top of page
Original.png

ప్రమాదం లో పథకం

1 hour ago
7 min read

ప్రమాదంలో పథకం కథలో అగ్నికి గురైన బస్సు పక్కన ప్రాణాలతో బయటపడిన అంజలిని రక్షిస్తున్న పోలీస్ అధికారి దృశ్యం.

Pramadham Lo Padhakam - Telugu Crime Thriller Story | Vemparala Durga Prasad

ప్రమాదం లో పథకం - తెలుగు క్రైమ్ థ్రిల్లర్ కథ | వెంపరాల దుర్గాప్రసాద్

Published In manatelugukathalu.com On 09/09/2026


ప్రమాదంలో పథకం వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ఉత్కంఠభరితమైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ కథ. బస్సు ప్రమాదం, రాజకీయ కుట్ర, కిడ్నాప్, మానవ అక్రమ రవాణా, నాలుగేళ్ల మిస్టరీ వంటి అంశాలతో ఈ కథ ఆసక్తికరంగా సాగుతుంది.



అది కర్నూలు నగరం, గాంధీ నగర్ సెంటర్. సమయం రాత్రి 8.30 నిమిషాలు అవుతోంది.

అంజలి హడావిడిగా వచ్చి స్లీపర్ బస్సు ఎక్కింది. అది అప్పటికే కదలటానికి సిద్ధంగా ఉంది.

ఆమె ఎక్కుతుంటే డ్రైవర్ సీట్ నెంబర్ అడిగి, “రండి, మీకోసమే బయలుదేరలేదు” అంటూ బస్సు ఇంజిన్ ఆన్ చేశాడు.


“ఏంటో... బస్సు కదిలితే గానీ రారు... ఈ ఆడాళ్ళు” అని అతను గొణుక్కోవడం ఆమె చెవిని దాటిపోలేదు.


ఆమె బస్సు ఎక్కడం కొన్ని జతల కళ్ళు పరిశీలనగా చూస్తున్నాయని అప్పుడు ఆమెకు తెలియదు. వాళ్ళ పథకం ప్రకారం బస్సు మహబూబ్ నగర్ చేరుకున్నాక, వారు ఆమెను బస్సు దింపించాలి. అది వాళ్ళకి ఇవ్వబడిన ఒక కాంట్రాక్ట్. బస్సును ఫాలో అవుతున్న ఆ గ్యాంగ్ వాడుతున్నది ఒక ఇన్నోవా కారు. ఆ ఇన్నోవాకి నెంబర్ ప్లేట్ కూడా డూప్లికేట్ నెంబరే.


బస్సు హైదరాబాద్ వెళ్లే దారిలో స్పీడ్‌గా ప్రయాణిస్తోంది. ఇప్పుడది ఆత్మకూర్ దాటి 15 నిమిషాలు అయింది.


బస్సు వెనుకే వస్తున్న ఆ గ్యాంగ్ లీడర్ ముకేశ్ రోడ్డు పక్కన ఉన్న వైన్ షాప్ దగ్గర ఇన్నోవాను ఆపించాడు. వాళ్ళు నలుగురు ఉన్నారు. డ్రైవర్‌ను 4 రమ్ బాటిల్స్ తెమ్మని చెప్పాడు.


ఇంతలో వాళ్ళలో ఒకడైన సుల్తాన్, “అన్నా ఇప్పుడు అవసరమా... ముందు పోరి పని చూసేక, మహబూబ్ నగర్ లో తాగుదాం” అన్నాడు.


“ఊర్కోరా... పోరి పని చూడాలంటే ముందు లోపల మందు ఉండాలె” అని నవ్వాడు.


మిగిలిన ఇద్దరూ నవ్వారు. సుల్తాన్ మరేమీ అనలేక ఊరుకున్నాడు.

మళ్ళీ ముకేశ్ ఇలా అన్నాడు:

“ఆ బస్సును అందుకోవడం కష్టం కాదులేరా... మళ్ళీ పది నిమిషాల్లో బస్సు వెనుకనే ఉరుకుతాములే.”


