top of page
Writer's pictureKaranam Lakshmi Sailaja

పునర్జన్మ


'Punarjanma' New Telugu Story


Written By K. Lakshmi Sailaja



ఆ రోజు ఆదివారం. ఉదయం అమ్మ, నాన్న లతో కలిసి కాఫీ తాగుతూన్నప్పుడు సునయన ఇలా అంది. "అమ్మా, నేను కళ్ళు, ఇంకా ఒక ఐదు అవయవాలు దానం చేయడానికి ‘ఆర్గాన్ డోనర్ కార్డు’ తీసుకుందామనుకుంటున్నాను" అంది.


"అంటే" అన్నది అయోమయంగా వాళ్ళమ్మ.


"అంటే, నేను నా మరణానంతరం నా కళ్ళు, ఇంకా ఏ అవయవాలు ఇతరులకు దానం ఇవ్వవచ్చో అవి దానం ఇస్తాను, అని హాస్పిటల్ వాళ్లకు వ్రాసి ఇవ్వడమన్న మాట. " అంది సునయన.


"అయ్యో, అయ్యో, అవేమి మాటలే?" రమ గట్టిగా అన్నది.


"ఏమిటమ్మా" ఆందోళన గా అన్నాడు, వాళ్ళ నాన్న చలపతి.

"నాన్నా, నిన్న మా స్నేహితురాళ్ళమందరం కలిసి ‘బ్లైండ్ చిల్డ్రన్ హోం’ కు వెళ్ళాము. అక్కడ కళ్ళు లేని పిల్లలను చూశాము. వాళ్ళనలా చూస్తుంటే ఎంతో బాధనిపించింది నాన్నా. మన ఊర్లోనే ఇంత మందికి కళ్ళు లేకుంటే ఇంక మిగతా ఊర్లల్లో ఎంత మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారో కదా! మనం చనిపోయిన తరువాత మన కళ్ళు దానం చేస్తే ఇద్దరి జీవితాలు ప్రపంచాన్ని చూస్తాయి. మనం చనిపోయి మళ్ళీ పుట్టిన వాళ్ళ మవుతామమ్మా!" అంది వాళ్ళ నాన్నకు, అమ్మకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ. చలపతి కూడా అవయవదానం విషయం విని వున్నాడు కనుక ఆందోళన పడకుండా ఆలోచిస్తున్నాడు. కానీ అప్పట్నుంచి వాళ్ళమ్మ.. అవయవ దానమంటే ఏదో విపరీతమన్నట్లుగా బాధ పడ్తోంది.

"ఎందుకమ్మా అలా, కన్నీళ్లు పెట్టుకొంటావు?" అన్నది సునయన నిస్సహాయంగా వాళ్ళమ్మ రమను చూస్తూ. "ఒక్కగానొక్క నలుసువి. ఎన్నో పూజలు చేసి కన్నాను నిన్ను. నువ్విలాంటి అశుభం మాటలు మాట్లాడితే కళ్ళనీళ్ళు పెట్టుకోక ఏం చేయను?" అంటూ కళ్ళు తుడుచుకుందామె. అది చూసి, సునయన వాళ్ళ నాన్న కూడా "అదికాదమ్మా, అసామాన్యమైన పనులు మనకెందుకు చెప్పు?" అన్నాడు, అనునయం గా.

"అదేంలేదు నాన్నా, మనం తలచుకుంటే ఇదేమంత కష్టమైన పనేమీ కాదు. ఎంతో అవసరమైన పని. మన జీవితానికి మరో జన్మనిస్తుంది. మనం పోతూ.. పోతూ.. ఒక మంచి పనిని చేసిన వాళ్ళమవుతాము. అయినా అది ఎప్పటి సంగతో కదా, ఇప్పుడు 'డిక్లరేషన్' కదా ఇస్తున్నది. దానికెందుకింత భయం? " అంటూ.. "మన కెటువంటి ఇబ్బంది ఉండదు. మనం చేస్తున్న ఈ పని వల్ల కొంత మంది జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళమవుతాము. అలాంటి మంచి పని చేసి, మనం భగవంతుని అనుగ్రహం కూడా పొందుతాముకదా. మనం జీవితం లో మంచి పనులు చేస్తామో లేదో తెలియదు, తెలిసి చేస్తున్న మంచి పనిని కూడా అడ్డుకుంటున్నారు మీరు, " సునయన కొంచెం నిరాశగా అన్నది.

