top of page

పగను చంపిన సాహసం


'Paganu Champina Sahasam' New Telugu Story


Written By Ch. C. S. Sarma(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)పెద్దలు ధైర్యే లక్ష్మి సాహసం అన్నారు. సాహసం అనేది కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలను రూపుమాపుతుంది. సాహసం సదా విజయానికి మూలం. పెద్దలు తమ పిల్లలకు పిరికితనాన్నినూరిపోయకుండా ధైర్య సాహసాలను చిన్న వయస్సు నుంచీ నేర్పాలి...."గుడ్ మార్నింగ్ ప్రాణనాథా"

ఆరు గంటలకు లేచి, స్నానం చేసి, దీపారాధన చేసి, పాలు కాచి, నైవేద్యం పెట్టి, కాఫీ కలిపి ప్లాస్క్ లో పోసి, భర్త శ్రీహరిని లేపేటందుకు పడక గదిలోకి వచ్చింది సుధ. మంచం పై బోర్లా పడుకుని ఉన్నాడు శ్రీహరి. భార్య పలుకులను విన్నాడు. కళ్ళు తెరిచి... తన చేతితో సుధచేతిని పట్టుకొని మంచం మీదికి లాగాడు. సుధ మంచం పై కూర్చుంది. తన చేతులతో సుధ నడుమును చుట్టేశాడు.


"నేను స్నానం చేశాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మీరూ లేచి స్నానం చేయండి. తన చేతులతో అతని చేతులను నవ్వుతూ విడదీసింది. మంచం దిగి నిలబడింది సుధ.


"ఆదివారం స్పెషల్ కావాలి సుధా!..." ఓరకంట సుధ ముఖంలోకి చూసాడు శ్రీహరి.


"ఆఁ... అదంతా రాత్రికి ఇప్పుడు కాదు. లేచి త్వరగా స్నానం చేయండి. నన్ను ఈరోజు గండిపేట గోల్కొండకు తీసుకుని వెళతానని మాట ఇచ్చారు. మరిచారా!..." చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ సత్యభామలా చూస్తూ పలికింది సుధ.


"ఓ... ఆ మాటే మరిచాను డియర్!... సారీ... అర్థగంటలో రెడీ అవుతాను. టిఫిన్ దార్లో చేద్దాం." లేచి వేగంగా బాత్రూం వైపుకు వెళ్ళాడు శ్రీహరి.


సుధ హాల్లోకి వచ్చి టీవీని ఆన్ చేసి సోఫాలో కూర్చుంది. శ్రీహరి స్నానం చేసి హాల్లోకి వచ్చాడు. ప్లాస్క్ లోని కాఫీని కప్పులో పోసి శ్రీహరికి అందించింది సుధ.


ఇరువురు చక్కగా తయారై కార్లు కూర్చున్నారు‌ ఇరవై నిమిషాల్లో ఒక హోటల్ ముందు కారును పార్కు చేశాడు శ్రీహరి. ఇరువురూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేశారు.

కారు ఎక్కి గోల్కొండకు చేరారు.శ్రీహరి, సుధ అన్నాచెల్లెళ్ల పిల్లలు. వారిరువురి వయస్సులో ఆరేళ్లు తేడా. సుధ మంచి అందగత్తె. ఎం ఏ వరకు చదివింది. శ్రీహరి సబ్ రిజిస్ట్రార్. మూడు నెలల క్రిందట వారి వివాహం జరిగింది. మంచి అన్యోన్యమైన దాంపత్యం.


శ్రీహరి... సుధలు ఆ కోటలో ప్రవేశించారు. అన్ని ప్రాంతాలు తిరిగి చూశారు. సుధ గోల్కొండను చూడడం అదే మొదటిసారి. ఆనందంగా ఫోటోలు తీసుకున్నారు. చెట్టాపట్టాలేసుకుని సమయాన్ని ఎంతో ఆనందంగా గడిపారు. అక్కడి నుంచి బయలుదేరి గండిపేట ప్రాంతానికి చేరారు.


