ఒకే గూటి పక్షులు
- Sudha Vishwam Akondi

- Oct 15
- 5 min read
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #TeluguInspirationalStories, #OkeGutiPakshulu, #ఒకేగూటిపక్షులు

Oke guti Pakshulu - New Telugu Story Written By Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 15/10/2025
ఒకే గూటి పక్షులు - తెలుగు కథ
రచన: సుధావిశ్వం ఆకొండి
"మళ్లీ ఒకసారి ఆలోచించు రామేశ్వర్! రక్త సంబంధం కదా.. మనిషికి పుట్టుకతో ఏర్పడిన సంబంధాలు తెంచుకోవడం భావ్యం కాదు! అది కూడా చిన్న చిన్న విషయాల్లో.. " అని చెబుతున్న లాయర్ విశ్వనాథం మాటలకు మధ్యలోనే అడ్డు తగిలాడు రామేశ్వర్ పూర్తిగా వినకుండా.
"చెప్పేది విను! నేను బాగా ఆలోచించే డిసైడ్ అయ్యాను! తనకు లేని ప్రేమాభిమానాలు నాకు ఎందుకు ఉండాలి? ఎంత ఓర్పుతో ఉన్నాను! మనిషి సహనానికి అంతు ఉంటుంది. మీరు కేసు ఫైల్ చేయండి! లేదంటే వేరే లాయర్ ను సంప్రదిస్తాను! స్నేహితుడివని నీ వద్దకు వచ్చాను!.. " ఆవేశంగా అంటూనే ఉన్నాడు రామేశ్వర్.
"అదికాదు నా మాట విను! ఆవేశంలో తీసుకునే నిర్ణయం అనర్థానికి దారితీస్తుంది. మీ ఇద్దరూ మంచి స్థితిలో ఉన్నారు. ఆ ఒక్కటీ తక్కువ అవుతుందా?"
"ఆ విషయం దానికి చెప్పు! అమ్మ నగలు మొత్తం అదే తీసుకుపోయింది. పోనీ అని ఊరుకున్నా ఎంతెంత మాటలు అన్నదో తెలుసా?"
ఇలా చాలాసేపు చర్చ జరిగాక పిటిషన్ రెడీ అయ్యాక, రామేశ్వర్ సంతకం తీసుకుని ఫైల్ చేస్తానని చెప్పి, పంపించాడు లాయర్.
అతను వెళ్ళిపోయాక నిట్టూర్చాడు.
***
"ఏమైంది?" అని అడిగింది ఇంటికి వచ్చిన భర్తను రామేశ్వర్ భార్య గౌరి.
"కేసు ఫైల్ చేస్తానని అన్నాడు. పిటిషన్ రెడీ అయ్యాక చెప్తానని అన్నాడు"
మొగుడికి కొన్ని నెలలనుంచీ నచ్చజెప్పాలని ప్రయత్నం చేసి, విఫలం అయ్యింది గౌరి. ఇప్పుడు ఇక నచ్చజెప్పే ఓపిక లేదు ఆమెకు. ఎంత చెప్పినా అతని నిర్ణయం మారదని అర్థం అయ్యింది. అతను ఆ నిర్ణయం రావడానికి చాలా వేదన దాగి ఉంది అతనిలో. అందుకే ఇక ఆ విషయంలో చెప్పడం విరమించుకుంది ఆమె.
భర్తకు, పిల్లలకు భోజనం వడ్డించి, తను తినేసి, వంటిల్లు సర్దుకుని వచ్చేసరికి పది, పన్నెండు వయసులో ఉన్న పిల్లలు పడుకున్నారు. ఏదో పుస్తకం చదువుతూ కూర్చునే భర్త కూడా నిద్రపోయాడు. మానసికంగా అలిసిపోతే అయితే అతినిద్ర అయినా వస్తుంది లేదంటే అసలు నిద్రే రాదు అనిపించింది ఆమెకు.
తను కూడా నడుంవాల్చి నిద్రపోవడానికి ప్రయత్నం చేయబోయింది. జరిగిన సంఘటన ఆమెకు గుర్తుకు రావడం మొదలుపెట్టింది.
***
రామేశ్వర్ కు ఒకే ఒక్క చెల్లెలు. ఆమె పేరు మృదుల. పెళ్ళికి ముందువరకు ఇద్దరూ ఎంతో సఖ్యంగా ఉండేవారు. అన్న అంటే చెల్లికి, చెల్లి అంటే అన్నకు ప్రేమ. ఎవరైనా తిడితే ఒకరికొకరు సపోర్ట్ గా ఉండేవారు. అలాంటిది గౌరి కొత్తకోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టగానే నెమ్మదిగా అన్నాచెల్లెళ్ల మధ్య దూరం పెరిగింది. దానికి కారణం గౌరి కానేకాదు.