మరో 15 నిమిషాల్లో వాళ్ళు ఆ బాటిల్స్ ఖాళీ చేసి, మళ్ళీ బస్సును అందుకోవడానికి హైవే ఎక్కేశారు.

హైవే నెంబర్ 44 చీకట్లో కాలనాగులా ఉంది. వాళ్ళు వెళ్తున్న ఇన్నోవా స్పీడ్ 120 కిలోమీటర్ల వేగం దాటేసింది.

ముకేశ్ అనుకున్నట్లే ఆ బస్సును చాలా దూరం నుంచే పసిగట్టాడు.

“అదిగో రా సుల్తాన్... బస్సును దొరకబట్టిన” అన్నాడు దూరంగా కనిపిస్తున్న బస్సును చూపిస్తూ.


“మనం ఆపాల్సిన బస్సు కాడికి చేరిపోతాం. మహబూబ్ నగర్ కూడా వచ్చేసింది” అన్నాడు ఇంకొకడు.


సుల్తాన్‌తో పాటు మిగిలిన వాళ్ళు అటువైపు చూశారు.

అప్పటికి వాళ్ళు మహబూబ్ నగర్ పరిసరాలలోకి వచ్చేసారు.

ఆ బస్సుకు ఇంకొక అరకిలోమీటర్ దూరంలో ఒక మోటార్ సైక్లిస్ట్ హైవే మీద పడిపోయాడు. వాడు తాగిన మైకంలో, తలకు పెద్ద దెబ్బ తగిలి అక్కడికక్కడే మరణించాడు. వాడు నడుపుతున్న మోటార్ సైకిల్ హైవే మీద అడ్డంగా పడిపోయింది.

స్లీపర్ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు గానీ, వెనుక వస్తున్న ఆ రౌడీ గ్యాంగ్‌కు గానీ, పడిపోయిన మోటార్ సైకిల్ చేయబోతున్న విధ్వంసం గురించి తెలియదు. విధి ఆడబోతున్న నాటకం మనుషులు ఊహించలేరు కదా!


ఇంతలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న బస్సు ముందు టైర్ హఠాత్తుగా పగిలిపోయి, బస్సు కంట్రోల్ తప్పింది. డ్రైవర్ చేస్తున్న ప్రయత్నం ఫలించలేదు... ఇంతలో గతి తప్పి, ఉరుకుతున్న బస్సు పడిపోయిన మోటార్ సైకిల్‌ను గుద్దుకోవడం, మోటార్ సైకిల్ యొక్క పెట్రోల్ ట్యాంక్ బద్దలు కావడం జరిగింది.


దాన్ని ఈడ్చుకుంటూ వెళ్తున్న బస్సు కింద, రోడ్డు మీద నిప్పురవ్వలు రేగడం, బస్సు ఇంధన ట్యాంక్ పేలిపోవడం ఒకేసారి జరిగాయి. పెద్ద విస్ఫోటనం జరిగింది, క్షణాల్లో బస్సు అగ్నికీలల్లో మునిగిపోయింది. నిద్రలో జోగుతున్న ప్రయాణీకులు తేరుకునే లోపే జరగరాని అనర్థం జరిగిపోయింది.


దూరంగా బస్సు తగలబడిపోతున్న దృశ్యం చూసి ఇన్నోవాలో వస్తున్న ముకేశ్ గ్యాంగ్ షాకయ్యింది.


అక్కడ బస్సులో ప్రయాణికుల ఆర్తనాదాలు గాలిలో కలిసిపోయాయి.

వీళ్ళ కార్ బస్సును సమీపించేసరికి బస్సు పూర్తిగా అగ్నిలో తగలబడిపోతోంది.

అక్కడ హైవే మీద సీసీ కెమెరాలు లేని ప్రదేశం అది.


వెనుక వస్తున్న వాహనాలు ఆగకుండా వెళ్ళిపోతున్నాయి. కాలిపోతున్న బస్సులోని వాళ్ళకి సహాయం చేయడం కంటే, ఆ పోలీస్ కేసు మనకెందుకు అన్నట్లు ఉంది ఆ కార్ల వాళ్ళ ఆలోచనా ధోరణి.