సునయన పి. జి. చదువుతోంది. సమాజం లో ఎక్కడైనా, ఎవరికైనా అన్యాయం జరిగిందని తనకు తెలిస్తే ఆందోళన పడ్తూ ఉంటుంది. తను చేయగలిగిన సహాయాన్ని, తన పరిధి లో చేస్తూ ఉంటుంది. తను చెయ్యడమే కాకుండా, తన చుట్టూ ఉన్న వాళ్ళతో చేయిస్తూ ఉంటుంది కూడా. హొమ్స్ కు తనవే కాకుండా, తన ఫ్రెండ్స్ వి కూడా బట్టలు, బుక్స్, ఇంట్లో వాడని దుప్పట్లు, లాంటివి సేకరించి ఇస్తూ వుంటుంది. పుట్టినరోజున అక్కడికి వెళ్లి పండ్లు స్వీట్స్ పంచుతుంది.


అప్పుడే చలపతి ఫ్రెండ్ కృష్ణారావు వచ్చాడు. వస్తూనే విషయం విని అతను కూడా అమ్మాయినే సమర్ధించాడు. "ఇందులో బాధ పడేదేమీ లేదమ్మా. అమ్మాయికి మంచి ఆలోచన వచ్చినందుకు అభినందించాలి. ఇంకా, ఇన్ని రోజులు మనమెందుకు ఈ విషయం గురించి ఆలోచించలేదా అని కూడా మనలను మనం విమర్శనాత్మకంగా గమనించుకోవాలి" అన్నాడు.


"నిజమేనమ్మా. కళ్ళు లేని పిల్లలు లోకాన్ని చూడలేరు. ఎంతో కష్టపడి చదువుకోవలసి వస్తుంది. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అన్నారు పెద్దలు. ఆ కళ్ళు లేని జీవితం మనకేలాగుంటుందో ఊహించలేము” అన్నాడు చలపతి.


"నిన్న సాయంత్రం డాక్టర్ కరుణాకరం అంకుల్ ను హాస్పిటల్ కెళ్ళి కలిశాము. అప్పుడు అంకుల్ ఈ అవయవ దానం గురించి చెప్పారు నాన్నా. రాత్రి మీరు ఆఫీస్ నుంచి లేట్ గా రావడం వల్ల మీతో ఈ విషయం మాట్లాడలేక పొయ్యాను. అంతే కాకుండా మనం బ్రతికున్నప్పుడు కూడా కొన్ని అవయవాలు దానం చెయ్యొచ్చట అంకుల్. కొంత చిన్నప్రేగు, కొంత క్లోమం, కొంత లివర్ కూడా ఇవ్వొచ్చట. లివర్ మళ్ళీ పెరుగుతుందట కూడా. ఇలా ఇవ్వడం వలన మన కేమీ ఇబ్బంది వుండదట. మనం రక్త దానం చేస్తే, మన రక్తం మళ్ళీ రెండ్రోజుల్లో మనకు వస్తుంది కదా నాన్నా. అలాగే నన్నమాట. నేను నా ఫ్రెండ్స్ తో కూడా అవయవదానం చేయించడానికి ఆర్గాన్ డోనర్ కార్డు తీయిన్చాలనుకుంటున్నాను" అన్నది సునయన.

సునయన ఇప్పటికే రెండుసార్లు రెడ్ క్రాస్ వారి బ్లడ్ బ్యాంకులో రక్తం దానమిచ్చింది. చలపతి కూడా ఇంతకు ముందొక నాలుగుసార్లు రక్త దానమిచ్చాడు. షుగర్ వ్యాది వచ్చిన తరువాత రక్తం ఇవ్వకూడదన్నారు.

"నిజమేనమ్మా, ఈమధ్య అవయవ దానం గురించి టి. వి. లో, పేపర్ లల్లో నేను కూడా విన్నాను. " అన్నాడు, వాళ్ళ నాన్న.


"కానీ, నాన్నా, ఆసుపత్రుల్లో రోగి సహజ మరణం జరిగినప్పుడు నాలుగు నుండి ఆరు గంటల వరకు కళ్ళు తీసుకోవచ్చట. రోగి మరణించినప్పుడు వారి బంధువులకు డాక్టర్స్.. కళ్ళు దానం చేయమని చెప్పడం కూడా సరిగా జరగడంలేదట. నిన్న కరుణాకరం అంకుల్ చెప్పారు. అసలలా జరిగితే మన ఊర్లో కళ్ళు లేని వారికి …. మన ఊర్లో చనిపోయిన వారు దానం చేసే కళ్ళేసరిపోతాయట. అప్పుడు చూపు లేని వారంటూ ఉండరట" అంది సంతోషంగా సునయన.

