'Patha Chinthakayapacchadi Lanti Katha' New Telugu
Story Written By Nallabati Raghavendra Rao
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"హలో సుబ్రహ్మణ్యం బాగున్నావా.. పాత చింతకాయ పచ్చడి రుచి అదిరిపోద్ది. పంపమంటావా?”.
''ఎవరు మాట్లాడేది??”
"నేనురా.. రామచంద్రపురం నుండే శివరామకృష్ణయ్యని మాట్లాడుతున్నాను. మీ ఇంటి దగ్గర పని చేసే ఆ బాగా పొడవాటి కుర్రాడు పొడుగురాజును పంపు. వాడిని అటక ఎక్కించి, పచ్చడి జాడి దింపించి, పాత చింతకాయ పచ్చడి వాడి చేతికిచ్చి నీకు కూడా పంపుతాను."
"అరెరే.. వాడు నిన్ననే మానేశాడు రా''
"ఏడ్చావు.. ఆ సంగతి ముందుగానే చెప్పొచ్చు కదా. ఫోన్ పెట్టేయ్.. కాల్ వేస్ట్......"
"మరి పచ్చడి ఎప్పుడు పంపుతావ్. అసలు నాకు తెలియకుండా మీ ఇంట్లో ఆ పచ్చడి ఎలా ఉంది''
"ఆపు నీ వెధవ అనుమానం. నీకు తెలియకుండా ఉండబట్టే ఇన్నేళ్లు ఉంది. ఇదిగో ఎల్లుండి మా కొడుకులు, కోడలు, కూతుళ్లు, అల్లుళ్లు.. వాళ్ల వాళ్ల పిల్లలు అందరూ వస్తున్నారు. అందరం తిన్నాక మిగిలితే పంపుతాలే వింటున్నావా... '
"మళ్లీ ఏదో అరకాసులో తిరకాసు పెడుతున్నావు. వాళ్లంతా వచ్చి రెండు నెలలే కదా అయింది. మళ్ళీ ఎలా వస్తారు?".. అనుమానం తీరక అడిగాడు సుబ్రహ్మణ్యం.
"అదంతే.. నాకు చూడాలని ఉంది. పావులు కదుపుతున్నాను కదా.. వాళ్ళు వచ్చేస్తారు."
ఫోన్ పెట్టేసాడు శివరామకృష్ణయ్య.
********
"వెన్నెల్లో పిండారపోసినట్లు, ఆ పిండితో చేగోడీలు చేసుకుతిన్నట్టు నీ ముఖం ఎంత కరకరలాడుతుంది.. సారీ.. కళకళలాడుతుంది. బాగుందా నా కవిత్వం.. లే.. తెల్లవారబోతుంది.”
"కిర్రు కిర్రు కాలి చెప్పుల్లా
కిసుక్కున నవ్వే నీ నవ్వు శబ్దం
టెంక లేని తాటి పండులా
పళ్ళు లేని నీ నోటి అందo''
“వహ్వా.. భలే కుదిరిందోయ్ ప్రాస.. కాత్యాయనీ నేను ఎన్ని కవితలు చదివినా నీకు మెలుకువ రాదేమిటి?''.. భార్యను లేపుతూ అన్నాడు శివరామకృష్ణయ్య.
అతను యవ్వనంలో శ్రీకృష్ణదేవరాయలు అంత దిట్ట. అన్ని పత్రికలు అవి బ్రతికినన్నాళ్లు అతని కవిత్వాన్ని ప్రచురించాయి.. తన ఫోటోనే కాకుండా భార్య కాత్యాయని ఫోటోతో సహా. అతని కవిత్వ గంధం లో కాస్తంత సుగంధం ఆమెకు కూడా అంటుకుంది... అలా వాళ్ల కవిత్వాలు ఆ ఇద్దరు ఫోటోలతో సహా మారుమోగిపోయేవి అప్పట్లో.. ఇదంతా మూడు పుష్కరాలు నాటి మాట. ఇప్పుడు అతనికి తొమ్మిదిపదులు ఆమెకు పది తక్కువ.
"లేచావా కూర్చో.. మన వాళ్ళందరినీ నీకు మళ్ళీ చూడాలని ఉందా?" ప్రశ్నించాడు.
"మీకు మాత్రం ఉండదా.. మీ ఆశ కాకపోతే వాళ్లు మళ్లీ ఇప్పుడు ఎలా వస్తారు?''
"ముందు నువ్వు మంచం దిగు.. కొంపతీసి నడుంకాని పట్టేసిందా మళ్లీ?''
"నేను చెప్తే విన్నారూ, ఆ అటక మీద పాతచింతకాయపచ్చడి జాడి గురించి మీరు శ్రమ పడటం కాకుండా నా చేత కూడా ఎక్సర్సైజులు చేయించారాయె. ఆ ముదనష్టపు జాడి మాట ఎలా ఉన్నా నా ఒళ్ళంతా నొప్పులు పట్టేసాయి.".. అంది కాత్యాయని నెమ్మదిగా క్రిందకు దిగుతూ.
