ప్రేమకోసం
- Pandranki Subramani
- Aug 7
- 7 min read
#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #ప్రేమకోసం, #Premakosam, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Premakosam - New Telugu Story Written By Pandranki Subramani
Published In manatelugukathalu.com On 07/08/2025
ప్రేమకోసం - తెలుగు కథ
రచన: పాండ్రంకి సుబ్రమణి
ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
హైద్రాబాదు అడ్మీనిస్ట్రేటివ్ కాలేజీలో వారం రోజుల ట్రైనింగు ప్రోగ్రామ్ కి హాజరయి, రాజమండ్రి స్టేషన్ లో దిగాడు రాజారాం. కంపార్టు మెంటు నుండి దిగి నడుస్తున్నవాడల్లా చప్పున యేదో జ్ఞాపకం వచ్చిన వాడల్లా ఆగిపోయి అలలా సాగు తూన్న జనసందోహం నుండి కాస్తంత యెడంగా తొలగి, సూటుకేసుని క్రిందనుంచి సెల్ ఫోన్ స్క్రీన్ తెరచి కాల్ రిజష్టర్ చూసాడు. మిస్డ్ కాల్స్ యేవీ లేవు.
రాజారాం కనుబొమలు ముడిపడ్డాయి. తను చెప్పే కదా వెళ్ళాడు; ట్రైనింగ్ షెడ్యూల్ ముగించుకుని సోమవారం ఉదయమే ఊరుచేరుకుంటాడని-- అలా ఊరు చేరుకున్నప్పుడు మధుమతి ఫోను మాత్రమే మొదటి కాల్ గా రింగవాలని-- మరులు గొలుపే-- లో హస్కీ వాయిస్ తో స్వాగతం పలకాలని-- మరి మధుమతి యేం చేస్తుంది? మరచిపోయిందా! లేక ముసుగుతన్ని యింకా నిద్రపోతూనే ఉందా?
ఎంతైనా కలవారి బిడ్డ! అసూర్యంపశ్య— పూలనావ వంటి పాన్పుపైన కలలు కంటూ ఉంటుంది. మనసున బెట్టు చేయాలనిపించినా ఉక్రోశాన్ని అణచుకుని ఫోను చేసాడు. రింగవుతూన్న ఫోను కాల్ ని మధుమతి అందుకోవడంలేదు, ఆమె తరపున వాయిస్ రికార్డర్ బదులిచ్చింది, చెప్పవలసిన అంశాన్నిమెసేజింగ్ చేయమని.
రాజారాం అబ్బురపడ్డాడు. వారం రోజుల యొడబాటు తరవాత తన ప్రియసఖినుండి-కాబోయే జీవిత భాగస్వామిని నుండి అటువంటి యాంత్రిక పరమైన స్పందన వస్తుందని అతడు యెదురు చూడలేదు. కాదూ కూడదనుకుంటూనే దారి మధ్యలో మరోమారు ఫోను చేసి చూసాడు. అదే యాంత్రికమైన స్పందన-- ఆపైన ప్రయత్నం ఆపుకున్నాడు. తన ఊహకందని విధంగా ఇంకేదో జరిగుంటుందేమో!
అలా ఆలోచిస్తూ అతడు ఇల్లు చేరుకున్న వెంటనే తన ఆఫీసు పర్సనల్ అసిస్టెంటుకి ఆదేశాలు జారీచేసాడు;తను ఊరు చేరుకున్నాడని ఆఫీసు రావడానికి ఆలస్యమవుతుందని, అర్జంటు విషయాలు గాని ఉంటే తన ఇన్ చార్జీ ఆఫీసరు ముందు ఫైల్సు పెట్టమని. ఇప్పుడతని ముఖాన ప్రసన్నత తగ్గింది. అసహనానికి గుర్తుగా ముఖానికి అడ్డంగా ఒక దీర్ఘమైన చార చోటు చేసుకుంది.
కెరటాల్లా గాలి తెరల్లా పొలోమని తాకుతూన్న ఆలోచనల వలయాల్ని అదుపు చేసుకుంటూ, బైక్ వేగాన్ని అప్పటిక ప్పుడు నియంత్రణలోకి తెచ్చుకుంటూ రోజ్ గార్డెన్ యింటి ముందు ఆపాడు రాజారాం. బండిని ఓ కంట చూసుకోమని వాచ్మెన్ కి సైగ చేసి బంగళా వేపు నడిచాడు రాజారాం. అతణ్ణి వసారాలో చూస్తూనే మధుమతి వదిన మృదుల ఆశ్చర్యంగా చూసి, ఆ తరవాత కళవళ పడుతూ యెదురొచ్చింది. ”మంచి పని చేసావు— నువ్వే వచ్చేసావు. ఇప్పుడిప్పుడే నీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను రాం!“
“అదేమిటి అంత టెన్స్ గా కనిపిస్తున్నారు? ఏమైందేమిటి!”
