'Paropakaram Idam Sariram' New Telugu Story
Written By Lakshmi Nageswara Rao Velpuri
'పరోపకారం ఇదం శరీరం' తెలుగు కథ
రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“ఒరేయ్ కృష్ణా, తొందరగా సామాన్లు కట్టండి రా! అక్కడ కస్టమర్లు గోల చేస్తున్నారు, నలుగురు ఉన్నారు కానీ, తొందరగా పని సాగటం లేదు” అంటూ ఒక గావు కేక పెట్టాడు, ఆ కిరాణా హోల్సేల్ వ్యాపారి రామ జోగయ్య గారు. విజయనగరంలో ఎన్నో వ్యాపారాలు చేసి లాభాలు గడిస్తూ ఆ ఊరిలోనే ఎంతో ధనవంతుడిగా పేరుపొందాడు. తను కిరాణా షాప్ లో కూర్చుని, నలుగురు పని వాళ్ళతో అత్యంత చాకచక్యంగా పనిచేయిస్తూ, మరోపక్క కస్టమర్లతో మాట్లాడుతూ ,బేరం పోనీకుండా, వారికి సరసమైన ధరలకు ఇస్తున్నట్టు నటిస్తూ, ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా వ్యాపారం చేస్తున్నాడు రామజోగయ్య. కానీ అందరికీ తెలిసిన విషయమేమంటే ఆయన పరమ పిసినారి.పనిచేస్తున్న పని వాళ్లకు కూడా సరిపడినంత జీతాలు ఇవ్వక, తన ఇష్ట ప్రకారము జీతాలు ఇస్తూ, పని చేయించుకుంటాడు ఆ షావుకారు. ఆరోజు షాపులో రద్దీగా ఉంది, కస్టమర్లు నెలవారి సామాన్లు లిస్టులు ఇచ్చి, తొందర పెడుతున్నారు అయినా తన మాటకారితనంతో, వాళ్ళకి సర్ది చెబుతూ పని వాళ్ళని తొందర పెట్టడం రోజువారి తంతే. కాస్త ఖాళీ దొరకగానే మంచిగా ఒక పాన్ నోట్లో వేసుకుని, తన కుర్చీలో కూర్చొని ఆరోజు 'బ్యాంకుకు' పంపించవలసిన వేల కొద్ది డబ్బును, లెక్కపెడుతూ, తన పని తాను చేసుకుంటున్నాడు షావుకారు. ఇంతలో రామజోగయ్య గారి స్నేహితుడు మధుసూదన్ గారు వచ్చి, “ఏమయ్యా జోగయ్య! మా అమ్మాయి ఫంక్షన్ కి రాలేదే, మీరు వస్తారని అనుకున్నాను కానీ రాలేదు..” అని ప్రశ్నించగా 'అయ్యయ్యో.. అదేం లేదు సార్!” అని ఏవో కుంటి సాకులు సాకులు చెప్పి, తప్పించుకున్నాడు రామజోగయ్య. తన మనసులో ‘పోనీలే. వెళితే 1000/- రూపాయలు ఖర్చు అయ్యేది, వాళ్లకి గిఫ్ట్ లు ఇవ్వాలి. ఇదో రకంగా డబ్బు మిగిలింది. ఫంక్షన్ లు వస్తూనే ఉంటాయి.. ఎంతకని డబ్బులు తగలేస్తాము.. అని తనలో తానే సమర్ధించుకున్నాడు. “ఇదిగోనయ్యా, ఇవాళ మీ చెల్లి నీకోసం మంచిగా 'చికెన్ బిర్యాని ,ద్రాక్షరసం 'పంపించింది. నేను ఎలాగో వెళ్తున్నాను కదా, అని నీకు ఇమ్మంది” అంటూ రెండు ప్యాకెట్లు చేతిలో పెట్టి, ఒక జ్యూస్ బాటిల్ ఇచ్చి, “ఖాళీ చూసుకుని, నువ్వు మీ ఆవిడ మా ఇంటికి రండి” అంటూ చెప్పి వెళ్లిపోయాడు ఆ స్నేహితుడు. అ ఆహార పదార్థాలు చూడంగానే ఒక్కసారి ఆకలి గుర్తుకువచ్చింది, వెంటనే “ఒరే కృష్ణ! కస్టమర్ లందరూ వెళ్లిపోయారుగా, నువ్వు ఒకసారి ఇలా రా!” అంటూ గట్టిగా అరిచాడు షావుకారు. ఆ పనివాడు రాగానే, “ఒరేయ్, ఈ ప్లేట్ లో ఉన్నది, ఈ బాటిల్, తొందరగా ఇంటికి వెళ్లి అమ్మగారికి ఇచ్చి, నేను భోజనానికి వస్తున్నాను అని చెప్పు” అని ఆ స్నేహితుడిచ్చిన ఆహార పదార్థాలను మరోసారి కనబడకుండా కప్పి, వాటికి రబ్బర్ బ్యాండ్లు వేసి, ఒక కవర్లో పెట్టి ఇస్తూ, “ఒరేయ్ జాగ్రత్త,! ఆ కవర్లో ఉన్నది లావు తగ్గడానికి ,బలానికి ఏదో చెట్ల వేర్ల నుంచి చేసిన మందు. దాని పక్కనే ఉన్న బాటిల్ లో చాలా చేదైన దగ్గు మందు ఉన్నది.