top of page

పరితప్తం


'Paritaptham' New Telugu Story

Written By Srinivasa Rao Thirukkovullur

'పరితప్తం' తెలుగు కథ

రచన: శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు


"సార్, జ్యూస్..." అంటూ నాకు సపర్యలు చేయడం కోసమే ప్రత్యేకంగా నియమించబడ్డ కేర్ టేకర్ రాజు పిలుపుతో నా కళ్ళను వాడికేసి తిప్పాను. వాడు నా నోరు తెరవమన్నట్టుగా నావైపు అసహనంగా చూస్తున్నాడు. నేను వాడు చెప్పినట్టే చేశాను. వాడి చూపులు నన్నెప్పుడూ పదునైన చాకుతో గుచ్చుతున్నట్టుగా ఇబ్బంది పెడుతుంటాయి.


నేనేదో అప్పనంగానూ, అన్యాయంగానూ వాడి బాబుగారి సొమ్మేదో తినేస్తున్నట్టూ ఏవగింపుగా చూస్తుంటాడు. 'నేను తింటున్నది నా భార్య కష్టార్జితం. మధ్యలో నీకెందుకూ నామీద ఏడుపు...?!'అని చాలాసార్లు నిలదీయాలనిపించినా, నోట్లోమాట నోట్లోనే ఉండిపోతోంది. దాంతో ప్రతీ బాధనీ నిశ్శబ్దంగా పంటిలోనే దాచుకోవడం అలవాటు చేసుకున్నాను.


నా పేరు చక్రపాణి.

ఒకప్పుడు దర్జాగా, దర్పంగా విష్ణుమూర్తిలా చక్రం తిప్పినవాణ్ణి.

ప్రస్తుతం మంచంమీద అచేతనంగా పడివున్నాను. 'నరాల సంబంధిత వ్యాధి'తో ఏడు సంవత్సరాలుగా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా కాళ్ళుచేతులూ పూర్తిగా చచ్చుబడిపోయి, నా శరీరంలో కళ్ళూ, చెవులూ తప్పించి, ఏ అవయమూ నా ఆధీనంలో లేకుండాపోయాయి. నాకు అందరి మాటలూ స్పష్టంగా వినిపిస్తాయి. అన్నీ కనిపిస్తాయి. కానీ నాలోని భావావేశాలను కించిత్ కూడా వ్యక్తపర్చలేని శాపగ్రస్తుణ్ణి.


గత ఏడు ఏడేళ్లుగా జీవితాన్ని భారంగా మోస్తున్నాను. ఉదయాన్నే కాలకృత్యాలు మొదలుకుని రాత్రి నిద్ర పోయేవరకూ అన్నీ బెడ్ మీదే నా జీవితం! 'మనిషి చేసిన పాపాలు ఆ మనిషిని ఏనాటికైనా వెంటాడుతాయి' అనేందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. నా కన్నకూతురుని ఒకసారి కనులారా చూసుకున్న తరువాతే తనువు చాలించాలనేది నా ముందున్న ఏకైక లక్ష్యం. అది నెరవేరే వరకూ నా ప్రాణాల్ని మంచానికే అంటిపెట్టుకుని ఈసురోమంటూ బ్రతుకు ఈడ్చుతున్నాను.


నా ఉనికిని కాస్తోకూస్తో పట్టించుకుని నన్నో మనిషిగా గుర్తించే ఏకైక మనిషి నా భార్య 'అమృతవల్లి' మాత్రమే. తను పేరుకు లాగానే మనిషి కూడా చాలా అందంగా ఉంటుంది. ఆ అందాన్ని మించిన సహృదయంగల గొప్ప మానవతామూర్తి. అమృతవల్లి రెండురోజులుగా నన్ను చూసేందుకు రాలేదు. బహుశా తనకు వీలుకాకపోయుండవచ్చు.


ఎందుకంటే-ఈ రోజే నా కూతురి పెళ్లి!

