top of page

పల్లె పులకించింది


'Palle Pulakinchindi' - New Telugu Story Written By Siramsetti Kantharao

'పల్లె పులకించింది' తెలుగు కథ

రచన : శిరంశెట్టి కాంతారావు


ముక్త్యాల, వేదాద్రుల మధ్య కృష్ణానది, ఎద్దు మూపురం ఆకృతిలో ఒంపు తిరిగి ప్రవహిస్తుంటుంది.

ఆ ఒంపు నడుమ చిట్టడవి తో కూడిన ఎగుడు దిగుడు సున్నపురాయి పీఠభూమి, కృష్ణమ్మ నుదుట సింగారించుకున్న పచ్చబొట్టు లా కనిపిస్తుంది.


వేదాద్రి నృసింహ స్వామి వారి ఆలయం ఎదురుగా నదికి ఆవలి ఒడ్డున గింజుపల్లి గ్రామం వుంది.

'ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా ఒదిగి ఉండే ఆ గ్రామాన్ని చూసిన వారెవరైనా తమ జీవిత కాలంలో మర్చిపోలేరు.


ఊరి మధ్యన ఏనాటిదో చెప్పలేని పెద్ద రావిచెట్టు ఒకటి కొమ్మలు సాచి విస్తరించి వుంది. దాని కాండం చుట్టూ నాపరాళ్ళతో నిర్మించిన రచ్చబండ కొంత కళ తప్పి పోయినా దృఢంగానే ఉంది.

ఆ చెట్టుకు ఎదురుగా తూర్పుముఖంగా ఊరి పెద్ద రైతు రామనర్సయ్య పెంకుటిల్లు హుందాగా కనబడుతుంది.


ఊరు కుటుంబానికి అతనే పెద్ద దిక్కు.


ఊరికి సంబంధించిన మంచి చెడులన్నీ ఆయన మాట మీదుగానే జరిగిపోతుంటాయి.

రామనర్సయ్య పెద్దగా చదువుకోకపోయినా చదువు విలువ తెలిసినవాడు కావడంతో తన ముగ్గురు కొడుకులను ఖర్చుకు వెరవకుండా నదికి ఆవలనున్న పట్టణంలో వుంచి పెద్ద చదువులు చదివించాడు.


వాళ్ళు కూడా కష్టపడి చదువుకుని మంచిఉద్యోగాలు సంపాదించుకుని హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.


ఎవరు ఎక్కడ వుంటున్నా, ప్రతి సంక్రాంతికి వాళ్ళంతా కుటుంబాలతో సహా గింజుపల్లికి వచ్చి,

వారం పదిరోజులపాటు తల్లిదండ్రులతోను, గ్రామస్తులతోనూ ఆనందంగా గడిపి వెళుతుంటారు.

తూరుపుకొండ ఇంటి తలుపులు తీసుకుని లోక సంచారానికి బయలుదేరబోతున్న బాలభానునికి కృష్ణమ్మ తన తరంగాల కరాలతో స్వాగతం పలుకుతూ భూపాలరాగం ఆలపించసాగింది.


నది పొడవునా బారులుతీరి నిల్చున్న రకరకాల అడవి చెట్లు ఆ రాగాలాపనకు మురిసిపోతూ కొమ్మల శిరాలను ఆనందంగా ఆడించసాగాయి.


తమ కలకూజితాలతో ఉదయభానునికి స్వాగతగీతికలను ఆలపిస్తున్న రకరకాల పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుతూ కనువిందు చేస్తున్నాయి.


వేదాద్రి నృసింహుని ఆలయంలో సుప్రభాత సేవలు ఆరంభమైనట్టుగా నినదిస్తున్న జేగంటానాదం ఆ ఉషోదయ సమీర తరంగాల్లో వలయాలు వలయాలుగా దూర తీరాలకు సాగిపోతున్నాయి.


