top of page

పంజరం


'Panjaram' New Telugu Story




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

అది విశ్వవిద్యాలయ ఆర్ట్స్ పీజి కళాశాల. సాయంత్రం నాలుగు గంటలైంది. ఆఖరి పిరీయడ్ పూర్తికావడానికి ఇంకా అరగంట సమయం పడుతుంది ; ప్రసాద్ ఆ ప్రాంగణం పక్కనే ఉన్న మామిడి చెట్టు కింద ఉన్న బెంచీ మీద కూర్చున్నాడు.


అతను అదే విశ్వవిద్యాలయ సైన్స్ పీజీ కళాశాలలో ఎమ్ఎస్సీ ఫైనల్ సంవత్సరం చదువుతున్నాడు. ఆ రోజు అతనికి ఆఖరి పిరియడ్; రీడర్ రాలేదు. అందుకే అతను ఇక్కడికి వచ్చి మధురిమ గురించి ఎదురు చూస్తున్నాడు. మధురిమ ఆఖరి సంవత్సరం ఎమ్ఎ చదువుతునాది. ఇద్దరికీ లైబ్రరీలో పరిచయం అయి అది స్నేహంగా బలపడి రెండు సంవత్సరాల తరువాత ప్రేమగా పరిణామం చెందింది.


ప్రసాద్ రోజూ సాయంత్రం పూట ఆర్ట్స్ కాలేజీకి వచ్చి మధురిమను కలుస్తాడు. ఆ తరువాత వారిద్దరూ బీచ్ దగ్గరికి వెళ్ళి కొద్ది సేపు కబుర్లు చెప్పుకొని మళ్ళీ హాస్టల్ కి వచ్చేస్తారు.


ఇంతలో క్లాసు పూర్తైనట్లు బెల్ వినిపించింది. ఐదు నిమిషాల తరువాత మధురిమ బయటకు వచ్చి ప్రసాద్ ని కలిసింది. ఆ తరువాత ఇద్దరూ బీచ్ వైపు బయల్దేరారు...

సాయంకాలం కావడంతో సముద్రతీరం అంతా కోలాహలంగా ఉంది. ప్రసాద్, మధురిమ జనాలకు దూరంగా ఉన్న సరుగుడు చెట్ల వైపు వెళ్ళి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో కూర్చున్నారు ..


తీరం వెంబడి చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆ గాలికి మధురిమ ముంగురులు ఎగిసి పడుతునాయి. ప్రసాద్ మధురిమనే చూస్తున్నాడు. మధురిమ పెద్ద పెద్ద కళ్ళు, తెల్లటి మేని ఛాయ, పొడవైన జుట్టుతో ముఖం తిప్పుకోలేనంత అందంగా ఉంటుంది. ఆ అందాన్ని చూసీ అతను ఆమెని బాగా ఇష్టపడ్డాడు.


ప్రసాద్ వాళ్ళది విజయనగరం దగ్గర చిన్న పల్లె. అతని తండ్రి రామారావు అక్కడే ఉపాధ్యాయుడు, వ్యవసాయం చేస్తుంటాడు. మధురిమ తండ్రి టాటా సంస్థలో ఎకౌంట్స్ ఆఫీసర్.. ఆమె ఒక్కర్తే కూతురు.


“మీ ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు?" అని అడిగాడు ప్రసాద్...

"మళ్ళీ నెల 5 నుంచి; మీవి?”

“మావి ఎనిమిది నుంచి; పదిహేను తో సరి.;అది సరే తరువాత ఏం చేస్తావు?” అని అడిగాడు ప్రసాద్.


"ఆక్స్ ఫర్డ్ లో పీజీ చదవాలని నా కోరిక. కానీ డాడీకి నన్ను ఇతర దేశం పంపడం సుతరామూ ఇష్టం లేదు... మరోసారి డాడీని అడుగుతాను" అంది మధురిమ దూరంగా ఎగిసి పడుతున్న కెరటాలను చూస్తూ...


