ప్రేగుబంధంతో ప్రమాదమా.. ????
- Dr. Brinda M. N.
- 10 hours ago
- 5 min read
#PregubandhamthoPramadama, #ప్రేగుబంధంతోప్రమాదమా, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Pregubandhamtho Pramadama - New Telugu Story Written By Dr. Brinda M N
Published In manatelugukathalu.com On 02/12/2025
ప్రేగుబంధంతో ప్రమాదమా - తెలుగు కథ
రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.
"నమస్కారం! నమస్కారం! సన్యాసిరావు గారు, కుశలమా?" అంటూ గుమ్మంలోకి విచ్చేస్తున్నాడు ఆనందమూర్తి.
"నమస్కారం! బావగారు రండి, విచ్చేయండి, కూర్చోండి"
"ఏమ్మా! కనకరత్నం ఎలా ఉన్నావ్? మీ చల్లటి చేతితో వేడి వేడి మంచి కాఫీ ఇవ్వు"
"ఇదిగో ఇప్పుడే తెస్తాను అన్నయ్యగారు" వంటింట్లోకి నడిచింది కనుకరత్నం.
"ఏంటోయి? వార్తలు, విశేషాలు"
"చెప్పుకోవడానికి విచిత్రాలు లేవులే బావగారు"
కాఫీ అందించింది కనుక రత్నం. "ఏమ్మా! అంతా కులాసానే కదా"
"భగవంతుని దయవలన దేనికి కొదవలేదు అన్నయ్య. ఆ.. ఒక్క సంతానం లేదనే విచారం తప్ప. ఏ జన్మలో చేసిన పాపమో ఇప్పుడు శాపమై తాండవిస్తోంది. " కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ
"అబ్బా! ఆపవే ఈ పిల్లల భాగోతం. బావగారు అలా బాల్కనీలోకి వెళ్లి మాట్లాడుకుందాం పదండి. "
"ఏంటండీ! ఈ దఫా ధార్మిక వివాహాలు ఎంత దాకా వచ్చాయి?"
"ఆ ఏముంది గత సంవత్సరాల్లో తక్కువగానే చేశాము కదా, ఈసారి పొలం వలన మంచి లాభాలు వచ్చాయి. వంద జంటలకు అనుకుంటున్నాం. "
"శుభస్య శీఘ్రం! రాబోవు మాసంలో మంచి ముహూర్తం భేషుగ్గా ఉంది, కానిచ్చేయండి. "
"అలాగే బావగారు, మీరు చెప్పడం నేను కాదనడం ఏనాడైనా జరిగాయా?" చిరునవ్వు చిందిస్తూ అన్నాడు సన్యాసిరావు.
నిర్ణీత సమయానికి వంద జంటలకు ధార్మిక కళ్యాణం జరిపించారు సన్యాసిరావు దంపతులు. మరుసటి రోజు వాయనం ఇచ్చి పంపడం ఆనవాయితీ. ఆ తంతు కోసం అందరూ ఒక పెద్ద హాల్లో కూర్చున్నారు.
మేలిమి ఛాయతో చిరునవ్వు చిందిస్తూ, ఆప్యాయత, అనురాగాలకు ప్రతీకగా అందరినీ పలకరిస్తూ, పట్టుజర్రీ చీరతో మొక్కవోని విశ్వాసంతో మైకు పట్టుకుని ముందు నిల్చున్న ముదిత మాట్లాడటం ప్రారంభించింది.
"అందరికీ నమస్కారం, సన్యాసిరావు దంపతులకు పాదాభివందనాలు. శత జంటలకు శతకోటి శుభాకాంక్షలు. ఆనందంగా, ఆరోగ్యంగా వర్ధిల్లండి. ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా, ఆయుర్వేద పరిశోధకురాలిగా ప్రతి ఏడు రెండవ రోజు రావడం పరిపాటి. గతంలో భార్యాభర్తల మధ్య అంగీకారం, సహకారం, మమకారం, అలంకారాలు ఎలా ఉండాలో అని, ఇంకొకసారి ఆహార - ఆహార్యం నియమాలు, పోషకాలు, ఖనిజాలు, లవణాలు అంటూ తెగ చెప్పేసి, చప్పట్లు కొట్టించుకుని, చకచకా వెళ్ళేదాన్ని. కానీ ఈసారి ఇంతమందిని చూసిన తర్వాత నేటి సమాజంలో పిల్లల ప్రవర్తన, పైశాచికత్వంతో పాషాణమై, పాశమై చుట్టుకున్న ఒక యథార్థ రూపాన్ని మీ అందరి ముందు ఆవిష్కరింప చేస్తున్నాను. కొత్తగా పెళ్లయిన వారిపై కాస్త కనికరమైనా చూపించరూ? అన్న కుతూహలం మీకు ఉండవచ్చు. ఈనాటి రెండు గంటలు రేపటి 80 ఏళ్ల జీవితానికి పునాదని మరవకండి. అందరూ చరవాణిలను నిశ్శబ్ద రూపంలో నిద్రపోనివ్వండి.
