top of page
Writer's pictureKotthapalli Udayababu

పెరటి చెట్టుపై వాలిన పక్షి


'Perati Chettupai Valina Pakshi' New Telugu Story


Written By Kotthapalli Udayababu


రచన : కొత్తపల్లి ఉదయబాబు


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)



కోదండం గారు అన్న మాటలకి ఆంజనేయులు తలవంచుకున్నాడు.


" తప్పు నాదే సార్. నన్ను క్షమించండి. చేతులారా నా పరీక్ష నేనే పోగొట్టుకున్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ఈసారి తప్పనిసరిగా పరీక్ష పాస్ అవుతాను. పదవతరగతి పాస్ సర్టిఫికెట్ వస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సర్. నాయందు దయవుంచి నాకు ఈ ఒక్కసారి లెక్కలు చెప్పండి సర్" అన్నాడు రుద్ధమైన కంఠంతో.


"చూడు ఆంజనేయులు. ఇన్స్టంట్ పరీక్షకు కేవలం రెండు నెలలే సమయం ఉంది. సంవత్సరమంతా చదవలేనివాడివి ఈ రెండు నెలలలో చదివి ప్యాసవగలవా?"


"ఖచ్చితంగా పాసయేలా కృషి చేస్తాను సర్. మీరు ఇచ్చే ఈ అవకాశాన్ని పాడు చేసుకోను. నా మీద దయ ఉంచండి సర్ "


"సరే. నువ్వు రోజు ఉదయంమే వచ్చి లెక్కలు నేర్చుకోవాలి. నేను చెప్పినట్టుగా విని ఆచరిస్తే నువ్వు తప్పనిసరిగా 60 మార్కులతో పాస్ అవుతావ్.. కేవలం నీకోసం ఒప్పుకుంటున్నాను. ఫీజు 500. బాగా ఆలోచించుకో"


"సార్. ఒక్కసారి గా అంత ఫీజు ఇచ్చుకోలేను. కానీ పరీక్షకు వెళ్లబోయే లోపుగా తప్పనిసరిగా మీ ఫీజు మొత్తం చెల్లిస్తాను. ఈ వంద అడ్వాన్స్ గా ఉంచండి సర్. ''అంటూ వందనోటు ఇవ్వబోయాడు వినయంగా ఆంజనేయులు.


"పరీక్షకు వెళ్ళేలోపు ఇస్తానన్నావుగా... మొత్తం అపుడే ఇద్డువుగాని... రేపు మంచి రోజు. ఉదయమే రా. "అంటూ చనువుగా ఆ వంద నోటు ఆంజనేయులు జేబులో పెట్టేసారాయన.


"నా దగ్గర ఏడాదిపాటు చదువు కొని పరీక్ష ఫెయిల్ అయ్యావ్ అంటే నాకే అవమానంగా ఉంది. ఐదు సబ్జెక్టులు పాస్ అయి లెక్కలు సబ్జెక్టు 34 మార్కులు తెచ్చుకుని మిగుల్చుకున్నావంటే నీ నిర్లక్ష్యానికి నాకు చాలా కోపంగా ఉంది. సరే రేపు ఉదయమే రా "


ఆంజనేయులు మాష్టారి కాళ్ళకి సాష్టాంగ పడిపోయాడు.


" మీరు ఒప్పుకున్నారు. నాకు అదే చాలు సార్ " అని వినమ్రంగా వెళ్ళిపోయాడు ఆంజనేయులు.


"హూ వెధవ పిల్లలు. క్లాస్ లో మంచిగా చెప్పినప్పుడు వినిపించుకోరు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారు. "అనుకుని పేపర్లో తల దూర్చారు కోదండం గారు.

*******

మరుసటి ఉదయం నుంచే ఆంజనేయునికి కోదండం గారి శిక్షణ ప్రారంభమైంది.

ఒక్కోసారి ఇచ్చిన హోంవర్క్ చేసుకుని వచ్చేవాడు కాదు ఆంజనేయులు.


" ఏంటయ్యా! ఇంటి దగ్గరేం పని ఉంటుంది నీకు? రోజంతా ఖాళీయేగా. మరి హోం వర్క్ చేయడానికి ఏమి బాధ? "అని మాష్టారు కఠినంగా ఆడిగినప్పుడల్లా ఆంజనేయులు కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగేవి.


