పట్టువీడని పట్నం పిల్ల
- Dr. Brinda M. N.
- Jun 19
- 3 min read
#PattuVeedaniPatnamPilla, #పట్టువీడనిపట్నంపిల్ల, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Pattu Veedani Patnam Pilla - New Telugu Story Written By Dr. Brinda M N
Published In manatelugukathalu.com On 19/06/2025
పట్టువీడని పట్నం పిల్ల - తెలుగు కథ
రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.
ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అనార్కలి చిన్నప్పటినుండి చదువులో బాగా రాణించేది. తండ్రి దర్జీ పని చేస్తూ ముగ్గురు ఆడపిల్లలను కష్టపడి చదివించేవాడు. అనార్కలి ఆరోగ్యం అంతంత మాత్రముగానే ఉండేది, ఎప్పుడూ ఏదో ఒక అలర్జీతో బాధపడుతూ కళాశాలలో అప్పుడప్పుడు తరగతులకు హాజరవుతూ ఉండేది. ఒకసారి తన స్నేహితురాలు యామిని అప్పుడే బదిలీపై వచ్చిన కొత్త ప్రొఫెసర్ కౌముది గురించి చెప్పి హాజరు పట్టికలో పేర్లు ఉన్నవారినందరినీ తరగతులకు కచ్చితంగా రమ్మని చెప్పింది. కావున ఎల్లుండి సోమవారం నుండి నువ్వు రావాల్సిందే అంది.
అనార్కలి, "సరే, ఇన్నేళ్ళలో ఇంత మంచివారి గురించి, అందునా పిల్లల పట్ల అత్యంత శ్రద్ధ చూపిన వారిని చూడడం అరుదు, నేను తరగతికి హాజరవుతాను” అంది.
నెల రోజులపాటు తరగతి గదిలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులందరూ హాజరవడం, కౌముది బోధనలో క్రొత్త మెలకువలు, వాక్చాతుర్యం, సబ్జెక్టుపై ఔపాసన పట్టడానికి సులభ పద్ధతులు, ప్రయోగశాలలోని పరికరాలపై పట్టు సాధించడం, పిల్లల పట్ల తనకున్న మమకారం, ఆప్యాయత, అంతకుమించి బాధ్యత, ఇవన్నీ వెరసి అనార్కలికే కాక ఎంతోమందికి రోల్ మోడల్ అయింది కౌముది.
అప్పటినుండి అనార్కలి తరచూ కౌముదిని సంప్రదిస్తూ తనకున్న శంకలను నివృత్తి చేసుకునేది. కౌముది కూడా తన కుటుంబ పరిస్థితులను తెలుసుకుంటూ ప్రత్యేక తర్ఫీదునిచ్చేది. అలా అనార్కలి డిగ్రీలో కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రథమురాలిగా నిలిచింది.
"అనార్కలి, నువ్వు కచ్చితంగా పీజీ చేయాలి. "
"లేదు మేడం, మా నాన్నగారు చదివింది చాలు, పెళ్లి చేసి పంపిస్తాను అన్నారు."
తర్వాత వారి తండ్రి అయూబ్ గారితో కౌముది ఇలా అంది,
"పాప మంచి తెలివైన పిల్ల, కష్టపడి చదువుతోంది. ఉన్నత విద్యకు చేర్పించండి. దేనికైనా పట్టువిడుపులు ఉన్నప్పుడే భవిష్యత్తు బాగుంటుందని, " పరిపరి విధాల వారి తండ్రిని ఒప్పించింది.
ఇంకేముంది అనార్కలి పీ. జీలో అడుగిడిగింది రెండు సెమిస్టర్లు అయిపోయాయి. మూడవ సెమిస్టర్లో అనార్కలి హాజరు 30 శాతానికి పడిపోవడంతో కౌముది మందలించింది.
