top of page

పొదరిల్లు

Writer's picture: Lakshmi Madan MLakshmi Madan M

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link

'Podarillu' New Telugu Story


Written By Lakshmi Madan


రచన: లక్ష్మి మదన్


వర్ధని స్కూల్ నుండి వచ్చే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఇంటి ముందుకు వచ్చి అరుగు మీద నిలబడి, సందు చివరి వరకు చూస్తోంది... ఆ రోజుల్లో ఇప్పటి నర్సరీలాగా ఎవరైనా ఇంటి దగ్గర ఓనమాలు నేర్పించే వాళ్ళు ఉంటే పంపించేవారు, స్కూల్ వెళ్లే వరకు ఏదో కొంత నేర్చుకుంటారని. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆ బడి నడిచేది. దానిని కానిగీ బడి అని కూడా అంటారు.


పొద్దున చద్దన్నంలో చింతకాయ పచ్చడి, నెయ్యి వేసి కలిపి పిల్లలకు పెట్టి పంపించింది వర్ధని. యూనిఫాంలు బూట్లు ఇవన్నీ వేసుకునే పని లేదు కదా అప్పటి రోజుల్లో! చక్కగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని, చద్దన్నం తినేసి దేవుడికి దండం పెట్టుకొని పిల్లలంతా బడికి వెళ్లేవారు. పిల్లలు కూర్చోవడానికి అక్కడ ఒక గోడ మీద ఎవరి గోనేసంచి వాళ్లు తెచ్చి పెట్టుకునేవారు. వెళ్ళాక అది పరుచుకుని కూర్చునేవారు.


శ్రావణి, సంగీత, మరియు శ్రీనివాస్ ముగ్గురు కలిసి స్కూలుకు వెళ్లేవారు. అందరికన్నా చిన్నది శ్రావణి చాలా బెరుగ్గా ఉండేది. స్కూల్లో టీచర్ అంటే విపరీతమైన భయం. ముగ్గురు వెళ్లి వరండాలో నిలబడ్డారు. ఇంతలో టీచరు రంగమ్మ వచ్చి..


"లోపలికి వచ్చి మీ గోనెసంచి పరచుకొని కూర్చుని, పలకలు తీసి ఓనమాలు, ఒంట్లు రాయండి" అని చెప్పింది.


"సరే పంతులమ్మా!" అని పిల్లలు లోపలికి వచ్చి గోనెసంచి పరచుకొని కూర్చున్నారు. ఇంతలో మిగతా పిల్లలు కూడా వచ్చి వారి వారి సంచులు పరచుకొని కూర్చున్నారు....



ఆరోజు రంగమ్మ టీచర్ కి ఇంట్లో పని ఆలస్యమైంది అనుకుంటా.. వంటింట్లోనే ఎక్కువసేపు పని చేస్తూ కనబడింది. ఇంకా టీచర్ లేదని పిల్లలకి ఆటవిడుపుగా ఉంది. అల్లరి చేస్తూ మాట్లాడుతూ కూర్చున్నారు. ఇంతలో టీచర్ బయటకు వచ్చి "అందరూ పలకలు పట్టండిరా" అని అన్నది. అందరూ పలకలు పట్టి చూస్తున్నారు. అందరి పలకల మీద గుప్పెడు గుప్పెడు బియ్యం పోసి "ఇందులో రాళ్లు చక్కగా ఏరేసి పెట్టండి" అని చెప్పింది.


ఇలా టీచరు చిన్న చిన్న పనులు పిల్లలతో చేయించేది. పిల్లలకి కూడా సరదాగానే ఉండేది. రోజంతా చదువుకోడానికి ఏముంటుంది కనుక..?


ఆ తర్వాత పిల్లలు ఓనమాలు, ఒంట్లు రాసి టీచర్ కి చూపించారు. టీచర్ సంతోషపడి "ఆ ఇంకా ఒంటిగంట అయిపోయిందిరా.. ఇళ్లకు వెళ్లి అన్నం తిని రాపొండి" అని చెప్పింది...


"హమ్మయ్య "అనుకున్న పిల్లలు పరిగెత్తారు... శ్రావణి, సంగీత మరియు శ్రీనివాస్ ఇంటికి వచ్చారు.. సందు చివర్లో వారిని చూసి వర్ధని "వస్తున్నారు పిల్లలు" అనుకొని లోపలికి వెళ్లి వారికి కంచాలు, నీళ్లు పెట్టింది.


ఇంకా మడితోనే ఉన్న వర్ధని కంచాలలో అన్నం "పెట్టి తినండి రా!" అని చెప్పింది..



