పోటీ
- Malla Karunya Kumar

- 2 hours ago
- 5 min read

Potee - Telugu Family Story | Malla Karunya Kumar
పోటీ - తెలుగు కుటుంబ కథ | మళ్ళ కారుణ్య కుమార్
Published In manatelugukathalu.com On 01/05/2026
ఆస్తి కోసం పోటీ పడితే…బంధాలు గెలుస్తాయా?లేక మనసులు ఓడిపోతాయా?
ఈ కథలో ఒక కుటుంబం…ఒక నిర్ణయం…మరియు ఒక గొప్ప మార్పు.
"నాన్నా! మీ నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నాం. మాకు రావాల్సిన వాటా మాకు ఇస్తే మా దారి మేము చూసుకుంటాం!" మొహమాటం లేకుండా అడిగేశాడు పెద్ద కొడుకు ప్రభాకర్.
"అవును నాన్నా, మీరు నా గురించి కూడా ఆలోచించాలి. మీరు లేనప్పుడు మీ ఆస్తిని కాపాడుతూ, వ్యాపారాలు చక్కబెడుతూ వచ్చాను అన్న సంగతి మీకు తెలిసిందే కదా... ఇచ్చిన ఒక కంపెనీ చూసుకోవడం చేతకాక దాన్ని నష్టాల్లో ముంచాడు. కనుక నాకు ఎక్కువ వాటా ఇవ్వండి. ఇప్పుడు లెక్క సరిపోతుంది" అన్న వైపు కోపంగా చూస్తూ తండ్రితో అన్నాడు చిన్న కొడుకు జగన్.
కొడుకుల్ని ఎలా వారించాలో నాగేశ్వర్‌కు అర్థం కావడం లేదు. సర్ది చెప్తే వినే స్థాయిని దాటిపోయారు. విసుగొచ్చి, "రేయ్, నా తనువు తీరే వరకు ఈ విషయం ప్రస్తావించవద్దు. ఇప్పుడు మీకు అప్పగించిన బాధ్యతలను చూసుకోండి" అని కొడుకులతో చెప్పాడు.
"కుదరదు నాన్నా! ఈ ప్రస్తావన తీసుకువచ్చే ప్రతి సారీ మీరు దాటవేస్తున్నారు. తర్వాత తీర్థాలు, పుణ్య క్షేత్రాలని నెలలు నెలలు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చేస్తే మాకు ప్రశాంతంగా ఉంటుంది. మీకు కూడా బాధ్యతలు తీర్చానని సంతృప్తిగా ఉంటుంది" హితవు పలికాడు చిన్న కొడుకు.
అప్పుడే నాగేశ్వర్ దగ్గరకు చేరుకున్నాడు అతని అన్న కొడుకు సాగర్.
"బాబాయ్!" అని గట్టిగా అరుస్తూ...
"మీరు ఇలా మోసం చేస్తారని అనుకోలేదు. నిజాన్ని దాస్తే దాగిపోతుందని అనుకున్నారా?" నాగేశ్వర్‌ను చూస్తూ అన్నాడు సాగర్.
"ఏమైంది సాగర్! నేను మోసం చేయడం ఏమిటి? నిజం దాచడం ఏమిటి?" ఆశ్చర్యపోతూ అడిగాడు నాగేశ్వర్.
"ఇవి చూడండి మొత్తం మీకే అర్థమవుతుంది" అని తనతో తీసుకువచ్చిన కొన్ని డాక్యుమెంట్స్ నాగేశ్వర్ చేతికి అందించాడు.
వాటిని తీసుకొని చూసి ఒక్కసారిగా కూర్చున్న చోటు నుంచి పైకి లేచాడు.
నాగేశ్వర్ ఆశ్చర్యపోవడం చూసి, "ఇప్పటికైనా అర్థమయ్యిందా బాబాయ్? మీరు చేసిన మోసం ఏమిటో, దాచిన విషయం ఏమిటో? మా నాన్న దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు. బదులుగా మీరు సంపాదించిన సంపాదనలో నలభై ఒక్క శాతం ఇస్తానని బాండ్ రాశారు. ఆ రోజు అవన్నీ చట్టబద్ధంగా నమోదు చేశారు. కానీ మా నాన్న చనిపోవడంతో ఈ విషయం మరిచిపోయారు. ఇప్పుడు నాకు ఈ డాక్యుమెంట్లు దొరికాయి కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మీరే చెప్పండి తీర్పు" నాగేశ్వర్ చేతిలో నుంచి ఆ డాక్యుమెంట్స్ తీసుకుంటూ అడిగాడు సాగర్.
సాగర్ ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా శిలలా అయిపోయాడు నాగేశ్వర్. ప్రభాకర్, జగన్ ఇద్దరూ ఆ మాటలు విని కోపంతో రగిలిపోయారు.