పెళ్లి ఏదో స్టార్ హోటల్లో గ్రాండ్ గా చేస్తున్నారు. ఇక్కడ చిత్రమైన సంగతేమిటంటే-నా కూతురు పెళ్లికీ నాకెటువంటి 'ఆహ్వానం' అందలేదు. నా పిచ్చిగానీ ఆ ఆహ్వానం అందితే మటుకూ నేనెలా పోగలను?! కాళ్ళూచేతులూ పూర్తిగా చచ్చుబడిబోయి, శరీరంలో ఒక్క కళ్ళను తప్ప మరేది కదల్చలేనివాణ్ణి చలనరహిత జీవచ్చావాన్ని!


అప్పుడే నా భార్య నేనుంటున్న గదిలోకి వచ్చింది. అమృతవల్లి పట్టుచీరలో ధగధగమెరిసిపోతూ, అమృతం సేవించిన దేవకాంతలా చాలా అందంగా ఉంది. ఏదైనా మన చేజారిపోతేనే అదెంత విలువైందో తెలుసుకుంటాం. అమృతవల్లితోపాటు ఆమె జీవిత భాగస్వామి అరవింద్ కూడా వచ్చాడు. అతను ఎప్పుడొచ్చినా కొన్ని జాలిచూపులు అలా విసిరేస్తూంటాడు.


అమృతవల్లిని నా భార్య అంటూనే, అరవింద్ ఆమె జీవిత భాగస్వామి అంటూ గందరగోళంగా మాట్లాడుతున్నానని నన్నో పిచ్చోడుగా జమకట్టొద్దు. నేను శారీరక వైకల్యంతో దరిద్ర జీవితాన్ని అనుభవిస్తున్నా మానసికంగా పూర్తి ఆరోగ్యంగా వుండే ఈ మాట చెపుతున్నాను. నా మాటపై నమ్మకం కావాలనుకుంటే, ఓ పది సంవత్సరాలు వెనక్కి నాతో రావాలి...!


* * *


రాత్రి పది గంటలు కావస్తోంది.

ఆ రోజు నేను బాగా తాగివున్నాను. నా అడుగులు తడబడటం నాకు తెలుస్తూనేవుంది. నా కారు డ్రైవరు నన్ను జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. నాకు ఖచ్చితంగా తెలుసు. నా భార్య అమృతవల్లి నా కోసం ఎదురు చూస్తోందని. ఎందుకంటే-నాకూ, అమృతవల్లికి పెళ్ళయి ఆరోజుకి సరిగ్గా అయిదేళ్లు పూర్తవుతోంది. మ్యారేజ్ యానివర్సరీ సందర్బంగా మా పాపతో బయటకు వెళ్లాలని, సాయంత్రం త్వరగా వచ్చేమని మరీమరీ చెప్పింది.


నేను ప్రేమించిన అమ్మాయిని కాదని నా ఇష్టంతో ప్రమేయం లేకుండా నా తల్లిదండ్రులు అమృతవల్లితో బలవంతంగా నా వివాహం హడావిడిగా జరిపించేశారు. ఆరోజు నుండి తనతో పేరుకే ఏదో కాపురం చేసేవాడ్ని. తనని మనస్ఫూర్తిగా నా సగభాగమైన అర్ధాంగిగా ఏనాడూ ప్రేమించలేకపోయాను. ఎందుకంటే-నా హృదయాన్నంతా నేను ప్రేమించిన రజని మాత్రమే ఆక్రమించుకుంది.


