top of page

ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 1


'Prema Entha Madhuram Episode 1' - New Telugu Web Series Written By Mohana Krishna Tata

'ప్రేమ ఎంత మధురం! ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం

రచన: తాత మోహనకృష్ణ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"గుడ్ మార్నింగ్ సుశీల డియర్!" అని బెడ్ మీద నుంచి లేస్తూ, పక్కనే ఉన్న తన శ్రీమతి తో అన్నాడు సతీష్.


"గుడ్ మార్నింగ్ శ్రీవారు!"


"రోజు రోజు కు నీ అందం పెరిగిపోతుంది సుశీల.. నా కళ్ళకు అప్సరస లాగా ఉన్నావనుకో!"


"ఇంకా.. చెప్పండి.."


"నేనంటే.. నీకెంత ఇష్టమో చెప్పు డియర్.."


"రోజూ ఉదయమే ఈ ప్రశ్న అడుగుతారు మీరు.. మీరంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టం అండీ.. శ్రీవారు" అంటు బుగ్గను గిల్లి.. “నేనింక లేవాలండీ.. మీతో కబుర్లు చాలు ఇంక.."


గ్లాస్ డోర్స్ కు ఉన్న కర్టెన్ పక్కకు లాగితే, తెల్లవారి సూర్య కిరణాలు లోపలి రూమ్ లోకి తాకుతున్నాయి. ఆ వెలుగు సుశీల ముఖం పై పడి ఆమె ముఖం ప్రకాశిస్తుంది. సతీష్ సుశీల ది ఒక గేటెడ్ కమ్యూనిటీ లో అపార్ట్మెంట్.. చుట్టూ.. చెట్లు.. మంచి గాలి వెలుతురు బాగా వస్తాయి. సతీష్ ఇష్టపడి తీసుకున్నాడు ఆ ఫ్లాట్.


సుశీల చామనఛాయ గా ఉన్నా, ముఖం కళ గా ఉంటుంది. దానికి తోడు, ఆ చిరునవ్వు.. ఒక పెద్ద అలంకారం. సుమారు గా పొడవు, విశాలమైన నుదురు, మధ్య పాపిడి, పాపిడి బొట్టు, చేతులకి గాజులతో లక్షణంగా ఉంటుంది. మెడలో గొలుసు ఆమె అలంకారానికి ప్లస్ అనే చెప్పాలి.


సతీష్.. సుశీల కు పెళ్ళై ఆరు నెలలు అయ్యింది.


********

అప్పట్లో సతీష్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో కొత్తగా జాయిన్ అయ్యాడు. అనుకోకుండా.. మాట్రిమోనీ లో ఒక అమ్మాయి ను చూసాడు. రోజూ.. చాటింగ్ చేసుకున్నారు ఇద్దరు. వర్క్ పక్కన పెట్టి, ఆఫీస్ లో డే టైం అంతా చాటింగ్.. ఇంటికి వచ్చిన తర్వాత, తెల్లవారే వరకు ఫోన్ కాల్ లో ముచ్చట్లు.. మధ్య మధ్య లో పాటలు పాడుకున్నారు, ఆటలాడుకున్నారు.. సినిమా కబుర్లు చెప్పుకున్నారు.. ఇంకా ఎన్నో.. అన్నీ ఫోన్ లోనే.


ఇలాగ.. కొన్నాళ్లు గడిచాక,

ఇంట్లో చెప్పారు ఇద్దరు..


“నాన్న! మీ పెళ్ళికొడుకుల వేట ఇంక ఆపేయండి. నాకు కావల్సిన పెళ్ళికొడుకు ని.. నేనే సెలెక్ట్ చేనుకున్నాను. అర్జెంటు గా మీరు ఇంటికి రావాలి.. మీతో చాలా చెప్పాలి..”


“అలాగే తల్లి! వస్తున్నాను..”


ఇక్కడ సతీష్ కూడా.. అవే డైలాగ్స్.. తన పేరెంట్స్ తో..


మంచి ముహూర్తం చూసి పెళ్ళి చూపులు అరెంజ్ చేసారు..


ఆడపెళ్ళి వారు పెళ్ళి చూపుల హడావిడి. పెళ్లికూతురు ఏమి చీర కట్టుకోవాలో అర్ధం కాక, తికమక పడుతోంది. పెళ్లి కొడుకు ఫోటో చూసిన తర్వాత ఆల్రెడీ నచ్చేసాడు. పెళ్లిచూపులు కాబట్టి, ఇంకా బాగా ముస్తాబు కావాలని పెళ్లి కూతురు ఆత్రం. బీరువా లో ఉన్న చీరలన్నీ తీసి మంచం మీద పడేసి, ఆలోచిస్తుంది సుశీల.


