'Okka Mathra' New Telugu Story
Written By Ch. C. S. Sarma
'ఒక్క మాత్ర' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
దుప్పటి కప్పుకొని చలికి వణుకుతూ.. ‘‘అమ్మా!.. అమ్మా!..’’ అంటూ మూలుగుతూ కళ్లు మూసుకొనివుంది చంగాళమ్మ.
‘‘అమ్మా!..’’ పిలిచాడు చిన్నా..
‘‘మెల్లగా కళ్లు తెరిచింది చంగాళమ్మ. భర్త.. కొడుకు ముఖాలను చూచింది.
‘‘ఒరేయ్!.. ఆయన్ను ఎందుకు పిలుచుకొచ్చావురా!..’’ అంత జ్వరంలోనూ ఆవేశంగా అడిగింది.
‘‘అమ్మా!.. నాన్నేనమ్మా!.. ఆయనా డాక్టర్ కదా!..’’
‘‘ఏడిశావ్‌లే!.. ప్రక్కవీధిలో వున్న కోటేశ్వరరావు అన్నయ్యను పిలుచుకొనిరా.. ఫో!..’’ అసహనంగా చెప్పింది చంగాళమ్మ.
‘‘చంగాళూ!..’’ ప్రీతిగా పిలిచాడు రామ్‌ప్రసాద్.
‘‘మీరు వెళ్లి మీపని చూసుకోండి..మీవైద్యం.. మందులు నాకు అనవసరం.. మీరు మా అమ్మను మీ మందులతో చంపారు..’’ అసహ్యించుకొంది చంగాళమ్మ.
భార్య తత్వం ఎరిగిన రామప్రసాద్ నిట్టూర్చి మౌనంగా క్లినిక్‌లోకి వెళ్లిపోయాడు.
చిన్నా మెడికల్ షాప్ అంకుల్ కోటేశ్వరరావు వద్దకు వెళ్లాడు.
&&&&&
ప్రస్తుతంలో రామ్‌ప్రసాద్‌గారి వయస్సు.. యాభై.. చంగాళమ్మగారి వయస్సు నలభై రెండు.. చిన్నా వయస్సు ఇరవై సంవత్సరాలు. ‘లా’ చదువుతున్నాడు. గొప్ప న్యాయవాది కావాలని.. చిన్నా ఆశయం..
రామ్‌ప్రసాద్ ఆర్.ఎం.పి.డాక్టర్. అతని వైద్యం మీద చంగాళమ్మకు నమ్మకం లేదు. దానికి బలమైన కారణం వుంది. అప్పటికి చిన్నా ఇంటర్ సెకండ్ ఇయర్. ఈ సంఘటన జరిగి సంవత్సరం కావస్తూవుంది.. రామ్‌ప్రసాద్.. చంగాళమ్మ చిన్నా.. చంగాళమ్మగారి గ్రామానికి తిరుణాలు చూచేదానికి వచ్చారు. శివాలయంలో సప్తాహ్నిక ఉత్సవాలు. చంగాళమ్మ తండ్రి బలరామశర్మ ఆ దేవాలయ ట్రస్టీ. ఆలయ పూజా కార్యక్రమాలు ఆ బలరామశర్మగారి ఆధ్వర్యంలోనే జరుగుతాయి.
ఆరోజు వారి వుభయం. రావణాసేవ.. ఆ ఉదయాన్నించీ చంగాళమ్మ తల్లి యశోద జ్వరమని మంచం పట్టింది. ఆర్.ఎం.పీ. అల్లుడు రామ్‌ప్రసాద్ ప్రక్కనే వున్న తాలూకాకు వెళ్లి ఏవో కొన్ని మందులు తీసుకొనివచ్చి యశోదకు ఇచ్చాడు. సాయంత్రానికి యశోదకు జ్వరం తగ్గిపోయింది. అందరికీ ఆనందం.. ఆ రాత్రి రావణా సేవ వూరేగింపు ఘనంగా జరిపించారు బలరామ శర్మగారు.
మరుదినం యశోదమ్మకు జ్వరం తిరగబెట్టింది. రామప్రసాద్ తాను తెచ్చిన మందలు వాడాడు. కొన్ని గంటల్లో జ్వరం తగ్గింది.