అమృతవల్లికీ, నాకూ నిత్యమూ గొడవలు చోటుచేసుకునేవి. అప్పుడు తనని అర్ధం చేసుకోడానికి కించిత్ కూడా ప్రయత్నం చేసేవాణ్ణి కాదు. కానీ తను నాతో సర్దుకుపోవాలని శతవిధాలా ప్రయత్నించేది. నేనే అయినదానికీ కానిదానికీ నానారభస చేసేవాడిని. ఆలాగైనా నన్ను వదిలేసి వెళ్ళిపోతుందని ఏదోవిధంగా మా మధ్య చిచ్చు రగిల్చేవాడిని. రోజురోజుకి మా మధ్య వివాదాలు తరచుగా చిలికిచిలికి గాలివానలుగా ముదిరి పాకాన పడేవి. అమృతవల్లి మాత్రం పాప భవిష్యత్తు దృష్ట్యా నాతో సంసారాన్ని శాంతంగా నెట్టుకుపోవాలని తెగ తాపత్రయం పడేది.


ఒక శుభసమయాన నాతో విసిగివేసారిపోయిన అమృతవల్లి ఇక ఇరువురుకీ కుదిరేది కాదని ఒక దృఢనిశ్చయానికి వచ్చేసింది. దాంతో నేనూ-అమృతవల్లీ మ్యూచువల్ డివోర్స్ తీసుకున్నాం. వెనువెంటనే నేను ప్రేమించిన రజనికీ ఇచ్చిన మాట ప్రకారం తనతో నా కొత్త కాపురం అనందంగా మొదలుపెట్టేసాను. నా సంతోషానికి పట్టపగ్గాలులేవు. ఎవరికైనా తాము అనుకున్నది జరిగితే అందులోని మజానే వేరు.


* * *


ఒకప్పుడు నా భార్య..., ప్రస్తుతానికి నా మాజీ భార్య అయినటువంటి నేనుంటున్న గదిలోకి వచ్చిన అమృతవల్లి నా వ్యక్తిగత సంరక్షకుడైన రాజుని ఏవో విషయాలు అడిగి తెలుసుకుంటోంది. బహుశా నా గురించే అనుకుంటా. బైటకెళ్లేముందు ఎప్పటిలాగే నావైపు భావరహితంగా చూసింది.


నేను, అదే సరయిన అదనుగా భావించి నా మనసులోని ఆరాటాన్ని కళ్ళతో పలికించి, తనకు నా హృదయ స్పందననీ తెలియచేశాను. ఆ సంజ్ఞలు ఇద్దరికీ కొత్తేమీ కాదు. తనకి అర్ధమైనట్టుగా "భార్గవికి ఉదయం చాలాసేపూ నచ్చజెప్పి చూసాను. దానికి మిమ్మల్ని చూడ్డం అస్సలు ఇష్టంలేనట్టుగా ఎప్పటిలాగే మొండిగా మాట్లాడుతూంది. పెళ్లి అయ్యాక, అత్తవారింటికి బయలుదేరేముందు మీ ఆశీస్సులు కోసమైనా తనని ఒప్పించి ఎలాగైనా తీసుకువస్తాను..." నిర్లిప్తంగా అంది అమృతవల్లి. నాకు కాస్తంత భరోసాని ఇస్తున్నట్టుగా. అ మాత్రం గుర్తింపు చాలు నాకు. ఇలా ఎన్నేళ్లయినా బ్రతుకెయ్యడానికి. నేను తనకి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్పుకున్నట్లుగా నా రెండు కళ్ళను కదిలించాను.


నాకు బాగా తెలుసు. నా కూతురు అంత తొందరగా ఒప్పుకోదని. ఎందుకంటే-తను ఎంతైనా నా రక్తం పంచుకుపుట్టిన నా బిడ్డే కదా. భార్గవి ఇంట్లోనే ఉంటే ఎప్పుడైనా పొరపాటున నా మొహం చూడాల్సి వస్తుందేమోనని హాస్టల్లో వుంటూ చదువుకుంటోంది.


నా కూతురు 'భార్గవి"కీ నా మీద ఎందుకింత ద్వేషమో, భార్యాభర్తలుగా విడిపోయిన మేము..., అమృతవల్లి ఇంట్లో నేనెందుకు ఉండాల్సి వచ్చిందో తెలియాలంటే-నన్ను యీ దుస్థితికి కారణమైన భూతంలాంటి భూతకాలంలోకి మరొక్కసారి తొంగిచూడాల్సిందే!