"రేయ్ సాగర్! ఈ ఆస్తి మా నాన్న కష్టార్జితం. అతని పిల్లలం కాబట్టి ఆ ఆస్తి మాకు దక్కుతుంది. మధ్యలో నువ్వు ఏవో కాగితాలు తీసుకువస్తే నీకు వాటా ఇవ్వాలా? అది కూడా నలభై ఒక్క శాతం! వాటా లేదు గిటా లేదు పో ఇక్కడ నుంచి" ఆవేశంతో పలికారు.
"పోతాను, పోతాను, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళితే నాకు న్యాయం జరుగుతుంది" అని అక్కడ నుంచి వెళ్ళబోయాడు సాగర్.
కంగారు పడుతూ, "ఆగు సాగర్! ఎందుకంత ఆవేశం? మనం కూర్చొని మాట్లాడుకుందాం. దీని కోసం నువ్వు వేరే దగ్గరకు వెళ్ళడం ఎందుకు?" అని వారిస్తూ అన్నాడు నాగేశ్వర్.
ఒక గ్రూప్ వన్ రిటైర్డ్ ఉద్యోగిగా ఆ డాక్యుమెంట్స్ చెల్లుబాటు గురించి తెలుసు. విషయం నలుగురికీ తెలిస్తే ఇన్నాళ్ళు పోగు చేసుకున్న తన ప్రతిష్ట దెబ్బతింటుందని నాగేశ్వర్ భయం.
చివరికి కొడుకులు తో, సాగర్ తో విడిగా మంతనాలు జరిపాడు. ఎవరూ కూడా మాట వినలేదు.
చివరికి విసిగిపోయి, "రేయ్ మీరు ఎవరూ కూడా నా మాట వినడం లేదు. ఒక పెద్దగా నాకు మీరు విలువ ఇవ్వడం లేదు. మీకు నచ్చింది చేసుకోండి" నిస్సత్తువ ఆవరించి సోఫాలో కూర్చుండిపోయాడు.
"ఈ ఆలోచన ముందు ఉండాలి కదా, మిమ్మల్ని ఎవడు డాక్యుమెంట్ రాయమని చెప్పారు?" విసుక్కుంటూ అన్నాడు ప్రభాకర్.
"రేయ్ ఏమిటా మాటలు! ఆ రోజుల్లో డబ్బు కొరత గురించి నీకు తెలియదు. అలాంటిది నన్ను నమ్మి తన భూమి అమ్మి నా చదువుకు, తర్వాత నేను గ్రూపు వన్ ఉద్యోగం కోసం సిద్ధమవడానికి అయిన ఖర్చుకి డబ్బులు సమకూర్చారు. ఆ రోజు ఆయన డబ్బులు ఇవ్వకపోయి ఉంటే ఈ రోజు ఈ భోగాలు అనుభవించే వాళ్ళు కాదు" అన్నాడు నాగేశ్వర్ కోపంగా.
"ఇప్పటికీ మంచి మాట అన్నారు బాబాయ్. మీరే ఒప్పుకున్నారు కదా మా నాన్న చేసిన సహాయాన్ని... మరి వాటా సంగతి ఏం చేస్తారు?" అడిగాడు సాగర్.
సాగర్ మాటలు విని మౌనం దాల్చాడు నాగేశ్వర్.
కొంత సమయం తర్వాత, "సరే అదంతా మీ కష్టార్జితం కనుక ఒక పని చేద్దాం" అని అన్నాడు సాగర్.
"ఏమిటో అది?" అందరూ ఆశ్చర్యపోతూ అడిగారు.
"ఒక పోటీ పెడదాం! కుటుంబ పోషణలో, మంచి మార్గంలో నడుచుకోవడంలో, పిల్లల పెంపకం విషయంలో, ఇంకా కొన్ని విషయాల్లో ఎవరు సరిగ్గా ఉంటారో వాళ్లకు ఎక్కువ భాగం వాటా ఇవ్వాలి. ఒకవేళ నేను విజేతనైతే నాకు నా నలభై ఒక్క శాతం ఇవ్వాలి. ఒకవేళ మీరు విజేతలయితే నేను ఒక్క శాతం కూడా వాటా అడగను. ఈ డాక్యుమెంట్స్ మీ ముందే చింపి పారేస్తాను" అన్నాడు సాగర్.
సాగర్ చెప్పింది నచ్చి మరో ఆలోచన లేకుండా పోటీకి మేము సిద్ధమే అని అన్నాడు ఇద్దరూ.