శ్రావణి శ్రీనివాసు మెల్లిగా అన్నం కలుపుకొని తినసాగారు... కానీ చిన్నది సంగీత మారం చేస్తూ "నువ్వు కలిపి పెడితేనే తింటా. నేను కలుపుకొని తినను" అని చెప్పింది..


"నాయనమ్మకి ఇంకా భోజనం వడ్డించ లేదమ్మా. నేను మడితో ఉన్నాను. ఈరోజుకు నువ్వు కలుపుకొని తినమ్మా. రేపటినుండి పని ముగించుకొని నీకు తినిపిస్తాను" అన్నది...



అయినా వినలేదు సంగీత "లేదు.. నువ్వే తినిపించాలి. నేను తినను" అని ఏడ్చింది..


ఇంతలో పెద్ద ఆవిడ రాధమ్మ బయటకు వచ్చి "పోనీలే వర్ధని! కలిపి పెట్టు. నేను పెట్టుకుని తింటాలే" అని అన్నది..


"సరే అత్తయ్య "అని చెప్పి చిన్నదాని పళ్ళెం తీసుకొని పప్పు, నెయ్యి కలిపి ముద్దలు పెట్ట సాగింది...


శ్రావణి, శ్రీనివాస్ కూడా "మాకు తినిపించమ్మా" అని వచ్చి కూర్చున్నారు. ముగ్గురికి కలిపి అన్నం తినిపించింది. మళ్లీ స్కూల్ టైం కాగానే స్కూలుకు వెళ్ళిపోయారు.


స్కూలుకు వెళ్ళగానే రాసుకోవడానికి పలకలు, బలపాలు తీసుకున్నారు. ఇంతలో అదే స్కూల్లో చదువుకునే ఒక అమ్మాయి.. పేరు సుందరి.. వచ్చి, శ్రావణి వాళ్ళ పక్కన కూర్చుంది.


“శ్రావణీ! నువ్వు అన్ని రాసావా? టీచర్కి చూపించావా?” అని అడిగింది సుందరి.



"చూపించాను. నువ్వు రాయలేదా? "అని అడిగింది శ్రావణి..


ఎప్పుడూ ముచ్చట్లతో కాలక్షేపం చేసే సుందరికి చదువు అంటే ఒకింత నిర్లక్ష్యం. ఎప్పుడూ పిల్లల మధ్య ఏదో ఒక గొడవ పెడుతూ, అందరి వస్తువులను లాక్కుంటూ, అల్లరి ఎక్కువగా చేసేది. ఎన్నోసార్లు పంతులమ్మ తిట్టినా కూడా ఆ అమ్మాయి అలాగే చేసేది.


సుందరి మెల్లగా తన స్కూల్ బ్యాగ్ తెరిచి, అందులోంచి చింతకాయ ఓనగాయ తీసి మెల్లిగా తినసాగింది. పిల్లలందరికీ నోరు ఊరసాగింది..


"సుందరీ! సుందరీ.. నాకు ఇవ్వవా చింతకాయ! నాకు ఇవ్వవా.." అంటూ పిల్లలంతా అడగసాగారు.


అప్పుడు సుందరి "అబ్బా! ఎలా ఇస్తాను ఊరికే.. మీరంతా మీ బలపాలు నాకు ఇస్తే, మీకు నేను చింతకాయలు ఇస్తాను" అని చెప్పింది...


పిల్లలు అంతా చేసేది లేక, చింతకాయ తినాలని కోరికను ఆపలేక, బలపాలు ముక్కలు చేసి చిన్న ముక్క వారి దగ్గర ఉంచుకొని పెద్దబల్పం మొత్తము సుందరికి ఇచ్చేశారు. ఆ బలపాలన్నిటిని చక్కగా ఒక డబ్బాలో సర్దుకుని అందరికీ చిన్న చిన్న చింతకాయలు ఇచ్చేసింది. పిల్లలు వాటిని చప్పరిస్తూ ఎంతో ఆనందం పొందారు. పంతులమ్మ మాత్రం ఆ పక్కనే ఉన్న ఉయ్యాల బళ్ళ మీద విశ్రాంతి తీసుకుంటూంది.. ఆవిడకి ఈ గోల ఏమీ వినపడడం లేదు. మెల్లిగా నాలుగు గంటలకు లేచిన పంతులమ్మ పిల్లలని "మీ గోనసంచెలు మడతపెట్టి ఆ గోడ మీద వేసి. ఇళ్లల్లోకి వెళ్లిపోండి" అని చెప్పింది. పిల్లలు పోలోమంటూ బయటకు పరిగెత్తారు.


