top of page

పరుగెత్తి పాలు తాగటం కంటే


'Parugetthi Palu Thagadam Kante' - New Telugu Story Written By Madduri Bindumadhavi Published In manatelugukathalu.com On 12/11/2023

'పరుగెత్తి పాలు తాగటం కంటే' తెలుగు కథ

రచన: మద్దూరి బిందుమాధవి

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


ఏదో సాధించాలని అవిశ్రాంతంగా పరుగులు పెట్టి.. అనుకున్నది సాధించలేక బొక్క బోర్ల పడటం శ్రేయస్కరం కాదు అంటారు పెద్దలు.

పాలు కాకపోతే ఫరవాలేదు.. స్థిమితంగా నిలబడి నీళ్ళు తాగితే.. కడుపు నిండినా.. లేకున్నా కనీసం దాహం తీరుతుంది.

విజయం అన్నది ప్రతి సారీ మనం అనుకున్నట్టు చేరువ కాకపోవచ్చు!

కాబట్టి ఎండ మావుల వెంట పరుగెత్తి అనుకున్నది దొరకక నిరుత్సాహ పడకుండా స్థిమితంగా నిలబడి ఏదో ఒకటి సాధించటం మేలు అని పెద్దలు చెబుతారు.

@@@@

రాజేష్ కి డాక్టర్ కావాలనేది కోరిక.

అది కూడా ఆయుర్వేదం చదవాలనేది మరీ గాఢమైన కోరిక.

అందుకే ఏడో క్లాస్ నించి బయాలజీ ఏకాగ్రంగా చదివే వాడు.

అప్పుడప్పుడు అంతర్జాలంలో వెతికి అనేక మొక్కల పేర్లు వాటితో తయారయ్యే ఔషధాల పేర్లు గురించి ఆసక్తిగా తెలుసుకుంటూ ఉండేవాడు.

వంటింట్లో తల్లి వండే కూరగాయలు, ఆకు కూరల వల్ల ప్రయోజనాలు తెలుసుకుంటూ ఉండేవాడు.

అప్పట్లో వైద్య సదుపాయాలు పెద్దగా లేని రోజుల్లో.. సాధారణంగా వచ్చే రోగాలకి తన పూర్వీకులు ఎలాంటి మందులు వాడేవారు.. అవి బాగా ఫలితాలిచ్చేవా అని తల్లిని తరుచు అడుగుతూ ఉండేవాడు.

కొడుకు మెడిసిన్ చదువుతానంటే ఏ తల్లి సంతోషించదు కనుక!

భారతీయులు వంటల్లో ఎక్కువగా వాడే అల్లం, పసుపు, ధనియాలు, మిరియాలు గురించి సుబ్బలక్ష్మి వివరంగా చెబుతూ ఉండేది.

తాతగారికి దగ్గొచ్చినప్పుడు వాడే కరక్కాయ, అజీర్తి చేసి కడుపు నొప్పి వచ్చినప్పుడు వాడే మిరియాలు చేసే అద్భుతాల గురించి చెబుతూ ఉండేది.

ఇటీవల సేంద్రియ వ్యవసాయ ప్రాధాన్యం పెరిగి.. మిరియాల పొడి వేసి మరిగించిన నీటిని క్రిమి సంహారకంగా కూడా వాడుతూ సత్ఫలితాలని సాధిస్తున్నారని తెలుసుకున్న రాజేష్ కి మన సంప్రదాయ విధానాల పట్ల గౌరవం మరింత పెరిగింది.

ఋతువుల ప్రకారం కాసే కూరగాయలు.. ఆ ఋతువుల్లో వచ్చే రోగాలని బాగా నయం చేస్తాయి అని అమ్మ చెప్పినప్పుడు.. 'ప్రకృతే మనకి గొప్ప వైద్యుడన్నమాట' అన్నాడు రాజేష్.

రాజేష్ తో మాట్లాడుతూ.. సొరకాయ మిక్సీలో తిప్పి రసం తీసి ఒక గ్లాసులో వడగట్టింది సుబ్బలక్ష్మి. "దానితో ఏం చేస్తావ్" అన్నాడు.

"నా మోకాళ్ళ నెప్పికి అది దివ్యమైన ఔషధం. ఏ టాబ్లెట్స్ మింగకుండా.. మోకాళ్ళకి వంటింట్లో దొరికే మంచి చిట్కా వైద్యం అది" అన్నది.

"ఉదయమే కాకర కాయ రసం తాగితే శరీర బరువు తగ్గుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది" అన్నది.