"నువ్ ఇంటిదగ్గర చేసుకురావు అని నాకర్ధమైంది. ఇక్కడే చేసి వెళ్ళు "


పరీక్ష ఉత్తీర్ణత అవ్వడానికి ఏ ఏ అధ్యాయాలలో ఏ లెక్కలు బాగా చేస్తే పాస్ అవుతాడో ఆ లెక్కలు ఒక్కొక్కటిగా ఎంతో వివరంగా అర్థమయ్యేలా చెప్పి, ఒక్కొక్క లెక్కని ఐదుసార్లు చేయించి, తన ఎదురుకుండా వాటినే పరీక్ష గా పెట్టి దిద్ది మార్కులు వేయడం మొదలుపెట్టారు కోదండం గారు.

********

ఆ రోజు ఆదివారం! సాయంత్రం టీ తాగి సంతకి బయలుదేరారు కోదండం గారు. సంతలో ఒక చోట కూరగాయల కొట్లో ఆంజనేయులు ఉల్లిపాయలు చేటతో చెరుగుతూ కనిపించాడు. మాష్టారిని చూసి గతుక్కుమన్నాడు.


"ఏమయ్యా ఆంజనేయులు ! ఇది మీ కొట్టేనా ?'అడిగాడు కోదండం గారు.


" ఇది వాడి కొట్టేమిటి సారు? వాడు నాదగ్గర ప్రతి ఆదివారం పనిచేసే రోజు కూలీ. పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నా దగ్గర పని చేస్తాడు. " అన్నాడు కొట్టు యజమాని.


" ఏమయ్యా! హాయిగా ఇంట్లో కూర్చుని కష్టపడి చదువుకుని ఆ పరీక్ష పూర్తి చేసుకోక ఎందుకిలా సమయం పాడు చేసుకుంటావు? "


"రేపు ఉదయం మీ దగ్గరికి వచ్చే సరికి హోంవర్క్ అంతా పూర్తి చేసి తెస్తాను సార్" అన్నాడు ఆంజనేయులు చేతులు కట్టుకుని.


" అసలు మిమ్మల్ని కాదయ్యా. మీ తల్లిదండ్రుల అనాలి. చిన్నతనంలోనే ఇలాగే డబ్బు సంపాదన నేర్పిస్తారు. ఆ సంపాదనకి మీరు అలవాటు పడిపోయి చదువుకోరు. అందుకే ప్రభుత్వం ఎన్ని సహాయాలు చేసినా మీరు మీలాగే కింది స్థాయిలో ఉండిపోతారు. పబ్లిక్ పరీక్షలలో నీకు ప్రభుత్వం 125 రూపాయలు రాయితీ ఇచ్చింది. ఏం ప్రయోజనం? రేపు హోం వర్క్ చేసి రాకపోతే మాత్రం నువు ప్రయివేట్ కు రావక్కర్లేదు" అని అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోయారు కోదండరాం గారు.


మరో రెండు రోజుల తర్వాత హోల్ సేల్ ఫ్యాన్సీ షాప్ లో జంతికలు, చేగోడీలు త్రాసుతో తూచి ప్లాస్టిక్ కవర్లలో పెట్టి, కొవ్వొత్తితో అంచులు అంటించి ప్యాకెట్లు కింద చేస్తూ కనిపించాడు ఆంజనేయులు. పని ఒత్తిడిలో ఉన్న ఆంజనేయులు ఆయన్ని గమనించలేదు.

*******

మరుసటి ఉదయం హోమ్ వర్క్ పూర్తిచేయడమే కాదు. నేర్చుకున్న అన్ని సమస్యలు కేవలం ఒకటి రెండు తప్పులతో చూడకుండా చేసి డైలీ టెస్టులో 90 శాతం మార్కులు తెచ్చుకున్న ఆంజనేయుల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు కోదండం గారు మనసులో.

మరో రెండు రోజుల తరువాత తాను పాఠశాలనుంచి వస్తుంటే ఆంజనేయులు బజారులో వరుసగా ఉన్న కొట్లలో తన సైకిల్ కు ఉన్న పెద్ద సంచీలలోని పేకెట్లు ఇవ్వడం, డబ్బు తీసుకోవడం చూసారు.

ఇంటికి వచ్చాకా ఆలోచనలో పడ్డారు.