ఇంటికి రాగానే పిల్లల్ని వాళ్ళ నాయనమ్మ “వెళ్లి బావి దగ్గర కాళ్లు చేతులు కడుక్కొని రండి. మీకు మొక్కజొన్న పేలాలు, వేయించిన ఉలవలు తినడానికి పెడతాను” అని చెప్పింది. పిల్లలు బావి దగ్గరికి వెళ్లి చక్కగా కాళ్లు చేతులు కడుక్కొని లోపలికి వచ్చి వంటింట్లో కూర్చున్నారు. నాయనమ్మ చిన్న చిన్న గిన్నెలో మొక్కజోన్న పేలాలు, ఉలువలు పెట్టి ఇచ్చింది. వాటిని పిల్లలు ఆవురావురు మని తిని ఆడుకోవడానికి బయటకు వెళ్లారు.


పొద్దున మళ్ళీ స్కూలుకు వెళ్లేటప్పుడు పిల్లలు తల్లి వర్ధని దగ్గరికి వచ్చి "అమ్మా! మాకు బలపాలు కావాలి" అని అడిగారు


"అదేంట్రా రోజూ ఒక కొత్త బలపం తీసుకెళ్తున్నారు. ఏం చేస్తున్నారు బలపాలన్నీ?" అని అడిగింది...


పిల్లలు సమాధానం చెప్పలేక నీళ్లు నమల సాగారు. అప్పుడు సంగీత మెల్లగా నోరు విప్పింది…

“అమ్మా! మరి స్కూల్లో సుందరి చింతకాయలకి బలపాలు ఇమ్మని అడిగింది. అందుకే బలపాలు ఇచ్చేసి చింతకాయ తీసుకొని తినేసాము" అని చెప్పింది..


వర్ధని కొంచెం కోపంతో "ఇంట్లో బోలెడన్ని చింతకాయలు ఉన్నాయి. ఈ బలపాలిచ్చి కొనుక్కోవాలా? మన చెట్టు నిండా చింతకాయలే" అని ఇంటి వెనక ఉన్న చింత చెట్టుని చూపించింది. కానీ పిల్లలకి పొరుగింటి పుల్లకూర రుచి అయినట్టు ఆ సుందరి ఇచ్చిన చింతకాయలు తిన్నారు...


ఇలా పిల్లలకి చిన్నతనంలోనే ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉండేది. చిన్న చిన్న పనులు నేర్చుకోవడంతో పాటు ఎవరితో ఎలా మెలగాలి.. ఎలాంటి పనులు చేయకూడదు.. అనేది బాగా వంట పట్టించుకునేవారు. ఆ తర్వాత పాఠశాలకు వెళ్లినా కూడా సర్దుకుపోయే గుణము అలవడేది.



అలాగే అప్పటి రోజుల్లో పిల్లలకి ప్రకృతితో అవినాభావ సంబంధం ఉండేలా పెద్దలు నేర్పించి సహకరించేవారు.. అలాగే వర్ధని కూడా తొలకరి చినుకులు కురియ గానే పెరట్లో చేయాల్సిన పని బోలెడు ఉందంటూ...


"శ్రావణి, సంగీత, మరియు శ్రీనివాస్!పెరట్లో కూరగాయల విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలు నాటుదాం రండి" అని పిలుస్తూ చేతిలో ఒక ఇనుప చువ్వ, మరొక చేతిలో విత్తనాలు పట్టుకొని, కుచ్చిళ్లు చెక్కుకొని పెరట్లోకి గబగబా నడిచింది..


అక్కడే కూర్చున్న నాయనమ్మ రాధమ్మ "ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తే గాని నీకు తోచదు. వెళ్ళండిరా పిల్లలూ! అమ్మ ఒక్కతే పెరట్లో పని చేసుకుంటూంది. మీ నాన్నకేమో ఆఫీస్ పనులతోనే సరిపోతుంది. నాకేమో కాళ్ళ నొప్పులు. మీరైనా వెళ్ళండి రా పాపం.." అని అరిచింది.