"అది సరే కానీ ఎదురింటి అవతారం వచ్చాడా?.. ఖాళీ అయినప్పుడు వచ్చి అటక ఎక్కి చింతకాయ పచ్చడి జాడి కిందకు దింపుతానని మాట ఇచ్చాడు కదా."
"అతనికి అటక ఎక్కిన అవతారం అనే బిరుదు కూడా ఇస్తానని నమ్మబలికారు కదా."
"పచ్చడి జాడి కిందకి దింపుతాడని ఆశ పడి మాటిచ్చాను. ఆ ఆశ తీరకుండా నేను చస్తే మళ్లీ నిన్నే దెయ్యం అయిపోయి పీక్కుని తింటాను."
"అమ్మో ఇన్నాళ్లు పీక్కుతిన్నది చాలదూ!!'
"నీకేం తక్కువ చేశానోయ్''''
"అంతా తక్కువే.. చెప్పమంటారా.. పిల్లల్ని ఇంజనీర్లని చేశారు. కోడళ్ళు కూడా ఉద్యోగస్తులే. కూతుళ్ళని బ్యాంకు మేనేజర్లుగా చేశారు. బిజినెస్ మ్యాగ్నెట్లని అల్లుళ్ళుగా తెచ్చుకున్నారు. మనవలు కంప్యూటర్ మనుషులు అయిపోయారు. వాళ్ల పెళ్ళాళ్ళు కూడా జాబు హోల్డర్స్. అంతా బాగానే ఉంది నా బ్రతుకు మాత్రం ఇలా అయిపోయింది. చిన్నప్పుడు మా అమ్మగారు పెట్టిన వంటి రాయి పుడకని మూడురాళ్లు పుడకగా మార్చండి బాబోయ్ అంటే.. సుతారామూ వినిపించుకున్నారా?''
"దేనికైనా కాలం అంటూ ఒకటి కలిసి రావాలోయ్."
"మరే నాకు తెలియదు సుమండీ…”
"ఆ వెటకారం ఏంటి''
"మీ ఆశలన్నీ త్వర త్వరగా తీరిపోవాలి. లేకపోతే దయ్యమై పీక్కు తింటానంటున్నారు. నేను కోరుకునే దానికి మాత్రం కాలం అంటూ ఒకటి రావాలి అంటున్నారూ.. బాగుంది సంబడం'' భర్తతో సరదాగా పోట్లాడుతున్నట్టు అంది కాత్యాయని...
శివరామ కృష్ణయ్య సంతానం, వాళ్ళ వాళ్ల సంతానం.. అందరూ జంటలయ్యారు. అంతేకాకుండా వాళ్లంతా జంట నగరవాసుల కావడం విశేషం. అందరివి క్షణం తీరికలేని 5 అంకెల జీతాల ఉద్యోగాలే. ఏసీ బ్రతుకులు.. వాళ్ళందరికీ శివరామకృష్ణయ్య దంపతులంటే అభిమానమే.
ఎప్పటినుండో కాత్యాయని..
"పోనీ వాళ్లందరి దగ్గరికి వెళ్లి పోతే సరిపోతుంది కదా " అని భర్తతో అంటూ ఉండేది.
''నువ్వు వంద చెప్పు కాత్యాయని.. మీ అమ్మగారి ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న ఆ నల్లకావడి పెట్టె భూతంలా ఉంది భయమేస్తుంది దాన్ని అమ్మేస్తాను అంటే విన్నావా.. అదంటే నీకు అంత ప్రేమ మరి. అలాగే నాకు కూడా ఈ ఊరంటే అంత ప్రేమ... మన బ్రహ్మాండమైన చక్కని అంటే.. బీసీ బ్రతుకు వదిలి వాళ్ల.. ఏ. సీ. బ్రతుకులో ఇమడలేనోయ్."..
అంటూ ఆ ఆలోచన విరమింప చేసేవాడు.
ఇలా ఆ చిన్ని టౌన్ లో శివరామకృష్ణయ్య దంపతులు పాత జ్ఞాపకాల భవంతిలో ముసలి జంట గువ్వల్లా కాలం గడిపేస్తున్నారు. అదే వారికి ఇష్టంగా ఉంది. ఎవరు రమ్మన్నా వెళ్లరు వెళ్లిన ఉండలేరు.
"ముక్కుపుడక చేయించమన్నావుగా చేయిస్తాను. సరే ఆ టీపాయ్ మీద టాబ్లెట్లు ఉన్నాయి కాస్తంత తెచ్చి ఇస్తావా?''
"మీ ముక్కుపుడక కు ఒక దండం. నేను బలంగా ఉన్నాననుకుంటున్నారా? నా టాబ్లెట్లు బాక్స్ ముందు మీరు తెచ్చి ఇస్తే రెండు బిళ్ళలు మింగి మీ టాబ్లెట్లు తెచ్చి ఇవ్వగలను?''
