top of page
Original.png

తాతగారి పడక్కుర్చి

Aug 11
4 min read

ఒకరికొకరు, కుటుంబ కథ, భార్యాభర్తల అనుబంధం, వృద్ధాప్యం, తల్లిదండ్రులు, పిల్లలు, భావోద్వేగ కథ, తెలుగు కథ, నయన కస్తూరి

తాతగారి పాత పడక్కుర్చీలో వార్తాపత్రిక చదువుతున్న వృద్ధుడు, చుట్టూ ఆడుకుంటున్న నలుగురు మనవళ్లు
అనారోగ్యంతో ఉన్న భార్యకు ప్రేమగా సేవ చేస్తున్న భర్త, దూరంలో ఉన్న పిల్లలతో భావోద్వేగ కుటుంబ దృశ్యం

Thatha Gari padakkurchi- Telugu Family Story | Nayana kasthuri

తాతగారి పడక్కుర్చి - తెలుగు  కుటుంబ కథ | నయన కస్తూరి

Published in manatelugukathalu.com on 11/08/2026


“తాతగారి పడక్కుర్చి” శ్రీమతి నయన కస్తూరి రచించిన హృదయస్పర్శి తెలుగు కథ. ప్రతిరోజూ వార్తాపత్రిక చదువుకుంటూ విశ్రాంతి తీసుకునే రంగనాధంగారికి తన పాత పడక్కుర్చి అంటే ఎంతో ఇష్టం. కొడుకు, కూతురు తమ పిల్లలతో వేసవి సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు, మనవళ్ల ఆటల్లో ఆ పడక్కుర్చి దెబ్బతినడంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఒక సాధారణ కుర్చీ వెనుక దాగి ఉన్న జ్ఞాపకాలు, అనుబంధం, కుటుంబ ప్రేమ ఈ కథలో మనసుకు హత్తుకునేలా ఆవిష్కృతమవుతాయి.

                                                                                                                      

రంగనాధంగారు తన పడక్కుర్చీలో కూర్చుని, వార్తాపత్రిక ఎంతో మనసు పెట్టి చదువుకుంటారు ప్రతిరోజూ. రంగనాధంగారికి పేపర్ చదవడం అంటే ఎంతో ఇష్టం. అందులోనూ తనకెంతో ఇష్టమైన పడక్కుర్చీలో విశ్రాంతిగా కాళ్లు జాపుకుని, వీపు వెనక్కి వాల్చుకుని, మధ్యమధ్యలో కళ్లజోడు సవరించుకుంటూ చదవడం ఆయనకు ఎంతో ఇష్టం.


ఈమధ్య టీవీలో అనేక వార్తా చానెల్స్ ఇరవై నాలుగు గంటలూ ప్రపంచంలోని నలుమూలల నుంచి వార్తలను మన ఇంటి మండువాలోకి ప్రత్యక్షంగా, మన కళ్ల ముందుకు తేవడం వలన వార్తాపత్రికల ప్రాముఖ్యత తగ్గింది. కానీ రంగనాధంగారికి మాత్రం వాటి మీద మక్కువ తగ్గలేదు. రోజూ పేపర్ క్షుణ్ణంగా చదువేస్తారు, పడక్కుర్చీలో కూర్చుని.


ఈ అలవాటువలన రిటైర్ అయినా, ఏ ఇతర కాలక్షేపం లేకపోయినా, తాము ఎంతో గారాబంగా పెంచుకున్న కొడుకు, కూతురు తమ పిల్లలతో సహా వాళ్ల మెరుగైన జీవితాల కోసం ముంబాయి మహానగరానికి వెళ్లిపోయినా, ఒంటరితనం ఫీల్ అవ్వకుండా, ఆ పడక్కుర్చీలో వార్తాపత్రికతో సహజీవనం చేస్తూ, వేళకు భార్య చేతి రుచికరమైన వంటకాలు భుజిస్తూ, కుటుంబ సభ్యులకు ఏ విధమైన ఇబ్బంది కలిగించకుండా హాయిగా జీవనం కొనసాగిస్తున్నారు భార్యతో.


