top of page

ప్రధాని ప్రసంగం - ఆంతర్యం

#RCKumar, #శ్రీరామచంద్రకుమార్, #PradhaniPrasangamAntharyam, #ప్రధానిప్రసంగంఆంతర్యం, #TeluguArticleOnTerrorism

Pradhani Prasangam Antharyam - New Telugu Article Written By R C Kumar

Published In manatelugukathalu.com On 13/05/2025

ప్రధాని ప్రసంగం - ఆంతర్యం - తెలుగు వ్యాసం

రచన: ఆర్ సి కుమార్


నేపథ్యం :

ఆపరేషన్ సింధూర్ పై మొదటిసారిగా జాతిని ఉద్దేశించి భారత ప్రధాని చేసిన ప్రసంగం ప్రచారం కోసమో, రేటింగ్ పెంచుకోవడానికో లేక బావోద్వేగాలతోనో చేసినది కాదు. శత్రుదేశానికి, అంతర్జాతీయ సమాజానికి కూడా అందించిన ఘాటైన పదజాలంతో కూడిన స్పష్టమైన సందేశం అది. త్రివిధ దళాలు మరియు సరిహద్దు దళాల శౌర్య పరాక్రమాలను, భారతమాత ముద్దుబిడ్డల ఐక్యతను, కొనియాడుతూ నేషన్ ఫస్ట్ స్ఫూర్తిని ప్రదర్శించిన వైనాన్ని ప్రశంసించారు. మేకిన్ ఇండియా ఆయుధాల సామర్థ్యం ఏమిటో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తెలిసిందన్నారు. 


తొలగిన ఉగ్రవాద ముసుగు : 

నగరాల నడిబొడ్డున ఆసుపత్రుల ముసుగులో ఉగ్రవాద స్థావరాలలో శిక్షణనిచ్చి ప్రపంచ దేశాలపై వారిని ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ పాలకుల విష సంస్కృతిని ప్రపంచ దేశాలకు తెలియజేశారు. పాకిస్తాన్ దేశం తమ తీవ్రవాద మిలిటరీ ద్వారా ఉగ్రవాదుల తయారీ ఫ్యాక్టరీ, ఉగ్రవాదుల శిక్షణా యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నది. దానిని ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా ముద్ర వేయడానికి అధికారిక సైనిక లాంచనాలతో చనిపోయిన ఉగ్రవాదులకు అంత్యక్రియలకు జరిపించడమే పెద్ద రుజువు. 


భారత్ షరతులు: 

ఉగ్రవాదం చర్చలు ఓకే సమయంలో జరగవు అన్న ప్రధాని సిద్ధాంతాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంపీ చిదంబరం గారు నిర్ద్విందంగా బలపరిచారు. మన ఐక్యతే మన బలమైన శక్తి, నేషన్ ఫస్ట్ అనే విషయంలో అందరూ ఒకటే అని ప్రతిపక్షాలతో సహా జాతి మొత్తం నిరూపించింది. వర్తక వాణిజ్యాలు చర్చలు కూడా సమాంతరంగా జరగలేవు అని ఇదివరకే పాకిస్తాన్ పై విధించిన ఆంక్షలు విషయంలో స్పష్టం చేశారు.‌ మరీ ముఖ్యంగా నెత్తురు నీరు కలిసి ప్రవహించలేవు అని ఖరాకండిగా మాట్లాడుతూ సింధు జలాల నిలుపుదలపై తగ్గేది లేదని చెప్పకనే చెప్పారు. 


