top of page
Original.png

పారిజాతం పూలు

#అనిసాతబస్సుమ్, #AnisaTabassum, #పారిజాతంపూలు, #ParijathamPulu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Parijatham Pulu - New Telugu Story Written By Anisa Tabassum Sk

Published in manatelugukathalu.com on 21/02/2026

పారిజాతం పూలు - తెలుగు కథ

రచన: అనిసా తబస్సుమ్ SK


రాజమండ్రి పక్కనే ఉన్న ఒక గ్రామంలో జరిగిన ఒక మంచి ప్రేమ కథే ఈ "పారిజాతం పూలు" అనే కథ.


అప్పుడే మంచుతెరలు తొలుగుతూ సూర్యోదయం అవుతున్న వేళ. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలిలో మమేకమైన పారిజాతం పూల పరిమళం మనసుకు ఆనందాన్నిస్తుంది. రాఘవయ్య వీధిలో ఉన్న పెద్ద చెట్టే ఆ పారిజాతం చెట్టు. ఆ వీధికి అదే అందం. తెల్లవారుజామునే అందమైన పడుచు అమ్మాయిల నుంచి పిల్లల వరకు... రాలి పడిన ఆ పారిజాతం పూల కోసం వస్తారు.


ఆ పడుచు అమ్మాయిలలోనే ఒక అందమైన అమ్మాయి 'రాధ'. ఆ ఊరిలో రంగయ్య, లక్ష్మమ్మల కూతురే రాధ.


ఆచారాలు, కట్టుబాట్లకు గౌరవం ఇచ్చే కుటుంబం.


రంగయ్య ఆవేశపరుడే అయినా మంచి మనసున్నవాడు, లక్ష్మమ్మకు ఇల్లే సర్వస్వం. కనకమ్మ (రాధ నానమ్మ), కనకమ్మకు రాధ అంటే అమితమైన ఇష్టం. రాధతో చాలా చనువుగా, సరదాగా ఉంటుంది.


రాధ...., రాధా... అంటూ అరుస్తూ రాధ గదిలోకి వచ్చిన లక్ష్మమ్మ అక్కడ రాధ లేకపోవడం చూసి, "ఈ పిల్లకి తెల్లవారడమే ఆలస్యం, స్నేహితులతో కలిసి ఆ చెట్టు దగ్గరికి పరిగెత్తడం... ఇదే పని. అంతే కానీ కొంచెం ముగ్గు వేద్దాం, ఇంటి పనుల్లో సహాయం చేద్దాం అని ఉండదు" అంటూ గొణుగుతుంటే కనకమ్మ కలుగజేసుకుంటూ "ఏమిటే నా మనవరాలిని అంటున్నావు, అది పనులు చేస్తే ఇంకా నువ్వు ఎందుకుంటా" అంటూ దీర్ఘాలు తీసింది. "ఆ... ఒక్క మాట పడనివ్వరుగా, మీరు కాదు గారాబంతో దాన్ని చెడగొట్టింది" అంటూ వంటింట్లోకి వెళ్ళింది లక్ష్మమ్మ.


పచ్చటి పరికిణీలో, కాళ్లకు... సవ్వడి చేసే మువ్వల పట్టీలతో, పారిజాతం చెట్టు దగ్గరికి వెళ్లిన రాధ, రాలి కింద పడి ఉన్న పూలల్లో నుంచి ఒక పారిజాతం పువ్వును తీసి, ఎర్రగా పండిన గోరింటాకు చేతులతో సుకుమారంగా... తన చేతి వేళ్ళతో బోసిగా ఉన్న తన వాలు జడలో అలంకరించింది.


తన స్నేహితులతో కలిసి పూలు పోగుచేస్తున్న రాధను... అటుగా వెళ్తున్న కృష్ణ కుమార్ ఆగి మరీ రాధనే చూస్తుండిపోయాడు. కదులుతున్న బాపు బొమ్మలా ఉన్న రాధ అతనికి చూడగానే నచ్చింది.