అది పొరపాటున ఎవరైనా ఎక్కువ తాగితే, అది విషం లా పనిచేసి, వాంతులు, విరోచనాలతో చస్తారు జాగ్రత్త! అర్జెంటుగా వెళ్లి అమ్మగారికి ఇచ్చేయ్.. జాగ్రత్త సుమా! ఏవో తినే వస్తువులని కుక్కలు, కాకులు వచ్చి తన్నుకు పోతాయి. వెళ్ళు.. వెంటనే రా” అంటూ కృష్ణయ్యకిస్తూ, అనుమానంగా చూశాడు రామజోగయ్య. “అలాగే అయ్యా ! ఇప్పుడే వెళ్తున్నా” అంటూ ఆ కవర్ మొత్తం తీసుకొని రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న షావుకారి ఇంటికి బయలుదేరాడు కృష్ణయ్య. కృష్ణయ్యకు తెలుసు షావుకారి పిసినారితనం. ఎందుకు పదేపదే అవి మందులని, జాగ్రత్తగా ఇంటికి ఇమ్మని చెప్పాడో తెలుసుకుందామన్న ఆత్రుత ఎక్కువైంది కృష్ణయ్య కు. వెంటనే ఒక పెద్ద చెట్టు నీడ కింద కూర్చొని ఎంతో పకడ్బందీగా కట్టిన కవర్ ని విప్పి చూసాడు. ఆశ్చర్యపోతూ,’ఇది మందు కాదు, ఏమీ కాదు. ఆహా.. ఇది 'చికెన్ బిర్యాని '. ఎంత ఘుమఘుమమలాడుతుందో.. పోతే పోయింది వెదవ ఉద్యోగం! పొద్దున్నుంచి చాకిరీ చేస్తూ కడుపు నకనకలాడిపోతుంది” అంటూ ఆవురావురుమంటు లొట్టలేసుకుంటూ తిన్నాడు కృష్ణయ్య. త్రాగడానికి మంచి నీళ్లు లేక సరే షావుకారు ఎలాగో నాతో అబద్ధమాడి ఇచ్చాడు, 'జూస్ ' అయి ఉంటుంది, అని కొంచెం రుచి చూసి, చక్కని 'ద్రాక్ష రసం 'అని తెలుసుకొని , గుటకలువేస్తూ తాగాడు. ‘ఆహా షావుకారు! ఎంత పిసినారోడు, ఇంట్లో అంత మంచి వంటలు ఉన్నా ,పిల్లికి బిక్షం పెట్టడు..’ అని మనసులోనే అనుకుంటూ ,కడుపు నిండి , దాహం తీరాక ఆ చెట్టు నీడలోనే మత్తుగా నిద్ర పోయాడు కృష్ణయ్య. సరిగ్గా మధ్యాహ్నం షాప్ కట్టేసి పని వాళ్ళని పంపించి, తాళం వేసి ఇంటికి వచ్చాడు షావుకారు రామజోగయ్య. ఇంటికి రాగానే భార్యతో “నాకు భోజనం వడ్డించు. కొంచెం తొందరగా తిని, కాసేపు రెస్ట్ తీసుకుని, మళ్లీ షాప్ కు వెళ్లాలి ! “ అనేసరికి, భార్య మంగ “ఏవండీ! ఇవాళ లేట్ అయిపోయింది! వంట ఒక పావుగంట లో అవుతుంది, కూర్చోండి వడ్డించేస్తాను” అని అనేసరికి అసలే అలిసిపోయి ఉన్న షావుకారు, “నువ్వు రోజూ ఇంతే! సమయానికి భోజనం వండవు. పోన్లే.. ఆ కృష్ణయ్య గాడు తెచ్చి ఇచ్చిన పార్సల్ పట్రా, పాపం నా స్నేహితుడు మధు ఫంక్షన్ కి రాలేదని చికెన్ బిర్యాని, జ్యూసు ఇచ్చాడు. అవేనా తిని కాసేపు పడుకుంటాను” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు షావుకారు. “అదేంటండీ! మన