“చాలానే జరిగింది. మధుమతి కొంచెం అప్ సెట్ అయినట్లుంది“
“కొంచెమే కదా! అంతా చల్లారిపోతుందిలా!“
“నిజం చెప్పాలంటే— కొంచెమంటే కొంచెం కాదు. చాలానే అప్ సెట్ అయింది. నువ్వలా కూర్చో— కాఫీ తెస్తాను“ అంటూ కదిలిందామె.
అతడేమీ అనలేదు. సముద్ర హోరులా గాలి విసురులా మనసు ఓరన ఓ వింత శబ్దం వినిపిస్తూంది. అన్యమనస్కంగా నడవమ్మట నడచి, మేడ పైనుండి చక్రపాణి రాజేశ్వరమ్మ దంపుతులిద్దరూ చూస్తూండగానే మధుమతి గది ముందు నిల్చుని తలుపు తట్టాడు రాజారాం- “మధూ బైటకి రా!”అని.
మధుమతి బయటకు రాలేదు “రాం! నువ్వేరా! ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ !“
అదివిని అతడు తలుపు తోసుకుంటూ వెళ్ళి “నాకోసం నిజంగానే నిరీక్షిస్తున్నావా మధూ!” అంటూ కాళ్ళు ముడుచుక్కూర్చున్న మధుమతికెదురుగా వెళ్ళి చోటు చేసుకుని కూర్చున్నాడు రాజారాం.
అతడి ప్రశ్నకు ఉఁ అని ఊరుకుంది మధుమతి. అప్పుడతను వెంటనే స్పందించలేదు. ముఖంలో ముఖం పెట్టి చూస్తూ అన్నాడు “నేను నమ్మలేకపో యాను నువ్విలా చేస్తావని. నేను ఏ సమయంలో స్టేషన్ లో దిగుతానో తెలిసి కూడా నువ్వు రాలేదు, కనీసం ఫోను కూడా చేయలేదు. మెసేజ్ పంపించలేదు. ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు. ఇంకా చెప్పాలంటే యేదో కారణంతో నన్ను అలజడికి లోను చేయాలనే చేస్తున్నావు. ఔనా!”
“కొంచెం మెల్లగా మాట్లాడు రాం! మన మధ్య యేదో పోట్లాట జరుగుతుందనుకునేరు-- ఔను. నేను చాలా అప్సెట్ అయాను. కొన్ని రోజులుగా నిలకడ కోల్పోయాను, అగ్గికీ సముద్రానికీ మధ్య నిల్చున్నట్లుంది నా పరిస్థితి”
“అలాగా-- మరైతే, నీ పరిస్థితికి కారకుణ్ణి నేనేనా! నిజంగా నీ పరిస్థితికి నేను కారకుణ్ణయితే— ఆమాట ముఖాముఖి చెప్పొచ్చుగా!”
మధుమతి కళ్ళెత్తి చూసింది గాని పెదవి విప్పలేదు.
“బదులివ్వవేం?” గొంతు రెట్టించాడతను.
“ప్లీజ్! సౌండ్ తగ్గించండి. మా యింట్లోవాళ్ళకు చెవుడేమీ లేదు”
“లేదు. దెబ్బతిన్నవాడి శారీరక భాష ఇలానే ఉంటుంది. మీ యింట్లోవాళ్ళందరూ విననియ్యి. బాగా విననియ్యి-- ఐ డాంట్ కేర్!”
“సరే- అలాగే మాట్లాడు. నేను అప్ సెట్ కావడానికి కారణం నువ్వు కాదు”
అతడు కళ్ళు పెద్దవి చేసి చూసాడు- “మరెందుకీ నకారాత్మక వైఖరి! ఫోను చేయలేదు. కనీసం యెస్సెమ్మెస్ కూడా చేయలేదు. అదీ పోనియ్యి. నేను చేసిన ఫోన్ కాల్స్ కూడా అందుకోలేదు. వై?”
