top of page

ఒంటరి నేను


'Ontari Nenu' New Telugu Story By K. Nihitha Chandrika

రచన: నిహిత చంద్రిక


నా పేరు ఆమ్ల.

ఏంటి నా పేరు ఇంత వింతగా ఉంది అనుకుంటున్నారా? అది చాలా పెద్ద కథ లెండి. తరువాత చెప్తాను. ముందు ఒకళ్ల గురించి ఒకళ్లు తెలుసుకుందాం. మా అక్క పేరు శ్వేత. ఈమె నన్ను పెంచుకుంటుంది. అంటే వీళ్ళ అమ్మ నాన్నలు కూడా అనుకోండి. కానీ నేను పుట్టగానే నన్ను పెంచుకోవాలని అనుకుంది మా అక్క. వాళ్ళింట్లో గొడవ పడి, అందరినీ అతి కష్టం మీద నన్ను పెంచుకోవడానికి ఒప్పించి నన్ను పెంచుకుంటోంది మా అక్క. మా అక్కకి నేనంటే చాలా ఇష్టం, ప్రేమ, ఆప్యాయత, ప్రాణం, ఇలా చెబుతూ పోతే పెద్ద లిస్ట్ అవుతుందనుకోండి. మొత్తానికి చెప్పాలంటే మా అక్కకి నేనంటే వాళ్ల అమ్మ కన్నా ఎక్కువ ఇష్టం. కానీ అది అతి ప్రేమ కావడం వల్ల మా అక్క చేసే చేష్టలకి నాకు అప్పుడప్పుడు పిచ్చ చిరాకు వేస్తుంది. అవును మీకు ఇంకా అందరి గురించి చెప్పలేదు కదా!


మా అమ్మ పేరు సంగీత. మా అమ్మ పేరుకి తగ్గట్టుగానే సంగీతం చాలా బాగా పాడుతుంది. అలాగే తిట్లు కూడా బాగానే తిడుతుంది. అలాగే మా అక్క గురించి అందరికీ లగాయించి గొప్పలు కూడా చెప్తుంది. మా అమ్మ వాళ్ళకి చెప్పే గొప్పలతో మా అక్కకి సిగ్గు, కోపం, ఏడుపు, చిరాకు అన్నీ ఒకేసారి ముంచుకొచ్చేవి, అప్పుడు మా అక్కకి ఏం చెయ్యాలో అర్ధం కాక అక్కడి నుంచి ఉరుక్కుంటూ నా దగ్గరికి వచ్చేది.మా అక్క నా దగ్గరికి వచ్చి నాతో ఆడుకునేది. అదేంటో నాతో పాటు ఆడుకోవడం వల్ల మా అక్కకి ఉన్న కోపం, చిరాకూ అన్నీ పొయ్యేవి. ఇంకా కొద్ది సేపటి తర్వాత మా అక్క అలసిపోతుంది. ఆ తరువాత తాను ఎక్కడుందో అక్కడ కూర్చుని నన్ను పిలుస్తుంది. మా అక్క నన్ను పిలవగానే నేను మా అక్క దగ్గరికి పోతాను. మా అక్క నన్ను మెడ దగ్గర, తల మీద రుద్దుతూ నాకు ముద్దులు పెడుతూ ఉంటుంది. అది చూసి మా నాన్నమ్మ మా అక్కని తిడుతుంది. మా అక్కేమో ఏం అవుతుంది. అని చెప్పి మా నాన్నమ్మ తోని వాదించికుంటూ కూర్చుంటది. ఈ గ్యాప్ లో నేను మేడ పైకి పోయి ఆడుకుని వస్తాను.


