top of page

ప్రాయ‌శ్చిత్తం


'Prayaschittham' New Telugu Story





(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

ఆ రోజు బి. ఏ ఫ‌లితాలు వ‌చ్చేరోజు... శార్వ‌రికి ఉద‌యం లేచిన ద‌గ్గ‌ర్నుంచీ టెన్షన్ గా ఉంది.. 3 సంవ‌త్స‌రాల క‌ష్టం యొక్క ఫ‌లితం తేలేరోజు.. చ‌దువుకుంటున్న‌ప్పుడు ఎక‌నామిక్స్ లెక్చ‌ర‌ర్ గారు ‘మూడు సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డ‌తారు. మూడు గంట‌ల్లో ప‌రీక్ష వ్రాస్తారు. కానీ మూడు నిమిషాల్లో ఫ‌లితం తెలిసిపోతుంది’ అన్న మాట‌లు ఆ స‌మ‌యంలో గుర్తుకు వ‌చ్చి నవ్వుకుంది...


నిజ‌మే.. ఇప్పుడు మూడు నిముషాల స‌మ‌యం వ‌చ్చేసింది. నిన్న‌టిదాకా ఆమెకు త‌న ఫ‌లితం మీద బాగా న‌మ్మ‌కం ఉండేది. కానీ ఈ రోజు ఎందుకో ఫ‌లితాలొస్తాయి అన‌గానే భ‌యం క‌లుగుతోంది; ముఖ్యంగా ఈ టెన్ష‌న్‌కి కార‌ణం లెక్చర‌ర్స్‌, స్నేహితులు ఆమె మీద పెట్టుకున్న న‌మ్మ‌కం.. వాళ్ళంతా శార్వ‌రికి యూనివ‌ర్శిటీ ఫ‌స్ట్ వస్తుంద‌నీ గొప్ప న‌మ్మ‌కం పెట్టుకున్నారు.... శార్వ‌రి భ‌య‌ప‌డుతున్నదందుకే..


ఒక వేళ వాళ్ళంతా భావిస్తున్న‌ట్లు యూనివ‌ర్శిటీ ఫ‌స్ట్ గానీ రాక‌పోతే వాళ్ళ‌ముందు త‌ను త‌లెత్తుకోగ‌ల‌దా?`` అని ఆమె తీవ్రంగా ఆలోచిస్తోంది. అందుకే ఫ‌లితాలు వ‌స్తాయ‌న్న ద‌గ్గ‌ర్నుంచీ ఏం జ‌రుగుతుందోన‌నీ భ‌య‌ప‌డుతోంది...

ఆమె కాఫీ తాగి కాసేపు పేప‌రు తిర‌గ‌వేసింది. ఆ త‌రువాత ఫ్రెష్ అయి 9 గంట‌ల‌కు యూనివ‌ర్శిటికి బ‌య‌లుదేరింది.


ఆటోలో వెళుతుంటే ఆమెని ఆలోచ‌న‌లు చుట్టు ముట్ట‌సాగాయి. జీవితంలో ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించి త‌ను ఈ స్థితికి చేరుకుంది. తాను ఆరు చ‌దువుతున్న‌ప్పుడు తండ్రి శ్రీధర్ ఒక హ‌త్య కేసులో ఇరుక్కొని జైలు పాల‌వ‌డం, ఆ త‌రువాత త‌ల్లి సులోచ‌న బెంగ‌తో మంచం ప‌ట్టి చ‌నిపోవ‌డం, అప్పుడు త‌న‌ని ఎవ‌రో అనాధాశ్ర‌మంలో చేర్పించ‌డం... అక్క‌డే ఉండి తాను ఇంట‌ర్‌లో రేంకుతో పేస‌వ‌డం, ఆ త‌రువాత స్కాల‌ర్‌షిప్పు మంజూర‌వ‌డంతో తాను హాస్ట‌ల్లో ఉండి డిగ్రీ చ‌దువుకోవ‌డం అన్నీ గుర్తుకు రాసాగాయి... యూనివ‌ర్సిటీ ద‌గ్గ‌ర ప‌డుతుంటే ఆమె భ‌విష్య‌త్తు గురించి ఆలోచించ‌సాగింది.