అలా క్రమేణా ఏ దుష్ప్రభావాన్ని (side effect or reaction) చూపించకుండా మంచి ఫలితాలనిచ్చే భారతీయ వైద్య విధానాల పట్ల ఒక ఆకర్షణ ఏర్పడింది రాజేష్ కి.

ఆన్ లైన్ లో సంస్కృతం నేర్పే సైట్ అంతర్జాలంలో వెతుకుతూ ఉండేవాడు.

"మీ సిలబసే చాలా ఉంటుంది. పరీక్షలకి చదువుకోక.. మళ్ళీ ఈ సంస్కృతం కోసం వెతకటం ఎందుకు" అన్నది కొడుకుతో సుబ్బలక్ష్మి.

"మన పురాతన వైద్య విధానం.. ప్రాచీన భాష అయిన సంస్కృత గ్రంధాల్లో ఎక్కువగా దొరుకుతుందిట. అందుకే అప్పుడప్పుడు అవి నెట్ లో వెతుకుతూ ఉంటాను" అన్నాడు రాజేష్.

@@@@

"ఇంటర్ అయ్యాక నేను అలోపతి మెడిసిన్ కాకుండా ఆయుర్వేదం చదవాలనుకుంటున్నానమ్మా. నేను నీట్ పరీక్ష రాసి అందులోనే చేరతాను. నాన్నగారిని ఈ విషయంలో నువ్వే ఒప్పించాలి".

"అందరూ నడిచే దారిలో నడవకపోతే మీకు వింతగానే ఉండచ్చు. కానీ ప్రయోగం చేసినప్పుడే కదమ్మా మన సత్తా మనకి తెలిసేది! విపరీతమైన పోటీ ఉండే రెగ్యులర్ మెడిసిన్ కంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ చదవాలనుకుంటున్నాను. "

"ఇంగ్లిష్ వైద్యం అనేది ఇటీవల కాలం అంటే.. 200-300 ఏళ్ళ క్రితం వచ్చింది. కానీ మానవ చరిత్ర.. నాగరికత ఎన్నో వేల సంవత్సరాల క్రితం నించి ఉన్నదే! అప్పుడు వాళ్ళు వాడినది ఇప్పుడున్న వైద్య విధానం కాదు కదా! అప్పుడు మాత్రం జబ్బులు రాలేదా? వాళ్ళు వైద్యం చెయ్యలేదా? ఎవరో ఒకరు మళ్ళీ ముందుకొచ్చి పాతవి తిరగ తోడకపోతే మనదైన గొప్ప వారసత్వ సంపద వెలుగులోకి ఎలా వస్తుంది" అన్నాడు రాజేష్ తల్లివంక సాలోచనగా చూస్తూ!

"వీడు ఎంత ఎదిగిపోయాడు! నాకే పాఠాలు చెబుతున్నాడు" అనుకుంది సుబ్బలక్ష్మి.

"అప్పటికప్పుడు వచ్చే జబ్బులు.. సర్జరీల ద్వారా మాత్రమే పరిష్కారాలు దొరికే రోగాల కోసం ఇంగ్లిష్ వైద్యానికి వెళ్ళచ్చు. ఆ వైద్యంలో వాళ్ళు జబ్బుని అణిచేస్తారే కానీ మూలాలతో నయం చెయ్యలేరు. అప్పటికి తగ్గినట్టు అనిపించినా.. రోగ నిరోధక శక్తి తగ్గే సరికి ఆ జబ్బు ఇంకొక శరీర భాగంలో బయట పడుతుంది. కానీ అది ఒకప్పుడు అణచివేయబడిన రోగమే అని మనకి తెలియదు. అబ్బా.. అదంతా ఒక సంక్లిష్టమైన విషయంలే అమ్మా.. ఇంకొక సారి మాట్లాడతాను. "

"ఇప్పుడిప్పుడే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకి మన వాళ్ళు ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, హోమియో పతి వైద్యానికి వెళుతున్నారు. "

"విదేశాల వాళ్ళకి మన లాంటి పురాతన వైద్య విధానాలు లేవు కనుక వాళ్ళు అలోపతినే పాటిస్తారు" అన్నాడు.

అప్పుడే సరిగ్గా టీవీలో రామాయణ ప్రవచనం వస్తోంది. అందులో యుద్ధకాండలో.. రావణుడు వేసిన 'శక్తి' అస్త్రంతో మూర్చపోయిన లక్ష్మణుడిని కాపాడటానికి హనుమని హిమాలయాలకి వెళ్ళి సంజీవని అనే మూలికని తీసుకురమ్మని సుషేణుడు అనే వైద్యుడు చెబుతాడు.