* * *


రజనీని ఎంతో ఇష్టంగా పెళ్లిచేసుకున్నా, మూడేళ్ల కాపురం తరువాత తనకి నేను బోరు కొట్టానేమో. ఒకానొకారోజున రజని నన్ను విడిచిపెట్టి, డబ్బూ దస్కమూ ఛేజిక్కించుకుని ఎవరితోనో పారిపోయింది. తనని నమ్మి మోసపోయినందుకు చాలాకాలం మామూలు మనిషిని కాలేకపోయాను. మద్యానికి పూర్తిగా బానిసనైపోయాను.


నేను వద్దనుకున్న అమృతవల్లి మూడేళ్లుపాటు అహర్నిశలు కష్టపడి చదివి, సివిల్స్ లో మంచి ర్యాంక్ కొట్టింది. ప్రభుత్వరంగంలో ఉన్నతమైన కేడరుని పొంది, తాను కోరుకున్న మహోన్నత జీవితాన్ని సాధించుకుంది. ఆ తర్వాత తనని బాగా అర్ధంచేసుకుని, అన్నివేళలా ఆసరాగా నిలిచిన చిన్ననాటి మిత్రుడైనా అరవింద్ ని వివాహం చేసుకుంది.


రజనీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాక డిప్రెషన్ తో నా జీవితం రోజురోజుకి దిగజారిపోయింది. నా తల్లిదండ్రులు నా మీద బెంగతో చనిపోయారు. నేను మరింత ఒంటరివాడినయ్యాను. ఆ తర్వాత-ఏడేళ్ల కాలప్రవాహంలో కిందామీదా పడుతూ... మొత్తమ్మీదా నా ఆర్ధికపరిస్థితి దారుణంగా పతనమై, పీకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయాను.


ఒకరోజు నా కారులో పనిమీద అరకు వ్యాలీ వెళ్లి, తిరుగు ప్రయాణంమయ్యాను. ఆకస్మికంగా ఓ లారీ ఎదురుగా వచ్చి నా కారుని బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో నా కారు ఎన్నో పల్టీలుకొట్టి లోయలోకి పడిపోయింది. అది గమనించిన కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. వారు నన్ను విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. నా శరీరమంతా నుజ్జునుజ్జయి నరాల వ్యవస్థంతా అతలాకుతలమై, నా కాళ్ళూచేతులూ పూర్తిగా చచ్చుబడిపోయాయి.


అదృష్టమో దురదుష్టమో చెప్పలేను కానీ, నా తలకి పెద్దగాయాలేమీ కాలేదు. ఆసుపత్రిలో నన్ను పరామర్శించడానికి ఎవరూ రాలేదు. ఆసుపత్రి వర్గాలవారు నా చచ్చుబడిన శరీరాన్ని ఎక్కడికి డిస్పాచ్... అదే డిశ్చార్జ్ చేయాలో అడిగారు. ఏదో తెలియని మొండి ధైర్యంతో అమృతవల్లి అడ్రస్ చెప్పేసాను. కొద్దిరోజుల్లో నేను ఎలాగూపోతానని, పోయేముందు నా కూతురుని కనులారా చూసుకుని, అలాగే నా భార్య అమృతవల్లికీ మనస్ఫూర్తిగా క్షమాపణులు చెప్పుకోవాలని అలా వారి ఇంట్లోకి చేరిపోయాను.


ఒక్కోసారి మొండితనం కూడా నెగ్గుతుంది. అమృతవల్లీ, ఆమె భర్త అరవింద్ ఎందుకో నన్నా పరిస్థితిల్లో చూసేసరికి, ఏం అనుకున్నారేమో దయతో కాదనలేకపోయారు. ఆ రోజు ఆసుపత్రిలో ఏ ధైర్యంతో ఆలా చెప్పేసానో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే! అమృతవల్లి నా బాగోగులు చూసుకోడానికి ఒక కేర్ టేకర్ని కూడా నియమించింది. ఓ నెలా రెండునెలల్లో పోతాననుకున్నవాడిని ఏడేళ్లుగా ఓ ప్రాణమున్న శవంలా బ్రతికేస్తున్నాను. అందుకే అంటారేమో 'పాపి చిరాయివు' అని!