"అమ్మ పని చేస్తుందంటే చాలు, ఈ నాయనమ్మకి నస పెరుగుతుంది. ఒక్కతే చేస్తుంది.. ఒక్కతే చేస్తుంది.. మీరెళ్లి చేయండి.. అని చంపుతుంది. పక్కింట్లో శాంతత్త వాళ్ళ అత్తేమో కోడలే అన్ని పనులు చేయాలి అని రోజు అరుస్తూనే ఉంటుంది.. ఈ నాయనమ్మ అమ్మ పని చేస్తుంటే తట్టుకోలేదు. ఏంటో ఈ అత్తా కోడళ్ళు" అని ఒకరితో ఒకరు ముచ్చటించుకొని పెరట్లోకి నడిచారు.



అప్పటికే పెరడంతా అనవసరపు మొక్కలను తీసేసి చదును చేసి ఉంచింది వర్ధని.


ఇనుప చువ్వతో భూమిపై గుంతలు చేస్తుంటే పిల్లలు అందులో ఒక్కొక్క విత్తనం వేసుకుంటూ వెళుతున్నారు. చుట్టూ మొక్కజొన్న విత్తనాలు నాటారు.. మూలల్లో ఆనప, చిక్కుడు, దొండ పాదులు వేశారు.. మధ్యలో అంతా చామంతి, గోరింటా, బంతి మొక్కలను వేశారు. శ్రావణ భాద్రపద మాసాల్లో మొక్కలన్నీ పెరిగి పూలు పూస్తాయి. దసరాకు అంతా మొక్కజొన్న కాస్తుంది. మరో నెలలో ఆనప. దొండ. చిక్కుడు కాయడం మొదలుపెడతాయి. ఇంక కూరగాయలు కొనే అవసరమే ఉండదు... దేవుడి పూలకు కొదవ లేదు. అలా పిల్లలతో కబుర్లు చెబుతూ పెరడంతా విత్తనాలు నాటి నలుగురూ చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చారు...


వంటింట్లోకి రాగానే చక్కని ఘుమఘమ వాసనలు రాసాగాయి...


"ఆహా! ఏదో కమ్మటి వాసన వస్తుంది. ఏం చేస్తావే నాయనమ్మ.. తినడానికి పెట్టు" అని ముగ్గురు పిల్లలు ఒకేసారి అరిచారు...



"తపాలా రొట్టె చేశాను రా. వెళ్లి సత్యనారాయణ ఆకులు కోసుకొని కడిగి తీసుకొని రండి. అందరికీ పెడతాను” అని చెప్పింది...


పిల్లలు మళ్లీ పెరట్లోకి వెళ్లి ఓ 15 ఆకులు కోసి, కడిగి తీసుకొని వచ్చారు. ఇంతలో వీరితో ఆడుకోవడానికి వచ్చే పిల్లలు లోపలికి వచ్చారు


"ఆడుకుందాం రండిరా" అని పిలిచారు....


నాయనమ్మ ఉండి "మీరు కూడా తిని వెళ్లి ఆడుకోండి” అని చెప్పింది..


నాయనమ్మ అలా చెప్పగానే పిల్లలందరూ పెరట్లో చాప వేసుకుని వరుసగా కూర్చున్నారు. అందరికీ తపాలా రొట్టె కొంచెం వెన్న వేసింది నాయనమ్మ... తపాలా రొట్టె రుచిగా ఉందంటూ పిల్లలు ఇష్టంగా తింటున్నారు...


"ఇందులో ఏమేమి వేశావే నాయనమ్మ "అని శ్రీనివాస్ అడిగాడు..


"బియ్యం పిండిలో ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, కారం, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి బాండ్లీలో చక్కగా కాల్చాను రా" అని చెప్పింది..


"నీకు ఒక్క మాటలో ఏదీ చెప్పడం రాదు. సాగదీసి కథంతా చెప్తావ్" అని అన్నాడు శ్రీనివాస్. పిల్లలంతా నవ్వుకుంటూ తిన్నారు.. వాళ్ళందర్నీ చూసి నాయనమ్మ మురిసిపోయింది...


కొడుకు, కోడలికి కూడా ఆకుల్లో పెట్టి ఇచ్చింది.


"మరి మీరు తినరా అత్తయ్యా" అని అడిగింది వర్ధని..

"ఎలాగూ రాత్రికి ఫలహారమేగా చేసేది.. రాత్రి తింటాలే "అని మెత్తటిది చూసి, ఒక గిన్నెలో పెట్టుకొని మడిగా పెట్టుకుంది నాయనమ్మ..



ఇంతలో అలా బయటకు వస్తున్న పెద్దావిడ నీళ్లలో కాలు పెట్టి జారీ కింద పడిపోయింది.... ఒక్క ఉదుటున కోడలు వర్ధని, కొడుకు సుబ్రహ్మణ్యం వచ్చి లేపి, మెల్లగా రాధమ్మని బల్లపై పడుకోబెట్టారు. అప్పటికే బట్టలన్నీ తడిసిపోయాయి. వయసు అయిపోవడం వల్ల దెబ్బల నొప్పి ఎక్కువగా ఉంది.. మూలుగుతూనే ఉంది...