"మా అమ్మ పెళ్లిరోజు నాడే అన్నది. ఒరేయ్ బడుద్దాయి.. ఈ పిల్ల వాలకం చూస్తుంటే నీ వార్ధక్యంలో నిన్ను సుఖ పెట్టేలా లేదురా అని. అన్నంత పని అయ్యింది. పోనీ ఆ మూలనున్న చేతి కర్ర తెచ్చి ఇస్తావు సహాయానికి."
"సింహద్వారం పక్కన నా చేతికర్ర ఉంది. అది కాస్త మీరు తెచ్చిస్తే.. ఆ మూడు కాళ్లతో వెళ్లి మీ మూడో కాలు తెచ్చి ఇవ్వగలను. సరే సరే ఎలాగోలా లేచి టీ కాచి ఇస్తాను. కాస్తంత గుటకేసి మీ పనులు మీరు చూసుకోండి బాబు.".. అంది చిరు చిరాగ్గా కాత్యాయని.
"నీకేo తెలుసు జీవితం అంటే దానికి కాచి వడబోసిన వాడిని."
"రోజు టీ కాఫీలు కాచి వడబోస్తూనే ఉన్నాను మీ కన్నా నేను ఏం తక్కువ కాదు."
"నీ సతాయింపు ఆపి కావలసిన కార్యక్రమం గురించి ఆలోచించరాదూ."
"మీరనేది అటక మీద పాతచింతకాయ పచ్చడిజాడి విషయమే కదా. అసలు ఆ జాడీకి మన వాళ్ళందరూ ఇక్కడకు రావడానికి దగ్గర సంబంధం ఏమిటి అంట" చిత్రంగా ముఖం పెట్టి ప్రశ్నించింది.
"కథ.. క్లైమాక్స్ లో అర్థమవుతుందిలే. మరీ అంత తెలివి తక్కువ వాడిని అనుకోకు."
****
అటక మీద ఉన్న పాత చింతకాయ పచ్చడి జాడి క్రిందకు దింపడం కోసం వారం రోజులుగా ప్రయత్నిస్తున్నారు ఆ వృద్ధ దంపతులు. పాత చింతకాయ పచ్చడి పెడితే తాను కూడా రుచి చూడొచ్చు అన్న ఆశతో పాలుపోసే పోతురాజు నిచ్చెన ఎక్కబోయి నిచ్చెన కాలే కాదు, తన కాలు కూడా ఇరగొట్టుకున్నాడు. బట్టలు ఉతికే అప్పిగాడు అతి కష్టం మీద అటక ఎక్కేసి.. తేలు కుట్టింది బాబోయ్.. అని క్రిందపడ్డాడు. అతని నడుమూ విరిగింది. ఆ నడుము కింద పడ్డ ఆ తేలు నడుమూ విరిగింది.
ఫోన్ రింగ్ అయ్యింది. శివరామకృష్ణయ్య రిసీవర్ అందుకున్నాడు.
"హలో శివరామకృష్ణయ్య.. నేను రా.. సుబ్రహ్మణ్యాన్ని. నేను ఎంత ఆలోచించినా అటక మీద ఆ చింతకాయ పచ్చడి జాడీకీ మీ పటాలమంతా జంటనగరాల నుండి దిగిరావడానికి లింకు కనిపించడం లేదు. ఏమిటి కథ.. ఎందుకు ఈ సస్పెన్స్. "అడిగాడు సుబ్రహ్మణ్యం.
"ఎవరు మాట్లాడేది. సారీ.. ఇది శివరామకృష్ణయ్యగారి ఇల్లు కాదు రాంగ్ నెంబర్. " రిసీవర్ కింద పెట్టేశాడు శివరామకృష్ణయ్య.
"పాయింట్ లీకు చేద్దామని ప్రయత్నిస్తున్నాడు. నేను లీక్ అవనిస్తానా?''
"ఇంతకీ ఎవరిది ఆ ఫోను."
"ఎవడో ఏబ్రాసి సుబ్రహ్మణ్యం అంట."
"అయ్యో.. అయ్యో.. వరుసకు మా అన్నయ్య కదా అతను... మన సుబ్రహ్మణ్యమే''
"ఎవడో ఒకడు.. అనవసరమైన కూపీ లాగాలని ప్రయత్నిస్తే రాంగ్ నెంబరే."
"సర్లేండి నాకెందుకు. ఇంతకీ ఆ జాడీలో చింతకాయ పచ్చడి ఎన్ని సంవత్సరాల క్రితానిదట. ఎప్పుడు దాచారు. నాకు అసలు గుర్తులేదు''.
''నీకు పెళ్లి అవ్వని క్రితం మా తాతల కాలం నాటిది. నీకు ఇష్టం లేకపోతే తినడం మానేయి''.