మృదుల తన పేరుకు వ్యతిరేకంగా దుందుడుకు స్వభావం, ఈర్ష్య తనకే తెలియకుండా తనలో ఏర్పరచుకుంది. ఏదైనా విషయంలో తనకు సపోర్ట్ గా భర్త మాట్లాడితే వెంటనే మృదులకు బుస్సున కోపం వచ్చేది! కానీ కారణం అదీ అని తెలియకుండా ఏదో ఒకదానికి గొడవలు పెట్టుకునేది.
గౌరి అదృష్టం వల్ల అత్తామామలు బాగానే ఉన్నారు. గౌరిని కూతురుగానే చూశారు. కానీ తమ పెళ్లి అయిన అయిదు ఏళ్ళకి అత్తగారు, ఆ వెంటనే నెలల వ్యవధిలో మామగారు పైకి వెళ్ళిపోయారు.
ఈ అకారణ ద్వేషంతో ఏదో ఒకటి అంటూ గౌరి మనసు గాయపరిచేది మృదుల.
అత్తగారు ఉన్నప్పుడు..
"నా నగలు ఇద్దరికీ చెరి సగం పంచుతాను. పంచకుండా పోతే మీరే ఇద్దరూ సమంగా తీసుకోండి!" అని చెబుతూ ఉన్నా, ఆ మాటలు తేలిగ్గా కొట్టిపారేసింది మృదుల
"మా అమ్మవి అన్నీ నావే" అని అనేది.
అన్నట్లుగానే తల్లి పోగానే అన్ని నగలు తనే తీసుకుని వెళ్ళింది. అలాగని మృదుల డబ్బు సమస్యల్లో కూరుకుపోయిన ఫ్యామిలీ కాదు. మంచి ధనవంతులు అయిన కుటుంబంలోకి వెళ్ళింది. అయినా తృప్తి లేదు తనకి.
రామేశ్వర్ కూడా ఇంజినీరింగ్ చేసి మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న గౌరి పరిచయం అయ్యింది. ఇద్దరి స్వభావాలు దగ్గరగా ఉండడంతో ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది.
ఇరుకుటుంబాలవారు అంగీకరించారు. ఇద్దరికీ పెళ్లి అయి కొత్తకోడలిగా గౌరి ఇంట్లోకి అడుగుపెట్టింది.
అన్నావదినలు కాస్త నవ్వుకుంటూ మాట్లాడుకున్నా, సరదాగా మాట్లాడుతూ భుజం తట్టినా ఒళ్ళు మండిపోయేది మృదులకు. కలిసి వాళ్ళిద్దరూ సినిమాకు వెళ్ళినా కోపం వచ్చేది. తల్లికి వదినపైన చాడీలు చెప్పేది. కానీ ఆవిడ మృదులకే అలా అనకూడదని చెప్పేది. తనకు అవసరం ఉంటే చక్కగా మాట్లాడుతుంది.
సైకాలజిస్టు వద్దకు తీసుకుని వెళితే, కోపం వచ్చింది. మధ్య దారిలో రోడ్డుపైన గొడవ చేసింది. కొందరు కుటుంబంలో తల్లిదండ్రులు, తోబుట్టువులు తమ ప్రేమను పంచినా స్వీకరించరు. తనకి కోపం వస్తే తిట్టుకోవడానికి, తప్పులు తీసి, నోరు పారేసుకోవడానికి సాధనాలుగా మాత్రమే తల్లిదండ్రులుగాని, తోబుట్టువులుగాని అని అన్నట్లుగా ప్రవర్తిస్తారు.
మృదుల పెళ్ళి అయిన కొత్తలో ఆమె భర్త చేస్తున్న వ్యాపారంలో చాలా నష్టాలు వచ్చాయి. వున్న బంగారం అమ్ముకునే స్థితిలో ఉన్నారు. అదే సమయంలో రామేశ్వర్ దంపతులకు సాఫ్ట్వేర్ జాబ్స్ పోయి, వెదుకులాటలో ఉన్నారు. వున్న అమౌంట్ తో జాగ్రత్తగా సంసారాన్ని నడుపుకుంటూ వచ్చింది గౌరి. ఇద్దరి పరిస్థితి బాగులేదు.
