top of page

ప్రయాణం

#PGopalakrishna, #Pగోపాలకృష్ణ, #Prayanam, #ప్రయాణం, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Prayanam - New Telugu Story Written By P. Gopalakrishna

Published In manatelugukathalu.com On 14/08/2025

ప్రయాణం - తెలుగు కథ

రచన: P. గోపాలకృష్ణ  

కథా పఠనం: A. సురేఖ

“లక్ష్మిపురానికి టికెట్ ఇవ్వండి” 


అప్పుడే బస్సు ఎక్కిన నేను బస్సు అంతా కలయ జూశాను. ఎక్కడా సీట్ కనపడలేదు. అయినా నాలుగు ఊళ్ళు అవతల నారాయణవలసలో సంత ఉంటే జనాలు కిక్కిరిసిపోయి ఉండే బస్సు లో సీట్ వెతకడమేంటి? పిచ్చికాకపోతే.. పైగా మా రూట్ కి ఇదే లాస్ట్ బస్సు. 


కొన్ని చేపల బుట్టలు బస్సు మీద వెయ్యగా ఇంకొన్ని వెనకాల వేసేసినట్లున్నారు, బస్సు లో ఘుప్పు మని చేపల కంపు. నా అవస్థ గమనించాడేమో.. ఈ సీట్లో కూర్చోండి సార్ అంటూ కండక్టర్ వెనకాల సీట్లో కూర్చున్న అబ్బాయి లేచి సీట్ ఇచ్చేసాడు. బస్సు లో జనాలు పెరుగుతున్నారే తప్ప తగ్గడంలేదు. 


ఇంకా రెండుగంటలు ప్రయాణం చేస్తే కానీ నేను గమ్యం చేరుకోలేను. అప్పటికే బస్సు నిండుగర్భిణీలా నెమ్మదిగా నడుస్తోంది. ప్రతిచోట బస్సు ఆపి జనాల్ని ఎక్కిస్తూనే ఉన్నాడు. కొందరు చిన్నపిల్లలు చేపల కంపుకి ఉక్కిరి బిక్కిరైపోతూ ఏడుపు మొదలెట్టారు.

 

“బాబూ తొందరగా పోనివ్వు. టైం ఇప్పటికే పది కావస్తోంది” అంటూ వెనకాల నుండి ఆడగొంతు వినిపించింది. 


అదేం చిత్రమో అప్పటిదాకా నోరెత్తని కొందరు పురుషపుంగవులు కండక్టర్ ని డ్రైవర్ ని అరుస్తూ తొందరగా పోనివ్వమని గోల చేయసాగారు. డ్రైవర్ ఇవే్మీ పట్టించుకోకుండా తన అలవాటు ప్రకారం నింపాదిగా పోనిస్తున్నాడు. 


బస్సు ఆగిన ఒక్కో స్టేజి లో ఒకరిద్దరు దిగితే నలుగురైదుగురు ఎక్కుతున్నారు. 


“ఏంటయ్యా ఈ అన్యాయం. గంటలో చేరాల్సిన మా స్టేజి కి రెండున్నర గంటలైన చేరుకోలేదు.” అరుస్తూనే డ్రైవర్ ని కండక్టర్ ని రెండు బూతు తిట్లుతో సన్మానించాడు ఒక మధ్యతరగతి మోటు మనిషి. కండక్టర్ ఉలుకూ పలుకూ లేకుండానే తనపని తాను చేస్తున్నాడు. నాలుగు తన్ని తగలెయ్యాలి ఆవేశం ఆపుకోలేని ఒక భావి పౌరుడు వ్యాఖ్యనం ఇది. 


ఇంతలేసి మాట్లాన్నాక ఎవరికైనా రోషం రావాలి. ఖాకి యూనిఫామ్ లోంచి చెమట్లు కారిపోతున్న పట్టించు కోకుండా మౌనమునిలా ఉన్నాడు కండక్టర్. 


“వాళ్లంతా అలా మాట్లాడుతూ ఉంటే మీకు కోపం రావట్లేదా?” నేను కూర్చున్న సీట్లోంచి కండక్టర్ సీట్ మీదికి వాలి అడిగాను. 


అతను చిన్నగా నవ్వేసి, “ప్రతి విషయానికి వాదన చేసుకుంటూ పోతే యుద్ధాలే వస్తాయి సార్, వాళ్ళేదో కాలక్షేపానికి అంటారు కానీ వాళ్ళ స్టేజి వచ్చాక ఇవన్నీ గుర్తుంచుకుంటారటండీ” అడిగాడు. 


“ఎన్నాళ్లుగా చేస్తున్నారు ఈ జాబ్?” అడిగాను ఉత్సాహంకొద్దీ. 


“పన్నెండేళ్లు అయ్యింది” చెప్పాడు. 