ఇంతలో కృష్ణారావు ఇలాగన్నాడు. "సహజ మరణంతో చనిపోయిన వాళ్ళు కళ్ళు మాత్రమే ఇవ్వగలరట. రక్తప్రసరణ ఆగిపోకుండా అర్జెంటు గా తియ్యగలిగితేనే కిడ్నీలలాంటివి తీసి వేరేవాళ్ళకు ఇవ్వవచ్చునట. ముందుగా బంధువుల అనుమతి తీసుకున్నా కూడా... ఇది అంత సులువు కాదట. కానీ మన బంధువులకు మనం బ్రతికుండగానే మన కున్న రెండు కిడ్నీలల్లోనుంచి ఒక కిడ్నీ ఇవ్వవచ్చునట. ఒక్కొక్క కిడ్నీతో ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారట. "

"అవునట అంకుల్. 1994 లో అవయవ దానం ‘చట్ట సమ్మతం’ చేశారట. మళ్ళీ రెండు సవరణలు కూడా జరిగాయట. బంధువులకైతే ఎవరి అనుమతీ లేకుండానే మనం అవయవాలు ఇవ్వవచ్చునట గానీ, ఎవరికైనా తెలిసిన వాళ్ళకిస్తామంటే మాత్రం ప్రభుత్వ అనుమతి కావాలట, డాక్టర్ గారు నిన్న చెప్పారు, " అంది సునయన.

"అలాగైతే సరేలే గానీ ఇలా కళ్ళిచ్చేస్తాను, కాళ్ళిచ్చేస్తాను… అంటే నాకు కంగారేసింది. ఇలా అవసరమైన వాళ్ళకు, మనకు అవసరం లేనివి, లేదా మనుకు ఉపయోగపడనివీ, ఇచ్చి, వాళ్ళకు మంచి జరుగుతుంటే మనక్కూడా సంతోషమేగా" అంది రమ. అప్పటికి ఆమె తన మనసుకు సర్ది చెప్పుకుంది.

"అవునమ్మా, ఏమతంలో నైనా భగవంతుడు ఇతరులకు సహాయం చెయ్యమని చెప్తాడు గదా. మనం చేసేది మంచి పని అయినా... ఈ 'అవయవ దానం' బ్రతికుండగా గానీ, లేదా మరణానంతరం గానీ చేసినందువలన మనలను భగవంతుడు దీవిస్తాడు కూడా కదమ్మా.


ఈ అవయవదానానికి దేవుడు విరోధి కాదమ్మా. మన వాళ్ళల్లో చాలా మందికి ప్రకృతి విరుద్ధం కదా అనే మూఢ నమ్మకం కూడా వుంటుంది ఎటువంటి సందేహం వద్దు" అన్నాడు కృష్ణా రావు.

"నిజమేలే" అన్నది తన ఆలోచన పొరపాటని వప్పుకుంటూ రమ. "ఆ.. ఆమధ్య శాంతమ్మ కు కిడ్నీ చెడిపోతే.. వాళ్ళమ్మ ఒక కిడ్నీని ఇచ్చింది కదా, " అని కూడా అన్నది.

" అమ్మయ్య నీ అభ్యంతరం తొలగిపోయింది. " అన్నది సంతోషంగా సునయన.

"అవును గానీ నయనా, ఈ విషయాన్ని మనం మనకు తెలిసిన వాళ్ళకు చెప్తే బాగుంటుంది కదా" అన్నాడు చలపతి.


"అవును నాన్నా. మేము ఒక పదిమందిమి నిన్న హోంకెళ్ళి నప్పుడు నాకీ ఆలోచన వచ్చింది. ఇంకో పది మందికి ఈ విషయం చెప్తే వాళ్ళ కు కూడా మన ఆలోచన నచ్చవచ్చు కదా" అన్నది సునయన.


"చాలా మంచి ఆలోచన తల్లీ. నాకు తెలిసిన నలుగురు ఫ్రెండ్స్ ను నేను ఈరోజు సాయంత్రం మీ ఇంటికి తీసుకొస్తాను. విషయాలన్నీ వాళ్ళకు కూడా చెప్దాము" అని కృష్ణారావు ఇంటికి బయలుదేరాడు. కృష్ణారావు ఇంటికి వెళ్ళిన తరువాత చలపతి, రమ, సునయన కొద్ది సేపు అవయవ దానం ఇవ్వడం, తీసుకోవడం గురించి తమకు తెలిసిన విషయాలు మాట్లాడుకున్నారు.


సాయంత్రం వాళ్ళ మండువా లోగిలిలోనే ఇంట్లో నుంచి కుర్చీలు తెచ్చి వాకిట్లో వేశారు. రెండు మంచాలు వాల్చారు. వాకిట్లో ఉన్న మల్లె, గన్నేరు, పారిజాతం చెట్లకు అప్పుడే నీళ్ళు పట్టి ఉన్నందున... ఆ చెట్ల నుంచి మంచి పరిమళం వస్తున్నది. డాక్టర్ కరుణాకరాన్ని కూడా రమ్మని సునయన రిక్వెస్ట్ చేసింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినందున కొంచెం లేట్ గానయినా వస్తానని చెప్పారు డాక్టర్ గారు. సునయన ఫ్రెండ్స్ ఒక ఐదుగురు, చలపతి ఫ్రెండ్స్ ఒక నలుగురు, రమకు తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరు వచ్చారు. రెండు చాపలు కూడా వేసి ఉంచింది రమ. అందరికీ మంచినీళ్ళు ఇచ్చి, టీ కూడా రెడీ చేసింది సునయన.