ఆ సమయంలో తన కూతురు మొదటి పుట్టినరోజు గ్రాండ్ గా చేయాలని మృదుల దంపతులు అనుకున్నారు. అప్పులు తెచ్చి, మరీ ఏర్పాటు చేసుకున్నారు. ఆన్లైన్లో, తెలిసిన వారి వద్ద షాపింగ్ బాగానే చేసేది మృదుల. అప్పుడు కూడా తెలిసిన వారి వద్ద చీరలు తీసుకుంది. తనతో పాటుగా గౌరికి కూడా తీసుకుని, ఇంటికి వచ్చింది. చీర తీసుకొమ్మని చేతికి ఇచ్చింది.
"నా పరిస్థితి ఎలా ఉందో, చెల్లి పరిస్థితి అలాగే ఉంది. బావ కూడా జాగ్రత్తపరుడు కాదు. ఇప్పుడు సింపుల్ గా చేసుకుని, కాలం కలిసి వచ్చాక గ్రాండ్ గా చేసుకోవచ్చు కదా! కానీ చెప్పినా వినరు! మనకు వీలు అయినంత సాయం చేయాలి. నేనూ ఇవ్వగలిగే పరిస్థితి లేదు. కాబట్టి తను బట్టలు పట్టుకొచ్చి ఇస్తే, తీసుకోవద్దు!" అని రామేశ్వర్ అన్నాడు గౌరీతో ముందుగానే.
గౌరి కూడా అంగీకరించింది. అందుకని ఇప్పుడు ఆ చీర వద్దని అంది.
"ఇప్పుడు వద్దమ్మా! వున్న చీరలు చాలు!" అంటే కోపంగా
"నేను చాలా కాస్ట్ లీ చీర తేలేదు. సింపుల్ గా తక్కువ రకం చీరనే తెచ్చాను. మా వాళ్ళకి కాస్ట్ లీ తీసుకోవలసి వచ్చింది. పెద్దగా కటింగ్ ఇవ్వకు! తీసుకుంటే తీసుకో! లేదంటే లేదు!" అని అక్కడ్నుంచి చరచరా వెళ్ళిపోయింది.
అన్న రామేశ్వర్ కు కూడా ఇవ్వబోతే అతను కూడా అలా అనేసరికి కోపం వచ్చేసింది.
ఇక అప్పట్నుంచి కోపం పెరిగి, తల్లి సర్ది చెబితే కూడా వినలేదు. ఆ తర్వాత పరిస్థితి బాగుపడినా ఆ కోపం పోలేదు. పైకి ఏదోలా మాట్లాడినా, లోపల్నించి కోపం బయటకు వస్తుంది.
ఓసారి మృదుల ఇంటికి వెళ్ళారు రామేశ్వర్ దంపతులు. బయటకు వెళ్ళి వచ్చిన మృదుల, సరదాగా మాట్లాడుకుంటున్న రామేశ్వర్ దంపతులను చూసింది.
గౌరిని ఒంటరిగా దొరకబుచ్చుకుని..
"ఎక్కడ ఉన్నాం! ఏం చేస్తున్నామని లేదా? కంట్రోల్ చేసుకోలేరా? కామం బాగా పెరిగి పోయింది.. " అనకూడని పిచ్చి మాటలు మాట్లాడింది గౌరీతో.
ఆ మాటలు విన్న రామేశ్వర్ కి చాలా కోపం వచ్చింది. అలా మాటా మాటా పెరిగింది. అప్పట్నుంచి ముఖాముఖాలు చూసుకోవడం లేదు ఇద్దరూ. ఊళ్ళో ఉన్న తాతలనాటి ఇల్లు తనకు కావాలని మృదుల గొడవ పెట్టింది. అన్నని సంతకం చేయమంది. ఇంతకుముందు అయితే చేసేవాడే కానీ ఇప్పుడు తను కూడా ఒప్పుకోలేదు.
"నువ్వే సంతకం చెయ్యి. ఆ యిల్లు నాకే కావాలి" అని అన్న డిమాండ్.
మృదుల కోపంతో ఆడపిల్లకి ఇచ్చిన ఆస్తి అది అని కేసు ఫైల్ చేసింది. అందుకే కోపంతో తను కూడా పిటిషన్ వెయ్యమని లాయర్ ఫ్రెండ్ ను కలిశాడు. అదంతా తలుచుకుని నిట్టూర్చింది గౌరి.
*****
అర్ధరాత్రి ఆకస్మాత్తుగా మెలకువ వచ్చింది రామేశ్వర్ కు. గొంతు తడారిపోయినట్లుగా అనిపించింది. నీళ్లు తాగుదామని కిచెన్ వైపుకు వెళ్ళాడు. కిచెన్ వైపు బాల్కనీలో ఎవరో ఏడుస్తున్న శబ్దం వినబడి, కిటికీ నుండి చూసాడు.