కృష్ణ కుమార్ పైచదువుల కోసం పొరుగూరికి వెళ్లి ఉంటాడు. కళాశాలకు సెలవులు ఇవ్వడంతో తన సొంతూరికి వచ్చాడు. అలా రాధనే చూస్తున్న కృష్ణ దగ్గరికి తన చిన్ననాటి స్నేహితుడు వచ్చి పలకరించడంతో ఈ లోకంలోకి వచ్చి తనతో మాటల్లో పడతాడు. తరువాత చెట్టు వైపు చూసిన కృష్ణకి అక్కడ ఎవరూ కనిపించరు.


ఇంటికి పూలు తీసుకొచ్చిన రాధ, చక్కటి పారిజాతం పూలమాల కట్టి... జడలో పెట్టుకొని. ఒక చేతిలో రెండు, మూడు పుస్తకాలు... వాటి పైన స్టీల్ లంచ్బాక్స్ పట్టుకొని, ఇంకో చేత్తో జామకాయ తింటూ... తన స్నేహితురాలు కమలతో కలిసి కళాశాలకు వెళ్తుంది.


సాయంత్రం కళాశాల నుంచి తన చెల్లిని తీసుకురావడానికి వెళ్లిన కృష్ణకి, తన స్నేహితులతో కలిసి సరదాగా నవ్వుకుంటూ వెళ్తున్న రాధ కనిపిస్తుంది. కృష్ణ తన చెల్లి సుబ్బలక్ష్మిని రాధ గురించి అడిగితే, "తను...! తానొక పారిజాతం పూల పిచ్చిది అన్నయ్యా కానీ మంచి పిల్లనే" అంటూ రాధ గురించి చెప్పుకొస్తుంది.


మరుసటి రోజు పొద్దున్నే, చెట్టు దగ్గరికి వెళ్లిన రాధ, తన తోటి వారు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ముత్యాలలా రాలి పడి ఉండే పారిజాతం పూలు ఒక్కటి కూడా కనిపించట్లేదు, ఒక్కటి కూడా ఉంచకుండా ఎవరు తీసుకెళ్లారో అంటూ తిట్టుకుంటూ నిరాశగా వెళ్ళింది. ఆ బోసి జడతోనే కళాశాలకు వెళ్లిన రాధకు, ఒక అమ్మాయి అరటి ఆకుతో చుట్టిన పొట్లం ఇచ్చి "మీకు ఒక అన్న ఇవ్వమన్నాడు" అని చెప్పి వెళ్లి పోతుంది. ఆ పొట్లం పై 'రాధ గారి కోసం' అని రాసి ఉంటుంది. తెరిచి చూసిన రాధ ముఖం ఆశ్చర్యంతో, ఆనందంతో వెలిగిపోతుంది. ఎందుకంటే ఎవరో చక్కటి పారిజాతం పూల మాలను పంపారు. వెంటనే ఆ మాలను తీసి జడలో పెట్టుకొని. అది పంపింది ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది.... కానీ ఫలితం లేకుండా పోతుంది. "ఎవరు పంపారో కానీ మహానుభావుడు మంచిపనే చేసాడు" అనుకుంటుంది మనసులో.


మరుసటి రోజు కూడా అదే పరిస్థితి. చెట్టు దగ్గర పువ్వులు లేకపోవడం చూసిన రాధ, తన తోటి వారు... "ఇదెక్కడి విచిత్రమో 'మనూర్లో ఎవరో పూల దొంగ పడ్డట్టున్నాడే" అని అంది ఒక అమ్మాయి. 


"ఎక్కడన్నా బంగారమో, డబ్బో దొంగిలించే దొంగల్ని చూసాం కానీ ఈ పూల దొంగ ఏంటే బాబు" అంటూ ఇంకో అమ్మాయి వంతపాడింది. 


ఇక చేసేదేంలేక ఇళ్ళకి వెళ్లారు అందరూ. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న కృష్ణ చిన్నపాటి చిరునవ్వుతో తన చేతుల్లో ఉన్న పూల మూటను చూస్తాడు.


వట్టి చేతుల్తో వచ్చిన రాధను చూసి "ఏంటే ఖాళీ చేతుల్తో వచ్చావ్ పూలేవి??" అంది లక్ష్మమ్మ. 


