top of page

పరివర్తన


'Parivarthana' New Telugu Story


Written By Yasoda Pulugurtha


రచన: యశోద పులుగుర్త

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

తమది సామాన్యమైన కుటుంబం. నాన్న ఒక్కరిదే సంపాదన. తనూ, అమూల్య వారి సంతానం. డిగ్రీ పూర్తి అయింది తనకు. అమూల్య ఇంజనీరింగ్ చదువుతానని పట్టుబట్టి మరీ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయింది. దాని అదృష్టం ఉన్న ఊళ్లోనే సీట్ రావడం.


తనూ ‘ అమూ’ ఎంతో సన్నిహితంగా ఉంటారు. చెప్పాలంటే మంచి స్నేహితులులాగ. తనకి అమూల్య అంటే పంచ ప్రాణాలు. దానికీ అంతే. అమ్మా నాన్నా మాట వినని అది తను ఎంత చెపితే అంత. తనకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు.


అనుకోకుండా ఒక రోజున తెలుగు మాట్రిమోనీ లోని మీ అమ్మాయి సమీర ప్రొఫైల్ మాకు చాలా నచ్చింది, మా అబ్బాయి రిక్వైర్ మెంట్స్ కి బాగా కలసిందంటూ ఎవరో స్వర్ణలత అనే ఆవిడ ఫోన్ చేయడం, ఆ తరువాత పెళ్ళి చూపులూ అవీ చక చకా జరిగిపోయాయి. స్వర్ణలత కొడుకు ఐ. ఓ. సీ. ఎల్ లో కెమికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. పైగా స్తితిమంతులు. అమ్మా నాన్నకూ సంబంధం బాగా నచ్చడంతో ' ఏమ్మా 'మీరా', అదృష్టవంతురాలివి, సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది' నీకు ఆ అబ్బాయి నచ్చాడు కదూ అనేసరికి మౌనంగా తల ఊపింది.


బాంబే లో దివాకర్ తో తన వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుందని ఊహలల్లుకుంది. కానీ అటువంటి ఊహలకు, సరదాలకు, ప్రేమావేశానికి అర్ధమేమిటో తెలియని తన భర్తత తో నిస్సారమైన సంసారం మొదలైపోయింది. తప్పతాగి ఎప్పుడో అర్ధరాత్రి గాని ఇల్లు చేరడు. ఎంతకీ ఇల్లు చేరని భర్తకోసం నిండుయవ్వనంలో ఉన్న తను ఎదురు చూస్తుంటే అత్తగారు మాత్రం బాగా అలంకరించుకుని మామగారితో పార్టీలకు ఫంక్షన్సుకూ వెళ్లిపోయేది. అత్తగారితో చెపితే ‘వాడంతే, సర్దుకుపోవాలంటూ’ చెప్పేదేకానీ, కొడుకుతో తాగుడు మానేయమని గానీ, భార్యను ప్రేమగా చూసుకోమని గానీ చెప్పకపోవడం తనకు ఆశ్చర్యరంగా అనిపించేది. పైగా అత్తగారి తృణీకార ధోరణి, నిరాదరణ, డబ్బుగల వాళ్లమనే అహం, ఆ ఇంట్లో తన స్తానమేమిటో అర్ధం అయ్యేది కాదు. అందరూ తనను దూరంగానే ఉంచేవారు. స్వర్ణలత లేడీస్ క్లబ్ సెక్రటరీ. తన కొడుక్కి ఒక మధ్యతరగతి అమ్మాయిని కోడలుగా చేసుకుందని మంచి మనసున్న వ్యక్తి అని బయట మెప్పు సంపాందించింది.


తన భర్త వ్యసనపరుడని, ములుకుల్లాంటి మాటలతో అత్తగారు, ఆడపడుచులు తనను గాయ పరుస్తున్నారన్న వాస్తవాన్ని అమ్మా, నాన్నకూ కనీసం తన ప్రియమైన చెల్లెలు 'అమూ' కి ఎందుకో చెప్పలేకపోయింది.