"మనం ఇద్దరిని రెండు కళ్ళల్లా చూసుకున్నాం! ఇద్దరూ ఎంతో ప్రేమగా ఒకరికొకరు తోడుగా ఉండాలని, ఒకరి క్షేమం మరొకరు చూడాలని ఎన్నో చెప్పాం. ఒకే గూటిలో ఉన్న పసికూనలైన పక్షుల్లా, ఒక కొమ్మకు పూచిన పూవుల్లా కలిసివుండాలి, ఏ గొడవలు పెట్టుకోకూడదని చెప్పాం!
అదంతా వదిలేసి, ఈ చిన్న ఇల్లు కోసం కోర్టుకెక్కారు.
పిల్లలను కని, పెంచి, మంచి బుద్ధు, లు చెప్పేవరకే మన బాధ్యత. పేరెంట్స్ అంటే గౌరవం లేని వాళ్లకు మనం ఎంత రోదించినా అర్థం చేసుకుంటారా? ఇంకా బ్రతికిఉంటే మనల్ని ఇంట్లోంచి గెంటేవారు. మనం అదృష్టవంతులమే!.." తండ్రి తల్లితో అంటున్నాడు. తల్లి రోదిస్తోంది.
అదంతా విని బాల్కనీ తలుపుతీసి, వారున్న చోటికి వెళ్ళి, ఏడ్చాడు రామేశ్వర్.
"అమ్మా! నాన్నా! మీరు ఇంతగా బాధపడుతున్నారని అనుకోలేదు. నేను చేసింది తప్పే! ఆ యిల్లు చెల్లికే ఇచ్చేస్తాను. అదేమన్నా పట్టించుకోను!.. " అని అన్నాడు.
"ఒరేయ్! నిన్ను మాటలుపడుతూ ఉండమని అనలేదు. ఆ ఇల్లు కోసం గొడవ పెట్టుకుని కోర్టుకి వెళ్లడం బాధ కలిగించింది. తనలో మార్పు వచ్చేవరకూ దూరంగా ఉంటూ దాని మంచికోరుకో ! అది చాలురా!" అంది తల్లి.
అమ్మ కాళ్ళ వద్ద తల పెట్టాడు ఏడుస్తూ..
ఆమె ఆప్యాయంగా తలపై చేయి వేసింది.
చిన్నప్పుడు తను, చెల్లి ఆడుకోవడం, బ్యాంకు మేనేజర్ అయిన తండ్రికి కేరళకి బదిలీ అయినప్పుడు, అక్కడ అరటి ఆకులతో గొడుగు చేసి, చిన్నగా వాన తుంపరలు పడుతుంటే ఆ గొడుగు పట్టుకుని ఆడుకోవడం, అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు పక్షిగూళ్లలో బుల్లి పక్షులు కలిసి ఉండడం చూసి, అలా ఎప్పుడూ కలిసి ఉండాలని అమ్మమ్మ చెప్పిన విషయాలు, కథలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకురాసాగాయి రామేశ్వర్ కి.
ఇంతలో "ఏంటండీ! ఇక్కడ పడుకున్నారు?" అంటూ గౌరి వచ్చింది.
'కలా! కలలాంటి నిజమా!' అనుకుంటూ లోపలికి వెళ్లాడు.
*****
"మృదులా! కేసు విత్ డ్రా చేసుకుని, ఆ ఇల్లు నువ్వే తీసుకో! గొడవలు వద్దు. ఎప్పుడూ నేను నీ మంచి కోరుకుంటాను. నిన్ను బాధపెట్టి ఉంటే సారీరా!"
"నాకేమీ వద్దు. నువ్వే తీసుకో! కేసు విత్ డ్రా చేసుకుంటాను నేను. నువ్వే నన్ను క్షమించాలి అన్నయ్యా! నేనే బుర్ర తక్కువగా ప్రవర్తించాను" అంది మృదుల.
"మీ అన్నయ్య లాగే నీకు కూడా మీ అమ్మానాన్న కనిపించారా!" అని అడిగింది గౌరి రామేశ్వర్ వద్ద నుండి ఫోన్ తీసుకుని మాట్లాడుతూ.
"అవును వదినా! అప్పుడే బాగా ఆలోచించాను. నా తప్పు నాకు తెలిసింది"
"పోనీలే! ఇప్పటికి అంతా సర్దుకుని, ప్రశాంతంగా గొడవలు లేకుండా పోయినందుకు ఆ భగవంతుని కృతజ్ఞతతో ప్రార్థిస్తాను!" అంది గౌరి సంతోషంగా.
పైలోకాల నుంచి పితృదేవతలు వారిని దీవించారు.

-సుధావిశ్వం




Comments