ఆ ఉదయం ప్రతిరోజూ లాగానే పడక్కుర్చీలో కూర్చుని, పేపర్ చదువుకుంటున్న రంగనాధంగారి దగ్గరకు భార్య వర్ధనమ్మ చేతిలో బత్తాయిరసంతో వచ్చింది.

“ఏవండోయ్! ఇదిగో బత్తాయిరసం తాగండి. ఈ రోజు బాగా ఎండగా ఉంది, తీసుకోండి” అంటూ గ్లాసు అందించింది.


ఆయన దాన్ని అందుకుని తాగుతుంటే, వర్ధనమ్మగారు, “ఏవండీ, మిమ్మల్నే! మళ్లీ శనివారం ఈపాటికి పిల్లలంతా దిగుతారు. వాళ్ల హడావిడితో ఇల్లంతా సందడే సందడి కదండీ?” అన్నారు.


“అవునోయ్, అప్పుడు మనిల్లు పెళ్లివారిల్లే! వాళ్లకి కావలసిన సరుకులన్నీ చూసి, ముందే తెప్పించుకో. మళ్లీ పిల్లల ముందు అది లేదు, ఇది లేదు అనుకుంటుంటే బాగుండదు” రంగనాధంగారి సలహా.


“అవునండీ! మళ్లీ అన్నీ ఒకసారి చూసి, మన వాచ్‌మాన్‌తో తెప్పించుకోవాలి” వర్ధనమ్మగారి సమాధానం.


వాళ్లు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. కొడుకు, కూతురు తమ ఇద్దరేసి పిల్లలతో వేసవి సెలవులకు దిగారు. చిన్నచిన్న ఫ్లాట్స్‌లో ఉన్న పిల్లలకు తాతగారి విశాలమైన పాతకాలం మండువా ఇల్లంటే ఎంతో ముచ్చట. రకరకాల మొక్కలు, చెట్లతో నిండిన దొడ్లలో పరుగులెడుతూ ఆడుకుంటున్నారు.


వారి ఆటలు, కేరింతలు చూసి రంగనాధంగారు కొంచెం ముచ్చటపడిన మాట వాస్తవమే కానీ, ఈ ఆటపాటల మధ్య ఆయన ఏమాత్రమూ సహించలేని విషయం ఒకటి జరుగుతోంది. రోజూ ఆయన ఎంతో ఇష్టంగా, జాగ్రత్తగా చూసుకునే ఆయన పడక్కుర్చీ మనవళ్ల చేతిలో ఒక ఆటవస్తువైంది. దాని మీద గెంతుతూ, దాని మీద నుంచి కిందకు దూకుతూ, దానిని ఒక గుర్రంలాగా భావించి “చల్! చల్!” అంటూ స్వారీ చేసేస్తున్నారు ఆ కుర్చీని, ఆ నలుగురు పిల్లలు.


అది చూసి, తన పడక్కుర్చీని పిల్లల బారి నుంచి రక్షించుకోవడానికి ఆయన ప్రయత్నం చేశారు.


“ఏయ్ పిల్లలూ! ఆపండర్రా మీ అల్లరి చేష్టలు. నా ఒక్కగానొక్క పడక్కుర్చీ విరిగిపోతుందర్రా!” అని చెప్పారు.


ఆటల్లో మునిగిపోయిన ఆ పిల్లలు తాతగారి మాట వినిపించుకునే స్థితిలో లేరు. ఆఖరికి కుర్చీ చెయ్యి విరగనే విరిగింది.


