top of page
Writer's pictureGorthi Vani

పశ్చాత్తాపం


'Paschatthapam' New Telugu Story Written By Gorthi VaniSrinivas

'పశ్చాత్తాపం' తెలుగు కథ

రచన: గొర్తి వాణిశ్రీనివాస్

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


వందేభారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి బయల్దేరింది. మెనూ చార్ట్ ప్రకారం చెక్ చేసుకుంటూ కాఫీ టీ సప్లయర్స్ చురుగ్గా కదులుతూ ప్యాసింజర్స్ కి తమ సేవలందిస్తున్నారు.


వేడి కాఫీని చప్పరిస్తూ పేపర్ చదవడంలో మునిగిపోయారు ప్రయాణీకులు.


కిటికీ పక్కన కూర్చున్న ఆమె మనసు రైలుకన్నా వేగంగా పరిగెడుతుంది.


ముందుగా విశాఖలోని తన అత్తవారింటికి వెళ్ళాలి. అక్కడనుంచి శ్రీకాకుళం వెళ్ళాలి.


రమణ మాస్టార్ని కలవాలి. ఇప్పటికి ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు లేదు. అవన్నీ అందాయో లేదో?


పోనీ ఫోన్ చేద్దామంటే నెంబర్ తెలీదు. అమ్మావాళ్ళని అడిగితే బాగుండదు. బహుశా ఆయన ఆ ఊళ్ళో వుండటంలేదేమో.


ట్రైన్ లో ఏసీ మరీ చల్లగా అనిపించి చీర కొంగు కప్పుకుంది.

రమణ మాష్టారికోసం కొన్న కాశ్మీర్ శాలువా గుర్తొచ్చింది.

ఏమిస్తే తీరుతుంది ఆ రుణం?!


కాలం మెట్లపై పరచిన ఎర్రతివాచీ ఆయన సహనం.


ఎల్లలు లేని ఆ క్షమాగుణాన్ని తలుచుకుంటే కన్నీళ్లు చిప్పిల్లాయి.


ఆమె మనసు గతాన్ని తడిమింది.


***********

రమణ మాస్టార్ని చూడగానే గుడిసెలోకి పరిగెత్తింది చిన్ని.


"రండి మాస్టారూ" అంటూ చిన్ని తల్లి రేణుక

చేతులు జోడించింది మాస్టార్ని ఆహ్వానించింది.


లోపలికివెళ్లి కుర్చీ తెచ్చి వేసింది.

రమణ మాస్టారు వచ్చి కూర్చున్నారు.


"ఇలా వచ్చారేం సారూ?" అంది రేణుక.


"ఏదీ ఆ గుడ్లగూబ?" అన్నారు.


"ఎవరు సారూ గుడ్లగూబ?"


"అదే నీ కూతురు చిన్ని. బడికి రాకుండా తప్పించుకుంటోంది. వెలుగు రాగానే అన్ని ప్రాణులూ నిద్రమేల్కొంటాయి. గుడ్లగూబకి మాత్రం వెలుతురు నచ్చదు. బయటకు రమ్మను తనని" అన్నాడు రమణ.


తల్లి పిలిచిన కాసేపటికి పిల్లిలా వచ్చి నిలబడింది తొమ్మిదేళ్ల చిన్ని.


"ఏమ్మా, బడికి రావట్లేదే. చదువుకోవా? ఆడపిల్లకు చదువు ఎంతవసరమో నీకిప్పుడర్ధం కాదు. నామీద గౌరవం ఉంటే

మానకుండా బడికిరా. " అన్నాడు.


"ఈమధ్య స్నేహితులతో ఆటలు నేర్చింది సారూ.

నేను పంపిస్తాను. ఈసారికి దాని తప్పు కాయండి.

బడికొస్తా సారూ అని చెప్పవే చిన్నీ" అని కూతురిని ముందుకు తోసింది రేణుక.


"వస్తా సారూ" అంది చిన్ని.


"నువ్వు ఐదో తరగతి పాసైతే కోరుకున్న బహుమానం ఇస్తాను. సరేనా" అన్నారు.


"అట్టనే సారూ. సదూకుంటాను" అని చెప్పింది.


రమణ మాస్టారు వెళ్ళిపోయారు.

‘మాస్టారుకి ఎందుకింత పట్టుపడుతున్నాడు.

నేను చదవకపోతే ఈయనగారి ముల్లేదో పోయినట్టు.. తిక్కలోడు’ అనుకుంటూ అచ్చంగాయలాట మొదలుపెట్టింది చిన్ని.