తాను ఎన్నిసార్లు చెప్పినా ఆంజనేయులు ఎందుకు అంత కష్టపడుతున్నాడు?

తన కుటుంబం కోసమా? తనకు ఫీజు ఇవ్వడం కోసమా? నిజంగా అతని పరిస్థితి అంత దయనీయమైనదా?


మరునాడు ఉదయం ఆంజనేయులు వచ్చిన వెంటనే అడిగారాయన.


''అంజనేయులు... నీతో మాట్లాడాలి!''ఆంజనేయులు ఆశ్చర్యంగా చూసాడు.


''నీకు మీ అమ్మ అంటే ఇష్టమా? నాన్న అంటే ఇష్టమా?''


''నాన్నకి బాగా తాగుడు అలవాటు సర్. నేను తొమ్మిదో తరగతి లో ఉండగా ఎలక్షన్లలో పోసిన కల్తీ సారా తాగి వోటేసి పోలింగ్ బూత్ లోనే ప్రాణాలోదిలేసాడు సర్. నేను ఇంటికి పెద్దకొడుకుని సర్. నాతర్వాత ఇద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు సర్. అమ్మ పాచిపనులకి, సీజన్లో కూలిపనులకి వెళ్తుంది సర్. నాన్న నా చిన్నప్పటినుంచి చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ పిల్లలు తినే తినుబండారాలు హోల్-సేల్ కొట్లలో తీసుకుని లైన్ కి వెళ్ళేవాడు. కలెక్షన్ కి వెళ్ళేవాడు. బాగా సంపాదించేవాడు. దాంతో తాగుడు అలవాటు చేసుకున్నాడు.


కుటుంబం అంతా అమ్మ రెక్కలమీద గడవాలంటే కష్టం కదా సర్. అమ్మ నన్ను బాగా చాడువుకోమంటుంది. కానీ నేనే అమ్మ కష్టం చూడలేక తొమ్మిదవ తరగతి నుంచే ఈ పని మొదలెట్టాను సర్. పదో తరగతిలో అందుకే పరీక్ష ఫెయిల్ అయ్యాను సర్. ఇంట్లో అయిదుగురు బతకాలి సర్ మరి. మీకు కూడా ఈ రెండు నెలలలో 500 ఫీజు ఇమ్మన్నారు కదా సర్. అందుకే రోజూ పడే కష్టం కన్నా కొంచెం ఎక్కువ పడుతున్నా సర్. అంతే'' ఇక తప్పదన్నట్టు చెప్పేసి కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు ఆంజనేయులు.


కోదండంగారు ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి ఆంజనేయులు దగ్గరగా వచ్చారు.


అతని భుజం మీద చేయివేసి ధైర్యం చెబుతున్నట్టుగా ''ఎంతటి కష్టమయ్యా... నీకు ఈ చిన్నవయసులో.. నీ కుటుంబ పరిస్థితులు తెలీక నిన్ను అపార్ధం చేసుకున్నాను. ఫీజు ఎక్కువ చెబితే ప్రైవేట్ కు రావడం మానేస్తావనుకున్నాను. ఆనాడే నీగురించి తెలుసుకుని నీమీద కొంచం శ్రద్ధ చూపించి వుంటే పరీక్ష పాసయి ఉండేవాడివి. మీ అమ్మ నాన్నల్ని ఆడిపోసుకున్నాను. ఇపుడు చెబుతున్నాను. నువ్వు నాకు ఫీజు ఇవ్వనవసరం లేదు. నువ్వు తప్పక పరీక్ష పాసయ్యేలా నేను తర్ఫీదు ఇస్తాను. '' అన్నారాయన ధృఢమైన కంఠంతో.


''ఏమండీ. ఒక్కసారి ఇలా రండి. '' అన్న భార్య మాటలు విని ''నువ్వు లెక్కలు చేస్తూ ఉండు. ఇపుడే వస్తాను. '' అని లోపలి వెళ్ళారాయన.


''మీరు ఫీజు కట్టడానికి తెచ్చిన ఎనభై అయిదు వేలు కనపడటం లేదండీ'' అందామె కంగారుగా.


''సరిగ్గా అంతా వెతికావా?''


''వెతికానండి. ఇదిగో ఈ చిన్న చీటీ ఉంది అక్కడ. '' అంటూ ఆ చీటీ ఇచ్చారామె ఆయనకి.