ఆరునెల‌ల క్రితం పీజీ చ‌దువు కోసం లండన్ స్కూల్ ఆఫ్ ఎకానామిక్స్‌కి ఎప్లె చేస్తే ప‌దిరోజుల కింద‌ట త‌న‌కు సీటు ఎలాట్ అయిన‌ట్లు ఆ యూనివ‌ర్శిటి నుంచి లెట‌ర్ వ‌చ్చింది. కాక‌పోతే సుమారు మూడు ల‌క్ష‌ల రూపాయ‌లు ఫీజుగా క‌ట్టాలి.. మ‌రొక రెండు ల‌క్ష‌లు ఖర్చులు , పుస్త‌కాల‌కు అవ‌స‌రం అవుతాయి.


ఇప్పుడామె ఆలోచ‌న‌ల‌న్నీఆ ఐదు ల‌క్ష‌ల చుట్టే తిరుగుతునాయి. ఒక‌వేళ ఆ డ‌బ్బు స‌మ‌కూర‌క‌పోతే లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ లో చదువు కోవాలనే తన కల కల్ల అవుతుంది ; అప్పుడు ఇక్క‌డే పిజీ చెయ్యాలి; ఆమె ఆలోచ‌న‌లు ఐదులక్ష‌ల‌లు దాకానే వ‌చ్చి ఆగిపోతునాయి త‌ప్పా అవి ఎలా సంపాదించాల‌న్న విష‌యం వైపు వెళ్ళ‌టం లేదు...


అలా ఆలోచిస్తుంటే ఆమె మ‌స్తిష్కం మొద్దుబారిపోయింది. ఇంత‌లో ఆటో యూనివ‌ర్శిటి కేంప‌స్‌లోకి అడుగు పెట్టింది. ఆమెను చూడ‌గానే ఆమె స్నేహితురాళ్ళు, లెక్చ‌ర‌ర్స్ కంగ్రాచులేష‌న్స్ చెప్ప‌డం మొద‌లు పెట్టారు.. ఒక్క‌సారిగా అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చి అభినంద‌లు తెలుపుతుంటే ఆమెకేం జ‌రుగు తోందో అర్థం కాలేదు.


ఇంత‌లో హెడాఫ్ ది డిపార్ట్‌మెంట్ తుల‌సీరావు గారొచ్చి “శార్వ‌రీ! నీకే యూనివ‌ర్సిటి ఫ‌స్టొచ్చింది. కంగ్రాట్స్‌.. మా అంద‌రి న‌మ్మ‌కాన్ని నువ్వు వ‌మ్ము చెయ్య‌లేదు. 80 శాతం పైగా మార్కులు తెచ్చుకొని మ‌న ఎకానామిక్స్ డిపార్ట‌మెంట్ ప‌రువు నిల‌బెట్టావు``అంటూ ఆమె నోట్లో స్వీటు పెట్టి అభినందించ‌గానే ఆమెకు విష‌యం అర్థ‌మై క‌ళ్ళు చెమ్మ గిల్లాయి; ఆ మాట‌లు విన‌గానే నిన్న‌ట్నుంచి ప‌డుతున్న టెన్ష‌న్ ఒక్క‌సారిగా తగ్గిపోయి ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది...


ఇక అప్ప‌ట్నుంచీ గంట దాకా అభినంద‌న‌ల వెల్లువ కొన‌సాగింది. ఆ పూటంతా ఒక‌రికొక‌రు అభినందించు కోవ‌డంతోనే గ‌డిచి పోయింది... ప‌న్నెండు గంట‌ల‌కు ఆమె కేంప‌స్‌లో ఉన్న బేంకుకి వెళ్ళి లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ వాళ్ళు పంపిన ఎడ్మిష‌న్ లెట‌ర్ని మేనేజ‌ర్‌కి చూపించి ఎడ్యుకేషన్ లోను కావాల‌ని అడిగింది.

అత‌ను ఆ లెట‌ర్ని చూసి ``మేడం! లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ చాలా గొప్ప విద్యాసంస్థ ; అందులో సీటు రావ‌డం అంతా ఆషామాషీ విష‌యం కాదు. అందులో సీటు వచ్చినందుకు మిమ్మ‌ల్ని మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్నాను. కాక‌పోతే లోనుకి ష్యూరిటీలు కావాలి. ఎవ‌రైనా ఇస్తే నేను మీ ఫీజు మొత్నాన్ని మంజూరు చేస్తాను`` అని చెప్పాడు. శార్వ‌రి అత‌నికి కృత‌జ్ఞ‌త‌లు చెప్పి ష్యూరిటీలు ఎవ‌రిస్తారా అని ఆలోచిస్తూ బ‌య‌ట‌కు వ‌చ్చింది.