ప్రేమకోసం, ఆదరణకోసం తపించే మనసు ఏ అమావాస్యకో పున్నమికో చాచిన అతని చేతుల్లో ఆత్మాభిమానాన్ని విడిచి కరగిపోయేది. అతనిలో ఏమాత్రం ప్రేమరాహిత్యం ఉండేదికాదు. తాగుడుమైకంలో ఇంటికి చేరడం, తిండి తినేసి దుంగలా పక్కమీద చేరి నిద్రపోవడం, పొద్దుట లేవగానే ఆదరాబాదరా ఆఫీసుకి పరుగెత్తడం.


బాబు పుట్టాక తనలో మరీ పిరికితనం ఆవహించింది. బయటపడి ఈ లోకంలో ఒంటరిగా పిల్లవాడిని పెంచగలనా అనుకుంది. ఆర్ధికంగానూ, ఆరోగ్యపరంగానూ అంతంత మాత్రంగానే ఉన్న తల్లితండ్రులమీద అదనపు భారం పెట్టలేని బలహీనత. పైగా అమూల్య కి పెళ్లి చేయాలనే తలంపులో ఉన్నారు.


తన జీవితంలా చెల్లెలి జీవితం కాకూడదనుకుంది. అమూల్యకు పెళ్లి కుదిరినపుడు నాన్న నా కూతుళ్లిద్దరూ బంగారపు తల్లులు, అందుకే సంబంధాలు వెతుక్కుంటూ కాళ్లదగ్గరకు వచ్చాయంటూ మురిసిపోయాడు. నాన్న ఆనందానికి పేలవంగా నవ్వుకుంది.


అమూల్య కి వచ్చిన సంబంధం తమకి దూరపు బంధువులే. అమూల్య కి కాబోయే అత్తగారు భువనేశ్వరి పరమ గయ్యాళని అందరికీ తెలుసు. పెద్ద గొంతుకతో అందరిమీద అరుస్తూ, ఏదైనా కాస్త తేడా వస్తే చాలు అవతల వాళ్లు ఎవరన్నదీ చూడకుండా విరుచుకు పడుతుంది. పిల్లలకు తల్లి అంటే భయం. తండ్రి అతి నెమ్మది.


ఆవిడ కొడుకు కిరణ్, అమూల్యా హైద్రాబాద్ లో ఒకే సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు.

కిరణ్ కు అమూల్య నచ్చడంతో తన తల్లి తండ్రులను అమూల్య ఇంటికి పెళ్లి మాటలకు పంపించాడు. కిరణ్ బుధ్దిమంతుడు, తెలివైనవాడు. అమూల్యకు కూడా ఇష్టమే అతనంటే. అతన్ని రెండు సంవత్సరాలుగా తన ఆఫీసులో చూస్తోంది.


'ఆవిడ గయ్యాళి కదమ్మా, వీరిద్దరినీ సవ్యంగా కాపురం చేయనిస్తుందా? 'అమూ' ని రాచీరంపాన్న పెడుతుందేమో ఎందుకేనా మంచిది ఆలోచించుకోండమ్మా' అంటూ పదే పదే తల్లికి చెప్పి చూసింది సమీర. 'అమూ’ కి కూడా చెప్పింది.


'మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా అక్కా, మారుతున్న కాలంతోబాటూ ఆవిడలోనూ మార్పు వచ్చి ఉండచ్చుగా' అంటు కొట్టి పారేసింది.


చెల్లెలి పెళ్లికి పదిరోజుల ముందే వెళ్లింది. తనకి ఎందుకో ఆందోళనగా ఉంది. సరిగా ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నారేమోనని.

‘అమూ’ కి వివరంగా చెప్పాలి. నాన్న నిర్ణయానికి తల వంచినందుకు నేను అత్తవారింట్లో నరకయాతన పడుతున్నానని, నీవు నాలా కాకూడదని, ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకొమ్మని హెచ్చరించాలనుకుంది.

ఆరోజు సాయంత్రం అమూల్యను డాబా మీదకు తీసుకు వెళ్లింది.

'అమూ, ఒక్క విషయం చెప్పు, నీకీ పెళ్లి ఇష్టమేనా'?

'అదేంటక్కా అలా అడుగుతున్నావు'?

‘తొందరపడి చేసుకుంటున్నావేమోనని. ఇంతకంటే మంచి సంబంధం రాదన్న భయమా’?