కొడుకులు తొందరపాటు చూసి, "ఎంత పని చేశారు! వీళ్ళ అసమర్థత చూసి సాగర్ ఈ విధంగా పోటీ పెట్టాడు. అన్ని విషయాల్లో సాగర్ పర్ఫెక్ట్‌గా ఉంటాడు. అతని పిల్లలు కూడా అన్ని రంగాల్లో ముందున్నారు" అని తనలో అనుకుంటూ బాధపడ్డాడు.
"మంచిది! ఈ పోటీకి న్యాయ నిర్ణేతగా బాబాయే ఉంటారు. అలా అని పుత్ర ప్రేమ చూపించి ఒక పక్షమే వకాల్తా పుచ్చుకుంటాను అంటే కుదరదు. ప్రతి ఒక్క పాయింట్ రాసుకోవాలి. విజేతల్ని ప్రకటించేటప్పుడు ఆ పాయింట్స్ ప్రస్తావించాలి. సరిగ్గా పదిహేను నెలలు ఇక్కడ నుంచి పోటీకి సమయం. ఈ పదిహేను నెలల్లో ఎవరు మంచి ప్రతిభ కనబరుస్తారో వాళ్ళే విజేతలు" అని చివరి మాటగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు సాగర్.
సాగర్ వెళ్ళిపోయిన తర్వాత, "రేయ్ మీరు ఎందుకు వెనుకా ముందూ ఆలోచించకుండా ఈ పోటీకి ఒప్పుకున్నారు? ఆ సాగర్ తన తెలివిని ఉపయోగించి మిమ్మల్ని దద్దమ్మలు చేద్దామని చూస్తున్నాడు" అని కోపంతో నాలుగు చివాట్లు పెట్టి,
"సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇకనుండైనా మీరు జాగ్రత్తగా నడుచుకోండి. నేను చెప్పినట్టు నడుచుకోండి తప్పకుండా మీరు గెలుస్తారు" అని కొడుకులతో చెప్పాడు.
కొడుకులు కూడా వేరే దారి లేక ఒప్పుకున్నారు. ప్రతి విషయం తెలుసుకొని కొడుకులు ఎక్కడ తప్పులు చేస్తున్నారో చూస్తూ వాళ్ళకు సలహాలు ఇస్తూ వాళ్ళను ఒక కంట కనిపెట్టుకొని ఉన్నాడు. మరో పక్క సాగర్ ను కనిపెట్టుకొని ఉన్నాడు. ఎక్కడ తప్పు చేసి సాగర్ దొరుకుతాడా అన్న కోణంలో చూస్తూ ఉన్నాడు.
కానీ సాగర్ నాగేశ్వర్‌కు ఆ అవకాశం ఇవ్వకుండా ఎటువంటి మచ్చ లేకుండా తన పనులు నిర్వర్తిస్తున్నాడు.
ఈ పోటీ మొదలైనప్పటి నుంచి పెద్ద కొడుకు ప్రభాకర్, అతని భార్య రమణి ఇద్దరూ ఇంటి వ్యవహారాలు చూసుకుంటున్నారు. అంతకు ముందైతే ఇద్దరూ ఎప్పుడూ క్లబ్‌లో తిరిగేవాళ్ళు.
చిన్న కొడుకు జగన్, అతని భార్య వ్యాపారాలు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. ఏ చిన్న లోటు కూడా లేకుండా చూస్తున్నారు. ఇంతకు ముందైతే డబ్బు ఆశతో వెనకా ముందూ ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టేసేవారు. అలాగే నష్టపోయేవారు. ఇప్పుడు వాళ్ళ ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని ఒక పనికి పది ఆలోచనలు చేసి ముందడుగు వేస్తున్నారు. వ్యవహారాలు అన్నీ చూస్తూ వీలు దొరికిన సమయాల్లో మనవరాళ్ళు, మనవళ్ళను దగ్గరకు తీసుకొని వాళ్ళకు అర్థం కాని తరగతి పాఠాలు చెప్పడం.
ఎలా తమని తాము తీర్చిదిద్దుకోవాలన్నది చెప్పడం. ఇలాంటివి చేసేవాడు. ఎలాగైనా తన ఆస్తిలో వాటా సాగర్ కు వెళ్ళకూడదని కంకణం కట్టుకొని మరీ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. అలా రోజులు గడుస్తున్నాయి. పదిహేను నెలలు పూర్తయ్యాయి. తాను చూసిన ప్రతి విషయాన్ని రాసుకున్నాడు. ముగ్గురు చేసిన పనులు, వాళ్ళ పురోగతి, చేసిన తప్పులన్నీ ప్రత్యేకంగా డేటా తయారు చేశాడు.