కారును పార్కింగ్ స్థలంలో వదిలి ఇరువురు సైట్ సీయింగ్ కు బయలుదేరారు. ఆదివారం కనుక వీరిలాగే... ఎన్నో జంటలు... కుటుంబాలు ఆ ప్రాంతాన్ని చూసేటందుకు వచ్చారు. కొందరు చెట్ల నీడల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కొందరు వారితోటే తెచ్చుకున్న ఆహార పదార్థాలను తింటున్నారు. ప్రేమికులు దూరంగా ఓ మూలగా కూర్చుని వారి భావి జీవితపు కలలను కంటున్నారు. ప్రశాంతమైన వాతావరణం. ప్రతి మనసుకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. అందరి ముఖాల్లోనూ ఉత్సాహం... ఆనందం... కొందరు పిల్లలు హైడ్ అండ్ సీక్ ఆటను ఆడుతున్నారు.


శ్రీహరి... సుధలు కొంతవరకు తిరిగి ఒకచోట కూర్చున్నారు. తోటే తెచ్చుకున్న ఆహార పదార్థాలను తినడం ప్రారంభించారు.


ఒక స్కూల్ బస్సు వచ్చి ఆగింది. ఐదుగురు టీచర్లు, ముప్ఫై మంది బాలబాలికలు బస్సు నుంచి దిగారు. టీచర్లు చెప్పినట్లుగా వరుసగా నిలబడి పరిసరాలను చూడ ప్రారంభించారు.


కొందరు ఆకతాయి మగ పిల్లలు అమిత ఉత్సాహంతో అటూ ఇటూ పరిగెత్తాలని ప్రయత్నించినా... టీచర్ల బెదిరింపుతో క్రమంగా ముందు నడిచే పిల్లలను అనుసరించారు.


ఇలాంటి ప్రాంతాలకు పిల్లలను తీసుకుని వచ్చిన టీచర్లు వారిని కంట్రోల్ చేసి నడిపించి... చూడవలసిన వాటిని చూపించి... చెప్పవలసిన విషయాలను వారికి చెప్పి... చివరగా పిల్లలందరినీ వారి వారిఇండ్లకుచేరేవరకూ... జాగ్రత్తగా చూసుకోవడం వారి బాధ్యత అవుతుంది. దాన్నే ఈ టీచర్లు పాటిస్తున్నారు.


భోజనం ముగించి శ్రీహరి సుధలు చెరువు కట్టమీద కూర్చున్నారు. ఆ నీళ్ళల్లో... చేపలు ఎన్నో... మనుషులను చూసి అవి దరికి... వచ్చినవారు ఏదైనా ఆహారాన్ని తమకు వేస్తారని వస్తాయి. సుధ, శ్రీహరి నీటిపై బొరుగులు చల్లారు. వందల్లో చేపలు క్షణాల్లో ఆ ప్రాంతాన్ని చేరాయి. బొరుగులను తినడం ప్రారంభించాయి.


నీటిలో ఆ చేపల కదలిక... అవి బొరుగులను తినే విధానం సుధ ఇంతకుముందు ఎక్కడా చూడలేదు. చిన్నపిల్లలా మారిపోయి కేరింతల కొడుతూ ఆ దృశ్యాన్ని చూసి ఎంతగానో ఆనందించింది. తనూ నీటిపై బొరుగులను విసిరింది.


శ్రీహరికి ఈ అనుభవం క్రొత్త కాదు. ఐదేళ్ల నుంచి హైదరాబాదులో ఉంటున్నాడు. స్నేహితులతో కలసి అనేక పర్యాయాలు ఈ పరిసరాలను చూసేదానికి వచ్చి ఉన్నాడు. ఆనందంగా గంతులేస్తున్న అర్ధాంగిని ఎన్నో భంగిమలలో ఫోటోలు తీశాడు. తను భార్యను స్పృశిస్తూ పరమానందాన్ని పొందాడు. నీటిపై నుంచి వీచే చల్లగాలి శరీరాలను తాకి వారిని మరింత వుత్తేజితలను చేస్తూ ఉంది.


టీచర్లు... ఆ బాల బాలికలు ఆ ప్రాంతానికి చేరారు. నీటిలోని చేపల విన్యాసాలను చూసి ఆ బాలబాలికలు ఎంతగానో ఆశ్చర్య ఆనందాలతో మునిగిపోయారు.