ఆయన ఆత్రంగా దాన్ని చదివారు.


''నాన్నా. ఫీజు కట్టడానికి డబ్బు నేనే తీసుకు వెళ్తున్నాను. - విశ్వ. ''


''చూసావా.. వాడికి వచ్చిన రాంక్ కి ఎక్కడ సీట్ వస్తే అక్కడే ఇంజనీరింగ్ లో చేర్పిద్దాం అని నేను నెత్తీ నోరు కొట్టుకుని నిన్ను ప్రాధేయపడ్డాను. ఎక్కడో చేర్పిస్తే స్నేహాలు పట్టి చెడిపోతాడు. ఉన్న ఊళ్లోనే ఎన్. ఆర్. ఐ. సీటు తీసుకోండి, లేకపోతే నన్ను చంపుకుతిన్నట్టే అని ఒట్టు వేయించుకున్నావ్. లక్షన్నర పెట్టి ఆ సీటు కొని వూళ్ళో కాలేజీలో చేర్పించాను. అది కాక సంవత్సరానికి ఎనభై అయిదు వేలు ఫీజు. వాడి స్టేటస్ కి తక్కువ అయిందని బైక్ కొనిపించావ్. వాడి సాదర్లు, పెట్రోల్ ఖర్చు... అన్ని కలిపి కిందటి సంవత్సరానికి లక్షా ఏభై వేలు కట్టాను. ఇది ఇంకా రెండో సంవత్సరం. ఇంకా ఈ మూడేళ్ళు కట్టాలి.


మొదటి సంవత్సరంలో రెండు సుబ్జక్టులు పాసై మిగతావి కొట్టేసాడట. చెడిపోవడానికి దూరం, దగ్గర అని ఉండదే. వాడు పట్టినవి మామూలు స్నేహాలు కాదు. లగ్జరీ స్నేహాలు. చూడు అహల్య!కన్న పాపానికి నేను చెయ్యగలిగినదంతా చేస్తాను. ఒక్కగానొక్క కొడుకని గారం చేసుకుని, వాడిముందు నన్ను అవమానించి మాట్లాడిన నాడే నేను భౌతికంగా చచ్చిపోయాను. వాడి చేతుల్లో నీ బ్రతుకు బలికాకుండా చూసుకో. '' అని హాల్లోకి వచ్చేసారాయన.

మౌనంగా లెక్కలు చేసుకుంటున్న ఆంజనేయులు చెవుల్లో వద్దన్నా ఆ మాటలు పడ్డాయి. అతనికి తల్లి మాటలు గుర్తుకు వచ్చాయి.


''ఈ లోకం లో అందరికీ సుఖాలు ఒకటే రా అంజి. కష్టాలే కోటి రకాలు. ''

***************

''సర్. పరీక్షా ఫలితాలు వచ్చేసాయి సర్. 78 మార్కులు వచ్చాయి సర్. ఇది... ఇది... మీరు పెట్టిన బిక్ష సర్. '' స్వీట్లు, రెండు రకాల పండ్లతో వచ్చి వాటి అన్నిటిని తన వొడిలో ఉంచి కాళ్ళకి సాష్టాంగ పడిపోయిన ఆంజనేయులి ఆనందం చూసి కోదండం మాస్టారి హృదయం చెమ్మగిల్లింది.


ఆప్యాయంగా ఆయన ఆంజనేయులి వీపు నిమిరి వెన్ను తట్టారు.


''చూసావా? దృష్టి పెట్టి చదివితే ఎంత మంచి ఫలితం పొందావో. ''


''నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నాను సర్. నాకు ఇదివరకెప్పుడూ లెక్కలు 78 మార్కులు రాలేదు సర్. మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను సర్. అమ్మ మీకు ఈ వెయ్యి రూపాయలు ఫీజుగా ఇమ్మంది సర్. తీసుకోండి సర్. ''అని రెండు అయిదువందల నోట్లు ఆయన చేతిలో పెట్టాడు ఆంజనేయులు. ఆయన వాటిని చేత్తో పట్టుకున్నారు.


''తరువాత ఏం చేద్దామనుకుంటున్నావు ? ఇంటర్లో చేరతావా?'''


