top of page
Original.png

పునర్వివాహం

#KLakshmiSailaja, #కేలక్ష్మీశైలజ, #Punarvivaham, #పునర్వివాహం, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Punarvivaham - New Telugu Story Written By K. Lakshmi Sailaja

Published In manatelugukathalu.com On 30/06/2025

పునర్వివాహం - తెలుగు కథ

రచన: కే. లక్ష్మీ శైలజ

కథా పఠనం: పద్మావతి కొమరగిరి

 “సాయం సంధ్యా వందనం కరిష్యామి” అంటూ సింగపూర్ లో ఉన్న తన మనవడికి సంధ్యావందనం నేర్పిస్తున్నాడు ఇండియా లో ఉన్న ఈ తాతయ్య, మనవడి శ్రద్ధకు మురిసిపోతూ. 


 “ఓహో. పౌరోహిత్యం ఖండాలు దాటి పోతున్నదే!” అంది కాఫీ తీసుకొని వస్తూ, చివరి మాటలు వింటున్న నాన్నమ్మ. 


 “లక్షణంగా సంధ్య వారుస్తున్నాడు. పోయిన వారం ‘శంకరజయంతికి’ ఉపనయనం చేయించి పంపాము. అప్పటి నుంచీ రెండు పూటలా చేస్తున్నాడు. అయినా పాతికేళ్ల వెధవ. వాడికేం కష్టం?” అన్నాడు కాఫీ చప్పరిస్తూ ఎనభై ఏళ్ళ తాతయ్య. 


 “అంతేలే. కలికాలం. ఈ వయసులో ఆ దేశం లో వంటరిగా ఉంటూ చేసే పూజలేపాటివో? నానా గడ్డీ తిని ‘పుండరీకాక్ష’ అని నెత్తిన నీళ్ళు జల్లుకుంటే దోష పరిహారం జరిగినట్లే అనుకునే రోజులు ఇవి” అంది ఆమె నిట్టూరుస్తూ. 


 ‘మనమడిగితే చేసే అవకతవక పనులు బయట పెట్టకుండా ఏవో కాకి కబుర్లు చెప్తారు. అందుకని అడక్కుండా వుంటేనే మంచిది’ అనుకొంటూ కాఫీని ఆస్వాదించసాగారు ఇద్దరూ. 

 

***


 “ఒరే పార్వతీశం. నిన్నంతా ఫోన్ చెయ్యలేదేమిట్రా?” అన్న తాతయ్య ప్రశ్నకు


 “నిన్న లండన్ లో మీటింగ్ కు వెళ్ళాను తాతయ్యా. అందువల్ల కుదరలేదు” మనవడి జవాబు. 


 లండన్ కు వంద కిలోమీటర్ల దూరం లో ఐ. బి. ఎం. లో పనిచేస్తూ ఉంటాడు పార్వతీశం. అప్పుడప్పుడూ హెడ్ ఆఫీస్ లో పని ఉంటే లండన్ కు వెళ్ళి వస్తూవుంటాడు. ఎంత మేధావులయినా ఎక్కడో ఒకచోట వెనుకబడతారన్నట్లు పార్వతీశం తెలుగు చక్కగా చదవలేడు, చిన్ననాటి నుంచీ ఇంగ్లీష్ మీడియం లో చదవడం వలన. అందుకని సంధ్యా వందనం..చూసి చదవడానికి కూడా కష్టపడుతున్నాడు. 


 తల్లితండ్రులిద్దరూ కరోనా తో చనిపోయారు. ఉపనయనం కాకపోవడం వలన కర్మ కాండలకు ఇబ్బంది వచ్చింది. పెద్దవాళ్ళు తొమ్మిదో సంవత్సరంలో చేద్దామంటే ‘అది వీళ్ళ నిరంకుశత్వ భావం వల్ల అలా చెప్తున్నారు. పాత భావాలు. ఇప్పుడే జరగడాని వీల్లేదు. వద్ద’ ని కోడలు ఉపనయనం చెయ్యనివ్వకుండా ఇన్ని సంవత్సరాలు జరుపుతూ. వాళ్ళు చనిపోయిన మూడవ సంవత్సరం లో అడిగి మరీ ఉపనయనం చేయించుకొని తాతయ్య నేతృత్వం లో ప్రస్తుతానికి బాగానే ఆచరిస్తున్నాడు పార్వతీశం. 