ఇంట్లోంచి వసారాలోకొచ్చిన రేణుక కూతురి వీపుమీద ఒక్కచరుపు చరిచింది.


"గిప్పుడేనా గా సారు గంతిదిగా మంచిమాటలు చెప్పి ఎల్లాడు. అప్పుడే గాలికొదిలేసినవా ఏందే. పెద్దాళ్ళమాట సద్దిమూట. సదువుకో. లేకపోతే వీపు చీరేస్తా"


తల్లి తిట్లకి ఏడుస్తూ అక్కడినుంచి లేచింది.


చిన్ని స్నేహితురాళ్లు ఇళ్ళకి వెళ్లిపోయారు.

తండ్రికూడా చదువుకోమని కోప్పడ్డాడు.


అత్త, బాబాయి ఎవరు చూసినా మీ మాస్టారు నువ్వు బడికి పోవట్లేదని చెప్పారు. ఏ ఎందుకుపోవట్లేదు. చదువుకోవా

అని అడుగుతుంటే చిన్నికి కోపం వచ్చేది.


మాష్టారి పోరు పడలేక బడికిపోవడం మొదలుపెట్టింది.


చిన్నీవాళ్ళ పక్కిల్లే రమణ మాస్టారుది.

ఆయన ఆ పెంకుటింట్లోకి దిగి ఆరునెలలైంది.


రమణ మాష్టారి భార్యపోయి ఏడాదయింది.

ఆయన కూతురు సిటీలో ఉద్యోగం చేసుకుంటూ అక్కడే హాస్టల్ లోఉంటుంది. మాస్టారు మాత్రం చెయ్యికాల్చుకుంటూ ఒంటరిగా ఉంటున్నాడు.


మాష్టారి పోరుతో ఎలాగొలా అయిదవతరగతి అత్తెసరు మార్కులతో పాసయింది.


ఊళ్ళో ఆడపిల్లలు బడికి రాకపోతే రమణ మాస్టారు ఊరుకోరునే ప్రచారం జరిగింది. ఆయన ప్రోద్బలంతోనే ఇంట్లోవాళ్ళు కూడా పిల్లల్ని బడికి పంపుతున్నారు.


ప్రతిక్లాసూ ఎలాగో నెట్టుకుంటూ పదవ తరగతి దాకా వచ్చింది చిన్ని. పాఠాలు అసలు బుర్రకెక్క లేదు.

పది పాసవడం కష్టం అన్నారంతా.


"మా ఇంటికి రా నేను చదివిస్తాను. నిన్ను పాస్ చేయించే బాధ్యత నాది" అన్నారు రమణ మాస్టారు.


చిన్ని ఇంట్లో వాళ్ళు మాస్టారు దగ్గర ప్రయివేటుకి వెళ్ళమని ఒకటే పోరు పెట్టారు.


ఎవర్ని చూసినా బాగా చదువుతున్నావా అని అడిగేవాళ్లే.

అసలు చదువు ఇష్టంలేదు మొర్రో అంటే ఎవరూ వినిపించుకోరు.


ఈ మాస్టారు ఒకడు. ఎప్పుడూ చదువు అంటాడు. అమ్మ, పెద్దమ్మ, పిన్ని, అత్త ఎవరూ చదువుకోలేదు కదా. వాళ్ళు ఎంతోహాయిగా వుంటున్నారు. అదికదా జీవితం.


చక్కగా ఇంటిపనులు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఉన్నది తింటూ వాళ్లలాగే సంతోషంగా ఉండాలని చిన్ని కోరిక.


చక్కగా చీరకట్టుకుని గురుగులు పెట్టుకుని స్నేహితుల్ని పిలిచి వంట చేసి భోజనాలు పెట్టే ఆట ఆడుతోంది చిన్ని.

అది ఆమెకి ఎంతో నచ్చిన ఆట.


"కూరలో ఉప్పు లేదే. పప్పులో కారం ఏదీ?" అంటూ తోటి ఆటగాడు అడుగుతుంటే జారిపోతున్న పైట సర్దుకుంటూ "రేపు సరిగా వేస్తానండీ.. ఈ పూటకి కాస్త సర్దుకుని ఎలాగోలా తినండి. " అని చెప్పింది.


తోటి స్నేహితురాళ్ళు నవ్వుతుంటే తానూ హాయిగా నవ్వేసింది.


మినుములు విసరడం, కళ్ళాపి చల్లి ముగ్గులు వేయడం ఇలాంటి పనులు చేయడానికి ఇష్టపడేది చిన్ని.