"ఏమే అమ్మాయ్, నువ్వేదో మంచి విషయం చెప్తావని మీ అమ్మ చెప్పింది. మొదలు పెట్టు మరీ” అంది వెనుకింటి సావిత్రి.

అందుకు సునయన ఉదయం తమ నలుగురికి మధ్య జరిగిన విషయాన్ని గూర్చి వివరంగా చెప్పింది


అప్పుడు చలపతి ఫ్రెండ్ ఒకరు ఇలా చెప్పుకొచ్చారు.

"అవయవ దానమనేది జీవితానికొక సార్ధకత కూడా. ఆ రూపంగానైనా మనం 'చిరంజీవి'గా ఉండొచ్చు. ఎన్నో అవయవాలు..... ఎముకమజ్జ మార్పిడి వరకు రోగాలను నియంత్రించి, రోగనిరోధక శక్తిని పెంచేందుకు తోడ్పడటం అవయవ దానం వలన జరుగుతున్నప్పుడు, ప్రతి ఒక్కరు బ్రతికున్నప్పుడు దానం చెయ్యగలిగినవి చేస్తూ, మరణం తరువాత కూడా చెయ్యగలిగినన్ని చేస్తానని ప్రమాణం చెయ్యాలి. ఏటా రెండు లక్షల మంది... సమయానికి అవయవ దానం చేసే వాళ్ళు లేక చనిపోతున్నారట. 'మన అవయవాలతో ఇంకొకరు జీవనం సాగిస్తారు' అని అనుకోగానే మనకు ఎంత అద్భుతంగా అనిపిస్తుందో చూడండి. "

సునయన లేచి, "అవునంకుల్ నేను రేపు హాస్పిటల్ దగ్గరకు వెళ్ళి, నా మరణానంతరం నా అవయవాలు ఏవి ఉపయోగపడ్తే అవి దానం చేస్తాననే 'ఆర్గాన్ డోనర్ కార్డు' తీసుకోవాలనుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ కూడా అదే పని చేస్తారు" అంది.

వెంటనే నయన ఫ్రెండ్ ఒకమ్మాయి లేచి "అవునండీ. నేను కూడా సునయన లాగే 'ఆర్గాన్ డోనర్ కార్డు' తీసుకోవడానికి ఈరోజు మాఇంట్లో పర్మిషన్ తీసుకున్నాను. అవయవాలను దానమివ్వడంవలన 'మానవత్వం పరిమళి స్తుంద'ని మా అమ్మా, నాన్నా కూడా అన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పుట్టినరోజున ఆర్గాన్ డోనర్ కార్డు తీసుకుంటామని చెప్పారు" అన్నది.

కృష్ణారావు తో వచ్చినతను ఇలా చెప్పాడు. "అవును. నిజం. కానీ ప్రజలకు ఈ విషయంలో ఎక్కువ అవగాహన లేదు.


ప్రభుత్వం వారు ఈవిషయంలో 'జీవన్ దాన్' ద్వార అవయవ సేకరణ చేసి, అవసరమైన వారికి ఆ అవయవాలను అమరుస్తున్నారు. ఇలా అవయవ దానానికి 'లైసెన్సు' రావటం వలన కిడ్నీల లాంటి అవయవాలను దొంగతనంగా అమ్మడమనే వ్యాపారాన్ని ఆపగలిగారు. అందువల్ల అవయవ దానం చేసేవాళ్ళు 'మరణానంతర జననం’ కలిగిన వాళ్ళవుతారు. "

సునయన వాళ్ళమ్మతో "అమ్మా, నువ్వు కూడా' ఆర్గాన్ డోనర్ కార్డు' తీసుకుంటున్నావుగా?" అంది.


"తప్పకుండా, తల్లీ" అంది వాళ్ళమ్మ రమ.


“నేను, మీఅమ్మ ఇద్దరమూ, పదిరోజుల తరువాత వస్తున్న మాపెళ్లిరోజు ఆర్గాన్ డోనార్ కార్డు తీసుకుంటాము తల్లీ” అన్నాడు చలపతి.


సునయన “అమ్మయ్య. మొదట నా ఇంట్లో వాళ్ళ చేత ఆర్గాన్ డోనార్ కార్డు తీయిన్చలేకుంటే ‘అవయవదానం చేయండి’ అని చెప్పే నా మాటలు ఎవరూ వినరని నాకూ అనిపించింది నాన్నా, మీకు నా కృతజ్ఞతలు. ” అంది సంతోషంగా.