"ఆహ్ ....పూల దొంగ పడ్డాడ్లే" అంటూ తన గదిలోకి వెళ్ళింది.


"ఆ పుణ్యాత్ముడు ఎవరో మంచిపని చేసాడు" అంటూ రంగయ్యకు కాఫీ కలిపి ఇచ్చింది లక్ష్మమ్మ.


రాధ క్లాస్రూమ్ లో ఉన్నా తన బుర్రలో మాత్రం ఏవేవో ఆలోచనలు మెదులుతున్నాయి. అసలు నిన్న పూలు పంపింది ఎవరు? ఈ రోజు కూడా పంపుతాడా? లేక నిన్న తెలిసిన వారు ఎవరన్నా ఆటపట్టిస్తున్నారా? ఒకవేళ పంపితే నాకు మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు పంపాలో? అంటూ ఆలోచిస్తుంది. క్లాసులన్నీ పూర్తయి ఇళ్లకు వెళ్లే సమయమైంది. అప్పటిదాకా పూల కోసం వేచి చూసి రాధ "నిన్న ఎవరో సరదాగా పంపి ఉంటార్లే" అనుకొని... స్నేహితులతో కలిసి ఇంటి దారి పట్టింది. 


అలా నడుస్తూ ఒక చెట్టు వద్దకు రాగా, అకస్మాత్తుగా రాధా మీద పారిజాతం పూల వాన కురిసింది. అలా కురవడమే ఆలస్యం రాధ ఆనందానికి అవధులు లేవు. తన చేతిలో పుస్తకాలు కమలకిచ్చి (రాధ స్నేహితురాలు) ఆనందంతో వికసించిన ముద్దమందారం లాంటి ముఖంతో, పసిపాప లాంటి అందమైన నవ్వుతో తన మీద కురుస్తున్న ఆ పారిజాత పూల వానలో తడిసి పరవసించిపోయింది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న కృష్ణ, రాధ ముఖంలో ఆనందం, అమాయకత్వం చూస్తూ సంతోషంతో మురిసిపోయాడు. 


రాధ తన స్నేహితులతో కలిసి ఆ పూలు వేసిన ఇద్దరు కుర్రాళ్ళని జరిగిన దాని గురించి ప్రశ్నించింది. 


"ఒక అన్న ఇలా చేస్తే చెరో రెండు రూపాయలు ఇస్తానన్నాడక్క" అంటారు ఇద్దరు. 


"ఎవర్రా మీకు డబ్బులు ఇస్తాడన్న అన్న" అని అడిగితే "... ఏమో అక్క మాకు తెలీదు, తన పేరు కూడా చెప్పలేదు" అంటారు.


రాత్రి పెరట్లో మల్లె పందిరి కింద మడత మంచం పై పడుకొని చందమామకేసి చూస్తూ.... "అసలు ఎవరు మీరు, ప్రత్యేకంగా నాతోనే నాకు ఇష్టమైన పూలతో మెప్పించేటంతటి వీరుడా మీరు!! ఇంకా ఎన్ని రోజులో ఈ దాగుడుమూతలు నేను చూస్తా" అని మనసులో అనుకుంటూ సిగ్గుపడిపోతుంది రాధ. 


పక్క మంచం మీద కూర్చొని తాంబూలం చుట్టుకుంటున్న కనకమ్మ.... సిగ్గుతో ఎర్రగా కందిన రాధ ముఖం కేసి చూస్తూ "ఎవరే ఆ కుర్రాడు" అని అంది. 


దిగ్గున లేచి కూర్చున్న రాధ "ఎవరా... కుర్రాడు" అని తిరిగి ప్రశ్నిస్తుంది. 


"నా దగ్గర వద్దు నీ నాటకాలు!! ఎప్పుడు లేనిదీ చందమామకేసి చూస్తూ వెర్రి నవ్వులు నవ్వుతుంటేనే అర్ధమైందిలేవే... ఎవరో చెప్పు" అంటూ కొంటెగా అడుగుతుంది రాధ నానమ్మ. 