"అమ్మా! ఏం చీర కట్టుకోవాలి? చెప్పవే?"


"నీకు ఈ చీర నప్పుతుంది తల్లి! ఈ గ్రీన్ కలర్ కట్టుకో"


"అవును కదా.. సతీష్ కు గ్రీన్ కలర్ అంటే ఇష్టం కదా!.. కరెక్ట్ గా సెలెక్ట్ చేసావే అమ్మా"


"అక్కా! నువ్వేంటే.. ఇలాగ ముసలమ్మ లాగా, హెయిర్ స్టైల్ నువ్వూ" అంది చెల్లెలు. “ఇలా పైకి దువ్వు, సినిమా హీరోయిన్ లాగా ఉంటావ్. కొంచం నవ్వుతూ ఉండవే, బావగారు.. టక్కున 'ఎస్' చెబుతారు!”


“బావగారిని ఎలా ఇంప్రెస్ చెయ్యాలో మాకు తెలుసు లేవే, నువ్వేమి చెప్పక్కర్లేదు”.

"అక్కా! కాబోయే బావగారు వచ్చారంట!.. నాన్నగారు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చారు. పదా!.. కిటికీ లోంచి చూద్దాం.

బావగారు, టక్ చేసుకొని స్టైల్ గా ఉన్నారు"


"లోపలికి రండి బాబు! కూర్చోండి.. స్వీట్స్ తీసుకోండి.. అమ్మాయి వస్తోంది.."


సుశీల.. కాఫీ గ్లాస్ పళ్లెం లో పెట్టుకొని, అందరికి ఇస్తున్నాది. ‘గ్రీన్ కలర్ సారీ, మాచింగ్ బ్లౌజ్, సూపర్ గా ఉంది’ అనుకున్నాడు సతీష్.


"అమ్మాయి తో ఏమైనా మాట్లాడాలంటే, అలా, వరండా లోకి వెళ్ళండి బాబు.. ఇద్దరు కాసేపు మాట్లాడుకోండి.."


మాట్లాడుకోవాల్సినవన్నీ.. ఫోన్ లో అయిపోయాయి.. ఇంక చూసుకోవడమే ఉంది.. ఇద్దరు.. అదే పనిగా.. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు..


"నేనంటే ఇష్టమేనా సుశీల? చెప్పు.. ఇంక.. పెళ్లిచేసుకుందామా!.."


"అలాగే కాబోయే శ్రీవారు" అంటూ ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది సుశీల..


"ఫ్లైయింగ్ కిస్ ఏమిటి సుశీల? మనకి ఆల్మోస్ట్ పెళ్ళైపోయినట్టే.. ఒక ముద్దు ఇవ్వొచ్చు కదా.. సుశీ!"

"అన్నీ పెళ్ళైన తర్వాతే. పెళ్ళైన తర్వాత మీకు ఎన్ని కావాలంటే, అన్ని ఇస్తాను"


"పోనీ, నా కోసం ఒక డాన్స్ చేయవా సుశీ?"


"డాన్స్ ? నేనా?"


"ఫోన్ లో వచ్చని చెప్పావు!"


"ఎవరైనా వస్తే బాగుండదండి"


"పర్వాలేదు లే! లేకపోతే.. అందరి ముందు అడుగుతా!.. అప్పుడు అక్కడ చేయాల్సి ఉంటుంది.. ఆలోచించుకో..”

"అలాగే! చేస్తాను.." అని సుశీల రెండు స్టెప్స్ వేసింది.. అవి చూసి ఈల వెయ్యాలనిపించింది సతీష్ కు.. కానీ ఆగిపోయాడు..


అలాగ పెళ్ళి చూపులు, జరిగాయి. ఆ రోజు రాత్రి సుశీల నుంచి సతీష్ కు ఫోన్ వచ్చింది..


"ఏమిటి సుశీలగారు! ఇలా కాల్ చేసారు? చెప్పండి? మేము నచ్చామా అండి?"


"చాలు లెండి! మీ వెటకారం.. మిమల్ని చూడాలని ఉంది. రావొచ్చు కదా! మా ఇంటికి?"


"వస్తే.. మీ ఇంట్లో ఏమనుకుంటారో?"


"పర్వాలేదండి, నేను రమ్మన్నానని చెబుతాను లెండి.. "


"అలాగైతే వస్తాను.. ఇప్పుడు రమ్మంటావా?"


"రాత్రి పూట? నో.."


"రేపు ఉదయం రండి.. పూరి చేసి పెడతాను.. మీ కోసం.. టిఫిన్ లోకి"


"ఏమి నా అదృష్టం.. నా సుశీ చేతి పూరి కోసమైనా వెళ్ళాలి రేపు" అనుకున్నాడు సతీష్.