“సారీ! గమనించలేదు”
“సారీల మాట అటుంచు గాని, ఇంతకీ యేం జరిగింది? నిన్నెవరైనా యేమైనా అన్నారా! మా యింట్లో వాళ్ళుగాని అవక తవకగా మాట్లాడి నిన్ను నొప్పించారా!“
“----------------”
“అలా మైనపు ముద్దలా ముకుళించుకుపోతే నాకెలా అర్థమవుతుంది మధూ!”
మధుమతి కళ్ళెత్తి చూసింది గాని పెదవి విప్పలేదు. అప్పుడు— మృదుల గదిలోకి ప్రవేశించి యిద్దరికీ కాఫీ కప్పులు అందిచ్చి అంది- “నేను చెప్పేదా మధూ!”
మధుమతి ఆమెను చెప్పనివ్వలేదు.
“వద్దు వదినా! నేనే చెప్తాను. మంచికో చెడుకో విషయాన్ని నేనే సెటిల్ చేసుకుంటాను”
మృదుల అంగీకార సూచకంగా తలూపింది.
“అంటే— మొత్తానికి పెద్దపాటి రగడే జరిగిందన్న మాట!” కాఫీ కప్పు అందుకుని కాఫీ చప్పరిస్తూ అన్నాడు రాజారాం.
ఔను మరి అన్నట్లు అతడి వేపు చూపు సారించి తలూపుతూ వెళ్ళిపోయింది మృదుల.
ఆమె నిష్క్రమణ తరవాత అతను మధుమతికి దగ్గరగా జరిగి “ముందు కాఫీ తాగు. ఏదైనా సరే, యెటువంటిదైనా సరే, మనసు విప్పి మాట్లాడుకుందాం. చర్చించి పరిష్కరించుకుందాం” అని ఆమె చేతిపైన చేతినుంచాడు,
అంతే— ఆ స్పర్శలో యేముందో మరి-ఆమె ద్రవించిన మంచు గడ్డలా కరిగింది. అతడి చేతిని చెంపలకు హత్తుకుంది. “తెలిసో తెలియకో— నేనొక పొరపాటు చేసాను రాం!”
“పొరపాటా! పర్వాలేదు. అదేమిటో చెప్పు. గ్రహిస్తాను”
“నిన్ను ప్రేమించడం !”
అది విని అతడు జెర్కింగుకి లోనయాడు- “మన మనసులు కలసి- కలసి మెలసి చెట్టాపట్టాలేసుకుని తిరిగి రెండేళ్ళవుతుంది. ఇప్పుడా నీకా జ్ఞానోదయం కలిగింది. ? సరే— అలాగే అనుకో— క్షణ క్షణ భంగురముల్- జవరాండ్ర చిత్తముల్. అలా యెందుకనిపించిందో అదైనా చెప్పు మరి--”
“మీకుటుంబానికున్న సామాజిక విద్యావ్యాసంగాల పరిమితుల్ని సరిగ్గా అర్థం చేసుకోకుండానే నిన్ను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నాననిపిస్తూంది”
“ఓ-- అదా! మేం మీ వాళ్ళంత ఆస్తిపరులం కాదనేగా!“
“కాదు. కచ్చితంగా అది కారణం కాదు. సున్నితత్వం, సుకుమారత్వం లేని మీ యింట్లో వాళ్ళ నిశిత వైఖరి గురించి—
“అంటే— అన్నట్టు సూటిగా మధుమతి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసాడు రాజారాం.
“మొన్న అనుకోకుండా ఒక తెలిసిన వాళ్ళింటి పెళ్ళిలో మీ అక్కయ్యను కలుసుకున్నాను. అప్పుడు తెలుసుకున్నాను, మీ యింట్లోవాళ్ళకు ముఖ్యంగా మీ అమ్మగారికి నృత్యకళాకారిణులంటే యే మాత్రమూ సదభిప్రాయం లేదని--"
“ఈసారి మౌనం వహించడం రాజారాం వంతయింది. అంతవరకూ జరిగినదానిని- యిక ముందు జరగబోయే దానిని మనసున విశ్లేషణ చేయనారంభించాడు. మధుమతికి కూచి పూడి నృత్యమంటే ప్రాణ ప్రదం. హృదయాంగతం. ఆ నృత్యాన్ని ఆమె నాలుగేళ్ళ నుండి నేర్చుకుంది. ఇంకా నాట్యకళలోని మెలుకువలు నేర్చుకుంటూనే ఉన్నది- ఆత్మార్పణతో--. మంచి పొడవు. ఆకృతికి అడ్డులేని ఒంపు సొంపులతో విరాజిల్లే అంగసౌష్ఠవం. నిగారింపుతో తొణికిసలాడే యెర్రటి మేని లావణ్యం. ఆమెకు నాట్యమే కాదు— గాత్రమూ ఉంది.