సంధ్యా సమయంలో సముద్రం అందంగా కనిపిస్తోంది... పడమర సంజెలోకి సిందూర వర్ణంతో జారిపోతున్న సూర్యుడు, ఎదురుగా ఎగిసిపడుతున్న కెరటాల హెూరు, దూరంగా తెరచాప ఊగిసలాడుతూ ఎగిరెగిరి పడుతున్న పడవ.. అదంతా ఒక వర్ణ చిత్రంలా కనిపిస్తోంది.


కొద్దిసేపు మౌనం తరువాత మధురిమ అతని వైపు తిరిగి “నువ్వేం చేస్తావు” అనీ అడిగింది. "సివిల్స్ రాస్తాను.. దాని కన్నా ముందు మా ఊరు వెళతాను” అన్నాడు నవ్వుతూ...


"మీ ఊళ్ళో టైం పాసవుతుందా?”

“వెళ్ళిన రెండు రోజుల దాకా బావుంటుంది. తరువాత బోర్ కొడుతుంది. అది సరే.. నువ్వు నాతో మా ఊరు రాకూడదూ... పల్లెలంటే నీకిష్టమనీ చెప్పావు కదా? మా అమ్మా నాన్నలకు నిన్ను పరిచయం చేస్తాను... కాబోయే అత్తవారిల్లు ఎలా ఉంటుందో నీకు కూడా తెలుస్తుంది” అన్నాడు నవ్వుతూ...


అతని మాటలకు మధురిమ ఆశ్చర్యపోతూ “ఏంటి మాట్లాడుతునావు... పెళ్ళి గురించి నన్ను అడగక్కర్లేదా?” అంది కోపంగా...

“చాలా రోజుల నుంచి మన పెళ్ళి గురించి నీతో మాట్లాడాలనీ అనుకుంటున్నా ఎలా మాట్లాడాలో తెలియక ఆ ప్రస్తావన తేలేదు .. కానీ చదువు పూర్తొతోంది కాబట్టి ఈ రోజు చెప్పక తప్ప లేదు.. నీ కిష్టమైతే మనం కలిసి జీవితాన్ని కొనసాగిద్దాం.. నేను తొందర పడి ఉంటే ఏమి అనుకోవద్దు. ఇష్టపడ్డ అమ్మాయి తో పెళ్ళి గురించి చెప్పడం నాలాంటి యువకులందరికీ ఓ పెద్ద సమస్య... అయినా చెప్పక తప్పదు” అన్నాడు సముద్రం వైపు చూస్తూ...


అతని మాటలకు ఆమె కొద్దిసేపు మౌనం దాల్చింది...

“పెళ్ళి గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు... ఇప్పుడు ఆకస్మాతుగా పెళ్ళి గురించి చెప్పేసరికి ఏం చెప్పాలో తెలియటం లేదు... అయినా ఇదంత సులభం కాదు.. చాలా పరీక్షలు ఎదుర్కోవాలి; ఇద్దరు ఒకటవాలంటే రెండు కుటుంబాలు ఏకతాటి మీదకు రావాలి. కొత్త వ్యక్తితో కొత్త కుటుంబంలో అడుగుపెట్టి కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే మానసికంగా బాగా సిద్ధపడాలి... పెళ్ళి తరువాత స్వేచ్ఛని కోల్పేతే జీవితం పండదు. నన్ను కొన్ని రోజులు ఆలోచించు కోనివ్వు ... పరీక్షలైన తరువాత నా నిర్ణయం చెబుతాను” అంది మధురిమ..


అప్పటికే గోధూళి వేళ ప్రవేశించింది. చీకటి సముద్రం మీద పరుచుకుంటోంది. కొద్దిసేపు అక్కడే కూర్చొని తరువాత వాళ్ళు హాస్టల్ కి బయలుదేరారు...

హాస్టల్ చేరేదాకా ఇద్దరూ గంభీరంగా, మౌనంగా ఉన్నారు... ఆ తరువాత ఇద్దరూ వీడ్కోలు చెప్పకొని తమ తమ హాస్టల్స్ కి వెళ్ళిపోయారు.

... ... ...

ఇద్దరి పరీక్షలూ ముగిసాయి. ప్రసాద్ మధురిమతో తన ఊరు రమ్మనమనీ చెప్పడంతో ఆమె తన తండ్రికి ఒక పల్లెటూరు వెళుతునాని చెప్పి ట్రైన్లో బయలుదేరింది...