“పిల్లలూ! మీరు మీ ఆగడాలు ఆపుతారా? లేదా?” అని గట్టిగా అరవడంతో,

“ఏంటి నాన్నా! అంత గట్టిగా అరుస్తున్నారు? వాళ్లను ఆడుకోనివ్వండి. పాత కుర్చీయే కదా?” అని రంగనాధంగారి అబ్బాయి తండ్రిని మందలించాడు.


“చాల్లేరా! ఎప్పటినుంచో నేను కూర్చుంటున్నది. చూడు ఎలా విరిగిపోయిందో” అంటూ దానిని చేత్తో తడుముతూ బాధపడ్డారు.


“ఏమోయ్, వర్ధనమ్మ! చూడవోయ్! నీ మనవళ్లు నా పడక్కుర్చీని ఎలా ముక్కలు చేశారో! ఇక రోజూ నేనెక్కడ కూర్చుని నా పేపర్ చదువుకోవాలి?” అంటూ కాస్త గట్టిగానే అరుస్తూ చెప్పారు.


భర్త కుర్చీ విరిగిందని వర్ధనమ్మగారు బాధపడినా, పిల్లలు తండ్రి మాటలను ఎక్కడ తప్పుపడతారో అని భర్తకు సర్దిచెప్పడానికి చూశారు.

“చెయ్యే కదా విరిగింది? అంత ఇదైపోతున్నారు! కార్పెంటర్ చేత పెట్టించుకోవచ్చులెండి” అన్నారు.


“చిన్న పిల్లలు విరక్కొడుతుంటే నీ పిల్లలు కనీసం వాళ్లని ఆపను కూడా ఆపలేదు. నేనేమి చెయ్యాలి ఇప్పుడు?” అని వాపోతుంటే, కొడుకు, కూతురు చిన్నబుచ్చుకుని తమ గదుల్లోకి వెళ్లిపోయారు.


“అయ్యో రామా! నేనేమి చెయ్యాలి? ఈయనకూ చెప్పలేను, పిల్లలకీ చెప్పలేను. ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నానురా దేవుడా!” అనుకుంటూ కుర్చీని జాగ్రత్తగా స్టోర్‌రూమ్‌లో పెట్టించి, వంటింట్లో పని చూసుకోవడానికి వెళ్లింది.


రెండు రోజులు గడిచాయి. రంగనాధంగారికి ఏమీ తోచడం లేదు పడక్కుర్చీ లేక. వీధివైపు అరుగు మీద కూర్చుని ఏదో కాసేపు పేపర్ చదువుకుంటున్నారు. ఆయనకది తృప్తినివ్వడం లేదు. కొడుకు, కూతురికి కూడా తండ్రి పడుతున్న బాధని చూసి, దానిని ఎలా పోగొట్టాలా అనే ఆలోచనలో పడ్డారు.


ఆ రోజు పేపర్ రాగానే కొడుకు తీసుకుని, తండ్రి గదిలోకి వెళ్లి,

“నాన్నగారూ, ఒకసారి ఇలా రండి నాతో” అని చెయ్యి పట్టుకుని హాల్‌లోకి తీసుకుని వచ్చి,


“ఇది చూడండి! మీరిక ఆ పడక్కుర్చీ కోసం బాధపడక్కర్లేదు. మీకోసం నేనూ, చెల్లాయి కలిసి ఈ రివాల్వింగ్ రిక్లైనర్ సోఫా కొన్నాము” అని ఒక అందమైన రాయల్ బ్లూ కలర్ రిక్లైనర్ చూపించారు.


“చూడండి, ఇలా కూర్చుని, దర్జాగా కాళ్లు జాపుకుని, వెనక్కి వాలి, రిలాక్స్‌డ్‌గా కూర్చుని, రోజంతా మీరు పేపర్ చదువుకోవచ్చు. మధ్యమధ్యలో మీకు నిద్ర వస్తే కునుకు తీయచ్చు నాన్నగారూ!” అని సంతోషంగా దానిని వర్ణిస్తూ చెప్పుకుంటూ పోతున్నాడు.