 వాళ్ళ తాతగారు. ‘ ‘దున్నమంటే దూడల్లా, మెయ్యమంటే ఎద్దుల్లా ‘ ఉంటారుగానీ సాంప్రదాయాలు పాటిద్దామని లేదు’ అని విసుక్కున్నా ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ళమ్మ వాడికి సపోర్ట్. ‘ఈ కాలంలో పూజలు ఎవరు చేస్తున్నారు?’ అని.. వాడిని చిన్నగా అరిచినందుకు అక్కుల్లు బొక్కుళ్ళుగా ఆమె ఏడిచేది ముక్కుచీదేస్తూ. అది వాడికి అలుసయ్యిందప్పుడు. ఎగురుకుంటూ వెళ్ళిపొయ్యేవాడు. 


 ఇప్పుడు ఉపనయనం చేసుకోవడానికి వచ్చాడు ఫారిన్ నుంచి. అలా వచ్చినప్పుడు పార్వతీశాన్ని తీసుకొని ఒకమ్మాయిని పెళ్ళి చూపులు చూసి వచ్చారు పెద్దవాళ్ళు. ఆ విషయం గురించి అమ్మాయి వాళ్ళు తాతగారితో మాట్లాడి, అమ్మాయి నచ్చితే ఫోన్ లో చెప్పమంటున్నారిప్పుడు. 


 “ఏమిటో..ప్యాంట్, షర్ట్ వేసుకొని పెళ్ళి చూపుల్లో కాఫీ ఇచ్చింది” గొణుక్కున్నాడు తాతయ్య. 

ఆడపిల్ల నలుగురిలోకి వచ్చినప్పుడే అలా వుంటే ఇక మామూలుగా ఎలా వుంటుందో అని ఆయన శంక. 


 “ప్యాంట్ వేసుకుంటే కాఫీ రుచేమైనా తగ్గిందా?” 

అన్న ఆమె గర్జనకు ఆయన మన్ను తిన్న పాములాగా అయిపొయ్యాడు. కదలకుండా కూర్చున్నాడు. ఆమె అపర వాగ్ధాటికి ఆయన తట్టుకోలేరు. 


 “తల్లి, తండ్రి లేరు వాడికి. విదేశాల్లో వంటరిగా వున్నాడు. ఈ పిల్ల అక్కడ వుండవలసిందేగా. అక్కడందరూ ప్యాంట్ లే వేస్తారు. పిల్ల చూస్తే బంగారు బొమ్మలా వుంది. ఏమిటో తమరి అభ్యంతరం. కాఫీ తాగితే జిహ్వ లేచి రాలేదూ? అయినా వంట బాగానే చేస్తుందేమో?” మళ్ళీ అందుకుందామె. పాతికేళ్ళ మనవడు ఒక్కడే వాళ్ళకు ఇప్పుడు ఆధారం. ఉన్న ఒక్కకొడుకూ పోయే. వీడినయినా మంచిగా చూసుకుందామని ఆమె ఆలోచన. 


 “నా శ్రార్థం” అంటూ లేచి పై పంచ విదిలించి వెళ్ళిపొయ్యాడాయన కర్ర తాటించుకుంటూ. 


.. 


 ఆ మధ్యాహ్నం వచ్చిన ఫోన్ ఆమె గుండె జారేట్టు చేసింది. తరువాత ఆమె గుండె దిటవు చేసుకుని ధైర్యంగా ఆ పిల్లకు అండగా వుండింది. వివరాలన్నీ మాట్లాడుకున్నారిద్దరూ. ధైర్యంగా ఉండమని సలహాకూడా ఇచ్చింది. 


