'Premalayam' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
'ప్రేమాలయం' తెలుగు కథ
రచన : సుదర్శన రావు పోచంపల్లి
ప్రేమకు నిఘంటువులో పర్యాయ పదాలు చాలానే ఉన్నాయి-. అభిమానము అనురాగము బేటం బేటము మమత ఇత్యాదివెన్నో అర్థాలు చోటు చేసుకున్నాయి పదనిధిలో.
ప్రకృతిలో ప్రేమ పాత్రమైనవి కోకొల్లలు. ప్రేమ లేనిది జీవుల మనుగడ అసాధ్యము. కౄరజంతువైన, విష పురుగులైన వాటి సంతును ప్రేమతోనే పెంచుకుంటాయి.
ఇక కథ లోనికి వస్తె సదాగతి- నగనందిని ప్రేమ వివాహము తోనే ఆలు మగలయ్యారు. ప్రేమకు కూడా కొన్ని హద్దులుంటె చూడ ముచ్చ టగా ఉండి మానసికంగా ఉత్సాహ కారక మైతది- అతి ప్రేమ అనర్థదాయకము కూడ. హద్దులు లేని ప్రేమ ఏక ద్రవ్యాభిలాషి ద్వేషి అను చందంగా సుందోప సుందులు తిలోత్తమను కాంక్షించి వారికి వారే తన్నుక చస్తారు- అంటె అమిత ప్రేమ ప్రభావము అటువంటిది.
అందుకే అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. సాధారణంగా ప్రేమ అనే పదాన్ని అమ్మాయిని అబ్బాయో అబ్బాయిని అమ్మాయో గాఢంగా ఇష్టపడితె ప్రేమ అని అన్వయించుకుంటారు. ప్రేమ అనునది పవిత్ర భావము. దానికి కట్టుబడి ఉంటేనే దానికో అర్థము పరమార్థము ఉంటుంది.
సదాగతి కాని నగనందిని కాని ప్రేమకు విలువ ఇచ్చి సంసార శకటాన్ని లాగుచున్నారు. దురదృష్ట వశాన నగనందినికి ఆరోగ్యము చెడితె నిర్లక్ష్యము చేయక ఆమెకు నిరంతర శిశౄష చేయడములో వెనుకకు పోక ఎవరిమీద ఆధారము పడకుండ యాష్టకు తావీయకుండా చూసుకుంటాడు భార్యను.
సదాగతి అనుకునేది ఒకటే - పూలను మొక్కలను పిల్లులను, కుక్కలను, పక్షులనను ఇంకా చెప్పాలంటే మొత్తము ప్రకృతినే ప్రేమించినప్పుడు మనుషులను కూడా ప్రేమ భావముతో చూడాలని- అమ్మను, నాన్నను, తోబుట్టువులను ప్రేమ భావముతో చూస్తేనే అందము అంటాడు. రుణానుబంధ రూపేణ పశు, పక్షి, సుతాలయ అనబడే అనుబంధము కూడా ప్రేమకు మూలమే అంటాడు.
సదాగతికి సంతానము ఇద్దరు- ఒక కొడుకు నీరజారి- కూతురు గోమిని ప్రేమకు విలువ నిచ్చెడు సదాగతికి తన సంతానమంటె ఎంతో అపురూపము.
సదాగతి, నగనందిని, నీరజారి, గోమిని కాక ఆ యింటిలో సదాగతి తండ్రి దేవేశ్ తల్లి కౌశికి మొత్తము ఆరుగురు ఉంటారు- సదాగతి, వాళ్ళ తలిదండ్రులకు ఒక్కడే సంతానము- తలి దండ్రులంటె అమిత భక్తి సదాగతికి- కారణం ప్రేమతో పెరుగడమే. తలిదండ్రులచే ఏమాత్రము దండన అనేది ఎరుగడు సదాగతి.
కొడుకు నీరజారి, కూతురు గోమిని లను కూడా ఏ మాత్రము తిట్టుడు కొట్టుడు బెదిరించుడు లేకుండా పెంచుతుంటాడు సదాగతి.
నగనందిని కూడా భర్త అడుగుజాడలలో నడుస్తూ అత్త మామల పట్ల ప్రేమ చూపుడే కాక, పిల్లలు ఎంత అల్లరి చేసినా ఓర్పుతో మెలుగుడే కాని వాళ్ళను కోపగించుడు కూడ ఎరుగదు.
ఈ ప్రేమ భావము చూసి సదాగతి కొడుకు నీరజారి తమ ఇంటి పైన "ప్రేమాలయము" అని వ్రాస్తాడు. అది చూసి సదాగతి ఒక పద్యము చదువుతాడు.
‘ప్రేమ యన్న నదియు పెరుగును పంచిన
కామ భావ ననగ కాదు ప్రేమ
ధామ మందు ప్రేమ తగ్గక యున్నను
అదియె చూడ ప్రేమ ఆల యంబు’
అంతే కాక ప్రేమ పైన ఒక కవిత వినిపిస్తాడు కొడుకుకు సదాగతి.