కళారంగంలో మెట్టు మెట్టుగా కళాభిమానుల ఫోకస్ లోకి వస్తూంది. పత్రికల్లో ఆమె డ్యాన్సు ప్రోగ్రాముల గురించి తెలుసుకుని రెండు మూడు ప్రాంతాలనుండి నృత్యోత్సవాలలో పాల్గొనమని ఆహ్వానాలు కూడా అందినవి. డిగ్రీకోర్సు ముగించే తరుణం కాబట్టి అప్పటి కప్పుడు పొరుగూళ్ళకు నృత్య ప్రదర్శనలకు వెళ్ళకూడదని వెనక్కి తగ్గిందామె.
ఐతే— ఇక్కడ వచ్చిన చిక్కల్లా— తన తల్లికి అటువంటి కళా వైభవాలపట్ల- ముఖ్యంగా బహిరంగ ప్రదర్శనల పట్ల సుముఖత ఉండదు. ఆమెది ఒకటే దారి. సూటైన దారి. కళాకారిణులకు నిలువలేని తనం యెక్కువని, అంటీ అంటని జీవన వైఖరితో వివాహ జీవితానికి అతకరని. ఒకవేళ యెప్పు డైనా యెక్కడైనా కొందరు గంతకు తగ్గ బొంతలా సంసార జీవితానికి కుదురినట్టు అగుపించినా; కుటుంబ జీవితాన్ని యెక్కువ కాలం పాటు యెగుడు దిగుళ్ళు లేకుండా సాగించలేరన్నిది ఆమెలో గూడుకట్టుకున్న అనుమానం.
ఆమె అలా అనుకోవడానికి బొత్తిగా ఆధారాలు లేవనడం సబబు కాదు. ఆమె మిక్కిలి అభిమానించే అప్పటి ప్రసిధ్ధ నృత్య కళాకారిణులు యిద్దరు— సినీరంగంలో సహితం ఓ వెలుగు వెలిగిన ఆ నృత్య కళాకారిణులు వివాహం చేసుకున్న రెండు మూడేళ్ళకే వివాహ వ్యవస్థలో యిమడలేక పెడాకులు తీసుకున్న వైనం ఆమెకు బాగా గుర్తు. కళారంగానికి చెందిన స్త్రీలు భావోద్వేగాలకు యిచ్చినంత ప్రాముఖ్యత కుటుంబ జీవితానికివ్వరని ఆమె అనుమానం.
“అదేంవిటి అలా ఊరకుండిపోయారు రాం! ఏమైనా చెప్పు”
ముఖభావం చూపించకుండా “ఏం చెప్పమంటావు?” అని అడిగాడతను.
“అదే రాం- నృత్య కళల పట్ల మీ అమ్మగారికి- అంటే మా కాబోయే అత్తగారికి యే మాత్రమూ సానుకూలత లేదటగా! మీ అక్కయ్య స్కూలు రోజుల్లో భరత నాట్యం నేర్చుకుని, ఇంటర్ చేరేటప్పటికి బాల సరస్వతీదేవి స్థాయికి యెదగ గలదన్న ఖ్యాతి తెచ్చుకుంటూన్న సమయంలో, నడి నెత్తిన గుది బండ వేసినట్టు ‘అవన్నీ వద్దు‘ అని మానిపించేసిందటగా!”
“మా అక్కయ్య క్లాసికల్ డాన్సర్ గా కొంత స్థాయికి వచ్చిన మాట వాస్తవమే! అమ్మ దాని నృత్య వ్యాపకాన్ని ఆపుచేయించిన మాట కూడా వాస్తవమే-- కాని అలా జరగడానికి అసలైన కారణం మరొకటుంది. మా అక్కయ్య నీకు చెప్పి ఉండదేమో!“
మధుమతి కళ్ళెత్తి చూసింది అదేమిటన్నట్టు.