కొడుకుల ప్రవర్తన సంతృప్తిగా ఉన్నా కానీ సాగర్ తో వాళ్ళు పోటీలో వెనుకంజలో ఉన్నారు. అది కూడా ఒక్క శాతంతో... ఫలితాలు చూసి నాగేశ్వర్ లో బాధ. కానీ న్యాయ నిర్ణేతగా తన పని సక్రమంగా నిర్వహించాలి అనుకున్నాడు. ముగ్గుర్నీ పిలిచి ఫలితాలు ప్రకటించాడు. అందరూ ఊహించినట్టుగానే సాగర్ విజేతగా నిలిచాడు.
"పర్వాలేదు నాన్నా! ఈ పోటీలో మేము చాలా నేర్చుకున్నాం. ఈ ఆస్తి మాకు చాలు. మేము ఇంకా సంపాదించుకోగలం" తండ్రితో అన్నారు.
కొడుకుల నుంచి ఈ మాటలు విని ఉప్పొంగిపోయాడు నాగేశ్వర్. ఇంతకు ముందు ఎప్పుడూ వాళ్ళ నుంచి ఇలాంటి మాటలు వినలేదు.
"మీరు ఇలా మాట్లాడటం గర్వంగా ఉంది. మీ నుంచి నేను ఎప్పుడూ ఆశించేది ఈ ఆత్మవిశ్వాసమే. ఇన్నాళ్ళకు మీ నుంచి ఈ మాట విన్నాను. ఇప్పుడు సాగర్ గెలుచుకున్న ఆస్తిని అతనికి రాసి ఇచ్చేస్తాను" నవ్వుతూ అన్నాడు.
నాగేశ్వర్ మాటలు విని, "వద్దు బాబాయ్. మీరు నా పేరున ఆస్తి రాయాల్సిన అవసరం లేదు" అన్నాడు సాగర్.
అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశ్చర్యానికి తెర దించుతూ, "వీళ్ళు బాధ్యత లేకుండా తిరగడం, మీరు ఇంటి వ్యవహారాలు పట్టించుకోకుండా తిరగడం చూసి నేనే మీకు సరైన మార్గంలో నడవమని చెప్పాలనుకున్నాను. కానీ అలా చెప్తే మీరు నా మాట వినరని నాకు తెలుసు. నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నాన్న ఈ డాక్యుమెంట్ గురించి నాకు ఎప్పుడో చెప్పారు బాబాయ్. కానీ వీటిని నువ్వు నీ లక్ష్యం బాధ్యతగా చేరుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో ఏమరుపాటు ఉండకూడదని ఇలా రాయించారు. వీటిని ఉపయోగించి మీ దగ్గర ఆస్తి తీసుకోవద్దని మరీ మరీ నాకు చెప్పారు.
కానీ మిమ్మల్ని దారిలోకి తీసుకురావడానికి ఇవి ఉపయోగపడ్డాయి. కానీ వీటి గురించి నాకు తెలుసన్న విషయం తెలియగానే మీరు ఆశ్చర్యపోయారు. నేను వాటా అడిగానని నాతో ఎన్నో మంతనాలు జరిపారు. మీలో ఇంత స్వార్థం ఉందని నేను అనుకోలేదు బాబాయ్. వాటా అడగడంతో మీ దృష్టిలో నేను చెడ్డవాడిని అయిపోయాను. మీ దృష్టికోణం పూర్తిగా మారిపోయింది. ఉన్నత స్థానాలు అధిరోహించిన మీరు ఇలా నడుచుకుంటారని నేను అనుకోలేదు" అన్నాడు సాగర్.
"సాగర్! నన్ను క్షమించు. పుత్ర ప్రేమతో, మమకారంతో నా కళ్ళు మూసుకుపోయాయి. మా అన్నయ్య నాకోసం పడిన శ్రమ కూడా మరిచిపోయాను. నువ్వు నా కళ్ళు తెరిపించావు. నా బాధ్యత ఏమిటో మళ్ళీ నాకు గుర్తు చేశావు. ఆస్తుల్ని లెక్క చేయకుండా విలువలకు, బంధాలకు విలువ ఇచ్చే నీ మనస్సును తెలుసుకోలేకపోయాను. నిన్ను అపార్థం చేసుకున్నాను. నీలాంటి నిజమైన ఆస్తి ఎంత పుణ్యం చేస్తే నాలాంటి వారికి దొరుకుతుంది" ఒక్కసారిగా కన్నీళ్లు కారుస్తూ సాగర్ ను కౌగలించుకున్నాడు నాగేశ్వర్.
***సమాప్తం****
మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.
విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.
సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.
telugu comedy story, funny telugu kathalu, husband wife comedy story, telugu humor story, short comedy story telugu, మళ్ళ కారుణ్య కుమార్, Malla Karunya Kumar |






Comments