"దీనికన్నీ ఇల్లాలి కుండాల్సిన లక్షణాలున్నాయి. పెళ్లిచేస్తే మంచి భార్య అవుతుంది. పిల్లలకి మంచి తల్లవుతుంది. " అనేవాళ్ళు చిన్ని మేనమామలు.


లెక్కలు ఇంగ్లీషు అసలు అర్ధం కావు. ఇంట్లో ఎవరూ చదువుకోకపోవడంతో చిన్నికి కష్టంగా అనిపించింది. మాష్టారి ఇంటికి ప్రయివేటుకి వెళ్లక తప్పలేదు.


రమణ కిరసనాయిలు స్టవ్వు మీద వంటచేసుకుంటూ వుండేవాడు. అటు వంట చేస్తూ ఇటు చిన్నికి చదువు చెప్పేవాడు.


అర్ధంకాకపోయినా అరిచిమరీ చెప్పడం చిన్ని కి ఏమాత్రం నచ్చలేదు. బుర్రకెక్కట్లేదు మొర్రో అంటే ఇంకాస్త ఎక్కువసేపు చదవమంటాడు. ఇంట్లో వాళ్ళు కూడా చిన్నిని అక్కడే ఉండి చదువుకోవమనేవాళ్ళు.


మెల్లిగా చిన్ని చదువులోపడింది. పదవతరగతి త్రైమాసిక పరీక్షల్లో కొద్దిగా మార్కులు పెరిగాయి.

ఇంకా బాగా చదవాలి చిన్నీ. ఈసారి ఇంకా మంచిమార్కులు రావాలి అన్నాడు రమణ.

ఆటలు బంద్. అల్లరి బంద్. తెల్లవారుజామున లేపి చదివించాడు. మధ్యంతర పరీక్షలు అయ్యాయి. చిన్ని నీరసించిపోయింది. తలనొప్పి వచ్చింది. కళ్ళజోడు కూడా వచ్చింది.


'నీ మొహానికి కళ్ళజోడు భలే వింతగా ఉంది. గుడ్లగూబలా ఉన్నావ్' అని ఆటపట్టించారు స్నేహితులు.


కొద్దిరోజుల్లో పది పబ్లిక్ పరీక్షలు ఉన్నాయనగా చిన్నికి ఒక ఉత్తరం వచ్చింది.


'నీకెవరు ఉత్తరం రాశారే' అంటూ ఆ ఉత్తరాన్ని చదవమని చిన్నికి ఇచ్చింది తల్లి.


"డియర్ చిన్నీ నువ్వంటే నాకిష్టం. నిన్ను చదివించేది నీమీద ప్రేమతోనే. నువ్వు చిన్నివి కాదు. నా ఝాన్సీవి. నీకోసం ఎంత డబ్భైనా ఖర్చుపెడతాను. బాగా చదువుకుంటావా. " అనుంది ఆ లెటర్ లో.


"ఓరిదేవుడోయ్! ఈ మాస్టారు నాకొంప ముంచాడురా. నాకూతురిమీదే కన్నేశాడు.. ఆయన పెళ్ళాం పేరెట్టి పిలుస్తుండ్ల. కొడకో. మహానుభావుడిలెక్క అగుపించేటోడు. అందుకే అతని కూతురు అతని దగ్గర ఉండకుండా పోయింది.


సరైనోడైతే తన కూతురి సంపాదనమీద ఎందుకు ఆధారపడతాడు. లక్షణంగా పెళ్లిచేసి అత్తోరింటికి పంపేటోడు. ఇంకా నయం. పాడుబుద్ధి ముందుగాల తెలిసింది. బిడ్డని పైలం సేసుకోనీకి. "


మాస్టార్ని తిట్టిపోసి చిన్నిని ట్యూషన్ మాన్పించారు.


పాడుపని చేసినవాడిగా మాస్టారు ముద్రపడ్డాడు. అయినా ఆ ఊరిని వదిలిపోలేదు. తలవంపుల్ని భరిస్తూ అక్కడే వున్నాడు. అతని కూతురు మాత్రం వచ్చి పోతుండేది.


*************

రైలు విశాఖపట్నం స్టేషన్ లో ఆగింది. ఆమె రైలు దిగి సీతమ్మధార తన అత్తవారింటికి వెళ్ళింది.

అక్కడ అందరూ ఆమె రాకకు సంతోషించారు. భోజనాలు చేశాక డ్రైవర్ ని రమ్మని ఫోన్ చేశారు ఆమె మామగారు మూర్తి.


ఆయన పేరుమోసిన పెద్ద కాంట్రాక్టర్.