సుల్తాన్ అన్నాడు... “పోనీలే అన్నా... మన చేతులకి మట్టి అంటుకోకుండా బాస్ చెప్పిన పని అయిపోయినట్లుంది” అన్నాడు ఆనందంగా.


మిగిలిన ఇద్దరూ, డ్రైవరు, తల పంకిస్తూ వాడికేసి చూశారు. వాళ్ళు, బస్సుకు ఎడమవైపు వాళ్ళ కార్ ఆపి ఉంచారు ఒక చెట్టు కింద.


కానీ నిజానికి, బస్సు ఇంధన ట్యాంక్ పేలడానికి క్షణాలు ముందు అంజలి ఎమర్జెన్సీ విండో పగలగొట్టుకుని కిందనున్న ముళ్ళపొదల్లోకి దూకేసింది. గాయాలతో ఆమె బతికి బయటపడింది. ఒళ్ళంతా రక్తసిక్తంగా ఉంది, పక్కటెముకలు విరిగిన భావన.


పేలిపోతున్న బస్సును భీతితో చూస్తూ... ఆ ముళ్ళలోనే... పాక్కుంటూ కొంత దూరం వెళ్ళగలిగింది. బస్సు కాలిపోవడం చూసి, ఆమె భయపడిపోయింది. ఒంట్లో సత్తువ లేదు. ఆ సమయానికి స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉంది.


ముకేశ్‌కు అప్పుడే పొదల్లో మూలుగుతో పాటు “హెల్ప్” అనే ఆర్తనాదం వినబడింది. అతని కళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. ఈ భీతావహ దృశ్యం దెబ్బకి వాళ్ళకి అందరికీ అప్పటికే మత్తు మొత్తం దిగిపోయింది. బస్సు దగ్గరికి, పిలుపు వచ్చిన వైపు పరుగున వెళ్ళాడు. ఆ వ్యక్తిని అంజలి అని పోల్చుకున్నాడు. బస్సు వైపు చూశాడు.

డ్రైవర్ సీట్లోనే తగలబడిపోయాడు. బస్సులో కిటికీ బద్దలుకొట్టుకుని బయటకు వద్దామని ప్రయత్నం చేసి, ఓడిపోయి, కాలిపోతూ వేలాడుతున్న ఇద్దరు కనపడ్డారు.


అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థం అయింది. బస్సు ప్రమాదం నుండి బయటపడిన ఒకే ఒక వ్యక్తి ఆమె. ఎమర్జెన్సీ విండో పగలగొట్టుకుని ఆమె దూకగలిగింది. ఆమెను అనుసరించబోయిన తర్వాత వాళ్ళు అగ్నికీలల్లో తగలబడిపోయారు. ఇప్పుడు ఆ బస్సు ప్రయాణికుల్లో ఆమె తప్ప ఎవరూ బతికి లేరు. బస్సు డ్రైవర్ కూడా చనిపోయాడు. అతనికి, అక్కడ సాక్ష్యాలు ఏవీ లేవనే విషయం చాలా రిలీఫ్‌గా అనిపించింది.


ముకేశ్ వేగంగా పొదల వైపు కదిలాడు.


“మేడం ఇలా చెయ్యి ఇవ్వండి మిమ్మల్ని వెంటనే హాస్పిటల్‌కి చేరుస్తా” అంటూ ఆమె చెయ్యి అందుకుని, ఒక్క ఉదుటున ఎత్తుకుని వీళ్ళ కార్ దగ్గరికి తెచ్చాడు.

వెనుక సీట్లో ఆమెను పడుకోబెట్టాడు. అంతవరకే ఆమెకి తెలుసు. ఇంతలో ఆమె స్పృహ కోల్పోయింది.


మిత్రులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇన్నోవా వేగంగా కదిలిపోయింది.

మరొక పది నిమిషాలకి... చుట్టుపక్కల ఊరి జనాలు బస్సు మంటలు చూసి అక్కడికి చేరుకున్నారు. బస్సు పూర్తిగా తగలబడిపోయింది. అప్పటికే శవాలు గుర్తుపట్టలేనట్లు మాడిపోయాయి. ఫైర్ ఇంజిన్లు రావడం, మంటలు ఆర్పుట జరిగింది.