కృష్ణా తీరమంతా అట్లా నవజీవన చైతన్యాన్ని ప్రోదిచేసుకుంటూ ఆరోజు జీవయాత్రకు సన్నద్ధం కాసాగింది.


అటువంటి సుప్రభాత వేళ ఒకదాని వెంట ఒకటిగా సాగి వచ్చిన మూడు కార్లు, వేదాద్రి గుడి గాలిగోపురం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆగాయి.


వాటిల్లోనుండి దిగిన రామనర్సయ్య కొడుకులను, వారి కుటుంబ సభ్యులను గమనించిన ఆచుట్టుపక్కల దుకాణాల వాళ్ళంతా “సంకురాత్రి ఎల్లి ఆరునెల్లు గూడ తిరక్కముందే మళ్ళొస్తున్నారేందయ్యా?” అంటూ ఎంతో చొరవగా అడిగారు.


“మా అందరికీ అనుకోకుండా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. దాంతో అమ్మానాన్నలను చూసిపోదామని వస్తున్నాం” అంటూ రామనర్సయ్య పెద్ద కొడుకు శ్రీనివాసరావు బదులిచ్చాడు.

“ఈపిల్లగాడెవరు?! ముక్త్యాల రాజా గారి మనుమడి మాదిరి నాజూగ్గా కన్పిస్తున్నాడు” శ్రీనివాసరావు ఎడమపక్కనిల్చుని తమనందరినీ మౌనంగా పరికించి చూస్తున్న యువకుణ్ణి చూపిస్తూ అడిగాడు కొబ్బరికాయల దుకాణం సత్యనారాయణ.


“మా చిన్నబ్బాయి కదూ?” తన కుడిచేతిని కొడుకు ఎడమ భుజం మీద వేస్తూ ఓ విధమైన సంతృప్త స్వరంతో బదులిచ్చింది శ్రీనివాసరావు శ్రీమతి ప్రమీల.


“అట్లనా!? ఎప్పుడూ కనబడలేదే?” అక్కడున్న వాళ్ళంతా ఆ యువకుని దిక్కు ఆసక్తిగా చూస్తూ అన్నారు.


పదినిమిషాలపాటు వాళ్ళతో మాట్లాడిన శ్రీనివాసరావు వాళ్ళు, గుడిపక్క గట్టుమీద నుండి దిగుతూ నెమ్మదిగా రేవులోకి చేరుకున్నారు.


తెల్లవార్లూ పడవలమీద నదిలో చేపలవేట సాగించిన పల్లెకారులంతా వాటిని సమయానికి మార్కెట్‌కి చేర్చాలన్నఆరాటంతో హడావిడిగా వెళ్ళిపోతున్నారు.


వేదాద్రి రేవునుండి గింజుపల్లికి, గింజుపల్లి రేవునుండి వేదాద్రికి వెళ్లాల్సిన ప్రయాణికులు రెండు పక్కలా రేవుల్లో పడవ కోసం వేచి చూస్తున్నారు.


రోజూ చీకటితోనే నదిలో స్నానంచేసి, కడవనిండా నీళ్ళు ముంచుకుని తడిబట్టలమీదనే గట్టు మీదున్న ఓడమల్లేశ్వరుని లింగంమీద గుమ్మరించి, దండంపెట్టుకొని దిగివస్తూ శ్రీనివాసరావు వాళ్ళను చూసిన సరంగు శివన్న “ఏందబ్బాయ్‌! రోజులుగాని రోజుల్లో వస్తున్నరేంది?” అంటూ ప్రేమగా పలుకరించాడు.


“ఏంలేదు శివన్నా! అమ్మోళ్ళను చూసిపోదామని వస్తున్నామంతే” తన చిన్నతనం నుండీ ఎదుగూ బొదుగూలేని జీవనాన్ని సాగిస్తున్న శివన్నను గురించి ఓ పక్క ఆలోచిస్తూనే మరోపక్క బదులిచ్చాడు శ్రీనివాసరావు.