“దానికి పెళ్ళి సంబంధం కుదిరేంత వరకూ అమ్మ దాని నృత్య కళాభిరుచికి ఆటంకం చెప్పలేదు. పెళ్ళి సంబంధం ఖాయమైన తరవాతనే దాని డ్యాన్సు ప్రోగ్రాములకు ఫుల్ స్టాప్ పెట్టించింది. నృత్యకళాకారిణిగా పౌర జీవితంలో వెలుగొందుతూ మెట్టింట్లో కోడలు పిల్లగా సర్దుకుపోవడమన్నది— అమ్మ దృష్టిలో జోడెద్దులపైన చెరొక కాలూ వేసి సవారీ చేయడం వంటిదే!”
“మూడు ముళ్ళూ వేసిన మీ బావగారికి లేని ఆక్షేపణ మీ ఇంట్లో వాళ్లకెందుకంట—”
“అది మా అమ్మనే అడగాలి. ఆ తరవాత ఫుల్ క్లారిఫికేషన్ కోసం మా బావను అడగాలి. ఐతే ఇక్కడ ముఖ్యమైన లిటిగేషన్ ఒకటుంది. మా అక్కయ్య సగం చెప్పి మిగతా సగం మింగేసినట్లుంది. అక్కయ్యను అమ్మ బయట డ్యాన్సు ప్రోగ్రాములకు వెళ్ళకుండా, బావకూ అత్తామామలకూ దూరం కాకుండా నడచుకోమందే గాని..
నృత్యకళకు దూరం కావాలని శాసించలేదు. నృత్యాలయాన్ని నడుపుకోమంది. ఇంకా చెప్పాలంటే అది అమ్మ సలహా ప్రకారం తనింట్లో నృత్యాలయాన్ని నడుపుతుంది కూడా---దానికి మొదట్నించీ సెలెక్టివ్ మిమరీ లాస్. అదలా ఉంచు. కనీసం యిదైనా చెప్పిందా”ఏమిటన్నట్టు ప్రశ్నార్థకంగా చూసిందామె,
“దానికి పెళ్ళి కాకముందు ఇండో నేషియాలో జరిగిన అంతర్జాతీయ కల్చరల్ షోకి అమ్మ అనుమతితో వెళ్ళొచ్చిందని—”
ఇది విని మధుమతి ముఖం అదోలా పెట్టింది. “వాటిస్ దిస్ రాం! ఆడాళ్ళ సున్నిత మనసుల్ని గ్రహించకుండా, మీ అమ్మను అంతలావు వెనకేసుకొస్తున్నావు?”
“లేదు. ఉన్నదున్నట్లు చెప్తున్నాను. అర్థం చేసుకోవడం- చేసుకోకుండా ఉండిపోవడం నీ వంతు”
“ఔనవును. ఎందుకు చెప్పవూ! మీ అక్కయ్య చెప్పిందానిని మక్కికి మక్కీగా ఖరారు చేస్తున్నావుగా!“
“అదేంవిటి ఈ కొత్త పోటు!”
“ఇదేమీ కొత్తపోటు కాదు. మీరెప్పుడూ మీ అమ్మమాటను జవదాటరటగా! న్యూవేవ్ యూనివర్సిటీనుంచి స్కాలర్ షిప్ ఆఫర్ వస్తే అమ్మ వద్దందని వెళ్ళటం మానుకున్నావటగా! వంటగదిలో పూజాగదిలో కాలం గడిపే మీ అమ్మ చెప్పే ప్రతి మాటకూ తలూపడం వల్ల మీ భవిష్యత్తుకి యెంతటి గట్టి దెబ్బ తగిలిందో యెప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకున్నావా!”
“నేనలా అనుకోవడం లేదు మధూ! మా అమ్మ యేది చెప్పినా నా మంచికే చెప్తుంది. ఈ విషయంలో నాకు కొంచెం కూడా రిజర్వేషన్ లేదు. ఆ మాటకు వస్తే అమ్మ మాటను మా యింట్లో యెవరూ జవదాటరు. ఇంట్లో మా అమ్మ స్థానం అటువంటి ది మరి. ఎనీహౌ-- ఇప్పటికి ఈ టాపిక్ చాలిద్దాం.
నువ్విప్పుడు ఆక్రోశంలో ఉన్నట్టున్నావు. ఏం చెప్పినా యెలా చెప్పినా విషయం నీకందక పోవచ్చు. నీకు గాని ఆక్షేపణ లేకపోతే ఇదే విషయాన్ని మరొకసారి నిదానంగా మాట్లాడుకుందాం-” చివరి మాటగా అలా అంటూ లేచి కదలబోయాడు రాజారాం.