నీలమ్మ ఆంటీ "నిజంగా ఇది చాలా మంచి పనే అమ్మాయ్. ప్రతి ఒక్కరూ కూడా ఆ 'ఆర్గాన్ డోనర్ కార్డు ' తీసుకోవాలి. అందరూ కూడా మన మరణం తరువాత కనీసం కళ్ళను ఇచ్చేస్తామని చెప్పాలి. తప్పకుండా మా ఇంట్లో వాళ్ళమంతా కూడా ఆ పని చేస్తాం. దానిక్కావలసిన ఏర్పాట్లేవో చూడు. నా కళ్ళతో నా తరువాత... ఇద్దరు చూస్తారు. ఇంత కంటే పుణ్యం ఇంకేముంటుంది. ? అందరం దానకర్ణుల మవుదాము. " అన్నది.


చలపతి స్నేహితుడు శ్రీ కృష్ణ ఇలా చెప్పాడు. "మనం మంచి మనిషిగా బ్రతుకుతామో లేదో తెలియదు. చనిపోయిన తరువాత మంచి మనిషిగా మిగుల్తాను కదా, అని అనుకుంటే నా గుండె సంతోషంతో ఉప్పొంగి పోతోంది. మనం రోజూ ఎన్నో ఆక్సిడెంట్లు వింటూ ఉంటాము. చూస్తూ ఉంటాము. వారందరికీ ఎంతో రక్తం అవసరమవుతుంది. కొంత మంది కొనలేరు కదా. మనం రక్తం ఇవ్వడం వలన మనకూ మంచిదే, కొత్త రక్తం వస్తుంది. మనకు ఇబ్బంది లేదు. అందుకని అందరూ కనీసం రక్తదానం చేయండి.


తోటి వారి ప్రాణాలు కాపాడండి. మన రక్తం లో 'హిమోగ్లోబిన్' శాతం చూసే, వాళ్ళు రక్తం తీస్తారు. అందువల్లమనకేం కష్టం రాదు. ఇక మనం అవయవ దానం చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని కుటుంబ సభ్యులందరికీ చెప్పండి. వారి ఆమోదం అవసరం. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి, ఆక్సిడెంట్ లేదా ‘బ్రెయిన్ డెడ్’ అయ్యి చనిపోతే మన అవయవాలు పదిమందికి ఇవ్వవచ్చునట. మన అవయవాలు అవతలి వారికి సరిపోతాయో లేదో నని డాక్టర్లు రక్త పరీక్ష చేసి చూస్తారట. మన బంధువులకు మన డోనర్ కార్డ్ సంగతి తెలిసి వుంటే వాళ్ళు వెంటనే స్పందించి మన అవయవదానానికి డాక్టర్స్ కు సహకరించగలరు. అవయవదానం మహాదానం అని మనం తెలుసుకోవాలి. "


“అవయవ దానం చెయ్యాలనుకున్న వాళ్ళు కనీసం పద్దెనిమిది సంవత్సారాల వయసు ఉండాలట. ” సునయన ఫ్రెండ్ మానస అన్నది.


ఇంతలో డాక్టర్ కరుణాకరం వచ్చారు. అందరూ డాక్టర్ గారి మాటలు వినడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. 'టీ' తాగి డాక్టర్ గారు ఇలా చెప్పారు.


"మనకున్న అవయవాలు వయసురీత్యానూ, వ్యాధుల బారిన పడినప్పుడూ క్షీణిస్తూ ఉంటాయి. వాటిని ట్రాన్స్ ప్లాంటేషన్ ద్వార అంటే క్షీణించిన అవయవం స్థానం లో కొత్త అవయవాన్ని అమర్చడం ద్వారా మళ్ళీ పని చేయించవచ్చు. అవయవాలను ఎప్పుడు, ఎక్కడ, ఎలా దానం చేయాలి అన్న విషయాలను తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలను ప్రజలకు చెప్పడానికి ప్రభుత్వం వాళ్ళు ఎంతో ప్రచారం చేయవలసి వుంది.


అవయవ దానం చేస్తామన్న విషయం రోగి చెప్పలేకుంటే కుటుంబ సభ్యులు డాక్టర్స్ కు ముందుగా తెలియజేయాలి. అవయవ దానంలో ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. మనం బ్రతికుండగానే అయిదు లేక ఆరు అవయవాలను అంటే, కొన్నిఅవయవాలు పూర్తిగా, అనగా మూత్రపిండం లాంటివి... కొన్నిఅవయవాలు ముక్కలుగా, అంటే కాలేయము, ఊపిరితిత్తులు, క్లోమము, చిన్నప్రేగు లాంటివి ఇవ్వవచ్చును. అందువల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. ఇవన్నీ మీరు ఎంతో కొంత తెలుసుకొని వుంటారు. మీకు పూర్తి గా అవగాహన లేని ఒక విషయం చెబుతాను. "

అంటూండగా అదే వీధిలో వున్న రమేష్ అనే పత్రికా విలేఖరి వచ్చాడు. 'సర్, నేను పాల్గొనవచ్చా' అంటూ. అతను వీళ్ళకు తెలిసిన వాడే.