వెనుక వస్తున్న వాడు నెట్టగా ముందు నడుస్తున్న ఒకడు కాలుజారి నీళ్లలో పడిపోయాడు. అందరూ 'రోహిత్... రోహిత్...' అని బిగ్గరగా అరిచారు. టీచర్లు హడలిపోయారు. చెరువులో పడ్డ రోహిత్ ను చూస్తూ హెల్ప్... హెల్ప్... బిగ్గరగా అరిచారు. కాస్త దూరంలో ఉన్న శ్రీహరి సుధ ఆ ప్రాంతానికి పరిగెత్తారు. టీచర్ల, పిల్లల అరుపుల విని మరికొందరు కూడా అక్కడికి పరుగున వచ్చారు.


ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం క్షణంలో ఎంతో భయానకంగా వీరి అరుపులతో మారిపోయింది.

రోహిత్ వయస్సు పన్నెండు సంవత్సరాలు. వాడికి ఈత రాదు నీట మునిగీ తేలుతూ మునుగుతూ ఉన్నాడు.


విషయాన్ని గ్రహించిన శ్రీహరి నీట దూకాడు. పట్టుకున్నాడు. అన్ని రకాల ఈతలెరిగిన శ్రీహరి రోహిత్ ను ఒడ్డుకు చేర్చాడు. రోహిత్ స్పృహను కోల్పోయాడు. వాడి పొట్ట ఒత్తి నోటి గుండా నీళ్లు బయటికి వచ్చేలా చేశాడు.


అందరూ రోహిత్ చుట్టూ గుమిగూడారు. అందరి వందనాల్లో ఎంతో విచారం. ముఖ్యంగా టీచర్లు హడలిపోయారు.

శ్రీహరి ప్రథమ చికిత్సతో రోహిత్ కళ్ళు తెరిచాడు. అందరి ప్రాణాలు కుదుటపడ్డాయి. వాణ్ణి మెల్లగా లేవదీసి కూర్చోబెట్టాడు శ్రీహరి... షర్ట్ బటన్స్ విప్పి... వాడి శరీరానికి బాగా గాలి తగిలేలా చేశాడు శ్రీహరి.


అంతవరకు జరిగినదాన్ని చూసి షాక్ తిన్న సుధ భయంతో శ్రీహరిని ఏడుస్తూ చుట్టుకుంది. ప్రీతిగా ఆమె వీపు జవురుతూ "సుధా! భయపడకు నేను మంచి ఈతగాణ్ణి. ప్రైజులు కూడా గెలుచుకున్నాను." అనునయంగా చెప్పాడు శ్రీహరి.


రోహిత్ లేచి నిలబడ్డాడు. వాడిని చూసి అందరూ ఆనందించారు. ఒక మేడం తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న చిన్న టవల్ ను బయటకు తీసి అతని తలను తుడిచింది.

"హౌ ఆర్ యు రోహిత్?..." ప్రీతిగా అడిగింది.

"ఐ యాం ఆల్ రైట్ మేడం." నవ్వుతూ చెప్పాడు.


రోహిత్ శ్రీహరిని సమీపించాడు.

"థాంక్యూఅంకుల్!..." మెల్లగా అన్నాడు.


"నో మెన్షన్ డియర్!..." తన కుడి చేతిని రోహిత్ తలపై ఉంచి నవ్వుతూ చెప్పాడు శ్రీహరి.

టీచర్లందరూ శ్రీహరిని చుట్టుముట్టారు. అతన్ని అభినందించి ధన్యవాదాలు తెలియజేశారు. తనకన్నా వయసులో పెద్దవారైన వారికి సవినయంగా నమస్కరించాడు శ్రీహరి.


పిల్లలందరూ టీచర్ల మాట ప్రకారం వరుసగా నిలబడి బస్సు వైపుకు నడిచారు.

తన పవిటితో శ్రీహరి తలను తుడిచింది సుధ. "నేను చాలా భయపడ్డాను మీరు నాతో చెప్పకుండా చేసిన సాహసానికి.." బొంగురు పోయిన కంఠంతో పలికింది సుధ.


ఆమె కన్నీటిని తన వేళ్లకు తుడిచాడు శ్రీహరి. పద ఇంటికి వెళదాం." ఆమె భుజం పై చేయి వేశాడు. ఇరువురూ కారును సమీపించారు. ముందు బస్సు వెనకాల కారు బయల్దేరాయి. 'అంకుల్ జిందాబాద్... అంకుల్ జిందాబాద్' అనే చిన్నారుల అరుపులు సుధా శ్రీహరి చెవులకు వినిపించాయి.