“అట్లనా మంచిది. ఈపిల్లగాడెవరు? “ దొరబాబు లెక్క నాజూగ్గా కనబడుతున్న శ్రీనివాసరావు చిన్నకొడుకు దిక్కు చూస్తూ ఇందాక దుకాణాలవాళ్ళ మాదిరిగానే అడిగాడు శివన్నగూడా.

ఎవరో చెప్పాడు శ్రీనివాసరావు.


“ఓ అట్లనా! ఈఅబ్బాయి పుట్టినప్పుడు మూడో నెల ఎల్లకముందు అమ్మమ్మగారి ఊరునుంచి మనూరు తీసుకొచ్చేటప్పుడు నేనే నా నావమీద ఏరుదాటిచ్చాను. ఎంతల్నే ఎంతెదిగిపోయిండు!?” తన బ్రతుకంతా ఆ రెండు రేవులమధ్య గిడసబారిపోయిందన్నస్పృహే లేకుండా ఎంతో నిర్మలంగా గలగలా మాట్లాడాడు శివన్న.


ఇంతలో..

నదికి ఆవలి పక్క గింజుపల్లి రేవులో నుంచి “ఓ శివన్నా తొందరగా నావను ఇటు దిక్కు తీస్కరా! గొల్లోల్ల అడివన్నకోడలు రాత్రి నుంచి పురిటి నొప్పులు పడుతుంది. కడుపుల పిండం అడ్డం తిరిగి కానుపు కష్టమైతుంది. ఎమ్మటే పేటకు తీసుకపోకుంటె చిన్నప్రాణం సంగతేమోగాని, పెద్ద ప్రాణమే పొయ్యేటట్టుందిి. మంత్రసాని ఎరుకలి పుల్లమ్మ నది దరుల్లోని ఒండ్రుమట్టి

ఉర్లిపడేంత గట్టిగా కేకలువేసింది.


ఆ కేకలు విన్న శివన్న ‘తనబిడ్డకే ప్రాణాలమీది కొచ్చింద’న్నంతగా కంగారుపడిపోతూ “ మీరంతా తొందరగా నావ ఎక్కండి బాబూ! అవతల ఆడకూతురు రాత్రినుంచి పురుటినొప్పులు తీస్తుందంట” అంటూ రేవులో వున్న ప్రయాణీకులందరినీ తొందర పెట్టాడు.


శ్రీనివాసరావు వాళ్ళతోపాటు రేవులో ఉన్న 'ప్రయాణికులంతా గబగబా పడవెక్కి కూర్చున్నారు.

వెంటనే లంగరెత్తిన శివన్న గడకర్ర నందుకుని దాన్ని నది అడుక్కి అదిమిపెడుతూ పడవను మెలమెల్లగా నదిలోకి తోయసాగాడు.


అదేసమయంలో శివన్న బావమరిది తెడ్డుకు బదులు కొత్తగా అమర్చిన అయిలింజన్ని “ఆన్‌” చేశాడు.


దాంతో వేగంపుంజుకున్న పడవ నది మధ్యకు సాగిపోతుంటే, చేతిలోని గడను పడవలో ఓ పక్మన పడేసిన శివన్న వెంటనే వెళ్ళి చుక్కాని పట్టాడు.


నది గల గలల గీతానికి అనుగుణంగా అయిల్‌ ఇంజన్‌ చప్పుడు ఏక్‌తారను మీటుతున్నట్టుంది.

వేదాద్రి గుడిశిఖరం మీదుగా ఎగిసివస్తున్న సూర్యుడు రాచగుమ్మడిపండును తలపిస్తున్నాడు.

కొందరు ప్రయాణీకులు పడవలో ఒంగి తమదరగ్గరున్న సీసాల్లో నదినీళ్ళను పట్టుకోసాగారు. మరికొందరు చిల్లర డబ్బులు నదిలోకి విసిరి కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్నారు.