ఉదయానికి ఆ వార్త తెలంగాణలో మరియు ఆంధ్రలో పెద్ద సెన్సేషన్.

పత్రికలు అనేక కథనాలు వండి వార్చేశాయి. ఈ కథనాలు అలా 20 రోజులు కొనసాగాయి. ఆ బస్సు తెలంగాణలో ఒక పెద్ద రాజకీయ నాయకుడిది.


ఆ ప్రమాదం జరిగి 20 రోజుల వరకూ రోజుకో వార్త పత్రికలలో చూస్తూ ప్రజలు గడిపారు. ప్రభుత్వం ఆ ప్రమాదం మీద పరిశోధన కోసం ఒక కమిటీని వేసింది. పోలీస్ టీమ్ తన పని తాను చేసుకుంటూ పోతోంది.


బస్సులో ఉన్న ప్రయాణికుల సంఖ్య 22 గా తేల్చారు. చివరికి, డ్రైవర్‌ది, మరొక 15 మంది వివరాలు పోల్చుకోగలిగారు. ఏడుగురి మృతదేహాల గురించి పోల్చుకోవడానికి మాడిపోయిన మాంసం ముద్దల నుండి మాత్రమే వివరాలు తెలియాల్సివుంది. ఫోరెన్సిక్ లాబ్ నుండి వివరాలు తెచ్చి ఆ మూటలను, వారి వారి బంధువులకి అప్పజెప్పారు.


ఈ సంఘటన జరిగి 4 సంవత్సరాల కాలం అయింది. అది ముంబయి నగరం. సమయం రాత్రి 10.30 నిమిషాలు అవుతోంది. ఆ ప్రాంతం ఒక రెడ్ లైట్ ఏరియా. చిన్న చిన్న గదులతో ఆ వీధులు ఒక స్మశానంలా ఉన్నాయి. సరిగ్గా అప్పుడే ఆ ప్రాంత అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వినోద్, తన బృందంతో ఆ ఏరియా మీద దాడి చేశాడు.


ఒక మాదక ద్రవ్యాల ముఠాపై నిఘా ఉంచిన ముంబై పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు, వినోద్ ఆ దాడిలో పాల్గొన్నాడు.


ఒక గదిలో మూలకి నక్కి, పోలీసుల కేసి దీనంగా చూస్తూ “నన్ను రక్షించండి” అని తెలుగులో వేడుకుంటున్న అంజలిని అప్పుడే చూశాడు వినోద్. వినోద్ అంతకుముందు తెలంగాణలో పనిచేసి ఈ మధ్యనే కేంద్ర సర్వీసులోకి వచ్చాడు. ఆమె తెలుగమ్మాయి అని అర్థం అయింది.


“భయపడకుండా చెప్పు... నువ్వెక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు?” అని తెలుగులో అడిగాడు.


ఆమె మొహంలో చెప్పలేనంత సంతోషం, వెనువెంటనే తన దీన స్థితికి దుఃఖం పొంగుకు వచ్చాయి.


4 సంవత్సరాలుగా తన గోడు చెప్పుకునే వాళ్ళు లేక, తెలుగు వారు ఎవరైనా కనపడతారేమో అని ఆశగా ఎదురు చూస్తున్న అంజలి అనేకసార్లు తెలుగు తెలిసిన వాళ్ళకోసం చేయని ప్రయత్నం లేదు. కానీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఇన్నాళ్ళూ ఆమె ఆ చీకటిలోకంలో మగ్గిపోయింది. ఇప్పుడు ఆమె దీనగాథ చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం ఆమెకి దేవుడు కల్పించాడు. వినోద్ రూపంలో ఒక తెలుగు ఆఫీసర్ ఆమెకి తారసపడ్డాడు. ఆమె ఆనందానికి అవధులు లేవు.


ఆమె భయపడుతూ, తనను 4 సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ దగ్గర జరిగిన బస్ ఆక్సిడెంట్ సమయంలో తెలంగాణ రాజకీయ నాయకుడు భుజంగరావు అనుచరులు ఎత్తుకొచ్చిన విషయం చెప్పింది.