సిగ్గు పడుతూ లేచి తన నానమ్మ పక్కన కూర్చొని తనను రెండు చేతులతో చుట్టుకుంటూ... "నిజంగా అతను ఎవరో నాకు తెలీదే కనకం" అంటూ జరిగింది చెప్పి. "నా మీద పూలు పడుతున్నప్పుడు ఆ ముచ్చు మొఖం గిరిజాని చూడాలి అసూయతో మాడిపోయింది అనుకో" అనుకుంటూ నవ్వుకుంది. 


"ఇలాంటి దొంగాటాలు మా కాలంలో లేవమ్మా" అంటూ కొన్ని ముచ్చట్లు చెప్పుకొని పడుకున్నారు.


అటు కృష్ణ కుమార్ పరిస్థితి కూడా ఇంతే. కళ్ళు మూస్తే రాధ, కళ్ళు తెరిస్తే రాధ... అంతలా రాధ ప్రేమలో మునిగాడు. సావిట్లో నవారు మంచంపై పడుకొని జాబిల్లి వంక చూస్తూ.... "చందమామ సైతం చూసి అసూయ పడే అందం నీది, తామరాకు మీద నీటి బిందువు లాంటి స్వచ్ఛమైన మనసు నీది, కలువ రేఖలాంటి కనుల మధ్య నీటి బిందువు లాంటి ఎర్రటి బొట్టు, మహాలక్ష్మి లాంటి కళ గల ముఖం రాధ నీది!! నేన్ ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో, ఈ జన్మలో నువ్వు నా కంట పడ్డావ్!! ఆ రాధాకృష్ణులుగా మనం ఎప్పుడు కలిసి ఉంటామో" అనుకుంటూ రాధ ధ్యానంలోనే నిద్రపోయాడు.


కొన్ని రోజులకు కృష్ణ, రాధకి ఒక ఉత్తరం రాసి పంపిస్తాడు. రాధ ఆ ఉత్తరం అందుకొని తెరిచి చూస్తే ఇలా ఉంటుంది "ప్రియమైన రాధ గారికి రాయునది.. నా పేరు కృష్ణ కుమార్, నేను పొరుగూరిలో ఉన్నత చదువుల్లో ఉన్నాను. సెలవుల కోసం ఊరికి వచ్చిన రోజు... ఇంటికి వెళ్లే దారిలో మిమ్మల్ని చూశాను. 


"ఆ మంచుతెరల్లో, పచ్చటి పరికిణీలో, త్రాచుపాము లాంటి వాలు జడతో అపురూపమైన బాపు బొమ్మలా దర్శనం ఇచ్చారు. మీలానే స్వచ్ఛమైనది మీ మనసు. మీరు నాకు నచ్చారు రాధ గారు, మిమల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మీరు నా జీవితంలోకి వస్తే అంతకన్నా అదృష్టం నాకు మరేది లేదు. 


మీకు ఇష్టమే అయితే సాయంత్రం కళాశాల వెనకున్న చెరువు దగ్గరకు రండి. ఒకవేళ మీరు రాకపోతే మీకు ఇష్టం లేదు అని భావించి మరెప్పుడు మిమల్ని ఇబ్బంది పెట్టాను. మీ రాకకై ఎదురు చూస్తుంటాను. ఇట్లు ఇంకా మీకు ఏమి కాని కృష్ణ" అని ఉంటుంది. 


ఆ ఉత్తరం చదివిన రాధ ముఖంలో భయం, ఆందోళన, నిస్సహాయత కనిపిస్తున్నాయి. సాయంత్రం కళాశాల పూర్తయ్యాక, తన కోసమే ఎదురు చూస్తున్న కృష్ణ దగ్గరకు వెళ్ళింది. "మీరెందుకలా చేసారు" అని అడిగింది. 


ఆ స్వరం వినడంతో వెనక్కి తిరిగి... రాధను మొదటిసారి దగ్గర్నుంచి చూసిన కృష్ణ, ఆమె అందానికి ముగ్ధుడై అలానే ఉండిపోయాడు. "మిమ్మల్నే" అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన కృష్ణ, సందేహంగా.. "నేనా! నేనేం చేశాను" అని బదులిచ్చాడు. 


"ఎం చేసారా? ఎం చేయలేదు మీరు?? పూలతో ఆ దాగుడుమూతలు, పిచ్చి రాతలు, ఏంటి" అని అడిగింది.