‘అయ్యో అక్కా, నా కెందుకా భయం’? నాదీ కిరణ్ దీ ఒకటే ఆఫీసు. రెండేళ్లగా అతన్ని గమనిస్తున్నాను. చాలా మంచివాడు.

‘పైకి అందరూ అలాగే కనిపిస్తారే’, ముఖ్యంగా వాళ్లమ్మ ఎంత గయ్యాళిదో అందరికీ తెలుసు.


'అక్కా నీవేమి చెపుతున్నావో అర్ధంకాక కాదు'. నీ మాటలు వినడంలేదని తొందరపడి నిర్ణయం తీసుకున్నానని నీవు ఒకటే ఆరాట పడుతున్నావ్.


'కానీ అక్కా, ఒక్క మాట, నాకు కిరణ్ ముఖ్యం కానీ ఆవిడ ఎలా ఉంటే నా కెందుకు'?

'అతను చాలా మంచి వాడక్కా'. కిరణ్ పేరు చెపుతుండగా 'అమూ' కళ్లల్లోని మెఱుపులు సమీర దృష్టిని దాటిపోలేదు.

'అదే పొరపాటు అమూ! మా అత్తగారినే చూడు, బయట సమాజంలో ఆవిడ చాలా మంచి మనిషి. ఇంకా చెప్పాలంటే ఒక దేవత. కానీ,..' ఒక క్షణం ఆగిపోయింది. గొంతు దుఖంతో నిండిపోయింది.


‘ఏమైందే, నీవు చాలా హేపీగానే ఉన్నావు కదా’?

‘అదే చెప్పబోతున్నానే. పైకి ఎంతో సాత్వికంగా కనిపించే మా అత్తగారు ఇంట్లో నన్ను రాచిరంపాన్న పెడుతుందంటే ఎవ్వరూ నమ్మరు.'

అక్క ముఖంవైపు తేరిపారచూసిందో క్షణం. అక్కను తను బిజీగా ఉండి గమవించనేలేదు గానీ, అందమైన అక్క ముఖంలో నైరాశ్యం అలుముకుంది. తన పెళ్లి పట్ల ఎందుకో భయాందోళనలు వ్యక్త పరుస్తోంది.

‘నిజమా అక్కా’?

'అవునే, నా సంసారంలో ముఖ్యపాత్ర ఆవిడదే'. మీ బావ తప్పతాగి ఇంటికొచ్చినా సమర్ధిస్తుంది. ములుకుల్లాంటి మాటలతో అత్తగారూ, అవకాశం వచ్చినదే తడవుగా విమర్శనాస్త్రాలతో ఆడపడుచులూ నా మనసుని గాయం చేస్తున్నారే 'అమూ'. నా అనుభవంతో చెబుతున్న మాటలను నీవు కొట్టిపడేస్తున్నావు. పండగలకూ పబ్బాలకు మనం కలిసిన సందర్భాలలో ఆవిడ చూపించిన ఆప్యాయతా, మంచితనం అంతా బూటకమే.'

అమూల్యకు ఏమనడానికి తోచడంలేదు. అక్క ఎంత చెప్పినా కిరణ్ తో ఏర్పడిన అనుబంధం, ప్రేమని తను ఒదులుకోలేదు.

అక్క అమాయకురాలు, ఇన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా ఎదురు తిరగలేని అక్క మనస్తత్వానికి జాలిపడింది.


"చూడు అక్కా, నీవు ఊహిస్తున్నట్లుగా ఒకవేళ నాకూ నీలాంటి పరిస్తితే ఎదురైతే నేను మాత్రం సర్దుకుపోను. కిరణ్ నేనూ వేరే వెళ్లి పోతాం. ఒక వేళ కిరణ్ నేను రాను, మా అమ్మ కొంగు పట్టుకునే కూర్చుంటానంటే అలాగే కూర్చో నాన్నా, నా దారిన నేను వెళ్లిపోతా నంటాను. నా గురించి వర్రీ అవకు, నేను బాగానే ఉండగల'ననేసరికి సమీర ఏమీ చెప్పలేకపోయింది.