"నాకు ఖాళీ జాడి ఇచ్చేసారనుకోండి.. అందులో ఉప్పు వేసుకుందామని."
"అది సరే కానీ కాత్యాయని.. మనిద్దరం మోడ్రన్ డ్రెస్సులో ఫోటో దిగడం గురించి ఏం ఆలోచించావు."
"ముందు పాతచింతకాయపచ్చడి జాడి అన్నారు..
ఇప్పుడేమో మోడ్రన్ డ్రెస్సు అంటున్నారు. చిన్నపిల్ల వాడిలా ఏమిటి ఆ కోరికలు. ఫోటోకు నేను రెడీ అనుకోండి..
మీరైతే పౌడర్ పూసుకుంటారు, కట్టుడు పళ్ళు తగిలించుకుంటారు, జోళ్ళు తుడుచుకుంటారు, తెల్ల వెంట్రుకలకు నల్ల రంగు రుద్దుతారు.. నాదేం పోతుంది గనుక. ఫోటో లో నేను ముసలిదానిగా కనపడి మీరు పడుచు కుర్రాడిలా కనపడితే చూసిన వాళ్లు నవ్విపోరూ."
"దాందేముంది.. నిన్ను పనిమనిషి తల్లివి.. అని చెప్తాలే. '... శివరామకృష్ణయ్య అలా అనడంతో కాత్యాయని మూతి ముడుచుకుంది.
శివరామకృష్ణయ్య అదే అటక మీద పాత ట్రంకు పెట్టిలో దాచిన పాత మోడల్ బట్టలతో సరదా ఫోటో తీయించుకోవాలని అతని ఉద్దేశం. ఎవరైనా పచ్చడి జాడి కోసం అటక ఎక్కితే దానితోపాటు ఈ ట్రంకు పెట్టిన కూడా క్రిందకు దింపించుకోవచ్చు అన్నది అతని అభిప్రాయం.
అది దృష్టిలో పెట్టుకునే తన ఫ్రెండ్ అబ్బిరాజు స్టూడియో లో పురమాయించాడు.. చాకులా బాగా పొడుగ్గా ఉండి.. ఫోటోలు బాగా తీసే వాడిని పంపమని.
ఆ అబ్బాయి వచ్చే టైం అయింది. అతను వచ్చాక ఎలాగోలాగా ఒప్పించి ముందు అటక ఎక్కించి ఈశాన్యం మూలన దాచిన పొడుగు ఫ్యాంటు, కురుస కాలరు షర్టు తనేసుకుని.. తనకు పెళ్లి అయిన కొత్తలో కాత్యాయని వేసుకుని వదిలేసిన లంగాఓణి బుట్ట చేతుల జాకెట్టు ఆమెచే ధరింపజేసి సరదాగా ఫోటో తీయించుకుని రోజు దాన్ని చూసుకుంటూ పాత జ్ఞాపకాల ఆనందాన్ని అనుభవిం చాలని... అదో చిలిపి కోరిక శివరామకృష్ణయ్యది. ఆ తీసిన ఫోటో సీక్రెట్ గా ఉంచుతాను అని భర్త మాట ఇవ్వడంతో తను కూడా రెడీ అంది కాత్యాయని ఫోటోకి.
శివరామకృష్ణయ్య స్నానం చేసి వచ్చేసరికి అబ్బిరాజు పంపిన ఫోటోఅబ్బాయి వీధిలో రెడీగా ఉన్నాడు.
"నిన్నేనా మా అబ్బిరాజు గాడు పంపింది.. నీ పేరేంటి?''
"సత్తిపండు."
"ఏడ్చినట్టు ఉంది. మామిడిపండు.. వెలగపండు.. అరటిపండు.. మరి ఈ సత్తిపండు ఏ చెట్టుకి పండు తుంది అబ్బాయ్. కొందరు పెద్దవాళ్ళకి బుద్ధులు ఉండవు అనడానికి ఇదే సాక్ష్యం. ఆలోచించి పెట్టాలి పేరు. ఆనందం అనో.. సంతోషం అనో పెట్టొచ్చు కదా. సరే మా అబ్బిరాజు గాడు.. ఆ వెధవ.. అదేనయ్యా ఏమవుతాడేంటి నీకు?.."
"మీ వెధవాoడి.. నాకు గురువవుతాడండి."
"అయ్యో అయ్యో నువ్వు కూడా వెధవా అని అంటావేంటి గౌరవం లేకుండా."
"అలాగంటేనే మీకు అర్థమవుతుందేమోనని....."
"సరే ఆ అప్రాచ్యుడు ఏం చెప్పాడేంటి నీకు??''
