పరిష్కారం
- T. V. L. Gayathri

- Jun 12
- 4 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #Parishkaram, #పరిష్కారం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Parishkaram - New Telugu Story Written By - T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 12/06/2025
పరిష్కారం - తెలుగు కథ
రచన: T. V. L. గాయత్రి
బెల్లు మోగింది. తలుపు తీసింది నర్మద.
వాచ్మాన్.
"ఏమిటి?" అడిగింది నర్మద.
"నీళ్లు పట్టి పెట్టుకోండి మేడం! రేపు నీళ్లు రావు. జూలై దాకా రోజు మార్చి రోజు నీళ్లు వదులుతున్నాము!" చెప్పాడు వాచ్మెన్.
"సరే!" అంది నీరసంగా నర్మద.
పూనాలోని మధ్య తరగతి వాళ్ళు ఉండే కాలనీ అది. కాలనీలో బోర్లు అడుగంటి పోయాయి. ట్యాంకర్ల నీళ్ళే శరణ్యం.
టబ్బుల్లో నీళ్లు పట్టిపెట్టుకుంది నర్మద. పిల్లలు కాలేజీకి, భర్త ఆఫీసుకు వెళతారు. పగలంతా పరవాలేదు. ఎండాకాలం సాయంత్రం స్నానం చేయాలన్నా చెయ్యలేని పరిస్థితి. పోయినసారి ఇంత దారుణం లేదు. పూనాలో కూడా నీళ్ల కటకట ప్రారంభమైంది. బెంగళూరు, జైపూర్, హైదరాబాద్ లాంటి నగరాల్లో నీటి కష్ఠాల కథలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఆ జాబితాలో పూనా కూడా చేరుతోంది.
"నీటి సమస్యకు పరిష్కారం ఏమీ లేదా?” రాత్రి భర్త మహేషుని అడిగింది నర్మద.
మహేష్ ఆడిటర్.
"భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. కాంక్రీటు భవనాలు ఎక్కువ అవుతున్నాయి. అంతటా రోడ్లు, భవనాలు.. ఎక్కడ మట్టి కనిపిస్తోంది? వాననీరు భూమిలోకి ఇంకిపోయే దారి లేదు. దాంతో వర్షాకాలం రోడ్లన్నీ నిండిపోతాయి. అప్పుడు వరద వస్తుంది. దాదాపుగా అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి. వాన నీటిని పట్టుకొని భూమిలోకి మళ్ళించాలి! అప్పుడే నీటి ఎద్దడి తగ్గుతుంది. అలా చేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రజలకు ఆసక్తి లేదు. కాస్త దూర దృష్టితో ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది" వివరించాడు మహేష్.
ఆ రాత్రంతా నర్మద ఆలోచిస్తూనే ఉంది. రెండో రోజు గవర్నమెంట్ వాటర్ వర్క్స్ వాళ్ళకి ఫోన్ చేసింది. ఆఫీసర్ గణనాథ్.
"మీరు మా ఆఫీసుకు వస్తే పూర్తిగా వివరిస్తాను!" అన్నాడతడు.
పిల్లలు భర్త వెళ్ళాక పదకొండింటికి ఆఫీసుకు వెళ్లింది నర్మద.
ఆఫీసరు పేరు గణనాథ్. సమస్యను విన్నాడు.
"మీ కాలనీలో ఇంకుడు గుంతలు ఎక్కువగా ఏర్పాటు చేసుకోవాలి! మేడల మీద ఉన్న పైపులైన్లను ఆ ఇంకుడు గుంతలకు అనుసంధానం చేసుకోవాలి! అప్పుడు వాననీళ్లు ఆ ఇంకుడు గుంతల్లోకి వెళతాయి. అది ఒక పరిష్కారం.
ఇంజక్షన్ బోర్లు వేసుకోవాలి! అంటే బోర్ల చుట్టూ కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. లోపల నూటయాభై మీటర్ల వరకు వాటర్ ఉంటుంది. ఒక్క చుక్క నీటిని వృధా పోనీయకూడదు! ఇక వాన నీరును పట్టి వాటిని ట్యాంకుల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి! ఇవి ఎంత కాలమైనా పాడవవు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కాలనీలో రెండు మూడు ఏళ్లకు నీటి ఎద్దడి తగ్గుతుంది!" వివరంగా చెప్పాడు గణనాథ్.
