత్యానంద్ ను పలకరించింది. వినయంగా ఆమెకు విష్ చేశాడు సత్యానంద్.
కొన్ని బిల్స్ ను ఎంబుక్ లను ఆయనకు ఇచ్చి ఆ బిల్స్ ను ఎలా ఎంబుక్ లో ఎంటర్ చేయాలనే విషయాన్ని అతనికి వివరించింది శకుంతల.
విషయాన్ని అర్థం చేసుకొన్న సత్యానంద్ తన స్థానంలో కూర్చొని పని ప్రారంభించాడు.
సత్యానంద్ సహజంగా చాలా తెలివిగలవాడు. ఒకసారి విన్నాడంటే విషయాన్ని గ్రహించగల మేధావి. శకుంతల తనకు అప్పచెప్పిన బాధ్యతను... ఒంటిగంటకల్లా పూర్తిచేశాడు.
అదే సమయానికి ఇనస్పెక్షన్ ముగించుకొని పరందామ్ ఆఫీసుకొచ్చాడు.
“సత్యా... భోజనం !...”
“చేయాలి సార్!...i”
“సరే రా!... వెళ్లదాం...”
సత్యానంద్ శకుంతల ముఖంలోకి చూచాడు.
అతని భావాన్ని అర్థం చేసుకొన్న శకుంతల...
“సత్యానంద్ !... వెళ్లి భోంచేసి రండి !..” అంది.
పరంధామ్... సత్యానంద్ లు హెూటల్ కు వెళ్లారు. ఇరువురు స్పెషల్ మిల్స్ కు ఆర్డరు ఇచ్చేశారు.
బేరర్ కంచాలు వారి ముందు వుంచి అన్నీ వడ్డించాడు.
ఇరువురూ తినడం ప్రారంభించారు.
“సార్ !...”
“చెప్పు సత్యా !...”
“నేను సాయంత్రం మా వూరికి వెళ్లి వుదయాన్నే వస్తాను...”
“ఆ... వెళ్లిరా!...” క్షణం తర్వాత... “మనిద్దరికి బాస్ శకుంతల... ఆమెకు కూడ ఓ మాట చెప్పు...” అన్నాడు పరంథామ్.
“అలాగే సార్ !...”
భోజనాననంతరం ఇరువురు ఆఫీసుకు వచ్చారు. ఓ సైట్ ఇనస్పెక్షన్ కు బయలుదేరిన శకుంతల సత్యానంద్ ను తనతో రమ్మంది. ఇరువురూ జీప్ లో బయలుదేరారు.
పని ముగిసింది. ఆరుగంటలకు తిరిగి వచ్చేదారిలోనే బస్టాండ్. అక్కడ దిగి బస్సులో తన వూరికి వెళ్లాలనుకున్నాడు సత్యానంద్.
“మేడమ్ !...”
“చెప్పండి... సత్యానంద్ !...”
“మావూరు ఇక్కడికి ఇరవై కిలోమీటర్లు. మా వూరికి వెళ్లి వుదయాన్నే వస్తాను మేడమ్ !...” సౌమ్యంగా అడిగాడు సత్యానంద్...
“అలాగే వెళ్లిరండి...” అంది శకుంతల.
జీప్ బస్టాండు దగ్గరకు చేరింది. శకుంతల చెప్పగా డ్రైవరు జీప్ ను ఆపాడు. సత్యానంద్ దిగాడు.
“థాంక్యూ మేడమ్ !...” వినయంగా చెప్పాడు సత్యానంద్.
“జాగ్రత్తగా వెళ్లిరండి... ఆఫీస్ పదిగంటలకు...” చిరునవ్వుతో చెప్పింది శకుంతల.
“అలాగే మేడమ్...” కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించాడు సత్యానంద్.
* * *
మరుదినం తొమ్మిదన్నరకల్లా ఆఫీస్కు చేరాడు సత్యానంద్. ఆరుగంటలకు ఆఫీస్ వదలిన తర్వాత నిన్న సైట్ నుంచి తిరిగి వస్తూ తాను చూచిన ‘టులెట్ బోర్డు ఇంటిని సమీపించాడు. వీధిగేటు ముందు’ నిలబడి లోనికి చూచాడు.