రాజుగారి పాలెం లో బస్సు ఆగింది. ఇద్దరు దిగి ఒకావిడ బస్సు ఎక్కింది. 


“వేరే జాబ్ ఏమీ ప్రయత్నించలేదా?” ఆవిడకి టికెట్ ఇచ్చి ఎస్ ఆర్ రాసి కూర్చున్న కండక్టర్ ని అడిగాను. 


నిర్వేదంగా ఒక విషాదపు నవ్వు నవ్వి “నాకు రిజర్వేషన్ లేదు సార్, నా కులానికి ఈ ఉద్యోగం చాలా ఎక్కువ” అన్నాడు. 


“ఇంతకీ ఏం చదువుకున్నారు?” అడిగాను. 


“ఉద్యోగం వస్తుందని ఆశతో పీజీ ఫస్ట్ క్లాస్ తో పూర్తి చేశాను. అదిగో ఆ డ్రైవర్ ఉన్నాడు చూసారా? అబ్దుల్ అతనిపేరు. పీజీ చేసి ఎం ఫిల్ చేసాడు. అతని మతం అతనికి ఉద్యోగం రాకుండా చేసింది. ముసలి తల్లిని, పెళ్లి కాని పిచ్చి అక్కగార్ని పోషించడానికి ఈ చక్రం పట్టాడు. బతుకు చక్రం గతి తప్పి ఇలా బతికేస్తున్నాడు” చెప్పాడు కండక్టర్. 

బస్సు అప్పుడే ఊపు అందుకుంటోంది. పరుగులు పెడుతూ గమ్యం వైపు చేరుకోడానికి ఆశగా పరుగులు పెడుతున్న యువత లాగా ఉంది. రోడ్డు పక్కనే పది బస్తాలు పెట్టుకొని ఒక పెద్దావిడ నిలబడింది. 


“తమ్ముడూ కూరగాయల బస్తాలు వేస్తారేమో. బస్తాకి పది రూపాయలు ఎక్కువ అడుగు” అంటూనే స్లో చేసాడు డ్రైవర్. 


“ఎక్కడికమ్మా” అంటూ కిటికీ లోంచి బుర్ర బయటికి పెట్టాడు కండక్టర్. బస్సు ఆగింది. 


గబగబా నలుగురు మగవాళ్ళు ఒకతన్ని పట్టుకొని బస్సు ఎక్కారు అతనికి ఒంటి నిండా దెబ్బలు. 


“పాపం ఎవరో తెలీదన్నా, ఏ ఊరో కూడా తెలీదు. బైక్ మీద వెళ్తుంటే లారీ గుద్దేసిందిట. బైక్ పోతే పోయింది. మనిషి మిగిలాడు”, అంటూ బస్సు ఎక్కించారు. 


“ఆక్సిడెంట్ కేసులని ఎవరూ ఎక్కించుకోరు. బస్సు లో ఏమైనా ఐతే పోలీసులు చుట్టూ తిరగాలి. బస్సు ఎక్కించుకోరని ముందు రోడ్డు పక్కన లగేజ్ లు పెట్టి ఇలా నాటకాలు ఆడతారు.” వెనకాల నుండి ఒకామె అరుస్తోంది. 


“ఎవరైనా సీట్ ఇవ్వండయ్యా” అడుగుతున్నారు ఆ మనిషిని తీసుకొచ్చిన వాళ్ళు. 


“మా బుర్ర మీద కూర్చోపెట్టు” రెచ్చిపోయింది ఆవిడ. 


‘ఊరుకోవమ్మా’ అంటూ కండక్టర్ సర్ది చెప్పబోయాడు. 


“ఇంకో అరగంట ఆగితే లక్ష్మీపురం వెళ్ళిపోతాం” అంటూ డ్రైవర్ కూడా ఏదో చెప్పబోయాడు. 


“తాగుబోతులు బండి నడిపితే ఆక్సిడెంట్లే అవుతాయి” ఎవరో కామెంట్. 


ఇంకా నయం కాలో చెయ్యొపోలేదు. ఏంటో ఈ మనుషులు. అదే ప్రమాదం తమ వాళ్ళకి జరిగితే ఎంత ఆందోళన పడతారో!


నా సీట్ ఖాళీ చేసిచ్చాను. అతికష్టం మీద పక్క సీట్లో కూర్చున్న అతను అయిష్టంగా లేచి సీట్ ఇచ్చాడు. కొరకొర చూస్తూ నా వెనకాలే నిలబడ్డాడు. ఏమిటో ఈ మనుషులు. బొత్తిగా మానవత్వం మరిచిపోతున్నారు. నా బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఇచ్చాను. అతనితోపాటు ఎక్కిన నలుగురిలో ముగ్గురు బస్సు దిగిపోయారు. ఉన్న ఒక్కతను వయసులో ఉన్న చదువుకున్న వ్యక్తి. 