'ఒక్కమాట అమూ, నా విషయాలేమీ అమ్మా నాన్నకు చెప్పవుకదూ'?

'చెప్పను కానీ, నీవు మారాలి, నోరుమూసుకుని కూర్చునే రోజులు కావివి'. 'జీవితం చాలా విలువైందక్కా'. రాంగ్ స్టెప్ తీసుకోకు. బావను మార్చడానికి ప్రయత్నం చేయి. నీకు నేనున్నానంటూ ధైర్యమిచ్చింది.


అమూల్య కి కిరణ్ తో పెళ్లి అయిపోయింది. కిరణ్ ను బెంగుళూర్ ఆఫీస్ కి ట్రాన్స్ ఫర్ చేసారు. అమూల్య కూడా వేరే ఆఫీస్ కు మారిపోయింది. కిరణ్ తల్లీ తండ్రీ కూడా హైద్రాబాద్ లోని సొంత ఇంటిని అద్దెకిచ్చేసి బెంగుళూర్ వెళ్లిపోయారు. ఈ వార్త తెలిసినప్పటినుండీ సమీర కు అమూల్య మీద బెంగ ఇంకా ఎక్కువైంది. ఆ గయ్యాళి 'మహాతల్లి ' అమూ ని ఏ చిత్రహింసలు పెడుతోందోనన్న ఆలోచనలే. అస్తమానూ తల్లికి చెల్లెలుకి ఫోన్ చేస్తూ ఎలా ఉన్నారంటూ ఆరా తీసేది.


పెళ్లై ఆరునెలలు గడచిపోయాయి. సంక్రాంతి పండుగకు మమ్మలనే రమ్మన్నారు అమూల్య అత్తగారు, ఒక వారంరోజులైనా ఉండాలంటూ మరీ మరీ చెప్పినందుకు నేనూ నాన్నా బెంగుళూర్ వెడుతున్నామే మీరా అని తల్లి ఫోన్ చేసి చెప్పింది. అమ్మ చెల్లి సంసారాన్ని దగ్గరుండి చూస్తుంది కాబట్టి వివరాలు తెలుసుకోవచ్చని సమీర ఎదురుచూస్తోంది.


తల్లి నుండి ఫోన్ వచ్చేసరికి మళ్లీ అదే విషయాన్ని తరచి తరచి అడిగింది సమీర. ' అమూ బాగానే ఉంది కదమ్మా అని'.

‘ఓసి పిచ్చి తల్లీ, ఎంత ప్రేమే నీకు చెల్లెలంటే, అదీ అంతే, అనుక్షణం నీ గురించే ఆరాటపడుతూ ఉంటుంది'.


అమూల్య అత్తగారు అందరి దృష్టిలో ఎంతో గయ్యాళిలా కనిపించినా ఇంట్లో ఆవిడ ఎంత సౌజన్య మూర్తో, ప్రేమాభిమానో రుచి చూసి వచ్చామే మీరా. నీ చెల్లిని ఎంత ముద్దు చేస్తుందో తెలుసా. అది సరిగా తినడంలేదని దగ్గరుండి నోట్లో పెట్టి మరీ తినిపిస్తోంది. ఆఫీసు వర్క్ లో పడి తనని తాను పట్టించుకోవడం లేదంటూ ఆరారా పండ్లరసాలు తీసి తాగించడం. ఈ పెంకె ఘటంలో కూడా ఎంతో మార్పు. ‘అమూ’ ని చూసి ఆశ్చర్య పోయాననుకో. టైమ్ ఉన్నపుడు అత్తగారికి వంటలో సాయం చేస్తుంది, ఆవిడ వద్దు అన్నా.


ఆవిడైతే ఒక్క పని చేయించదు దానిచేత. కొడుకూ కోడలినీ ఒకేలాగ చూస్తుంది. వీక్ ఎండ్ వస్తే నీవూ కిరణ్ హాయిగా బయటకి వెళ్లిరండంటూ పంపిస్తుంది. మమ్మలని తరుచుగా వస్తూ కొన్ని రోజులు ఉండిపోవాలంటూ పదే పదే చెప్పింది. బయట ఎలా ఉన్నా ఆవిడ ఇంట్లోమాత్రం అందరికీ ప్రేమను పంచి ఇచ్చే గయ్యాళంటూ ఫక్కున నవ్వుతూ దాని గురించి దిగులుపడడం మానేయి మీరా అంటూ ఫోన్ పెట్టేసింది.