వరండాలో నిలబడివున్న డెబ్భై ఏళ్ల మనిషి...
“మీరెవరు బాబూ !...” అడిగాడు గేటును సమీపించి.
తన వివరాలు చెప్పాడు సత్యానంద్.
వారి పేరు అచ్యుతరామయ్య... కాంట్రాక్టర్. సత్యానంద్ తన తండ్రి పేరు సాంబశివరావు అని చెప్పగానే... అచ్యుతరామయ్యగారు గేటు తెరచి సత్యానంద్ కు ఎంతో గౌరవంగా లోనికి ఆహ్వానించాడు. ఖాళీ ఇంటి భాగాన్ని చూపించాడు ఆనందంగా....
మేడమీద వున్న ఆ భాగం సత్యానంద్ కు నచ్చింది.
“అద్దె ఎంత సార్ !...”
“ఆరువేలు... నీవు మా సాంబశివరావు కొడుకువు కాబట్టి ఐదువేలు ఇవ్వు !...” నవ్వుతూ చెప్పాడు అచ్చుతరామయ్య.
వెంటనే... సత్యానంద్ జేబులోంచి ఐదువేలు తీసి వారి చేతిలో వుంచాడు.
“మరి ఇంట్లోకి ఎపుడు వస్తావ్ ?...”
“మీరు సరే అంటే... మరో అరగంటలో వచ్చేస్తాన్ సార్ !...” ప్రాధేయపూర్వకంగా చెప్పాడు సత్యానంద్.
“నాకు ఎలాంటి అభ్యంతరం లేదు... వచ్చేయండి...” నవ్వుతూ చెప్పాడు అచ్చుతరామయ్య.
వారికి ధన్యవాదాలు తెలియచేసి ఆపీస్ కు వచ్చి తన బ్యాగ్ తీసుకొని గంటలో ఆ తన పోర్షన్ లోకి ప్రవేశించాడు సత్యానంద్.
* * *
ఆరోజు ఆదివారం. అప్పటికి సత్యానంద్ ఉద్యోగంలో చేరి మూడు మాసాలు గడిచాయి. ఆ ఆఫీస్ కార్యకలాపాలు సత్యానంద్ కి చాలా వరకు అర్థం అయాయి. అచ్చుతరామయ్య సత్యానంద్ కు మంచి ఆప్తుడైనాడు.
సమయం వుదయం ఏడుగంటల ప్రాంతం... హడావిడిగా సత్యానంద్ గదికి వచ్చాడు పరంధామ్. మూసివున్న తలుపులు గట్టిగా తట్టాడు.
రెస్టురూమ్ లో వున్న సత్యానంద్ పరుగున వచ్చి తలుపు తెరిచాడు. ఎదురుగా అప్రసన్నంగా వున్న పరంధామ్ ను చూచాడు. పరంధామ్ లోపలికి ప్రవేశించి తలుపు మూశాడు. సత్యానంద్ ఆశ్చర్య పోయాడు.
తన చేతిలోని సూట్కేసును సత్యానంద్ కు అందించి...
“నేను రెండు గంటల తర్వాత వస్తా !... దీన్ని జాగ్రత్తగా వుంచు... జాగ్రత్త...” అంటూ మరోసారి చెప్పి వేగంగా వెళ్లిపోయాడు పరంధామ్.
సత్యానంద్ బిత్తరపోయాడు. అతనికి అంతా అయోమయంగా తోచింది. చేతిలోని చిన్న సూట్కేసును పరీక్షగా చూచాడు. అతని మనస్సున అనుమానం....
“ఇందు ఏముంది?...” పరంధామ్ ఎందుకు అంత హడావిడిగా వచ్చి వెళ్లిపోయాడు ?... విషయం ఏమిటి ?... అంతా అయోమయం... చెమటలు కమ్మాయి సత్యానంద్ కు... కుర్చీలో కూలబడ్డాడు. శరీరంలో వణుకు... భయంతో కంపించాడు. పదినిముషాలకు తేరుకొని... క్రింద పెట్టిన సూట్కేసును చేతిలోకి తీసుకొని వీధిలోకి వచ్చి ఆటోలో కూర్చొని నేరుగా శకుంతల ఇంటికి చేరాడు.