భార్గవి నేనంటేగల అంతులేని అసహ్యానికీ తగిన కారణం లేకపోలేదు. అప్పుడు-నా కూతురుకి అయిదేళ్ళుంటాయి. నేను అమృతవల్లితో చివరిసారిగా గొడవపడి ఇంట్లోంచి బయటికి వచ్చేసినప్పుడు ఓ సంఘటన చోటుచేసుకుంది.


ఆరోజు నేను బాగా తాగివున్నాను. నేను అమృతవల్లిని వద్దనుకుకుని ఇంట్లోంచి బయటికొస్తున్నప్పుడు భార్గవి నా కాళ్లకు అడ్డంపడి వెళ్లొద్దని ఎంతగానో బ్రతిమలాడింది. తాగిన మైకంలోవున్న నేను నా కూతురు భార్గవిని బలంగా తన్నేసాను. భార్గవి తల గోడకు తగిలి, రక్తం ధారగా కారుతున్నా, ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా బయటికొచ్చేసాను.


* * *


తన అయిదేళ్ల ప్రాయంలో చోటుచేసుకున్న ఆ చేదు సంఘటనే నా కూతురు మనసులో బాగా నాటుకుపోయివుంటుంది. కేవలం తనకోసమే ఏడేళ్లుగా నిరీక్షిస్తోన్నా నన్ను ఏనాడూ కన్నెత్తి చూసిందీ లేదు. పన్నెత్తి పలకరించిందీ లేదు. తన జీవితంలో అత్యంత విలువైన వివాహ సందర్భాన్ని పురస్కరించుకుని నా ఆశీస్సులు కోసమైనా తప్పకుండా వస్తుందని నా కూతురు 'భార్గవి ' కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను.


ఆరోజు రాత్రంతా కంటిమీద రెప్పవాల్చకుండా తను ఏ క్షణమైనా రావొచ్చని నా కూతురు కోసం ఎదురుచూస్తూ, తెల్లవారిజామున ఎప్పుడో నాకు తెలియకుండా నిద్రలోకి జారిపోయాను.


ఎవరివో మాటలు నా చెవినపడి ఉదయాన్నే మొలకువ వచ్చింది. వెంటనే ఎదురుగావున్న గోడ గడియారంకేసి చూసాను. తొమ్మిది గంటలు చూపిస్తోంది. 'నేను నిద్రపోతున్నప్పుడు నా కూతురు నన్ను చూడ్డానికి వచ్చి, వెళ్ళిపోయిఉంటుందా..?! తను వచ్చిందా? అసలు రాలేదా...?!'అనేక సందేహాలతో నా బుర్ర బద్ధలైపోతోంది.


రోజూ ఎనిమిది గంటలకు వచ్చే కేర్ టేకర్ రాజు ఆ రోజు ఆలస్యంగా వచ్చాడు. వాడు నేనుంటున్న గదిలోకి వస్తూనే "మేడంగారు, మీకో విషయం చెప్పమన్నారు. అమ్మాయిగారు మిమ్మల్ని చూడ్డానికి రానని అన్నారట... మీకు చెప్పమన్నారు"అంటూ వాడు చెప్పిన విషయం నాలో ఎక్కడో మిణుకుమిణుకుమని కొట్టుమిట్టాడుతున్న నాలోని ఆశాదీపం కాస్త కొండెక్కిపోయింది.