కోట్లకు పడగలెత్తిన వ్యక్తి.

అతని ఒక్కగానొక్క కొడుకు శశిధర్.


హైదరాబాద్ లో లా కాలేజీలో చదువుతున్నప్పుడు ఆమెను ప్రేమించాడు. చదువు పూర్తయ్యాక ఆమెనే పెళ్లి చేసుకుంటానని తండ్రితో చెప్పాడు. కొడుకు ఇష్టాన్ని కాదనలేక వాళ్ళ పెళ్లి జరిపించాడు మూర్తి.


"కారువచ్చింది. జాగ్రత్తగా వెళ్లి రేపు తిరిగి వచ్చెయ్యి. " అంటూ కోడలికి జాగ్రత్తలు చెప్పాడు మూర్తి.


"అయ్యో మావయ్యా.. నేను వెళ్ళేది నా పుట్టింటికే కదా" అంది నవ్వుతూ.


"అవుననుకో. మా వంశాoకురం నీ కడుపులో పెరుగుతోంది. నువ్వుమాకింకా అపురూపం" అని ఎన్నో జాగ్రత్తలు చెప్పి కారిచ్చి పంపాడు మూర్తి.



శ్రీకాకుళం జిల్లా రాజాం వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. ఆమె కారులోంచి దర్జాగా దిగటం చూసిన ఆమె తల్లిదండ్రులు బంధువులు ఎంతో సంతోషంగా ఆహ్వానించారు. ఆమె వైభవానికి పొంగిపోయారు. అందరూ కలిసి భోజనం చేశారు.


వాళ్ళందరితో ఆనందంగా గడిపింది. ఆ సాయంత్రం,

"అమ్మా, మన పక్కింటి మాస్టారు వుండాలిగా ఏమయ్యారు?" అనడిగింది.


"ఆయనా.. ఈఊళ్ళోనే ఊరిచివర ఓ ఇంట్లో ఉంటున్నాడు. ఆ పిచ్చిపని చేసినోడితో నీకేంపని" తల్లి అంటున్నా ఇప్పుడే వస్తానని చెప్పిఆమె కారులో మాష్టారి దగ్గరకు బయల్దేరింది.


ఇంటికి వెళ్లి చూసేసరికి మాస్టారు ఇల్లు ఊడ్చుకుంటూ కనపడ్డారు.


మాస్టారూ అని పిలిచింది.


'ఎవరూ 'అన్నాడు తలపైకెత్తి చూసి.


"నేను చిన్నిని" అంది.


ఒక్కనిమిషంపాటు తేరిపారా చూసి నువ్వా చిన్నీ! ఎంత పెద్దదానివయ్యావు. ఎప్పుడొచ్చావు? రా"

అని ఇంట్లోకి పిలిచి కూర్చోపెట్టాడు.


"ఎలా ఉన్నారు?" అంది.


"నాకేం బాగానే ఉన్నా. నీకు పెళ్లైందా? అత్తవారు, ఆయనా బాగున్నారా? నిన్ను బాగా చూసుకుంటున్నారా?" అంటూ వివరాలడిగాడు.


"ఒకప్పుడు చదువుని ద్వేషించేదాన్ని. వంట చేయడం వస్తే చాలనుకునేదాన్ని. మీరు పెట్టిన విద్యాభిక్షతోనే నాకీ అదృష్టం పట్టింది. నా జీవితమే మారిపోయింది. మేము పేదవాళ్ళమైనా నా చదువు వల్లే కోటీశ్వరుల ఇంటి కోడలినయ్యేఅదృష్టం కలిగింది. మీరానాడు ఎందుకంత పట్టుపట్టేవారో అర్ధమైంది.


పది అవగానే మీ బలవంతంతోనే ఇంటర్ లో చేరాను. మీరు కట్టిన డబ్బుతోనే హాస్టల్ లో చదువుకున్నాను. తర్వాత ప్రభుత్వం వారిచ్చిన రాయితీతో ఇంజనీరింగ్ పూర్తిచేసాను.

కానీ నేను చేసిన తప్పు మాత్రం నన్ను తొలుస్తూనే ఉంది. దానికి నిష్కృతిలేదు. నన్ను క్షమించండి మాస్టారూ. "అని ఆయన కాళ్ళమీద పడింది.


"అయ్యో అందులో నీ తప్పెంతుందో నాకు తెలీదుగానీ నువ్వు ఎప్పటికీ నాకు మా ఝాన్సీ వే. " అన్నాడు.


ఆశ్చర్యంగా చూసింది.