మా నాన్నమ్మ పేరు పేరమ్మ. మా అక్క ఎప్పుడూ మా నాన్నమ్మ ఫోన్ గెలుకుతూనే ఉంటుంది. అందులో అంతగనంగా ఏం చూస్తుందో నాకైతే ఇప్పటి వరకు అర్ధం కాలేదు. తనకి మూడ్ వచ్చినప్పుడు మా నాన్నమ్మ ఫోన్లో నా వీడియోస్ తీస్తుంది. ఇంకా మా అక్క నన్ను వీడియో తీస్తుంటే నా మొహం పైన బొచ్చు, మీసాలకన్నా ఎక్కువగా సిగ్గు కనిపించేదంటే నేను ఆ సమయాల్లో ఎంత సిగ్గు పడేదాన్నో మీకు ఆర్తమైందనుకుంటాను. మా నాన్నమ్మ కూడా మా అక్క అడగంగానే ఫోన్ ఇచ్చేస్తుంది. ఎంతైనా మనుమరాలు కదా! మా నాన్న పేరు లక్ష్మణచారి. అందరూ లక్ష్మణ్ అని పిలుస్తారు. ఎవరైనా వచ్చి పేరు అడిగినా అదే చెప్తాడు. అందరూ అదే పేరుతో పిలుస్తున్నారు కదా అని మేము కూడా అదే పేరు చెబుతాము, అదే పేరుతో పిలుస్తాము. మా నాన్న ఇసుక బిసినెస్ చేస్తున్నాడు. మా నాన్న పాటలు, కథలు రాస్తాడు. ట్యూషన్లు కూడా చెప్తాడు.


నా పేరు చరిత్ర మీకు చెప్పలేదు కదా. నన్ను పెంచుకుంటున్నప్పుడు మా అక్క నాకు పెట్టడానికి ఎన్నో పేర్లు వెతికింది. చివరికి నాకు రూబీ అనే పేరు సెలెక్ట్ చేసింది. నాకు ఆ పేరు కొత్త కాబట్టి నన్ను ఆ పేరుతో ఎవ్వరు పిలిచినా పలికేదాన్ని కాదు. కొద్ది రోజులైతే నాకే అలవాటు అవుతుంది అని మా అక్క వదిలేసింది. కానీ మా బాబాయి ‘ఎన్ని రోజులు ఇలా ఇంగ్లిష్ పేర్లు పెట్టుకుంటారు. మన పేర్లు పెట్టుకుందాం.’ అన్నాడు. మా బాబాయి అలా అనేసరికి నాకు పెట్టడానికి స్వర్ణ, సుమ, స్వాతి, లలిత ఇలాంటి ఎన్నో పేర్లు చెప్పారు. ఐనా ఆ దరిద్రపు మనుషుల పేర్లు నాకైతే వినగానే చిరాకు వేసింది. ‘ఇదేం కర్మరా బాబు పోయి పోయి ఇలాంటి పేర్లు వినాల్సొస్తుంది. అదే నన్ను వదిలేసింటే హాయిగా చెత్త కుప్పల్లో పడి దొర్లుకుంటూ మూడు పూటలా మంచిగా కుళ్ళి ఘుమఘుమలాడే మాంసం ముక్కలు తింటూ నా స్నేహితులతో అదే గజ్జి కుక్కలు వాటితో ఆడుకుంటూ ఎంత దర్జాగా ఉండేదాన్ని. ఛీ తెచ్చి ఈ శుభ్రమైన కొంపలో పడేశారు. ఎక్కడైనా, ఎప్పుడైనా వేరే కుక్కలతో ఆడనిస్తారా అంటే అది కూడా లేదు. మీదినుంచి నా మొహానికి పేరొకటి.’ అని నేను అనుకున్నాను. కొద్ది సేపటి తర్వాత మా బాబాయికి ఈ పేర్లన్ని విని పిచ్చెక్కిపోయింది. ఇవన్నీ వొద్దు ఆయుర్వేదిక్ పేరు పెడదామన్నారు.‘మళ్ళీ ఆ దరిద్రపు పేర్లు కూడా వినాలా. హూ వినక చస్తానా, సరేలే కానివ్వండి విని చస్తాను’ అని నేను లోలోపలే గొణుక్కున్నాను. ఒకడేమో త్రిఫల అంటాడు ఇంకొకడేమో చ్యవనప్రాష్ అంటాడు.... ఇంకొకడేమో అర్క అంటాడు ఇంకొకడు ఇంకేదో అంటాడు... నాకా కొత్త పేర్లు వినగానే కడుపు తిప్పినట్టైంది. ‘చీ అవి కూడా పేర్లేనా’ అనుకున్నాను. మొత్తానికి ఆమ్లా అని నిర్ణయించారు.