భోరున ఏడుస్తూ, "మేడం, మా నాన్నగారు బ్యాంకు ఉద్యోగమే నీకు ముఖ్యం, దానికి చదువు చదువు అని ప్రతి నిమిషం వేధిస్తున్నారు. నేనేమో పీ. జీ పైన శ్రద్ధ పెట్టలేక పోతున్నాను. మెదడు మందగించి పిచ్చిపిచ్చిగా అయిపోతుంది. ఈ బాధకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. తిండి, నిద్ర సరిగా లేదు. మేడం, మీరు అనుమతిస్తే నేను ఈ కోర్సు విరమించుకుంటాను అంది. " అనార్కలి.
"చూడమ్మా! జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు ఎదురొడ్డి, ధైర్యంతో పోరాడి తమ కాళ్ళ పైన తాము నిలబడి మార్గదర్శకంగా ఉండగలగాలి. ఆత్మహత్య చేసుకోవడానికే అయితే పుట్టడం దేనికమ్మా?, అది వ్యర్థం” అని,
వారి తల్లి అమీషా గారిని పిలిపించి, "తల్లిగా మీ పాపకు అండగా ఉండి, ధైర్యం చెప్పి ముందుకు ప్రోత్సహించండి. సంసారంలో పట్టువిడుపులు సహజమే కదా! మీకు తెలియంది ఏముంది?" అని హితబోధ చేసి పంపింది కౌముది.
ఇలా అనార్కలిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అడుగడుగునా, శారీరక మానసిక బలాలను ధృడ పరుచుకునే విధానాలను దగ్గరగా ఉండి నేర్పింది, వెన్నుతట్టి ప్రోత్సహించింది కౌముది. తత్ఫలితంగా పీ. జీలో కూడా విశ్వవిద్యాలయ, జిల్లా స్థాయిలో అనార్కలి ప్రథమురాలిగా నిలచి, ప్రతిభా పురస్కారం, పదివేల రూపాయల లాప్టాప్, బంగారు పతకం సాధించింది అనార్కలి.
"అమ్మా, అనార్కలి! ఇదే ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో ముందుకెళ్ళు, కష్టపడి బ్యాంకు ఉద్యోగానికై చదువు. విజయం నీదే. "
కౌముది ఇచ్చిన ఆనందకర ప్రోత్సాహంతో, అత్యంత ఉత్సాహంతో కష్టపడి చదివి స్టేట్ బ్యాంకులో క్లర్క్ గా స్థిరపడి, ఇంటి ఇల్లాలై, పిల్లలకు తల్లై, తండ్రి యొక్క సుదీర్ఘ కలను సాకారం చేసి భవిష్యత్తును బంగారుమయం చేసుకుంది అనార్కలి.
కౌముది ఎప్పుడైనా బ్యాంకు పని మీద అలా వెళ్ళినప్పుడు అనార్కలిని తప్పక కలిసి, మంచి మాటా తెలుసుకుని, పలకరించి వచ్చేది, అంతే కాకుండా, "పట్టువీడని పట్నం పిల్లా, ఎలా ఉన్నావు? పట్టులోని పొట్టును పట్టుకుని పిప్పి పిప్పి పీల్చి పడేశావు కదూ, " అంటూ హాస్యంగా చమత్కరించేది కౌముది.
"మేడమ్, అంతా మీ మంచితనం, మాట చలువ, నిజాయితీగా మీరిచ్చే శిక్షణ మాకు లభించిన అరుదైన వరాలు మేడమ్, ఎప్పటికీ మరచిపోలేనివి" అంటూ తల్లి చాటున పిల్లలా వాలిపోయింది అనార్కలి, కౌముది భుజాలపై.
గుర్తొచ్చినప్పుడల్లా తన సంసార జీవితంలో కూడా కౌముది మేడమ్ తెలిపిన పట్టువిడుపులను క్రమం తప్పక పాటిస్తూ ఆనంద సాగరంలో ఓలలాడుతూంది అనార్కలి.
సందేశం: లక్ష్యంపై దృష్టి పెట్టే లక్షణాన్ని అలవర్చుకుని సాధించడం ఉత్తమోత్తమం.
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
సమాప్తం
డాక్టర్ బృంద ఎం. ఎన్. గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.
కవయిత్రి, రచయిత్రి, గాయని,
స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి
15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట
భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.




Comments