వినోద్‌కు ఆ సంఘటన గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో అతను తెలంగాణలోనే పనిచేశాడు. కానీ ఆ ఆక్సిడెంట్‌లో ఈమె బతికి బట్టకట్టిందనే విషయం అతనికి కొత్తగా ఉంది.


భుజంగ రావు విపరీత చేష్టలకి అప్పుడు వినోద్‌కు చాలా కోపం వచ్చేది. కానీ అతని రాజకీయ స్థితికి అతన్ని ఏమీ చేయలేకపోయేవాడు.


ఇప్పుడు భుజంగరావు పరిస్థితి తారుమారు అయింది. ఈమధ్య జరిగిన ఎన్నికలలో అతను ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓడిపోయాడు. అతని పార్టీకి కూడా చాలా తక్కువ సీట్లు రావడం జరిగింది. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానంలో ఉంది అతని పార్టీ.


ఆరోజు అంజలిని ప్రత్యేకంగా ఒక లేడీస్ హోమ్‌కి తరలించాడు.

మరునాడు లేడీస్ హోమ్‌కి వచ్చి, ఆమెను కలిశాడు.

అతన్ని చూస్తూనే, అంజలి లేచి నిలబడి, “నమస్కారం సార్” అంది.


“నమస్కారం! ఇప్పుడు కాస్త స్థిమిత పడ్డారా?” అన్నాడు.


ఆమె మొహంలో ఇప్పుడు కొద్దిగా ప్రశాంతత కనిపిస్తోంది. కానీ కళ్ళల్లో గతం తాలూకు భయం మెదులుతుండగా... “మీకు జరిగిన కథ వివరంగా చెప్తాను... నన్ను నా తల్లిదండ్రుల దగ్గరకు చేరుస్తారా?” అంది.


“చెప్పండి. మీకేం భయం లేదు. ఇప్పుడు భుజంగరావు కోరలు తీసిన పాము. వాడిని కటకటాల్లో పెట్టించే దాకా నిద్రపోను. మీ కథ మొత్తం చెప్పండి” అన్నాడు.


ఆమె తన కథ ఇలా చెప్పింది:

“నేను తెలంగాణలో ఒక పత్రిక ఆఫీసులో పనిచేస్తూ ఉండేదానిని. నేను మా తల్లిదండ్రుల దగ్గరికి కర్నూలు, వినాయకచవితికి వెళ్ళాను. ఆరోజు దొరికిన ఒక రహస్య సమాచారం నా వద్ద పెన్ డ్రైవ్‌లో ఉంది. మరునాడు పేపర్‌కి ఆ సమాచారం చేరవేసే ముందు, చీఫ్ ఎడిటర్‌తో డిస్కస్ చేయవలసి ఉంది. అందుకే నేను మరొక రోజు సెలవు ఉన్నా, బస్సు ఎక్కి హైదరాబాద్ బయలుదేరిపోయాను. అది, అప్పుడే ఎదుగుతున్న భుజంగరావు భూ కుంభకోణాలకి సంబంధించిన సమాచారం. నా మీద దాడికి ప్లాన్ జరిగింది. భుజంగరావుకి సంబంధించిన మనుషులు నేను ఎక్కిన బస్సు వెనుక నన్ను వెంబడించారు. కానీ, నాకు ఆ విషయం తెలియదు.


దురదృష్టవశాత్తూ... నేను ప్రయాణిస్తున్న బస్సు ఫైర్ ఆక్సిడెంట్‌లో తగలబడిపోయింది.


నేను కిటికీ అద్దం పగలగొట్టుకుని, ముళ్ళ పొదల్లోకి దూకేశాను. అప్పుడే వాళ్ళు నన్ను రక్షిస్తున్నట్లు నటించి, వాళ్ళ కారులోకి ఎక్కించుకున్నారు. ఇంతలో నాకు స్పృహ పోయింది.