"అవును ఝాన్సీ నా కూతురి బిడ్డ. నా మనమరాలిపేరు ఝాన్సీ"


"అక్కకి పెళ్లైందా సారూ?" అంది ఆశ్చర్యంగా.


"ఆమెకి నేనక్కడున్నప్పుడే పెళ్లయిపోయింది. కూతురు కూడా పుట్టింది. మా అల్లుడు ఇద్దర్నీ వదిలేసి వెళ్ళిపోయాడు. చంటిపిల్లతో ఒంటరిగా మిగిలింది నాకూతురు. ఎన్నాళ్ళో బాధతో కుమిలిపోయింది.


కానీ ఆమెకు ఆసరాగా ఉంది మాత్రం ఒక్క చదువే. దానితో మంచి ఉద్యోగం తెచ్చుకుంది. తన కాళ్ళమీద తను నిలబడింది. ఇప్పుడు కూతుర్ని పెంచి పెద్దచేసుకుంది.


వివాహబంధం విచ్చిన్నమైతే ముందుగా నష్టపోయేది ఆడపిల్లే. ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళు నిలదొక్కుకోవాలంటే ఆర్ధిక స్వావలంబన కావాలి. అందుకే ఆడపిల్లలు చదువుకోవాలని నేనంతగా పట్టు పట్టేది" అన్నాడు రమణ.


"మీది ఎంత మంచి ఆలోచన సారూ! మీకో విషయం చెప్పాలి. ఝాన్సీ మీ భార్య పేరని ఎవరో చెప్పారు. మీ మీద కోపంతో అప్పుడు అలా ఆ ఉత్తరం నేనే రాశాను. తెలిసీ తెలియని వయసు. చదవమని నా బాల్యాన్ని నాకు కాకుండా చేస్తున్నారనే కోపంతో ఆ పిచ్చి ఉత్తరం రాసి మీ గౌరవం పోగొట్టాను.. మీరెప్పుడూ ఝాన్సీ అంటుంటే అది మీ భార్య పేరనుకుని ఆమె పేరుతో నన్ను పిలుస్తున్నట్టు ఆ ఉత్తరం రాసాను.


ఆ తర్వాత తెలిసింది. మీ భార్యాపేరు శ్రావణి అని. నేనెంత పాపాత్మురాలినో పెద్దదాన్నవుతున్నకొద్దీ అర్థమై నాలో పశ్చాత్తాపం కలిగింది. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు మాస్టారూ. " అంటూ రమణ ముందు కన్నీటి పర్యంతమైంది.


"ఊరుకోమ్మా, నామీద కోపంతో అది నువ్వే రాశావని నాకప్పుడే తెలుసమ్మా. ఆతర్వాత నువ్వెంత బాధపద్దవో కూడా తెలుసు. పైకి చెబితే అందరూ నిన్ను తిడతారని భయపడ్డావు. నీలో కలిగిన ఆ పశ్చాత్తాపమే నిన్ను పట్టుదలగా చదువుకునేలా చేసింది.


అందుకే నా గురుదక్షిణ నాకు చెల్లించగలిగావు. అది చాలదా తల్లీ.


చదువు స్త్రీ చేతిలో ఒక ఆయుధం. ఆపదలో అక్కరకొస్తుంది. నిన్ను ఒక గొప్పింటికి కోడల్ని చేసింది. నా కూతుర్ని తన కాళ్ళమీద నిలబడేలా చేసింది. నిన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది తల్లీ " అన్నాడు.


పశ్చాత్తాపంతో మరుగుతున్న చిన్ని మనసు భారం తీరి తేలిక పడింది. గురువంటే అజ్ఞానాన్ని దూరం చేసే దీపం. కళంకం లేని దైవ రూపంగా భావిస్తూ చిన్ని ఆయనకు చేతులు జోడించి నమస్కరించింది.


"సుఖీభవ. నీకు కూతురుపుడితే చక్కగా చదివించు. కొడుకుపుడితే చదువుతోపాటు స్త్రీలను గౌరవించేలా పెంచు. అదే దేశానికి తల్లిగా నువ్విచ్చే కానుక" అన్నారు మాస్టారు.


తను తెచ్చిన పట్టు శాలువా రమణ మాష్టారికి కప్పి ఆశీస్సులు అందుకుని భారం తీరిన మనసుతో వెనుతిరిగింది చిన్ని.

గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.







100 views1 comment

1 Comment


Vijayalaxmi Telikicharla • 3 hours ago

బాగుందమ్మా! వందే భారత్ ఎక్కించేసారు

Like
bottom of page