ఆమె‌కి యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్లు త‌ప్ప ఎవ్వ‌రూ తెలియరు. ఆమె స్నేహితురాళ్ళెవ‌రూ ష్యూరిటీలు ఇచ్చేటంత‌టి డ‌బ్నున్న వాళ్ళు కారు. ఆమెకెందుకో ప్రొఫెస‌ర్ల‌నీ, లెక్చ‌ర‌ర్స్‌నీ ష్యూరిటీలుగా ఉండ‌మ‌నీ అడ‌గ‌టానికి మ‌న‌సొప్ప‌లేదు. ఇంకా ప‌దిహేను రోజుల స‌మ‌యం ఉంది క‌దా ఈ లోపు ఏదైనా జరగవచ్చు; "గుర్రం ఎగరా వచ్చు” అని తానెప్పుడో చదివిన విషయం గుర్తుకొచ్చి నవ్వుకుంటూ హాస్ట‌కి వెళ్ళిపోయింది.

వెళ్ళిందే కానీ ఆరోజుంతా ఆమె అన్య‌మ‌న‌స్కంగా గ‌డిపింది. త‌ను లండ‌న్ వెళ్ళీ అక్క‌డ ఆ కాలేజీలో చ‌దవాలంటే లోను సేంక్ష‌న‌వ్వాలి, లేక‌పోతే కుద‌ర‌దు. త‌ను ఓ అనాథ‌... చుట్టాలు, ప‌క్కాలు ఎవ్వరూ లేరు.. ఆదుకునేటంత‌టి డ‌బ్బున్న స్నేహితురాళ్ళు కూడా లేరు.


ఇలా ఆలోచించ‌గానే అక్క‌డి కెళ్ళి చ‌ద‌వ‌డం అనేది క‌ష్టం అని ఆమెకు తెలిసిపోయింది. ఇక యూనివ‌ర్సిటీలోనే పీజీ చెయ్య‌డం ఒక్క‌టే త‌నకున్న ఏకైక మార్గం!

‘ఈ దేశంలో పేద‌వాళ్ళ‌కు త‌మ‌కు న‌చ్చే చ‌దువులు చ‌దివే అర్హ‌త లేదు... అది డ‌బ్బున్న వాళ్ళ‌కే ఉంటుంది’; ఆ ఆలోచ‌న రాగానే ఆమె క‌ళ్ళ‌ల్లో నీళ్ళు తిరిగాయి. ఆమె చాలాసేపు గ‌దిలో మౌనంగా ఉండిపోయింది. అప్పుడామె దృష్టి గోడ‌మీద ఎవ‌రో వ్రాసిన “ఒక దీపాన్ని వెలిగించు, వేవేల దివ్వెలు”! అన్న వాక్యం క‌నిపించింది.. అది చ‌దివిన త‌రువాత ‘నా దీపాన్ని ఎవ‌రు వెలిగిస్తారు’అని ఆమె త‌నని తాను ప్ర‌శ్నించుకుంది.. అలా ఆలోచిస్తూ ఆమె నిద్ర‌లోకి జారుకుంది.

..................

మ‌ర్నాడు ఉద‌యం ప‌దిగంట‌ల స‌మ‌యంలో హాస్ట‌ల్ ఎటెండెంట్ రాము ఒక ఏభై ఏళ్ళ వ్య‌క్తిని శార్వ‌రి గ‌దికి తీసుకువ‌చ్చి “ఈమే శార్వ‌రి గారు” అని చెప్పి వెళ్ళిపోయాడు.

అత‌ను తెల్ల‌గా, న‌ల్ల‌కోటు, క‌ళ్ళ‌జోడులో హుందాగా ఉన్నాడు. చేతిలో ఒక ఫైలు ఉంది.

అత‌ను లోప‌లికి వ‌స్తూనే ``నా పేరు విశ్వ‌నాథం. లాయ‌ర్ని; మీరు శార్వరి గారేనా ? “అని అడిగాడు .


శార్వ‌రి అత‌నికి న‌మ‌స్కారం పెడుతూ `` అవును” అని చెప్పి కూర్చోమ‌నీ కుర్చీ చూపించింది.


“అమ్మా ! మొద‌ట‌గా యూనివ‌ర్సిటీ ఫ‌స్టు వ‌చ్చినందుకు మీకు అభినంద‌న‌లు; ఈ రోజు పేప‌ర్లో ఆ వార్త చూసి చాలా ఆనంద‌ప‌డ్డాను ఇక నేనెందుకొచ్చానో చెబుతాను; హ‌ర‌నాథ్ అనే ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త గురించి మీరు వినే ఉంటారు; అత‌ను ప్ర‌స్తుతం కిడ్ని వ్యాధితో బాధ‌ప‌డుతూ నిన్న‌నే చ‌నిపోయాడు.