''ఇద్దరి ఆడ పిల్లల పెళ్ళిళ్ళు ఎలా? అని అమ్మ అపుడే బెంగ పెట్టేసుకుంది సర్. అందుకని చిన్న వ్యాపారం మొదలుపెదామని అనుకుంటున్నాను సర్. ''


''నువ్వు చెప్పింది నిజమే. చదువు నీ బాధ్యతలు తీరిపోయాకా కూడా చదవుకోవచ్చు అభిరుచి ఉంటె. ఒక్క మాట చెబుతాను పాటిస్తావా?''


''మీకోసం ఏం చేయమన్నా చేస్తాను సర్. ''


''అయితే నువ్వు చేయబోయే వ్యాపారానికి ఈ వేయి రూపాయిలే మొదటి ఇటుకలు గా పేర్చి కష్టపడు. తప్పక మంచి ఫలితం సాధిస్తావ్. ''


''సార్. ఇది మీ ఫీజు సర్. వద్దు సర్. ''ఆంజనేయులికి కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగిపోయాయి.


''నాకోసం ఏదైనా చేస్తాను అన్నావ్. ''


ఆంజనేయులు కళ్ళు తుడుచుకున్నాడు.


''అవును సర్. అన్నాను. మీ కోసం చేస్తాను సర్. ఏదైనా చేస్తాను. విజయుడవై తిరిగి రమ్మని నన్ను ఆశీర్వదించండి సర్. '' అని మళ్ళీ పాదాలకు నమస్కరించాడు ఆంజనేయులు.


''నీపేరే ఆంజనేయుడయ్యా. హనుమంతుడు కార్యసాధకుడు. విజయోస్తు. వెళ్లిరా. '' అన్న మాష్టారి దీవనలను మనసునిండా నింపుకుని ఆంజనేయులు వెళ్ళిపోయాడు.

**********


''ముందు ఒక ప్లేట్ ఇడ్లి ఇవ్వండి మాష్టారు. తరువాత ఒక ప్లేట్ దోశ చెప్పండి. '' కస్టమర్లు అడిగిన టిఫిన్స్ గబగబా అందిస్తున్న కోదండంగారు స్వచ్చమైన తెలుగులో తనను 'మాస్టారు' అని పిలిచింది ఎవరా? అని ఇడ్లి ప్లేట్ అందిస్తూ అతన్ని తేరపార చూసారు.


''మీరు తెలుగు వారా బాబు? ఆంధ్రా నా. తెలంగాణా నా?'' అడిగారాయన.


''ఆంధ్ర మా పుట్టినిల్లు సార్. తెలంగాణా నా మెట్టినిల్లు సర్. '' అన్నాడతను.


''మెట్టినిల్లు ఆడవాళ్ళకు ఉంటుంది. మగవాళ్ళకేమిటి బాబు?'' నవ్వారాయన నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ.


''అవును సర్. ఈమె నా భార్య సువర్చల. తెలంగాణా అమ్మాయి. అపుడు నాకు మెట్టినిల్లు తెలంగాణా యే కదా సర్?'' అతను అన్నతీరుకు నవ్వారాయన. అతను తినడం మానేసి ప్లేట్ భార్యకు ఇచ్చి వంగి కోదండంగారి కాళ్ళకు నమస్కరించాడు. ఆ టిఫిన్ సెంటర్ దగ్గర నిలబడిన దాదాపు పాతికమంది వింతగా చూస్తూ ఉండి పోయారు.


''బాబు. ఏమిటిది? ఎవరు మీరు?ఏం చేస్తున్నారు?'' అంటూ ఆయన కాళ్ళు వెనక్కు లాక్కోబోయారు.

అతను మాస్టారి పాదాలను కదలనీయలేదు.

అప్పటికే అతని కన్నీళ్లు ఆయన పాదాలను అభిషేకం చేస్తున్నాయి.


అతన్ని భుజాలు పట్టి లేవనెత్తారు ఆయన. ఆయన కళ్ళు కన్నీళ్ళతో మసకబారుతుండగా ''మీరెవరో గుర్తుపట్టలేకపోతున్నాను బాబు. '' అన్నారు.