గణనాథ్ చెప్పింది శ్రద్ధగా విన్నది నర్మద.
కాలనీలో ఉండే మెయింటనెన్స్ ఆఫీసరు శైలేంద్ర భట్నాగరుకు ఫోన్ చేసి తను వాటర్ వర్క్స్ ఆఫీసుకు వెళ్లి తెలుసుకున్న విషయం చెప్పింది.
నర్మద చెప్పింది విని నిరుత్సాహంగా మొహం పెట్టాడు శైలేంద్ర భట్నాగర్.
"ఇప్పుడు వీటికి చాలా ఖర్చు అవుతుంది మేడం! నిజంగా ఫలితం వస్తుందో రాదో తెలీదు.. దీనికి ఖర్చు పెడదామంటే అందరూ ఏమనుకుంటారో? "
సందేహం వెలిబుచ్చాడు భట్నాగర్.
"మనము వెనకడుగు వేస్తుంటే మనకే నష్టం కలుగుతుంది. నిజానికి పూనా కార్పొరేషన్ వాళ్లు ప్రతి వీధిలో ఇంకుడు గుంతలు ఎక్కువగా ఏర్పాటు చేయాలి.. రోడ్లమీద పడ్డ వాన నీరు భూమిలోకి ఇంకుతుంది.. మనము కాలనీ వాళ్ళతో మాట్లాడదాము! ఇప్పుడు నీళ్ల ట్యాంకర్లు ఊరికే వస్తున్నాయా? వాటికి డబ్బు కడుతున్నాము! అందరూ ఒప్పుకుంటే సంతోషమే కదా! సమస్య తీరుతుంది.. ఒక ప్రయత్నం చేసి చూద్దాం! " అంది నర్మద.
తప్పనిసరై ఒప్పుకున్నాడు భట్నాగర్.
"సరే మేడం! మీరు ఇంతగా చెబుతున్నారు కాబట్టి వచ్చే ఆదివారం మీటింగ్ పెడతాను! ఎంతమంది వస్తారో చూద్దాము! డబ్బుతో పని.. ఎంతమంది ఓనర్లు సహకరిస్తారో చూడాలి!” అన్నాడతడు.
ఇంటికి వచ్చింది నర్మద.
పూనా వాటర్ వర్క్స్ ఆఫీసర్ గణనాథకు ఫోన్ చేసిఆదివారం ఉదయం కాలనీకి రమ్మంది నర్మద. ఒక అసిస్టెంటును వెంటబెట్టుకొని వచ్చాడు గణనాథ్.
కాలనీ కార్యాలయంలో బోర్డు ఒకటి పెట్టి, బొమ్మలు వేసి మరీ చూపించాడు గణనాథ్.
"రెండేళ్లలో బోర్లలోకి నీళ్లు వస్తాయి. ఆ తర్వాత ఒక ఏడాదికి నీళ్ల ట్యాంకర్లతో అస్సలు పని ఉండదు"
అతడు చెప్పిందంతా విన్నారు కాలనీవాసులు. కానీ ఇప్పుడు పైపులైన్లు, ఇంజక్షను బోర్లు అంటే ఒక్కొక్క ఓనరుకు దాదాపు ముప్ఫయి వేల పైన పడుతోంది. డబ్బు గురించి విన్నాక ఎవ్వరూ అంత ఉత్సాహం చూపించలేదు.
నీరసంగా ఇంటికి వచ్చింది నర్మద.
"ఏమైంది? మీటింగుకు ఎంత మంది వచ్చారు?" భార్యను అడిగాడు మహేష్.
"మనది ఇండిపెండెంట్ ఇల్లు అయితే మనమే చేయించుకోవచ్చు! అపార్ట్మెంట్లలో ఉన్నప్పుడు అందరూ కలిసి రాకపోతే ఏ పని చెయ్యాలన్నా కష్టమే!" దిగులుగా ఉంది నర్మదకు.