‘ప్రేమ అనే పదానికి పెద్ద అర్థ ముందిలే
అది జీవకోటి మనుగడకు చేవ నిచ్చు అమృతం
భవిత యనే బాట నడువ భద్రమైన సాధనం
ప్రేమ యనే పదం లేక పెరుగదే జీవి యైన
ఆ ప్రేమ యనే పదార్థం పెరుగుచుండు పంచుచుండ
ఖగమైనా మృగమైనా కానరాని జీవి యైనా
ప్రేమ మార్గమందె పెరిగి పెద్దదౌట నిజము
సముద్ర మథనంలో సాధించిన సుధకన్న వసుధలోన ప్రేమ మిన్న
అంతరాత్మ తడిమి చూడ అనంతమైన ప్రేమామృతం అందుచుండు అదినిజం
ఆవేష కావేషాల చిచ్చు నార్పు నీ పీయూషం
రాగ ద్వేషాల సొద నెదుగనీయదీ అమృతం
అమ్మ యనే పదము లోనె అమృత ముంది
ఆ అమ్మ ప్రేమ చూరగొన్న జన్మ యెంత ధన్యమో
ప్రేమ పాశం ప్రేరణతో యమ పాశం వెను దిరుగును
సముద్రాలు ఎన్నైనా చాలవింక ప్రేమ నింప
ప్రేమ ఉంటె చాలు లే ఈ వసుధ వైకుంఠ మగునులే
ప్రేమ కన్న మిన్న లేదు తరచి చూడ భువిని దివిని
రుణాను బంధ రూపేణ పశు పక్షి సుతాలయ
ఇది ప్రేమ లోని భావాలకు పవిత్రార్థం
జీవ కోటి మనుగడ సౌధానికి ప్రథమ ద్వారం
ప్రేమ లేక జీవి లేదు జీవి లేక లేదు జగము’.
ప్రకృతిలో అందాన్నే కాక అనాకారిని, అవిటి వారిని, తృతీయా ప్రకృతిపరులను, పేదలను, దీనులను మున్నగు అశక్తులను కూడా ప్రేమించ గలుగాలి. ప్రేమ అనేది ఇచ్చి పుచ్చుకునేది.
బంగారాన్ని ప్రేమించినట్టే ఇనుమునూ ప్రేమించ గలుగాలి- బంగారము ఆభరణాలకే అక్కరొస్తె ఇనుము మానవులకు బంగారానికన్న ఎన్నో రెట్లు అక్కరొస్తది.
ఉదాహరణకు- ఇంటిలో పరికరాలే కాక వ్యవసాయ పనిముట్లు అట్లనే ప్రయాణానికి బండి చక్రముపట్టా- బస్సులు, కార్లు, రైళ్ళు ఇనుము లేనిది అనుకూలించవు అని కొడుకు నీరజారి, కూతురు గోమినికి తెలుపుతాడు సదాగతి. భార్య నగనందిని మంచము లోనే పడుకొని ఉంటది మూలుగుతూ.
మన తలిదండ్రిని, పశు పక్షాదులను స్నేహితులను ప్రకృతిని ప్రేమించినట్టే మనము పుట్టిన దేశాన్ని, మనము ఆరంభమునుండి అమ్మ చెప్పిన మాతృభాషనూ ప్రేమించాలి.
అట్లనే అన్నింటికన్న గొప్పది మట్టి- మట్టి నుండే మనము తినే తిండి కట్టే బట్ట, ప్రయాణ సాధనాలు చెబుతూ పోతె సమస్తము, పూలు పండ్లు అత్తరు, పన్నీరు సకలము ఈ మట్టినుండే ఉద్భవిస్తాయి కావున మట్టిని కూడా ప్రేమించాలి అని కొడుకుకు, కూతురుకు వివరంగా చెబుతాడు సదాగతి ప్రేమ విలువ తెలియ జేస్తు.
ఆమ్మ నాన్న పట్ల అటులనె గురువులు
తోడ బుట్టు లందు తోటి జీవి
పుట్టి నట్టి మట్టి పురమందు భాషందు
ప్రేమ జూపు చుండు పేర్మి తోడ
ప్రేమ ఉన్న చోట పెద్దగ దోషాలు
కాన రావు జూడ కర్వ రందు
మంచి లక్ష ణాలె మనుచుందు జూడగ
ఎలమి భావ మెపుడు ఎరుగ నుండ
కిరణ మాలి జూడ కిరణాల మైత్రితొ
కాంతి బెంచు చుండు కాంచ నుండ
కిరణ మనగ లేక కించిత్తు వెలుగేను
కాన ప్రేమె తగును కపిలు కైన
స్నేహము అధిక మయితె ప్రేమ పుట్టుకొస్తుంది. అందుకే స్నేహానికి ప్రేమకు అనుబంధ మేర్పడింది.
ఇంకొకటి ప్రేమ భావము బలపడితె మనకు సంబంధము లేని మనిషైనా పక్షైనా జంతువైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు ఆదుకునే మనస్తత్వము అలవడు తుంది- దానితో సంఘములో గౌరవము, మర్యాద ఏర్పడుతుంది.
“మొదటి పాఠంగా మీరు మీ అమ్మను, నానమ్మను, తాతను ప్రేమించండి- మీకు చేతనైన పనులలో వారికి ఏ లోటు రాకుండ చూడండి” అంటాడు సదాగతి కొడుకు నీరజారి, కూతురు గోమినిలతో.
సదాగతి తలిదండ్రులు దేవేశ్, కౌశికి చూస్తుంటారు తన కొడుకు సదాగతి అతని సంతానము నీరజారి, గోమినికి ఎంత బాగా బుద్ధి నేర్పుకుంటున్నాడో అని సంతోషముతో ఉప్పొంగి పోతారు- పిల్లలు అభివృద్ధికి వచ్చుడే గాక కుటుంబ గౌరవము ఇనుమడిస్తది అనుకుంటారు.
అటు బయటి పనులు, ఇటు ఇంటి పనులు, పిల్లలకు బడి పాఠాలు, నీతి బోధ చెయుచున్నా తన భార్య నగనందినికి సేవ చేయుటలో లవలేశము. తాత్సారము చూపడు. అదే ప్రేమకు తార్కాణము. కొడుకు నీరజారి ఇంటి మీద వ్రాసిన "ప్రేమాలయము" ఫలకాన్నీ మరీ మరీ చూసుకుంటూ మురిసి పోతాడు సదాగతి.
సమాప్తం
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Commentaires