ఉదయం ఆరున్నర ప్రాంతం. శుభ స్నానం చేసి డ్రస్ చేసుకొని అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకొంటూ ఉండగా కాలింగ్ బెల్ మ్రోగింది. వేగంగా వెళ్ళి తలుపును తెరచింది.

ఎదురుగా రోహిత్, వాళ్ళ అమ్మా నాన్నలు.


"గుడ్ మార్నింగ్ ఆంటీ. వీరు మా అమ్మా నాన్న." నవ్వుతూ చెప్పాడు.

"ఓ...గుడ్ మార్నింగ్. ప్లీజ్ కమ్." సాదరంగా లోనికి ఆహ్వానించింది సుధ.


ముగ్గురు లోనికి నడిచారు. సోఫాలను చూపి "కూర్చోండి. వారిని పిలుస్తాను." చెప్పి లోనికి వెళ్ళిపోయింది సుధ.

ఐదు నిమిషాల తర్వాత శ్రీహరి హాల్లోకి వచ్చాడు. కూర్చొని ఉన్న వారిని చూసి ఆశ్చర్యపోయాడు. రోహిత్ తల్లిదండ్రులు లేచి నిలబడ్డారు. కొన్ని క్షణాలు వారు ఒకరినొకరు తదేకంగా చూస్తూ ఉండిపోయారు.


"అంకుల్... గుడ్ మార్నింగ్ మీరు మా అమ్మ నాన్నలు." చెప్పాడు రోహిత్.


"అన్నయ్యా!... బాగున్నారా!..." ఆప్యాయంగా శ్రీహరి పలకరించాడు నవ్వుతూ.


రోహిత్ తల్లి ఈశ్వరి తండ్రి ఆనంద్ కళ్ళల్లో కన్నీరు‌. శ్రీహరి పలకరింపుకు వెంటనే మాట్లాడలేకపోయారు. అవమానంతో వారు ఇరువురి హృదయాల్లో ఎంతో బాధ.

కూర్చోండి అన్నయ్యా!..." ఆప్యాయతతో నిండిన శ్రీహరి పలుకు.


శ్రీహరి... ఆనంద్ లు అన్నదమ్ములు బిడ్డలు. ఆనంద్ శ్రీహరి కంటే ఆరు సంవత్సరాలు పెద్ద. తాతగారు ఆస్తి పంపకాల్లో పక్షపాతంగా వ్యవహరించాడని శ్రీహరి తండ్రి గోపాల్, ఆనంద తండ్రి గోవింద్ ల మధ్య పగ, ద్వేషం. పది సంవత్సరాలుగా ఆ రెండు కుటుంబాల మధ్య మాటలు... రాకపోకలు లేవు‌.


"తమ్ముడూ!... నన్ను క్షమించరా. పెద్దల నిర్ణయాలకు కట్టుబడి మనం ఇంతకాలం విరోధులుగా పగతో బ్రతికాము. నీవు నా బిడ్డను కాపాడి నాకు పుత్ర భిక్ష పెట్టావు. నీవు మా పాలిట దేవుడివి." ఆవేదనతో కన్నీటితో చెప్పాడు ఆనంద్.


"అన్నయ్యా!... నేను నీకంటే చిన్నవాడిని. నాకు ఎవ్వరి మీద పగలేదు. నేను ఎప్పుడూ మీ నుంచి ఆశీస్సులు కోరతాను." అనునయంగా చెప్పాడు శ్రీహరి.


ఆనంద్, శ్రీహరిని అశ్రుపూరిత నయనాలతో కౌగిలించుకున్నాడు. కాఫీ కప్పులతో హాల్లోకి ప్రవేశించిన సుధ వారి సంభాషణను విన్నది.


'చెల్లీ!... పిన్నీ...' అంటూ ఈశ్వరి రోహిత్ లు సుధను సమీపించారు.


ట్రేని టీపాయ్ పై వుంచి వారి చేతులను ఆప్యాయంగా నవ్వుతూ తన చేతుల్లోకి తీసుకుంది సుధ.

శ్రీహరి సాహసం... అన్నదమ్ముల మధ్య ఉన్న పగను చంపింది.


* * *

-సమాప్తం-

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Twitter Link

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.29 views0 comments

Comments


bottom of page