"మనుషుల్లో మార్పు ఒక్కసారిగా రాదు! మీ ఆడవాళ్ళ కిట్టీ పార్టీలలో చెప్పి చూడు! ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్లు నీలాగా ఏదోరకంగా సంపాదిస్తున్న వాళ్ళే కదా! వాళ్ళతో మాట్లాడుతూ ఉండు! ఒకసారి కాదు నాలుగు సార్లు చెప్పు! ఇలా చేసి విజయం సాధించిన వాళ్ళ గురించి గ్రూపులో వ్రాసి, ఫోటోలు, వీడియోలు పెట్టు! ఇప్పుడు కాకపోతే తర్వాత తర్వాత మార్పు రావచ్చు! గట్టి ప్రయత్నం చెయ్యి!" సలహా ఇచ్చాడు మహేష్.
రోజులు గడుస్తున్నాయి. వానాకాలం వచ్చింది. తాత్కాలికంగా సమస్యను మర్చిపోయారందరు. ఎవరు విన్నా వినక పోయినా మహేష్ చెప్పినట్లు కిట్టీ పార్టీల్లో నీళ్ల సమస్య గురించి చెప్తూనే ఉంది నర్మద.
నీటి సమస్యను అధిగమించిన కాలనీల వీడియోలు సేకరించి గ్రూపుల్లో పోస్ట్ చేయసాగింది. పేపర్లలో వచ్చిన వ్యాసాలు కూడా అప్పుడప్పుడూ కాలనీవాసుల గ్రూపు లో పోస్ట్ చేయసాగింది.
మరుసటి సంవత్సరం ఏప్రిల్ నెలాఖరు.
మళ్ళీ కాలనీలో నీటి కటకట. మార్పు ఏమిటంటే ఈసారి కాలనీవాసుల్లో కొంతమంది నర్మదకు ఫోన్ చేసి వాటర్ వర్క్స్ గురించి అడిగారు.
వెంటనే నర్మద శైలంద్ర భట్నాగరుకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వాటర్ వర్క్స్ ఆఫీసరు గణ నాథుకు విషయం చెప్పి కాలనీకి రమ్మంది. ఆ ఆదివారమే కాలనీ కార్యాలయంలో మీటింగ్ పెట్టాడు భట్నాగర్.
ఈసారి కొంచెం ఎక్కువ మంది ఓనర్లు హాజరయ్యారు.
వాటర్ వర్క్స్ ఆఫీసరు గణనాథ్ వచ్చాడు. ఈసారి కాలనీవాసులు తమకున్న సందేహాలు అన్నీ అతడిని అడిగి తెలుసుకున్నారు.
ఇప్పుడు డబ్బు గురించి ఎవ్వరూ అభ్యంతరం పెట్టలేదు.
నర్మదకు సంతోషం వేసింది. మిగిలిన ఓనర్లకు కూడా విషయాన్ని తెలిపాడు భట్నాగర్. గణనాథ్ సూచనలతో పని మొదలైంది.
కాలనీ మొత్తంలో ఎనిమిది ఇంజక్షన్ బోర్లు వేశారు. కొత్త పైపులైన్లు అంతటా వేశారు. దాదాపు రెండు నెలలు పట్టింది. వానాకాలం వచ్చింది.
అన్ని టెర్రస్సుల పైన చెత్త పేరుకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాడు భట్నాగర్. బోర్లు నిండాయి. కాలనీలోని సీనియర్ సిటిజన్లు వాన నీటిని ఒడిసి పట్టుకోవటం గురించే నిరంతరం చర్చించుకుంటూ ఉన్నారిప్పుడు.
ఆ మరుసటి సంవత్సరానికి కాలనీకి నీటి కష్టాలు తీరాయి.
ఇప్పుడా కాలనీవాసులు సాధించిన విజయం చుట్టు ప్రక్కల వాళ్లకు స్ఫూర్తిని కలుగ చేసింది. నర్మద పేరు అందరికీ తెలిసింది. వేరే వేరే కాలనీల వాళ్ళు చాలా మంది ఆమెకు ఫోన్ చేసి నీటి సమస్య పరిష్కారం గురించి అడుగుతూ ఉన్నారు.
(సమాప్తం )
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments