top of page

ప్రమీల


'Prameela' - New Telugu Story Written By Ashok Anand

'ప్రమీల' తెలుగు కథ

రచన: అశోక్ ఆనంద్


"ఆరొందలు ఇస్తానంటున్నాడు" "మరి రూమ్ సంగతి ఏటట" "ఆ వోల్వో బస్సు ఎనక తుప్పల్లోకి రమ్మంటున్నాడు" "ఏం చేద్దాం అనుకుంటున్నావ్" "వెళ్ళనా?" "నోర్ముయ్ వే. నలభై ఏళ్లున్న నేనే ఏనాడు వెయ్యికి తక్కువ ఎల్లలేదు. సూపర్ ఫిగర్ వి. నిండా పద్దెనిమిదేళ్ళు కూడా లేవు. ఇలాంటి సీప్ నా కొ..ల పక్కన పడుకుంటావా! గమ్మునుండు. ఏదొక మంచి బేరం తగులుద్ది" కొత్తగా వచ్చిన ప్రమీలకి అనుభవంతో చెప్తుంది తల్లి సరళ. వైజాగ్ ఆర్.టి.సి. కాంప్లెక్స్ బస్టాపు. రాత్రి పదకొండున్నర అవుతుంది. బండి మీద ఉడుకుతున్న ఇడ్లీ, వాతావరణంలో కమ్మటి పొగలు నింపుతోంది. దూరపు ఊర్ల నుంచి వచ్చి ఆగిన బస్సుల్లో టీ అందిస్తున్నాడు టీ షాపువాడు. 'అబ్భా! ఈ చలికాలపు రాత్రి వేడి వేడిగా రెండిడ్లీ తిని, మాంచి మసాలా టీ తాగితే ఉంటది....' మనసులో అనుకుంటుంది ప్రమీల. ఇంతలో లాల్చీ, కాటన్ ప్యాంటు ధరించిన ఒకతను వీళ్ళ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. జేబులో ఉన్న పెన్నును తీసి చేతిలో పట్టుకుని, పళ్ళ మధ్య ఉంచి తదేకంగా చూస్తున్నాడు. "ఎంతసేపని చూస్తావ్, ఏదోటి మాట్లాడు" విసుక్కున్నట్లు చెప్పింది సరళ. "ఎంత" అడిగాడతను. "నేనా? ఇదా?" "ఈ పిల్లే" "ఎంతసేపటికి?" "ఫుల్ నైట్" "ఓయబ్బో! ఇదైతే పదిహేనొందల రూపాలకి ఒక్క పైసా తగ్గేది లేదు" "రెండు వేలు తీసుకో" "హా‌‌‌‌‌ఁ.. నిజమా సారూ!" అడక్కుండానే మాటకి గౌరవం తోడైంది. నోటిపై నోటు చేస్తున్న పెత్తనం. "నిజం" "సారూ.. మరి రూమూ అది? పిల్ల కూడా ఏవీ తిన్లేదు" "అవన్నీ నేను చూస్కుంటాను! ముందు పంపించు" బైక్ బయలుదేరింది. ఆ రెండిడ్లీ, వేడి టీ దగ్గరే ఆగిపోయాయి అమాయకపు ప్రమీల కళ్ళు. చీకటిని కప్పుకుని ప్రమీల పగిలిన పెదాల కౌగిలి కోసం వేచి చూస్తున్నాయి ఆ రెండిడ్లీ, మసాలా టీ. కొన్ని అంతే. దగ్గరగానే ఉంటాయి గానీ దగ్గరవ్వవు. త్రీ స్టార్ హోటల్లో ఒక రూమ్ తలుపు తెరుచుకుంది. ఇద్దరూ లోపల అడుగుపెట్టారు. అరగంట గడిచింది. ఒంటి నిండా చెమటలతో దుప్పట్లోంచి బయటకొచ్చాడు కవేశ్వర్. "నువ్వుండు. నేను కిందకెళ్ళి తినడానికి ఏవైనా తీస్కొస్తా" అన్నాడు. "ఇడ్లీ ఉంటే తీసుకురండి" మాట్లాడకుండా వెళ్ళి, పది నిమిషాల తర్వాత పైకొచ్చాడు. "చీప్ గా ఇడ్లీ ఏం తింటావ్! ఇదుగో ఈ దమ్ బిర్యానీ తిను" ఆకలికి కూడా పేద, ధనిక భేదాలుంటాయా? అనుకుంది. "ఏం చూస్తున్నావ్ తిను, నీ లైఫ్లో ఇలాంటి త్రీ స్టార్ హోటల్లో ఇంత మంచి బిర్యానీ.. అదీ నాతో తినే అవకాశం రావడం నీ అదృష్టం" గర్వంగా చెప్పాడు. తీసుకుని తినడం ప్రారంభించింది ప్రమీల. లాల్చీ లోంచి పెన్ను, ఒక చిన్న నోట్ బుక్ తీశాడు కవేశ్వర్. "హ్మ్.. ఇప్పుడు చెప్పు నీ కథేంటో" "ఏం కథ సారు!!" “నీ కథే. అసలు నీ పేరేంటి, ఊరేంటి, ఏం చదువుకున్నావ్, ఈ వృత్తిలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, వగైరా వగైరా” “నా వివరాలన్నీ మీకెందుకు సారు” ఆశ్చర్యంగా అడిగింది. “ఎందుకేవిటి! నేనెవరనుకున్నావ్! ఈ విశాఖ జిల్లాలోనే పేరు మోసిన పెద్ద కవిని” “ఏం పేరో” “కవేశ్వర్.” “నా కథ తెల్సుకుని ఏం చేస్తారు అయినా” “ఏం చేస్తాను. నీ కథని వస్తువుగా తీస్కుని అద్భుతమైన