ఒక చిన్న రైల్వే స్టేషన్లో రైలు దిగి అక్కడి నుంచి ఆటో లో ప్రసాద్ ఊరు బలరామపురం బయలుదేరారు.


కొడుకు, అతని వెనకాల ఒక అందమైన అమ్మాయిని చూసిన ప్రసాద్ తల్లితండ్రులకు కొద్దిగా అనుమానం కలిగినా ఇద్దర్నీ అప్యాయంగా పలకరించి ఇంట్లోకి తీసికెళ్ళారు.

మధురిమను తన స్నేహితురాలిగా తల్లితండ్రులకు పరిచయం చేసాడు. ఆ రాత్రి మధురిమ డాబా మీద ఉన్న సమయంలో తాను ఆమెను వివాహం చేసుకోదల్చుకున్నాననీ తండ్రి రమణమూర్తికి చెప్పాడు ప్రసాద్. ఆ మాట విని రమణమూర్తి కొంచెం ఆశ్చర్యపోయాడు... అతనికి ప్రేమ పెళ్ళిళ్ళు అంటే అంత సదభిప్రాయం లేదు.. అదీ కాకుండా పెళ్ళి కాకుండానే ఒక యువకుడితో అతనింటికి వచ్చిన మధురిమ మీద కోపం కలిగింది.. అయినా కొడుకు బాధపడతాడనీ అతను బయటపడలేదు.


ఆ రాత్రి ప్రసాద్ తల్లి జానకి ముందుగా భర్తకూ, కొడుకు ప్రసాదుకి భోజనాలు పెట్టింది. వాళ్ళు తిన్న తరువాత ఆమె, మధురిమ తిన్నారు.

మధురిమకు ఆ పద్ధతి ఆశ్చర్యం కలిగించింది. తమ ఇంట్లో అమ్మ నాన్న, తనూ ముగ్గురూ ఒకేసారి డైనింగ్ టేబుల్ మీద భోజనాలు చెయ్యడం ఆమెకు గుర్తుకొచ్చింది... అదే విషయాన్ని రాత్రి డాబా మీద ప్రసాద్ తో ప్రస్తావించింది మధురిమ.


పల్లెటూళ్ళలో మగవాళ్ళకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తారనీ, స్త్రీలు వాళ్ళ తరువాత తింటారన్న చేదు నిజాన్ని అతని నోటి నుండి విని ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.. ఆ సమయంలో తానెక్కడో చదివిన భర్తృహరి వాక్యం 'నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి ' గుర్తుకొచ్చి వళ్ళంతా గగుర్పాటు కలిగింది. ఇంకా ఇలాంటి పాత కాలపు పద్ధతులున్నాయంటే ఆమెకు ఆశ్చర్యం కలగసాగింది.


ఆ రాత్రి 9 గంటల దాకా తామిద్దరూ మాట్లాడుకుంటుంటే జానకి మీదకు వచ్చి పదమ్మా! రాత్రి 9 అయింది. పద.. పడుకుందాం' అంటూ ఆమెను కిందకు తీసికెళ్ళి పోయింది.. పెళ్ళి కాని యువతీ యువకులు వంటరిగా మాట్లాడుకోరాదనీ ఆమె ఉద్యేశ్యం కాబోలనిపించింది మధురిమకి.


ఆ మర్నాడు ప్రసాద్ మధురిమను పక్క ఊళ్ళో ఉన్న శివాలయానికి తీసికెళదామనీ ఆటోని పిలిపించాడు. కానీ జానకి తాను కూడా వస్తానని చెప్పి వాళ్ళతో గుడికి వెళ్ళడం మధురిమకు కోపం తెప్పించింది... అంటే తామిద్దరూ వంటరిగా వెళ్ళకూడదనే ఆమె తమతో వచ్చిందా అన్న సందేహం ఆమెకు కలిగింది.


