top of page

ఒక్కటే!


'Okkate' - New Telugu Story Written By Dinavahi Sathyavathi

'ఒక్కటే!' తెలుగు కథ

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

అనగనగా ఒక గ్రామంలో భైరవశర్మ అనే ధనికుడైన బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతని భార్య వేదవతి. ఆ దంపతులకి ఆరేళ్ళ కొడుకు, పేరు రాఘవ శర్మ. భైరవశర్మ, భార్య వేదవతి మడి, ఆచారాలని అధికంగా పాటించేవారు. కొడుకుని తమ కులపు పిల్లలతో తప్ప వేరే కులం వారితో కలవనిచ్చేవారు కాదు. భైరవశర్మకి ఇంటిపనీ తోటపనీ చేయడానికి సూరీడని పాలేరు ఉండేవాడు.


సూరీడుకి ఒక కూతురు, పేరు మంగళ. తల్లిలేని బిడ్డని ఒంటరిగానే పెంచుకొచ్చాడు సూరీడు. మంగళకి ఇప్పుడు ఎనిమిదేళ్ళు. పనికి వచ్చేటప్పుడు కూతుర్ని వెంటబెట్టుకుని వచ్చేవాడు. తండ్రి పని చేస్తుంటే తానూ చిన్న చిన్న పనులు చేస్తూ, ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుండేది మంగళ. మంగళతో ఆడుకోవాలని ఉబలాటపడుతున్న కొడుకుని వద్దని వారించాడు భైరవశర్మ.


“ఎందుకు నాన్నా అక్కతో ఆడుకుంటే ఏమవుతుంది?” కొడుకు ప్రశ్నకి కోపం ముంచుకొచ్చి “అది నీకు అక్కేమిటీ, వెధవ వరస కలపడం నువ్వూనూ” కసురుకున్నాడు.


“నువ్వే కదా పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవకూడదన్నావు?”


“మనవాళ్ళని అలా పిలవకూడదన్నాను”

“వాళ్ళు మనవాళ్ళు కాదా?”

“కాదు. వాళ్ళు అంటరాని వాళ్ళు. అలాంటి పిల్లతో నీకు ఆటలేమిటీ?”


“అంటరాని వాళ్ళంటే?”


“అంటే వాళ్ళని మనం ముట్టుకోకూడదు, వాళ్ళతో కలిసి తిరక్కూడదు”


“మన వాళ్ళంటే?”


“అంటే.. అంటే.. నీకిప్పుడు చెప్పినా అర్థం కాదుగానీ పోయి ఆడుకో” తండ్రి విసుక్కునేసరికి బిక్క ముఖం వేసాడు రాఘవ.


ఎంత ఆలోచించినా తండ్రి మాటలు బోధపడలేదు సరికదా ‘వాళ్ళని ముట్టుకో కూడదంటాడు నాన్న. కానీ మరి సూరీడు మా అందరి బట్టలూ ఉతుకుతాడు, ఆరిపోయిన బట్టలు మడత పెడతాడు, అవేగా మేము కట్టుకుంటాము! ఇల్లు ఊడుస్తాడు, అంట్లు తోముతాడు, గేదె పాలు పితుకుతాడు- ఆ పాలేగా నేను తాగుతాను! ఏంటో మరి?’


వాడి చిన్న బుర్రలో సవాలక్ష సందేహాలు. ఒకరోజు రాఘవ తన తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉంటే కొంచం దూరంలో కూర్చుని చూస్తోంది మంగళ. ఇంతలో ఎక్కడినుంచో అదుపు తప్పిన గిత్త వేగంగా పరిగెత్తుకుంటూ ఆడుకుంటున్న పిల్లల మీదకి వచ్చింది. అందరూ భయపడి అరుస్తూ అటూ ఇటూ పరిగెత్తారు.

అదంతా ప్రక్కనే కూర్చుని చూస్తున్న మంగళ గభాలున పరుగెత్తి రాఘవ పైకి రాబోయిన గిత్తకు అడ్డు వెళ్ళి వాడిని బలంగా ప్రక్కకి తోసేసింది. ఆ క్రమంలో గిత్త కొమ్ములు తగిలి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. పిల్లల అరుపులు విని తోటలో పనిచేస్తున్న సూరీడు పరిగెత్తుకుంటూ వచ్చి గిత్త కొమ్ములు పట్టుకుని లొంగదీయాలని ప్రయత్నిస్తుంటే తోడుగా మరి నలుగురు వచ్చి గిత్తని తాడుతో బలంగా కట్టి లాక్కెళ్ళారు. కొడుకు అరుపులు విని చేస్తున్న పూజ మధ్యలోనే వదిలేసి భైరవశర్మా, వంటపని వదిలేసి వేదవతీ ఉరుకున వచ్చి భయంతో ఏడుస్తున్న కొడుకుని కావలించుకున్నారు.


తన ప్రాణాలు అడ్డుపెట్టి కొడుకు ప్రాణాలు కాపాడిన మంగళ త్యాగం సాహసం భైరవశర్మ అంతరాత్మని మొదలంటా కుదిపేశాయి. వెంటనే, స్పృహ తప్పిన కూతుర్ని చూసి దిక్కు తోచక ఏడుస్తున్న సూరీడు ఒడిలోంచి, మంగళని తన చేతుల్లోకి ఎత్తుకుని గబగబా ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. గాయంతో అధిక రక్త శ్రావమై మంగళకి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


మంగళది అరుదైన గ్రూపు రక్తం. సూరీడు రక్తం సరిపడదని తెలిసి వెంటనే రక్త దానం చేయడానికి ముందుకొచ్చాడు భైరవశర్మ. పరీక్ష చేయగా భైరవశర్మదీ అదే గ్రూపని తేలింది. సమయానికి మెరుగైన వైద్యం అందడంతో ప్రాణాపాయంనుంచి బయటపడింది మంగళ.


“నాన్నా మంగళకి నావల్లనే కదా దెబ్బలు తగిలాయి” వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకుని దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ “మంగళ కాదు బాబూ అక్కా అని పిలవాలి సరేనా?” అన్నాడు.


“మరి వాళ్ళని అంటకూడదూ అన్నావుగా?”


“నావల్ల ఘోరమైన తప్పు జరిగిందిరా బాబు. ఆ దేవుడు నా కళ్ళు తెరిపించాడు. ఎవరూ అంటరాని వాళ్ళు కాదు. అందరిలో ఉండేదీ ఒకే రక్తం. మనమంతా ఒక్కటే. అందరం కలిసిమెలిసి ఉండాలి”


ఇప్పుడు కూడా తండ్రి మాటలలో అంతరార్థం బోధపడకపోయినా, ఆ పసివాడికి మహదానందం కలిగించిన విషయం, ఇకపై తాను మంగళని అక్కా అని పిలవచ్చు, అక్క తో కలిసి ఆడుకోవచ్చు ఎంచక్కా అనేదే!


******

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in

93 views1 comment
bottom of page