"మీరు చెప్పినట్టే నన్ను చేయమన్నారండి'
"అదిగది.. నేను చెప్పానులే వాడికి. నువ్వు వెళ్లేట ప్పుడు నీ చేతికి పాతచింతకాయ పచ్చడి ఇచ్చి పంపుతాననిి. ఆ వెధవ చింతకాయ పచ్చడి పెడతాను.. అంటే పెళ్ళాన్ని కూడా అమ్మేస్తాడు. అంత ఇష్టం వాడికి... ముందు ఆ ఎత్తుపీట మీద ఈ ముక్కాలు పీట వేసుకుని అటక ఎక్కుతావ''
అంతే.. ఆ అబ్బాయి ఎత్తుపీట మీద చిన్నపీట వేసుకుని జంపు చేసి అటక ఎక్కేశాడు. బ్యాటరీలైట్ సహాయంతో జాడీ వెతికాడు అదెక్కడ కనిపించలేదు.
"సత్తిపండు.. మా ఎదురింటి అవతారానికి అదృష్టం లేదు. అతనికిద్దామనుకున్నాను అటకెక్కిన అవతారం అనే బిరుదు.. ఇప్పుడు నీకు ఇస్తున్నాను అటక ఎక్కిన సత్తిపండు బిరుదు.. ఇదిగో అందుకో. పచ్చడి సువాసన మధురంగా ఉందా.. తొందరపడి నోట్లో వేసుకోకేే. క్రిందకు దించాక నీకు కొంచెం పెడతానని మాట ఇచ్చేగా'' అంటూ శివరామకృష్ణయ్య క్రింద నుండి డైరెక్షన్ ఇస్తున్న.. జాడి జాడ తెలుసుకోలేకపోయాడు సత్తిపండు.
"సరే.. పచ్చడి అంతా ఎలుకలు తినేసి ఉంటాయేమో''. శివరామకృష్ణయ్య తనే సర్ది చెప్పాడు.
"అవును కానీ జాడీ కనపడడం లేదంటున్నాడు. జాడీని కూడా ఎలుకలు తినేసి ఉంటాయంటారా?'' లోపల నుండి వస్తూ అంది కాత్యాయని.
హైటెక్ యుగం. ఎలుకలు తినేసిన తినేసి ఉండొచ్చు. సత్తిపండు.. జాడి తీరిగ్గా వెతికించి మీకు అందరికీ పచ్చడి పంపుతాను కానీ.. ఎలాగూ ఎక్కావు కనుక ఓ చిన్న పని చేసి పెడుతూ. అదిగో ఆ తూర్పు వైపు ఈశాన్యం మూలన.. కొంచెం దూరంగా చూడు ఆ చీకట్లో దెయ్యంలా నల్ల ట్రంకు పెట్టె కనిపించడం లేదూ... దాన్ని పట్టుకుని వచ్చేయ్'''
అంతే అతి కష్టం మీద సత్తిపండు ఆ పెట్టుతో సహా అటక దిగాడు. "పాత చింతకాయపచ్చడి అటక అటక అంటూ ఎక్కించారు.. చివరికి పాత ట్రంకు పెట్టుతో దింపించారు.. " చిరాకుపడ్డాడు సత్తిపండు.
"ఇదిగో అబ్బాయి మాలాంటి పెద్ద వాళ్ళందరినీ నీలాంటి కుర్రకుంకలు ఇలాగే అపార్థం చేసుకుంటారు ముందు.. అర్థం అయ్యాక సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తారు. గోచి పెట్టుకోవడం తెలియని కూర్మాపురం కుర్రోడు లాంటోడివి నీకు ఇది అర్థం కాదులే."
చివరికి శివరామకృష్ణయ్య దంపతులు ఆ పాత బట్టలు వేసుకొని రెడీ అయ్యారు. సత్తిపండుకి చాలా కోపం వచ్చింది వాళ్ళ డ్రస్ చూసి. తన గురువు అలాంటి ఫోటో తీస్తే కోప్పడతాడేమోనని అనుమానించాడు. శివరామకృష్ణయ్యకు అతని పరిస్థితి అర్థమైంది.
"చూడు సత్తిపండు ఈ ఫోటో చాలా సీక్రెట్.. నీకు నాకు మా ఆవిడకు తప్పించి ఏడో కంటికి తెలియ కూడదు. ఇంకో మాట జాగ్రత్తగా విను.. మీ పక్క వీధిలో ఉన్న శ్రీ కౌముదిపేపర్ ఎడిటర్. అతను నాకు మీ గురువుకి ప్రాణ స్నేహితుడు. రాష్ట్రమంతా పెద్ద సర్కులేషన్ పత్రిక అది. ఆ పత్రిక ఎడిటర్ కి మాత్రం నువ్వు ఈ ఫోటోని చచ్చినా కనపడనివ్వకు.".. చెప్తున్నాడు శివరామకృష్ణయ్య.
"మళ్లీ ఇంకో మలుపు తిప్పారు.. బుర్ర పగిలిపోతుంది సారూ " అన్నాడు సత్తిపండు.