నేనా పేరు వినగానే కొంచెం సంతృప్తిపడ్డాను. మళ్ళీ ఇంకేం పేరు పెట్టొద్దని పోయి నా పేరు చెప్పిన బాబాయిని ఒక్క నాకుడు నాకాను. ఇంకా నేను నాకడమే ఆలస్యమా ఇంకేమన్నానా అన్నట్టు అందరూ ఓ హడావిడి చేసేశారు . ఇంక నాకు కూడా ఆ పేరు నచ్చిందని నాకు అదే పేరు పెట్టారు. కానీ మా అక్కకి మాత్రం రూబీ అనే పేరే నచ్చింది. కాబట్టి నాకు రెండు పేర్లు నిశ్చయించారు. ఒకటి ఆమ్లా మరొకటి రూబీ. ఇంట్లో అందరూ నన్ను ఆమ్లా అనే పిలుస్తారు. కానీ ఎవరైనా కొత్తవాళ్లు నా పేరు ఏమిటని అడిగితే రూబీ అని చెప్తుంది మా అక్క. అప్పుడప్పుడు నేను మా గేట్ పక్కన ఉన్న చేత్త కుప్ప దగ్గరికి పోయి హాయిగా పొర్లాడుతుంటే మా దోస్తులు వచ్చి నాతో కలిసి అడుతారు. నేను కూడా వాళ్ళతో పాటు అడుతాను. రుచికరమైన కుళ్ళిపోయిన మాంసం ముక్కలు తింటాను. ఆ ముక్కలు తింటున్నప్పుడు అనిపిస్తుంది ‘అసలు మా అక్క ఈ ముక్కలని ఎందుకు తిననానివ్వదో ఏమో, ఐనా ఆమెకేమ్ తెలుసు ఈ కుళ్ళిపోయి వాసన వస్తున్న రుచికరమైన మాంసం ముక్క యొక్క రుచి. నాతో పాటు ఒక్కసారి వాచీ వీటిని తింటే తెలుస్తుంది ఆమెకి. ఊ స్టైల్లు పాడుకుంటూ అందరి ముందు తింటే బాగుండదు అది ఇది అనుకుంటూ మంచి రుచి వాదులుకుంటుంది , పాపం ఈ అమృతం రుచి చూసే అదృష్టం మా అక్కకే కాదు ఈ మానవమాత్రులకీ లేదు. ఒక్కొక్కసారి నేను మా అక్కకి దొరికిపోతాను. అప్పుడు మా అక్క నన్ను కొట్టి ఇంట్లోకి తీసుకుపోతుంది. ఐనా ఆమెకేం తెలుసు ఆ కుళ్ళిపోయిన మాంసం ముక్కల అద్భుతమైన రుచి. నిశ్శబ్ధంగా కొద్ది సేపు నేను చేసిన తప్పుకి పాశ్చాత్తాప్పడ్డట్టు నటించి, మరికొద్ది సేపు కాగానే మళ్ళీ ఇంట్లోంచి ఉరికి, ఇంకొద్ది సేపు కాగానే ఇంట్లోకి వచ్చి ఏమీ తెలియనట్టుగా మా అమ్మ పెట్టిన అన్నం తింటాను. మా అక్క అది చూసి ఎంతో మురిసిపోతుంది. 'హబ్బా మా ఆమ్లా ఎంత మంచి కుక్క. నేను చెప్పగానే మాట వింటుంది అస్సలు బైటికి పోకుండా మేమేసిన అన్నమే తింటూ మా దగ్గర్నే ఉంటుంది’ అని అనుకుంటుంది. పాపం నేను చేసే చేష్టలు తెలియక.