'ఎవరికీ అక్కర్లేని ఈ పాపిష్టి జీవితం నాకవరమా? ఇక నా యీ జన్మకి సెలవు ఇప్పించు తండ్రీ!'అని మనసులో గాఢంగా ఆ భగవంతుడిని ప్రార్ధించాను. అప్పుడే ఓ అద్భుత దృశ్యం కళ్ళముందు లీలగా కనిపిస్తోంది.


పెళ్లి బట్టలతోనున్న నా కూతురు నా గదిలోకి వస్తోంది. తన ఐదేళ్లప్పుడు ఎలా ఉండేదో ఇప్పటికీ అలాగే వుంది. ఆ పసితనపు ఛాయలు ఇంకాపోలేదు. తన పక్కనే పెళ్ళికొడుకు కూడా ఉన్నాడు. నాకు అంతా అయోమయంగా వుంది. వధూవరులిద్దరూ వంగి నా పాదాలకు నమస్కరిస్తున్నారు.


నేను గబుక్కున నా రెండు కాళ్ళని వెనక్కి తీసేసుకోవాలనుకున్నాను. నాకది సాధ్యంకాని పనియని తర్వాత గుర్తొచ్చింది. ఆ వధూవరులను ఆశీర్వదించే అర్హతలేనివాణ్ణని నాకు ఖచ్చితంగా తెలుసు. అంతపాటి పెద్దరికానికి తగనని తెల్సినా, నా కళ్ళతోనే వారిని ఆశీర్వదించాను. ఎంతైనా తండ్రి మనస్సు!

నా ఏడేళ్ల నిరీక్షణా ఫలితం!!


నా పక్కనే బెడ్ మీద కూర్చున్న కూతురి కళ్ళల్లో నీళ్లు నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. "నాన్నా..." అంటూ అచ్చం మా అమ్మలాగే లాలనగా పిలిచింది. నా ఒళ్ళు ఒక్కసారిగా చలించింది. నన్ను నేను నమ్మలేకపోయాను. ఈ జన్మకి ఇది చాలు! ఇదంతా వాస్తవమేనా? అని నా కళ్ళని తిప్పుతూ చుట్టూ చూసాను. ఓ పక్కగా నిల్చుని నన్నే గమనిస్తోన్న రాజు నవ్వుతూ కన్పించాడు. "ఎలా వుంది, సార్. నా సడన్ సర్ప్రైస్...?!" అడిగాడు ఉత్సాహంగా.


అమృతవల్లి... కూతురు పక్కనే నిల్చుని నన్నే చూస్తోంది తదేకంగా. ఈ ఏడు సంవత్సరాలుగా తనెప్పుడూ అంత దీర్ఘంగా చూడ్డం ఎరుగను. వ్యర్థం అనుకున్న నా జీవితానికి అర్ధాన్ని చూపించిన ప్రేమదేవత! తన పక్కనే ఉన్న అరవింద్ కళ్ళల్లో ఇదివరకులా జాలిచూపులు లేవు. బంధాలను ప్రేమిస్తూ...'మూర్తిభవించిన మహా వ్యక్తిత్వం' అతనిలో ప్రస్ఫుటమవుతోంది. నా కళ్ళల్లోంచి జారిపోతోన్న కన్నీటిని నా కూతురు తన చీరకొంగుతో తుడుస్తోంది ననుకన్న తల్లిలా. నాకర్ధమైంది నా అంతిమ ఘడియలు సమీపిస్తున్నాయని!


నా కళ్ళు నా ప్రమేయం లేకుండానే నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. నా మెదడు ఆలోచించే శక్తిని క్రమంగా కోల్పోతోంది. నాకది స్పష్టంగా తెలుస్తోంది. 'మరి కొద్దిరోజుల్లో నీ బిడ్డగా పుట్టయినా నా బాధ్యతల్ని నెరవేర్చుకుని, వాత్సల్యపూరితమైన, అచంచలమైన ప్రేమను పంచి, నా తప్పులనీ, పాపాలనీ తప్పక ప్రాయశ్చిత్తం చేసుకుంటా తల్లీ! ఈ జన్మకింక సెలవు... 'అనుకుంటుండగా నా కళ్లు శాశ్వత నిద్రకు సమయం ఆసన్నమైన్నట్టుగా మూతలు పడిపోయాయి...!🙏

***

శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత పరిచయం:

నా పేరు శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు,M.A.