"హిమాలయాల దక్షిణ శిఖరం మీద 'విశల్య కరణి' (శరీరం మీద విష ప్రయోగం జరిగినప్పుడు ఆ విషాన్ని విరిచెయ్యగల గొప్ప మూలిక), 'సావర్ణ్య కరణి' (విషం వల్ల శరీర వర్ణం మారిపోతే.. ఆ విషాన్ని లాగేసి పూర్వ వర్ణం తెచ్చే మూలిక), 'సంజీవ కరణి' ( ప్రాణం పోయే పరిస్థితి వస్తే తిరిగి బతికించే మూలిక), 'సంధాన కరణి' (ఎముకలు విరిగితే తిరిగి అతికించగల మూలిక) దొరుకుతాయి" అని ఆ ప్రవచన కర్త చెబుతుంటే విని..

"అమ్మా చూశావా టీవీలో మన ప్రాచీన వైద్య శాస్త్రం ఎంత విస్తారమయినదో చెబుతున్నారు. అంటే ఇప్పుడు మనం చాలా ఆధునికం అనుకుంటున్న వైద్యాన్ని మన పూర్వీకులు ఎప్పుడో చేశారు" అన్నాడు రాజేష్.

"థాయ్ లాండ్, మలేషియా, చైనా, హాంకాంగ్.. ఇలా అనేక దేశాల్లో మసాజ్ లు చాలా ఫేమస్ తెలుసా? అలా మసాజ్ చేసేటప్పుడు వాళ్ళు కండరాలకి పనికొచ్చే కొన్ని మూలికా తైలాలని వాడతారు. మసాజ్ అనేది ఇంగ్లిష్ వైద్య విధానంలో లేనే లేదు".

"ఇంతకీ ఏమంటావురా" అన్నది సుబ్బలక్ష్మి కుర్చీలో చతికిలబడి.

"నేను ఈ పిచ్చిపోటీకి బలి అవదల్చుకోలేదు. ఇంచక్కా ఆయుర్వేదం చదువుతాను" అన్నాడు.

"పైగా ఒక్క ఎంబిబిఎస్ తో సరిపోదు. తరువాత ఇంకా చదువుతూనే ఉండాలి. మనకి నచ్చే సబ్జక్ట్ లో సీట్ వస్తుందని నమ్మకం లేదు. అలా వచ్చేవరకు అంతూ.. పొంతూ లేకుండా చదువుతూనే ఉండాలి".

"తీరా చదువయ్యాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చెయ్యాలంటే అక్కడ ఏ సౌకర్యాలు ఉండవు. ప్రభుత్వాలు పట్టించుకోవు. కార్పొరేట్ ఆసుపత్రిలో పని చెయ్యాలంటే వాళ్ళు చెప్పినట్టు అడ్డమైన టెస్ట్స్ చేయించమని రోగులకి.. వాళ్ళని దోచే ప్రిస్క్రిప్షన్ రాసి.. మన మనసుని అమ్ముకోవాలి. "

"ఎందుకొచ్చిన గొడవ.. "పరుగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్ళు తాగుతూ" ప్రజా సేవ చెయ్యాలనేది నా కోరిక".

"కాబట్టి నేను మన వేదాల్లో ఉపవేదమైన 'ఆయుర్వేదాన్నే' చదువుతాను. ఇప్పుడిప్పుడు విదేశాలు కూడా మన సంప్రదాయ వైద్య విధానాలని పాటిస్తూ.. వాటి మీద పేటెంట్లు కూడా తీసుకుంటున్నారుట. "

"వాడెవడో వచ్చి మన గొప్పతనాన్ని మనకి చెబితే అప్పుడు 'అవును'అంటూ భుజాలెగరేస్తాం. "

"అందుకే నేను మన నిధిలాంటి ఆయుర్వేదాన్ని చదువుతాను" అని ఇంక నా నిర్ణయం మారదు అన్నంత దృఢంగా చెప్పాడు.

కొడుకు చెప్పిన విషయంలో పస లేదు అనలేదు.. అలా అని వేరే దారిలో వెళతానంటే అందులో ఉండే సాధక బాధకాలు ముందుగా తెలియక.. తరువాత ఇబ్బంది పడతాడేమో అనే బాధ.. ఎటూ తేల్చుకోలేక సుబ్బలక్ష్మి.. కేరళ వారి కొట్టక్కల్ వైద్యం చేయించుకుంటున్న స్నేహితురాలితో మాట్లాడి.. ఈ వైద్యంలో తన అనుభవం, అభిప్రాయం తెలుసుకోవాలని నిర్ణయించుకుంది.

***

మద్దూరి బిందుమాధవి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

https://www.manatelugukathalu.com/profile/bindumadhavi/profile

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.


60 views0 comments
bottom of page