నిహారిక, నియాన్లకు మొదటి సంతానం ఆడబిడ్డ జన్మించి అనారోగ్యం వలన కొన్ని రోజులకే కాలం చేసింది. మూడేళ్ల అనంతరం మరలా ఆడశిశువుకే స్వాగతం పలికింది నిహారిక.
"చూడమ్మా! ఈ పాపను జాగ్రత్తగా చూసుకోండి, ఇంకొకసారి గర్భధారణ చేసే అవకాశం లేదు కావున" చెప్పింది డాక్టర్. "సరేనండీ" పలికారు ఒకే స్వరంతో
పాపను జాగ్రత్తగా కాదు కదా అతిగారాబంతో పెంచసాగారు. తనకు నచ్చిన దుస్తులు, పాదరక్షలు ఎన్నో ఎన్నెన్నో. మామూలుగా కాకుండా అహం, దర్పం, డాంబికం ఆభరణాలను ధరిస్తూ పెరిగింది నిషా. చిన్నప్పుడు చదువులో చలాకీగా ఉన్నా, రాను రాను అంతంతమాత్రంగా చదివేది. నిహారిక చెల్లితో చాలా చనువుగా ఉండేది నిషా.
స్టవ్ మరమ్మత్తు చేస్తూ నియాన్, "నిషా! అ నూనె, పరికరాలు అవన్నీ తీసుకురామ్మా. "
తెచ్చి అక్కడ పడేసింది.
"నువ్వు, ఓ చెయ్యి వేయచ్చు కదమ్మ!"
"ఆ.. , నాన్న చేసుకో, నువ్వు ఆఫీసులో రివాల్వింగ్ సీటులో తిరగడమే కదా!" అంటూ తండ్రిని అవహేళనగా మాట్లాడింది.
"ఏంటండీ? ఏమైంది? అలా ఉన్నారు!"
"అబ్బే! ఏమీ లేదులే నీ.. , హు. "
వారం రోజులు అనంతరం నిషా తనను అవమానించిన తీరును చెప్పాడు భార్యతో.
"మొక్కై వంగనిది మానై వంగుతుందా? కొంచెం కఠినంగా ప్రవర్తించాలి మనం. " అంది కోపంతో నిహారిక.
"సర్, గత కొన్ని రోజులుగా చెప్పాలనుకుంటున్నాను. మీ పాప ప్రతిరోజు ఇంటర్వెల్ లో తరగతి గదిలో బెంచిలన్నీ ఎక్కి బూట్లతో త్రొక్కి అపరిశుభ్రంగా చేస్తోంది. అంతేకాక తోటి అబ్బాయిలు, అమ్మాయిలను విచక్షణరహితంగా దూషించడం, బాధడం వంటివి చేస్తుంది. " చెప్పింది పాఠశాల క్లాస్ టీచర్.
"అయ్యో, క్షమించండి. ఇకముందు అలా జరగకుండా చూసుకుంటాం. " అన్నాడు
ఆ రెండు రోజులు దంపతులిద్దరూ బాగా బుద్ధి చెప్పడంతో కొంచెం దారిలోకి వచ్చింది నిషా. కానీ చిన్నాచితక గొడవలు అడపాదడపా కొన్ని ఆకతాయి సంఘటనలను కొనసాగిస్తూ ఉండేది. గారాల పట్టి కావడంతో పెద్దవారు కూడా స్వేచ్ఛ, స్వాతంత్రాలు పూర్తిగా ఇచ్చేశారు నిషాకి.
పుట్టినరోజుకు పంజాబీ డ్రెస్ కొనడానికి వస్త్రాలయంలోకి వెళ్లి మంచి డ్రెస్ ని ఎన్నుకొని ఓనర్కు డబ్బులు ఇవ్వబోతుంటే "నాన్న, ఈ డ్రెస్సు కొనివ్వు చాలా బాగుంది. " నియాన్ దగ్గరికి వచ్చి చూడగా, అది ఖరీదు మరీ ఎక్కువాయే.