"చూడండి రాధ గారు మీరంటే నాకు ఇష్టం. అందుకు మీకు అభ్యంతరం లేకపోతే రాధాకృష్ణులుగా ఏకమౌదాం" అని రాధ వైపు సూటిగా చూస్తూ అన్నాడు. 


అందుకు రాధ ముఖంలో ఆందోళన దర్శనమిచ్చింది. "మీరు దేని గురించి భయపడుతున్నారో నేను అర్ధం చేసుకోగలను. నేను మీకు ఎలాంటి ఇబ్బంది కలుగనివ్వను, నా ఇంటి మహాలక్ష్మిగా, నా సహధర్మచారిణిలా మిమల్ని గౌరవిస్తాను. నా కడదాకా మీ తోడుగా ఉండడానికి సిద్ధమయ్యే మీకు ఇది చెబుతున్నా. నన్ను నమ్మండి రాధ గారు" అంటూ ఒక రాజు తన సర్వస్వాన్ని తన రాణి కాళ్ళ దగ్గర పెట్టినట్టు... తలవంచి ప్రేమగా ఆమె పాదాలను తాకుతాడు. 


ఆ మాటలకు ఆనందంతో రాధ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, మరేమి మాట్లాడలేకపోతుంది. అక్కడ్నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతున్న రాధతో, "రాధ గారు ఆగండి, ఏమన్నా తప్పుగా మాట్లాడి మిమల్ని బాధ పెట్టి ఉంటె నన్ను క్షమించండి రాధ గారు.." అంటూ కేకలేస్తున్న కృష్ణ వైపు వెనక్కి తిరిగి చూసి పొద్దున్న కృష్ణ ఉత్తరంతో పాటు పంపిన ఎర్ర గులాబీ తీస్కొని తన జడలో పెట్టుకుంటుంది. కృష్ణ అంటే రాధకు ఇష్టం ఉన్నట్లుగా. అది చూసిన కృష్ణకు ఆనందం కట్టలు తెంచుకుంటుంది. ప్రపంచంలో ఎవరూ సాధించనిది ఇతనే సాధించినట్లు పొంగిపోయాడు.


అలా ఇంటికి వెళ్లిన రాధ తన గది తలుపులు మూసి కృష్ణ రాసిన ఉత్తరాన్ని తన చేతుల్లోకి తీస్కొని ముద్దాడింది. కృష్ణ మాట్లాడిన మాటలను తలుచుకుంటూ సిగ్గుపడిపోతుంది. ఇంతలో "ఏవిటే ఓ తెగ సిగ్గుపడిపోతున్నావ్, ఏమిటి కథ" అంటూ స్వరం వినిపిస్తుంది. 


ఆ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడి తిరిగి చూస్తే... మంచానికి పక్కగా కనకమ్మ నుంచుని ఉంది. "ఒసేయ్ కనకం నువ్వేంటి ఇక్కడ, ఎప్పుడొచ్చావు" అని అంది రాధ.


"ఎప్పుడు రావడం ఏంటి, నేను ఈ గదిలోనే ఉన్నా. నువ్వే సరాసరి వచ్చి గడియ పెట్టి పిచ్చిదానిలా నవ్వుకుంటున్నావ్" అంది కనకమ్మ. 


రాధ తన నానమ్మతో జరిగిందంతా చెప్పింది. "ఆహా... ధైర్యం ఎక్కువేనేవ్. అబ్బాయి ఎలా ఉంటాడు! ఒడ్డు-పొడుగు బాగుంటాడా?" అని అడిగింది కనకమ్మ. 


"ఓ... అందగాడేనే. చూపు తిప్పుకోలేరు ఆడవాళ్ళు... అంత అందంగా ఉంటాడంటే నమ్ము... కాకపోతే ఎలాంటి వాడో చూడాలి" అంటూ పందిరి మంచం పై వాలిపోయింది రాధ.