''సార్. మిమ్మల్ని ఇలాంటి దుస్థితిలో చూస్తానని అనుకోలేదు సర్. ప్లీజ్ సర్. ముందు మీరు ఆ పనిని ఆపండి సర్. నేను... నేను... మీ ఆంజనేయుల్ని సర్. దాదాపు పదిహేను సంవత్సరాల కిందట నన్ను పదవతరగతి పాస్ చేయించి, నేనిచ్చిన ఫీజునే నా వ్యాపారానికి ఇటుకలుగా పేర్చిన మీ ఆంజనేయుల్ని సర్. బాబు... నువ్వు కొంచెం చూసుకో. నేను సార్ తో మాట్లాడాలి. '' అని దోశలు వేస్తున్న పని కుర్రవాడికి పురమాయించి మాష్టారి చేయి పట్టుకుని పక్కనే ఉన్న గుడి గట్టు మీద కూర్చో బెట్టాడు ఆంజనేయులు.


ఆ పవిత్ర కాశీక్షేత్రంలో పవిత్ర గంగా నది మీదనుంచి అలలు అలలుగా వస్తున్న చల్లని గాలి అక్కడ ఉన్న వారి మనసుల్ని చల్లబరుస్తోంది.


''బాబు... ఆంజనేయులు... నువ్వా.. ఎంతవాడివి అయ్యావయ్యా... అవును.. ఏదో చిన్న వ్యాపారం చేస్తానని ఆరోజు చెప్పిన గుర్తు. ఏం చేస్తున్నావ్?''


''ఈ ప్రపంచంలో తిండి దొరకని వాడు కూడా చిరుతిండి తిని కడుపునిండా మంచినీళ్ళు తాగేస్తాడు సర్. ఆరోజుల్లో నేను కొట్లకు వేసిన మన ఆంధ్రా పిండివంటల వ్యాపారం ప్రారంభించాను సర్. ఈనాడు రెండు తెలుగు రాష్ట్రాలలోను 40 కి పైగా శాఖలుగా విస్తరించింది సర్. ఇది మీరు పెట్టిన బిక్ష సర్. అమ్మగారు ఏరి సర్?''


''ఏం చెప్పను బాబు. వేమన చెప్పినట్టు తల్లితండ్రులందు దయలేని పుత్రుడు బాబు వాడు. కొడుకుని గారం చేసుకుని వాడు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయింది. ఉద్యోగ విరమణ చేసాకా ఇక్కడకు చేరాము. ఆమె వైద్యానికే నా డబ్బు అంతా ఖర్చయిపోయింది. వేరే గతి లేక వచ్చిన విద్యతో పదిమంది ఆకలి తీర్చడమే పరమావధిగా ఈ పని చేస్తున్నాను బాబు. ''గాద్గదికంగా అన్నారు కోదండం గారు.


''వర్చలా'' అన్న అతని పిలుపు వింటూనే ఆమె భర్తకి ఒక కవరు అందించింది.


''మాస్టారు. మీ జీవితాంతం ఈ బిడ్డ మీకు తోడుగా ఉంటాడు సర్. ఆనాడు మీకు నేను ఇవ్వాల్సిన ఫీజుకు ఇరవై రెట్లు ప్రీమియం లక్ష్యంగా పెట్టుకుని ఎల్. ఐ. సి. కట్టాను మాస్టారు. దానికి నామినీ మీపేరే పెట్టాను. అది మెచ్యూర్ అయిన తాలూకు చెక్కు ఇది సర్. ఇది మీ ఫీజు సర్. దీనిని ఈ పవిత్ర కాశీక్షేత్రంలో ఈ గుడి ప్రాంగణంలో మీకు ఆ శివయ్య సాక్షిగా సమర్పించుకుంటున్న గురుదక్షిణ సర్. ఆనాడు మీరు నొక పని చెబుతాను పాటిస్తావా? అని అడిగారు. అలాగే నేను ఒక సహాయం అడుగుతున్నాను సర్. చేయగలరా సర్?''


''తప్పకుండా నాన్న... చెప్పు. నేను ఏంచెయ్యాలి?''


''ఇక్కడ మన తెలుగువారి పిండి వంటల శాఖ ప్రారంభం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాను సర్. దానికి మీరు పర్యవేక్షకుడిగా ఉండి నన్ను నడిపించాలి సర్. మీ పెరటి చెట్టుమీద వాలిన ఈ పక్షి కోరిక తీరుస్తారా సర్?''


సాక్షాతూ ఆ పరమేశ్వరుడే దర్శనమిస్తున్నట్లుగా అపురూప అలౌకిక భావనతో ఆంజనేయులి చేతులు పట్టుకుంటూ కళ్ళుమూసుకున్నారు కోదండం మాస్టారు.