అప్పుడామె రివ్వున కదలి సముద్ర తరంగంలా రివ్వున లేచి స్పందించిందామె. ఉన్నపాటున అతడి చేతిని అందిపుచ్చుకుని-- “నేనిప్పుడు ఒప్పుకుంటున్నాను రాం! నేను పూర్తిగా నన్ను నేను శరణాగతురాలిని చేసుకుని ఒప్పుకుంటున్నాను. నేను పూర్తిగా ఓడిపోయాను” అందామె.
అతడు తేరిచూస్తూ అడిగాడు, ఎవరిముందని—
“నీముందు- నీ ప్రేమముందు. పాలముంచినా నీట ముంచినా నీతోనే నాజీవితం-- నాకిప్పుడు తెలిసొచ్చింది, ప్రేమేమిటో ప్రేమించడం అంటే యేమిటో! ప్రేమంటే తనువు కాదు, మనసుని పరిపూర్ణంగా అర్పించు కోవడమేనని--”
“బి క్లియర్ మధూ! నిలకడగా నిల్చుని చెప్పు. నిదానంగా చెప్పు. నువ్వు చెప్పొచ్చేదేమిటి?”
“నువ్వు లేకుండా నేను బ్రతకలేనని- నీవు లేని జీవితం వ్యర్థమని— ఐ ప్రామిస్— నేను మళ్ళీ ఈ విషయం ప్రస్తావించను. ఇప్పుడు రమ్మంటే ఇప్పుడే ఇలాగే నీతో వచ్చేస్తాను“
అతడీసారి బదులివ్వలేదు. స్పందించలేదు. ఒక నిమిషం పాటు అలా నిశ్శబ్దంగా చూస్తూండిపోయాడు. సఖి కళ్ళలోతుల్ని మనోరాగంతో స్పర్శించాడు. ఆమె మళ్ళీ చెప్పనారంభించింది- “నా భావోద్వేగం నీకు విసుగు కలిగించింది కదూ! ఐ యామ్ సారీ- రియల్లీ సారీ!”
మధుమతి మెల్లగా అశ్రురుధ్ధ కంఠంతో అంది. అతడప్పటికీ పెదవి విప్ప లేదు. ఆమెకు మరింత దగ్గరగా జరిగి నుదుట గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. “చివరి మాటగా ఒకటడుగుతాను. చెప్తావా మధూ!”
ఉఁ అని అతణ్ణి పెనవేసుకుంటూ అందామె.
“మన పెళ్ళి తరవాత కూడా నీకు నృత్య ప్రదర్శనలివ్వాలని ఉంది. ఔనా!”
“ఔను. మన కుటుంబ జీవితానికి ఆటంకం రానంత వరకూ— నిన్ను కోల్పోనంతవరకూ-“
“ఇది జరుగుతుంది. నీ యిష్టప్రకారమే జరుగుతుంది. మన పెళ్ళి తరవాత కూడా నీకు ఓపికున్నంత మేర నీ నృత్య కళను పోషిస్తూనే ఉండవచ్చు. దిస్ ఈజ్ మై వార్ట్. నిన్నెవరూ ఆపరు. సరేనా!”
ఆ మాటతో ఆమె ఉలిక్కిపడుతూ తలెత్తి చూసింది. “మరి మా అత్తగారి విషయం? అందరూ చేరి మిమ్మల్ని రాచిరంపాన పెట్టరూ!“
“ఎలా జరిగితే అలా జరగనియ్యి. జీవితంలో యెంత వద్దనుకున్నా యేదో ఒక సందర్భాన యేదో ఒక విషయంలో రిస్క్ తీసుకునే తీరాలిగా! నేను నా ప్రేమకోసం తెగువ చూపిస్తున్నాను. ఐ ప్రామిస్- చివరి వరకూ నేను నీతోనే ఉంటాను. నీ కళాపోషణకు వత్తాసుగా నిలుస్తాను”
ఆమె నమ్మలేనట్టు కళ్ళు విప్పార్చి చూస్తూ కాబోయే భర్తను గుండెలకు హత్తుకుంది.
అప్పుడు హాలునుండి టీ వీ- మధురగీతాలు కార్యక్రమంలో తీయని తెలుగుపాట వినిపిస్తూంది- “మనసే కోవెలగా— మమతల మల్లెలుగా--“
శుభం
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

Commentaires