 ఫోన్ పెళ్ళి కూతురు సీతామాలక్ష్మి చేసింది. 


 “మామ్మగారు. నేను సీతనండీ. మా అన్నయ్య, వదినా వాళ్ళు నా గురించి మీకు ముఖ్యమైన విషయం చెప్పకుండా దాచిపెట్టారని ఈ రోజు నాకు తెలిసింది. 

అందుకే నేను మాట్లాడుతున్నాను. 


 నాకు ఆరు నెలల క్రితం వైజాగ్ లో పెళ్ళి జరిగిందండి. పెళ్ళికొడుకు పెళ్ళి పీటలమీదనే గుండె పోటుతో మరణించాడు. వెంటనే మా అన్నయ్య ఆ ఊర్లో ఉండకుండా కర్నూలు కు ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చాడు. చుట్టుపక్కల వారితో మా వివరాలన్నీ చెప్పకుండా మౌనంగా ఉన్నాము. నా పెళ్ళి గురించి ఎవరితో చెప్పలేదు. 

 

 ఒకసారి పెళ్ళి అయ్యిందంటే నాకు ఇంక పెళ్ళి జరగదని, పెళ్ళయిన తరువాత నిజం చెప్పవచ్చుననీ అనుకున్నారట. మీకు చెప్పకుండా అందుకే దాచారట. అది నాకు ఇష్టం లేదు. అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను. పెళ్ళి చూపులు కూడా నాకు తెలియకుండా ఏర్పాటు చేశారు. ఆఫీస్ కు వెళ్ళే ఐదు నిముషాల ముందు నాకు చెప్పారు. అందువల్ల నేను డ్రెస్ కూడా మార్చుకోలేకపొయ్యాను. ఏమనుకోకండి. నా గురించి పూర్తిగా తెలుసుకొని ఆలోచించి మీ నిర్ణయం చెప్తారని ఫోన్ చేశాను” అంది, పూర్తి సమాచారం ఇస్తూ. 


 “పునర్వివాహం.. ” ఆలోచనలో పడింది నాన్నమ్మ. కానీ ఆ పిల్ల నిజాయితీ నచ్చిందామెకు. నిజం దాచిపెట్టలేదు. కాబట్టి ఈ పెళ్ళికి మనవణ్ణి వొప్పించాలని కంకణం కట్టుకొని పావుగంట తరువాత ఫోన్ చెయ్యబోయింది. కానీ ఆ ఫోనే ముందు మోగింది. 


 “నాన్నమ్మ. సీత ఫోన్ చేసింది. నీకు కూడా చేశానని చెప్పింది. పాపం కదా నాన్నమ్మ. అతను చనిపోవడం లో సీత తప్పేమీ లేదుగా! అందుకే నేను ఈ పెళ్ళి సంబంధానికి వప్పుకుంటూ ఉన్నాను” అన్నాడు పార్వతీశం. 


 “అమ్మయ్య. ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారు’. నాక్కూడా 'అమ్మాయి తప్పేమీ లేదు కదా' అనిపించింది. నువ్వొప్పుకుంటావో లేదో నని భయపడ్డాను” అందామె సంతోషంగా మనవడిని మెచ్చుకుంటూ, మనవడికి త్వరగా పెళ్ళవుతోందన్న సంతోషం కూడా కనపడ్తోందామె గొంతులో. 


 “అవును నాన్నమ్మ. ఇంకోటేమంటే అమ్మాయి నిజాయితీ కూడా నాకు నచ్చింది. నిజం దాచలేదు. ఇష్టమైతేనే చెప్పమంటోంది. ఏడిచి మొత్తుకోవటం లేదు. కష్టపడి సంపాదిస్తూనే ఉంది. తానెవరికీ బరువు కాదు. నేనా విషయం కూడా అలోచించాను. నువ్వేలాగూ నా మాట కాదనవని పెళ్ళి చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదని చెప్పాను” అన్నాడు పార్వతీశం. 