అంత వుదయాన్నే... అదీ ఆదివారం నాడు... ఎన్నడూ తన ఇంటికి రాని సత్యానంద్ ను చూచి శకుంతల ఆశ్చర్య పోయింది.
“సత్యా ఏమిటి విషయం ?... ఆదరంగా అడిగింది.
తన చేతిలోని సూట్ కేసును శకుంతలకు చూపి “దీన్ని పరంధామ్... నా చేతికి ఇచ్చి రెండు గంటల్లో వస్తానని చెప్పి పరిగెత్తాడు. నాకు ఏదో అనుమానంగా వుంది...” ఆవేదనతో చెప్పాడు సత్యానంద్.
శకుంతల ఆ బ్రీఫ్ కేసును అందుకొని తల పిన్నుతో తెరచి చూచింది. టు థౌజండ్ నోట్ల కట్టలు... సత్యానంద్ కళ్లు గిర్రున తిరిగాయి.
శకుంతలకు విషయం అర్ధం అయింది.... సత్యానంద్ చేతిని తన చేతిలోకి తీసుకొని...
“భయపడకు నాతో రా !...” అంది.
తూలి కిందపడతానేమో అనే స్థితిలో సత్యానంద్ ఆమెను అనుసరించాడు.
ఇరువురూ కార్లో కూర్చున్నారు. శకుంతల కారును స్టార్ట్ చేసింది. ఇరవై నిముషాల్లో కారు పోలీస్టేషన్ ముందు ఆగింది. బ్రీఫ్ కేసుతో ముందు శకుంతల... వెనుక బిక్క ముఖంతో సత్యానంద్ స్టేషన్లో ప్రవేశించారు.
అదే సమయానికి... కాంట్రాక్టర్ కళ్యాణ్ రావు అక్కడ వుండటాన్ని చూచింది శకుంతల. ఆమెకు విషయం పూర్తిగా అర్థం అయింది.
కళ్యాణ్ రావు వినయంగా శకుంతలకు నమస్కరించాడు. సబ్ ఇనస్పెక్టర్ ఆమెను గౌరవంగా పలకరిస్తూ “కూర్చోండి” అన్నాడు.
శకుంతల కుర్చీలో కూర్చుంది. ఆమె పక్కన భయంతో అచేతనంగా సత్యానంద్.
తన చేతిలోని బ్రీఫ్ కేసును టేబుల్ పై వుంచి... సత్యానంద్ తనకు చెప్పిన కథను... పరంధామ్ సత్యానంద్ లకు ఉన్న సంబంధం గురించి ఇనస్పెక్టరు గారికి వివరంగా తెలియచేసింది శకుంతల.
ఇనస్పెక్టర్ బ్రీఫ్ కేసు తెరిచాడు.
“సార్ !... ఈ నోట్లు నేను ఇచ్చినవే... ఇవి నావే !...” ఆవేశంగా చెప్పాడు కళ్యాణ్ రావు.
ఇనస్పెక్టర్ నలుగురు పోలీసులను పరంధామ్ ను అరెస్టు చేసి తీసుకురావాలసిందిగా చెప్పి పంపించాడు.
“ఐదు లక్షలు ఇస్తేగాని బిల్ ను యం.బుక్ లో ఎంటర్ చేయనని బెదిరించి వాడు నా దగ్గర ఈ సొమ్మును తీసుకొన్నాడు. నష్టంతో ఆపని చేస్తున్నా... నేను వాడికి ఇవ్వక తప్పలేదు సార్....” దీనంగా చెప్పాడు కళ్యాణ్ రావు.
కన్నీటితో శకుంతలకు చేతులు జోడించి నమస్కరించాడు.
“మీరు కృతజ్ఞతలు చెప్పవలసింది నాకు కాదు... ఈ సత్యానంద్ కు...” చిరునవ్వుతో చెప్పింది శకుంతల.
సత్యానంద్ అయోమయంగా శకుంతల ముఖంలోకి చూచాడు.
* * *
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
コメント