"వస్తున్నా వస్తున్నా పాయింటు కరెక్ట్ గానే ఉంది.. నేను ఊసుపోని కాకమ్మ కథ చెప్పడం లేదు. నీకే అర్థమయ్యే ఏడుస్తుందిలే చివర్లో. సరే.. అసలు విషయం ఏమిటoటే ఆ ఎడిటర్ ఇలాంటి గమ్మత్తైన ఫోటోలు అన్నీ సేకరించి తన పేపర్లో తీపి గుర్తు శీర్షికలో వేస్తుంటాడు. ఇలాంటి ఫోటోలు ఇచ్చిన వాళ్లకే వెయ్యి రూపాయలు.. వినబడుతుందా.. అక్షరాల వెయ్యి రూపాయలు బహుమతి ఇస్తుంటాడు.
ఆ ఫోటో అతని పేపర్లో పడితే సర్కులేషన్ పెరిగిపో తుందన్నమాట. వింటున్నావా గొప్ప బిజినెస్ టెక్నిక్. నీకు తెలియదులే.. నిడదవోలు గేదెలపాలు పితికే కుర్రాడు వయసు నీది." సత్తిపండు వైపు వారగా చూస్తూ అన్నాడు శివరామకృష్ణయ్య.
"అమ్మో ఫోటో ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తాడా!".. ఆశ్చర్యపడ్డాడు తనలోనే సత్తిపండు.
"ఇదిగో ఆ వెయ్యి రూపాయలు కొట్టేయాలను కుంటున్నావా.. నీ ముఖం వాలకం చూస్తుంటే అలాగే చేస్తావనిపిస్తుంది... ఏది అలాంటి ఉద్దేశం నీకు లేదని నా కళ్ళలోకి చూసి చెప్ప.."
"అబ్బే.. నేనెందుకు చేస్తానండి.. చచ్చిన అలాంటి పని చేయను. " మొఖం అడ్డంగా తిప్పుతూ అన్నాడు సత్తిపండు.
"చచ్చాక నువ్వేంచేస్తావు.. ఏదైనా చేస్తే బ్రతికుండగానే చేయాలి. సత్తిపండు.. పోనీ నువ్వు ఫోటో ఆ ఎడిటర్ గారికి ఇచ్చిన పర్వాలేదు.. ఈ ఫోటో చిరాకుదంపతులది అని మాత్రం చెప్పకు."
"చిరాకుదంపతులు అంటే.. " అమాయకంగా అడిగాడు సత్తిపండు.
"అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్.. నా పేరు షార్టు కట్టులో.... శి.. రా.. కృ.. నా కవిత ఖండికలలో ఈ షార్ట్ కట్టు పేరుని శ్రీ కౌముది పేపర్ అతను తరచూ వేసేవాడు. రాను రాను నీలాంటి నోరు తిరగని కాకి ముక్కు రకం వెధవల వల్ల ఆ అందమైన పేరు కాస్త.. ' చిరాకు.. చిరాకు దంపతులు'.. గా రూపం మారిపోయి పెద్ద ప్రాచుర్యం పొందింది. ఇదంతా ఆ ఎడిటర్ కి గుర్తు చేసి మా ఫోటో అతనికిచ్చేసి అతనిచ్చే వెయ్యి రూపాయలు కొట్టే ద్దామని కచ్చితంగా నీ మనసులో తీర్మానం చేసు
కున్నట్టు కనిపిస్తున్నావు. బాబ్బాబు అలా చేయకే" శివరామకృష్ణయ్య బ్రతిమలాడాడు.
"అంత గొప్పవారా.. మీ పరువు నేనెందుకు తీస్తాను సార్. ఈ ఫోటో మీ తీపి వగరు కారం చేదు పులుపు.. వగైరా గుర్తు అని నాకు తెలుసు కదా."
"హమ్మయ్య... సత్తిపండు.. అసలు ఆ ఎడిటర్ నీకు తెలుసా''..
"తెలుసండీ.. సత్యనారాయణగారు.. వాడ్రేవు వారి వీధి. మా వీధి చివర.. ప్రతిరోజు తెల్లవారకుండా కబుర్లాడుకుంటూ చెరో చెంబుడు నీళ్లతో ఊరవతల ద్రాక్షారామం మైలురాయి దగ్గరకి కలిసే వెళ్తాం మేమిద్దరం."... చెప్పాడు సత్తిపండు.
"అతను ఫోటో ఎవరికి ఇవ్వనంటున్నాడు కదా. పాపం టైం వేస్ట్.. ఎందుకు అబ్బాయిని అలా సతాయిస్తారు. ఇదిగో నేను లంగావోణి బుట్టచేతులు జాకెట్టు వేసుకున్నాను. మీరు పొడుగు గొట్టం ప్యాంటు షర్టు వేసుకున్నరాయే. పాత జ్ఞాపకాలు ముసిరేస్తు న్నాయి.. మీరిలా వచ్చి నిలబడండి. ఫోటో అబ్బాయి త్వరగా స్విచ్ నొక్కు నాయనా.".. కంగారు పెట్టింది కాత్యాయని. దాంతో సత్తిపండు చాలా కష్టపడి చిరాకు చెత్త ఫోజులుతో ఒక ఫోటో తీసి వెళ్లబోయి వెనక్కి వచ్చాడు.