ఆ రాత్రి మధురిమ తో కలిసి భోజనం చేస్తున్న సమయంలో జానకి “చూడమ్మా! మీ పెళ్ళి గురించి మీ నాన్నగారు ఇక్కడకొచ్చీ మాతో మాట్లాడితే బాగుంటుంది. అది సంప్రదాయం... ఎంత మీరిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డా పెద్దవాళ్ళు వచ్చి చెబితే మంచిది... ఈ విషయం మీ నాన్నగారికి చెప్పి ఇక్కడికి పంపించు" అనీ చెప్పింది.

మధురిమ ఆమె మాటలు ఆశ్చర్యంతో వింటూ మౌనంగా తల ఊపింది.


ఆ మర్నాడు సాయంత్రం ప్రసాద్, మధురిమ కలిసి వాళ్ళ పోలానికి వెళ్ళారు... మధురిమ పొలాల్లో, నడవటానికి బాగుంటుందనీ జీన్ పేంట్, షర్ట్ వేసుకుంది... కనుచూపు మేర హరిత వర్ణపు పొలాలను చూడగానే మధురిమకు చాలా ఆనందం కలిగింది...


చుట్టూరా పచ్చటి పొలాలు, పైన నీలాకాశం, పొలాల మీద ఎగురుతున్న తెల్ల కొంగలు... మధ్యలో గలగల మనీ ప్రవహిస్తూన్న నీళ్ళు... అక్కడ ప్రకృతి ఆరబోసినట్లుంది వాతావరణం. చీకటి పడేదాకా అక్కడ ఇద్దరూ కబుర్లు చెప్పుకొని ఇంటి కొచ్చారు. ఆమె గది లోపలికెళ్ళి దుస్తులు మార్చుకొని బయటకొస్తూ ఉంటే “ఏంట్రా అమ్మాయి అలాంటి బట్టలు వేసుకుంది. ఇది పల్లెటూరు. మీ నాన్నగారు ఈ ఊరి స్కూల్లో ఉపాధ్యాయుడు. అతని కాబోయే కోడలు జీన్ పేంటూ, షర్టూ వేసుకుంటే ఏం బాగుంటుందిరా.... ఆ అమ్మాయికి చక్కగా పరికిణీ వోణీ వేసుకోమని చెప్పు” అనీ జానకి ప్రసాద్ కి చెబుతున్న మాటలు వినీ మధురిమ స్థాణువై అక్కడ చాలాసేపు నిలబడి పోయింది.. ఆ మాటలు విన్న తరువాత ఆమె చాలాసేపు మనిషి కాలేకపోయింది. అలాగే ఆలోచిస్తూ డాబా ఎక్కింది..


ఆ సమయంలో ఆమెకు తన ఇంట్లో వాతావరణం గుర్తు కొచ్చింది. తన తల్లీ తండ్రి స్వేచ్ఛకు ఎంతో విలువివ్వడం, సంప్రదాయాలకు, కట్టుబాట్లకు దూరంగా ఉండటం గుర్తుకొచ్చి ఆమె కళ్ళు చెమ్మ గిల్లాయి...


వచ్చిన దగ్గర్నుంచీ ఆ ఇంటి వాతావరణం ఆమె గమనిస్తూ ఉంది. టీవిలో వాళ్ళకి కావలసిన కార్యక్రమాలు పెట్టుకోవడం, ఇతరుల గురించి ఆలోచించకపోవడం ఆమెకాశ్చర్యం కలిగించింది.


ఆ రాత్రి ప్రసాదుతో మధురిమ రేపు తాను ఊరు వెళ్ళిపోతాననీ లేకపోతే అమ్మనాన్నలు గాబరా పడతారనీ చెప్పింది... ప్రసాద్ తల్లితండ్రులకు ఆ విషయం చెప్పి మర్నాడు ఉదయం ఆమెను రైల్వే స్టేషను కి తీసికెళ్ళాడు.

... ... ...