"వద్దులేమ్మా, ఈసారి తీసుకుందాం ఇటువంటిది. "
"ఆ.. ఆ.. నాకు కానే కావాలి కొనివ్వు. "
"చెప్పాను కదా, ఏంటి నీ గోల?" కోపంతో అన్నాడు.
"ఇంత ఖరీదైన డ్రస్సు కొనివ్వడం చేతకానప్పుడు ఎందుకు నీవు తీసుకొచ్చావు ఇక్కడికి?" అంటూ అమర్యాదగా ప్రవర్తించింది నిషా.
పరువు కోసం తెచ్చిన నగదును అంతా పెట్టి డ్రెస్సును కొనిచ్చాడు. భార్యతో విషయం చెప్పి చాలా బాధపడ్డాడు. నిహారిక నాలుగు దెబ్బలేసింది నిషాకు. దినదిన ప్రవర్ధమానం అవుతున్న చందంలో పదవ తరగతిలోకి అడుగు పెట్టింది నిషా. ఇక డ్రెస్సుకు తగ్గ గాజులు, బొట్టు, చేతి రుమాలు, హారం, లిప్స్టిక్ అన్ని మ్యాచింగ్ ఉండాల్సిందే. చదువు అటకెక్కింది. టెన్త్ లో డుమ్మా కొట్టింది. తర్వాత వత్సరం మరీ నెట్టుకొచ్చింది. ఇంటర్ కి కళాశాలలో చేర్పించారు. మొదట చదువుపై శ్రద్ధ బాగా పెట్టేది, తర్వాత స్నేహితులు షికార్లు, అఫైర్లు అక్కడ అదే తంతు. రెండవసారి నీరసంగా బయటపడింది.
డిగ్రీలో స్నేహితులంతా బైక్లో వస్తున్నారు. బైకు కొనిస్తేనే కళాశాలకు వెళ్తా. ఇది ప్రెస్టీజ్ ఇష్యూ ఆర్డర్ వేసింది ఇక చేసేదేముంది బైక్ తీసి ఇచ్చారు. నిషా ఆనందాలకు అంతు పొంతూ లేకుండా పోయింది. ఐస్ క్రీమ్ పార్లర్లు, బ్యూటీ పార్లర్లు, స్నేహితులతో షికారులు, నిహారిక ఎంత మందలిస్తున్న లాభం లేకపోయింది. ఇలా గడుస్తున్న తరుణంలో నిహారిక సోదరుని సుపుత్రుడితో నిషా నిశ్చితార్థం జరిగింది. చిన్నప్పుడు అనుకున్న సంబంధమే దానికి తోడు నిషా, బాబీ ఒకరికొకరు ఇష్టపడ్డారాయే. ఎలాగో బోల్తాలు కొట్టి కొట్టి పీజీ విద్య వరకు వెళ్లగలిగింది నిషా. బాబీ ఎప్పుడు ఫోన్ చేసినా ఎంగేజ్, స్విచ్ ఆఫ్ స్పందించకపోవడంతో కోపంతో నిహారికకు ఫోన్ చేశాడు.
"ఏంటత్తా! తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిప్లై ఇవ్వదు. ఏం, నీ కూతురు అప్సరసలా ఫీలవుతున్నట్టుందే అంటూ ఏవేవో మాట్లాడాడు. నిహారిక, బాబీ మధ్య వాదోపవాదాలు జరిగాయి. విషయం తెలుసుకుని నిషా, బాబీని చెడామడా వాయించింది. అంతే ఇది కూడా గోవిందా!!
ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యేది నిషా. పరీక్షలన్నీ పెద్దపెద్ద నగరాల్లో నిర్వహించడం వలన ప్రతిసారి నియాన్ వెంట వెళ్లేవాడు. వార్ధక్యానికి మెట్టు మెట్టు దగ్గరయ్యే కొద్ది నియాన్ లో శక్తి సన్నగిల్లుతూ ఉండేది. వచ్చిన పెళ్ళి సంబంధాలన్నిటిని ఏదో విధంగా చెడగొట్టేది నిషా తన పిన్ని సహాయంతో. ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో పిన్నితోనే సన్నిహితంగా గడపడంతో సహవాస దోషం వలన ఆమె బుద్ధులు, పోలికలు బాగానే అతికాయి నిషాకు.
"నిషా! మనకున్న దానితో బ్రతుకుదాం. మీ నాన్న ముందులాగా లేడు. ఆయన తోడు వచ్చినప్పుడు మాత్రమే, నీవు పరీక్షకు వెళ్లాలి ఒంటరిగా నిన్ను పంపను. " అంటూ ఖరాఖండీగా చెప్పింది నిహారిక.