“రండి. మీ పేపర్లో విషయాలు నలుగురూ చదువుతారు కనుక ఇక్కడ ఇలా అందరూ మాట్లాడుకోవడం తప్పు కాదనీ, అందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలనీ, ప్రభుత్వం కూడా అందరికీ తెలపాలనీ వ్రాయండి'' అన్నారు డాక్టర్ గారు,

చలపతి, ఇంకా వచ్చిన వాళ్ళు.


“నేను కూడా పాజిటివ్ గానే వ్రాస్తాను సర్” అన్నాడతను. సునయన ఇంట్లోనుండి ఇంకో రెండు స్టూల్స్ తెచ్చి వేసింది. ఇక్కడ వీళ్ళు ఇలామాట్లాడుకోవడం విని పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అంతా కాంపౌండ్ వాల్ పక్కన కొందరు, వీధిలో కొందరు చేరి... వింటున్నారు.

డాక్టర్ గారు మళ్ళీ మొదలు పెట్టారు. "ఈ మధ్య చనిపోయిన వారి గుండెను ఒక వూరి నుంచి, ఇంకొక ఊర్లో వారికి, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వచ్చి అమర్చడం చదివేవుంటారు, చూసే వుంటారు. దినపత్రికలు, టి. వి. లు ప్రభుత్వం వారు, పోలీస్ వారు, వైద్యులు... అందరూ సహకరించడం వల్ల అలా చేయగలుగుతున్నారు. బ్రతికి వున్న వారి గుండెను తియ్యలేము కదా. అందువల్ల 'బ్రెయిన్ డెడ్' అయిన వారి అవయవాలను, కుటుంబ సభ్యుల అనుమతితో వేరే వారికి అమర్చవచ్చు. ఇందుకు ప్రభుత్వానుమతి ఉంది.


ఎందుకంటే 'బ్రెయిన్ డెడ్' అయిన వ్యక్తులు ఇంక ఎన్ని రోజులు బ్రతికి ఉన్నా సామాన్య జీవితం గడపలేరు. శరీరం అంతా బాగుండి మెదడు చనిపోయిన వాళ్ళన్న మాట. వీళ్ళు జీవించినా మరణించినట్లే. వారిని 'చనిపోవడం' చేయడం వల్ల వారికి మనం మంచి చేసిన వాళ్ళమే అవుతాము. శారీరక కష్టాన్ని తప్పించిన వాళ్ళమవుతాము. అందువల్ల వారి అవయవాలను వేరేవారికి అమర్చే మహత్కార్యం చేయడానికి భగవంతుడే వారికి ఆదారి చూపించాడు.


ఇంతటి అత్యుత్తమదానం చేయగలగడం వారి అదృష్టం. వారి కుటుంబ సభ్యులు బాధను దిగమింగి అలాంటి సమయం లో అవయవదానానికి అనుమతించాలి… ఎటువంటి మూఢ నమ్మకాలు వద్దు. ఏ మతాలు కూడా ఇందుకు వ్యతిరేకం కాదు. ప్రభుత్వం వారు ‘రక్తదాన దినోత్సవం’ గా జూన్ పద్నాలుగవ తేదీని, 'ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే' గా ఆగస్ట్ పదమూడవ తేదిని ప్రకటించారు కూడా. అందుకే మనమందరం కూడా అవయవ దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి" అని చెప్పారు.

తరువాత రంగారావు గారు ఇలా అన్నారు. "ఈ మధ్య సినిమా నటీ నటులు కూడా ఈ కార్యక్రమం లో పాలు పంచుకుంటూ... అవయవ దానానికి డిక్లరేషన్ ఇస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ అవయవ దానం గురించి ఇంకా పదిమందికి చెప్పండి. ఒక ఉద్యమంగా ఇది సాగాలి. ఇంకా మా లయన్స్ క్లబ్ ద్వారా అవగాహన కార్యకమాలు ఏర్పాటు చేయించడానికి, వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయిన్చడానికి ప్రయత్నిస్తాను".

ఆ మాటలకు అందరూ చప్పట్లు కొట్టారు. ఈ మాత్రం కదలిక కొందరిలో నైనా వస్తున్నందుకు అటు డాక్టర్ గారు, ఇటు సునయన సంతోషపడ్డారు.