తల్లి మాటలకు సమీర మనసు నిండా ఆనందమే. ‘అమూ’ సంసారం పట్ల తనకున్న భయాందోళనలన్నీ దూదిపింజాల్లా ఎగిరిపోయాయి.

మనుషులలో ఎంతంటి వ్యత్యాసం !


బయట అందరి దృష్టిలో దేవత అనిపించుకునే తన అత్త ఇంట్లో పరమ గయ్యాళి, పైకి గయ్యాళి అనిపించుకున్న అమూల్య అత్తగారు ఇంట్లో దేవత.


ఇంగ్లీష్ లో ఓ ఫ్రేజ్ ఉంది “ డోన్ట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ ఔటర్ కవర్ అని “!

అప్పుడే క్లబ్ నుండి వచ్చిన అత్తగారు 'ఎప్పుడూ ఆ ఫోన్ చేతిలో పట్టుకుని ఎవరితో ఆ మాటలు'? మీ అమ్మా వాళ్లకూ చాడీలు గానీ చేరవేయడం లేదు కదా? అయినా ఇంతటి రాజభోగాలు అనుభవిస్తూ కూడా ఏ కష్టాలున్నాయని చెప్పుకోడానికి? ఇంతకీ మహారాణీ గారు వంట ఏమైనా చేసారా లేదా? చచ్చేటంత ఆకలితో వచ్చానంటూ అధికారంగా మాట్లాడుతుంటే ఒక్క క్షణం తన ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఆవిడ ముఖంపైనే దృష్టి సారిస్తూ “ మహారాణులెవరైనా వంట చేస్తారా అత్తయ్యగారూ”, మీరు వంట వండి నన్ను పిలిస్తే నేను వచ్చి తింటానంటూ తన గదిలోకి వెళ్లిపోయింది.


సమీర అదివరకటి లాగ భయపడడం లేదు. తనకు చేయాలనిపిస్తే చేస్తుంది, లేకపోతే బాబు ఆలనాపాలనలో పూర్తిగా ములిగిపోతూ పట్టించుకోవడం మానేసింది. బి. ఎస్. సి చదివి అప్పట్లో కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసిన తాను మళ్లీ తన నాలెడ్జ్ ను రిఫ్రెష్ చేసుకోవడం ప్రారంభించింది.


ఆ రోజు శుక్రవారం. రాత్రి బాబుని పక్కన పెట్టుకుని నిద్రపోతున్న సమీరకు ఏదో కలకలం, హడావుడిగా ఇంట్లో మనుషులు తిరుగాడడం గమనించి టైమ్ చూసింది. అర్ధరాత్రి ఒంటిగంట. గది బయటకు వచ్చింది.


దివాకర్ ను కారులో నుండి దింపుతున్నారు. అతని శరీరమంతా రక్తసిక్తమై ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న అతని కారు ఎదురుగా వస్తున్న ట్రక్ ను గుద్దేయడంతో కారు అద్దాలు పగిలిపోయి ముందు భాగం అంతా డొక్కుపోయింది. ఎవరో ఫోన్ చేసి సమాచారం ఇస్తే పోలీసు కేసు కాకుండా ట్రక్ డ్రైవర్ ను డబ్బుతో కొనేసారు. పోలీస్ కేస్ అయితే అప్రతిష్ట అని, నలుగురిలో తలెత్తుకోలేమని.


అప్పటికప్పుడు ఫేమిలీ డాక్టర్ ను పిలిపించారు. శరీరమంతటా గాయాలు. ఎడం కాలికి బలమైన దెబ్బతగిలింది. బోన్ ఫ్రాక్చర్ అయిందని చెప్పాడు. ఇంట్లోనే ట్రీట్ మెంట్ మొదలైంది.


మూడునెలలు బెడ్ రెస్ట్, కాలికి బేండేజ్ తో కదలలేని స్తితిలో ఉన్నాడు.