"చిరాకుగారూ... మరచిపోయాను ఆ ఎడిటర్ గారికి మీ ఫోటో ఇస్తే డబ్బులు వెయ్యి కన్నా ఎక్కువ ఇవ్వడా..” అంటూ ఆత్రుతగా అడిగాడు.
"ఫోటో అతనికి నచ్చింది అనుకో.. డిమాండ్ చేస్తే రెండు వేలు ఇవ్వవచ్చు. అతనికి లాభం ఏమిటి అంటే సర్కులేషన్ పెరగడమే కాదు ఫోటో అవార్డులకు పంపి బోలెడు డబ్బు సంపాదిస్తాడు. ఇంతకీ నువ్వు ఇదే ప్లాన్ లో ఉన్నావా?''.. అనుమానం గా అడిగాడు శివరామకృష్ణయ్య.
"అబ్బబ్బ.. మీరు నిశ్చింతగా ఉండండి చిరాకుగారు.. నేను పెద్దాపురం పర్ఫెక్ట్ పడుచు కుర్రాడు లాంటి వాడిని. ఇప్పుడు మీరు నాకు చెప్పినదంతా మరిచిపోండి మీరు నాకేం చెప్పలేదు. ఆ ఎడిటర్.. ఆ రెండు వేలు అంతా మాయ. జగమే మాయ.. ఒక కల" అనుకుంటూ వెళ్లిపోయాడు సత్తి పండు.
**********
ఆ మర్నాడు.. ఫోన్ మోగింది రిసీవర్ అందుకున్నాడు శివరామకృష్ణయ్య.
"రిసీవర్ పట్టుకున్నది చిరాకుగాడేనా..’ ఫోన్ చేసిన వ్యక్తి ప్రశ్నించాడు.
"అవునురా శివరామకృష్ణయ్యనే. మాట్లాడేది సుబ్రహ్మణ్యం అని గుర్తుపట్టాను కూడా... ఏంటి విషయం ఇంత పొద్దుటే ఫోన్ చేశావు?'''
"ఏరా నీకు మతి పోతుందా.. నువ్వు వెధవ వేషాలు వేసేది కాకుండా మా చెల్లెమ్మ చేత కూడా పిచ్చివేషాలు
వేయిస్తున్నావన్నమాట. ఇప్పుడే పేపర్ చూశాను. చి చి ఆ పిచ్చి ఫోటోలు ఏమిటి.. ఉండు వస్తున్నాను వచ్చి డైరెక్ట్ గా తిడతాను. " అంటూ సుబ్రహ్మణ్యం రిసీవర్ పెట్టేసాడు.
సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని నిమిషం నిమిషం కష్టంగా గడుపుతున్నారు.. ఆ వృద్ధ దంప తులు ఇద్దరూ. సాయంత్రం ఏమవుతుందో వాళ్లకు తెలుసు.. ఆ సమయం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
సాయంత్రం అయ్యింది.. నాలుగు మారుతి కార్లు స్పీడుగా వచ్చి శివరామకృష్ణయ్య ఇంటి ముందు ఆగాయి. ఆ కార్లలోంచి తమ తమ సంతానo ఆసంతానo యొక్క సంతానం అందరూ శ్రీ కౌముది న్యూస్ పేపర్లు చేతితో పట్టుకొని కోపంగా దిగడం శివరామకృష్ణయ్య గమనించి సీన్ అర్థం అయిపోయి వీధిలో మెట్ల మీదే కూర్చుని చూస్తున్నాడు.. ఆనం దంగా. కాత్యాయని గుమ్మం పట్టుకొని నవ్వుతూ నిలబడుతూ ఉంది.
అందరూ కలిసి ఇంటి లోపలికి వచ్చారు.
"ఇలాంటి తలతిక్క ఫోటోలు న్యూస్ పేపర్ లో పడటం వల్ల తమ పరువు పోతుందని ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయవద్ద”ని చీవాట్లు వార్నింగులు లాంటివి గంటసేపు కడుపునిండా పెట్టారు ఆ దంపతులు ఇద్దరికీ వచ్చిన వాళ్ళు అందరూ. వాటితోపాటు వాళ్లు తెచ్చిన స్వీట్లు హాట్లు పళ్ళు పూర్తిగా లాగిన్ చేశారు ఆ దంపతులు.. అంతేకాకుండా వాళ్ళందరినీ పూర్తిగా తనివి తీరా చూసుకుంటూ పెద్దల్ని దీవిస్తూ పిల్లల్ని ముద్దాడుకుంటూ గడిపేశారు.. మహాఆనందంగా. ఆ రాత్రంతా వచ్చిన వాళ్ళందరితో చాలాసేపు తనివి తీరా మాట్లాడుకున్నారు ఆ దంపతులు. తెల్లవారుతుండగా వాళ్ళిద్దరి దగ్గర సెలవు తీసుకుని వచ్చిన మారుతీ కారులన్నీ కదలి వెళ్ళిపోయాయి జంట నగరాల వైపు.