కథనంతో మధ్య మధ్యలో కవిత్వాలతో రాసి న్యూస్ పేపర్ వాళ్ళకిస్తే వీక్లీ పుస్తకాల్లో ప్రచురించుకుంటారు.” “ప్రచురిస్తే?” “జనం చదువుతారు” “చదివి?” “నీ కథ తెల్సుకుంటారు” “తెల్సుకుంటే?” “మీ వేశ్యలపై ఉన్న చిన్న చూపు పోయి, సానుభూతి కలుగుతుంది” “ఆ సానుభూతి అన్నం పెడుతుందా సారు” ముద్ద చేతిలో పట్టుకుని అడిగింది. కవేశ్వర్ మొహంలో ఏదో ఎక్స్ప్రెషన్. కోపమా! అవమానమా! ఏమో. “సానుభూతి కలిగితే మీ పైన గౌరవం పెరుగుతుంది.” “గౌరవం పెరిగితే మాకాడికెవరొస్తారు సారు.” నిశ్శబ్దం. “మాట్లాడండి” “అయితే ఇప్పుడు నీ కథ చెప్పనంటావ్” “హహ్హ.. చెప్పను అన్లేదు సారు. దాని వల్ల మాకొరిగేదేం లేదు. మా కథలు చదివి 'ప్చ్ అయ్యోపాపం' అనే వాళ్ళకి పెళ్ళాలు ఊర్లెళ్తేనో, పురుడుకెళ్తేనో గుర్తొచ్చేది మేమే. కాలేజీ కుర్రాళ్ళు రూపాయి రూపాయి పోగు చేసుకుని పోగొట్టుకునేదీ మా కాడే. అచ్చరాలు రాసేవాడి బతుకు మారుద్దేమో గానీ మా బతుకులింతే. పోనీ మీకన్నా పొట్ట నింపుద్ది అంటే చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు.” “నాన్సెన్స్! నీ కథ మీద బతకాల్సిన గతి నాకు లేదు. చిన్నపిల్లవని చూస్తున్నాను లేదంటేనా!” “ఏం చేసేవారు” కవేశ్వర్ కంఠం ఎరుపెక్కింది. “ఈ చిన్నపిల్లనే..ఒళ్ళు మొత్తం హూనం చేసిన మగ మారాజులు మీరు. ఇంకా చేయడానికేముంది” మళ్ళీ కవేశ్వర్ మొహంలో ఏదో ఎక్స్ప్రెషన్. డౌట్ లేదు. ఈసారి అవమానమే. “ఒక్కో వేశ్య కథ ఒక్కోలా ఉండదు సారు. మావందరివీ ఒకే కథలు, అన్నీ అవే వ్యథలు.” బిర్యానిలో చేయి కడిగేసుకుందామనుకుంది. కవేశ్వర్ ప్రమీలని చూస్తున్నాడు. ప్రమీల కంచం వైపు చూస్తుంది. “మా కథల పేరు.. ఆకలి. మా వ్యథల పేరు.. నిస్సహాయత.” బిర్యానీ కంచాన్ని పక్కకి జరిపింది. పెన్ను చుట్టూ వ్రేళ్ళను బిగించాడు కవేశ్వర్. లేచి నిల్చుని నిశ్శబ్దంలో అడుగులేసుకుంటూ అతని దగ్గరగా వచ్చి నిలబడి పెన్నును తీసుకుని మంచంపై పడేసింది. “ప్రత్యేకంగా పెన్నుని పట్టుకు రాసేంత ఆసక్తిగా మా బతుకులుండవులే సారు. ఈ ప్రపంచంలో మన దగ్గర లేనిది మనక్కావాలంటే మన దగ్గరున్నది మనం అమ్ముకోక తప్పదు. కూడుకీ, మా కడుపుకీ మధ్య దూరం ఆరంగుళాలు. మా శరీరం మీ ఆహరం, మీ ఆయాసం మా ఆకలి తీర్చుకునే ఆధారం.” చెప్పింది.... కాసేపటికి కథ ముగిసింది. కొత్తగా ఏం లేదు. వారం దాటింది. సేమ్ రూమ్. సేమ్ ప్రమీల. సేమ్ కవేశ్వర్. వీక్లీ పుస్తకం తీసి ప్రమీల ఒళ్ళో కొట్టి, ప్రమీల తొడపై భుజం మోపి గర్వంగా పడుకున్నాడు. రెండు పేజీలు తిప్పింది. 'కన్నీటితో తడిచిన కొంగు, మగాడి చేత్తో బరువెక్కిన రొమ్ము' అని మూడో పేజీలో హెడ్డింగ్. చదవబోయింది. "ఇంకెంతసేపని చూస్తావ్, ఇటివ్" కసురుకున్నాడు కవేశ్వర్. జాకెట్ తెగి నేలపై పడింది. రొమ్ము బరువెక్కింది. కొంగు తుడుచుకునేంత దగ్గరలో లేదు. ఏ రాతలూ ఎవ్వరి బ్రతుకుల్నీ మార్చలేవు. 'అక్షరాలను అమ్ముకోవడం కంటే అవయవాలను అమ్ముకోవడం పవిత్రమైన పని' కామం రాజ్యమేలుతున్న ఆ చీకట్లో, శంఖం మ్రోగింది ప్రమీల మనసులోని మాటతో.

***

అశోక్ ఆనంద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

అశోక్ ఆనంద్.

రచయిత, దర్శకుడు, సాహితీ వేత్త


48 views1 comment

1 Comment


Surekha Arunkumar
Surekha Arunkumar
Oct 01, 2023

కథ బావుంది

Like
bottom of page