మధ్యలో కారులో ఉండగా నాకు స్పృహ వచ్చింది. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల వలన వాళ్ళ పథకం తెలిసింది. నాకు ఎక్కడో వైద్యం చేయించి మళ్ళీ స్పృహ పోయేలా చేశారు. మరునాడు నేను కళ్ళు తెరిచేసరికి, నేను ఈ మురికి కూపానికి అమ్మివేయబడినానని తెలిసింది.


అప్పట్నుంచీ, బాహ్య ప్రపంచానికి, నాకు సంబంధాలు తెగిపోయాయి. నన్ను నా తల్లిదండ్రుల దగ్గరికి చేరవేయండి ప్లీజ్!” అంది, తన కథ ముగిస్తూ...

ఈ కథ విన్న వినోద్ ఆశ్చర్యానికి లోనయ్యాడు.


“ఆ రోజు మీ బస్ ఆక్సిడెంట్‌లో ఎవరూ బ్రతికి బయటపడలేదని పోలీసులు ప్రకటించారు. మీరు చెప్పిన దానిని బట్టి, నిజాలు తన పలుకుబడితో భుజంగరావు మార్పించేసాడని అర్థం అవుతోంది. ఎవరిదో శరీర భాగాలు మీవని మీ తల్లిదండ్రులకి అప్పజెప్పేసి ఉంటారు” అన్నాడు.


ఆ మాటలు వినగానే, విస్తుపోయింది అంజలి.

“ఇప్పుడు తను చనిపోయినదానిగానే ఇంట్లో భావిస్తున్నారన్నమాట” అనుకుంది.

“మీ సాక్ష్యం ఇప్పుడు తెలంగాణలో పెద్ద సంచలనం సృష్టిస్తుందన్న మాట” అన్నాడు అతను.


వెంటనే తెలంగాణలో తన మిత్రుడు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేంద్రకి సమాచారం చేరవేసి, ఆమెకి రక్షణ ఏర్పాట్లు చేసి, దగ్గరుండి ఆమెని తెలంగాణ తీసుకుని వచ్చాడు.


ఇంటి తలుపు తట్టిన అంజలిని చూసి మాన్పడిపోయారు ఆమె తల్లిదండ్రులు. చనిపోయిందనుకుని అంత్యక్రియలు కూడా చేసేసిన ఆ తల్లిదండ్రులకి, అంజలిని బ్రతికి ఉన్న స్థితిలో చూడడం ఎక్కడ లేని సంతోషాన్ని కలిగించింది.


ఆ రోజు పోలీసులు నిర్వహించిన ప్రెస్ మీట్ రాష్ట్రంలో సంచలనాలు సృష్టించింది.

పేపర్లు “తిరిగి వచ్చిన మృతురాలు” శీర్షికతో ఆమె కథని మరునాడు ప్రచురించాయి.

అప్పటికే భుజంగరావుని, అతని గ్యాంగ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.


భుజంగరావుకి సహకరించడానికి కూడా ఇప్పుడు ప్రతిపక్ష నేత ముందుకు రాలేకపోయాడు.


భుజంగరావుకి ఊచలు లెక్కపెట్టక తప్పలేదు.

6 నెలలు గడిచాక కోర్టు తీర్పు వెలువడింది. కిడ్నాప్, హత్యా ప్రయత్నం, ఇల్లీగల్ ట్రాఫికింగ్ కేసుల్లో అతనికి, ముకేశ్ గ్యాంగ్‌కి 4 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు.


అంజలి, తల్లిదండ్రుల వద్ద ఇప్పుడు ప్రశాంతంగా జీవితం గడుపుతోంది.

వినోద్‌ని ఆ కుటుంబం ఇప్పుడు దేవుడులా కొలుస్తోంది.


..సమాప్తం..


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



వెంపరాల దుర్గాప్రసాద్ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):






వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 






మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



వెంపరాల దుర్గాప్రసాద్

రచయిత పరిచయం:


నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్


నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో


అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.


రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.


క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.


ధోనీ, రోహిత్ శర్మ అంటే  క్రికెట్ లో చాలా ఇష్టం.


సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.


ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.


వుండేది విశాఖపట్నం.


ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page