దివాకర్ పట్ల ఒక నిరాదరణ, తృణీకార భావం చోటు చేసుకుంది ఇంట్లో వాళ్లందరకీ. అతనితో మాట్లాడడం మానేసారు. నీ ఖర్మ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.

ఆ రోజు రాత్రి ఇంట్లో అందరూ ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్లారు. దివాకర్ ఏదో అవసరంపడి నౌకరుని పిలుస్తుంటే అతను పలకలేదు. రెండు మూడుసార్లు పిలిచినా రాలేదు. సమీరకు వినపడుతూనే ఉంది అతని పిలుపు. మానవత్వం వెళ్లి చూడమని ఆదేశించింది. సమీరను చూడగానే తొట్రుపడుతూ ‘శంకర్ ని ఎన్నిసార్లు పిలిచినా పలకడంలేదు మీరా’.


‘మీరా’ అని పిలిచేది తనకు అత్యంత దగ్గరవాళ్లే. కళ్లెత్తి అతనివైపు చూస్తూ ఏమి కావాలంటూ అడిగింది.

అతను సమీర వైపే చూస్తున్నాడు.


ఎంతందంగా ఉంది చూడీదార్ లో. పచ్చని మేనిఛాయ, ఎడంవైపు గెడ్డం కింద పెసరబద్దంత పుట్టుమచ్చ, వత్తుగా ఉన్న కర్లీ హెయిర్, చక్కని ఎత్తు. తనను తాను సంభాళించుకున్నాడు.


కాలు బాగా నొప్పిపెడుతోంది. కదలకుండా ఇలా పడి ఉండడం నరకంలా ఉంది. కాస్త మెల్లిగా నన్ను అటువైపు కి జరపగలవా ? సమీర మెల్లిగా అతను చెప్పినట్లు చేసి వెనుదిరగబోయింది. హఠాత్తుగా ఆమె చేయిపట్టుకుని కాసేపు ఇక్కడ కూర్చోవూ, నీతో మాట్లాడాలంటూ అభ్యర్ధించాడు.

సమీర నిలబడే ఉంది.


నా మాటలు నీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ నిజం. నేను స్వతహాగా త్రాగుబోతుని కాదు. నేను నందిని అనే అమ్మాయిని ప్రేమించాను. తను కూడా నన్ను ఇష్టపడింది. ఇంట్లో అందరం అమ్మ చెప్పినట్లే వినాలి. లేకపోతే రాధ్దాంతం, చస్తానని బెదిరింపు. నందిని తో నా పెళ్లి ససేమిరా వద్దంది. అయినా చేసుకోవాలనే నిర్ణయించుకున్నాను. నందినిని ఆఫీసు పనిమీద చెన్నె పంపించారు. అక్కడ తనకు స్వైన్ ఫ్లూ ఎటాక్ అయింది. లంగ్స్ లో ఇన్ ఫెక్షన్ సోకి ఆరోగ్యం క్షీణించి చావు బ్రతుకుల మధ్య పదిరోజులు పోరాడి చనిపోయింది. లోకం శూన్యమైంది నాకు. ఒకరోజు అమ్మ మా చెల్లెళ్లతో అంటూండగా విన్నాను. పీడ వదిలిందని, త్వరలో నాకు పెళ్లిచేసేయాలని. పిచ్చివాణ్ణి అయ్యాను. త్రాగుడే నన్ను సేదతీరుస్తుందనుకున్నాను. పగలంతా ఆఫీసులో గడచిపోయినా సాయంత్రాలు మాత్రం నందిని తలపులు గుర్తొచ్చి బార్ లో కూర్చుని బాగా తాగి ఇంటికి చేరేవాడ్ని.


కాలక్రమేణా నందిని జ్నాపకాలనుండి బయట పడినా, ఈ తాగుడు మైకం నుండి మాత్రం బయటపడ లేకపోయాను. నిన్ను పెళ్లిచేసుకోమని బలవంతం చేసింది.

పెళ్లి చేసుకున్నా ఏనాడూ నిన్ను భార్యగా ప్రేమించలేదు. మన బాబుని దగ్గరకు తీయలేదు. భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు మీరా, ' నన్ను క్షమించవూ '? ఆవేదనతో అభ్యర్ధించాడు.