అలా రాధాకృష్ణుల ప్రేమాయణం మొదలవుతుంది. ఆ ప్రయాణంలోనే ఒకరి అభిప్రాయాలు మరొకరు అర్ధం చేసుకోవడాలు, ఇరువురి ఇష్టాలను గౌరవించుకోడాలు జరిగిపోతాయి. రాధకి కృష్ణ స్వభావం, ఆడవారి పట్ల తనకు ఉన్న గౌరవం ఎంతగానో నచ్చుతాయి.


ఇది ఇలా ఉండగా, కృష్ణ సెలవులు ముగిసి తిరుగు ప్రయాణం చేసే రోజు రానే వచ్చింది. రాధకి కృష్ణ తనను విడిచి వెళ్లడం ఇష్టం లేదు. కృష్ణని హత్తుకొని చాలా బాధపడుతుంది రాధ. 


"నువ్వలా బాధపడిపోతే ఎలా రాధ, నిన్ను వదిలి నీకు దూరంగా వెళ్లడం అంటే నా మనసుకి కష్టమే. ఇంకొక్క ఏడాదే కదా, అయిపోగానే నేను ఉద్యోగంలో చేరి నిన్ను పెళ్లి చేసుకోవడమే కదా. చదువు పూర్తవకపోతే నిన్ను ఎలా పోషించగలను రాధ. మనం దూరంగా ఉన్నా మన మనసులు ఒక్కటే కదా, మనం ఉత్తరాలలో మాట్లాడుకుందాం. సంవత్సరం ఇట్టే గడిచిపోతుంది నన్ను నమ్ము" అని ధైర్యమిస్తాడు కృష్ణ. 


"మీదేం పోయింది" అన్నట్టు మౌనంగా ఉండిపోతుంది రాధ.


మరుసటి రోజు తెల్లవారుజామునే పారిజాతం చెట్టు వద్ద ఎదురు చూస్తున్న కృష్ణ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి అతన్ని హత్తుకుంటుంది. కృష్ణ చేతులు పట్టుకొని అతని కళ్ళలోకి చూస్తూ... "నా కోసం త్వరగా వచ్చేస్తారు కదూ..." అంటుంది కన్నీళ్లను ఆపుకుంటూ.


"వచ్చేస్తాను రాధ" అంటూ తాను తెచ్చిన పారిజాతం పూల మాలను రాధ జడలో అలంకరించి, "సరే మరి వెళ్ళొస్తాను" అంటూ రాధ నుదుటి మీద ముద్దు పెట్టి... రాధ కేసి చూస్తూ "నువ్వు జాగ్రత్త, వెళ్ళగానే ఉత్తరం రాస్తాను" అని చెప్పి బయలుదేరుతాడు. కృష్ణ వెళ్తుంటే పారిజాతం చెట్టు కింద ఒంటరిగా నుంచున్న రాధ అంతే చూస్తుండిపోతుంది.


కృష్ణ వెళ్లిన మూడు రోజులకు కృష్ణ నుంచి ఉత్తరం వస్తుంది.


"ప్రియమైన రాధకి, నేను క్షేమంగానే చేరాను, నా గురించి చింతించకు. ప్రత్యేక్షంగా నా కళ్ల ఎదుట లేకపోయినా నువ్వు ఎప్పుడు నా హృదయంలోనే ఉంటావు.." అంటూ రాసిన ఉత్తరం పూర్తిగా చదివి, ఆ ఉత్తరాన్ని ముద్దు పెట్టుకొని, కృష్ణ కోసం ఉత్తరం రాయడం మొదలుపెడుతుంది. ఇలా రాధాకృష్ణుల ప్రేమాయణం మూడు నెలల పాటు ఉత్తరాలతో నడిచింది.


ఒక రోజు రాధ తన కళాశాలకు వెళ్లే ముందు... పందిరి మంచం పై పడుకొని సిగ్గు పడుతూ, ఆనంద పడుతూ కృష్ణ రాసిన ఉత్తరం చదువుతుంది. ఇంతలో రాధ తల్లి కేక వేయడంతో ఉత్తరాన్ని మడిచి పరుపు కింద పెట్టి హడావిడిగా జడలో పూలు పెట్టుకొని వెళ్తుంది. 