అత‌ను వారం రోజుల క్రితం నన్ను పిలిచి అత‌ని ఆస్తిని పంప‌కాలు చేసే విల్లును వ్రాయ‌మ‌న్నాడు. అత‌ని ఆస్తిలో ముప్పావు భాగం అనాథ‌శ్ర‌మాల‌కు వ్రాసేసాడు. మిగ‌తా పావులో కోటి రూపాయ‌లు నీకు వ్రాసిచ్చాడు. అది ఎందుకు నీ పేర వ్రాసాడో బహుశా ఇందులో రాసి ఉంటాడు” అంటూ ఒక క‌వ‌ర్ని ఆమెకిచ్చాడు.


అత‌ని మాట‌లు మొద‌ట ఆమెకి అర్థం కాలేదు. ఆ త‌రువాత అర్థ‌మై ఆమె మ‌స్తిష్కం మొద్దు బారిపోయింది. హ‌ర‌నాథ్ అనే ధ‌న‌వంతుడెవ‌రో త‌న‌కు తెలియ‌దు... మ‌రి త‌న‌కెందుకు ఆస్తి వ్రాసాడు?... ఆమె ఆలోచిస్తూ క‌వ‌ర్ని తెర‌చి అందులోని ఉత్త‌రన్ని చ‌ద‌వ‌సాగింది....


“చిరంజీవి శార్వ‌రికి ఆశీర్వ‌చ‌న‌ములు!...

నా పేరు హ‌ర‌నాథ్‌... ఈ జిల్లాకే పెద్ద పారిశ్రామిక వేత్త‌ను.. నా వ‌ల్ల మీ కుటుంబానికి ఓ పెద్ద అన్యాయం జ‌రిగింది. మీ నాన్న నా ద‌గ్గ‌ర ప‌దిహేనేళ్ళ క్రితం గుమాస్తాగా ప‌నిచేసేవాడు. ఒక‌సారి నా కంపెనీ మీద నా ప్ర‌త్య‌ర్థి బ‌ల‌రాం ప్ర‌భుత్వానికి ఫిర్యాదు చేస్తే ఆ కోపంతో అత‌న్ని నేను దారుణంగా చంపించాను... ఆ కేసుని మీ నాన్న శ్రీధ‌ర్ మీదకు నెట్టి నేను తప్పించుకున్నాను;అలా మీ నాన్న నా వ‌ల్ల త‌ను చెయ్య‌ని నేరానికి జైలు పాలై శిక్ష‌నుభ‌విస్తూ చ‌నిపోయాడు. ఆ తరువాత మీ అమ్మ కూడా బెంగ‌తో చ‌నిపోయింది. ఆ విధంగా నా వల్ల మీ కుటుంబం చిన్నాభిన్నం అయింది. నువ్వు అనాధ‌వ‌య్యావు. !”

“అలా నేను స్వార్ధంతో చేసిన ఓఘోర త‌ప్పిదం మీ కుటుంబాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసింది. కానీ దాని వ‌ల్ల నేను జీవితంలో ఏమిటి సాధించాను? ఆనాడు నేను మీకుటుంబానికి చేసిన అన్యాయం వల్ల నా కూతురు ర‌జిత‌ను అల్లుడు డ‌బ్బు కోసం నానా హింస‌లు పెట్టి కాల్చి చంపేసాడు. కారులో వెళుతున్న నా కొడుకు కుటుంబాన్ని నా ప్ర‌త్య‌ర్ధులు పెట్రోలు పోసి ద‌హ‌నం చేసారు.


అలా నా కుటుంబం మొత్తం నాశ‌నం అయింది. ఆ బాధల్ని త‌ట్టుకోలేక నేను రోగాల పాల‌య్యాను; చివ‌ర‌కు కిడ్నీ వ్యాధి న‌న్ను క‌బ‌ళించింది; నేను కొద్ది గంటల్లో ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను; అప్పుడు నేను చేసిన పాపం ఇప్పుడు న‌న్ను అనుక్ష‌ణం ద‌హించి వేస్తోంది.; మనం చేసిన పాపాల‌కు దేవుడు బ‌తికున్న‌ప్పుడే శిక్ష వేస్తాడనటానికి నా బ‌తుకే సాక్ష్యం; ఏ డ‌బ్బు కోసం అయితే నేను పాపాలు చేసానో అది నాకు జీవితంలో ఎందుకూ కొర‌గాకుండాపోయింది. ”


“జీవిత చ‌ర‌మాంకంలో నేను ప‌డ్డ ఈ క్షోభ ఏ శత్రువుకీ రాకూడ‌దు; నేను చేసిన పాపం నన్ను కార్చిచ్చులా దహించి ప్ర‌త్య‌క్ష న‌ర‌కాన్ని చూపింది. అందుకే ఈ లోకాన్ని వీడే ముందు నే చేసిన తప్పుకి ప్రాయ‌శ్చిత్తం చేయ‌ద‌ల్చుకున్నాను”.