'ప్రయాణీకులువేసే బొంగుపేలాలకోసం నీటిపక్షులుకొన్ని పడవచుట్టూ గాలిలో గిరికీలుకొడుతూ ఆనందాన్నిపంచసాగాయి.


చూస్తుండగానే పడవ వెళ్ళి గింజుపల్లిరేవులో ఆగింది.


ప్రసవవేదన పడుతున్న ఇల్లాలిని పడవ ఎక్కించడానికి గింజుపల్లి ఊరు ఊరంతా కదలివచ్చి రేవులోనే వున్నట్లుంది.


పడవ దిగుతున్న కొడుకులను, కోడళ్ళను, మనుమలను, మనుమరాళ్ళనుచూసిన రామనర్సయ్య దంపతులు ఒక్కసారిగా ఆశ్చర్యపడిపోతూ “ఇదేంటి!? మాట మాత్రం కూడా కబురుపెట్టకుండా వస్తున్నారేంటి?” అనుకుంటూ ఎదురెళ్ళారు.


చాలారోజుల తరువాత ఇంటికొస్తున్న శ్రీనివాసరావు చిన్నకొడుకును అందరికంటే ముందుగా దగ్గరికి తీసుకున్న రామనర్సయ్య భార్య “నాయినా! సుమంతూ! బాగున్నవా?” అంటూ ఆనందంతో కళ్ళ నీళ్ళు తీసుకుంది.


“బావున్నా నాన్నమ్మా! నువ్వెలావున్నావ్‌?” అంటూ ఆవిడను అల్లుకుపోయాడు సుమంత్‌.


పురిటినొప్పుల ఇల్లాలిని మెల్లగా పడవలోకి ఎక్కించి సాగనంపిన [గ్రామస్తులంతా రామనర్సయ్య పిల్లల్ని చుట్టుముట్టి “సంకురాత్రి కి రావాల్సినోళ్ళు ఇప్పుడొస్తున్నారేంది?” అంటూ కుతూహలంగా పలుకరించారు.


“ఏం లేదు. అమ్మానాన్నలను చూసిపోదామని వస్తున్నామంతేౌ"అంటూ బదులిచ్చాడు రామనర్సయ్య రెండో కొడుకు.


వాళ్ళచేతుల్లోని సంచుల్నిి సూట్‌కేసుల్నీ ఊళ్ళో వాళ్ళంతా తలా ఒకటి అందుకున్నారు.

ఊరంతా ముచ్చట్లతో రేవులో నుండి ఊరు దిక్కు కదిలింది.


మద్యాహ్నభోజనాలు చేసిన తర్వాత రామనర్సయ్య కుటుంబ సభ్యులంతా ఇంటి ముందున్న వేపచెట్టుకింద మంచాలు వేసుకుని కూర్చున్నారు.


తల్లిదండ్రుల దిక్కు చూస్తూ అందరికన్నా ముందుగా నోరువిప్పిన శ్రీనివాసరావు “సుమంత్‌గాడు కలెక్టర్‌గా సెలక్టయ్యాడు. ఆ విషయం మీకు స్వయంగా తెలియజేయాలన్న ఉద్దేశంతో మేమంతా బయలుదేరి వచ్చాం” అకస్మాత్తుగా వచ్చిన తమరాకలోని పరమార్ధాన్ని తెలియజేస్తూనే సంతోషంతో ఉబికివస్తున్న కన్నీళ్ళను తెల్లటి జేబురూమాలుతో ఒత్తుకున్నాడు.


కొడుకు మాటలు వింటూనే సంతోషంతో కూడిన ఉద్వేగానికి లోనైన రామనర్సయ్య దంపతులిద్దరూ ఒకేసారి “అయ్యా! సుమంతూ! నువ్వు అనుకున్నది సాధించావా నాయినా!?” అంటూ అతణ్ణి తమ బాహువుల్లోకి తీసుకున్నారు.