చంగాళమ్మకు తన తల్లిని పట్నం తీసుకెళ్లి మంచి డాక్టర్‌కు చూపించాలనే తాపత్రయం. అందుకు తన తండ్రి.. రామప్రసాద్‌లు.. వ్యతిరేకం.. మూడవరోజు రాత్రి విపరీతమైన జ్వరంతో యశోదమ్మ బాధపడసాగారు. అందరికీ భయం.. రాత్రి సమయం. అక్కడికి పట్నం ఐదుకిలోమీటర్లు. రెండెడ్ల బండిలో ఆ రాత్రి సమయంలో యశోదమ్మను చంగాళమ్మ బలవంతంమీద పట్నం తరలించారు. యశోదమ్మ మార్గమధ్యంలో కన్నుమూసింది.
చంగాళమ్మ.. అందరూ భోరున ఏడ్చారు. తన తల్లి చావుకు కారణం తన భర్త రామ్‌ప్రసాద్ ఆర్.ఎం.పీ యేనని.. చంగాళమ్మ మనస్సున చెరగని ముద్ర పడిపోయింది. భర్త వైద్యంమీద ఆమెకు నమ్మకం లేకుండా పోయింది.
భార్యగా తన ధర్మాన్ని తాను.. రామ్‌పస్రాద్ విషయంలో వంటవండిపెట్టడం సక్రమంగా చేసేది. ఇరువురి మధ్య మాటలు లేవు.
అత్తగారు పోయిన నాటినుంచీ.. రామ్‌పస్రాద్‌కు భార్య అంటే భయం.. చొరవగా దరికి చేరి మాట్లాడలేక పోయేవాడు..
చంగాళమ్మ దృష్టిలో భర్త రామ్‌ప్రసాద్ తన తల్లిని చంపిన హంతకుడు.. మంచాలు విడబడ్డాయి. సఖ్యత నశించింది. ఎలుక..పిల్లుల బ్రతుకు.
జీవితం నాటకం అయిపోయింది.. ఎవరి పాత్ర.. నటన వారివే.!..
వూరికంతా.. రామ్‌ప్రసాద్ ఆర్.యం.పి. మంచి హస్తవాసి వున్న డాక్టర్. ఎంతో మంచిపేరు.. ఎందరో అభిమానులు..
ఎక్కడికి పోవాలన్నా.. చంగాళమ్మ కొడుకు చిన్నాను తోడు తీసుకొని వెళ్లేది.
ఒక వయస్సు వచ్చాక.. కొందరి ఆలుమగల విషయంలో తత్వ బేధాలవల్ల సఖ్యత సన్నగిల్లుతుంది. దానికి వయస్సు.. మనస్సు కారణం. భర్త సాన్నిధ్యాన్ని త్యజించే స్త్రీ తనకు కావాల్సిన ఆనందాన్ని తన బిడ్డల సహాయంతో తీర్చుకొంటుంది. భర్త యంత్రంగా మారిపోతాడు. పిల్లలు తల్లిదండ్రులను వారి అవసరాలకు వాడుకొంటారు. ఆలుమగలు యాంత్రిక జీవితాన్ని గడుపుతారు. సంసారమనే సుందర సువిశాల గగనాన్ని.. కారుమేఘాలు క్రమ్ముకోకూడదు. క్రమ్ముకొంటే అలాంటివారు పేరుకు దంపతులు.. నేటి సమాజంలో అలాంటివారు కొందరున్నారు. ఎవరిలోకం వారిది.. అందులోనే వారికి ఆనందం. పరస్పర సఖ్యత, స్నేహభావాలు వారిలో వుండవు. చూపరులకు వారు ఆదర్శదంపతులు. అంతా నటన..
***** ***** *****
చిన్నా.. కోటేశ్వరరావుగారి ఇంటివైపుకు బయలుదేరాడు. ఓ దేవుడా!.. నిజానిజాలు నీకే తెలియాలి. మా నాన్న ఇచ్చిన మందుల కారణంగా మా అమ్మమ్మ చచ్చిపోయిందా!.. ఎవడైనా రోగిని బాగుచేయాలని మందులిస్తాడుగాని.. చంపేదానికి ఇస్తాడా!.. అనవసరంగా మా అమ్మ మా నాన్నను అనుమానిస్తూ అసహ్యించుకొంటూ వుంటుంది. మా నాన్న అమాయకుడు.. ‘తండ్రీ.. మా అమ్మ తత్వాన్ని మార్చు..’ అని తనకు ఇష్ట దైవమైన తిరుమల వెంకన్నను తలుచుకొంటూ కోటేశ్వరరావు ఇంటికి చేరి తన తల్లి చెప్పిన మాటలను అతనికి చెప్పాడు. కోటేశ్వరరావు వెంటనే చిన్నాతో బయలుదేరాడు..