పనివాడు కృష్ణయ్య అసలు రానేలేదు, ఏ ప్యాకెట్లు తేలేదు” అని భార్య మంగ చెప్పగానే,. “అరే.. అదేంటి? ఆ వెధవ ఏం చేశాడో,! కక్కుర్తి వెదవలు.. వాడ్ని ఈ రోజే ఉద్యోగంలో నుంచి పీకేస్తాను. సరే నాకు అన్నం పెట్టు. నేను వెంటనే షాప్ కు బయలుదేరుతాను” అంటూ కోపంగా భార్య పెట్టినది తిని, మళ్లీ వెంటనే బయలుదేరాడు షాప్ కి షావుకారు. షాపుకు వెళ్లే దారి వెంట స్కూటర్ మీద వెళుతూ అటూ ఇటూ చూస్తున్నాడు షావుకారు. ఇంతలో ఒక పెద్ద చెట్టు కింద నీడలో మత్తుగా పడుకొని ఉన్న ఉన్నాడు, పనివాడు కృష్ణయ్య. వెంటనే స్కూటర్ ఆపి, “ఒరేయ్ కృష్ణ.. లేవరా వెధవా!” అంటూ చాలా గట్టిగా అరుస్తూ వాడిని కుదుపుతున్నా తెలివి రాని పనివాడ్ని, కోపంగా ఒక దెబ్బ వేసాడు చేతితో. టక్కున మెలకువ వచ్చింది కృష్ణయ్యకు. “అయ్యా మీరా, నేను ఇంకా బ్రతికే ఉన్నానా!, నన్ను గట్టిగా గిల్లండయ్యా” అంటూ షావుకారు కాళ్లు పట్టుకున్నాడు కృష్ణయ్య. “ఏరా.. ఇంటికి పంపించిన వస్తువులను ఏం చేశావు? చెప్తావా పోలీసుల్ని పిలవమంటావా?” అని గట్టిగా అడిగేసరికి, “అయ్యా! రెండు రోజుల నుంచి భోజనం లేక కడుపు కాలిపోతుంది. షాపులో పనిచేస్తూ అలిసిపోయా. కాసేపు ఎండగా ఉంది కదా! అని ఆ చెట్టు నీడను కూర్చోగానే, ఒక కుక్క ,రెండు కాకులు ఆ కవర్ ని లాక్కొని వెళ్ళిపోయాయి. అవి ఏదో ఆహారమని కొట్లాడుకుంటూ పట్టుకుపోయాయి. మీకు తెలిస్తే చంపేస్తారని, నా ఉద్యోగం పోతుందని తెలిసి, ఇక ఏమీ చేయలేక, మీరు చెప్పారు కదా! ఆ నల్లని కషాయం తాగితే ,చచ్చిపోతారని.. అందుకే అది తాగేసానండి! ఇప్పుడు ఇంకో గంటలో సచ్చిపోతాను కాబట్టి నన్ను క్షమించండి అయ్యా!” అంటూ ఏడుస్తూ కాళ్ళవేళ్ళాపడ్డాడు, పనివాడు కృష్ణయ్య. షావుకారు రామజోగయ్య గారికి మతి పోయినట్లయి, తనలో తనే ‘తన పిసినారితనం, స్వార్థం గుర్తుకు వచ్చి, ఒక పనివాడు కృష్ణయ్య తన కళ్ళు తెరిపించినట్లయి, ‘ఓహో , తన దగ్గర పనిచేసే వాళ్ళని, బంధువులను ,స్నేహితులను అందరినీ అనుమానిస్తూ, పరోపకారం చేయకుండా, స్వార్థంతో ఇన్ని ఆస్తులు మూటగట్టాను, చ్చీ! ఇకనుంచి ‘పరోపకారమే ఇదం శరీరం’ అన్న వాక్యాలు అక్షర సత్యాలుగా భావించి, తనకున్న దాంతో ఎక్కువగా దానధర్మాలు చేస్తూ, పని వాళ్ళకి మంచి జీతాలు ఇస్తూ ,వారి ఆదరాభిమానాలను చూరగొన్నాడు రామ జోగయ్య గారు. తనకున్న ధనంతో అనాధాశ్రమాలను కట్టించి, తన కళ్ళు తెరిపించిన పనివాడు కృష్ణయ్యను అధికారిగా చేసి, వృద్ధులకు, వికలాంగులకు భోజన సదుపాయాలు కల్పించి కొన్ని సంవత్సరాల లోనే 'అపర దాన కర్ణుడిగా' పేరు గాంచారు షావుకారు రామ జోగయ్య గారు. ************** |
వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం :
నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Comments