ఒకరోజు నేను మా అక్క, మా నాన్న మరియూ మా అమ్మ కలిసి ఒక టూరుకి వెళ్ళాం. అక్కడ ఒక జలపాతం మా అక్క కంట పడింది. మా అక్క ఆ జలపాతాన్ని చూడడమే ఆలస్యం ఉరుక్కుంటూ వెళ్ళి మా నాన్నని ‘నాన్న నాన్న ప్లీజ్ నాన్న జలపాతంలో ఈత కొడదాం రావా. నువ్వు వస్తేనే అమ్మ నన్ను ఈత కొట్టనిస్తుంది. రా నాన్నా.’ అని అడిగింది. కాదు అడుక్కున్నది. అప్పుడు మా అమ్మ అక్కడికి ఉరికి వచ్చి మా అక్కని తిట్టడం మొదలెట్టింది. 'సిగ్గు లేని దానా, ఇంత సర్ది పెట్టుకొని జలపాతంలో ఈత కొడుతదంట.’ అని వెటకారంగా అన్నది. మా అమ్మ అలా అనగానే మా అక్క మొహం మోరంగడ్డలాగా అయిపోయింది. మా అక్క రెచ్చిపోతూ మా అమ్మతో కొట్లాడడం మొదలెట్టింది. ‘ఏమిటమ్మా! నాన్న వస్తా అన్నాడు కదా... ఇంకేం అయితుంది... నువ్వే కదా ఒక్కదాన్ని ఒద్దన్నావ్ నేను నువ్వు చెప్పినట్టు విని నాన్నని ఒప్పిస్తున్నా కదా.... మద్యల వచ్చి గెలుకుతవెందుకు. ఎంత ఓవర్ చేస్తావు నువ్వైతే. నిన్ను చూస్తుంటే పిచ్చ కోపం ఒస్తుంది’. అన్నది మా అక్క. మా అక్క అలా అనేసరికి మా అమ్మకి కూడా పిచ్చ కోపం వచ్చింది. మా అమ్మ బూతులు తిట్టడం మొదలుపెట్టింది. మా అమ్మ తిట్టిన బూతులు నేను చెప్తే ఏం బావుంటుంది. ఆ బూతులు వినే అదృష్టం మీకు లేదులెండి. ఆ భాగ్యం నాకు, మా నాన్నకి, మా అక్కకి మాత్రమే ఉంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా...,.. ఆ బూతులు వినే అదృష్టం మాకే కాకుండా ఇంకొకడికి ఉంది. వాడు రోడ్డు మీద పోతూ పోతూ మా అమ్మని, మా అక్కని చూశాడు. ఏంటబ్బా గొడవ అని కొంచెం దగ్గరకొచ్చి చూశాడు. ‘ఏంట్రా మేము మేము కొట్లాడుకుంటుంటే మద్యలోకొచ్చి చూస్తున్నావు అన్నట్టు నేను ఒక్క మొరుగుడు మోరిగాను. ఇంక నేను ఇలా మోరిగానో లేదో మా నాన్న పాపం ఆ అదృష్టవంతుణ్ణి మూడు నాలుగు మాటలతో దురుదృష్టవంతుణ్ణి చేసి పడేశాడు. ఇలా నేను మొరాగ్గానే మా నాన్న అలా మా అమ్మని అక్కని కదిలించడానికి ‘హమ్మా! అక్కడ చూడండి వాడు ఎవడో వెధవ మీరిద్దరూ కొట్లాడుకుంటుంటే వచ్చి తమాషా చూసినట్టు చూస్తున్నాడు.’ అన్నాడు. అస్సలు మా నాన్న అనడమే ఆలస్యమా ఇంకేమన్నా అన్నట్టు వాడి మీదకి విరుచుకుపడ్డారు మా అక్క, అమ్మ.


‘అసలు నన్ను ఆ గోల లోంచి బైటికి తెప్పించేవాడు ఎవడూ లేడా’ అనుకుంటున్న సమయంలో ‘మీ గొడవ మధ్యలో పాపం ఏం పాపం ఎరుగని ఆ ఆమ్లా బలవుతుంది చూడండి. కనీసం దాని మొహం చూసైనా ఊరుకోవచ్చు కదా.’ అన్నాడు మా నాన్న. ఆ మాటలు వినగానే నేను కొంచం కుదుటపడ్డాను. కనీసం మా నాన్న మాటలు వినైన్నా నన్ను విడుదల చేస్తారు అని ఊహించాను. కానీ నా దురుదృష్టం కొద్దీ మా అమ్మ, అక్క మా నాన్న మాటలు ఏమీ వినకుండా చాలా శ్రద్ధతో కొట్లాడుకోవడం లో పూర్తిగా లీనమైపోయ్యారు. ఏదైతేనేం కనీసం మా నాన్నైనా నన్ను పట్టించుకున్నందుకు నేను కొంచం సంతోషించాను.