వాళ్ళు వెళ్ళే సరికి స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది. అది చిన్న స్టేషన్ కాబట్టి అక్కడ రోజుకి రెండు పాసింజర్లే ఆగుతాయి. మధురిమ అక్కడ ఉన్న చెట్టు కింద బెంచీ మీద కూర్చుంది... ప్రసాద్ టికెట్ కొనడానికి స్టేషన్లోకి వెళ్ళాడు. ఆ సమయంలో పంజరంలో ఉన్న ఆకుపచ్చటి రామచిలకని ఒక స్త్రీ తెచ్చి "అమ్మా ! ఈ చిలక ఖరీదు పంజరంతో కలిపి ఐదువందల రూపాయలు... ఈ చిలక మాట్లాడుతుంది కూడా... మొన్ననే మా తోటలో పట్టాము” అనీ చూపించింది.


మధురిమ ఆమెతో “వద్దులే” అని చెబుతుంటే ప్రసాదు వచ్చి “అరే .. రామచిలుక చాలా బాగుందే.. ఎర్రటి ముక్కు, ఆకుపచ్చటి చిలక, వెరీ నైస్... ఎంతమ్మా ” అనీ ఆమె నడిగాడు.


“ఆమె ఐదొందలు ! ఇది మాట్లాడుతుంది బాబూ. సర్లెండి.. వంద తగ్గించి నాలుగువందలివ్వండి” అంది అతనికి పంజరాన్ని అందిస్తూ.


“మధూ! చిలకని తీసికెళతావా? నీకు బాగా టైమ్ పాస్ అవుతుంది ;నువ్వేలాగూ మీ ఇంట్లో ఒక్కదానివే కదా.. నీకు బాగా ఊసుపోతుంది, తీసికెళ్ళు” అంటూ ఆ అమ్మాయికి నాలుగువందలిచ్చి పంజరాన్ని మధురిమ కిచ్చాడు...


మధురిమ ఆ పంజరాన్ని పట్టుకొని ఆ చిలకని గమనించసాగింది.

“మధూ! ఇది మన పెళ్ళికి ముందు నీకు నేనిచ్చే గిఫ్ట్ ... సరేనా” అన్నాడు నవ్వుతూ. ఇంతలో పాసింజర్ వస్తున్నట్లు బెల్ మోగింది... జనాలందరూ ప్లాటుఫారం మీదకు వెళుతూ కనిపించారు..-


“పద మధూ... రిజర్వుడ్ బోగీ ప్లాటుఫారం చివర్లో ఉంటుందట” అంటూ ఆమె బేగు అందుకున్నాడు.


ఇంతలో మధురిమ ఆ పంజరం తలుపు తీసి చెయ్యి లోపలికి పెట్టి ఆ చిలకను బయటకు తీసి గాల్లోకి వదిలేసింది. ఆ చిలుక ముందు మెల్లగా ఎగిరినా ఆ తరువాత రెక్కలు కొట్టుకుంటూ చాలా ఆనందంతో ఎదురుగా ఉన్న చెట్టు మీదకు ఎగిరి అదృశ్యమైపోయింది; ఆమె చేసిన పనికి ప్రసాద్ ఆశ్చర్యపోతూ ఆమె వైపు అదోలా చూసాడు.

మధురిమ అదేమీ పట్టించుకోకుండా తన బేగుని తీసుకొని వడివడిగా ప్లాటుఫారం మీదకు నడిచింది. ఇంతలో హారన్ కొట్టుకుంటూ రైలు రావడం, అది ఆగగానే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి బోగీలోకి ఎక్కడం క్షణంలో జరిగిపోయాయి.


మధురిమ చేస్తున్న పని అర్ధం కాక ప్రసాద్ ఆమె వేపే ఆశ్చర్యంగా చూస్తూ చేతులు గాల్లో ఆడిస్తూ వీడ్కోలు పలికేడు. అలా ట్రైయిన్ కనుమరుగయ్యేదాకా దాని వైపే చూస్తూ అన్యమనస్కంగా ఇంటికి బయలుదేరాడు ప్రసాద్.


వారం తరువాత తాను త్వరలో పీజీ చదవడం కోసం ఆక్స్ ఫర్డ్ వెళుతున్నాననీ, తనకిప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం లేదనీ, తన కోసం ఎదురు చూడకుండా పెళ్ళి చేసుకోవాలనీ ప్రసాదు ని కోరుతూ మెసేజ్ పెట్టింది మధురిమ.

(సమాప్తం)

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link


Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.


73 views0 comments
bottom of page