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో పిన్నితో చేతులు కలిపి, తల్లి మంచం పడేట్లు చేసింది నిషా, తన అధికారం చలాయించడం కోసం, సంపూర్ణ స్వేచ్ఛ కోసం.
నిహారిక నరకయాతనను అనుభవించి, అనుభవించి కన్నుమూసింది. భార్య పోవడంతో మానసికంగా నీరసించి పోయాడు నియాన్. రామ కృష్ణ అంటూ ఆశ్రమాలకు నిత్యం వెళుతూ ఉండేవాడు. నిషాకు అడ్డు, అదుపు లేకుండా పోయింది. బాయ్ ఫ్రెండ్స్ తో షికారులు, విహారాలు, సినిమాలు.. ఒకటేమిటి!!
"చూడమ్మా! మంచి సంబంధం చూశాను. అబ్బాయి చాలా మంచివాడు. నీకు వివాహం చేయాలన్నది మీ అమ్మ చివరి కోరిక చేసుకో తల్లి" అంటూ నిషా చేతులు పట్టుకొని వేడుకున్నాడు నియాన్
"నాన్న! ఐ వాంట్ టు ఎంజాయ్ ద లైఫ్. ఈ పెళ్లి ఇవి, అవి నథింగ్. "
"పద్ధతిగా పెళ్లి చేసుకుని మీ ఆయనతో ఎంజాయ్ చేయమ్మ"
"ఏంటి, నా లైఫ్, నా ఇష్టం ముసలోడివయ్యావు, ఓ మూలన కూర్చో" ఇలా ఎదురుకెదురు సమాధానం చెప్పేది. ఆ కృత్యాలు చూడలేక మానసిక రోగంతో మంచాన పడ్డాడు. నిషా విలాసాలకు వ్యవధి కూడా సరిపోయేది కాదు. తండ్రి అని కూడా చూడకుండా శారీరకంగా, మానసికంగా హింసకు గురి చేసేది. ఎన్ని రోజులు
తట్టుకోగలదు ఆ ముసలి శరీరం ఈ యాతనను, పాండురంగా అంటూ పరమాత్ముని సన్నిధి చేరుకున్నాడు నియాన్. ఇక నా దారికి నేనే అధికారిని, ఈ యావదాస్తికి యువరాణిని అంటూ భోగవిలాసాల్లో జీవితం గడుపుతుంది నిషా.
హాలులోని జంటల గుండెల్లో గుండుసూదులు గ్రుచ్చుకున్నట్లున్నాయి. అందరికి చెమటలు పట్టేసాయి. నోటిలో నీటి చుక్కైనా నిల్వకుండా ఎండిపోయాయి. ముఖాలన్ని ముడుచుకుని వాడిపోయాయి. ప్రేగుబంధంతో ఇంత ప్రమాదమా??? రామరామ అనుకుంటూ ఛాతీ మీద చెయ్యి వేసుకున్నారు కొందరు, ముక్కున వేలేసుకున్నారు ఇంకొందరు, శివశివా అంటూ తల బాదుకున్నారు మరెందరో.
"ఈ యదార్థాన్ని దృష్టిలో ఉంచుకొని మీ సంతాన పెంపకంలో తగు నిచ్చెనలు వేసుకోవాలని, ఏ తల్లిదండ్రులకు ఇలాంటి దౌర్భాగ్యం పట్టకూడదని, జీవితంలో కొన్ని కఠోర నియమాలు తప్పనిసరి అవసరమని, మీరందరూ ఎంతో ఓపికగా విన్నందుకు మరొకసారి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించండి" అంటూ ఆ ముదిత ప్రతి జంటకు వాయనం అందించింది. సన్యాసిరావు దంపతులు మాకు పిల్లలు లేకపోవడం నిజంగా అదృష్టమే అనుకున్నారు మనస్సులో.
నీతి: చిన్నప్పటినుండే క్రమశిక్షణ, శ్రమపడే తత్వం, బాధ్యత, మంచి చెడులు, నైతికత నేర్పడం, అదేవిధంగా మనీ, మార్కులని కాకుండా పిల్లల్లో మార్పుకు నాంది పలికితే ఇలాంటి నిషాలు పుట్టుకురారు.
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
సమాప్తం
డాక్టర్ బృంద ఎం. ఎన్. గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.
కవయిత్రి, రచయిత్రి, గాయని,
స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి
15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట
భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.