నాకు అప్పుడే ఉన్నట్టుండి మాంసం వాసన వచ్చింది. నేను ఆ వాసన చూస్తూ ఆ వాసన బాటలోనే నడవడం మొదలుపెట్టాను. మా అక్క చేతిలో నా మెదకెసిన ఛైను ఉండడం వల్ల మా అక్క నన్ను ఆపగలిగింది. ఐనా నేను ఆగలేదు. అలాగే నా ఛైనును లాగుతూ ముందుకు వెళ్ళాను. నన్ను ఈ సారి మా అక్క ఆపలేదు. అక్క ఎలాగో ఆపలేదు కదా అని నేను ముందుకు సాగాను. అలా నేను నేలవంక చూస్తూ వెళ్తూ పొయ్యాను. సడంగా నాకు నా కళ్ల ముందు ఒక మనిషి పడుకొని ఉన్నట్టుగా అనిపించింది కానీ నేను నేలకేసి చూస్తూ ఉండడం వల్ల నాకు సరిగ్గా కనిపించలేదు. కళ్ళు పైకెత్తి చూసేసరికి నిజంగానే ఒక మనిషి కనిపించాడు. కానీ ఆ మనిషి నిద్రపోతున్నట్టైతే నాకు అనిపించలేదు. నేను ఆ మనిషిని కొంచెం దగ్గరగా వెళ్ళి చూశాను. ఆ మనిషి ఒళ్ళంతా రక్తంతో స్నానం చేయించినట్టుగా ఉంది. ఆ భయంకరమైన దృశ్యం చూడగానే నేను ఒక్కసారి ఉలిక్కిపడ్డాను.


ఆ భయంకరమైన రూపం చూసి నేను చాలా భయపడినందువల్ల ఒక్కసారి మా అక్క దగ్గరికి వెళ్ళి ఆమె ఒల్లో పడుకుని ఓదార్పు పొందాలనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఒక్కరూ కనిపించలేదు. అలా ఆ భయంకరమైన అడవి మధ్యలో, చీకటి అమావాస్య రాత్రి, నా ముందే రక్తంతో తడిసిన ఒక మనిషి శవం దానికితోడు నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకు చాలా భయం వేసింది. చాలా ఏడ్చాను. కానీ లాభం లేకపోయింది. అలాగే ఏడ్చుకుంటూ నిద్రపోయాను. నాకు మెలకువ వచ్చేసరికి తెల్లవారు జామున 5 గంటల సమయం లాగా అనిపించింది. నాకు ఏమి తోచక అటూ ఇటూ తిరిగి కొంచెం పళ్ళు కింద పడి దొరికితే తీసుకుపోయి ఆ చచ్చినోడు అదే ఎవరో మనిషి మీద పెట్టాను. ‘అరె! కుక్క మనకోసం పాపం కష్టపడి పళ్ళు తెచ్చింది’ అని అనుకుని లేచి పళ్ళు తిని మళ్ళీ చచ్చిపోవచ్చుకదా. సచ్చినోడు నేను అలా కష్టపడ్డానన్న ఇన్నిత జ్ఞానం కూడా లేకుండా చచ్చే ఉన్నాడు. హౌల గాడు.