సమాప్తం.

కొత్తపల్లి ఉదయబాబు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Podcast Link


Twitter Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు : కొత్తపల్లి ఉదయబాబు పుట్టిన తేదీ : 01/07/1957 విద్యార్హతలు : M.Sc., M.Ed., M.phil (maths) నిర్వహించిన వృత్తి : ప్రధానోపాధ్యాయులు


తల్లి తండ్రులు : శ్రీ కొత్తపల్లి గంగాధర్ శర్మ, విశ్రాంత హెడ్ పోస్ట్-మాస్టర్ స్వర్గీయ శ్రీమతి సుబ్బలక్ష్మి. భార్య : శ్రీమతి సూర్యకుమారి కుమార్తె : చి. సౌ. గుడాల సుబ్బ లక్ష్మి సంతోషిత , M.B.A. w/o లక్ష్మికాంత్ – లాయర్ మనుమరాలు : చి. లక్ష్మి పూర్ణ సాధ్వి కుమారుడు : చి. హనుమ గంగాధర్ శర్మ , సాఫ్ట్-వేర్, h/o చి.సౌ.తేజశ్రీ మనుమలు : చిరంజీవులు గహన్ ముకుంద, ఋషిక్ వశిష్ట.

*వృత్తి పరంగా :

*జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల పోటీలలో వివిధ అంశాలలో బహుమతులు, క్విజ్,సాంకేశృతిక కార్యక్రమాల నిర్వహణ, న్యాయ నిర్ణేతగా వ్యవహిరించిన అనుభవం.

*పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2002 లో తొలిసారిగా ఐదుగురు విద్యార్థులకు నూటికి నూరు మార్కులు రావడం ఆ సందర్భంగా అరకాసు ఉంగరం బహుమతిగా అందుకోవడం ఒక చక్కని ప్రోత్సాహం, ఉత్సాహం. అలా మొత్తం సర్వీసులో నూటికి నూరు మార్కులు దాదాపు తొంభై మందికి పైగా విద్యార్థులు పొందగలగడం వృత్తిపరంగా సంతృప్తిని కలిగించిన విషయం.

*జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించిన భౌతిక శాస్త్ర,గణిత శాస్త్ర సదస్సులకు రిసోర్స్ పర్సన్ గా వ్యవహరించడం.

*జిల్లా ఉమ్మడి పరీక్షల సంస్థకు అయిదు సంవత్సరాలపాటు ఎక్కువమంది విద్యార్హులు గణితంలో ఉత్తీరర్ణతాశాతం పొందదానికి అవసరమైన విజయ సూచిక, విజయ సోపానాలు... పుస్తకాలను ప్రభుత్వం తరపున రూపొందించుటలో ''గణిత ప్రవీణుడు''గా వ్యవహరించడం.

*ఆకాశవాణిలో కథానికలు, నాటికల ప్రసారం,అవగాహనా సదస్సులలో పాల్గొనడం, రేడియో నాటక కళాకారునిగా మూడు సంవత్సరాలు విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో పాల్గొనడం..మొదలైనవి


ప్రవృత్తి పరంగా :

*కథా రచయితగా రచనలు :

1. *అందమైన తీగకు...! - 25 కధల మాలిక (2003) 2. *చిగురు పిట్టలు* - నానీల సంపుటి (2007) 3. ఉదయబాబు *మాస్టారి' కధానికలు* - ఉదయకిరణాలు (2015) 4. *అమ్మతనం సాక్షిగా*... కవితా సంపుటి (2015) 5. *నాన్నకో బహుమతి* - 16 కథల సమాహారం (2019-.) జీ.వి.ఆర్. కల్చరల్ అసోసియేషన్ వారు నిర్వహించిన కథాసంపుటుల పోటీలలో ద్వితీయ బహుమతి పొందిన కథల సంపుటి) 6. ఆయన మా నాన్నగారు ( దీర్ఘ కవిత - త్వరలో )

నవలలు : 1 . లేడీ సింగర్ (2 భాగాలు )

2 . మనసు చేసిన న్యాయం(ప్రతిలిపి వారు మార్చి 2202 లో నిర్వహించిన ధారావాహికల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందినది)

ప్రేరణ : నాన్నగారు...ఆయన నాటక రచయిత,దర్శకుడు,ఉత్తమ నటుడు(18 నాటక పరిషత్తులలో)

*సామాజిక సేవ : రక్తదాన కార్యక్రమం లో, లయన్స్ క్లబ్ వారి కార్యక్రమాలలో విరివిగ పాల్గొనడం .