సమావేశం ముగిసేటప్పటికి అందరూ ఈ విషయం లో వారు విన్న విషయాలను, చదివిన విషయాలను అందరితో చర్చించుకుంటున్నారు. పత్రికా విలేఖరి రమేష్ డాక్టర్ గారి దగ్గరికి వచ్చి కొన్ని సందేహాలను అడిగి తీర్చుకుంటున్నాడు. సునయన డాక్టర్ గారికి, ఇంకా వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పింది. వచ్చిన వాళ్ళందరూ డాక్టర్ గారితో రేపే 'ఆర్గాన్ డోనర్ కార్డు' తీసుకుంటామని చెప్పి, ఇంకా తమకు తెలిసిన వాళ్లకు కూడా చెప్తామని చెప్పి వెళ్ళారు.

ఉదయాన్నే ఒక మంచి పని చేయ బోతున్నాననే ఉత్సాహంతోనూ, ఇంకా పదిమందితో చేయించగలుగుతున్నాననే సంతోషంతోనూ, సునయన హాయిగా నిద్ర పోయిందా రాత్రి.

ఉదయం లేచి పేపర్ చూడగానే ఆ సంతోషం రెట్టిపయ్యింది సునయనకు. రాత్రి జరిగిన సమావేశా న్ని గురించి విలేఖరి రమేష్ చక్కగా వ్రాశాడు. ఒక ఇంట్లో జరిగిన సమావేశంగా రమేష్, అవయవదాన ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రభుత్వం వారు బాగా ప్రాచుర్యం లోనికి తేవాలని, ప్రభుత్వం వారు 2014 లో ఏర్పాటు చేసిన 'జీవన్ దాన్' ను ఇంకా సమర్ధ వంతంగా పని చేసేట్టు చూడాలని, ప్రజల్లో ఇంకా అవగాహన కలిగించాలనీ వ్రాశాడు.


ఆరోజు సాయంత్రం ప్రాంతీయ ఛానల్ లో ఏం. ఎల్. ఎ. గారు అవయవ దాన ప్రాముఖ్యతను గురించి అసెంబ్లీ లో చర్చకు తీసుకు వస్తాననీ, ఇంకా అవగాహన కార్యక్రమాలు పెంచడానికి వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా పని చేయిస్తానని తెలపడం సమావేశానికొచ్చిన వారందరిలో కూడా సంతోషాన్ని ఇనుమడింపజేసింది. ఆరోజు ఉదయం సమావేశానికి వచ్చినవాళ్ళు 'ఆర్గాన్ డోనర్ కార్డు' లు తీసుకోవాడానికి హాస్పిటల్ కు బయలు దేరడం ముదావహం.

నాలుగు రోజుల తరువాత అదే పేపర్ లో అవయవ దానం గురించి వ్యాసరచన పోటీ నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ వారి ప్రకటన చూసింది సునయన. తను కూడా పాల్గొంటానని చెప్పగానే తప్పకుండా వెళ్ళమన్నారు, వాళ్ళ నాన్న. సంతోషంగా వెళ్ళి పాల్గొంది.


వ్యాసరచనలో... తమ ఇంట్లో జరిగిన సమావేశంలోనూ, ఫ్రెండ్స్ తో కలిసి హాస్పిటల్ కెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పిన విషయాలు …ఇంకా తన ఆలోచనలు, తను కూడా నాలుగు రోజుల క్రితం ఆర్గాన్ డోనర్ గా రిజిస్టర్ అయిన విషయం... అన్నీ వివరంగా వ్రాస్తూ, చివరలో ఈకింది విధంగా ముగించింది.

అంగవైకల్యం అంటే మన శరీరం లోని ఏ అంగమైనా లోపిస్తే ఎంత కష్టపడాలో అది అనుభవించే వారికి, వారి ఆప్తులకు తెలుస్తుంది. అందుకే మనం చేయగలిగినంత సహాయం మనకు ఇబ్బంది రాకుండా చేయగలిగితే మన జన్మకు సార్ధకత. జీవితం లో వాళ్ళు రాణించగలగాలంటే వాళ్ళు ఎంత సేపూ... జీవితాన్ని ఛాలెంజ్ గా తీసుకొని గడపాలి. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి కూడా ‘జీవన్ దాన్’ ద్వార ప్రభుత్వం ఉచితంగా అవయవాలను దానం చేయించ గలుగుతోంది.