ఓ మంచి తెలుగు సాహిత్యాభిమానిని. నిరంతరమూ సాహిత్యాన్ని అధ్యనం చేయడమంటే చాలా ఇష్టం. రాయడం కన్నా, చదవడానికే ఎక్కువగా ఇష్టపడతాను.


నా మొట్టమొదటి కథ 'సామాజిక స్పృహ' ఆంధ్రభూమిలో ముద్రితమైంది.


నా కథలు ఆంధ్రభూమి తదితర వార, మాస పత్రికలపాటు, మొన్న ఈనాడు ఆదివారం అనుబంధం అనుబంధంలో నా కథ 'స్నేహితుడు' ముద్రితమైంది. అలాగే బాలమిత్ర, బుజ్జాయి, బాలభారతం, ఆటవిడుపు పిల్లల పత్రికల్లో కథలన్నీ కలిపి ఓ అరవై రచనలు దాకా ప్రచురింపబడ్డాయి.


'విశాఖ రచయితల సంఘం' ఆధ్వర్యంలో వెలువడిన "విశాఖ కథా తరంగాలు" కథా సంకలంలో నా కథ 'అమ్మ' ముద్రితమైంది. ప్రముఖ సాహితీ మాసపత్రిక 'సాహో' సంపాదకులు శ్రీ ఇందూ రమణగారి నేతృత్వంలో వెలువడిన "ప్రియమైన రచయితలు'వాట్సప్ సాహితీ సమూహంతో విడుదలైన 'నూరుకథలు' సంకలనంలో నా కథ స్థానం సంపాదించుకుంది. అలాగే ప్రసన్నబారతి వాట్సప్ కథల పోటీల్లో నా కథ 'జీవనవేదం' బహుమతితో పాటూ సంకలనంలో చోటుచేసుకుంది.


ఈ మధ్యకాలంలో వచ్చిన సహరి క్రైమ్ కథల పోటీల్లోనూ, 'ప్రసన్నభారతి- ఓసారి చూడండి అంతే'వారి వాట్సప్ కథల పోటీల్లోనూ, డా. రామశర్మ సౌజన్యంతో జరిగిన హాస్యానందంవారి హాస్యకథల పోటీల్లోనూ, సాలూరు మిత్రబృందం మరియు బి.ఎస్.ఎన్.మూర్తి స్మారకార్ధం నిర్వహించిన కథల పోటీల్లోనూ, 'సుమతి' అంతర్జాల మాసపత్రికవారి కథల పోటీల్లోనూ నా కథలకు బహుమతులు వచ్చాయి.


నా సాహితీమిత్రులు శ్రీయుతులు కాండ్రేగుల శ్రీనివాసరావు, శ్రీచరణ్ మిత్ర మరియు నంద త్రినాథరావు, కోరికాన అనంద్ మరియు కోరాడ నరసింహారావుగార్లు!94 views2 comments

2 comentários


Trinadhrao Nanda
Trinadhrao Nanda
31 de mar. de 2023

శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు గారి కథ "పరితప్తం" అద్భుతంగా ఉంది. ఊహించని మలుపులు తిరుగుతూ ఆకట్టుకుంది. మానవీయ కోణాన్ని ఆవిష్కరింపజేస్తూ సాగిన కథ ముగింపులో మనసుని ద్రవింపచేసింది. ఇలాంటి అనుభూతి ప్రధానమైన కథలు మరెన్నో ఆయన కలం నుండి జాలువారాలని ఆశిస్తూ.. నంద


Curtir
T.Srinivasa Sri
T.Srinivasa Sri
02 de abr. de 2023
Respondendo a

ధన్యవాదములు, సార్

Curtir
bottom of page