ఆ రోజు రాత్రంతా.. నిద్రపట్టలేదు.. పాత సినిమా లోలాగా వరుసగా సుశీల తో డ్యూయెట్ పాడుకున్నట్లు.. ఒకటే కలలు..


మర్నాడు సతీష్ నీట్ గా డ్రెస్ చేసుకుని.. సుశీల ఇంటికి వెళ్ళాడు.


సుశీల వేడి వేడిగా పూరి వేయిస్తున్నది..

"సతీష్! పూరి తినండి" అని ప్లేట్ అందించింది సుశీల.


పూరి తింటూ, సుశీల వైపు చూస్తున్నాడు సతీష్..

"ఏమిటి అంతలాగ చూస్తున్నారు? ఊరుకుంటే, ఇప్పుడే తాళి కట్టేటట్టు ఉన్నారు సార్ "

"నువ్వు 'ఎస్' అను, అలాగే కానిచ్చేద్దాం"


"మరీనూ.. ముహుర్తాలు నాలుగు నెలల వరకు లేవంట తెలుసా?"


"ఉన్నాయంట.. చేసుకుంటే.. నెలలో చేసుకోవాలి, లేకపోతే నాలుగు నెలల వరకు ఆగాలి అంట. నాకు తెలుసు సుశీ?”


"తొందరగా ముహూర్తం పెట్టించండి.." అంది సుశీల.


"అలాగే అంటూ ఇంటి దారి పట్టాడు, సతీష్..


"అక్క! బావగారు చాలా ఫాస్ట్ గా ఉన్నారు.. ఛాన్స్ ఇస్తే అమాంతం నిన్ను ఎత్తుకుపోతారేమో!.."


"ఛీ.. పాడు.. అన్ని ఇలాంటి మాటలే.."


"ఏంటి తల్లీ! నువ్వేమైనా చిన్న పిల్లవా! చెప్పు.. పాతిక వస్తాయి నీకు ఇంకో మూడు నెలలు పొతే.."


"అయినా.. నాకు.. మా ఆయనకు.. ఏముంటే.. నీకెందుకే?.. ఇక్కడనుంచి పోవే.. "


"అమ్మా! చూడవే అక్క అప్పుడే.. కాబోయే ఆయనను వెనుకేసుకొస్తుంది.. "

"పొనీలేవే! అక్కను ఆట పట్టించకు.. ఎంతైనా నా కూతురు అదృష్టవంతురాలు.. రాజా లాంటి అల్లుడు వస్తున్నాడు మా ఇంటికి.. "


ఇంటికి చేరుకున్నాడు సతీష్. కొడుకు ముఖంలో ఆనందం చూసి తల్లిదండ్రులకు అర్థమైపోయింది..

"ఏరా! అమ్మాయి నచ్చిందా. ?"


"అమ్మాయి బాగుందిరా!.. నాకైతే నచ్చింది” అన్నది తల్లి.


"నచ్చింది అమ్మ! ముహుర్తాలు పెట్టించండి" అన్నాడు సతీష్.

మంచి ముహూర్తాన ఇరువురు పెద్దలు తాంబూలాలు మార్చుకున్నారు. రెండు నెలలలో పెళ్ళి ఫిక్స్ అయ్యింది.


'సతీష్ వెడ్స్ సుశీల' శుభలేఖలు అచ్చు వేశారు. పెళ్ళి చాలా వైభవంగా జరిగింది..


*******


పెళ్ళై ఇప్పుడు 8 నెలలు అయ్యింది..


"సుశీల! మంచి కాఫీ ఇవ్వవా!"


"అలాగేనండి! వస్తున్నా!"


"నువ్వు అలాగా నవ్వుతూ చేతికి కాఫీ ఇస్తుంటే, చాలా బాగుంటుంది. ఏమంటావు?”


“శ్రీవారు.. స్నానం చేసి, పదండి ఆఫీస్ కు..” అని టవల్ చేతికిచ్చి బాత్రూం లోకి పంపించింది.


‘ఏమిటో శ్రీవారు చాలా సరదాగా, హుషారుగు ఉంటారు.. కానీ అప్పుడప్పుడు రూమ్ లో ఒంటరిగా.. కూర్చొని.. ఏదో ఆలోచిస్తూ ఉంటారు.. ఏమిటో తెలియట్లేదు..’ అనుకుంది సుశీల..


బెడ్ రూమ్ లో కూడా చాలా హుషారుగా ఉండే మా ఆయనను.. అంతగా దిగాలు చేసిన ఆ విషయము ఏమిటో తెలుసుకోవాలి.. అడిగితే ఏమనుకుంటారో?


‘నేనే ఎలాగైనా తెలుసుకోవా'లనుకుంది సుశీల.


=====================================================================

ఇంకా వుంది..

=====================================================================

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ144 views0 comments

Comments


bottom of page