రామనర్సయ్య వెంటనే తన వేలుకున్న బంగారపుటుంగరాన్ని తీసి మనుమడి వేలికి తొడిగి “నువ్వు అనుకున్నది సాధించి కలెక్టరై మనూరికి మొదటిసారి వచ్చినందుకు గుర్తుగా నా సంతోషం కొద్దీ ఇస్తున్నాన్రా!” అంటూ అతని బుగ్గలు పునికాడు.


తాత, నాయినమ్మల పాదాలనంటి నమస్మరించాడు సుమంత్‌.


గంధపు అగరొత్తుల సువాసన క్షణాల్లో ఇల్లంతా వ్యాపించినట్టు రామనర్సయ్య మనుమడు కలెక్టర్‌ అయ్యాడన్న వార్త ఊరంతా పాకిపోయింది.


దాంతో ఊరంతా రామనర్సయ్య ఇంటికి పోటెత్తింది.


“ఎటు పోవాలన్నా నావమీద తప్ప బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టలేని ఈ కుగ్రామంలో పుట్టిపెరిగిన పిల్లగాడు మనకండ్లముందే కలెక్టర్‌ అయ్యాడంటే మామూలు మాటలుగాదు”


“మనూరికి ఎంత పేరుదెస్తదో!?”


“నువ్వు సల్లంగ బతికి, పేదోల్లకు సాయం జెయ్యాల బిడ్డా!”


“ఢిల్లీకి రాజైనా, తల్లికి కొడుకే నన్నట్టు నువ్వు యాడున్నా మన ఊరిని మర్చిపోవద్దు నాయినా!”


“నువ్వు అప్పుడప్పుడు మనూరికొచ్చి పోతుంటె నిన్నుజూసి ఒకరిద్దరు పిల్లలన్న గాటిన బడతారు” వచ్చిన గ్రామస్తులంతా ఊరిమేలును, పక్కవారి అభివృద్ధిని కోరుకుంటూ మాట్లాడారు తప్ప, ఒక్కరు కూడా నాకది చేసిపెట్టాల, నాకిది చేసిపెట్టాల అనలేదు.


వాళ్ళ స్వార్ధరాహిత్యానికి, ఎదుటివారిపట్ల వారికున్న ప్రేమాప్యాయతలకూ చలించిపోయిన యువ కలెక్టర్‌ “ముందు ముందు నా శక్తివంచన లేకుండా ఊరి బాగు కోసం శ్రమిస్తాను” అంటూ ఊరి వారందరికీ మాటిచ్చాడు.


రాత్రి తండ్రి చెప్పిన మాట ప్రకారం పొద్దున్నే నదిని దాటి కార్ల్షమీద బస్తీ కెళ్ళిన రామనర్సయ్య కొడుకులు ముగ్గురూ ఊరిలో వున్న అరవై కుటుంబాలతోపాటు, ఊరికి కొంచం దూరంగా వున్న రెండు దళిత వాడల్లోని నలభై ఇండ్లను కలిపి, మొత్తం వంద ఇండ్లకు వంద చీరలు, వంద పంచలతోపాటు, వంద కిలోల లడ్డూలు కూడా తీసుకొని మధ్యాహ్నం కల్లా ఇంటికి తిరిగొచ్చారు.


జీతగాళ్ళతో కబురుచేసిన వెంటనే ఊరి వాళ్ళతోపాటు దళితవాడలకు చెందినవాళ్ళు కూడా రామనర్సయ్య ఇంటికి కదిలి వచ్చారు.


వచ్చినవాళ్ళందరికీ పేరు పేరున కలెక్టర్‌ మనవడి చేతులమీదుగా గుడ్డలతోపాటు లడ్డూ మిఠాయి లను అందజేయించాడు రామనర్సయ్య.