అంతవరకూ మౌనంగా వింటున్న సమీర కంఠం ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

'క్షమించమని అడగడం చాలా తేలిక దివాకర్'.


నేను ఈ ఇంట్లో ఎంత నరకం అనుభవిస్తున్నానో మీకు అర్ధం కాదు. మీకోసం అహర్నిశలూ ఎదురుచూసే ఒక భార్య ఉందని ఏనాడైనా గ్రహించారా? తాగుడు మైకంలో మీ శారీరక అవసరాలను తీర్చే ఒక యంత్రంలా వాడుకున్నారు నన్ను. మీ అమ్మా, చెల్లెళ్లు ఎలా ప్రవర్తించినా, కనీసం మీ ప్రేమాభిమానాలు కోసం ఆరాటపడ్డాను. అవికూడా ఎండమావులే అయ్యాయి. రోషం, దుఖం రెండూ ముప్పిరిగొనగా సూటిగా మాట్లాడుతున్న సమీర మాటలకు అతను పశ్చాత్తాపంతో నలిగిపోతున్నాడు.


'నేను బాబుని తీసుకుని హైద్రాబాద్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను దివాకర్'! ఏదైనా ఉద్యోగం చూసుకుని స్వతంత్రంగా బ్రతకాలని అనుకుంటున్నాను. నేనిలా జీవఛ్చవంలా నా ఆత్మాభిమానాన్ని చంపుకుంటూ ఇలా ఇక్కడ ఉండలేను.


సమీర మాటలకు అతని ముఖం రక్తం లేనట్లు పాలిపోయింది. 'ఎంత దుర్మార్గుడు తాను?' తాగుడు మైకంలో కళ్లు మూసుకు పోయాయి. తనను నమ్ముకుని నీతోనే నా జీవితం అనుకుంటూ వచ్చిన ఒక అమాయకురాలిని ఇలా క్షోభ పెట్టే అధికారం తనకెవరిచ్చారు? తను దారి తప్పి ఇలా ప్రవర్తిస్తుంటే తనకు బుధ్ది చెప్పి తన నడవడిని సరిదిద్దే తన తల్లీ తండ్రీ తనను పట్టించుకోకపోవడంతో తను మితిమీరి ప్రవర్తిస్తున్నాడు.

తల్లీ తండ్రీ ప్రవర్తన గుర్తొచ్చేసరికి అతని మనసు వికలమైపోయింది. 'హు, వాళ్లకెందుకు తనెలా ప్రవర్తిస్తే'?


ముందు సమీరను తాను ఆపగలడా? ఇన్నాళ్లూ తన కళ్లు మూసుకుపోయాయి. తనకు బలవంతంగా పెళ్లిచేసిందని తల్లిమీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. సమీరకు అసలు విషయం చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు.

' ప్రస్తుతం నేను అమ్మా అని పిలుస్తున్నావిడ నా కన్న తల్లి కాదు సమీరా'.

తెల్లబోయింది సమీర అతని మాటలకు.


'నిజం'. పెళ్లై చాలా కాలం అయినా పిల్లలు కలగక పోతే మూడు నెలల వయస్సున్న నన్ను అనాధాశ్రమం నుండి తెచ్చుకుని దత్తత చేసుకున్నారు. ఈవిడే నన్ను కన్నట్లుగా బయట లోకాన్ని నమ్మించారు, ఎందుకంటే గొడ్రాలన్న అపఖ్యాతిని తొలగించుకోడానికి. నన్ను స్వర్ణలత ఎప్పుడూ ప్రేమగా దగ్గరకు చేరతీయలేదు. ఆయా సంరక్షణలో పెరిగాను. నాకు ఊహ తెలిసిన తరువాత ఆవిడ ప్రవర్తనకు ఆశ్చర్యపడే వాడిని. నన్ను తెచ్చుకున్న మూడు సంవత్సరాలకు ఆవిడ అదృష్టమో, నా దురదృష్టమో గానీ ఆవిడకు ఆడపిల్లలు కవలలు పుట్టారు. నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒకరోజు నా చెల్లెలు రమ్య నీవు మా స్వంత అన్నయ్యవు కాదు తెలుసా, అమ్మే చెప్పింది అనేసరికి నేను ఆవిడను అడిగాను. 'నిజమే, ఇప్పుడు నీకువచ్చిన లోటేమిటి' అనేసరికి తెల్లబోయాను'. పైగా దెప్పుతూ ఉండేది. శ్రీమంతుల బిడ్డవనుకుంటూ నీ ఇష్టారాజ్యంగా అన్నీ జరుగుతాయని అనుకోకు. నీ హద్దుల్లో నీవు వుండాలని చెప్పేది.