“నా వ‌ల్ల అంధ‌కార ‌బంధుర మైన నీ జీవితానికి వెలుగు నివ్వాల‌నీ నిర్ణ‌యించుకునీ నా ఆస్తిలో కోటిరూపాయ‌లు నీ పేర వ్రాసాను; ఇదేదో నీకు స‌హాయం చేసి నీ సానుభూతిని పొంది త‌ద్వారా పుణ్యం సంపాదించాల‌నీ కాదు.. నేను మీనాన్న‌ని అన్యాయంగా జైలుకి పంపించడం ద్వారా మీ కుటుంబానికి ఎంత అన్యాయం జరిగిందో ఆ పాపం కార‌ణంగా అసువులు బాసిన నా పిల్ల‌ల‌కీ, తద్వారా నాకుటుంబానికీ అంతే అన్యాయం జరిగింది.

“ఈ మాన‌సిక సంఘ‌ర్ష‌ణ నుంచి బ‌య‌ట‌ప‌డి నేను ప్రశాంతంగా చ‌నిపోవాలంటే నేను చేసిన పాపానికి ప్రాయ‌శ్చిత్తం చేసుకోవాలి. అందుకే నీ పేర డ‌బ్బు వ్రాసాను.. దీనివ‌ల్ల నీ జీవితం బాగుప‌డితే నా ఆత్మ‌, త‌ద్వార నా పిల్ల‌ల ఆత్మ‌లు సంతోషిస్తాయి; కాబ‌ట్టి ద‌య‌చేసి ఈ కోటి రూపాయ‌ల ధ‌నాన్ని కాద‌న‌కుండా స్వీక‌రించి నా జీవితానికి వెలుగుని ప్ర‌సాదించు; ఇది నీకు నేను చేసిన స‌హాయం కాదు.. నాకు నేను చేసుకున్న ప్రాయ‌శ్చిత్తం!... ఉంటాను”- హ‌రనాథ్‌.


ఆ ఉత్త‌రాన్ని చ‌దివిన త‌రువాత శార్వ‌రి క‌ళ్ళ‌ల్లో నీళ్ళు చెమ్మ‌గిల్లాయి.

చెమ‌ర్చిన క‌ళ్ళ‌ను తుడుచుకుంటూ "ఎందుకిలా చేసాడాయ‌న‌?" అని అడిగింది విశ్వనాధాన్ని.


"పుట్టిన‌ప్పుడు ఎవ్వ‌రూ చెడ్డ‌వారు కాదు; కొన్ని ప‌రిస్థితులు, స‌మాజం మ‌నిషిని చెడ్డ‌వాడిగా మారుస్తాయి. అలాంటి వ్య‌క్తే హ‌ర‌నాథ్... అత‌ను డ‌బ్బు కోసం గ‌డ్డితిని చాలామందికి అన్యాయం చేసాడు. ఎన్నో కుటుంబాల‌ను నాశ‌నం చేసాడు. అయితే చ‌ర‌మాంకంలో త‌న త‌ప్పు తెలుసుకున్నాడు.


అందుకు ప్రాయ‌శ్చిత్తం చేసుకున్నాడు. మీరింకేం సందేహించకుండా ఈ డ‌బ్బు తీసుకొని మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. మీరు ఉన్న‌త స్థానాల‌కి వెళ్ళి మంచి పేరు తెచ్చుకుంటే చ‌నిపోయిన మీ త‌ల్లితండ్రులు సంతోషిస్తారు.. హ‌ర‌నాథ్ గారి ఆత్మ కూడా శాంతిస్తుంది..” అని చెప్పి వెళ్ళిపోయాడు విశ్వ‌నాథం.


అత‌ను వెళ్ళిపోయినా అత‌ను చెప్పిన `ప్రాయ‌శ్చిత్తం` అన్న ప‌దం పదే పదే గుర్తుకి వస్తూ ఆమె క‌ళ్ళ‌ల్లో నీళ్ళు తిరిగాయి.


(సమాప్తం)

గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Twitter Link

Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం

గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.




70 views1 comment
bottom of page