ఇంకా కొన్ని రకాల వికలాంగత్వం ఉన్న వాళ్ళకు పింఛను ద్వార చేయూతనిస్తోంది. చదువులోను, ఉద్యోగాలల్లోను రిజర్వేషన్స్ కల్పించింది. ఆర్టిఫిషియల్ కాళ్ళు, చేతులు అమర్చగలగడం కూడా ఒక గొప్పపనే. వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేసుకోగలుగుతున్నారు. అన్ని అవయవాలు ఉన్న వాళ్ళే సరిగా చేయలేని పనులను.. కొన్ని అవయవాలు లేకున్నా కొంత మంది ఎంతో నైపుణ్యం తో చేయగలుగుతున్నారని మనం పేపర్ లో చదువుతున్నాము.

సమయానికి సరైన గ్రూప్ బ్లడ్ దొరక కుంటే ఎంత ఇబ్బందో గమనించి, రక్తం దానం చేసే శక్తి ఉన్న వాళ్ళు తప్పని సరిగా రక్త దానం చెయ్యాలి. చిన్న వయసులో ఉన్న వాళ్ళు రక్త దానం చేయడం ఎంతో మంచిది. ఈ మధ్య షుగర్ వ్యాధి వల్ల చాలా మంది పెద్ద వాళ్ళు రక్త దానం చేయలేక పోతున్నారు. కనుక యువత ముందుకు రావాలి. అలాగే ప్రతీ ఇంట్లో ఎవరు చనిపోయినా, కనీసం చనిపోయిన వారి కళ్ళను కుటుంబ సభ్యులు ‘జీవన్ దాన్‘ కు డొనేట్ చేయాలి.

అనవసరంగా అవయవాలన్నీ మట్టిలో కలిసిపోవడం వల్ల ఎన్నో జీవితాల్లో వెలుగు నింపే అవకాశాన్ని పోగొట్టుకుంటారు. కనీసం కళ్ళైనా దానం ఇవ్వగలిగితే, ఇద్దరు మనుషులు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతారు. కళ్ళదానం వల్ల ముఖకవళి కలల్లో ఎటువంటి తేడా రాదట. భగవంతుడు వాళ్లకు ఇవ్వలేకపోయినవి, లేదా ఇచ్చినవి పాడైపోయినప్పుడు.. మనం మళ్ళీ వాటిని సమకూర్చ గలిగే భాగ్యం భగవంతుడు మనకు కల్పించాడు.


అలా చేసినందువల్ల … మనం కూడా భగవంతునితో సమానమవుతాము కూడా. భగవంతుడు మనకు ఎంతో దివ్యమైన ఆశీస్సులు అందిస్తాడు.


ఇలా వ్రాసి, ఆ పేపర్స్అక్కడి అధికారులకిచ్చి, సాయంత్రం మీటింగ్ కు హాజరయ్యింది.. అమ్మ, నాన్నలతో కలిసి. తను ఎలా వ్రాసిందోవివరంగా వాళ్ళ నాన్నకు చెప్పింది. ‘వెరీ గుడ్ నీకు బహుమతి కూడా రావచ్చు అనిపిస్తోంది’ అన్నాడు వాళ్ళ నాన్న.


ఆ మీటింగ్ లో డాక్టర్స్, సంఘ సంస్కర్తలు, స్వచ్చంద సంస్థలకు సంబంధించిన వారు యువతీ, యువకులు పాల్గొని అవయవ దానం గురించి ఇంకా కొన్ని కొత్తకొత్త విషయాలు, ఎలా అవగాహన కల్పించాలి అనే విషయాలు చర్చించారు.


చివరలో... బహుమతి ప్రదానోత్సవం లో వాళ్ళ నాన్న అనుకున్నట్లుగానే సునయనకు మొదటి బహుమతి ప్రకటించారు... బహుమతిని అందుకుంటూ "ఈ బహుమతి తన బాధ్యతను ఇంకా పెంచినట్లుగా భావిస్తున్నానని, తను ఇంకా ఈ విషయం లో ప్రజలకు అవగాహన కల్పించడానికి తన వంతు కృషిని చేస్తాన’ని చెప్తూ ”అవయవదానం... అద్భుత దానం, అన్ని దానాల కన్నా అవయవ దానం గొప్పది” అని ముగించింది.


సమాప్తం

( ఈ కథ చదివిన వారిలో కొందరైనా అవయవ దానానికి సిద్ధపడితే వారెంతో కీర్తి గడించిన వారవుతారు. )


కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


Podcast Link


Twitter Link


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నా పేరు K. లక్ష్మీ శైలజ.

నెల్లూరు లో ఉంటాను.

నేను ఎం. ఏ. ఎం.ఫిల్ చేశాను.

ఇప్పటి వరకు 40 కథలు , పది కవితలు ప్రచురితమైనవి.

జూన్ 2022 న తానా గేయతరంగాలు లో గేయం రచించి పాడటమైనది.

యూట్యూబ్ లో కథలు చదవడం ఇష్టం.


84 views0 comments

Comments


bottom of page