అప్పటికి ఇదంతా పెరట్లో నుంచుని కిటికీలోనుంచి రాధను చూసిన రాధ తండ్రి, రాధ ప్రవర్తనకు అనుమాన పడతాడు. రాధకి ఇంతవరకు ఎవరు ఉత్తరాలు రాయలేదే... ఒకవేళ రాసినా అంత సిగ్గు పడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది?? అని సందేహిస్తూ తొందర తొందరగా రాధ గదిలోకి వెళ్లి పరుపు కింద ఉన్న ఉత్తరం తీసుకుంటాడు రంగయ్య. 


ఆ ఉత్తరం చదివిన రంగయ్యకి కోపం ముంచుకొస్తుంది. కోపంతో ఆ ఉత్తరాన్ని చింపిడేస్తాడు. కళాశాలకు వెళ్లిన రాధ, కృష్ణకు జవాబు ఉత్తరం రాసి పోస్ట్ చేసి, సాయంత్రం ఇంటికి వస్తుంది.


ఇంట్లోకి వచ్చి చూసిన రాధకు తన అన్న, నాన్న ఎప్పుడూ లేనంత కోపంగా కూర్చొని ఉంటారు. పాపం లక్ష్మమ్మ వంటింటి గుమ్మానికి ఆనుకొని బోరున ఏడుస్తుంది. రాధ కేసి దీనంగా-భయంగా చూస్తుంది కనకమ్మ.


మూడు నెలలు గడిచినా రాధ నుంచి ఒక్క ఉత్తరం ముక్క లేకపోయేసరికి, రాధకేమైనా అయ్యిందేమోనన్న భయంతో ఊరికి బయలుదేరాడు కృష్ణ.


ఊరు చేరుకున్న కృష్ణ మరుసటి రోజు కళాశాలకెళ్లి రాధ కోసం ఎదురు చూశాడు, కానీ రాధ ఎక్కడా కనిపించలేదు. మరుసటి రోజు తెల్లవారుజామునే పారిజాతం చెట్టు వద్ద రాధ కోసం ఎదురు చూస్తున్న కృష్ణకు తన మిత్రుడి ద్వారా గుండెలు పగిలే నిజం తెలిసింది. రాధకి రెండు నెలల క్రితమే పెళ్ళైపోయిందంట. మంచి సంబంధం వచ్చిందని రాధ తల్లితండ్రులు వెంటనే పెళ్లి చేసారంట అని చెప్పాడు వచ్చిన మిత్రుడు.


ఆ వార్త విన్న కృష్ణకు భూమి కంపించినంత పనైంది. నిస్సత్తువగా నుంచున్న కృష్ణకు మువ్వల సవ్వడి వినిపించడంతో తలెత్తి చూస్తాడు... వచ్చింది మరెవరో కాదు రాధ... తాను మనసారా ప్రేమించిన రాధ. మెడలో పసుపు తాడుతో, ఏదో చెప్పుకొని దుఃఖంలో ఉన్న ముఖంతో, బలవంతంగా ఆపుకుంటున్న కన్నీళ్లతో ఉంది. 


తాను ఇదివరకు చూసినట్లు లేదు. ముఖాన ఆ అందమైన నవ్వు లేదు, ఆ కళ లేదు... ధారలుగా కారుతున్న కన్నీళ్లతో అలానే చూస్తుండిపోయాడు కృష్ణ. బలవంతంగా వారి జీవితాలను ఎవరో లాగేసుకున్నట్టు నుంచుని ఉన్న రాధాకృష్ణులను చూస్తుంది ఆ పారిజాతం చెట్టు. బలంగా వీచిన గాలికి రాలి పడిన పారిజాతం పూలు ఎగిరిపోయాయి.


కథ సమాప్తం


— అనిసా తబస్సుమ్ SK (Anisa Tabassum SK)


అనిసా తబస్సుమ్ SK  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



కథ సమాప్తం


అనిసా తబస్సుమ్ SK


3 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
life_explorer
life_explorer
9 hours ago
Rated 5 out of 5 stars.

Good story👍

Like
Shaik Anu
Shaik Anu
an hour ago
Replying to

Thank you😊

Like

Shaik Anu
Shaik Anu
11 hours ago
Rated 5 out of 5 stars.

❤❤

Like
bottom of page