చదువులో మెరిట్ స్టూడెంట్ ని అయినమూలాన చదువే లోకంలా గడిపేవాణ్ణి. ఐఐటి కెమికల్ ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది. తరువాత ఉద్యోగం. ఇక్కడ నుండి వెళ్లిపోదామా అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఆవిడ ఎలాంటిదైనా ఆవిడ పట్ల ఒక కృతజ్నతా భావం, నా లాంటి అనాధను చేరదీసిందని. ఆరాధన, జాలి, ఓదార్పు, సానుభూతి, ఆకర్షణ, ఇష్టం, ప్రేమ లాంటి ఏ భావోద్వేగాలకూ నోచుకోని ఒక దురదృష్టవంతుడిని. ఆవిడకు నచ్చిన అమ్మాయిని చేస్తే తన కంట్రోల్ లో ఉంటుందని నీతో నా పెళ్లి జరిపించింది. ఆవిడమీద ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితోనే నేను నిన్ను నిర్లక్ష్యం చేసాను.

కానీ భగవంతుడు ఎంతటి దయామయుడో చూడు, నిన్ను నాకిచ్చి నా జీవితానికో వెలుగుని ప్రసాదించాడు. కానీ నీ లాంటి దేవతను ఎంత క్షోభ పెట్టానో తలచుకుంటుంటే నన్ను నేను క్షమించకోలేక పోతున్నాను మీరా.


'నిన్ను క్షమించమని అడగడం చిన్న మాట'. నా మనసుని విప్పి నీ ముందు ఉంచాను మీరా. నీవు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను.

సమీర కు ఆశ్చర్యంగా ఉంది. స్వర్ణలత సమాజం దృష్టిలో మానవత్వం ఉన్నఒక గొప్ప మహిళ. కానీ ఇంట్లో, ఒక సంస్కారహీనురాలు.


దివాకర్ ఒక త్రాగుబోతని, ఏ ప్రేమావేశాలూ లేని ఒక బండ రాయనుకుంది. కానీ ఆ బండరాయికూడా స్రవిస్తుందని ఇప్పుడే తెలుసుకుంది.


దివాకర్ తన మాటలని కొనసాగించాడు. 'మనమీ ఇంటినుండి వెళ్లిపోదాం మీరా, నేనిక త్రాగనని ప్రమాణం చేస్తున్నాను'. నిన్నూ, బాబునీ నా ప్రాణప్రదంగా చూసుకుంటాను, ఆశగా ఆమెవైపే చూస్తున్నాడు. అతను పశ్చాత్తాపంతో కృంగిపోతున్నాడు.


సమీర మౌనంగా కిటికీలోనుండి బయటకు చూసింది. వెన్నెల రాత్రి. నీలాకాశంలో తారకలు తళుక్కుమంటున్నాయి. పౌర్ణమి చంద్రుడు తారకలతో ముచ్చట్లాడడానికి వచ్చినట్లున్నాడు. ఎప్పుడూ లేనంత మనోహరంగా వెలుగులీనుతున్నాడు. చెలికాడు చేరరమ్మని పిలుస్తుంటే రాను ఫో అంటోందేమిటీ పిచ్చిపిల్ల అనుకుంటున్నాడు.


కొన్ని క్షణాల మౌనం తరువాత తలెత్తి దివాకర్ వైపు చూసింది. ఇద్దరి కళ్లూ కలుసుకున్నాయి. అతని కళ్లల్లో కనిపిస్తున్న అంతులేని అనురాగానికి ఆమె హృదయం పులకించింది.

--సమాప్తం--

యశోద పులుగుర్త గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link

Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








57 views0 comments
bottom of page