ఆ ఏటి పట్టెమ్మటి గ్రామాల్లో అప్పటివరకు ఇటువంటి సన్నివేశం కనీ వినీ ఎరుగని గ్రామస్తులంతా ఆనందంతో కదిలిపోతూ యువ కలెక్టర్ని మనసారా అభినందించారు.

అంతా వెళ్ళిపోయిన తరువాత తిరిగి వేపచెట్టుకింద చేరిన రామనర్సయ్య కుటుంబసభ్యులు “టీ తాగసాగారు.


సూర్యుడు మెల్లగా పదమటికొండలకు చేరువగా వెళ్ళసాగాడు.


అడవికి వెళ్ళిన తల్గులకోసం గొల్లవాడలోని మేకపిల్లలు అరుస్తున్న అరుపులు ఊరిని ధ్వనెత్తించసాగాయి.


వేదాద్రిగుడిలో ఎవరో స్వామీజీ చేస్తున్న ప్రవచనం గాలితరంగాలమీద కదలివచ్చి వినూత్నంగా విన్పిస్తుంది.


అటువంటివేళ ఎనభైకిపైన, తొంభైకి దగ్గరగా వున్న భూమికి సమాంతరంగా నడుము వంగిపోయిన, తుంగచాపమాదిరిగా చర్మం ముడుతలుదేరిన, సన్నగా కంపిస్తున్న దేహంతో ఊతకర్రమీద మెలమెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దళితవాడనుండి రామనర్సయ్య ఇంటి ఆవరణలోకి వచ్చింది మార్తా.


ఆవిడను చూస్తూనే రామనర్సయ్య కుటుంబసభ్యులంతా తమ ప్రమేయంలేకుండానే నిశ్శబ్దంగా లేచి నిల్చున్నారు.


మెల్లగా వాళ్ళను సమీపించిన మార్తా “అయ్యో! అయ్యో! నన్ను జూసి మీరంతాలేచి నిలబడుడు మంచిగలేదు. కూసోండి! కూసోండి!” అంటూ తను వేపచెట్టు మొదట్లో వున్న గద్దెమీద కూలబడింది.


మార్తాను చూసిన ఇరుగు-పొరుగు ఇండ్లవాళ్ళు, వాళ్ళనుచూసి మరికొందరు గొలుసుకట్టుగా తెలుసుకుని తిరిగి ఊరంతా రామనర్సయ్య ఇల్లు చేరింది.


రామనర్సయ్య భార్య మార్తా దగ్గరికెళ్ళి “అమ్మా! పొద్దుబోయి ఇంతదూరం ఎందుకొచ్చినవ్‌?” అంటూ మర్యాదగా పలుకరించింది.

“మీ మనవడు కలెక్టరైన సంగతి నాకిప్పుడే తెలిసింది. అందుకే పిల్లగాన్ని పలకరిచ్చిపోదామని వచ్చిన” తనకు ఎడమ పక్కనున్న చేతికర్రను కుడిపక్కన పెట్టుకుంటూ మెల్లగా వివరించింది మార్తా.


ఆవిడమాటలు వింటూనే ఆశ్చర్యచకితుదైన యువకలెక్టర్‌ చప్పున ఆవిడ దగ్గరకెళ్ళి ఆవిడ రెండుభుజాలమీద తన రెండుచేతులూ వేసి దగ్గరికి తీసుకుని అవ్వా! నన్ను పలకరించి పోడానికొచ్చావా!” అన్నాడు.


“ఔను బిడ్డా! నువ్వు కలకాలం సల్లంగుండాల. నీవల్ల మనూరు వృద్ధిలోకి రావాల అంటూ అతని చేతులను మెల్లగా నిమరసాగింది.


అట్లా ఐదునిమిషాలు గడిచిపోయాయి.


ఆలోపల..


ఇంట్లోకెళ్ళిన రామనర్సయ్య భార్య ఓ కొత్తచీర తెచ్చి, మనవడి చేతికిచ్చి “ముసలవ్వకివ్వరా!” అంది మనస్పూర్తిగా.