''మనం తిరగలేమని తిరిగినా వీళ్లంతా ఒకచోట కనిపించరని, వీళ్ళందర్నీ ఇక్కడకు రప్పించడం కోస ప్లాను వేసి మీ కోరిక తీర్చుకున్నారు తనివి తీరా చూసుకొని తాదాత్మ్యం పొందారు. రెండు నెలల క్రితం వీళ్లందరినీ చూడాలని ఆశపడి నాకు అప్పుడు ఒంట్లో బాగుండలేదని నాటకం ఆడింప చేసి వీళ్ళందర్నీ ఇలాగే రప్పించారు.. ఇక ఇప్పుడు ఈ ఫోటో ప్లాన్ కూడా బాగానే వేశారు. " వాళ్లంతా వెళ్ళిపోయాక భర్తను పొగిడింది కాత్యాయని.
"నువ్వు మాత్రం ఆ చిన్న పిల్లలతో ఆడుతూ ఆ పెద్దవాళ్లతో తిరుగుతూ ఎంత ఆనందించావో నేను గమనించాను. గుండె నిండా ఎంతో సంబరాన్ని నింపుకొని చిన్నపిల్లవై పోయావు. ఇలాంటి ఆనం దకరమైన సందర్భాలు చాలు మనం ఇంకో ఆరు నెలలు ఆనందంగా గడిపేయడానికి. కాటికి కాలు చాపిన మనకు వీళ్ళందరి రాకతో మళ్ళీ యవ్వనం వచ్చేసినట్టు ఉంది కదూ. " అన్నాడు మహదా నందభరితంగా శివరామకృష్ణయ్య.
"ఇంతకీ అటక మీద ఆ పాతచింతకాయపచ్చడి విషయం ఏమిటండీ. " అనుమానం తీరక అడిగింది కాత్యాయని.
"అదా.. పాత బట్టలు అటక మీద ఉన్నాయి.. అటక ఎక్కి ఆ ట్రంకు పెట్టి క్రిందకు దింపండి.. అని ఎవరితో చెప్పినా మన మాట వినరు. అందుకనే ఇలా పచ్చడి వంక పెట్టాను. పాత చింతకాయ పచ్చడి ఆశ పెడితేనే కదా మా అబ్బిరాజు గాడు ఫోటో సత్తిపండు ని పంపించింది. వాడొస్తేనే కదా అటక మీద ట్రంకు పెట్టి కాస్త క్రిందకు దిగింది. అందులోని పాత బట్టలు వేసుకుంటేనే కదా మన వాళ్లకు తిక్కరేగే ఫోటో తీసుకోగలిగింది. ఆ ఫోటో వస్తేనే కదా న్యూస్ పేపర్లో తీపి గుర్తు శీర్షికలో పడింది. అలా పడితేనే కదా.. అది చూచి కోపమొచ్చి మన వాళ్ళందరూ చీమలదండులా వచ్చింది.
వాళ్లు సరదా పడే మంచి ఫోటో అయితే ఇలా వస్తారా? చాలా కోపం వస్తేనే కదా మనల్ని తిట్టడా నికైనా వాళ్లంతా వచ్చి తీర్తారు. ఎంతసేపు ఉన్న పర్వాలేదు.. ఎలాగోలా వాళ్ళంతా రావడమే నాకు కావలసింది. వాళ్లందరినీ కళ్ళ నిండా మరోమారు చూసుకోవాలన్న నా ఆశ తీరింది. " యుద్ధంలో విజయం సాధించిన వీరుడులా మాట్లాడాడు శివరామ కృష్ణయ్య.
"అందరూ ఒకే చోట ఉంటే ఎంత ఆనందం.. కానీ ఎలా కుదురుతుంది. ఈ కంప్యూటర్ యుగంలో బంధాలు,
అనుబంధాలు కాలగమనoలో అటకెక్కకుండా కుదు రుతుందా?''... భర్త వైపు నవ్వుతూ చూస్తూ అంది కాత్యాయని.
"అందుకనే మన అటక ఎక్కిన ఆనందాన్ని ఓ రెండు నెలల్లో మరోమారు క్రిందకు దింపే ప్లాన్ సిద్ధం చేస్తున్నాను.".. అన్నాడు శివరామకృష్ణయ్య భార్య వైపు చిలిపిగా చూస్తూ.
''ఈసారి డైరెక్షన్ నాది.".. అంది కాత్యాయని.
వృద్ధ దంపతులు ఇద్దరు నవ్వుకున్నారు మనసారా.
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Bhagavathula Bharathi
•4 hours ago
పాత చింతకాయ పచ్చడి 😅 చాలా బాగుంది అండీ