రాధమ్మ బట్టలను మెల్లగా వర్ధని మార్చేసి, పొడి బట్టతో తుడిచి వేరే చీర కట్టింది.. దెబ్బలు తగిలిన చోట ఆయింట్మెంట్ పెట్టి "మీరు పడుకోండి కదలకుండా! వద్దంటే వినకుండా అన్ని పనులు చేస్తారు” అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది వర్థని... కోడలు ప్రేమకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాధమ్మకు....


పక్కింట్లో రోజూ అత్తా కోడళ్ళ గొడవ తాను వింటూనే ఉంది, కోడలికి అత్తకి ఒక్క క్షణం పడదు. ఇద్దరూ ఏదో విషయంలో గొడవ పడుతూనే ఉంటారు. ఆ గొడవల వల్ల ఇంట్లో అందరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది. కానీ తన ఇంట్లో అలా కాదు. ‘కూతురికన్నా ఎక్కువ ప్రేమగా కోడలు తనను చూసుకుంటుంది.’ అని అనుకొని కళ్ళు మూసుకొని పడుకుంది.


కాసేపటికి వేడి చాయ్ తీసుకొని వచ్చింది వర్ధని "అత్తయ్యా! చాయి తాగి టాబ్లెట్ వేసుకొని పడుకోండి "అని చెప్పింది.


"అలాగేనమ్మ "అంటూ టాబ్లెట్ వేసుకొని పడుకుంది రాధమ్మ...



వంటింట్లో రాత్రి వంట సిద్ధం చేస్తూ వర్ధని ఆలోచిస్తోంది. మొదట్లో తాను అత్తగారిని ఎంత అపార్థం చేసుకుంది! తను ఏం చేసినా కూడా తప్పులు వెతుకుతూ ఆమెకి మనశ్శాంతి లేకుండా చేసింది. పిల్లలు కడుపులో పడ్డాక వేవిళ్ళు ఎక్కువగా ఉండేవి వర్ధనికి. అప్పుడు ఒక్క పని చేయకుండా ఇష్టమైనవన్నీ చేసిపెడుతూ ఎంతో ఆప్యాయంగా చూసుకుంది రాధమ్మ కోడల్ని. అప్పుడు వర్ధని అనుకుంది ‘తల్లి లేని తనకి తల్లిగా మారిన రాధమ్మని అర్థం చేసుకోలేకపోయా’నని బాధపడి "అత్తయ్యా! నన్ను క్షమించండి. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను" అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది.

"ఏంటమ్మా ఇలా? నువ్వు నా కూతురివి కాదా! కూతురైతే తల్లిని ఓ మాట అనదా? అలాగే నువ్వూ తల్లీ! నువ్వు నా కూతురివే. ఏదీ అలా మనసులో పెట్టుకోకుండా చక్కగా తిని నాకు పండంటి మనవడినో మనవరాలినో ఇవ్వాలి" అని నవ్వింది రాధమ్మ..


అదంతా గుర్తుచేసుకొని మనసులోనే నవ్వుకొని వంట పూర్తి చేసి పిల్లలకి భోజనం పెట్టి అత్తగారి దగ్గర వచ్చి కూర్చుంది వర్ధని.


వారి అన్యోన్యతను చూసి గూట్లో కూర్చున్న పిచ్చికలు కూడా మురిసిపోయాయి...


అప్పుడే వచ్చిన సుబ్రహ్మణ్యం ఈ ఇంటికి దేవతలా వచ్చిన తన భార్యను చూసి ఎంతో ఆనంద పడిపోయాడు. పిల్లలు హోంవర్క్ చేసుకొని ఆదమరిచి నిద్రపోయారు...


ఏకాంతంగా కూర్చున్న వర్ధిని, సుబ్రహ్మణ్యం ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకుని ఎంతో తృప్తిగా పడుకున్నారు


😊😊😊 శుభం😊😊


లక్ష్మి మదన్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు



కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి

కలం పేరు : లక్ష్మీ మదన్

హైదరాబాద్ లో ఉంటాను.

500 కి పైగా కవితలు, 300 కి పైగా పద్యాలు, పాటలు, కథలు రాసాను.




45 views0 comments

Komentarze


bottom of page