నాన్నమ్మ చెప్పినట్టే చేశాడు కలెక్టర్‌ సుమంత్‌!


చీరను తడిమి చూసుకుంటూ “నాకూ చీరపెట్టినవా నాయినా!” అంటూ గుండెల నిండుగా సంతోషాన్ని వ్యక్తం చేసింది మార్తా.


ఇంతలో..


ఆవిడను వెతుక్కుంటూ వచ్చిన కొడుకు “మా అమ్మ తలవాకిలిదాటి పక్కింటికి కూడా పోక పదేండ్లవుతుంది. అటువంటిది ఈరోజింతదూరం ఎట్లా నడిచొచ్చిందో అర్ధంకావడంలేదు!”అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశాడు.


“బిడ్డడు ఎన్నేండ్లు ఎంతకష్టపడిచదివితే కలెక్టర్‌ అయ్యిండో? ఆ కష్టం ముందల నాకష్టం ఏపాటిది రా పిచ్చోడా! ఈ మారుమూల పల్లె నుంచి, ఢిల్లీ దాకా బొయ్యి కలెక్టరై బైటికెళ్ళాడంటే మామూలు మాటలు కాదు. మన ఊరోళ్ళందరికి ఎంత గొప్ప?” అంటూ

తన మనసులోని మాటలను నెమ్మదిగా అయినా సూటిగా కొడుకుతో చెప్పుకొచ్చింది మార్తా.


ఆ మాటలు విన్న ఊరివాళ్లంతా ముసలావిడ దిక్కు కొత్తగా చూడసాగారు.


మరి కొంతసేపటి తరువాత “చీకటి పడుతోంది ఇంటికి పోదాంపా అంటూ తల్లి చెయ్యి పట్టుకున్నాడు మార్తా కొడుకు.


“పోదాం ఉండ్రా, అంటూ ఎన్నాళ్ళుగానో చీరకొంగున దాచుకున్న నలిగిపోయిన పాత ఇరవైరూపాయలనోటును

బయటకుతీసి కలెక్టర్‌ చేతికిస్తూ “నాపేరు మీద మంచి పెన్ను కొనుక్కో నాయినా!” ఎంతో ఆత్మీయంగా అంది మార్తా.


ఆవిడ మాటలను విన్న ఊరు విస్తుబోయి చూడసాగింది.


తీసుకోవడమే కాదు, ఇవ్వడమూ తెలిసిన ఆ వృద్దురాలి తీరును తిలకించిన సాయంసంధ్యా సూర్యుడు ఎర్రగా నవ్వుకుంటూ పడమటి కొండల్లోకి జారిపోయాడు.


మార్తా తీరుకు పులకించిపోయిన కృష్ణమ్మ తన గలగలల గాలిపాట ఉధృతిని మరికాస్త పెంచి, ఆనందంతో పరవళ్ళు తొక్కుతూ సాగిపోయింది.


దూరంగా దళితవాడలో ఎవరో తల్లి పాడుతున్న జోలపాట గాలిలో కదిలివచ్చి అక్కడున్న వారి హృదయ కవాటాలను మెత్తగా మీట సాగింది.


మెల్లగా లేచి, కొడుకు చేతిని పట్టుకుని, తూర్పు వాకిట అప్పుడే మొలుస్తున్న పూర్ణచంద్రునికి అభిముఖంగా అడుగులు కదిపింది మార్తా.


వెన్నెల్లో మెలమెల్లగా కదిలిపోతున్న మార్తా దిక్కు చూస్తూ యువ కలెక్టర్‌తోపాటు, అక్కడున్న ఊరు ఊరంతా గౌరవ పురస్కారంగా రెండుచేతులూ జోడిస్తూ పులకరించి పోయింది.

***

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం

శిరంశెట్టి కాంతారావు గారు

పాతపాల్వంచ


384 views19 comments
bottom of page