‘ఇంక నీకోద్దైతే నేనే తింటాను నీకు ఇవ్వను’ అని నేను లోపల్లోపలే అనుకున్నాను. అలా అనుకుని ఆ చచ్చినోడి మీద పెట్టిన పళ్ళు నేను వాడి మీదనుంచి తీస్కోని తిన్నాను. నా కడుపు కాస్త కుదుటపడింది. కొద్ది సేపటికి మా అక్క పిలుపులు వినిపించాయి. మా అక్క గొంతు వినగానే నేను కూడా ‘ఊ................................................’ అని కేకలు పెట్టాను. సడంగా మా అక్క నా దగ్గరికి ఉరుకొచ్చింది. మా అక్క నా కంట పడగానే నేను ఓ.. కేకలు పెడుతూ కుయి కుయి అని ఏడవడం మొదలు పెట్టాను. మా అక్క నన్ను ఎత్తుకుని నాకు ముద్దులు పెట్టి తాను కూడా ఏడవడం మొదలెట్టింది. అప్పుడు నేను మా అక్క మొహమంతా నాకే పనిలో లీనమైపోయాను. ఆ పని పూర్తయిన తర్వాత మా అమ్మ దగ్గర్కి పోయి మా అమ్మ కాలు నాకాను. ఎప్పుడూ నన్ను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని మా అమ్మ నన్ను మొదటి సారిగా ముద్దుపెట్టుకుంది. మా అమ్మ నన్ను అలా ముద్దుపెట్టుకోవడంతో నేను ఇంకా చాలా రెచ్చిపొయ్యను. మా అమ్మని ఇంకా నాకడం మొదలు పెట్టాను. మా అమ్మ కూడా నాకించుకుంది. కొద్ది సేపటి తర్వాత మా అమ్మకి కొంచెం విసుగు పుట్టి ‘ఏ! చాలింక ఎంత నాకుతవ్’ అని అన్నది. ఇంకమా అమ్మ అలా అన్న తరువాత నేను మా నాన్న దగ్గరకి పొయ్యను. మా నాన్నని కూడా నాకీ నాకీ చివరకి పోనీ లే పాపం అని వదిలేశాను. మా అక్కవాల్లే కాదు వాలతో పాటు పోలీసులు కూడా వచ్చారు. సడంగా నా చెంప మీద ఎవరో కొట్టినట్టు అనిపించింది. ఏంట్రా బాబు నన్నేవారు కొడుతున్నారని చూస్తే మా నాన్న. ఎందుకంటే నేను సమయం 7:15 అవుతున్నా పట్టించుకోకుండా పంది లాగ పడుకొనే ఉన్నానని. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది నేను ఆమ్లా కాదు దాని అక్క శ్వేత అని. ఇప్పటిదాకా నేను నా కల ప్రపంచంలోనే ఆమ్లా గా మారానని, ఆ అడవిలో అమావాస్య రాత్రి ఆ భయంకరమైన రూపంతో తప్పిపోయ్యానని. అప్పుడు నాకు చాలా సిగ్గు వేసింది. ఐనా నేను ఆమ్లా కావడమెంటీ అలా ఆ అమావాస్య రాత్రి, ఒంటరిగా, ఆ భయంకరమైన రూపంతో, ఆ భయంకరమైన అడవిలో నిజంగానే తప్పిపోవాడమెంటీ. ఒకవేళ నిజంగానే అలా అయితే ఇంకేమన్నా ఉందా. ఆమ్లాకి అన్నమెవరు వేస్తారు? నా హోమ్వర్కులు ఎవరు కంప్లీట్ చేస్తారు..... వామ్మూ ఆమ్లకైనా అమ్మ, నాన్న అన్నమేస్తరేమోకాని నా హోమ్వర్కులు కంప్లీట్ చేయకపోతే అదో పెద్ద తల్నొప్పి. మళ్ళీ రాయలేక చావలి. వద్దులే ఐనా మనకాంత అదృష్టం లేదులే. పోనీ ఎందుకు మనకు అందని దాని గురించి ఎక్కువగా ఆలోచించి తర్వాత అందలేదని బాధపడడం. ఉన్నదానితో సరిపెట్టుకుంటే సరి. మన మోహలకి అత్యాశ సూట్ కాదులే. అమ్మో నా స్కూల్కు సమయమవుతున్నది. నేను వెళ్ళాలి.

***సశేషం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి: కె.డి. నిహిత చంద్రిక

7వ తరగతి

హైదరాబాద్237 views0 comments

Comments


bottom of page