 కొంచెం వాటర్ తాగిన తరువాత ఆ మనిషి కొంచెం కళ్ళు తెరిచాడు. బస్సు మళ్ళీ స్పీడ్ అందుకుంది. కండక్టర్ ఏమనుకున్నాడో నాతో మాటలు కలిపాడు. 

“ఈ ఊరినుండి లక్ష్మీపురానికి వెళ్లాలంటే రోజూ ఈ ఒక్క బస్సే గతి సార్. రోడ్డు బావుండదు. ఆటో వాళ్ళు సర్వీస్లు బాగా తగ్గించేసారు సార్. ఎవరు ఎలాంటి అవసరం తో బస్సు ఎక్కుతారో మనం ఎలా చెప్పగలమండీ. ఎక్కించుకోకపోతే కొన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోవచ్చు. కొందరికి పెళ్లి ఆగిపోవచ్చు. తమ ఇష్టమైన వాళ్ళని ఆఖరి చూపు చూడలేకపోవచ్చు.”

 

 కండక్టర్ లో మానవత్వం ఎక్కడో ఉంది. నా మనస్ఫూర్తిగా అతనికి నమస్కారం చెయ్యాలనిపించింది. అవసరం లో ఉన్నవాళ్ళకి మనం డబ్బు ఇవ్వక్కర్లేదు. మన సేవ అందిస్తే వాళ్లు పడే సంతోషం మన కుటుంబానికి ఆశీర్వచనాలు అందిస్తుంది. చదివిన చదువుకి సమానమైన ఉద్యోగం రాకపోవచ్చు. వచ్చిన ఉద్యోగంలోనే సంతోషాన్ని వెతుక్కోవాలనేది నా సిద్ధాంతం సార్.. బస్సు లోపలికి వస్తున్న గాలి కంటే అతని మాటలు ప్రాణానికి హాయిగా అనిపించసాగాయి. 


ఆక్సిడెంట్ అయిన మనిషిని నెమ్మదిగా మాట్లాడించడానికి ప్రయత్నిస్తున్నారు కొందరు. మొబైల్స్ పట్టుకొని సెల్ఫీ తీసుకుంటూ స్టేటస్ లో పెట్టుకోవడానికి రెడీ అవుతూ ఉన్నారు కొందరు. 


“మాది లక్షింపురం పక్కనే ఉన్న లింగాల పాలెం. మా ఆవిడ అక్కడ అంగన్వాడీ టీచర్. ఆవిడ ని తీసుకొని రావడానికి వెళ్తూ ఉంటే పక్కనుండి వెళ్తూ లారీ వాడు ఆక్సిడెంట్ చేసి పారిపోయాడు.” కష్టం మీద చెప్పాడు అతను. 


బస్సు లో అందరూ ఈ విషయమే చర్చించుకోసాగారు. ఇందాక ఆక్సిడెంట్ కేసు ని మా బుర్ర మీద కూర్చోపెట్టు అని మొరటుగా మాట్లాడినావిడ గబగబా ముందుకు వచ్చి అతన్ని చూసి బావురుమంది. “ఓరి దేవుడో, నీకిలా అయ్యిందేమిటి దేవుడా? ఆ ముదనష్టపు లారీ వాణ్ణి తగలెయ్యా!” అంటూ శోకాలు మొదలెట్టింది. 


ఎవరో లాస్ట్ సీట్ లో కూర్చున్న వాళ్లు “బహుశా తాగేసి లారీ కి తగిలి ఉంటాడు. లారీ లాగేయ్యడంలో దెబ్బలు తగిలి ఉంటాయి” చెప్పుకోవడం మొదలెట్టారు. 


“ఇందాక నువ్వే కదా ఆక్సిడెంట్ అయినవాళ్ళని బస్సు ఎందుకు ఎక్కించుకోవాలి అంటూ అన్నావు.” ఇంకోసీట్లో కూర్చున్న ముసలావిడ బయటికి అనేసింది. అవేవీ పట్టించుకునే స్థితి లో లేదు ఆవిడ. 


ఇంకెక్కడా బస్సు ఆపకుండా నేరుగా హాస్పిటల్ కి పోనిచ్చాడు డ్రైవర్. “అన్నా, ఏదేదో వాగేసాను. క్షమించు అన్నా” అంటూ చేతులు జోడించింది ఆవిడ. 


ఒక ప్రాణాన్ని కాపాడినందుకు ఆ డ్రైవర్ కండక్టర్ లకు అభినందనలు అందించి ఇంటిముఖం పట్టాను నేను. 

 

***

P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ P. గోపాలకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కి text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/gopalakrishna 

యూట్యూబ్ ప్లే లిస్ట్ లింక్:

నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. 'ఆ అమ్మాయి..' కథ ఈ సైట్ లో నేను రాస్తున్న ఆరవ కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.


Comentários


bottom of page