 ఆ మాటలకు ‘ఎంత విశాల హృదయం వీడిది. చూడటానికి పోకిరిలాగా అనిపించాడు’ అనుకుంది నాన్నమ్మ మురిసిపోతూ. 

 

 ఇంతలో తాతగారు వస్తూన్న అలికిడయ్యింది. ఈ పెళ్లికి ఆయనను వప్పించడానికి తను గాండ్రించాలా, గర్జించాలా అనే ఆలోచనలో పడింది నాన్నమ్మ. 

 

 సమాప్తం


కే. లక్ష్మీ శైలజ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


 సమాప్తం

ree

రచయిత్రి పరిచయం: నా పేరు కె.లక్ష్మీ శైలజ

నేను ఏం. ఏ. ఎం. ఫిల్., చేశాను.

మహిళా అభివృద్ధి శిశుశంక్షేమ శాఖలో గెజిటెడ్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యాను. స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర A . కోడూరు. ప్రస్తుతం హైదరాబాదు లో నివాసం. నా పందొమ్మిదవ సంవత్సరం లో మా అమ్మ ప్రోత్సాహం తో మొదటి కథ వ్రాశాను. పాతిక కవితలు వ్రాశాను. ఇవి వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కెనడే వారి (బి.వి.ఆర్.ఫౌండేషన్) బహుమతులను ..అమ్మ, నాన్న, నేను...స్వయంకృతం.. అనే కవితలు గెలుచుకున్నాయి. 10 వ్యాసాలు వ్రాశాను. నేను టెలిఫోన్స్ గురించి వ్రాసిన వ్యాసానికి నంద్యాల కాలేజెస్ లన్నింటిలో ప్రథమ బహుమతి వచ్చింది.

ఇప్పటికి వంద కథలు... తెలుగు వెలుగు, బాల భారతం, ఆంధ్రభూమి, వార్త, సంచిక, ఈనాడు, వార్త, ప్రజాశక్తి, సూర్య, విశాలాంధ్ర, ఉషా, సాహితీ కిరణం, అంతర్జాల పత్రిక మనోహరం లలో , మన తెలుగు కథలు లో ప్రచురితమయ్యాయి. మనతెలుగు కథలు ఐదు కథలు నందు వారం వారం బహుమతులను, సంచిక, సాహితీ కిరణం లందు కథలకు బహుమతులు వచ్చాయి

నా పబ్లిష్ అయిన కథలను ...మనందరి కథలు ...అనే పేరున రెండు

సంకలనాలుగా ప్రింట్ చేయడం జరిగింది.

కొనిరెడ్డి ఫౌండేషన్ ప్రొద్దుటూరు వారు.. మనందరి కథలు... కు మార్చ్ ఎనిమిది 2025 న పురస్కారం ఇవ్వడం జరిగింది.

రచయిత్రుల గ్రూప్ ...లేఖిని...సాహిత్య సాంస్కృతిక సంస్థ... లో 74 మంది రచయిత్రుల తో కూడిన సంకలనం..కథల లోగిలి.. లో నా కథ... పుత్రునికి పునర్జన్మ ...ప్రచురించారు. నారం శెట్టి బాల సాహిత్య పీఠం వారి కథాసంకలనం లో ...జిమ్మీ నా ప్రాణం...అనే కథ ప్రచురించారు.

జిమ్మీ నా ప్రాణం కథ.

వేరే వారి కథలను మన తెలుగు కథలు, మనోహరం లలో చదివి వినిపించాను. సంగీత ప్రవేశం లో జూన్ 2022 న తానా గేయ తరంగాలు జూమ్ మీటింగ్ లో గేయం రచించి పాడటం జరిగింది. నెల్లూరు లో ఘంటసాల పాటల పోటీ లందు ఎస్. పి. వసంత గారు బహుమతిని ఇవ్వడం జరిగింది.

ఇంకా చిత్ర కళలో.. చందమామ.. వారు బహుమతిని ఇవ్వడం జరిగింది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page