తెలుగు సాహిత్యానికి సేవ : తెలుగు సాహితీ సమాఖ్య లో కార్యకర్తగా, సంయుక్త కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా తెలుగు సాహిత్యానికి విశేష కృషి , జిల్లా స్థాయిలో ర్యాలీల నిర్వహణ ...అష్టావధానం, త్రీభాషా శతావధానం లలో పృచ్చకునిగా 46 సంవత్సరాలపాటు ప్రతీ నెల సాహితీ స్రష్టల ప్రసంగాలు...విద్యార్హులకు వివిధములైన పోటీల నిర్వహణ,

పత్రికా రంగం లో : వ్యంగ్య చిత్రకళ లో పలు కార్టూన్లు వేయడం. :*1999 - జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు - పశ్చిమ గోదావరి జిల్లా*

*2000 - యువసాహితీ సహస్రాబ్ది అవార్డు - ఆంద్ర ప్రదేశ్ సాంస్కృతిక సమాఖ్య* *2011 - సోమేపల్లి సాహితీ పురస్కారం* *2016 - గోదావరి మాత అవార్డు - ఉంగుటూరు ఎం.ఎల్.ఎ, శ్రీ గన్ని వీరంజనేయులుగారి చే- గణపవరం - పశ్చిమ గోదావరి జిల్లా *ఉండి ఎం.ఎల్.ఎ. శ్రీ వి.వెంకట శివరామరాజు గారి చే ''ఉగాది పురస్కారం*

*పాలకొల్లు - కళాలయ సంస్థవారిచే " కధాభారతి" బిరుదు ప్రదానం*.

*జన విజ్ఞానవేదిక - భీమవరం వారిచే " ఉగాది పురస్కారం" ....సుమారు నూటికి పైగా సన్మానాలు సత్కారాలు...ఇంకా ఎన్నో..

Youtube :1. తెలుగు కథను ప్రపంచ వ్యాప్తం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుతం "Mastaru Kadhalu 'in' Telugu " ఛానెల్ ద్వారా నా కథలతో పాటు దాదాపు 25 మంది రచయితల కథలు (ఈనాటికి 420 కధల ఆడియో వీడియోలు)చదివి వీడియోలుగా మలుస్తూ ఉచిత సేవగా అందించడం జరుగుతోంది.

2.KUBDevotionalWorld అనే ఛానల్ ద్వారా శ్రీ భగవద్గీత 700 శ్లోకాలను ప్రతీరోజు 5 శ్లోకాలను భావాలతో సహా వీడియోలుగా చదివి అందించడం జరుగుతోంది.

3. UDAYABABUMathsBasics యు ట్యూబ్ ఛానెల్ ద్వారా విద్యార్థులకు గణితంలో మౌలిక భావనల బోధన

ప్రస్తుత నివాసం : 2010 లో సికింద్రాబాద్ సైనిక్ పురి లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఇప్పటికీ కధా రచయితగా, బాలల కథారచయితగా కొనసాగడం.

*చివరగా నా అభిప్రాయం :*

ఇప్పటికీ నా కవితా ప్రస్తానం, కధా సాహితీ సేద్యం కొనసాగుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం లో చెట్టు నాకు ఆదర్శం.

కవిగా రచయితగా తమ సాహితీ ప్రస్తానం కొనసాగిన్చాదలుచుకున్న యువత అంతా పాత సాహిత్యాన్ని బాగా చదవాలి. 'వెయ్యి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి' అన్న ఒక మహాకవి వాక్యాలు స్పూర్తిగా తీసుకుని నిన్నటి రచన కన్నా, నేటిది, నేటి రచన కన్నా రేపటిది మరింత మెరుగుపరచుకుని ఈ రంగం లో తమకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, ఆ దిశగా వారి సాహితీ ప్రస్తానం కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ.. ...సాహిత్యాభినందనలు.

కొత్తపల్లి ఉదయబాబు

సికింద్రాబాద్





57 views0 comments

Comments


bottom of page