రామ్‌ప్రసాద్.. అతని కాంపౌండరు రమణ తమ క్లినిక్‌కు వచ్చిన వారిని చూచి.. మంచి మందులిచ్చి పంపుతారు. ఇరువురికీ మంచి పేరు. కోటేశ్వరరావు చిన్నా క్లినిక్ దగ్గరకు వచ్చారు.
చంగాళమ్మ పెదనాన్నగారి కొడుకు కోటేశ్వరరావు. మందుల వ్యాపారి.. పేషంట్సు వున్న కారణంగా కూర్చోమని సైగచేశాడు రామ్‌ప్రసాద్.. చిన్నా కోటేశ్వరరావులు కూర్చున్నారు.
జనం వెళ్లిపోయారు..
‘‘బావా!.. ఏమిటిది?..’’ చిరునవ్వుతో అడిగాడు కోటేశ్వరరావు.
‘‘నేనేం చెప్పేది బావా!.. మీ చెల్లికి నామీద నా వైద్యం, మందుల మీద నమ్మకం లేదు. నా మందుల కారణంగానే అత్తయ్య చనిపోయిందని మీ అక్క ఆవేదన. నిజానిజాలు ఆ దైవానికే ఎరుక..’’ విచారంగా చెప్పాడు రామ్‌ప్రసాద్.
‘‘సరే బావా!.. నీవు మా అక్కను చూచావుగా!..’’
‘‘ఆ చూచాను.. నా మందులు తాను తీసుకోదు.. అందుకే నిన్ను పిలిపించింది.’’ విచారంగా నవ్వాడు రామ్‌ప్రసాద్.
‘‘సరే బావా.. నేను వెళ్లి చూచివస్తాను..’’
‘‘ ఆ.. వెళ్లిరా!..’’
చిన్నా కోటేశ్వరరావులు చంగాళమ్మ గదికి వెళ్లారు. తన బాధలను చంగాళమ్మ తమ్ముడితో చెప్పింది.
‘‘అక్కా!.. భయపడకు.. బాధపడకు.. నేను చిన్నాతో మందులు పంపుతాను.. రెండుపూటలా వేసుకో.. నీ జ్వరం మాయమైపోతుంది..’’ నవ్వుతూ చెప్పాడు కోటేశ్వరరావు.
చిన్నా.. అతను వెళ్లిపోయారు. పావుగంట తర్వాత చిన్నా రెండు మాత్రలను తల్లిచే మింగించాడు.
చంగాళమ్మ నిద్రపోయింది. రెండు గంటల తర్వాత రామ్‌ప్రసాద్ భార్య శరీరాన్ని తాకి చూచాడు.. శరీరం చల్లగా మామూలుగా వుంది.
GGGGG GGGGG GGGGG
మరుదినం.. చంగాళమ్మ లేచి తన దినచర్యను ప్రారంభించింది. క్లినిక్‌లో రామ్‌ప్రసాద్.. కోటేశ్వరరావు.. చిన్నా పెద్దగా నవ్వుతున్నారు.
వారి నవ్వును విని క్లినిక్ ద్వారాన్ని సమీపించింది చంగాళమ్మ.
‘‘నాన్నా!.. నిజంగా నీ హస్తవాసి అమోఘం.. నీవు ఇచ్చిన ఒక్క మాత్రతో.. అమ్మ.. లేచి కూర్చుంది’’ ఆనందంగా నవ్వాడు చిన్నా.
‘‘రేయ్!.. మా బావంటే ఏమనుకున్నావ్!.. ఎందరో అలోపతిక్ డాక్టర్లు ఆయన సలహాలను ఫోన్లో తీసుకొంటారు..’’ చెప్పాడు కోటేశ్వరరావు.
‘‘మీ అమ్మమ్మ చనిపోయేదానికి కారణం హార్ట్ ఫెయిల్!.. మా బావ ఇచ్చిన మందులవల్ల కాదు..’’
చంగాళమ్మ కళ్లల్లో కన్నీరు.. తన భర్త గొప్పతనం అర్ధం అయింది.
ఇంట్లోకి వెళ్లింది కాఫీ కలిపి నాలుగు గ్లాసుల్లో నింపింది. ట్రేలో పెట్టుకొని క్లినిక్ ద్వారం ముందుకు వచ్చింది.
తన పాత స్టయిల్‌లో.. చంగాళమ్మ..
‘‘సార్!.. కాఫీ!..’’ నవ్వుతూ లోన ప్రవేశించింది.
మబ్బులు విడిపోయాయి..నలుగురూ ఆనందంగా నవ్వుకొన్నారు.
// స మా ప్తి //
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.
Comments