ఇంతలోనే వాచ్‌మాన్ రాంప్రసాద్ పడక్కుర్చీ తీసుకొచ్చి,

“సార్! ఇదుగోండి, మీ పడక్కుర్చీ రెడీ. కూర్చోండి!” అని దాని స్థానంలో దాన్ని పెట్టాడు.


రంగనాధంగారు వెంటనే రిక్లైనర్ వైపు నుంచి తన కుర్చీ దగ్గరకు వెళ్లి,

“ఏమోయ్, వర్ధనమ్మ! చూడు, నా కుర్చీ రెడీ అయి వచ్చేసింది. నా తోడు నా దగ్గరకు వచ్చేసింది” అని సంతోషంగా పడక్కుర్చీలో కూర్చుని,

“రామూ, ఆ పేపర్ ఇటివ్వరా!” అని పేపర్ అందుకున్నారు.


“నా కుర్చీ నాకు వచ్చిందిరా అబ్బాయి! ఆ రిక్లైనర్ పిల్లలకు ఇచ్చేయి ఆడుకోడానికి. నా కుర్చీ నాకు చాలు” అన్నారు.


“ఏమిటి, నాన్నగారూ! ఏమంటున్నారు? ఇది ఎంతో తెలుసా? మీకోసమని ఏభైవేలు పెట్టి కొన్నాము. వాళ్లకి ఆడుకోటానికి ఇమ్మంటారేమిటి?” అని ఆశ్చర్యపోయాడు.

“బాగుంది నాన్నా మీరనేది” అంటూ కూతురు నిష్టూరమాడింది.


“అది కాదర్రా, పిల్లలూ…” అని ఆయన ఏదో చెప్పబోతుంటే, అక్కడికి వచ్చిన పిల్లలు తాతగారి కుర్చీని చూసి,

“తాతయ్య కుర్చీ వచ్చిందీ! తాతయ్య కుర్చీ వచ్చిందీ! రండి, రండి! ఆడుకుందాము!” అంటూ పరిగెత్తుకుని వస్తుంటే,

“మీకు రివాల్వింగ్ సోఫా కొత్తది వచ్చింది కదరా? దానిమీద ఆడుకోండి.


నా పడక్కుర్చీ జోలికి రాకండి” అంటూ దానిని గట్టిగా పట్టుకుని కూర్చున్నారు తాతగారు.


“లేదు తాతయ్యా! మాకు నీ పడక్కుర్చీనే కావాలి. మాకేమీ రిక్లైనర్ వద్దు. నువ్వు లే తాతయ్యా!” అంటూ మనవళ్లు నలుగురు రంగనాధంగారిని చుట్టుముట్టారు.

అప్పుడు తెలిసింది ఆ కుటుంబ సభ్యులకు తాతగారికి పడక్కుర్చీతో ఉన్న అనుబంధం!!!


***

నయన కస్తూరి గారి కొన్ని ఇతర రచనలు:



నయన కస్తూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


నయన కస్తూరి

రచయిత పరిచయం: నయన కస్తూరి

నా పేరు నయనతార కస్తూరి. నా విద్యార్హత M A English Lit. Med. తెలుగు, ఇంగ్లీష్  హిందీ భాషలంటే ఎంతో అభిమానం. కధలు వ్యాసాలు, ఆధ్యాత్మిక  విషయాలు  రచించుట నా హాబీ. నేను రచించిన కొన్ని కధలు మాస వార పత్రికలలో ప్రచురింప బడినవి..మేము హైదరాబాద్ వాస్తవ్యులము.

2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Beautifully written 👏

Like

Rated 5 out of 5 stars.

Nice heartwarming story! The attachment elders have for their personal artifacts can not be understood by the next generation. What is emotionally very important for him was just an old wooden chair for them. The story highlights this gap in understanding effectively.

Like
bottom of page