ఆధునిక సాంప్రదాయం: 

తరతరాలుగా భారతదేశం పాటిస్తున్న ధర్మాచరణ, శాంతి మంత్రాన్ని బలపరుస్తూనే ఉగ్రవాదుల విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని నొక్కి చెప్పారు.‌ బుద్ధ పౌర్ణమి రోజున బుద్ధుడి శాంతి మార్గ ప్రభోదాన్ని గుర్తు చేసుకుంటూ, శక్తితోనే శాంతి సాధ్యమవుతుందన్న వాస్తవాన్ని గ్రహించాలన్నారు. కాబట్టి భారతదేశం మరింత శక్తివంతంగా రూపుదిద్దుకోవాలి.‌

ఈయుగం యుద్ధాల యుగం కాదు అలాగని తీవ్రవాద యుగం కూడా కాదని తేల్చి చెప్పడంలో ఉద్దేశం ఉగ్రవాదులను ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వారికి దిమ్మతిరిగే రీతిలో జవాబు ఇస్తామని సూటిగా చెప్పడమే.‌ ఇప్పటివరకు సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్, మిలటరీ చర్యలతో సరిపెట్టుకున్నాము. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం తడాఖా ఏమిటో పాకిస్తాన్ తో సహా దాని మిత్ర దేశాలకు కూడా చూపించాము. భారత్ ను రెచ్చగొడుతూ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేస్తున్న పాకిస్తాన్ ఆగడాలను ఇక సహించేది లేదని, ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద ప్రేరేపిత ప్రభుత్వాన్ని విడివిడిగా చూడబోమని తేల్చి చెప్పారు. 


ఊహించని దెబ్బ: 

ఉగ్రవాదానికి గ్లోబల్ యూనివర్సిటీలుగా వ్యవహరిస్తున్న బహావల్పూర్, మురీద్ లాంటి స్థావరాలపై గురిపెట్టి ధ్వంసం చేసిన తీరు అమోఘం. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగినా వాటి మూలాలు పాకిస్తాన్ లోని ఈ ప్రాంతాలలోనే ఉన్నాయి. వాటిని మట్టి కరిపించి ప్రపంచశాంతికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడ్పడ్డాము. ఉగ్రవాద నిర్మూలనలో భారత్ కు సహాయం చేయాల్సింది పోయి మనదేశం మీదనే ఎదురు దాడి చేసింది పాకిస్తాన్. భారత దేశంలోని పాఠశాలలు, గురుద్వారాలు, మందిరాలపై దాడిచేసిన పాక్ తగిన మూల్యాన్ని చెల్లించుకుంది. కీలకమైన పాక్ వైమానిక స్థావరాలు పై భారత సైన్యం దాడి చేసి మూడు రోజుల్లోనే మూడు చెరువుల నీళ్లు తాగించడమే కాక, పౌరుల జోలికి పోకుండా ఉగ్రవాదుల స్థావరాలు, వారి మౌలిక సదుపాయాలు, హెడ్ క్వార్టర్స్ ను సమూలంగా నాశనం చేసింది. 


పాక్ భస్మాసుర హస్తం:

పాములకు పాలు పోసి పెంచుతున్న పాకిస్తాన్ బతికి బట్ట కట్టాలంటే తమ దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించుకోక తప్పదని సలహా ఇచ్చారు మన ప్రధానమంత్రి. లేదా ఏదో ఒక రోజు వాటి కాటుకు బలైపోవాల్సిందే. ముగింపుగా అంతర్జాతీయ సమాజానికి అర్థం కావలసిన రెండు ప్రధాన విషయాలను స్పష్టంగా తెలియజేశారు. పాకిస్తాతో చర్చలు అంటూ జరపవలసి వస్తే అది రెండు ప్రధాన అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. మొదటిది ఉగ్రవాద నిర్మూలన, రెండవది పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత్ హక్కు. దీని అంతర్యం ఎప్పటికైనా పిఓకే మాదే అని స్పష్టం చేస్తూ దాన్ని సాధించి తీరుతామని ఉద్ధాటించడమే. దశాబ్దాలుగా నలుగుతున్న కాశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా భారత జాతికి కావలసినది ఇంతకన్నా ఏముంటుంది. 


ధన్యవాదాలు 


ఆర్ సి కుమార్


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comments


bottom of page